సాంబాబాయ్ --- ఉమాదేవి పిన్ని
భట్టిప్రోలు విజయలక్ష్మి
మా నాన్నా, సాంబాబాయ్ బాగా క్లోజ్. పాపం ఒకళ్ళ నొకళ్ళు వదిలి ఉండలేకపోయేవాళ్లు. మా బాబాయ్ పెళ్లి అయ్యాక ఒకసారి పండగకి, పిన్నినీ, బాబాయినీ పిన్నీ వాళ్ళ అమ్మా వాళ్ళు పిలుచుకెళ్ళారట. పిన్నికేమో కొత్తగా పెళ్ళైన రోజులు, బాబాయేమో ఎప్పుడూ రాంక్రిష్ణుడు, రాంక్రిష్ణుడు అంటూ పిన్నిని బోర్ కొట్టేవాట్ట. సరే, బాబాయ్ పండక్కి అత్తారింటికి వెళ్ళాడు కదా, రెండు రోజులు చూసాక మా నాన్న ఆగలేక మా పిన్నీ వాళ్ళింటికి వెళ్ళాట్ట తమ్ముడి కోసం. మా న్నను చూడంగానే బాబాయ్ వెంటనే ఆనందంగా లేచొచ్చి, ఆ తరువాత ఇద్దరూ ఎవరినీ పట్టించుకోకుండా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి నడిచొచ్చేశారట. పిన్ని గోల. కొత్త పెళ్లికూతురు కన్నా, అన్నయ్యే ఎక్కువా అని. సరే పాపం ఏం చేస్తుంది, నెమ్మదిగా సద్దుకుపోయింది. ఇదీ నాన్నా, బాబాయ్ స్నేహం నేపధ్యం.
నేను నా B.Sc. ఫస్ట్ ఇయర్ కాకినాడలో బాబాయ్ వాళ్ళ ఇంట్లో వుండి చదువుకున్నా. అప్పుడే నేను మొట్ట మొదటిసారి ఇల్లు వదిలి వేరే చోట ఉండటం. నేను ఆ రోజుల్లో చాలా నేర్చుకున్నా. పిన్ని నుంచి శుభ్రం నేర్చుకున్నా. మొదట్లో కాస్త కష్టంగా ఉండేది, పిన్ని శుభ్రం స్టాండర్స్ అందుకోవడానికి. అప్పుడు పిన్ని శుభ్రం అంటే భయం వేసేది, కానీ ఇప్పుడు నేను పిన్నిలా అయిపోయా. జనం నా శుభ్రం చూసి భయపడుతున్నారు. పిన్ని వాళ్ళింట్లో చాలా అల్లారుముద్దుగా పెరిగింది. వంట పని బాగా రాదు. బాబాయ్ కేమో వంట బ్రహ్మాండంగా వచ్చు. అయినా సరే, బాబాయ్ పిన్నికి వంట ఎలా చెయ్యాలో నేర్పించేవాడు కానీ తాను మాత్రం వంట చేసేవాడు కాదు. ఏ కూర యెంత సైజులో తరగాలో, ఏ పోపులో ఏమేమి వెయ్యాలో, యెంత వెయ్యాలో చక్కగా చూపించేవాడు. చిన్న చిన్న ప్లేట్లలో పోపు గింజలు ప్రతి ఐటం కీ వేరు వేరుగా వేసి ఇచ్చేవాడు. నాకు ఇవన్నీ చూడటం తమాషాగా ఉండేది. యెంత పని చేసినా, పిన్ని ఇల్లు మాత్రం చాలా నీట్ గా ఉంచేది. ఎంతైనా బాబాయ్ ప్రొఫెసర్ కదా, నేర్పించటం బ్రహ్మాండంగా వచ్చు. చేయటం కాదు చేయించాలి అనేది, నేను బాబాయ్ దగ్గరే నేర్చుకున్నా.
బాబాయే వాళ్ళ అన్నదమ్ముల్లో మొట్టమొదటిగా M.Sc. మాథ్స్ చదివింది, అదీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో. మా బాబాయికి ఆర్ధిక, హార్దిక సాయం చేసింది మా నాన్న. బాబాయ్ M.Sc. మాథ్స్ పాస్ అయి వచ్చి, మా నాన్న చేత బలవంతంగా M.A. మాథ్స్ ప్రైవేట్ గా అదే యూనివర్సిటీలో అప్లై చేయించాడు. ఎందుకంటే, నాన్నకి పెళ్లయింది, పిల్లలున్నారు, గవర్నమెంట్ వుద్యోగం వుంది. ఇంటికి ప్రధానంగా నాన్న జీతమే ఆధారం. బామ్మ మాతోనే ఉండేది. ఇద్దరు బాబాయిలు వుండేవాళ్ళు. మేము ఇద్దరం పిల్లలున్నాం. అందుకని నాన్న చేత ప్రైవేటుగా చదివించాడు బాబాయ్. చదివించడం ఏమిటీ, ఎలా అంటే, బాబాయ్ పాపం నాన్నకు నోట్స్ రాసిపెట్టి, అవన్నీ చదువుతూ, వినిపిస్తూ నాన్నకు వివరిస్తూ ఉంటే, మా నాన్న తీరికగా మంచంపైన శేషతల్పశాయిలా పడుకుని, జంతికలు నములుతూ, ఆ.. చదవరా, అనేవాట్ట. పాపం మా బాబాయ్ ఓపికగా అన్నీ నాన్నకు చెప్తూ చదివించాట్ట. ఇవన్నీ నాకు మా పిన్ని ద్వారానే తెలిసింది. ఆవిడకేమో ఇదంతా ఆశ్చర్యంగా వుండేదిట.
కాకినాడలో వున్న రోజుల్లో బాబాయిని ఒకసారి ఏదో ఒక ప్రోబ్లెంలో డౌట్ అడిగాను. అది నేను ఎంత ప్రయత్నించినా సాల్వ్ కాలేదు. బాబాయ్ కూడా, అదే సబ్జెక్టు, మాథ్స్, JNTU లో చెప్తాడు. అందుకని అడిగా. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా బాబాయ్ క్షణంలో సాల్వ్ చేసేస్తాడు. కానీ ఆరోజు ఎందుకో ఆ ప్రాబ్లమ్ బాబాయిని కూడా ఇబ్బంది పెట్టింది. బాబాయ్ అలాగే వెళ్లి పడుకున్నాడు. నేనూ నిద్రపోయాను. ఒక రాత్రి వేళ నన్ను లేపి కూర్చోబెట్టి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చేసి వెళ్లి పడుకున్నాడు. బాబాయికి సమస్య ఉంటే నిద్ర పట్టదన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. పిన్నికి కాస్త కోపం వచ్చింది. ఒక్క లెక్క చెప్పకపోతే ఏమయిపోతుంది, ఇంత రాత్రి వేళా లేపి చెప్పాలా, అని కోప్పడింది. బాబాయేమో కూల్ గా "రేపు ఇదే ప్రాబ్లమ్ నా స్టూడెంట్ కాలేజ్ లో అడిగితే, నేను చెప్పలేకపోతే ఎలా, షేమ్ గా ఉండదూ" అన్నాడు. బాబాయ్ నుంచి నేను నేర్చుకున్న విషయాల్లో ఇది కూడా ఒకటి. టీచర్లకు అన్నీ వచ్చి ఉండాలన్న కఠినసత్యం. విద్యార్థిగా 40 శాతం వస్తే చాలు కానీ, అదే ఉపాధ్యాయుడుగా ఛాయస్ లతో కూడా కలిపి 200 శాతం సబ్జెక్ట్ వచ్చి వుండాలనీను. అదే మాట నేను పదేపదే నా స్టూడెంట్ టీచర్లకి చెప్తూ ఉండేదాన్ని. "మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు కాబోతున్నారు. అన్ని కాన్సెప్ట్స్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి" అని. ఒక్కోసారి కావాలని తప్పు ప్రాబ్లంలు తయారుచేసి ఇచ్చేదాన్ని, సాల్వ్ చేయమని. వాళ్ళు ప్రాబ్లంలో వున్న తప్పు పట్టుకుని దాన్ని కరెక్ట్ చేసి సాల్వ్ చేసి నాకు చెప్పాలి. అదీ అస్సైన్మెంట్.
ఒకసారి బాబాయి జాంగ్రీలు చేయటం నేర్పిస్తా, రమ్మన్నాడు నన్నూ పిన్నినీ. బాబాయ్ డైరెక్షన్ లో మినప్పప్పు నానేసి నేనూ, పిన్నీ గట్టిగా, స్మూత్ గా రుబ్బేసాం. నాకో తెల్ల కర్చీఫ్ ఇచ్చి మధ్యలో ఒక సన్న పెన్సిల్ పట్టేంత చిల్లి పెట్టి బటన్ స్టిచ్ చేసి పట్టుకు రమ్మన్నాడు. ఈ లోపల పిన్ని పాకం పట్టడం, నూనె కాచడం చేసింది. ఏం చేసినా అన్నీ బాబాయ్ చెప్పినట్లే, బాబాయికి చూపించే. రుబ్బిన మినప్పిండి ఆ కర్చీఫ్ లో వేసి బాబాయ్ నూనెలో జాంగ్రీలు వేయడం, పిన్ని వేయించడం, నేను వాటిని పాకంలో వేసి కాసేపుంచి తీయడం, ఇదీ పని. రవీ, వల్లీ చాలా సీరియస్ గా, కుతూహలంగా చూడటం. ఆ రోజుల్లో శారదా, పద్మా పిన్నీ, బాబాయిల దగ్గర కాకుండా, భీమవరంలో వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యల దగ్గర వుండి చదువుకునే వాళ్ళు. మా పిన్ని నన్ను "నువ్వు నా చచ్చిపోయిన పెద్ద కూతురువే" అనేది. ముద్దుగా అబ్రీవియేషన్ తో నన్ను 'చపేకు' అనేది. ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. ఇప్పటికీ పిన్ని నన్ను ఆ పేరుతోనే పిలుస్తుంది. మొత్తానికి మా జాంగ్రీ ఆపరేషన్ గ్రాండ్ సక్సస్.
పిన్నీ వాళ్ళ అమ్మ, మాకు అమ్మమ్మ, భీమవరం నుండి ఎప్పుడు వచ్చినా చాలా చాలా వస్తువులు తెచ్చేది. ఇంట్లోనే చేసిన కొబ్బరి లౌజు ఉండలు, పాలకోవా బిళ్ళలు, రకరకాల స్వీట్లు, జంతికలూ, చేగోడీలూ, ఓ నాలుగు, అయిదు గిన్నెల కారేజ్ నిండా ఊరగాయలూ తెచ్చేది. రవీ, వల్లీ వాటి పట్ల ఇష్టం కొద్దీ, అవి ఇంట్లో మరెవ్వరినీ తిననిచ్చేవారు కాదు. అది వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది, వాళ్ళ కొక్కరికే చెందిన సొత్తు అని వాళ్ళ దృఢాభిప్రాయం. చిన్న పిల్లలు వాళ్ళు. రవి అప్పుడు మూడో, నాలుగో క్లాసు చదువుతున్నాడు. వల్లి ఒకటో క్లాస్. పిన్నికేమో అవన్నీ నాకు కూడా పెట్టాలని ఉండేది. రహస్యంగా తెచ్చి వెనక నుంచి నా నోట్లో కుక్కేసి వెళ్లిపోయేది. ఆవిడ ప్రేమకి నాకు ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. ఒకసారి అమ్మమ్మ రావటం ఎందుకో కుదరలేదు. రవీ, వల్లీ పాలకోవా కావాలని గోల చేస్తున్నారు. బాబాయ్ ఏమో, పద మనమే చేసుకుందాం పాలకోవా, అన్నాడు. ఇంకేముందీ, మళ్ళీ నేనూ పిన్నీ అసిస్టెంట్ల రూపంలో తయారు. పాలవాడికి చెప్పి ఎక్కువ డబ్బిచ్చి, చిక్కటి పాలు బోల్డు తెప్పించాడు. అవి పొయ్యి మీద పెట్టటం, వంతుల వారీగా పాలు అడుగంటకుండా కలపటం, ఇంతే పని. ఎంతసేపయినా అది గట్టిపడదే. పైగా చక్కెర వెయ్యంగానే, మళ్ళీ చిక్కబడిందంతా పల్చగా అయిపోయేది. రవీ, వల్లీ గోల, మీకు చెయ్యటం రావడం లేదు, ఇంకా యెంత సేపూ అని. చివరికి కొంచెం బియ్యప్పిండి వేసి చిక్కబడేసి చల్లార్చి బిళ్ళలు కట్టాం. రవీ, వల్లీ లకు ఆ పేస్టే ముందు కొంచెం పెట్టేసాం. లేకపోతే వాళ్ళు మమ్మల్ని బిళ్ళలు కూడా కట్టనివ్వడం లేదు. అదీ పాలకోవా బిళ్ళల కథ. ఫరవాలేదు 75 పర్సెంట్ సక్సెస్ అన్నాడు బాబాయ్.
రవీ, వల్లీ స్కూల్ నుంచి వస్తూనే, ఆకలీ అంటూ వచ్చేవాళ్ళు. పిన్నేమో బూట్లు విప్పి బ్యాగులు పడేసి కాళ్లూ, చేతులూ కడుక్కు రమ్మనేది. దాంతో వాళ్ళు ఇంట్లోకి కాళ్ళు పెడుతూనే, గుమ్మం బైట ఒకటి, లోపల ఒకటి బూట్లు విసిరేసి, బాగులు అక్కడే వున్న కుర్చీలో పారేసి, కాళ్ళు కడుక్కోవడానికి పరిగెత్తేవాళ్లు. అది చూసి బాబాయికి కోపం వచ్చేది, ఏమిటా విసిరేయటం అని. అప్పుడు బాబాయ్ వాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్ లో అద్దెకి వుంటున్నారు. బాబాయేమో, మెట్ల కింద నుంచి అద్దె ఇస్తున్నాంరా, అక్కడి నుంచే పారేసుకుంటూ రావచ్చు అనేవాడు కోపంగా. పిల్లలకి ఆ సెటైర్ అర్ధం అయ్యేది కాదు. నేను ఆ రోజుల్లోనే, పిన్ని వల్లే కాకరకాయ, ఉల్లిపాయ, వగైరాలు తినడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కాకరకాయతో ఎన్ని వెరైటీస్ చేస్తానో. ఇంకా మొదటిసారి బేబీ ఆలూ ఫ్రై పెట్టింది, నేర్పింది ఉమాదేవి పిన్నే. ఒక్కోసారి వెరైటీగా అన్నీ అన్నాలే రకరకాలుగా వండి పెట్టేది. మా పెళ్లయ్యాక మా ఇద్దరినీ భోజనానికి పిలిచి, బోలెడు రకాలు చేసి పెట్టింది. మా వారు అవి తిని మీ పిన్ని చాలా బాగా వంట చేస్తుంది అని మెచ్చేసుకున్నారు. పిన్నికో అలవాటు ఉండేది. ఎప్పుడూ చేతులు కడుక్కోవడం. ఏ పని చేస్తున్నా ముందు చేతులు కడుక్కునేది. అదే ఇప్పుడు కొరోనాలో జాగ్రత్తలు చెప్తున్నారు. అలా చేతులు కడుక్కోవడం కోసం ఎప్పుడూ ఒక పంపు సన్నధారగా నీళ్లు తిప్పి వుంచుకునేది, పంపు కూడా ముట్టుకోకూడదని. అప్పుడు నీళ్లు వేస్ట్ అనుకునేదాన్ని, ఇప్పుడు అదే అందరికీ ఆచరించమని చెబుతున్నారు.
బాబాయింట్లో కుర్చీలకూ ఓ కథ వుంది. మా నాన్నకి తెనాలిలో ఒక రామభక్త హనుమాన్ వడ్రంగి ఉండేవాడు. అతను డిజైన్ చేసిన కుర్చీలవి. నాన్న వాటిని మాకూ, సాంబాబాయికి, హరి పెద్దనాన్నకీ, సరోజినత్తయ్యకీ ఒకే లాంటివి సెట్ గా నాలుగు చేయించాడు. ఫోల్డబుల్ టైపు, హ్యాండిల్స్ మీద పెట్టుకుని రాసుకోవటానికి, అందరికీ రెండు రైటింగ్ పాడ్ లు కూడా చేయించాడు. ఏమన్నా రాసుకోవాలన్నా, చదువుకోవాలన్నా చాలా అనుకూలంగా ఉండేవి అవి. ప్లాస్టిక్ వైర్ తో అల్లిన కుర్చీలవి. ఇన్నాళ్ల వాడకం మీద, ఆ ప్లాస్టిక్ బాగా లూజ్ అయి సాగి సాగి గుంట పడిపోయాయి. బాబాయి వాటిని అల్లిద్దామని అడిగితే, వాళ్ళు ఆ కుర్చీ చేయించడానికి యెంత అయిందో, అంత డబ్బు అడిగారట. ఇంకేముందీ మా శాంతమూర్తి బాబాయికి కోపం, పట్టుదలా వచ్చేసాయి. ఠాట్, ఈ మాత్రం నేను చేసుకోలేనా అని ఓ ప్లాస్టిక్ వైర్ కట్ట కొనుక్కొచ్చాడు. రావే, నువ్వోటీ, నేనోటీ అల్లేద్దాం, అన్నాడు. ఈ గోలంతా ఏమిటీ అని పిన్నికి కోపం. నేను "బాబాయీ, మనకు ఈ డిజైన్ అల్లటం వస్తుందా" అని సందేహంగా అడిగా. ఈ డిజైన్ కాకపోతే ఇంకో డిజైన్ అల్లేద్దాం, అన్నాడు బాబాయ్. నిజం చెప్పొద్దూ, నాకు ఇదంతా పాడు చేస్తామేమో అని కాస్త భయం వేసింది. కానీ బాబాయ్ పట్టు విడవని విక్రమార్కుడిలాగా వదలలేదు. ఒక డిజైన్ చూపించాడు. సందేహంగా మొదలుపెట్టినా, మొత్తానికి ఇద్దరం కలిసి నిజంగానే అల్లేసాం చక్కగా. ఇక్కడో విషయం చెప్పాలి. ఈ పని కూడా నాకో ఎడ్యుకేషన్. నేను ఇప్పటికీ, చిన్నా, చితకా పనులూ, రిపేర్లూ, ఇంట్లోనే నేనే చేస్తూ ఉంటా. ఇలా అన్నీ నాతో చేయిస్తూ, తానూ చేసేవాడు. ఇవన్నీ నేర్చుకుంటే వచ్చేవి కాదు. మనసు పెట్టి ఇష్టంగా చేయాలి. ఇలా ఎన్ని నేర్పించాడో చెప్పలేను.
నేను చిన్నప్పటి నుంచీ బాగా ఆలస్యంగా నిద్ర లేచేదాన్ని. కానీ స్కూల్ కి కానీ, కాలేజీకి కానీ ఏనాడూ లేట్ గా వెళ్లేదాన్ని కాదు. అందుకని పొద్దున్న లేస్తూనే మొహం కడుక్కోవటం, స్నానం అన్నీ వెంట వెంటనే చేసేసి, ఒకేసారి అన్నం తినేసి వెళ్లిపోయేదాన్ని. పిన్నీ, బాబాయేమో, అలా ఒప్పుకోలా. నువ్వూ మా పిల్లలతో పాటు పాలు తాగాల్సిందే అని ఆర్డర్. నాకేమో పాలు నచ్చవు. ఎలా మరి. బాబాయ్ ఓ ఉపాయం చెప్పాడు. కొంచెం చల్లటి పాలు తీసుకుని, దాంట్లోనే బోల్డు చక్కర వేసి బలవంతంగా తాగించేవాడు. పైగా, "ఇవి బాగుంటాయి, కరిగిపోయిన ఐస్ క్రీం లాగా ఉంటాయి, తాగు, లేకపోతే, నీకు శరీరంలోకి షుగర్ కంటెంట్ ఎలా వెళ్తుంది" అనేవాడు. అలా నాకు పాలు తాగటం అలవాటు అయ్యింది. ముందు అలా అలవాటు చేసి, తరువాత ఆ పాలల్లో ఏవేవో కలిపి కూడా ఇచ్చేవాళ్ళు పిన్నీ, బాబాయ్. ఒక్కోసారి బాదం పౌడర్ వేసి, ఒక్కోసారి రాగిమాల్ట్ వేసి ఇచ్చి తాగించే వాళ్ళు. మొదట్లో బలవంతంగా మొదలు పెట్టినా, నేను తరవాత్తరవాత ఇష్టంగానే తాగేదాన్ని. అంతే కాదు, నేను మాకు పిల్లలు పుట్టాక ,వాటిని తయారు చేసి మా పిల్లలతో కూడా తాగించేదాన్ని. మా పిల్లలిద్దరూ చాలా పొడుగు. అందరూ ఏమి పెట్టి పెంచుతున్నారూ అంటే, గ్రోమోర్ అని నవ్వేసేదాన్ని. అసలు సీక్రెట్ బాబాయ్, పిన్నీల దగ్గర వుంది మరి.
చిన్నప్పటి నుంచీ నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండేది. అప్పుడప్పుడు కళ్ళు కూడా తిరిగేవి. అందుకే బాబాయ్ నాకు పాలు తాగే అలవాటు చేయించే పని ప్రధానంగా పెట్టుకున్నాడు. బాబాయ్ అచ్చం మా నాన్నకు మల్లేనే, ఓ హోమియోపతీ పుస్తకం, మెటీరియా మెడికా, అనేది పెట్టుకుని గృహ వైద్యం చేస్తూ ఉండేవాడు. నాకు ఏవేవో షుగర్ పిల్స్ వేసి 'తగ్గిందా' అనేవాడు. ఒక్కోసారి, కాన్స్టిపేషన్ కి వేస్తే, అనీమియా వస్తోంది, అనీమియాకి వేస్తే కాన్స్టిపేషన్ వస్తోంది, ఏం మందు వెయ్యాలీ అని తల పట్టుకునే వాడు. మా బామ్మ, మా నాన్నా, మా బాబాయ్ వీళ్ళు సొంతంగా హోమియోపతీ వాడేసే వాళ్ళు. తియ్యగా ఉంటాయి కదా, పిల్లలం ఏం గొడవ చెయ్యకుండా మేమూ చప్పరించేసేవాళ్ళం. బాబాయ్ కొంచం జాగ్రత్తగా వాడేవాడు కానీ, మా నాన్న మాత్రం పెద్ద పెద్ద మిలియన్ పొటెన్సీలు కూడా వాడేసేవాడు. నేనూ, మా అమ్మా గోల పెట్టేవాళ్ళం, అలా వాడకూడదని. మా పద్మ పెళ్లప్పుడు నేను నాన్నతో దెబ్బలాడి, ఆ పెట్టె రోడ్డు మీదకి విసిరేసా. ఆ తరువాతే మా నాన్న సొంత వైద్యం మానేసాడు. బాబాయ్ దగ్గర మా నాన్నలా ఎక్కువ స్టాక్ ఉండేది కాదు. అన్నీ లిమిట్ లోనే చేసేవాడు బాబాయ్.
నేను వెళ్ళేసరికే బాబాయ్ ఉస్మానియా యూనివర్సిటీలో మాథ్స్ లో తన రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేసాడు. ఎప్పుడూ ఎదురు చూస్తూండేవాడు, ఎప్పుడు మంచి కబురు వస్తుందో అని. దాదాపు సబ్మిట్ చేసిన పదేళ్ల తరువాత తీరికగా పీహెచ్ డీ డిగ్రీ ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. బాబాయ్ బాగా హర్ట్ అయ్యాడు ఆ డిలేకి. పైగా బాబాయ్ తోనే OU వాళ్ళు Ph.D. వాళ్లకి వైవా చేయటం మొదలు పెట్టారు. అసలు విషయం ఏమిటంటే, బాబాయ్ ఒక పెద్ద మాథెమెటీషియన్ ప్రూఫ్ చాలా పెద్దది, అంత పెద్ద ప్రూఫ్ అవసరం లేదు, అని సింపుల్ గా ప్రూవ్ చేసి ఆ థీసిస్ లో చూపించాడట. అది వాళ్ళకెవరికో కాస్త పొడుచుకుంది, అహం దెబ్బ తింది. బాబాయికి డిగ్రీ ఆలస్యం చేసి, ప్రొమోషన్ కూడా ఆలస్యం చేసి ఆనందించారు. పైశాచికానందం. బాబాయ్ అసలే చాలా సౌమ్యమూర్తి. పాపం అన్నీ మౌనంగా భరించాడు. ఆ డాక్టరేట్ వచ్చిన తరువాత ప్రొమోషన్ ఇచ్చి హైదరాబాద్ JNTU కి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు మా బాబాయిది ఇంకో రికార్డ్ వుంది ఫామిలీలో. అందరికన్నా చిన్నవయసులో 17 ఏళ్లకే డిగ్రీ తెచ్చుకున్నాడు. ఈ రికార్డ్ మళ్ళీ 16 ఏళ్లకే డిగ్రీ తెచ్చుకుని మా సరోజినత్తయ్యా వాళ్ళ అబ్బాయి లలితానంద్ బ్రేక్ చేసాడు. అంత తెలివైన వాడు బాబాయ్.
మళ్ళీ ఆ తెలివితేటలు వాళ్ళ పిల్లలందరికీ వచ్చాయి. పిన్ని పాటలు బాగా పాడేది. కథలూ రాసేది. కానీ ఏ కళనూ ఎందుకో పిన్ని కంటిన్యూ చెయ్యలేదు. పిన్నీ బాబాయ్ ఇద్దరూ అందంగా ఉండేవారు. పిల్లలు నలుగురూ కూడా చక్కగా వుంటారు. జీన్స్ ద్వారా వాళ్లకి తెలివే కాదు, అందం కూడా వచ్చింది. ఇంకో వారసత్వం కూడా ఆడపిల్లలకి వచ్చింది. అది మా పిన్ని పొడుగ్గా, ఒత్తుగా వుండే జడ. ఆ జడలు బ్రహ్మాండంగా ఉండేవి. ఇంతంత లావుగా, పొడుగ్గా. పెద్దయ్యాక, శారదా, పద్మా, వల్లీ ముగ్గురూ ఆ జడలని తట్టుకోలేక కత్తిరించేసుకున్నారు. ఉన్నవాళ్లకి ఆ విలువ తెలియదు. మా చల్లమ్మత్తయ్య కూతురు నాగు, ఎప్పుడు మాట్లాడినా, జుట్టు పెరిగే ఉపాయం చెప్పవే అంటుంది. ఒకసారి పెట్టుకోమని పూలిస్తే, "ఫూల్ నహీ, బాల్ దో" అంది. నవ్వీ నవ్వీ చచ్చాను. ఈ రోజుకీ దానితో మాట్లాడితే ఎప్పుడూ జుట్టు గోలే. అలాంటి జుట్టుని ఈ అక్కాచెల్లెళ్లు ముగ్గురూ ఎంచక్కా కత్తిరించేసుకున్నారు. నాకూ జుట్టు తక్కువే. మా అమ్మకీ జుట్టు చాలా ఎక్కువ. నా చెల్లెళ్ళిద్దరికీ ఆ జుట్టు వచ్చింది కానీ, నాకు మాత్రం రాలేదు. ఇక్కడో జోకుంది నా జుట్టు మీద. ఎవరైనా "మీరింత పొడుగు కదా, మీ జుట్టు ఇంత పొట్టి ఏమిటీ" అంటే, నేను వెంటనే, "బుద్ధిమంతుల కురులు భుజాలు దిగవు" అని చెప్పేదాన్ని.
నా సైజుకి సరిపోనిది ఇంకోటి ఉండేది ఆ రోజుల్లో. అది నేను రోజూ తీసుకెళ్లే లంచ్ కారేజ్. అదీ పిన్నిదే. బుజ్జిది, యెంత ముద్దొచ్చేదో. మూడు గిన్నెలు, ఒకదాని మీద ఒకటి దొంతరగా. మూడు గిన్నెలూ కలిపినా ఎత్తు నాలుగు అంగుళాలు కూడా ఉండేది కాదు. నా ఆకలికి సరిగ్గా సరిపోయేది. నేను అక్కడ వున్నన్నాళ్ళూ ఆ కారేజ్ కి ఫిక్స్ అయిపోయా. ఫ్రెండ్స్ అంతా, "మీ పెర్సనాలిటీకి, ఆ జడలు, ఆ కారేజ్ సరిపోవండీ" అనేవాళ్ళు. నేను నవ్వేసి ఇంటికొచ్చి పిన్నితో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. కారేజ్ కథ ఇంకోటుంది. ఇందాక చెప్పానే, అమ్మమ్మ వచ్చినప్పుడల్లా, ఓ నాలుగు, అయిదు గిన్నెల క్యారేజ్ లో ఊరగాయలు తెచ్చేదని. సరిగ్గా అలాంటిదే నా పెళ్ళికి కానుకగా ఇచ్చి, "నాలాగే దీనితో పుట్టింటి నించి పచ్చళ్ళు తెచ్చుకోవే" అంది పిన్ని. కాకపోతే, నాకు అలాంటి అవసరమూ, అవకాశమూ ఏనాడూ రాలేదు. నా పచ్చళ్ళు, పొళ్లు, వడియాలు, వరుగులు, సమస్తమూ నేనే పెట్టుకునేదాన్ని. పైగా అందరికీ కూడా ఇచ్చేదాన్ని. గత 40 ఏళ్లుగా అన్నీ నేనే పెట్టుకుంటున్నా. ఈ మధ్యే కాస్త ఓపిక తగ్గుతోంది.
అన్నట్టు నా పెళ్లి మా బాబాయి, పిన్నే చేశారు. మావారి బావగారు, మా పిన్నికి మేనమామ కొడుకు. అలా పెళ్లి సంబంధం మాట్లాడి , బాబాయే మమ్మల్ని సంబల్ పూర్ నుంచి పిలిపించి వాళ్ళింట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు. అలా పెళ్లి కుదిరింది. అన్నట్టు మా బాబాయ్ జాతకాలు కూడా చూస్తాడు. తానే స్వయంగా చూసి జాతకం కుదిరింది అని మమ్మల్ని పిలిపించి అన్నీ ఏర్పాట్లూ చేసాడు. మొదట్లో మా మామగారు జాతకం చూసి కుదరలేదు అన్నారట. కానీ మా బాబాయ్ ఒప్పుకోలేదు. మొత్తానికి మావారి జాతకంలో తారీకు తప్పు పడిందని రుజువు చేసి, మా జాతకాలు బాగా కుదిరాయని నిరూపించి మా పెళ్లి చేసాడు బాబాయ్. అప్పటి నుంచీ మావారి సర్టిఫికెట్లలో 5వ తారీకు అని ఉంటే, పుట్టిన రోజు మాత్రం 6న చేసుకోవటం అలవాటయ్యింది.
బాబాయ్ చాలా చిన్నప్పుడే 45 ఏళ్లకే పోయాడు. పిన్ని పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయింది. పాపం పిన్నికి అంతా బాబాయితోనే లోకం. బాబాయి లేకపోవడాన్ని అలాగే చేదుగా సద్దుకుని ఎలాగోలా మింగింది. నేను పెద్దవాడిని కడుపుతో వున్నాను బాబాయి పోయినప్పుడు. బాబాయికి కిడ్నీ సమస్య వుంది. రెండు కిడ్నీలలో ఒకటి శరీరం లోపల పెరగలేదట. ఒక్కటే పెరిగి బాబాయిని 45 ఏళ్ళు బాగా ఉంచింది. లోపల కిడ్నీ పెరిగిందో లేదో బయటకు ఎలా తెలుస్తుందీ, తెలియలా, కానీ కొంప ముంచేసింది. తరువాత వున్న కిడ్నీ కూడా అలసిపోయి కన్ను మూసింది. సర్జరీ కూడా చేయించుకోనని బాబాయ్ మొండికేసాడు. ఎందుకంటే, జాతకం ప్రకారం ఆ సమయంలో తనకి ప్రాణ గండం ఉందట. ఎవరు చెప్పినా వినలేదు. నాన్నా, అత్తయ్యలూ కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. నాన్న ఆ రోజుల్లో గౌహతీలో ఉండేవాడు. నాన్న విషయం తెలుసుకుని వచ్చేసరికే బాబాయ్ చనిపోయాడు. నాన్నకి ఆ సమాచారం విజయవాడలోనే తెలిసి కుప్ప కూలిపోయాడు. ఎలాగో లేచి హైదరాబాద్ వచ్చాడు. ఆ తరువాత నాన్నకు కూడా చాలా జబ్బు చేసింది, బాబాయి మీద బెంగతో. ఇది చూసి పెదనాన్నలు, అత్తయ్యలు అల్లాడి పోయారు. మొత్తం మీద నాన్న లేచి తమ్ముడికి చేయవలసిన తతంగమంతా దగ్గరుండి అన్నీ రవితో చేయించాడు. రవి చిన్న పిల్లవాడు అప్పుడు. తమాషాగా అలాగే, మా నాన్న పోయినప్పుడు, శర్మ పెదనాన్న ధైర్యంగా నిలబడి, మా తమ్ముడు చేత అన్ని కార్యక్రమాలూ యధావిధిగా చేయించాడు. బాబాయ్ పోయేసరికి రవి పదో తరగతి అనుకుంటా, పాపం వల్లి ఇంకా చిన్నది. పద్మ ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ లో చేరింది. శారద కి కూడా ఆ సంవత్సరమే డిగ్రీ అయ్యింది. ఇప్పుడు శారద మైక్రో బయాలజీలో డాక్టరేట్ చేసి అమెరికాలో మెడికల్ డైరెక్టర్ గా వుంది. పద్మ మా ఇంట్లో మొదటి లేడీ ఇంజనీరు. పిల్లలందరూ పైకొచ్చారు, చక్కగా స్థిరపడ్డారు. అయినా బాబాయ్ లేని లోటు అలాగే ఉంటుంది. మానాన్న అప్పుడు నాతో అన్నాడు, "ఉమాదేవి ఎలా బతుకుతుంది, ఏనాడూ బయటకి కూడా రాలేదు. సాంబుడు లేకుండా ఒక్కత్తీ ఎలా నిర్వహించుకుంటుందీ" అని చాలా బాధపడ్డాడు.
బాబాయికి ఇంకా చాలా రంగాల్లో ప్రవేశం ఉండేది. ఇంట్లో ఒక కుట్టుమిషన్ ఉండేది. బాబాయికి బుద్ధి పుడితే చక్కగా కొత్త డిజైన్స్ అద్భుతంగా కుట్టేవాడు. బాబాయ్ దగ్గరే నేను ఫస్ట్ షీరో పామిస్ట్రీ బుక్ చూసాను. చాల స్టడీ చేసి పామిస్ట్రీ చెప్పేవాడు. ఇవేకాక జాతకాలు చెప్పేవాడు. నా పెళ్లి నిశ్చయించిందీ, ముహూర్తాలు పెట్టిందీ బాబాయే. ఒకసారి బాబాయీ ఇంకో ప్రొఫెసర్ గారూ కలిసి మసాబ్ ట్యాంక్ లో కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే, సడెన్ గా బాబాయ్ ఆయనతో 'కాసేపట్లో ఈ జంక్షన్ లో ఆక్సిడెంట్ అవుతుంది', అని చెప్పాట్ట. ఆయన వెంటనే ఆగిపోయి 'నిజంగా జరుగుతుందా, అయితే రండి ఇక్కడ కూర్చుని చూద్దాం', అన్నారట. వెంటనే ఈ ఇద్దరూ ప్రొఫెసర్లూ అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చుని చూస్తున్నారట. నిజంగానే ఆ సంఘటన జరిగిందిట. ఆ ప్రొఫెసర్ ఒక్కసారిగా బాబాయికి దణ్ణం పెట్టేసి మీరు గ్రేట్ అండీ, అనేసి, అప్పటినుంచీ బాబాయికి ఆయన అభిమాని అయిపోయాట్ట. ఈ విషయం స్వయంగా బాబాయే ఎప్పుడో నాకు చెప్పాడు. బాబాయ్ పోయిన తరువాత బాబాయ్ తోటి ప్రొఫెసర్లు బాబాయ్ డెస్క్, రాక్ ల నుంచి కొన్ని వస్తువులు, డైరీలు పుస్తకాలు తెచ్చి ఇచ్చారట. ఆ సంవత్సరం డైరీలో డిసెంబర్ 20 అని రాసి, రెడ్ పెన్నుతో రౌండ్ ఆఫ్ చేసి, ప్రాణగండం అని రాసి ఉందట. ఈ విషయం నాకు పద్మ చెప్పింది.
అందుకే కాబోలు, బాబాయ్ డిసెంబర్ 20 దాటితే కానీ ఆపరేషన్ చేయించుకోను అని పట్టుబట్టాడు. నాన్న ఏమో నేను కిడ్నీ ఇస్తాను అని గౌహతీ నుంచి బయలుదేరాడు. అది అత్తయ్యలకి ఇష్టం లేదు. వాళ్ళ ఉద్దేశం వేరు. వీళ్ళు మగవాళ్ళు, ఉద్యోగాలు చేసుకోవాలి, అదే మా ఆడవాళ్లయితే, ఓ వంటమనిషిని పెట్టి పనులు చేయించుకోవచ్చు, అన్నారు. కానీ వీళ్లందరి ఆలోచనలు తారుమారు చేస్తూ బాబాయి చెప్పుకున్న తన జాతకమే నిజమైంది. పైగా బాబాయి చాలా మొండివాడు, పట్టుదల ఎక్కువ. "నాకు ప్రాణగండం వుంది, నా ఆపరేషన్ కి డబ్బులు ఖర్చు చెయ్యద్దు. ఆ డబ్బులు నేను పోయాక నా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ నామీద ఖర్చు చెయ్యద్దు." అని పట్టు పట్టాడు. పాడు డిసెంబర్ 20 వచ్చేసింది, బాబాయిని తనతో తీసుకు వెళ్ళిపోయింది. బాబాయ్ పోయాక పెద్దత్తయ్య ఒక తల్లి లాగా 'ఇక్కడికే తీసుకు రండిరా, ఇక్కడినుంచే పంపిద్దాం' అని చివరి కార్యక్రమం అంతా వాళ్లింట్లోనే చేయించింది.
బాబాయికి ఇంకా చాలా రంగాల్లో ప్రవేశం ఉండేది. ఇంట్లో ఒక కుట్టుమిషన్ ఉండేది. బాబాయికి బుద్ధి పుడితే చక్కగా కొత్త డిజైన్స్ అద్భుతంగా కుట్టేవాడు. బాబాయ్ దగ్గరే నేను ఫస్ట్ షీరో పామిస్ట్రీ బుక్ చూసాను. చాల స్టడీ చేసి పామిస్ట్రీ చెప్పేవాడు. ఇవేకాక జాతకాలు చెప్పేవాడు. నా పెళ్లి నిశ్చయించిందీ, ముహూర్తాలు పెట్టిందీ బాబాయే. ఒకసారి బాబాయీ ఇంకో ప్రొఫెసర్ గారూ కలిసి మసాబ్ ట్యాంక్ లో కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే, సడెన్ గా బాబాయ్ ఆయనతో 'కాసేపట్లో ఈ జంక్షన్ లో ఆక్సిడెంట్ అవుతుంది', అని చెప్పాట్ట. ఆయన వెంటనే ఆగిపోయి 'నిజంగా జరుగుతుందా, అయితే రండి ఇక్కడ కూర్చుని చూద్దాం', అన్నారట. వెంటనే ఈ ఇద్దరూ ప్రొఫెసర్లూ అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చుని చూస్తున్నారట. నిజంగానే ఆ సంఘటన జరిగిందిట. ఆ ప్రొఫెసర్ ఒక్కసారిగా బాబాయికి దణ్ణం పెట్టేసి మీరు గ్రేట్ అండీ, అనేసి, అప్పటినుంచీ బాబాయికి ఆయన అభిమాని అయిపోయాట్ట. ఈ విషయం స్వయంగా బాబాయే ఎప్పుడో నాకు చెప్పాడు. బాబాయ్ పోయిన తరువాత బాబాయ్ తోటి ప్రొఫెసర్లు బాబాయ్ డెస్క్, రాక్ ల నుంచి కొన్ని వస్తువులు, డైరీలు పుస్తకాలు తెచ్చి ఇచ్చారట. ఆ సంవత్సరం డైరీలో డిసెంబర్ 20 అని రాసి, రెడ్ పెన్నుతో రౌండ్ ఆఫ్ చేసి, ప్రాణగండం అని రాసి ఉందట. ఈ విషయం నాకు పద్మ చెప్పింది.
అందుకే కాబోలు, బాబాయ్ డిసెంబర్ 20 దాటితే కానీ ఆపరేషన్ చేయించుకోను అని పట్టుబట్టాడు. నాన్న ఏమో నేను కిడ్నీ ఇస్తాను అని గౌహతీ నుంచి బయలుదేరాడు. అది అత్తయ్యలకి ఇష్టం లేదు. వాళ్ళ ఉద్దేశం వేరు. వీళ్ళు మగవాళ్ళు, ఉద్యోగాలు చేసుకోవాలి, అదే మా ఆడవాళ్లయితే, ఓ వంటమనిషిని పెట్టి పనులు చేయించుకోవచ్చు, అన్నారు. కానీ వీళ్లందరి ఆలోచనలు తారుమారు చేస్తూ బాబాయి చెప్పుకున్న తన జాతకమే నిజమైంది. పైగా బాబాయి చాలా మొండివాడు, పట్టుదల ఎక్కువ. "నాకు ప్రాణగండం వుంది, నా ఆపరేషన్ కి డబ్బులు ఖర్చు చెయ్యద్దు. ఆ డబ్బులు నేను పోయాక నా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ నామీద ఖర్చు చెయ్యద్దు." అని పట్టు పట్టాడు. పాడు డిసెంబర్ 20 వచ్చేసింది, బాబాయిని తనతో తీసుకు వెళ్ళిపోయింది. బాబాయ్ పోయాక పెద్దత్తయ్య ఒక తల్లి లాగా 'ఇక్కడికే తీసుకు రండిరా, ఇక్కడినుంచే పంపిద్దాం' అని చివరి కార్యక్రమం అంతా వాళ్లింట్లోనే చేయించింది.
నాకు అప్పుడప్పుడు పిన్నిని చూడాలనిపిస్తూ ఉంటుంది. నాకు ఒకసారి ఇబ్బంది వస్తే, ఇంటిల్లిపాదీ అందరూ హెల్ప్ చేసారు. పిన్నైతే, "నీకు అమ్మా, నాన్నా ఇద్దరూ లేరు, నేనున్నా, నీకు ఏం కష్టమొచ్చినా నాకు చెప్పుకోవే" అంది. ఎప్పుడూ ఎవరికీ ఫోన్ చెయ్యని పిన్ని, తనంతట తానే ఫోన్ చేసి నాతో మాట్లాడేది. మళ్ళీ ఆ సమస్య నాకు తీరిపోయాక, ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అయిపోయారు. పాతనీరు పోవాలీ, కొత్తనీరు రావాలీ. తప్పదు. ఇది సృష్టి నియమం. అయినప్పటికీ, మనవాళ్ళు, ఆప్తులు, ఆత్మీయులు ఇకనుంచీ కనిపించరూ అనిపిస్తే, ఆ బాధ వేరు. వర్ణనాతీతం. ఇప్పుడు రవిని చూస్తుంటే బాబాయ్ లాగ అనిపిస్తోంది. పద్మ చాలా దగ్గరైంది. శారద కూడా చాలా ఆపేక్షగా ఉంటుంది. ఇవీ మా సాంబాబాయీ, ఉమాదేవి పిన్నీలతో నా అనుభవాలు. అన్నట్టు మా బాబాయ్ పూర్తిపేరు డాక్టర్ నందివాడ వెంకట సాంబశివరావు, అందరూ, సాంబా, సాంబుడు అని పిలిచేవారు. చాలా రోజులుగా పద్మ అడుగుతోంది, మా నాన్నతో నీ అనుభవాలు రాయవా అని. అందుకే ఈ రైటప్.
**********************
Beautifully written! I just went back into those days akkayya! Thank you so much!
రిప్లయితొలగించండిChaala baaga raasavu peddakka. Malli oka sari babayini chusinattu ayyindi. Pinni kuda ee article chuste baguntundi kaani baadha padutundemo. Mana naannaki familylo andaritonu ilanti strong and affectionate relations undevi. Adi nanna speciality. Babai is a self less simpleton. Chaaaaaaaaala bagundi. Mugguru attayyalagurinchi kids raayi.
రిప్లయితొలగించండిAvunu padma, kalla kinkattinattu raasindi akkayya
తొలగించండిKuda in the last line
రిప్లయితొలగించండిExcellent Vijaya. It's a pleasure to read all your blogs. Your way of writing makes me remember Bhanumati Ramakrishna gari stories.
రిప్లయితొలగించండిPeddakka,
రిప్లయితొలగించండిMemories came flooding back reading your post and I have a lump in my throat now. Sambabai’s affection and caring were boundless. Saradakka, Padma, Ravi and Valli are fortunate to have inherited his virtues, genius and intellect. Sadly, fate snatched him away from them and all of us so early. I can’t imagine the pain and emotional strain they must have endured growing up. I also remember how Saradakka suddenly seemed to have acquired years of maturity and wisdom in a short span in an attempt to fill the void left behind by babai’s passing.
You are lucky to have spent those good years with babai’s family while pursuing your studies though we missed you a lot when we were in Sambalpur. You clearly had much fun with babai and received much love from pinni. I heard of his cooking skills and about the folding chairs, but never knew he was skilled at sewing too. Didn’t know pinni was good at singing either. Why don’t you write a full post about her, the unsung hero who raised four kids from their tender ages single-handedly never asking help from anyone? As if that wasn’t enough, she patiently and lovingly cared for her own aging mother decade after decade as she lived to be hundred+ years old.