అమ్మమ్మా, తాతయ్యా
భట్టిప్రోలు విజయలక్ష్మి
మా అమ్మమ్మ, లక్ష్మీనరసమ్మ, చాలా అందంగా వుండేది. తెల్లగా, పొట్టిగా, నాజుగ్గా వుండేది. గొంతు బావుండేది. పాట అయితే నేనెప్పుడూ వినలేదు. చాలా నిదానంగా నెమ్మదిగా కనిపించేది. గట్టిగా మాట వినిపించేది కాదు. కానీ చురుక్కుమనిపించేది. మనిషి చాలా శుభ్రంగా వుండేది. పది మంది పిల్లల తల్లిలాగా కనిపించేది కాదు. ఇంతమంది కానీ, పెంచి, గొప్ప వాళ్ళను చేసింది ఈవిడేనా అనిపించేది. మా తాతయ్యా వాళ్ళ అన్నగారు డాక్టరు, ఆయన చాలా చిన్నతనంలోనే పోయారట. ఆయన మధ్యలో అడ్డం వుండి ఇప్పించిన అప్పులు తీర్చటానికి ఆస్తిలో పెద్దభాగం వదిలేసుకోవాల్సి వచ్చిందట. అందుకని మా అమ్మమ్మకి మా తాతయ్య మీదా, వాళ్ళ మామగారి మీదా కోపంగా ఉండేదిట. ఇంతమంది పిల్లలని ఎలా పెంచాలా అని బాధపడేదిట. అందరి చదువులు, పెళ్ళిళ్ళు ఎలా అని ఆలోచించేదిట. అయినా మా మామయ్యలందరూ, మల్లు మామయ్య తప్ప, రోహిణీ పిన్నీ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఆమ్మమ్మ పొదుపుగా ఉంటూ అన్నీ అందరికీ అందేలా చూసుకునేది అని అమ్మ అనేది. అమ్మమ్మ చాలా ధైర్యం వున్న మనిషని మాత్రం నేనూ చూశా. తాతయ్య పోయాక అమ్మమ్మ వొక్కత్తే వొంటరిగా ఆరుగొలనులోనే వుండేది. తన పనులన్నీ తనే చూసుకునేది. బహుశా మా అమ్మకీ వాళ్ళ అమ్మ ధైర్యమే వచ్చివుంటుంది. మా అమ్మా నాన్న పోయాక వొంటరిగానే వుంది చాలాకాలం. ఒకసారి అమ్మమ్మని ఆరుగొలనులో ఆవో, ఎద్దో పొడిచింది. ఆరోజుల్లో నేను విజయవాడలో చదువుకునేదాన్ని. అమ్మమ్మని చూసుకోవటానికి సీతామ్మ వెళితే, నేనూ, సత్యవతీ సీతామ్మా వాళ్ళింట్లో వున్నాం. ఆ తరువాత అమ్మమ్మని వాళ్ళ పిల్లలెవరూ వా వూళ్ళో ఉండనివ్వలేదు. పిల్లలందరి దగ్గరికీ, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. నాతో సంబల్ పూర్ వచ్చింది. నాన్న అప్పుడే మా అందరినీ భువనేశ్వర్, కోణార్క్, పూరీ తీసుకెళ్ళారు. అవి చూసి అంతా చాలా సంతోషించాం. మేము వెళ్ళిన రోజుల్లో మూల విరాట్టులన్నీ ఆ గుడి ఆచారం ప్రకారం గుండిచా మందిరంలో వున్నాయని గుర్తు. ఎందుకంటే విగ్రహాలని చాలా దగ్గరగా చూశాం. మళ్ళీ అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేకపోయాం. పూరీలో శంకరాచార్య పీఠానికి వెళ్లాం. దానికి దగ్గరలోనే సముద్రం వుంది. అందరం సరదాగా దాంట్లోకి దిగాం. మా కుటుంబం, నాన్న ఎం. ఈడీ. క్లాస్ మేట్ గోవిందరాజులు గారి కుటుంబం కుడా మాతోనే వుంది. అందరం సరదాగా మిట్ట మధ్యాన్నం పన్నెండు, పన్నెండున్నర మధ్యలో సముద్రం లోకి దిగాం. అమ్మమ్మ మాత్రం మా సామాన్లన్నీ పెట్టుకుని వొద్దు మీద ఎత్తైన చోట కూర్చుంది. ఒక్కసారిగా పే......ద్ద అల ఒకటి వచ్చి మమ్మలనందరినీ ముంచేసి లోపలకి లాగేసింది. మాకు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నీళ్ళల్లో ఇసుక మీద గట్టిగా నించుంటే అలలకి కొట్టుకుపోమని నాన్న ముందే చెప్పాడు. నేను అలానే నించున్నా. కానీ నెత్తిమీంచి నీళ్ళు వేగంగా తన్నేస్తుంటే చాలా కష్టం మీద బలంగా నించున్నా. కొట్టుకుపోతూ, నాకేవో ఇద్దరి చేతులు దొరికాయ్. గట్టిగా పట్టుకుని ఆపా. తరవాత అల వెళ్ళిపోయాక తెలిసింది ఆ చేతులు మా భారతివి, గోవిందరాజులు అంకుల్ వాళ్ళ అమ్మాయివి అని. అసలు ఆ అలలోనుంచి బతికి బయటికి వస్తామనుకోలేదు. ఆ అల వెళ్లిపోంగానే అందరం గబగబా బైటకు వచ్చేశాం. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కేకలేశారు, ఎవరైనా పున్నమి రోజున మిట్ట మధ్యాన్నం వేళలో సముద్రంలోకి దిగుతారా అని. ఆ టైం లో హై టైడ్ వస్తుందిట. బతికాంరా బాబోయ్ అనుకుని పైకి వచ్చేశాం. పాపం అమ్మమ్మ గట్టు మీద కూర్చుని మేమంతా నీళ్ళల్లో మునిగిపోతుంటే భయపడుతూ, కంగారుగా ఉండిపోయింది. అందరూ మునిగిపోయారు, నాకు ఈ భాష రాదు, ఇప్పుడేం చేయాలి అని దుఃఖంలో పడిపోయింది. మేమంతా క్షేమంగా తిరిగి రాంగానే ఒక్కసారి బెంగగా మా దగ్గరికి గబగబా వచ్చింది. ఇక మేం అక్కడ ఉండలేదు. వెనక్కి వచ్చేశాం.
సంబల్ పూర్లో మాతో రెండు నెలలు వుంది. కొత్త వూరు, కొత్త భాష, కొత్త పద్ధతులు ఆవిడకి కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ముఖ్యంగా అమ్మ, నాన్న స్కూటర్ మీద వెళ్తే అమ్మమ్మకి తప్పుగా తోచింది. అవి అన్నీ తలచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది, అప్పటికీ ఇప్పటికీ రోజులు ఎలా మారిపోయాయా అని. భార్యాభార్తా కలిసి వెళ్తేనే తప్పు అనుకునే కాలం నుంచి ఎటువంటి కాలం లోకి వచ్చేశామా అని. నేను రకరకాలైన టిఫిన్లు చేస్తానని ముచ్చట పడేది. నాన్నా వాళ్ళు హైదరాబాదు వచ్చేశాక కూడా కొన్నాళ్ళు మా అమ్మ దగ్గర వుంది. హైదరాబాదులో మాఅమ్మ దగ్గరా, మురళీమామయ్య దగ్గరా ఎక్కువగా వుండేది, చివరలో చనిపోయేముందర పార్థు మామయ్యా వాళ్ళింట్లో వుంది, అక్కడే పోయింది. విస్సన్నపేట నుంచి హైదరాబాదు వరకూ ఆ యాత్ర అలా సాగింది.
మా తాతయ్య, నండూరి సత్యనారాయణ గారు ఆరుగొలనుకి కరణం. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో పోస్టాఫీసులు మొదటిసారి పెట్టినప్పుడు కరణాలకే ఆ బాధ్యత అప్పచెప్పారుట. దాంతో తాతయ్య ఆవూరికి కరణం, పోస్టుమాస్టరు రెండూను. సన్నగా, నల్లగా, పొడుగ్గా, మా అమ్మకి పూర్తిగా భిన్నంగా వుండేవాడు. చాలా సరదా అయిన మనిషి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ వుండేవాడు. నిజాయితీ గల మనిషిగా ఊరూ వాడా పేరు. డబ్బులు సంపాదించుకున్న కరణాలు చాలా మంది, నీతీ నిజాయితీ తో వుండే కరణాలు కొద్దిమంది. వాళ్ళల్లో మా తాతయ్యా ఒకడు. ఆ నీతీ, ఆ పుణ్యమే పిల్లలు మంచిగా ఎదిగేందుకు దోహదపడిందేమో. ఒక్కళ్ళ చేత కూడా వేలెత్తి చూపించుకోలేదు. మా అమ్మకి వాళ్ళ నాన్నంటే ఇష్టంతో పాటు ఎంత మర్యాదా, గౌరవమో. చిన్నప్పుడు వెన్నెల్లో ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశాన్నంతటినీ పరిచయం చేసేవాట్ట, ఈ నక్షత్రం ఇదీ, ఆ రాశి అదీ అంటూ. తాతయ్య రోహిణీ పిన్నికి పద్యాలు చదవటం, అర్ధం చేసుకోవటం బాగా రాదని కేవలం రోహిణీ పిన్ని కోసమే పింగళి సూరన గారి కళాపూర్ణోదయం కావ్యాన్ని తెలుగులో, అదీ తేట తెలుగులో, అందరికీ తేలికగా అర్ధం అయ్యేలా రాశారు. అది అముద్రిత రచన. బహుశా దాన్ని ఏ పత్రికకీ ముద్రణ కోసం పంపించలేదు. మా చిన్నప్పుడు తాతయ్య దస్తూరీతో వున్న ఆ పుస్తకం మా ఇంట్లోనే వుండేది. మేమందరం దాన్ని చాలా సార్లు చదివాం. రచన అనేది మా జీన్స్ లోనే వున్నాయనటానికి ఇది మరో తార్కాణం. ఉత్తరాల్లో తన పేరు నండూరు సత్యనారాయణ అని రాసేవారు. నండూరు ఎప్పుడు, ఎలా నండూరిగా మారిందో తెలియదు. మోహనం మామయ్యా, పార్థు మామయ్యా నండూరి అనే రాసేవాళ్ళు. తాతయ్యకి ఎలా వచ్చిందో గానీ బీడీలు తాగటం అలవాటు. చివరిలో అదే త్రోట్ కాన్సర్ లోకి దింపింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సర్జరీ కూడా చేశారు. గొంతులో మాట్లాడే ట్యూబ్ / అన్నవాహిక తీసేసి పొట్ట దగ్గర ఒక ట్యూబ్ పెట్టారు. దాంట్లో నుంచే కొద్దిరోజులు ఆహారం లోపలి పంపించారు. కానీ ఆ తరువాత ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన 1900 సంవత్సరం లో పుట్టారు. 1971లో పోయారు. ఆ టైంకి మాబామ్మ మాదగ్గరే వుంది. మా బామ్మ మా తాతయ్యని 'సత్యం' అనేది, ఆవిడకి ఈ తాతయ్య తమ్ముడు వరస. మా బామ్మ కూడా నండూరి వారి ఆడపడుచే. 'నాకన్నా సత్యం చాలా చిన్నవాడు, అప్పుడే పోయాడా' అని చాలా బాధపడింది. నేను టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన సంవత్సరం అది. రోహిణీ పిన్ని పెళ్లి కూడా ఆ తరువాతే అయింది. తాతయ్య ఎన్ని ఇబ్బందులు వున్నా శాంతంగా ఎలా వుండచ్చో జీవించి చూపించారనిపిస్తుంది. ఆస్తి పోగొట్టారని వాళ్ళ అన్నయ్యని కానీ, వాళ్ళ నాన్నని కానీ ఏనాడూ తప్పు పట్టినట్లు నేను వినలేదు. కరణీకం కానీ, పోస్టాఫీసు పని కానీ తీసుకోమని అంతా మల్లు మామయ్యకి ఎంతో చెప్పారు, ఆయన వినలేదు. 'మీరంతా పట్టణాల్లో వుంటే నేను పల్లెలో ఉండాలా' అని. కానీ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బాధపడ్డాడు. ఆరుగొలనులొ వుండి తాతయ్య వుద్యోగం తీసుకుంటే బాగుండేదని అందరూ అనుకునేవారు. తాతయ్య మాత్రం ఎవరితో మాట పడకుండా, ఎవరినీ మాట అనకుండా బతుకు బండి లాగగలిగాడు. దటీజ్ తాతయ్య.