29, మే 2020, శుక్రవారం

పాపం......బామ్మ

పాపం......బామ్మ  

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                      

                                                      బామ్మకి మొత్తం 13 మంది సంతానం పెద్ద పెదనాన్నతో కలిపి. ఆయన్నెప్పుడూ సవతి కొడుకని వేరుగా చూసింది లేదు. తొలి చూలు సంతానం బాలాత్రిపురసుందరి పుట్టిన కొద్ది రోజులకే పోయిందిట. కానీ బామ్మ ఎప్పుడూ ఈ విషయాన్ని నాకు చెప్పనూ లేదు. తానూ ఆ విషయాన్ని తలచుకుని బాధపడుతుంటే నేను ఏనాడూ చూడనూ లేదు. అసలు మా కుటుంబంలో ఇటువంటి ఒక కారెక్టర్ ఉందని నాకు ఈ మధ్యనే, మా పెద్ద పెదనాన్న రాసిన వంశవృక్షం కాపీలో కనపడింది. తరువాత ఇందిరక్క ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ఆ బాలాత్రిపురసుందరి పేరే మా ఉమా పెదనాన్న వాళ్ళ చిన్న అమ్మాయికి పెట్టుకున్నాడు అని. ఆ బాలాత్రిపురసుందరి తరువాత పుట్టినవాడు ఆయనే మరి. తన సంతానంలో మిగిలిన వాళ్ళల్లో బామ్మ తాను జీవించిన కాలంలోనే మరో రెండు మరణాలు చూసింది. మొదటిది మా బుచ్చిపాపత్తయ్యది అయితే, రెండోది మా మధు పెదనాన్నది. మధు పెదనాన్న మరణం నాకు కూడా బాగా గుర్తుంది. బామ్మ జీవితంలో నాకు తెలిసి అత్యంత బాధాకరమైన ఘట్టాలు ఇవి రెండూ. పాపం అయినా తట్టుకుని నిలబడింది. 

                                                                నేను అప్పుడు ఏడో క్లాసో, ఎనిమిదో క్లాసో చదువుతున్న రోజులవి. ఆ సంవత్సరం ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ నవలల పోటీలో ప్రధమ బహుమతి సంపాదించుకున్న నవల పేరు ఇందుమతి. రచయిత కాదంబరి. ఇది మా కుటుంబ కథ. ఈ నవలా నాయిక ఇందుమతే మా బుచ్చిపాపత్తయ్య. ఆ రచయితే మా అత్తయ్య భర్త శేషగిరిరావు గారు. ఆయనే ఎందుకో కాదంబరి అని కలం పేరుతో రాశారు. ఆ తరువాత ఆయన ఇంకే రచనలు చేసినట్టు తెలియదు. బాణభట్టు రాసిన కాదంబరి ఆయనకు ఇష్టమో ఏమో ఆ పేరునే తన కలం పేరుగా మార్చుకుని ఇందుమతి రాశారు. మా అత్తయ్య అసలు పేరు శ్రీమహాలక్ష్మి. ముద్దుపేరు బుచ్చిపాప. ఎంతో అందంగా వుండేదిట. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా వాళ్ళది ఎంతో అన్యోన్యమైన జంట. ఆయన పాపం ఆవిడను ఎంతగా ప్రేమించాడో మరి. ఆవిడను తన నవలతో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చిరంజీవిని చేసేసాడు. ఆ నవలలో మా నాన్న పాత్ర పేరు త్రివిక్రముడు, సాంబాబాయ్ పేరు వామనుడు అనుకుంటా. మా నాన్నకి ఈ అత్తయ్య రెండో అక్క. ఈ అత్తయ్యకి పెళ్లి అయిన కొద్దిరోజులకే బాగా జబ్బు చేసి, (థైరాయిడ్ గ్లాండ్ కి టీబీ వచ్చిందిట) యెంత వైద్యం చేయించినా బతకలేదు. బామ్మ ఎప్పుడూ అనేది. వాళ్ళ బంధువుల్లో కాచమ్మ గారనే ఆవిడని ఆ మెట్టపల్లి వారింటికే ఇచ్చి పెళ్లి చేస్తే, ఒక్క ఏడాదికే భర్త చనిపోయి వెనక్కు వచ్చేసిందట. కనుక ఆ ఇంటి పేరిటి వాళ్ళతో సంబంధం వద్దూ అన్నా, వినకుండా ఇది మంచి సంబంధం అని తాతగారు ఈ పెళ్లి చేశారట. ఈసారి అబ్బాయి బాగానే వున్నాడు కానీ, అమ్మాయి పోయింది. ఈసారి ఇలా అచ్చి రాలేదు ఆ ఇంటి సంబంధం. నాతో ఎప్పుడూ చెప్పేది, 'ఆ ఇంటికి కాచమ్మ నిస్తే, అది పాపం సంవత్సరానికే పసుపుకుంకుమ పోగొట్టుకుంది. ఆ సంబంధం వద్దూ అంటే, మీ తాతయ్య వినలేదు. చివరికి అబ్బాయి మంచివాడని నేనూ ఊరుకున్నా' అనేది. ఇంతకీ ఈ కాచమ్మ ఎవరో నాకూ తెలియదు. పెళ్లి అయింది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమతో వున్నారు. ఇంతలో ఆ దేవుడికి కన్ను కుట్టింది కాబోలు, ఈ వ్యాధి ముంచుకొచ్చింది. అత్తయ్య కొద్దిరోజులకే కన్ను మూసింది. 

                                                  ఈ సీరియల్ వస్తున్నన్నాళ్ళూ నాన్న బామ్మకోసం ఆంధ్రప్రభ వారపత్రిక కొనేవాడు. ప్రతి గురువారం నాడు కాబోలు వచ్చేది. పేపరబ్బాయి ఇంటికే తెచ్చి ఇచ్చేవాడు వీక్లీ. బామ్మకి అది చదువుతుంటే, కళ్లనీళ్లు వచ్చేసి చదవలేకపోయేది. ఇది చూస్తే, నాకూ జాలి వేసేది. నన్ను పిల్చి, 'ఇది కాస్త చదివి పెట్టవే' అనేది.  నాకసలే పుస్తకాలు చదవటమంటే మహా ఇష్టం. పైగా ఇది మా కుటుంబ గాథ. నేను చదవకపోతే ఎలా, ప్రపంచం ఆగిపోదూ..... పైగా ఆ రోజుల్లోనే బామ్మకి ఒక కంటికి ఆపరేషన్ చేశారు. ఎక్కువ చదవకూడదు. కన్నుకి అలసట పనికిరాదని ఆ డాక్టరుగారు చెప్పారు. ఇక నాకు తప్పేదేముంది. వారం వారం ఆ సీరియల్ బామ్మకి  చదివి వినిపించేదాన్ని. బామ్మ వింటూ ఏడుస్తూ ఉండేది. ఇక మా అమ్మ చూసుకో, లోపలి పిలిచి చచ్చేట్టు తిట్టేది. ఎందుకు చదువుతావ్, చదవనని చెప్పు అని కేకలేసేది.  దీనికి రెండు కారణాలు. ఒకటి...అదేమో ప్రేమకథ, నేనేమో చిన్నపిల్లని. అలాంటివి ఆ వయసులో నేను చదవటం మా అమ్మకి ఇష్టం లేదు. రెండో కారణం.... అది చదివితే బామ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది, అది ఆవిడ కంటికి మంచిది కాదు. ఇదీ మా అమ్మకి ఇష్టం లేదు. ఏది ఏమైనా, మా బామ్మ నన్నూ వదలలేదు, ఏడుపునీ వదలలేదు. మా అమ్మ నన్ను తిట్టటమూ మానలేదు. నేను ఆ సీరియల్ చదవటమూ మానలేదు. ఆ వార్తాపత్రికలన్నీ మా ఇంట్లో చాలాకాలం ఉండేవి. ఆ తరువాత ఏమయ్యాయో తెలియదు. ఈ అత్తయ్య పేరు, ముద్దు పేరుతో సహా మా హరి పెదనాన్న వాళ్ళ పెద్దమ్మాయికి పెట్టుకున్నాడు. తన కూతురు  పేరని మా బుచ్చిపాపక్కయ్యంటే, బామ్మకి ఎంతో  ఇష్టం. చాలామంది మా బుచ్చిపాపక్కయ్య అచ్చం బామ్మ పోలికంటారు కానీ, ఈ అక్కయ్య కన్నా, మా ఇందిరక్కకే బామ్మ పోలికలు ఎక్కువగా ఉంటాయి. అందుకని బామ్మకి ఇందిరక్కన్నా కూడా చాలా ముద్దు. మొత్తానికి బామ్మ పేరు నాకూ, రూపం ఇందిరక్కకూ, అత్తయ్య పేరు మా బుచ్చిపాపక్కయ్యకూ  వచ్చాయి. ఎంతమంది వున్నా మేం  ముగ్గురం మాత్రం బామ్మకి స్పెషల్. అదంతే. 

                                                              ఈ నవల ధర్మమా అని నాకు పుస్తకాలు చదివే పిచ్చి బాగా ఎక్కింది. ఎంత బాగా అంటే, మరునాడు పరీక్ష వున్నా, ఈ రోజు ఏదైనా పుస్తకం దొరికితే, అది చదివాకే పరీక్షకి చదివేదాన్ని. దుప్పటి కప్పుకుని, లోపల టార్చ్ లైట్ వేసుకుని చదివిన రోజులూ వున్నాయి. లైబ్రరీలకి లైబ్రరీలు ఖాళీ చేసేసా. రైల్వే కోడూరులో లైబ్రేరియన్ అయితే, అన్ని పుస్తకాలూ చదివేసారండి, మీ కోసం మళ్ళీ కొత్త పుస్తకాలొస్తే కానీ ఏమీ ఇష్యూ చెయ్యలేను, అనేది. ఆవిడ పేరు సీమంతిని. మంచి స్నేహశీలి. భార్యాభర్తలిద్దరూ ఆ లైబ్రరీలోనే లైబ్రేరియన్స్ గా పనిచేసేవారు. అతనికేమో మద్దిపట్ల సూరి అంటే ఇష్టం. ముఖ్యంగా ఆయన రాసిన చంగిజ్ ఖాన్ అంటే మరీ ఇష్టం. సరే, ఇదంతా నా గోల. మళ్ళీ బామ్మ దగ్గరికి వద్దాం. బామ్మని కూతురు పోయిన దుఃఖం నుంచైతే తప్పించలేను కానీ, ఆ నవల నేను చదువుతుంటే, ఆవిడ అంత దుఖంలోనూ ఆనందపడేది కూతురుని గుర్తు చేసుకుంటూ. అల్లుడు తప్పేమీ లేదని తెలిసినా, ఆ అల్లుడంటే బామ్మకి కోపంగా ఉండేది. అసలు ఆ ఇంటిపేరిటి వాళ్లకే, పిల్లనిచ్చి వుండకూడదు. నా ప్రారబ్ధం అని బాధపడేది. పాపం ఆ మామయ్యగారు కూడా భార్య పోయినా, తానూ వేరొక పెళ్లి చేసుకున్నా, మా కుటుంబంతో కూడా సన్నిహితంగానే ఉండేవారు. మా తమ్ముడు పెళ్ళికి ఆయన వృద్ధాప్యం వల్ల రాలేకపోతే, కొత్త దంపతులతో పాటు నాన్న, నేను వెళ్లి ఆయనకు బట్టలు పెట్టాం. అమ్మ అప్పటికే పెళ్లి పనులతో అలసిపోయి రాలేనంది. ఇదీ ఆ అత్తయ్య కథ. మధ్య వయసులో మా బామ్మకి తగిలిన ఒక పెద్ద దెబ్బ ఈ అత్తయ్య మరణం.  
                                                            
                                                           పెద్ద వయసులో బామ్మకి తగిలిన మరో పెద్ద దెబ్బ, మా మధు పెదనాన్న మరణం. అప్పుడు బామ్మ మాతోనే తెనాల్లో ఉండేది. ఉదయాన్నే కబురు....  పెదనాన్న పోయాడని. నాన్న నెమ్మదిగా బామ్మ దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుని, 'అమ్మా, బెజవాడ వెళ్ళాలి, టాక్సీ వస్తుంది కాసేపట్లో' అని చెప్పాడు. టాక్సీ అనేసరికి బామ్మకి ఖంగారు వేసింది. ఎందుకంటే, మామూలుగా అయితే మేము బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. ఎవరికి ఏం అయింది అని బామ్మ గట్టిగా అడిగేసరికి నాన్నే నెమ్మదిగా చెప్పాడు. మధన్నయ్య రాత్రి పోయాట్ట. హార్ట్ అటాక్ తో అని చెప్పాడు. బామ్మని పట్టుకోవడం చాలా కష్టం అయింది. నేను అప్పుడు ఐదో క్లాసో, ఆరోక్లాసో. మేము తెనాలి వచ్చి అప్పటికి సంవత్సరమో, రెండు సంవత్సరాలో అయిందేమో.  నాన్నకి అక్కడ తాలూకా హైస్కూల్లో హెడ్ మాస్టర్ వుద్యోగం వచ్చింది. పెద్ద స్కూల్ అని నాన్న బెజవాడ నుంచి తెనాలికి మారాడు. "లీలా, అందరికీ బట్టలు సర్దు, ఎన్నాళ్ళుండాలో తెలియదు." అని అమ్మకి చెప్పాడు. అందరం ఓ గంటలో బెజవాడ చేరాం. ఆ ముందటి రోజే పెదనాన్న హైదరాబాద్ లో తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేసి, ఆమ్మనీ, పిల్లాడినీ అక్కడే వదిలేసి తాను ఒక్కడే తిరిగి వచ్చాడట. భోజనం చేసి పడుకుని ఇక లేవలేదు. నిద్రలోనే పోయాడట. ఆమ్మ కూడా విషయం తెలుసుకుని హైద్రాబాద్ నుంచి టాక్సీలో పెద్దత్తయ్యా వాళ్ళతో దిగింది. అంతా ఏడుపులూ, మొత్తుకోళ్ళూ...గోల గోల. తలకొరివి పెట్టేవాళ్ళు లేకపోవటంతో నాన్నే చేసాడు ఆ కార్యక్రమాన్ని. మొత్తం మీద ఆ పది పన్నెండు రోజులూ, అమ్మా నాన్నా బిజీ బిజీ. ఎప్పుడు చూసినా తడి బట్టలు, మైల బట్టలు, మడి బట్టలూ అంటూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. దాంతో నాకు చెళ్ళెళ్ళూ తమ్ముడూ స్నానాలు చేశారా లేదా, అన్నాలు తిన్నారా లేదా,  అని చూసుకోవటం, మా బట్టలన్నీ ఉతుక్కోవటం, అవి జాగ్రత్త చేసుకోవటం ఫుల్లుగా చేతి నిండా పని. నేనే చిన్నదాన్నంటే, నాకన్నా చిన్నవాళ్లు మిగిలిన వాళ్ళు. మధ్య మధ్యలో బామ్మని పలకరించడం. ఇదీ నా పని. 

                                                   మా మధు పెదనాన్న డిగ్రీ అయ్యాక బెజవాడలో మొదటిసారిగా ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాడు దుర్గమ్మ వారి పేరు మీద. ఆ కాలేజీ పేరే... డీ టీ కాలేజ్, అంటే దుర్గా ట్యుటోరియల్ కాలేజ్. ఈ ట్యుటోరియల్ కాలేజీల కాన్సెప్టు ఆ రోజుల్లో కొత్తది. ఆ ఐడియా ఆయన బ్రెయిన్ చైల్డ్. అది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ట్యుటోరియల్ కాలేజ్. ఆ కాలేజ్ తోనే మూడంతస్తుల ఇల్లు కట్టాడు. విద్యార్థులని చదివించి బెనారస్ కి తీసుకు వెళ్లి బనారస్ మెట్రిక్ పరీక్ష రాయించటం ఆయన పని. అలా ఎంతమందిని చదివించాడో. మా నండూరి సుబ్బారావు తాతయ్య కూడా అక్కడే మెట్రిక్ చదువుకున్నాట్ట. తమాషా ఏమిటంటే, ఆయన కొడుకు ప్రభాకర్ కూడా అక్కడే చదువుకున్నాడు. మా ఇంట్లో ఆ రోజుల్లో ఆ కాలేజీలో చదువుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మా రామానంద్ అన్నయ్య, శివానంద్ అన్నయ్య, ఇందిరక్క, సుశీల వదిన, ఉమాదేవి పిన్ని చెల్లెలు, చల్లమాంబ పిన్ని ఇలా ఎందరో అక్కడ చదువుకున్న వాళ్ళే. మా నాన్న, సాంబాబాయ్ అక్కడ పార్ట్ టైం టీచర్లుగా కూడా పని చేసేవాళ్ళు. ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు. సాంబాబాయ్ అయితే, అక్కడే స్టూడెంట్ కూడా. మొత్తానికి మా తాతగారు వేదాలు బోధిస్తే, మా పెదనాన్న, నాన్నా, బాబాయ్ టీచింగ్ సైడ్ వచ్చారు. మా తరంకి వస్తే,  మేము ముగ్గురు అక్కాచెల్లెళ్లు, చెల్లమ్మ అత్తయ్య కూతురు నాగు, సరోజిని  అత్తయ్య కూతురు రాధిక, ఫుల్ టైం ప్రొఫెషన్ గా టీచింగ్ చేసాం. ఇందిరక్కా, చల్లమ్మత్తయ్య కూతురు రమా కూడా కొన్నాళ్ళు టీచింగ్ చేశారు. మా జీన్స్ అక్కడివి, అప్పటివి. మా అమ్మా వాళ్ల అన్నయ్య, మురళీ మామయ్య కూడా ఆ కాలేజీలోనే మెట్రిక్ చదువుకున్నాడు. మా ఆమ్మ బైట వూరు నుంచి వచ్చే ఆడ పిల్లల కోసం ఒక హాస్టల్ లాంటిది కూడా నడిపేది. ప్రతి సంవత్సరం స్కూల్ గ్రూప్ ఫోటో అంటే మాత్రం మా పిల్లలందరం వెళ్లి అక్కడ కూర్చునేవాళ్ళం. అలాంటి ఫోటోలెన్నో....ఎన్నెన్నో....

                                                               ఈ పెదనాన్న పోతూనే ఆ కాలేజ్ కూడా మూత  పడింది. ఈ పెదనాన్నా, ఆమ్మలకి మరో హాబీ కూడా వుండేదిట. అది పెళ్లిళ్లు చేయటం. బోల్డంతమంది స్టూడెంట్స్ కదా, వాళ్ళ అక్కలకీ, అన్నలకీ, ఇతర బంధువులకీ, ఎవరికి ఎవరు సరిపోతారో చూసి పెళ్లిళ్లు చేయటం. మా సాంబాబాయ్, ఉమాదేవి పిన్ని వాళ్ళ పెళ్లి కూడా వీళ్ళే కుదిర్చారు. మా ఉమా పెదనాన్న కూడా ఇన్కంటాక్స్ ప్రాక్టీషనర్ గా బాగా సంపాయించి మూడంతస్థుల మేడ కట్టాడు. మధు పెదనాన్న కాలేజీ పెట్టి మూడంతస్థుల మేడ కట్టాడు. కాకపోతే ఆ మూడంతస్తులూ క్లాస్ రూములే. వీళ్ళు మాత్రం ఓ రెండు మూడు గదుల్లో వుండేవారంతే.  అంత గొప్ప కొడుకులని కన్నందుకు బామ్మ ఎప్పుడూ ఉప్పొంగిపోతూ ఉండేది. ఆ సంతోషం మీద ఒక్కసారిగా నీళ్లు చల్లేసినట్లయి పోయింది. బామ్మ దుఃఖం పట్ట తరం కానిది. సరిగ్గా ఆరోజుల్లోనే, అన్నపూర్ణామ్మకు ప్రభాకర్ పుట్టాడు. మధు పెదనాన్నే మళ్లీ పుట్టాడని అందరూ సంతోషపడ్డారు. మా మధు పెదనాన్నకి పోయేటప్పటికి 50 ఏళ్ళు మాత్రమే. చాలా అందంగా ఉండేవాడు. మెహరుబాబాలా ఉంటాడని నేను ఆ రోజుల్లో అనుకునేదాన్ని. మా శ్రీధర్ బాబాయ్ కి కొంచం మధు పెదనాన్న పోలికలు వున్నాయి. మా సరోజినత్తయ్య కొడుకు లలితానంద్ కి ఇంకా ఎక్కువ పోలికలు వున్నాయి. 
                                                   
                                                                        తన సంతానంలో ఈ ఇద్దరి మరణాలూ బామ్మని బాగా కలిచివేసినట్టు నాకనిపించేది. కూతురు మరణం మర్చిపోయి, నెమ్మదిగా బతుకు బాటలో పడుతుండంగా, మధు పెదనాన్న మరణం పెద్ద దెబ్బ. నేను పోయి, వాడు ఉండకూడదా అని ఏడ్చింది. ఏమేమి మనం అనుభవించాలని రాసి ఉందో అదంతా అనుభవించక తప్పదు కదా. మొత్తానికి  అన్ని కార్యక్రమాలూ పూర్తి అయ్యాక  తిరిగి బామ్మతో సహా అందరం తెనాలి చేరుకున్నాం. అమ్మా, నాన్న మాత్రం ఆ సంవత్సరం అంతా బెజవాడ వెళ్లి మాసికాలు పెడుతూనే వుండేవాళ్ళు. మా అమ్మ కూడా ఇలాంటి ఎన్నో విషయాల్లో నాన్నకు తోడుగా ఉండేది.  మొత్తానికి బామ్మ పడ్డ కష్టాల్లో ఇదీ ఒకటి. అన్ని బాధల్లో కూడా యేవో రామదాసు కీర్తనలు పాడుకుంటూ ఉండేది. పెద్దపులి లాంటి బామ్మ దిగులుగా, బెంగగా, మౌనంగా అయిపోయింది. మా అమ్మ కూడా జాలి పడేది ఆవిడను చూసి. కానీ ఎవరేం చెయ్యగలం. బామ్మ ఇష్టంగా పాడుకునే పాటలు, "సీతారామస్వామీ, నే చేసిన నేరము లేమీ", "తక్కువేమి మనకూ, రాముండొక్కరుండు వరకూ", "ఏ తీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ  రామా", "తారకమంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా". ఇలా ఏవేవో పాడుకుంటూ, మొత్తానికి  కాలం గడిపేసింది మా బామ్మ. ఎంత రాజమాత అయినా మాతే కదా మరి. పుత్ర, పుత్రికా శోకం తప్పలేదు మరి. అందుకే "పాపం......బామ్మ" అని టైటిల్ పెట్టా.   
























25, మే 2020, సోమవారం

బామ్మ - పెళ్ళి కథా కమామీషూ

 బామ్మ - పెళ్ళి కథా కమామీషూ

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                           ఎప్పుడూ బామ్మని ఒకటి అడిగేదాన్ని. ' బామ్మా, నీ పెళ్లి ఎలా అయ్యిందీ అని. "మా  నాన్నకి నేనంటే ప్రాణం, అందుకని నన్ను ఊళ్ళోనే ఇవ్వాలని మీ తాతగారికి ఇచ్చాడు" అనేది. 'మరి మీ అక్కని బైట వూరికి ఇచ్చారుగా' అంటే, 'అందుకే నన్ను ఊళ్ళోనే ఇచ్చాడు' అని చెప్పేది. 'ఇంత బంగారం, ఇంత ఆస్తి ఇచ్చి మరీ నిన్ను రెండో పెళ్ళివాడికి ఎందుకు ఇచ్చారు, పైగా అప్పటికే ఒక కొడుకు కూడా వున్నాడు గదా' నేనూ వదిలిపెట్టేదాన్ని కాదు. ఎందుకంటే, నాకెప్పటికీ ఒక ఆశ్చర్యం, అర్ధం కాని విషయం ఇది. ట్రంకు పెట్టెడు బంగారం ఇచ్చి, పైగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి, వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలం ఇచ్చి,  రెండో పెళ్లి వ్యక్తికి, అందునా ఓ ఆరేళ్ళ కొడుకున్న తండ్రికి ఇచ్చి బామ్మకు  ఎందుకు పెళ్లి చేశారూ...... అని.  ఆ వయసులో ఇది అడిగే ప్రశ్న, ఇది అడక్కూడని ప్రశ్న అని తెలిసెడి కాదు. పైగా అత్యంత ఆత్మీయురాలు బామ్మ. ఆవిడ నా ప్రాపర్టీ అంతే, మరో ఆలోచన లేదు. అడిగేశా.

                                                 బామ్మ మాత్రం తొణక్కుండా, బెణక్కుండా ఒక్కటే విషయం చెప్పేది. ఏమంటే, బామ్మా వాళ్ళ నాన్న నండూరి శ్రీరామూర్తిగారికి తన చిన్న కూతురు వియ్యమ్మని పెళ్లి పేరుతో దూరంగా  పంపించటం ఇష్టం లేదు. చూడాలనుకోగానే పిల్లను చూసుకోగలిగేలాగా వున్న ఊళ్ళోనే ఇవ్వాలని ఆయన ఆలోచన. అప్పటికి, అవునూ, కాదూ అని చెప్పగలిగే వయసు కాదు బామ్మది. ఆరుగొలను గ్రామానికి నండూరు వాళ్ళు మొఖాసాదార్లు. అంటే అది నండూరి వాళ్ళ అగ్రహారం లాంటిదన్న మాట. దాంతో, ఊరు ఊరంతా నండూరివాళ్ళే. మరి ఊళ్ళోనే సంబంధం అంటే ఎలా? నండూరు వారు కాకుండా వూళ్ళో ఉంటున్న మరొక్క ఏకైక బ్రాహ్మణ కుటుంబం నందివాడ ఆనందరామయ్యగారిది. భార్య పోయి ఒంటరిగా వున్నాడు. ఒక కొడుకున్నా, ఆ పిల్లవాడిని మేనత్తలు పెంచుతున్నారు. వయసెక్కువ తేడా లేదు. పిల్లవాడు బుద్ధిమంతుడు. మంచి పేరున్న కుటుంబం. పైగా ఇంట్లో చేదోడు వాదోడుగా ఒక వితంతు ఆడపడుచు ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఓ రోజు శ్రీరామూర్తిగారు సంబంధం ఖాయం చేసుకున్నారు, అదీ పెళ్లయ్యాక ఆరుగొలను ఊళ్ళోనే ఉండిపోవాలన్న షరతు మీద. సరే, అదే ఒప్పందం మీద బామ్మకీ, తాతగారికీ పెళ్లి అయ్యింది. మామగారిచ్చిన స్థలంలోనే ఒక ఇల్లు కట్టుకుని కాపురం పెట్టారు బామ్మా, తాతగారూ. ఆ రకంగా బామ్మా వాళ్ళ నాన్న కోరిక తీరింది. ఆయనింటికి పావు మైలు దూరంలోనే చిన్నకూతురు సంసారం వెలసింది. ఇదీ బామ్మ చెప్పిన కథ.

                                                 కానీ అసలు కథ వేరే వుంది. ఇది నాకు ఇంకొంచం పెద్దయ్యాక అత్తయ్యల ద్వారా తెలిసింది. బామ్మకి మొదట గుడివాడలో లా ప్రాక్టీస్ చేస్తున్న రాజగోపాలం తాతగారితో పెళ్లి కుదిరిందిట. ఆయన ఆనందరామయ్యగారి తమ్ముడు. బామ్మా వాళ్ళ నాన్నకి బామ్మని దూరంగా ఇవ్వటం ఇష్టం లేక వీలైనంత దగ్గరలో వున్న గుడివాడలో పిల్లని ఇవ్వటానికి ఒప్పుకున్నారుట. ఈ లోపల ఆనందరామయ్యగారికి భార్య పోయింది. ముందుగా అన్నగారికి పెళ్లి చేస్తే గానీ తమ్ముడికి చెయ్యరు. అప్పుడు తాతగారి చెల్లెలు లౌక్యంగా మాట్లాడి, మీ ఊళ్ళోనే ఉంటాడు, అలా అని ఇల్లరికం ఉండడు, అంటూ మాట్లాడి మా బామ్మకీ, తాతగారికి పెళ్లి కుదిరేలా చేసిందట. ఇదీ కథ. పిల్ల ఊళ్ళోనే ఉంటుందన్న మాట మంత్రంలా వినపడి శ్రీరామూర్తిగారు మా బామ్మ పెళ్లి మా తాతగారితో జరిపించేసారుట. ఇదీ అత్తయ్యలు చెప్పిన కథ.


                                                       మొత్తానికి అన్నదమ్ములిద్దరిలో తన ముద్దుల కూతురిని ఎవరికివ్వాలో ఆలోచనలో పడ్డ నండూరి శ్రీరామూర్తిగారు గుడివాడలో ఉంటున్న మొదటి సంబంధం పెళ్ళికొడుకైన తమ్ముడి కన్నా, రెండో సంబంధం పెళ్ళికొడుకయినా ఆరుగొలనులోనే వుండే అన్ననే పెళ్లికొడుకుగా నిర్ణయించుకున్నారు. దాంతో మా బామ్మ పెళ్లి ఆనందరామయ్యగారి తోనే ముడిపడిపోయిందిట. తమాషా ఏమిటంటే, ఆ రాజగోపాలం తాతగారికి  పెళ్లి చేసుకున్నా,  ఆ  భార్యలూ బ్రతకలేదు, వాళ్ళకు పుట్టిన సంతానము బతకలేదు. వంశం కోసం, తన తదనంతర కార్యక్రమాలు జరిపించటం కోసం ఆయన తిరిగి మా బామ్మా, తాతయ్యలకు పుట్టిన సంతానాన్నే దత్తు తీసుకోవాల్సి వచ్చింది. అదీ విధి. ఏది ఏమైనప్పటికీ విజయరావమ్మగారు ఎంచక్కా, బోల్డు ఆస్తి, బంగారంతో పాటు పెళ్లి చేసుకుని, ఆరుగొలనులోనే, ఒక వీధి నుంచి మరో వీధికి కాపురానికి వచ్చేసింది. ఎంచక్కా డజను మంది పిల్లలను కన్నది. అందరినీ బాగా చదివించి ప్రయోజకులను చేసింది. తండ్రి హాపీ, కూతురు హాపీ. కథ సుఖాంతం.

                                                        వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలంలోనే  ఇల్లు కట్టుకున్నామని బామ్మే నాకు చెప్పింది. అందుకే ఆవిడకి ఆ ఇంటి మీద అంత మమకారం, హక్కు, పట్టూనూ. ఆ ఇంటిలో  ప్రతి గది గురించీ ఎంతో ఇష్టంగా చెప్పేది. యెంత ఇష్టంగా చెప్పినా మా అమ్మ వాళ్ళింటి గురించి చెప్పినంత ఇష్టంగా కాదనుకోండి. ఈ వివరాలన్నీ 'అ'----అమ్మ, 'ఆ'----ఆరుగొలను అనే పోస్టులో రాసాను. మొత్తం మీద ఈ అత్తాకోడళ్ళిద్దరూ నండూరివారే, మొఖాసాదారుల కూతుళ్లే. బామ్మకి తన ఇంటిలో వంటగది, పూజ గది, పెరట్లో పశువుల కొట్టం, బావి, బైట వసారా పెద్ద పడగ్గది, దాంట్లో ఎత్తైన పెద్ద పందిరి మంచం, ఆ మంచం ఎక్కడానికి ఓ కుర్చీపీట, అన్నీ గుర్తే. నాకూ ఆ ఇంట్లో ఓ నెలరోజుల పాటు వుండే అదృష్టం కలిగింది. అన్నాళ్ళూ ఆ పందిరి మంచం మీదే పడుకునే వాళ్ళం నేనూ బామ్మ. బామ్మ ఊరగాయలు పెట్టే పెద్ద పెద్ద జాడీలు, వాటికి మూతలు పెట్టి గుడ్డలతో వాసెనలు కట్టటం, అన్నీ  చెప్పేది. తాతగారి శిష్యులు వస్తే వాళ్ళ ఎడ్లు కూడా వీళ్ళ కొట్టంలోనే కట్టేసేవారట. ఇంతమందికీ ఆవిడే వంటలు చేసేదిట.

                                      ఇంటికి ఎదురుగుండానే ఊరి మంచినీటి చెరువు. ఆడవాళ్లు మడి కట్టుకుని ఆ చెరువు నుంచి మంచినీళ్లు తెచ్చుకునే వారట. ఆ నీటితోనే మడి  వంటలు చేసుకునేవారట. ఎప్పుడైనా ఎవరైనా తాకినా, లేదా తాకారని అనుమానం వచ్చినా ఆ నీళ్లు పారబోసి మళ్ళీ వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారట. కానీ బామ్మ మాత్రం తానూ ఏనాడూ చెరువుకు వెళ్లి నీళ్లు తెచ్చుకున్నట్టు చెప్పలేదు. మరి ఇంకెవరైనా తెచ్చి పోసేవారేమో. ఏదైనా వస్తువు, మంచి నీళ్ళైనా సరే,  మైల పడిందని తెలిస్తే మాత్రం పారబోయ్యాల్సిందే. కానీ ఎప్పుడైనా  తప్పనిసరి పరిస్థితుల్లో అవసరార్ధం శుద్ధి కోసం దాంట్లో ఓ చల్ల చుక్క వేసి ఆ వస్తువుని మళ్లీ వాడుకునే వాళ్ళుట. మా అమ్మా వాళ్ళ తాతమ్మ రాజ్యలక్ష్మమ్మగారికి కూడా ఈ మడి, మైల చాదస్తం బాగా వుండేదిట. అందులోనూ ఆవిడ ఇంకో తరం ముందు మనిషి కదా. ఈ చాదస్తం అనే విషయం గురించి చివర్లో చెప్తాను. అసలు ఈ పదం ఎలా వచ్చిందీ వగైరా సంగతన్నమాట. అమ్మకి తాతమ్మైతే, నాకు ముత్తాతమ్మగారు. ఈవిడ తడిబట్ట కట్టుకుని, బిందె తీసుకుని చెరువుకు వెళ్లి, అక్కడ మళ్ళీ స్నానం చేసి, ఆ తడిబట్టలతోనే బిందె నిండుగా నీళ్లు నింపుకుని దారి పొడవునా యేవో శుద్ధి మంత్రాలు చదువుతూ బిందె లోని నీళ్లను కాస్త కాస్త చిలకరించుకుంటూ ఇంటికొచ్చేసరికి బిందెలో నీళ్లన్నీ అయిపోయేవిట. దాంతో మళ్ళీ తిట్టుకుంటూ చెరువుకి వెళ్లి మళ్ళీ స్నానం, బిందె నింపుకోవటం, దారిపొడవునా నీళ్లు జల్లుకుంటూ రావటం, ఇదే చర్వితచర్వణంగా సాగేదిట ఆవిడ మడి మంచినీళ్ల బాగోతం. పైగా మధ్యలో ఏ ఆకతాయి పిల్లలో ముట్టుకుంటే, వాళ్లకు రెండు తగల్నించి, ఆ మిగిలిన కాసిని నీళ్ళూ అక్కడే ఎక్కడో చెట్టు మొదట్లో దిమ్మరించి మళ్ళీ చెరువుకు మంచినీటి యాత్ర మొదలు. మా బామ్మకు కూడా చాదస్తం వుంది కానీ మరీ మా ముత్తాతమ్మలా కాదేమో. 
                                                    

                                            ఇంతకీ చాదస్తం అనే పదం ఎలా వచ్చిందంటే, ఛాందసము అనే పదం నుంచి. ఈ ఛాందసము అనే పదమే రాను రాను వాడుకలో చాదస్తం అయ్యింది. ఛాందసము అనే పదం ఛందస్సునకు సంబంధించినది. పూర్వం ఎవరైనా ఛందస్సుని పట్టుకుని పద్యంలో పద నిర్మాణం కోసం తంటాలు పడుతుంటే, 'మరీ ఛాందసము, చూచాయగా ఏదో పదం వేస్తే పోలా' అనుకునే వారట. అలా ఛందస్సు కోసం తాపత్రయ పడేవారిని ఛాందసులు, చాదస్తులు అనుకోవటంతో  మొదలయ్యి, నెమ్మదిగా పూర్వాచార పరాయణత కోసం తాపత్రయ పడేవారి గురించి కూడా ఈ పదం వాడటం అలవాటై పోయింది. అదీ చాదస్తం కథ.
                                       
                                                     ఏమిటో, నా చాదస్తం, బామ్మ పెళ్లి గురించి రాస్తూ మళ్ళీ ఆచారాల గురించీ, మడి గురించీ రాస్తున్నాను. మొత్తానికి మా బామ్మ పెళ్లి ధర్మమా అని నండూరి వారి మొఖాసా గ్రామమైన ఆరుగొలనులో, నందివాడ వారు అలా స్థిరపడిపోయారు. ఇప్పుడు ఆ వూళ్ళో నండూరు వాళ్ళూ లేరు, నందివాడ వాళ్ళూ లేరు. అసలు బ్రాహ్మణులే లేరు, ఏదో గుడి పూజారులు తప్ప. ఇంతకీ మా బామ్మ పెళ్లి అయ్యాక, కొన్నాళ్ళు బాగానే వుంది కానీ, ఆ తరువాత వాళ్ళ నాన్నగారు పోయిన కొన్నాళ్ళకి ఆవిడకి, వాళ్ళ పుట్టింటితో ఏదో మాట పట్టింపు వచ్చింది. అంతే, మళ్ళీ బామ్మ పుట్టింటికి వెళ్ళలేదు. కొన్ని విషయాల్లో బామ్మ చాలా ఖచ్చితంగా ఉండేది. మాటంటే మాటే, పంతమొస్తే, పంతమే, అది ఎవరని కూడా చూసేది కాదు. అదీ బామ్మంటే.







18, మే 2020, సోమవారం

బామ్మా - బంగారం

బామ్మా - బంగారం  

భట్టిప్రోలు విజయలక్ష్మి
                                                                     
                            

                                                        అమ్మ బంగారం షాపు నుంచి రెండు సన్నని ముత్యాల గొలుసులు తెచ్చి, నాన్నకీ, బామ్మకీ చూపించి, నాకూ భారతికీ మెడల్లో వేసింది. మా అమ్మ కళ్ళు మెరిసిపోయాయి. 'ఎంత బాగున్నాయో, గొలుసులు, నాజూగ్గా, ముత్యాలు మెరుస్తున్నాయి కూడానూ' అంది అమ్మ. మా అమ్మకి ముత్యాలంటే ఇష్టం. 'అదేమిటి బంగారం గొలుసులు చేయించలేదా,' అని బామ్మ అడిగింది. ముత్యాల్లో బంగారమేనండీ, ఇద్దరికీ కలిపి కాసులో అయిపోయింది. అదే, మొత్తం బంగారం అంటే, చెరో మూడు కాసులూ కావాల్సొచ్చేది.' అంది అమ్మ. నాన్న కూడా, "పిల్లల మెడల్లోకి గొలుసులు ఉండాలి, పెద్దమనిషైన ఆడపిల్లలు తండ్రి ఎదుట బోసిగా తిరక్కూడదు అన్నావుగా. అందుకే ఈ గొలుసులు చేయించా" అన్నాడు నాన్న. నాన్న స్తోమత అంతే మరి. యెంత ప్రిన్సిపాల్ అయినా, ఎప్పుడూ ఇల్లంతా చదువుకో, ఉద్యోగానికో వచ్చి ఏళ్ల తరబడి ఉండిపోయేవాళ్లు, వచ్చే పోయే బంధుగణం, వారాలబ్బాయిలూ, ఇవన్నీ కాక మా నాన్నకి కొత్తగా తెనాలి వచ్చాక అలవాటైన స్వామీజీల పట్ల భక్తి, స్నేహం వగైరా. ఈ విషయం ఒక్కటే ఒక్క పోస్ట్ రాయాలి. వీటన్నింటి వల్ల నాన్న దగ్గర ఎప్పుడూ అప్పే గానీ డబ్బు ఉండేది కాదు. పైగా, అప్పు ఉండటం ఏదో క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయ్యి, "పుష్పగిరి స్వాములారు కూడా చెప్పారు, 'శర్మా, నీకు చచ్చిపోయే దాకా కూడా అప్పు వుంటుందీ' అని సమర్ధించుకునేవాడు. ఈ గొలుసులు కూడా అప్పే అయుంటాయి.

                                                  బామ్మ థీరీ ప్రకారం, ఆడపిల్లలు పెద్దమనిషయ్యాక బోసి మెడతో తండ్రి ఎదట తిరక్కూడదు. అలా తిరిగితే తండ్రికి ఆయుక్షీణం. మా నాన్నేమో, 'చేయిస్తానే, బంగారం ధర కొంచెం తగ్గనీ', అనేవాడు. ఇది మా ఇంట్లో, బామ్మకి నాన్నకీ ఎప్పుడు కాస్త తీరిక దొరికినా జరిగే సంభాషణ. ఇప్పటితో పోలిస్తే, అప్పటి బంగారం ధర చాలా చాలా తక్కువ. కానీ అది కూడా ఆ రోజుల్లో నాన్నకి అందుబాటులో లేని ధర. ఇలా కొన్నేళ్లపాటు ఆ రికార్డు అరిగిపోయేదాకా తిరిగాక, అప్పటికి నా తరువాత భారతీ పెద్దమనిషయ్యింది, మొత్తానికి ఈ ముత్యాల గొలుసులు ఇంటికి చేరాయి. ఇంటికి చేరాయన్నమాటే కరెక్ట్, ఎందుకంటే, ఏదో వచ్చిన రోజు మెళ్ళో వేసినా, ఓ గంట కల్లా వాటిని తీసేసి, బీరువాలో పెట్టేసారు మరి. మళ్ళీ మేమిద్దరం యధాప్రకారం బోసిమెడతో నాన్నకీ, బామ్మకీ యెదుటపడి తిరగటం. బామ్మ చెప్పీ, చెప్పీ ఊరుకుంది. కానీ బాధపడేది. పిల్లలకి ఇంత బంగారం పెడదామంటే, కుదరటం లేదే, అని బాధపడేది. ఓ రోజు నేను, 'బామ్మా, ఏమిటి బంగారం అంత ముఖ్యమా, నీకు అసలు బంగారమే లేదు కదా,' అని అడిగితే బోల్డు కబుర్లు చెప్పింది. నిజంగానే బామ్మ ఒంటిమీద చిన్నం ఎత్తు బంగారం ఉండేది కాదు. ఈ చిన్నం ఎత్తు అంటే నాక్కాట్టే తెలియదు కానీ, బామ్మ మాత్రం ఎప్పుడూ అతి తక్కువ బంగారం కొలత చెప్పాలంటే 'చిన్నం' అనేది. అన్నట్టు నాకు కాసు, తులం కాకుండా మరో బంగారం కొలత కూడా తెలుసు. అదేమిటంటే, మాడ. మా నందివాడ వారి ఇళ్లల్లో మంగళసూత్రాన్ని మూడు మాడలెత్తు బంగారంతో చేయిస్తారు. ఈ రోజుల్లో కంసాలులని వెళ్లి అలా అడిగితే తెల్లమొహం వేస్తారేమో. మా బామ్మ వంటిమీద చిన్నం ఎత్తు బంగారం లేకపోయినా సరే, బామ్మ ఠీవీ, దర్జాలలో మాత్రం ఏ తేడా ఉండేది కాదు. విత్ ఆర్ వితౌట్ బంగారం.... బామ్మ బామ్మే. చక్కటి తెల్లటి పంచెలో మెరిసిపోయేది. ఆ ముఖంలో కాన్ఫిడెన్స్ చూసి తీరాల్సిందే. అది కదా అసలు సిసలైన వుమన్ ఎంపవర్మెంట్ అనిపిస్తుంది నాకిప్పటికీ. సరే, మన బంగారం కథకొద్దాం.

                                                             బామ్మ అడిగితే తన బంగారం వివరాలు బోల్డు చెప్పేది. అడక్కపోతే అసలు ఆ ఊసే ఎత్తేది కాదు. మంచం మీద పడుకొని 'నామస్మరణా ధన్యోపాయం, నహి పశ్యామో భవతరణే, రామ హరే, కృష్ణ హరే....' అని పాడుకుంటూ ఉండేది. నేనే తీరిగ్గా వున్నప్పుడు వెళ్లి, 'బామ్మా, నీకు బంగారం యేమేముండేది చెప్పు' అంటే, అప్పుడు చిట్టా విప్పేది. కంఠే, కాసులపేరూ, చంద్రహారం, పలకసర్లూ, కాసికాయ గుళ్ళు, వడ్డాణం, వంకీలు, నెక్లేసులు, డజన్ల గాజులు, వంకీ గాజులు, బోల్డు ఉంగరాలు, దుద్దులూ.... అంటూ ఏవో నోరు తిరగని పేర్లతో ఓ లిస్ట్ చెప్పేది. కంఠె అంటే ఏమిటి బామ్మా అంటే, అది ఒక రౌండ్ రింగ్ లాగా కంఠానికి కడియం లాగా ఉంటుంది. కంఠానికి వేసుకుంటాం కనుకే, దానిపేరు కంఠె, అని చెప్పింది. ఏమో, నేను మాత్రం పాత సినిమాల్లో తప్ప కంఠె ఎప్పుడూ ఎవరూ పెట్టుకోగా చూడలేదు. 'పెద్ద ట్రంకు పెట్టె నిండా వెండి బంగారాలు తెచ్చుకున్నా, తెలుసా', అనేది. 'మరి ఇప్పుడు అవన్నీ ఏవి బామ్మా' అంటే, ' బావుందే, డజను మంది పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా అయ్యాయి మరి' అన్నది. పొలం ఉందిగా, 'వ్యవసాయం చేసేదానివిగా' అంటే, "దాంతో ఏదో తిండీ, బట్టా నడిచేవి అంతే, పైగా ఆడ వ్యవసాయం. మీ తాతయ్యేమో, ఆయన పూజలూ, హోమాలూ, నిత్యాగ్నిహోత్రాలూ, వేదపాఠాలూ, పఠనాలూ అంటూ కూర్చునేవారు. ఇంత సంసారం..... దాంతో నాకు తప్పేది కాదు. అక్కడికీ మా ఆడబడుచు ఇంట్లో వుండి అన్నిట్లో తోడు ఉండేది కనుక ఆ మాత్రమైనా జరిగింది. అయినా మీ తాతగారి ఆచారానికి ఆవిడ వండితే పనికొచ్చేది కాదు. విధవరాలు కదా. అందుకని నేనే పిల్లలకి స్నానాలూ అవీ చేయించాక చంటి పిల్లలని పాలిచ్చి పడుకోపెట్టి, పెద్దపిల్లలకు చద్దన్నాలు పెట్టీ, తరువాత మడి కట్టుకునేదాన్ని. వంటంతా అయ్యేవరకూ పిల్లలు లేచేవాళ్ళు కాదు. అప్పటికీ మీ తాతగారి పూజ అయితే, మహానైవేద్యం పెట్టి, భోజనాలన్నీ అయ్యాక, అప్పుడు కానీ పైపనికి కుదిరేది కాదు." అంటూ పెద్ద పాఠం చదివేది.

                                                              ఇంతకీ నీ బంగారం ఏం చేసావ్ చెప్పు అంటే, "నలుగురు ఆడ పిల్లలకి పెళ్లి చేశామా, అందుకు కొంత బంగారం ఖర్చయిపోయింది. ఆ తరవాత మగపిల్లల చదువులకి కొంత బంగారం ఖర్చయిపోయింది. అందరినీ డిగ్రీ దాకా చదివించాం కదా. నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం పొలం కూడా అమ్మేసాం. సరైన రాబడి లేక, నేను చెయ్యలేక, చేసేవాళ్ళు లేక అమ్మేసా. పిల్లలు వ్యవసాయం కన్నా చదువు మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు. పోన్లే, వాళ్ళనైనా చదువుకుని బాగుపడనీ, అని పొలం చాలావరకు అమ్మేసాం. ఒక్కో చదువుకు ఒక్క బంగారువస్తువు వెళ్లిపోయేది. నా వేలి చిట్ట చివరి ఉంగరం కూడా కొత్త కాపురం పెట్టాలమ్మా అంటే, మా అబ్బాయికి ఇచ్చేసా. అదే నా చివరి వస్తువు, అంతే. తరువాత మీ నాన్న పెళ్లి అవుతూనే, ఇక లాభం లేదని, వూళ్ళో మిగిలిన పొలం కూడా అమ్మేసి అందరం బెజవాడ చేరుకున్నాం. ఆ తరువాత అంతా ఆ ఉన్న దాంతో, మీ నాన్నా, హరీ, సాంబుడూ తెచ్చిన దాంతో జరిగేది. పోన్లే, పిల్లలందరూ పైకొచ్చారు. సంతోషం" అనేది. బంగారం లేదని దిగుల్లేదా బామ్మ అంటే, దిగులెందుకే, ఏం తీసుకుపోతాం కనక, అని ఎదురు ప్రశ్న వేసేది. 'లక్షాధికారియైన లవణాన్నమే గాని బంగారు కణికలు మింగబోడు' అని వేదాంతం చెప్పేది. ఎప్పుడూ నిర్విచారంగా ఉండేది. ట్రంకు పెట్టెడు వెండి, బంగారాన్ని, పండించే పొలాన్నీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం మరో ఆలోచన లేకుండా అమ్మేయగలిగింది బామ్మ. అప్పటికి తాతగారు లేరు.

                                                               తాతగారు సంస్కృత పండితుడు. మంచి వేద పండితుడు. తన పూజా, పాఠం తప్ప మరేవీ పట్టేవి కావని బామ్మ .అంటూండేది. వాళ్ళ అప్పగారు ఆదెమ్మగారు (ఈవిడ అక్కో, చెల్లెలో ఖచ్చితంగా తెలియదు. పెద్ద పెద్దనాన్న రెండురకాలుగానూ రాశారు. ఒకచోట అప్పగారు అని రాస్తే, వంశవృక్షం లైన్లో తాతగారి తరువాత ఆవిడ పేరు రాశారు. లక్ష్మీ నరసమ్మ గారు మాత్రం ఖచ్చితంగా చెల్లెలే) ఇచ్చిన పొలం కూడా చేసుకోలేక పోయేవారు. ఏదో కోర్ట్ లావా దేవీల్లో కోర్టులో హాజరయినప్పుడు, జడ్జిగారు, 'నువ్వు పుట్టు శాస్త్రివా, పెట్టు శాస్త్రివా' అని అడిగారట. దానికి మా తాతగారు, 'నేను పుట్టు శాస్త్రి నేనండీ' అని చెప్పారట. ఈ విషయం బామ్మా, అమ్మా, నాన్నా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన ఏనాడూ ఏ యాత్రలూ చెయ్యలేదు. ఇంట్లో వైశ్వదేవం, నిత్యాగ్నిహోత్రం, వేద పారాయణం వగైరా ఉండేవి. ముగ్గురు, నలుగురు వేద విద్యార్థులకి వేదం బోధించేవారుట. మా తాతగారు పోయిన తరువాత కూడా ఈ శిష్యులు ఆయన ఆరాధనకి భోక్తలుగా వారంతట వారే వచ్చేవారు. ఆయనకి తన 62 వ ఏట సన్న్యాసం తీసుకోవాలనే కోరిక కలిగింది. అలా సన్న్యాసం తీసుకుంటే తన ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం ఏర్పడింది. కానీ దానికి బామ్మ ఒప్పుకోలేదుట, మగతోడు లేకుండా ఇంత సంసారం ఎలా అని. తాతగారు మాత్రం సన్న్యాసం కోసం చాలా పంతం పట్టారుట. అలా మూడేళ్లు గడిచాయి. ఈ లోపల ఆ కోర్ట్ కేసు ఎవరిపైనైతే గెలిచారో వారు భోక్తగా పిలిచేసరికి వారింటికే భోజనానికి వెళ్లారుట. బామ్మ యెంత వద్దన్నా వినలేదుట. ఓ మూడు రోజుల తరువాత సాంబాబాయ్, శ్రీధర్ బాబాయ్ లతో కలిసి పొలం వెళ్లి తిరిగి వస్తుంటే ఓ కాలువలో పడిపోయారుట. లేచి ఎలాగో ఇంటికి చేరారు కానీ, పక్షవాతం వచ్చి, మాటా, కాలూ పడిపోయాయిట. మరి ఇక లేవలేదు. అల్లాగే మూడేళ్లు వున్నారుట. బామ్మ ఒప్పుకోగా, చివరి రోజుల్లో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. ఆ కుటుంబంలో అందరూ కూడా తరతరాలుగా ఆతుర సన్న్యాసం తీసుకున్నవాళ్ళే. మా పెద్ద పెదనాన్న కూడా ఆ పరంపరలో ఆతుర సన్న్యాసం తీసుకున్నారు. చివరి రోజుల్లో సాంబాబాయ్ కూడా ఆతుర సన్న్యాసం తీసుకున్నాడా, ఏమో....

                                                            బామ్మ పాపం, అన్నీ తట్టుకుంది. ఆడదాన్నని అలుసు చేస్తారేమో అనే భయంతో, నోరెట్టుకుని సంసారాన్ని లాక్కు వచ్చింది. ఇన్నేళ్లయినా మా కుటుంబంలో మా అందరి మధ్యా ఇంత ప్రేమా, ఆపేక్షా వున్నాయంటే, అది ఆవిడ చలవే. పెట్టెడు బంగారం వున్నా, ఆవిడకి దానిమీద లోభం, మమత లేవు. బంగారం కన్నా చదువులకే ప్రాధాన్యత నిచ్చింది. పిల్లలకు వ్యవసాయం మీద ఆసక్తి లేదని గ్రహించి, వాళ్లకు నచ్చిన చదువులు చదివించింది. పై చదువులు, వాళ్ళే చదువుకున్నారు. తనకి స్త్రీ ధనంగా వచ్చిన పొలం మీదా అది తనదే అన్న భావన లేదు. ఒంటి నిండా బంగారం వున్నా, లేకున్నా ఒకేలా ఉండేది. అదీ ఆవిడ కారెక్టర్. తనకేమీ మిగుల్చుకోకపోతే పెద్ద వయసులో పిల్లలు చూడరేమో అన్న బెంగ ఆవిడకి ఏనాడూ లేదు. తన పెంపకం మీద అంత నమ్మకం ఆవిడకి. ఏనాడూ, పిల్లలే తన దగ్గరున్నట్టు ఫీల్ అయేది కానీ, తానూ పిల్లల దగ్గర ఉన్నట్టు ఫీల్ అయ్యేది కాదు. వంట ఇల్లు వదిలాక కాస్త ఆవిడ పెత్తనం తగ్గింది. అయినా ఏనుగు ఏనుగే అన్నట్టు, బామ్మ బామ్మే. అదే బామ్మ. అదీ బామ్మ. దట్ ఈజ్ బామ్మ. అందరూ భయంగా భక్తిగా 'వియ్యమ్మగారూ' అని గౌరవించే బామ్మ, దగ్గర వాళ్ళు ప్రేమగా, ఆప్యాయంగా 'వియ్యాం' అని పిలుచుకునే బామ్మ. ఆరుగొలనులో పొలం గట్టు మీద నుంచుని పని చేయించిన మొదటి లేడీ రైతు బామ్మ. నందివాడ విజయరామమ్మ.






3, మే 2020, ఆదివారం

బామ్మా - ఉల్లిపాయలూ

బామ్మా - ఉల్లిపాయలూ 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                         బామ్మకి ఉల్లిపాయలు పడవు. ఆచారానికి పనికిరావు అనేది. ఇవన్నీ శరీరంలో మొద్దుతనాన్ని తెస్తాయి. చురుకుగా ఉండరు అవి తింటే, అనేది. పైగా ఆ ఘాటు వాసన అంటేనే ఆవిడకి చికాకు. బామ్మ ఇంట్లో ఉంటే మా ఇంట్లోకి ఉల్లిపాయలు వచ్చేవి కాదు. చుట్టుపక్కల వాళ్ళు వండుకున్నా, ఆ వాసన పట్టేసి, చికాకు పడి తిట్టుకునేది. వీలైతే, వాళ్ళతో చనువుంటే, వెళ్లి మరీ, 'తప్పండీ, ఇలాంటి వంటలు తినకూడదు. ఇవన్నీ ఉద్రేకాన్ని పెంచుతాయి. పిల్లలు బండగా అయిపోతారని' చెప్పి వచ్చేది. 'ఎందుకు బామ్మా, నీకు ఉల్లిపాయలంటే కోపం' అని అడిగితే,' మనది నిత్యాగ్నిహోత్రం ఉండే ఇల్లు. ఇలాంటివి ఆచారానికి పనికిరావు' అనేది. 'ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లేదు కదా బామ్మా', అంటే, 'ఒకప్పుడు ఉండేది కదా, మనం భూమి కింద పండినవి తినకూడదు', అనేది. మరి బంగాళాదుంపలు, కంద, పెండలం, చేమదుంపలూ కూడా భూమి కిందే పండుతాయి కదా, అవి తింటున్నాం కదా,' అని లాజిక్ అడిగితే, 'ఆ...గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించిందనీ' అని కోప్పడేది.    

                                                            ఏది ఏమైతేనేం, మొత్తానికి బామ్మకీ ఉల్లిపాయలకీ పడదు, షష్టాష్టకం. అదీ సంగతి. తెలియందేముందీ, అందుకని ఉల్లిపాయలకి మా ఇంట్లోకి ఎంట్రీ వీసా లేదు. కాకపోతే, బామ్మ లేనప్పుడు అప్పుడప్పుడూ వాటికి విజిట్ వీసా ఇచ్చేవాళ్లు అమ్మా, నాన్న. ఉల్లికే వీసా లేకపోతే, వెల్లుల్లికి అసలు ఆ మాత్రం విజిట్ వీసా కూడా ఇచ్చే వీలు లేదు. ఎందుకో అమ్మా, నాన్నా కూడా వెల్లుల్లిని ఇష్టపడేవాళ్లు కాదు. దాంతో మాకెవ్వరికీ వెల్లుల్లి అసలు అలవాటే లేదు. ఉల్లి మాత్రం తరువాత రోజుల్లో తినడం మొదలుపెట్టాం. ఎప్పుడైనా బామ్మ లేనప్పుడు ఇంట్లో ఉల్లిపాయలతో పకోడీల్లాంటివి వండితే, ఆవిడ తిరిగి వచ్చి కనక పసిగట్టిందా, అంతే, దండకాలు, స్తోత్రాలతో  (తిట్లతో)  దీవించేది అందరినీ. ముఖ్యంగా మా అమ్మని, కోడలు కదా, కాస్త చులకన, అంతే. కానీ పెద్దయ్యాక తెలిసింది, కేవలం ఆడవారి వల్ల మాత్రమే, సంప్రదాయాలు నిలుస్తాయనీ, అవి తరువాత తరాల వాళ్లకి తెలుస్తాయనీను. సరే, అది వేరే మాట. అప్పుడు మాత్రం అందరూ ఏమీ ఎరగనట్టు తేలు కుట్టిన దొంగల్లాగా, గప్ చుప్ గా ఉండిపోయేవాళ్లు. అక్కడికీ మిగిలిన ఉల్లిపాయలు కూడా పనిమనిషికి ఇచ్చేసేవాళ్ళు. అయినా బామ్మ ఎంత దూరం నుంచైనా ఉల్లిపాయ వాసన పట్టేసేది. అచ్చం హిరణ్యకశిపుడికి హరి ధ్యాస లాగా, మా బామ్మకి ఉల్లి ధ్యాస ఉండేదేమో లోపల్లోపల. అదీసంగతి. సో, బామ్మ ఉంటే ఉల్లిపాయలు ఇంట్లోకి కాదు కదా, ఇంటి చుట్టుపక్కలకు కూడా రావడానికి వీలు లేదు. అదీ నియమం.   

                                                                        మా బామ్మకో అక్క ఉండేది. సీతమ్మ గారు, మాకు పెద్ద బామ్మ. ఆవిడా వితంతువే. ఆ బామ్మకి మాత్రం ఈ ఉల్లిపాయ పట్టింపు లేదు. పైగా ఉల్లిపాయ పకోడీలు అద్భుతంగా చేసేదట. అందరూ ఈ పెద్ద బామ్మ ఎప్పుడొస్తుందా, ఆవిడ చేత ఉల్లిపాయ పకోడీలు చేయించుకుందామా అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా ఈ పెద్ద బామ్మ వచ్చినప్పుడల్లా, తప్పనిసరిగా ఇంట్లోకి ముందు ఉల్లిపాయలు, ఆ వెనకాలే పకోడీలు వచ్చేవి. పెద్ద బామ్మ రాంగానే నెమ్మదిగా, రెండో, మూడో రోజున, మా బామ్మని ఏదో వంక మీద బయటికి పంపించేవారు. 'ఉమాన్నయ్యకి నిన్ను చూడాలని ఉందట, లేకపోతే, మధన్నయ్యకి ఆమ్మ వచ్చిందని చెప్పిరా', అని నన్నూ, బామ్మనీ రిక్షా ఎక్కించి పంపించేవాళ్ళు. నేనే ఎందుకంటే, నాకూ ఈ ఉల్లిపాయల వాసనా పడదు. తలనొప్పి వచ్చేసేది. డోకొచ్చేది. ఇంట్లో బామ్మ తరువాత యాంటీ ఉల్లిపాయ నేనే. ఒకసారి నా ఉల్లి ద్వేషం గురించి అమ్మ మా ఫామిలీ డాక్టరు, హనుమానన్నయ్యను కూడా అడిగింది. 'ఇదెందుకు, ఉల్లిపాయ చూస్తే డోక్కుంటుందీ' అని. అన్నయ్యేమో, 'మెర్క్ సాల్ వాళ్ళ లక్షణం అది, వాళ్లకి ఉల్లిపాయ వాసన గిట్టదు' అన్నాడు. అలా హనుమానన్నయ్య, మెర్క్సాల్ ధర్మమా అని నాకు ఉల్లిపాయ బలవంతంగా తినే బాధ తప్పింది. అలా మమ్మల్ని ఏదో వంకని బయటకు పంపించి,  వీళ్ళందరూ పెద్ద బామ్మతో చక్కగా ఉల్లిపాయ పకోడీలు చేయించుకుని తినేసి, మేము తిరిగొచ్చేసరికి అన్నీ శుభ్రం చేసేసేవాళ్ళు. అయినా వాసనెక్కడికి పోతుందీ? 

                                                                 బామ్మ తిరిగి రాంగానే, 'ఏమే  సీతా, నీకు బుద్ధుందటే, నన్ను బయటికి పంపించి ఇదా నువ్వు చేసే పని,' అంటూ వాళ్ళక్కని ఓ జాడింపు జాడించేసేది. పాపం ఆ అక్కగారు, 'చేయనంటే పిల్లలు బాధ పడతారు, చేస్తే నీతో గోల' అని విసుక్కునేది. మా బామ్మ మాత్రం అధార్టీగా, అక్కలేంటి, అన్నలేంటి, ఎవర్నయినా సరే, దులిపిపారేసేది. ఆవిడ నోటికి అడ్డం ఉండేది కాదు. అందరూ మూతి కాలిన పిల్లుల్లాగా, నిశ్శబ్దంగా తలో మూలా దాక్కునే వారు. మా అమ్మ దగ్గరకొచ్చి,' ఏమే లీలా, నువ్వైనా చెప్పొద్దే,' అనేది. మా అమ్మేమో మామూలుగా, 'మీ అబ్బాయే వాళ్ళ ఆమ్మను అడిగి మరీ చేయించుకున్నారండీ, నేనేం  చేయను' అనేది. కానీ ఉల్లిపాయ పకోడీలు చెయ్యటంలో మా అమ్మ కూడా వాళ్ళ పెద్దత్తగారికి, అసిస్టెంటూ, పైగా పకోడీల్లో అధికారిక వాటాదారూనూ. 'అందరూ అందరే. ఇల్లంతా నేను లేకుండా చూసి మైల మంగళం చేస్తున్నారు', అని ఆరోజు, వంటిల్లూ, కుంపట్లూ, గిన్నెలూ, మూకుళ్ళూ, గరిటలూ, కత్తిపీటలూ మూడు నాలుగు  సార్లు ఆ వాసన పోయేదాకా కడిగించేది. మా నాన్న కూడా అప్పుడు నోరెత్తితే ఒట్టు. 

                                                      ఈ సీత బామ్మకి ఓ కొడుకున్నాడు. ఆయన్ని మా నాన్నా వాళ్ళు, భీముడన్నయ్య అనేవాళ్ళు. ఆయన పూర్తి పేరు భీమభాస్కరరావు కాబోలు. నాకు బాగా గుర్తులేదు. అయినా ఆయన పేరు భీముడన్నయ్య, భీముడు పెదనాన్న, భీముడు బాబాయ్, భీముడు మామయ్య, అంతే. నేను మరీ చిన్నప్పుడు భీముడంటే, బామ్మ దగ్గర భారతం విన్న ఇన్ఫ్లుయెన్స్ తో,  భీముడు అనంగానే, ఓ భారీ కాయాన్ని ఊహించేసుకున్నా. తీరా చూస్తే, ఆయన సన్నగా ఆట్టే పొడవూ, పొట్టీ కానీ సైజులో మామూలుగా ఉండేవాడు. ఈయనా, భీముడంటే, అని మొదట్లో కాస్త ఆశాభంగంగా అనిపించేది. కానీ రాను రానూ అలవాటైపోయింది. పైగా ఈ భీముడు పెదనాన్న అచ్చం మా శర్మ పెదనాన్న లాగానే ఉండేవాడు.  కాకపోతే,  మా శర్మ పెదనాన్న తెలుపు, ఈ పెదనాన్న నలుపు, అంతే తేడా. సో, ఈ ఇద్దరినీ నేను నల్ల శర్మ పెదనాన్న, తెల్ల శర్మ పెదనాన్న అనుకునేదాన్ని చిన్నప్పుడు. మొత్తానికి ఈ పెద్ద బామ్మ ఎన్ని సార్లు వచ్చినా ఇదే సీను పదేపదే రిపీట్ అయ్యేది, ఏమాత్రం తేడా లేకుండా. ఇంకా నేను ఇంటర్మీడియేట్ కి వచ్చేసరికి ఈ భీముడు పెదనాన్నా వాళ్ల అబ్బాయి ప్రసాదన్నయ్యకి మా కాలేజీ లోనే నాన్న బాటనీ లెక్చరర్ గా జాబ్ ఇప్పించాడు. మా ఇంట్లోనే ఉండేవాడు. నాకు ఇంటర్మీడియేట్ లో క్లాస్ రూమ్ లో నాన్నేమో  స్టాటిస్టిక్స్ చెపితే, ఈ అన్నయ్యేమో బాటనీ చెప్పేవాడు. ఎంపిసి గ్రూప్ వాళ్లకు కూడా ఆ రోజుల్లో బాటనీ, జువాలజీ ఉండేవి. 

                                                          మా అమ్మ బామ్మని అనేదా, ఉల్లిపాయలు తిననియ్యటం లేదని. తనేమో అచ్చం అలాగే, పెద్దయ్యాక, వెల్లుల్లిపాయల గురించి  గొడవ చేసేది. అమ్మ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే, వాళ్ళు ప్రత్యేకంగా వెల్లుల్లి సూప్ చేసి తెచ్చేవాళ్ళు, పేషంట్ డైట్ అంటూ.  మా అమ్మేమో వికారంగా మొహం పెట్టి, అటూ ఇటూ చూసి పారబోసేది. ఎంత బతిమాలినా, దెబ్బలాడినా, భయపెట్టినా వెల్లుల్లి మాత్రం ముట్టుకునేది కాదు. ప్రతిరోజూ ఆ నర్సులు వెల్లుల్లి సూప్ తేవడం, మా అమ్మ ఎలాగో ఒకలాగా  దాన్ని పారబొయ్యటం. ఇదే తంతు, ఇలాగే సాగేది, ఎన్నిసార్లు హాస్పిటల్ కి వెళ్లినా. ఈ మాటే శ్రీదేవిపిన్నితో, మా అమ్మ చెల్లెలు,  అంటే, 'పిన్నీ మీ కందరికీ హార్ట్ హిస్టరీ ఉంది, గార్లిక్ తినాలి' అంటే, 'వద్దు బాబూ, నాకు నా హిస్టరీనే ముద్దు, వెల్లుల్లి వద్దు' అంది. మొత్తానికి బామ్మ తరం వాళ్ళు చాలామంది ఉల్లి తినకుండా ఉంటే, అమ్మ తరం వాళ్ళు వెల్లుల్లి తినకుండా ఉన్నారు. దానివల్ల, ఇంట్లో అలవాటు  లేక మా తరం వాళ్లకి అవి ఎలా వండాలో,  వాడాలో చేతకాదు. నేను ఇప్పటికీ వెల్లుల్లి తినాలన్న దుగ్ధతో ఎప్పుడూ అవి కొని, ఎండపెట్టి పారేస్తూ ఉంటాను. ఎక్కడ వాడాలో తెలియదు మరి. ఏం చెయ్యనూ. ఇలా అనంగానే చాలామంది అది ఎలా వాడాలో బోల్డుసార్లు చెప్పారు. అయినా అది బుర్రలోకి ఎక్కదంతే. అలా చెప్పినప్పుడు మాత్రం వెల్లులి కారంపొడి చేసేసి ఓ సీసాలో పోసి పెడతా, ఎప్పుడు వెల్లుల్లి టేస్ట్ కావాలనిపిస్తే, అప్పుడు ఆ ఐటెం లో ఈ పొడి చల్లుకుని తినండి అనేదాన్ని. కాకపోతే, చుట్టుపక్కల బాలింతలు ఉంటే మాత్రం వాళ్ళకోసం ప్రత్యేకంగా వెల్లుల్లి  తెప్పించి ఈ వెల్లుల్లి కారంపొడి తయారు చేసి ఇవ్వటం నా అలవాటు. నాకూ మా అత్తగారు అలానే ఇచ్చింది మరి. ఉల్లిపాయలూ అంతే, అరకిలో తెప్పిస్తే, ఆరు వారాలు ఉంటాయి, తరువాత ఏమై పోతాయనా ప్రశ్న. ఏముందీ,  సింపుల్ గా పాడైపోతాయి, పారేస్తాం, అంతే. ఇదీ మా బామ్మ తరతరాలుగా తెస్తున్న యాంటీ ఉల్లీ, వెల్లుల్లీ సంప్రదాయం.  అన్నట్టు మరో విషయం మా వారి క్కూడా చిన్నప్పుడు నాలానే, ఉల్లిపాయ ఇష్టం ఉండేది కాదట. పెద్దయ్యాక హోటల్ భోజన పర్వంలో తప్పనిసరి అయి తినడం మొదలుపెట్టారుట.  సో, ఇద్దరం సేమ్ బాచ్. మరోసారి మరో కాన్సెప్ట్ తో కలుద్దాం. బై.