18, ఆగస్టు 2015, మంగళవారం

సంబల్ పూర్ ప్రస్థానం

సంబల్ పూర్ ప్రస్థానం


భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                               నాన్న సంబల్ పూర్ సెంట్రల్ స్కూల్లో ప్రిన్సిపల్ గా ఆరేళ్ళు పని చేశాడు. ఆ ఆరేళ్ళు అందరికీ అన్నీ లెర్నింగే. రోజువారీ భాషగా హిందీ మాట్లాడటం, ఒరియా కూడా మాట్లాడగలగటం, ఎండలే తప్ప చలి అంతగా తెలియని మేము అక్కడ వచ్చే విపరీతమైన చలిని తట్టుకోటం ఎలాగో, ఎండాకాలంలో వచ్చే మంటలు పుట్టే వేడినుంచి కాపాడుకోవటం, వానాకాలంలో వచ్చే అప్పటివరకూ మేమేరుగని పిచ్చిపిచ్చి గాలులు, వాటిని టైఫూన్లు అంటారట, వాటిల్నుంచి జాగ్రత్తగా వుండటం, అన్నీ నేర్చుకున్నాం. ఎండాకాలంలో పొద్దున్నే ఆరింటికల్లా బాగా ఎండ వచ్చేసేది. వానాకాలంలో మబ్బులు తమాషాగా ఉండేవి. మా ఇంటి వెనకాలే బూఢారాజా కొండ వుండేది, అది చాలా పెద్ద కొండ. మబ్బులు ఆ కొండకి మధ్యలో కనపడేవి. ఆ సీన్ భలే వుండేది. పైన కొండ, కింద కొండ, మధ్యలో మబ్బు. వివరంగా చెప్పాలంటే  పైన ఆకాశం, ఆ కింద కొండ, ఇంకా కింద మబ్బులు, వాటి కింద జోరున వాన. అలా ఆకాశం, పొడిగా వుండే కొండ, మబ్బు, వాన, తడిసిన కొండ ఒకేసారి చూడ్డం తమాషాగా, వింతగా వుండేది.  అక్కడ పాములు చాలా స్వేచ్చగా తిరిగేవి. ఉడుములు కూడా తిరిగేవి. ఒకసారి కొండచిలువ కూడా వచ్చింది. ఎదురుగుండా వున్న పొలం పక్కనే స్మశానం వుండేది. అప్పుడప్పుడు శవాలు కూడా కాల్చేవాళ్ళు. అన్నీ చూసేవాళ్ళం. ఇంటి ముందు ఒక చిన్నకొండ, వెనక ఒక పెద్దకొండ ఉండేవి. ప్రపంచంలోనే నదిమీద కట్టిన పొడవైన మట్టిడ్యాంగా పేరొందిన హీరాకుడ్ డ్యాం మా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం. నీళ్ళు రిజర్వాయర్ లో సమృద్ధిగా వున్నప్పుడు, నీళ్ళు వదిలితే ఆనీటి తుంపర ఒక నీటి పొగమబ్బు లాగా మాక్వార్టర్ల నుంచే కనిపించేది. ఆడ్యాం, దాని పక్కనే వున్న పవర్ హౌస్, లోపల వుండే టన్నెల్ చాలాసార్లే చూశాం. అప్పుడప్పుడు వానాకాలంలో, బాగా వానలు పడినప్పుడు, ఆ పొలాల్లో పడ్డ వాననీళ్ళల్లో అక్కడి స్థానికులైన  ముండా జాతివాళ్ళు ఉసుళ్ళు అనే పురుగుల్ని పట్టుకునే వాళ్ళు. అవి తింటారట, 'యాక్' అనుకునేవాళ్ళం. 

                                                  మొదట్లో ఈ ముండా వాళ్ళేమిటి, ఇదేం పేరు అని నవ్వుకునేవాళ్ళం. మనకేమో 'ముండా' అంటే తిట్టు పదం. ఈ ముండా జాతిలోని బిర్సా ముండా అనే వీరుడు, మన అల్లూరి సీతారామరాజు లాగా ఇంగ్లీషు వాళ్ళతో స్వాతంత్య్రం కోసం చాలా పోరాటం చేసి చనిపోయాడని తెలిసాక, వాళ్ళంటే గౌరవం పెరిగింది. ఈ ముండాజాతి వాళ్ళు ఆడా, మగా తేడా లేకుండా రాత్రుళ్ళు అంతా తాగేవాళ్లు. తమాషా ఏంటంటే, వాళ్ళ తాగే మత్తు ద్రవం వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. యేరోజూ మిగిలిన అన్నం, వగైరా అన్నీ ఒక కుండలో పెట్టి నిండా నీళ్ళు పోసి, దానికి మూత పెట్టి, మూతి కట్టేసి వాళ్ళ దొడ్లో ఒక చోట గుర్తుగా పాతిపెట్టేవాళ్ళు. అది బాగా పులిసినాక ఆనీళ్ళు తీసుకుని తాగేవాళ్లు. ఇలా రోజూ కుండలు పాతిపెట్టటం, అన్నింట్లో ఏది పాతదో చూసుకుని తీసి తాగటం. ఇదీ వాళ్ళ నిత్య కృత్యం రాత్రిపూట. ఈరోజుల్లో చౌక సారా, నకిలీ సారా, ఇల్లాంటి గొడవలు వాళ్లకి లేవు. పైగా తాగటానికి, వాళ్ళ సంపాదన నాశనం చేసుకోనవసరం లేదు. వాళ్ళ మద్యం వాళ్ళే తయారు చేసుకోవటం వల్ల నిషాకి నిషా, ఖుషీకి ఖుషీ.  ఒక్కోసారి కొండ జాతి వాళ్ళే నాగరికుల కంటే మేలేమో. ఆడుతూ పాడుతూ సరదాగా వాళ్ళ జాతరలు చేసుకునేవాళ్ళు. 

                                                       సంబల్ పూర్ వెళ్ళాక నాన్నకి ఒక మేలు జరిగింది. విజయవాడ, తెనాలిలో ఉండేటప్పుడు ప్రతి చలికాలంలో కాలికి మేహవాతం వచ్చి చాలా బాధపడేవాడు. అప్పుడప్పుడు ఒంటికణత నొప్పి వచ్చి బాధపడేవాడు. దీన్నే మైగ్రేన్ అంటారని తరవాత తెలిసింది. ఈ బాధలన్నీ చాలావరకు సంబల్ పూర్ వెళ్ళాక తగ్గిపోయాయి. అంటే, పూర్తిగా పోలేదు కానీ వచ్చినా చాలా రోజుల తరవాత రావటం, లేదా వచ్చినా తీవ్రత తక్కువగా వుండటం, ఇలా వుండేది. నాన్న మొదటిసారి స్కూటర్ కొనుక్కుంది కూడా అక్కడే. నీలం రంగు డార్క్, లైట్, కలర్ల కాంబినేషన్ తో  వున్న లాంబ్రేట్టా అది. చివరిదాకా అదే నడిపాడు. నాన్న తరవాత బాబు దాన్ని హరి పెద్దనాన్న కొడుకు కృష్ణకి ఇచ్చాడు, నాన్న గుర్తుగా వాడుకోమని. 

                                               సంబల్ పూర్ లో నాన్న చలికాలం రాంగానే మా క్వార్టర్ల పక్కనే, అదే కాంపౌండ్ లో బాడ్మింటన్ కోర్ట్ వేయించి ఆడటానికి అందర్నీ పిలిచేవాడు. సెంట్రల్ స్కూల్ వాళ్ళు, తెలుగువాళ్ళు చాలా మంది ఆ సీజన్లో అక్కడ చేరేవాళ్ళు. చలికాలంలో వంట్లో వేడి పుట్టాలంటే అలా చెమట పట్టేలా ఆడాల్సిందే. అక్కడే వాచ్ మాన్ బహదూర్ మాకోసం అల్లం వేసి వేడివేడిగా టీ చేసి అందరికీ ఇచ్చేవాడు. భారతి అందరికన్నా బాగా ఆడేది. అమ్మకూడా బాగా ఆడేది. సింగిల్స్, డబుల్స్ అన్నీ ఆడేవాళ్ళం. టోర్నమెంట్లు కూడా పెట్టుకునే వాళ్ల్లం. బాపూజీ అంకుల్ వాళ్ళ క్లబ్, మా అయింఠపూర్  క్లబ్  పోటీలు పెడితే, నేనూ, భారతి ఒకసారి గెల్చాం. మా అందరిలో భారతే బాగా ఒరియా మాట్లాడేది. మిగిలిన అందరికీ ఏదో వర్కింగ్ నాలెడ్జే.   

                                               అప్పుడే మాకు బాపూజీగారు, నెహ్రూగారు, పంతులుగారు, కుటుంబాలతో బాగా స్నేహం అయ్యింది. బాపూజీగారు ఆ రోజుల్లోనే ఎంబీయే చేసి కాకినాడ నుంచి సంబల్ పూర్ కి వలస వచ్చారు. సంబల్ పూర్ దగ్గర మానేశ్వర్ అనే పల్లెలో చాలా పొలం కొని, వ్యవసాయం మొదలుపెట్టారు. అది హీరాకుడ్ డ్యాం కింద భూమి, బాగా పండేది. కాకినాడ నుంచి కొన్ని కుటుంబాలని కూడా తనతో తీసుకువచ్చి, వాళ్ళకి పొలంలో ఇల్లు కట్టి ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయించేవారు. బాపూజీగారి భార్య శారదా ఆంటీ చక్కగా పాటలు పాడేది. వాళ్ళ  పిల్లలు మదన్, రామకృష్ణ, మురళి.  నెహ్రూ అంకుల్ గారు ఏజీ ఆఫీస్ లో పని చేసేవారు. మీనాక్షీ ఆంటీ కూడా శాస్త్రీయ సంగీతం బాగా పాడేది. వాళ్ళ పిల్లలు గరి, ఉబ్బి, బేబీ.  గరి అసలు పేరు గరిమెళ్ళ కోదండరావు, ఉబ్బి పేరు కామేశ్వరరావు, బేబీ పేరు అనురాధ. గరి, మదన్, మా వివేక్ ఒక వయసు వాళ్ళు. అంతా కలిసి కొంపల్లేచిపోయేలా అల్లరి చేసేవాళ్ళు. సందడో  సందడి, వీళ్ళంతా ఒకచోట చేరితే. పంతులుగారు ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ లో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసేవారు. విద్యావతి ఆంటీ కూడా చాలా స్నేహంగా వుండేవారు. వాళ్లకి నలుగురు పిల్లలు. కానీ అందరూ మాకన్నా చాలా చిన్నవాళ్ళు.  



                                                      మా క్వార్టర్లలోనే రాంబాబు అని నాన్న స్కూల్లోనే యూడీసీ, సరోజినీ మేడం అని ఒక ప్రైమరీటీచర్ కూడా వుండేవారు. అందరం ఎంతో కలిసిమెలిసి వుండేవాళ్ళం. అన్నట్టు ఈ మధ్యనే మూడురోజుల క్రితం నేను, భారతి, పద్మ ముగ్గురం సరోజినీమేడంని కలుసుకున్నాం. పద్మ ఆవిడని ఫేస్ బుక్ ద్వారా వెతికి పట్టుకుంది. ఫేస్ బుక్ చేసిన సహాయం ఇది. పద్మ చాలా సెర్చ్ చేసి మేడం నంబర్ సంపాయించి ఆవిడకి కాల్ చేసి తిరిగి కాంటాక్ట్ ప్రారంభించింది. మేడం వాళ్ళ బంధువులింటికి కొంపల్లి వచ్చినప్పుడు కలిశాం. సుమారు 37 ఏళ్ళ తరవాత కలిశాం. దాదాపు నాలుగు గంటలు బోల్డు ఖబుర్లు చెప్పుకున్నాం. ఫోటోలు తీసుకున్నాం. చాలామందిని తలచుకున్నాం. కలుసుకోవటం ఎంత సంతోషాన్నిచ్చిందో, విడిపోతుంటే అందరికీ బాధ వేసింది. మేడం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక 
రాంబాబు పిల్లలు నిమ్మి, గుండు, మంజుల ఎప్పుడూ మాఇంట్లోనే వుండేవాళ్ళు. పట్నాయక్ అని ఒక ఎల్డీసీ, చాలా చిన్న వయసువాడు, కూడా ఆ క్వార్టర్లలోనే వుండేవారు. నాన్న మంచితనం, తెలివితేటలు, సహృదయం ఒకసారి పట్నాయక్ ప్రాణాలు కాపాడాయి. పట్నాయక్ కి సడెన్ గా గుండెలో చిల్లి వుందని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలనీ, అదీ ఒక్క రాయవెల్లూరు ఆసుపత్రిలో మాత్రమే చేస్తారనీ తెలిసింది. అప్పుడే తెలిసింది కంచిపట్టు గుడ్డముక్కతో ఆ చిల్లికి అతుకు పెట్టి ఆ ఆపరేషన్ చేస్తారని.  అది చాలా ఖరీదైన ఓపన్ హార్ట్ సర్జెరీ. పట్నాయక్ తల్లితండ్రులు అంతగా చదువులేని పల్లెటూరివాళ్ళు. వాళ్లకి ఇవేవీ తెలియవు. వాళ్ళు అతనితో వెళ్ళినా ఏమీ ప్రయోజనం వుండదు. ఆరోజుల్లో ఏ ఒక్కరి దగ్గరా అంత డబ్బూ లేదు. పట్నాయక్ కి మెడికల్ గ్రాంట్ వస్తుంది, కానీ అంత టైం లేదు. నాన్న వెంటనే దిలేశ్వర్ అనే ఒక అటెండర్ కి సెలవు ఇచ్చి పట్నాయక్ కి తోడుగా పంపించాడు. స్కూల్లో ఆ నెల అందరూ జీతం అంతా పట్నాయక్ కి ఇచ్చేలా చేశాడు. నాన్న అందరికీ 'ఒక నెల జీతం రాలేదనుకుని పట్నాయక్కి ఇచ్చేయండి, అతను తిరిగి వచ్చాక, మెడికల్ బిల్లులు అన్నీ వచ్చాక మనందరికీ తిరిగి ఇచ్చేస్తాడు'  అని చెప్తే అందరూ నాన్న అయిడియాని ఎంతో మెచ్చుకుని ఒప్పేసుకున్నారు. దాదాపు ఓ నలభైరోజుల తరవాత పట్నాయక్ ఆరోగ్యంతో తిరిగివచ్చాడు. రాయవెల్లూరులో  వున్న అన్నిరోజులూ దిలేశ్వర్ పట్నాయక్కి చక్కగా సేవ, సాయం చేశాడు. మొత్తంమీద  స్కూల్లో అందరూ కలిసి పట్నాయక్ కి పునర్జన్మ ఇచ్చారు. పట్నాయక్ తిరిగి వచ్చి నాన్నకీ, అమ్మకీ కాళ్ళకి దణ్ణం పెట్టాడు. అందరికీ ఎవరి డబ్బు వారికి ఇచ్చేశాడు. ఆ తరవాత అందరూ నాన్నని ఒక హీరోలాగా, లీడర్లాగా చూసేవారు. ఆస్కూల్లో నాన్న ఏంచెప్పినా అందరూ చక్కగా వినేవారు. ఎదురు ప్రశ్నించే వాళ్ళు కాదు.  

                                                             అక్కడ వున్నప్పుడు మా పద్మ హోమ్ సైన్స్ లో చేరి వాళ్ళ స్కూల్లో రకరకాల వంటలు చేసి టీచర్లందరికీ మొహమాటపెట్టి  మరీ అమ్మేది. అది వాళ్ళ గ్రూప్ లో సేల్స్ స్పెషలిస్ట్. యెంత స్పెషలిస్టంటే నాన్నక్కూడా అమ్మి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ సంచయికా బాంకులో వేసేది. భారతేమో క్రాఫ్ట్ తీసుకుని అందరికీ స్వెట్టర్లు అల్లేది. పెరట్లో అమ్మ బోల్డు కూరలు, పళ్ళు, పండించేది, పూల మొక్కలు కూడా చాలా వేసింది. ఇంట్లోనే మల్లెలు, గులాబులు, మరువం, చామంతులు, బంతులు, టొమాటోలు, బెండ, దొండ, ఆలూ, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ, మొక్కజొన్నలు, తోటకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, లిటిల్స్, జామకాయలు, బొప్పాయి, అరటి,  రేగు, ఇలా ఒకటని కాదు, ఎన్నో పళ్ళు, పూలు, కాయలు, కూరలు అన్నీ పండించేది. 

                                                                  ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ వుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ టీలు, స్నాక్స్, వీటితో వంటిల్లు ఎప్పుడూ, దాదాపు రాత్రి పది, పదకొండు దాకా బిజీగా వుండేది. వాళ్లకి టీలు, కాఫీలు కలపటానికి ఏరోజు ఎన్ని పాలు తీసుకోవాలో లెక్క తెలియక, ఎప్పుడూ అమూల్ పాలపొడి డబ్బాలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. రాత్రిపూట చదువుకునే వాళ్లకి (మాకే) మధ్య రాత్రిలో ఆకలేస్తుందని అమ్మ రోజూ కొన్ని చపాతీలు ఎక్కువ చేసి టేబుల్ మీద పెట్టేది. ఏరోజూ అవి మిగిలేవి కావు. చదువుకోవటంకోసం మేలుకునేవాళ్ళమో, చపాతీలు తినటానికి మేలుకునేవాళ్ళమో తెలీదు. ఆ రోజుల్లో సెంట్రల్ స్కూల్ లైబ్రరీలో వున్న పుస్తకాలన్నీ చదివేశాం. రమణ బాబాయిగారి పుస్తకాలన్నీ ఆ రోజుల్లో ఎప్పుడూ చదువుతూ వుండేవాళ్ళం. నాన్న పోస్టులో తెలుగు డైలీ పేపర్ 'ఆంధ్రజ్యోతి' తెప్పించేవాడు. అది మోహనం మామయ్యది కదా అందుకు. అది ఒక రోజు ఆలస్యంగా ఈరోజు  పేపర్ మరుసటిరోజు వచ్చేది. 'ఆజ్ కీ తాజా ఖబర్' కి బదులుగా 'కల్ కీ బాసీ ఖబర్' చదువుతూ వుండేవాళ్ళం. ఆవిధంగా అయినా మన ప్రాంతంలోని వివరాలూ, విశేషాలూ తెలుస్తూ వుండేవి. 

                                                మేము అక్కడ వున్న  రోజుల్లోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. నాన్న చాలా ఖంగారు పడ్డాడు, అందరూ ఎలా వున్నారోనని. ఫోన్ లైన్లు పనిచెయ్యలా. విజయవాడ ఉమా పెద్దనాన్నకి  టెలిగ్రాం ఇస్తే, ఆయన 'ఆల్ వెల్' అని ఇచ్చిన టెలిగ్రాం పదిరోజుల తరవాత వచ్చింది. తరువాత ఆంధ్రజ్యోతిలో ఆ వివరాలన్నీ చదివి చాలా బాధపడ్డాం. ఆ రోజుల్లోనే మన దేశంలో ఎమర్జెన్సీ విధించటం, తరవాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి, ఇందిరా గాంధీ దిగిపోయి జనతాపార్టీ గవర్నమెంట్ రావటం జరిగింది. న్యూస్ లో మొరార్జీ దేశాయ్ మాట వినిపిస్తే, నాన్న 'ఎన్నాళ్ళకి మళ్ళీ మొరార్జీ మాట వినిపిస్తోంది' అన్నాడు. నేనేమో 'మొరార్జీ ఎవరు నాన్నా, న్యూస్ రీడరా?' అన్నా. తరవాత ఆయన మన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, నాన్న నవ్వుతూ 'నీ న్యూస్ రీడర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిపోయాడే' అన్నాడు. వాజపాయి అంటే నాన్నకి ఇష్టం, ఎంతైనా వాళ్ళ జనసంఘం నాయకుడు కదా. ఆయన స్పీచ్ లు చాలా శ్రద్ధగా వినేవాడు. అసలు వాజపేయి పేరు వింటుంటేనే నాకు భలే సరదాగా వుంటుంది. ఆయన పూర్తిపేరు అటల్ బిహారీ వాజపేయి. హిందీలో అటల్ అంటే స్థిరమైన, చలించని అని అర్ధం. మళ్ళీ అదే హిందీలో బిహారీ అంటే ఎల్లప్పుడూ తిరిగేవాడు, ఒకేచోట స్థిరంగా ఉండనివాడు అని. అంటే ఆయన స్థిరంగా వుంటాడూ, వుండడూ అని ఆయన పేరులోనే వుంది. ఆపేరులో ఆయన వ్యక్తిత్వం కూడా  ప్రతిఫలిస్తుంది. ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో అంటే పట్టు పట్టాలా, పట్టు విడవాలా అని చక్కగా తెలిసిన వ్యక్తి. అంటే



 'ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ 
నొప్పింపక తానొవ్వక 
తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు సుమతీ', 

                                        ఆటైపు. అందుకే రాజకీయాల్లో బాగా రాణించాడు. ఒకవైపు మితవాదిగా కనపడుతూనే అతివాద నిర్ణయాలు కూడా చేశాడు. దటీజ్ అటల్ బిహారీ వాజపేయి. అన్నట్టు ఈయనకీ ఒక లక్ష్మణుడి లాంటి తమ్ముడున్నాడు, ఆయనే లాల్ కృష్ణ అద్వానీ. ఈ ఇద్దరూ కలిస్తే చక్కని టీం. మితవాదిలాగా కనపడే అతివాది, అతివాదిలాగా కనపడే మితవాది, ప్రతిపక్షాలని తప్పుదారి పట్టించటానికి.  

                                                  సంబల్ పూర్ లో వున్న రోజుల్లోనే నాన్న సహాయంతో ఆనందరావుగారు వాళ్ళ నువాఖైరుపల్లి అనే వూళ్ళో తెలుగు-ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ తెరిచారు. ఆ స్కూల్ కి సేతుమాధవరావు గారని, ఒక మంచి తెలుగు వ్యక్తిని దిల్లీ నుంచి తెచ్చి పెట్టారు. ఆ స్కూల్ కి ఫండ్స్ కోసం తెనాలి నుంచి ఒక డ్రామాట్రూప్ ని పిలిపించి తెలుగులో నాటకాలు కూడా వేయించాడు. అందరూ నాన్నని ఎంతో పొగిడారు. ఆ స్కూల్లో కొన్నాళ్ళు మా రాఘవ బావగారు, అనురాధక్క కూడా పని చేశారు. వీళ్ళ గురించి తరవాత నందివాడ కుటుంబం పరిచయంలో రాస్తాను. అదే రోజుల్లో నా పెళ్లి అయ్యింది. ఆవెంటనే నాన్నకి గౌహతీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది. అప్పటికే నాన్నకి ఆ వూళ్ళో ఆరేళ్ళు సర్వీస్ పూర్తి అయ్యింది. సెంట్రల్ స్కూళ్ళల్లో అన్నాళ్ళు ఒకే వూళ్ళో వుంచడం కష్టం. పాపం, నాన్నని ఆవూళ్ళో ఇంకొన్నాళ్ళు ఉంచాలని ఆత్మీయులంతా ఎంతో ప్రయత్నించినా ఆ ట్రాన్స్ ఫర్  ఆగలేదు. మా కుటుంబం సంబల్ పూర్ నుంచి గౌహతీకి బయల్దేరారు. కానీ పెళ్లి అయ్యి నేను మా వారి దగ్గరికి రాజమండ్రికి, ఎమ్మెస్సీ ఇంకా ఒక సంవత్సరం ఉండటంతో భారతిని నెహ్రూ అంకుల్ ఇంట్లోను వుంచి అమ్మా, నాన్నా, పద్మా, బాబూ, గౌహతి వెళ్ళారు. 












కళాసరస్వతి తెనాలి

కళాసరస్వతి తెనాలి

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                     తెనాలి రోజులు మా అందరికీ కూడా చాలా ప్రత్యేకం. బహుశా ఆరోజుల్ని మాలో ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోలేరు. ఎందుకంటే అవన్నీ ఒకరకంగా మాకు ఫార్మేటివ్ యియర్స్. మాకంటూ ఒక సంస్కృతీ, సంప్రదాయం, అభిరుచులు, అభిప్రాయాలూ, భావాలూ ఏర్పడటం అక్కడే జరిగింది. మొదట్లో ఒక ఇంట్లో మేడమీద చిన్నవాటాలో వుండేవాళ్ళం. ఒక నెలలోనే ఆ ఇంటికి ఎదురుగా వున్న వీధిలో ఒక పెద్ద ఇంటికి మారాం. ఆ ఇల్లు సినిమా యాక్టర్ ముదిగొండ లింగమూర్తి గారిది. ఆయన మద్రాసులోనే ఉండటంతో ఆ ఇల్లు ఖాళీగా వుండేది. పెద్ద పెరడు వున్నట్టు గుర్తు. ఆ ఇంట్లో కూడా ఎక్కువ రోజులు లేము. ఒక సంవత్సరం లోపే అది కూడా ఖాళీ చేసేసి వేదాంతం కృష్ణ ప్రసాదు గారింటికి మారాం. ఆయన పక్కనే వున్న పల్లె, కుంచవరంకి ప్రెసిడెంట్. వాళ్లకి ఈ ఇల్లు ఫార్మ్ హౌస్ లాంటిది. అప్పుడప్పుడు వాళ్ళు కుటుంబంతో సహా, ఒక్కోసారి దగ్గర బంధువులతో కూడా కుంచవరం నుంచి తెనాలి వచ్చి మూడు, నాలుగు రోజులుండి, ప్రతిరోజూ సుమారు రోజూ రెండు, మూడు సినిమాలు చూసి మళ్ళీ వాళ్ళవూరు వెళ్ళిపోయేవారు. మాకు ఇదంతా వింతగా, తమాషాగా వుండేది. కృష్ణ ప్రసాద్ గారు నాన్నకి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే ఆ చుట్టుపక్కల ఆ ఒక్క ఇంటి బోర్ వెల్ లోనే తియ్యని నీళ్ళు వచ్చేవి. కనుక నీళ్ళకి వచ్చేవారిని ఆపద్దని చెప్పారు. మేమెవ్వరం అక్కడున్నన్నాళ్ళు ఎప్పుడూ నీళ్ళకోసం వచ్చేవారిని ఆపలేదు. అది ఒక్కోసారి తలనొప్పి కూడా అయ్యేది. నీళ్ళ వంకతో దొంగలు కూడా వచ్చి మా కాగులు, బిందెలు నీళ్ళతో నింపుకుని సైలెంట్ గా వెళ్లిపోయేవాళ్ళు. తరవాత చూసుకొని కుయ్యో, మొర్రో అనుకునేవాళ్ళం. అలా చాలాసార్లే జరిగింది. ఆ ఇంటికి అన్నివేపులా బైటకు వెళ్ళటానికి తలుపులు ఉండేవి. మెయిన్ గేట్ కాక ఇంకా రెండు చిన్న గేట్లు అటూ, ఇటూ ఉండేవి. అందులో ఒకటి ఇంటి ఓనర్లకి, ఇంకోటి నీళ్ళకోసం వచ్చేవాళ్ళకి, మధ్యలోది మాకు. రాత్రిపూట అన్ని గేట్లు, తలుపులు గడియలు వేసి పడుకునే వాళ్ళం. ఏ రోజూ ఇదో పనిగా వుండేది. పైగా ఇల్లు పెద్దది కావటంతో అన్ని తలుపులూ చూసుకుని, అడ్డగడియలు వేసి, తాళాలు వేసుకుని, వచ్చేసరికి కనీసం పది నిముషాలు పట్టేది. ఆ ఇంట్లో స్నానాలగది పెరట్లో బైటకు విడిగా వుండేది. అది కూడా రోజూ తాళం వేసేవాళ్ళం. ఎందుకంటే దాంట్లోనే మా నీళ్ళ బాయిలర్, దాంట్లోకి వాడే బొగ్గులు, కట్టెలు, బక్కెట్లు, చెంబులు, సబ్బులు  అన్నీ ఉండేవి. అప్పటికి ఇంకా ప్లాస్టిక్ సామాను వాడకంలోకి రాలేదు. అన్నీ ఇత్తడి, ఇనుము, రాగి, అల్యూమినియం సామాన్లే ఉండేవి. వంటింట్లో కూడా ఎక్కువ ఇత్తడి, ఇనుము పాత్రలే ఉండేవి. స్టీలు పాత్రలు కూడా చాలా తక్కువ. ఇంకా పులుసులు చారులు కాచడానికి రాచ్చిప్పలు ఉండేవి. ఈ రోజుల్లో ఎవరికీ ఈ రాచ్చిప్పలు తెలియవు. చాలా కాలానికి అవి కోణార్క్ చూడ్డానికి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఒకటి కొన్నా.  అన్నట్టు ఆ రోజుల్లోనే మా ఇంట్లో గాస్ స్టవ్ వుండేది. నాన్నే మొదటగా మా ఇంట్లో గాస్ స్టవ్ కొన్నది.  ఆ రోజుల్లో సిలిండర్ పేలుతుందని అందరూ భయపడేవాళ్ళు. ఆరోజుల్లో సిలిండర్ ధర పదహారు రూపాయల చిల్లర. ఇప్పుడు చెప్తే ఎవరూ నమ్మరేమో. అప్పటి బిల్లు ఒకటి వుంచుకోవాల్సింది. ఆ ఇంటికి ముందు పెద్ద వరండా వుండేది. దాంట్లోనే కుర్చీలు, టేబుళ్లు వేసేవాళ్ళం. నాన్న ఇంట్లో వుంటే ఆ వరండా నిండా ఎప్పుడూ నాన్నకోసం వచ్చేవారు వుండేవారు. నాన్న ఇంట్లో లేకపోతే ఆవరండా ఖాళీగా వుండేది. మేమే చింతగింజలాట, వామనగుంటలు, పచ్చీసు, తొక్కుడుబిళ్ళ, చెమ్మచెక్క, ఒప్పులకుప్ప లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళం. 
  
నాన్నకేమో పెద్ద ఇల్లు అలవాటు. కానీ అంత అద్దె ఒక్కడే పెట్టలేక ఎప్పుడూ ఆ ఇంట్లో ఓ రెండు, మూడు గదులు సబ్ లెట్ చేసేవాడు. అందువల్ల మాకు ఎప్పుడూ పక్కన ఎవరో ఒకరు తోడు వుండేవారు. మాఇంటి ఎదురుగుండా వుండే ఇల్లు మాస్కూల్లోనే టీచర్ గా పనిచేసే స్వామిశాస్త్రి గారిది. వాళ్ళకి వల్లి ఒక్కత్తే కూతురు. వల్లి మాఇంట్లో ఇంకో పిల్లలాగానే వుండేది. అది మాకు చదువుకోడానికి బుక్స్ తెచ్చిపెడుతూ వుండేది. ఆ రోజుల్లో తెనాల్లో చాలా మూఢఆచారాలు పాటించేవారు. పెద్దమనిషి కాకముందే ఆడపిల్లలకి పెళ్లి చేయాలని దానికి ఏడో క్లాస్ చదువుతున్నపుడే పెళ్లి చేసేశారు. అదీ అయిదు రోజుల పెళ్లి. పెళ్లి తరవాత అది దాదాపు స్కూల్ మానేసినట్లే. ఇష్టం వుంటే వచ్చేది, లేకపోతే లేదు. పెళ్లి అవటంతో ఎప్పుడూ చాలా నగలు పెట్టుకుని తిరుగుతూ వుండేది. దానికి సినిమాలంటే చాలా ఇష్టం, కానీ దాన్ని, వాళ్ళ అత్తవారు తప్పు పడతారని, ఒంటరిగా సినిమాలకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఒకసారి అది వాళ్ళ పిన్ని కొడుకుని తీసుకుని సినిమాకి వెళ్ళింది. దానికి పదకొండు ఏళ్ళు, ఆ తమ్ముడుకి ఆరేళ్ళు. హాల్లో ఎవరో ఆడ వేషంలో వచ్చి దీని పక్కనే కూర్చుని దేవుడి ప్రసాదం అని ఏదో తినిపించి టాయిలెట్ కి తీసుకెళ్ళి ఆ వున్న నాలుగు నగలూ దోచేసుకుని పారిపోయారు. ఆ సంఘటనతో అందరూ చాలా భయపడిపోయారు. చాలా రోజులు అది మమ్మల్నెవరినీ గుర్తు పట్టలేదు. కానీ మాకా భయాలేవీ లేవు, ఎందుకంటే మా దగ్గర అసలు బంగారమే లేదు. మా బామ్మ అంటూ వుండేది ఎప్పుడూ, ఎదిగిన ఆడపిల్లల్ని తండ్రి బోసిమెడతో చూడకూడదని. పాపం నాన్న దగ్గర ఎప్పుడూ బంగారం కొనేటంత డబ్బు వుండేదే కాదు. ఆ తరవాత చాలా కాలానికి ఒంటి వరుస ముత్యాల గొలుసులు నాకు, భారతికి ఒకేసారి చేయించారు, మొత్తం బంగారు గొలుసైతే ఎక్కువ డబ్బులవుతాయని. 

                                                          తెనాల్లో ఎప్పుడూ యేవో పూజలూ, వ్రతాలూ, నోములూ, జపాలూ ఎవరో ఒకళ్లిళ్ళల్లో జరుగుతూనే ఉండేవి. ఎప్పుడూ ఆ స్కూల్ మేనేజ్ మెంట్ వాళ్ళు స్కూల్ గ్రౌండ్ని ఎవరో ఒక స్వామీజీకి ప్రవచనాలకి, చాతుర్మాస్య దీక్షలకు, సభలు, సమావేశాలకు యిస్తూనే వుండేవారు. దానితో నాన్నకీ ఆ స్వామీజీలతో బాగా పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లోనే నాన్న కంచి పీఠాధిపతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శృంగేరి పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి, కుర్తాళం పీఠాధిపతి వీరందరికీ పాదపూజలూ, బిక్షలూ చేసేవారు. పుష్పగిరివారు, కుర్తాళంవారు వారి పీఠాన్ని మా ఇంట్లోనే పెట్టేవారు. శృంగేరి, కంచి పీఠాలు పెద్దవి కనుక అవి స్కూల్లోనే పెట్టేవారు. వీరిలో పుష్పగిరి పీఠాధిపతి అయితే ఒకసారి సంబల్ పూర్ కూడా వచ్చారు. బిక్షలు, పాదపూజలు చేసే రోజుల్లో చాలా మందిని భోజనాలకి పిలిచి వీధిలో పందిళ్ళేసి మరీ భోజనాలు పెట్టేవారు. నాన్న ఆదాయంలో చాలా భాగం ఇలాంటివాటికి ఖర్చు అయ్యేది. కొంతమంది మాత్రం నాన్నకి జాగ్రత్త చెప్పేవాళ్ళు. ఆడపిల్లలున్నవాడివి, ఇంకా సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, ఇలాంటివాటికి ఇంతంత ఖర్చు పెట్టకూ అని. నాన్న ఒక నిజమైన బ్రాహ్మణుడు, రేపటికి దాచుకోవటం మీద ఎప్పుడూ నమ్మకం లేని మనిషి. ఒకసారి స్కూల్లో సాధుపరిషత్ వాళ్ళ జాతీయ సభలు జరిగాయి. దానికి ఎంతోమంది సాధువులు వచ్చారు. వారిలో ఒక స్వామీజీ, సచ్చిదానంద భారతి, ఒక కేరళ సన్యాసి, సభలయ్యాక కూడా మా ఇంట్లోనే చాలాకాలం వుండిపోయారు. మాకు అందరికీ చదువు బాగా రావాలని సరస్వతీ మంత్రం, నేను ప్రత్యేకంగా కోరుకున్నందున రామ మంత్రం ఉపదేశం చేశారు. మా ఇంట్లో ఒక గది ఎప్పుడూ ఇలాంటి స్వామీజీలకో, లేకపోతే మా ఇంట్లో వుండి చదువుకునే పిల్లలకో కేటాయించబడి వుండేది. ఎప్పుడూ మా ఇంట్లో ఎవరో ఒకరు వుంటూనే వుండేవారు. మేము ఆరుగురమే వుండటం నాకు ఎప్పుడూ గుర్తు లేదు.   


మా స్కూల్ వాళ్ళకే వూరి బయట ఇంకో పెద్ద ఖాళీ స్థలం వుండేది. ఆ స్థలాన్ని సర్కస్ వాళ్లకి అద్దెకిచ్చేవాళ్ళు. దాంతో ఆ సర్కస్ వాళ్ళు స్కూల్లో టీచర్లకి, ప్రిన్సిపల్ కి ఫ్రీ టికెట్లు ఇచ్చేవాళ్ళు. వచ్చిన సర్కస్ లన్నీ ముందు వరుసలో కూర్చుని చూసేవాళ్ళం. భలే సరదాగా వుండేది. తెనాలి నాటకాలకి మహా ప్రసిద్ధి. స్కూల్ వాళ్ళే, అంటే, ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు, మిగిలినవాళ్ళన్నమాట, మాస్కూల్లోనే నాటకాలు వేసేవాళ్ళు. బహుశా నాన్న తప్ప అందరూ నాటకాలు వేసేవాళ్ళేమో. అన్ని నాటకాలూ బాగా చూసేవాళ్ళం. కొన్ని పౌరాణిక నాటకాలు రాత్రి అంతా వేసేవాళ్ళు. తెల్లారిపోయేది నాటకం ముగిసేసరికి. గొప్ప గొప్ప నటులు కూడా ఇక్కడ మంచి కళాహృదయులున్నారని తెనాలి వచ్చి మరీ నాటకాలు వేసేవారు. బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రిగారని, గొప్ప నటుడు, ఆయన్ని నటి అనాలేమో, ఎందుకంటే ఆయన నాటకాల్లో ఆడవేషాలేసేవారు. సక్కుబాయి, చింతామణి, ద్రౌపది, చంద్రమతి వంటి  వేషాలకి ఆయన పెట్టింది పేరు. మా ఎదురింటి స్వామిశాస్త్రి గారింట్లో అద్దెకుండేవారు. ఆయనకు అయిదుగురు పిల్లలు. వాళ్లందరితో ఆడుకునేవాళ్ళం. ఆయన గొంతు కూడా ఒకరకం జీరతో వుండి స్త్రీ పాత్రలకి సరిపోయేది. ఎబ్బెట్టుగా, అతికించుకున్నట్టుగా వుండేది కాదు. సాంఘిక నాటకాలు చాలా తక్కువ వేసేవాళ్ళు. సినిమా యాక్టర్ నాగభూషణం వచ్చి తన రక్తకన్నీరు నాటకం కూడా ఆవూళ్ళో చాలాసార్లు వేశాడు. ఒకసారి నేను జూనియర్ కాలేజ్ లో వుండగా ఒక తెలుగు సెమినార్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. నాన్న బెజవాడలో వున్నప్పుడు ఆయన స్టూడెంట్. ఆయన మా ఇంటికే వచ్చారు. నేను ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టాను, పెద్దవాడని. అప్పుడు నిజం గానే ఆయన విలువ నాకు తెలియదు. సినిమాలు చూడ్డం తక్కువే. ఎప్పుడైనా నెలకో, రెండు నెలలకో ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం. అమ్మకి సినిమాలు చూడాలని వుండేది. నన్ను పిలిచి ఎక్కేసేది. దాంతో నేను నాన్నని గట్టిగా అడిగి సినిమాకి వెళ్ళేలా చేసేదాన్ని. బామ్మ ఎప్పుడూ మాతో సినిమాలకి, నాటకాలకి  వచ్చిన గుర్తు లేదు. 


                                                                ఆ స్కూల్లో పాట కచేరీలు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి కచేరీ కూడా జరిగింది. ఆ వూళ్ళో వున్నప్పుడు ఆవిడ కచేరీలు రెండు, మూడు సార్లు విన్నాం. డీకే పట్టమ్మాళ్, డీకే జయరామన్ గార్ల కచేరీ కూడా విన్నాం. ఒకసారి ఆలయ పూజారుల సమావేశాలయితే దానికి ముఖ్య అతిధిగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆయన పూజారి అని అప్పుడే తెలిసింది. బాలమురళి కచేరీలు విన్నట్టు గుర్తు లేదు. ఈ ఇన్ ఫ్లుయెన్స్ తో నాన్న నన్నూ, భారతినీ సంగీతం నేర్చుకోవడానికి శ్రీ ములుకుట్ల సదాశివశాస్త్రిగారి దగ్గరకు పంపించాడు. ఆయన గొప్ప కర్నాటక సంగీత విద్వాంసుడు. హరికథలు అద్భుతంగా చెప్పేవారు. ఆరోజుల్లో ఆయన మా స్కూల్లో తెలుగు పండిట్ గా పనిచేసేవారు. ఆయనకు కుదరనప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి విశ్వనాథ శాస్త్రిగారు మాకు పాఠాలు చెప్పేవారు. వీణ కూడా అదే టైం లో నేర్చుకున్నాం. గాత్రంతో పాటు ఒక వాయిద్యం కూడా వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఒక సంవత్సరం నేర్చుకునేసరికి మాకు సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, స్వరజతులు, పిళ్ళారిగీతాలు పూర్తి చేసి వర్ణాలు మొదలుపెట్టాం. మోహన రాగంలో 'నిన్ను కోరీ..' కూడా మొదలెట్టినట్టు గుర్తు. అప్పుడే నేను టెన్త్ క్లాస్ కి రావటం, దాంతో చదువు దెబ్బ తింటుందని సంగీతం మానేయటం జరిగాయి. 


సంక్రాంతి వస్తే బొమ్మలు పెట్టేవాళ్ళం. బొమ్మల కొలువుల పేరంటాలకి నేనే ఎంతమంది ఇళ్లకో నడిచివెళ్లి మరీ పిలిచేదాన్ని.  ధనుర్మాసం అన్ని రోజులూ గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ఈ ఆవుపేడ సేకరణ బాధ్యత మెయిన్ గా నామీదే వుండేది. ఈ పిడకలన్నీ రథసప్తమి రోజున పరవాన్నం వండటానికి, ఇంకా భోగిరోజున భోగిమంటలు వేయడానికి వాడేవాళ్ళం. గంగిరెద్దులూ, హరిదాసులూ, తప్పకుండా ఇంటింటికీ తిరిగేవారు. ఆ వూళ్ళో యాయవారం బ్రాహ్మణులూ యెక్కువే.  చక్కగా ధగధగా మెరిసేట్టు తోమిన ఇత్తడి చెంబు చేత్తో పట్టుకుని ఆనాటి తిధి, నక్షత్ర, వార, వర్జ్యాలని చెప్పుతూ 'సీతారామాభ్యోంనమః' అనేవాళ్ళు. ఇంట్లోంచి తప్పకుండా ఎవరో ఒకరు పిడికిలినిండానో, దోసిలినిండానో,  ఆ చెంబులో బియ్యం ముష్టి వేసేవాళ్ళం. అన్నట్టు ముష్టి అంటే అడుక్కోవటం కాదు, పిడికిలి అని అర్ధం. ఇది కాక వినోబాభావే శిష్యులు వచ్చేవాళ్ళు. వాళ్లకి తప్పకుండా బియ్యం వేయమని నాన్న ఆర్డర్. నాన్న మా ఇంట్లో బీద పిల్లలకి వారాలు ఇచ్చేవాడు. వారాలు అంటే వారంలో ఒక పూట వాళ్లకి ఆ ఇంట్లో ఉచితంగా భోజనం పెట్టటమన్నమాట. పేద పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి పల్లెల నుంచి వస్తే వాళ్లకి స్కూల్ టీచర్లందరి ఇళ్ళల్లో, ఎక్కడో అక్కడ వారాలు దొరికే ఏర్పాటు చేసేవాడు. అలా మా ఇంటికి కూడా ఎందరో వారాలకి వచ్చేవాళ్ళు. అమ్మ పోయినప్పుడు కర్మలు చేసిన బ్రాహ్మణుడు అమ్మ ఫోటో చూస్తూనే 'ఈవిడ నాకు తెలుసు, లీలమ్మ గారు, నాకు తెనాల్లో వారాలు పెట్టింది' అని చెప్పాడు. "చేసిన పుణ్యము, చెడని పదార్ధము చేరును నీ వెంటా." దీపావళికి బుట్టలతో టపాకాయలు కొని కాల్చేవాళ్ళం. మతాబులు, చిచ్చుబుడ్లు మేమే తయారు చేసుకునే వాళ్ళం. సుమారు వారం, పదిరోజులపాటు టపాకాయలు కాల్చేవాళ్ళం. నాగుల చవితికి తప్పకుండా శివాలయంలో వున్న పెద్ద పుట్టలో పాలు పోసేవాళ్ళం. మా అమ్మ ఆరోజు ఉపవాసం వుండేది. పేరంటాలు శ్రావణ మాసంలో కూడా బోల్డు జరిగేవి. మంగళవారాలూ, వరలక్ష్మీ వ్రతాలూ అంటూ. వూళ్ళో అందరూ ఎప్పుడూ ఏదో ఒక హడావుడిలోనే వుండేవారు.  హోలీ పండుగకి ఒక్క పద్మసాలీలే రంగులు జల్లుకునేవాళ్ళు. అది ఆ వూళ్ళో కేవలం వాళ్ళ పండుగ, అంతే. వినాయక చవితికి నాన్న ఎన్నోరకాల పళ్ళు తెచ్చేవాడు. కొన్నిరకాల పళ్ళు అయితే కేవలం ఆ రోజుల్లోనే వచ్చేవి. వాటిల్లో పంపరపనస ఒకటి. వినాయకచవితి, దీపావళి, సంక్రాంతి మా పిల్లలందరికి నచ్చే పండుగలు. తెనాల్లో శ్రీరామనవమి పండుగ చాలా బాగా చేసేవాళ్ళు. వూరు మధ్యలో ఒక చిట్టాంజనేయస్వామి గుడి వుండేది. మామూలు రోజుల్లో చాలా సాదా సీదాగా, నిశ్శబ్దంగా వుండే ఆ గుడి శ్రీరామ నవమి రోజుల్లో, అంటే వసంత నవరాత్రుళ్ళలో, కోలాహలంగా వుండేది. ఊరంతా చలవ పందిళ్ళు, అంటే తాటాకు పందిళ్ళు, వేసేవాళ్ళు. అక్కడ శ్రీ రామనవమి రోజున వైభోగంగా సీతారామ కల్యాణం చేసేవాళ్ళు. అప్పుడు అక్కడ రకరకాల చిన్న చిన్న దుకాణాలు వెలిసేవి. ఆ దుకాణాల్లో పిల్లలందరం తప్పకుండా ఏదో ఒకటి కొనుక్కునే వాళ్ళం. కప్పలు అని టక్ టక్ మని శబ్దం చేసే ఇనప క్లిప్పు ఒకటి అమ్మేవాళ్ళు. అది తెచ్చి టక్ టక్ మని ఇల్లంతా హోరేత్తించేవాళ్ళం. ఆరోజుల్లో, ఆ వూళ్ళో ఎన్ని సరదాలో. మా బాల్యం మా పిల్లలకి లేదు. మా అమ్మా ఇలానే  అనేది. మా బాల్యం మీకు లేదు అని. తరాలు మారిపోతున్నాయి. అభిరుచులు, ఆటలు, పాటలు, ముచ్చట్లు, సరదాలు, సంబరాలు అన్నీ మారిపోతున్నాయి. పండుగలు కూడా మారిపోతున్నాయి. కొత్తరకం పండుగలకి ఎక్కువ ప్రచారం జరుగుతోంది.  



                                            వివేక్ స్కూల్లో చేరే వయసు వచ్చేసరికి నాన్నా, కృష్ణప్రసాదుగారూ మరికొందరూ కలిసి కంచి స్వామి వారి ఆశీస్సులతో 'వివేకానంద విద్యామందిర్' అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. కృష్ణప్రసాదుగారి అబ్బాయి, శరత్, కూడా మా బాబు వయసు వాడే. శరత్ చదువుకోసం వాళ్ళంతా తెనాలి వచ్చేశారు. ఆ వివేకానంద విద్యామందిర్ లో మొదటి స్టూడెంట్ మా వివేకానందే. 


                                     మేము అక్కడున్న రోజుల్లోనే సెపరేట్ స్టేట్ కావాలని ఆందోళన మొదలయ్యింది. మేమంతా కూడా రాష్ట్రం రెండుగా విడిపోవాల్సిందే అంటూ చాలా రోజులు స్ట్రైక్ చేశాం. నా ఇంటర్ పరీక్షలు మార్చ్ లో జరగాల్సినవి సెప్టెంబర్ లో జరిగాయి. అసలు ఆ సంవత్సరం పోతుందని భయపడ్డాం. చాలా రోజులు ఈ స్ట్రైక్ వాళ్ళ స్కూల్ వుండేది కాదు. అప్పుడు నేను, అమ్మ, కృష్ణప్రసాదుగారి భార్య జయమ్మ గారు ప్రైవేటుగా హిందీ రాష్ట్ర భాష పరీక్షలు రాసి పాస్ అయ్యాం.  


                                              తెనాల్లో వున్న రోజుల్లో సెలవల్లో ఎవరో ఒకళ్ళు బంధువులు వచ్చేవాళ్ళు. ఒక్కసారి రెండు మూడు కుటుంబాల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అత్తయ్యలో, పిన్నులో, పిల్లలతో వచ్చేవాళ్ళు. ఇంక ఇల్లంతా గోల గోల. టాప్ లేపేసేవాళ్ళం. ఖబుర్లు, ఆటలు, పాటలు, పిండి వంటలు, ఎన్ని సరదాలో. ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు భోజనానికి వస్తారంటే కొందరు భయపడుతున్నారు, కొందరేమో ఒకరోజు చేసి సంవత్సరమంతా చెప్పుకుంటున్నారు. మరి కొంతమందేమో, మా సువర్చల అత్తయ్యలాంటి వాళ్ళు, అలవోకగా అరడజను పదార్ధాలు క్షణాల్లో చేసిపెట్టేస్తున్నారు. రోజులు మారాయ్, బాగా మారాయ్, ఎంతో మారిపోయాయ్. వచ్చిన బంధువులకి అమ్మ బట్టలు కూడా పెట్టేది. మేమేక్కడికైనా వెళ్ళడం చాలా తక్కువ. ఎవరైనా మా ఇంటికి రావడమే ఎక్కువ.  కానీ ప్రతి సంవత్సరం మా తాతగారి తద్దినం, ఆరాధన వచ్చినప్పుడు మాత్రం అందరం విజయవాడ ఉమా పెద్దనాన్నగారింటికి వెళ్ళేవాళ్ళం. మేమే కాదు, అప్పుడు అందరూ అక్కడికి వచ్చేవారు. పెద్దవాళ్ళకేమో కానీ, మాపిల్లలకు మాత్రం అది కూడా మరో పండుగ లాగానే వుండేది. యెంత ఎదిగినా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మరిచిపోలేం. కానీ తమాషా ఏంటంటే అవి తల్చుకోవటానికి ఎవరికీ తీరికా లేదు. బహుశా ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో   'చైల్డ్ హుడ్ డే'  అని ఒకరోజు ప్రకటిస్తే అప్పుడు అందరం ఆ రోజు సెలెబ్రేట్ చేసుకుంటామేమో.  

13, ఆగస్టు 2015, గురువారం

మా నాన్న ఉద్యోగాలూ, ఊళ్ళు తిరగటాలూ

మా నాన్న ఉద్యోగాలూ, ఊళ్ళు తిరగటాలూ 

 భట్టిప్రోలు విజయలక్ష్మి

                                           మానాన్న తన కెరీర్ లో చాలా ఉద్యోగాలు మారాడు. ప్రతిసారీ పైమెట్టుకే  ఎక్కాడు. దానితో చాలా ఊళ్ళు తిరిగాం. ఈ ఉద్యోగపర్వంలో మొదటిమజిలీ కానుమోలో, ఆరుగొలనో అయితే చివరిమజిలీ హైదరాబాదు. కానుమోలు ఉద్యోగానికి రోజూ సైకిల్ మీద వెళ్లి వచ్చేవాట్ట. టీచర్ గా పనిచేస్తూ కూడా నిక్కర్లు వేసుకుని తిరిగేవాట్ట. కొన్నాళ్ళు శ్రీదేవి పిన్నికీ, రోహిణీ పిన్నికీ కూడా స్కూళ్ళల్లో పాఠాలు చెప్పినట్టు గుర్తు. బీయే, బీయీడీ అయ్యాక, పెళ్లి అయ్యాక, బెజవాడ మునిసిపాలిటీలో గాంధీ మునిసిపల్ హైస్కూల్ లో లెక్కల టీచర్ గా వుద్యోగంలో చేరాడు. అదేస్కూల్లో నాన్నతోపాటు నాగేశ్వరరావుగారు, అవధానిగారూ కూడా పని చేసేవారు.  నాన్నకి కొన్నాళ్ళు ఆ స్కూల్లో చేసాక ఎందుకో ఆపని నచ్చలేదు. లీన్ తీసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, రాయగడ అనే వూర్లో మళ్ళీ మాథ్స్ టీచర్ గా చేరాడు. ఈ రాయగడ ప్రస్తుతం రాష్ట్రాల విభజనల్లో చత్తీస్ గధ్ రాష్ట్రంలోకి వచ్చింది. లీన్ లో వుంటే వుద్యోగం పోదు. కొత్తచోట నచ్చకపోతే తిరిగి పాత ఉద్యోగంలో చేరచ్చు. అదీ అందులో వెసులుబాటు. నాన్న ఆ వూళ్ళో ఒక సంవత్సరం వున్నాడు. మళ్ళీ తిరిగి బెజవాడ తిరిగివచ్చి గాంధీ మునిసిపల్ హైస్కూల్లో చేరాడు. తనకి ఆ మేనేజ్ మెంట్ తో వచ్చిన ప్రాబ్లం అప్పటికి తీరిపోయింది అనుకుంటాను. రాయగడ అనుభవం ఒక్కటి చెప్పేవాడు. అదేమిటంటే, తానూ అక్కడ పని చేస్తున్న రోజుల్లోనే అక్కడ ఎన్నికలు జరిగాయిట. నాన్నకి హిందీ బాగా రాదనీ నాన్నని వెయిటింగ్ లిస్టులో పెట్టి వేరే వాళ్ళందరికీ డ్యూటీలు వేశారుట. కానీ ఈ వైటింగ్ లిస్టుకే ఎక్కువ పని తాకిడి తగిలి అన్ని రోజులూ ఎలెక్షన్ డ్యూటీ పడిందట. అక్కడ ఉన్నప్పుడే నాన్న బాగా హిందీ నేర్చుకున్నాడు. 

                                             ఎందుకో గాంధీ మునిసిపల్ స్కూల్ ఉద్యోగంలో నాన్న అంత హాయిగా, ఇష్టంగా లేడు. కానీ నాన్న చివరిదాకా తన స్నేహితులు నాగేశ్వరరావుగారు, అవధానిగార్లని మరిచిపోలేదు, వదలలేదు. అదే సమయంలో మేము అద్దెకి ఉంటున్న ఇంటి ఓనర్ జంధ్యాల భగవచ్చాస్త్రి గారు తెనాల్లో ఆయనకీ తెలిసిన వాళ్ళ ఎయిడెడ్ స్కూల్లో హెచ్ యెమ్ పోస్ట్ వున్నదనీ, దానికి అప్లై చెయ్యమనీ చెప్పారు. నాన్న ఆ పోస్టుకి అప్లై చెయ్యటం, ఆ జాబ్ రావటం, వెంటనే దాంట్లో జాయిన్ అయిపోవటం జరిగిపోయాయి. అమ్మ చెప్పేది, అసలు విజయవాడ నుంచి కదులుతామని అనుకొలెదని. కానీ ఒక నెల రోజుల ముందర ఎవరో ఒక సోదెమ్మ వచ్చి అమ్మ యెంత వద్దన్నా లోపలి వచ్చి అమ్మకి సోది చెప్పిందిట, ఒక నెల రోజుల్లో వూరు మారి వేరే చోటికి వెళ్తారని. అమ్మ నమ్మలేదుట, అలాంటివన్నీ గాలి కబుర్లని. కానీ నెలరోజులకే నాన్న తెనాల్లో తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్లో చేరటం, కుటుంబం అంటా కొత్త వూరికి వెళ్లిపోవటం జరిగాయట. ఆ స్కూల్లో ఆ రోజుల్లో వైదీకి, నియోగి రాజకీయాలు ఉండేవి. మేము నియోగులం. ఆ స్కూల్ సెక్రటరీ వైదీకులు. అయినా అన్ని వ్యవహారాలూ సవ్యంగానే జరిగేవి. ఏ విభేదాలూ, ఇబ్బందులూ రాలేదు. సుమారు మూడువేలమంది విద్యార్దులున్న స్కూలు అది. స్టాఫే వందమంది వుండేవాళ్ళు. నాన్న తన అడ్మినిస్ట్రేటివ్ కాలిబర్ సంపూర్ణంగా ప్రదర్శించిన, ప్రకటించిన రోజులవి. కొంతమంది ఉపాధ్యాయులు సమస్యలు సృష్టిస్తే, కొంతమంది విద్యార్ధులు గూండాల్లా వుండేవారు. నాన్న ఎవ్వర్నీ లెక్క చేసేవాడు కాదు. ఎవ్వరికీ భయపడే వాడు కాదు. తన కన్నా పైవాళ్ళైనా అంతే, కింద వాళ్ళైనా అంతే. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచేవాడు. అందరికీ నాన్నంటే, భయం, భక్తీ, గౌరవం, మర్యాదా, ప్రేమా ఏర్పడ్డాయి. చివరి దాకా అవి అన్నీ నిలిచాయి. 

                                     మా తెనాలి రోజుల గురించి చాలా రాయాలి, ఎందుకంటే, మా జీవితాల్లో, చాలా ముఖ్యమైన బాల్యం అక్కడ గడిచింది. మేమందరం ఎన్నో నేర్చుకున్న, అనుభవించిన సరదాలూ, సంతోషాలూ, విచారాలూ, దుఃఖాలూ, ఎన్నో, ఎన్నెన్నో. ఆ తెనాలి ముచ్చట్ల కోసం విడిగా కొన్ని భాగాలు రాస్తాను. తెనాలి తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్ విద్యా విధానంలో మార్పుల వల్ల జూనియర్ కాలేజ్ గా మారింది. ఆ మార్పు నాన్న ఆధ్వర్యంలో జరిగింది. నాన్న ఆ స్కూలుని జూనియర్ కాలేజ్ గా మార్చటానికి చాలా శ్రమించాడు. మా చిన్నపాపాయి కూడా ఆరోజుల్లోనే పోయింది. జూనియర్ కాలేజ్ గా మారటానికి కొత్త బిల్డింగులు కట్టాల్సి వచ్చింది. కొత్త లేబరేటరీలు కావాల్సి వచ్చాయి. వాటన్నింటికీ చాలా ఫండ్స్ కావాల్సి వచ్చాయి. నాన్న, మరికొందరు వూర్లో తిరిగి చందాలు సేకరించారు. ప్రతి పైసా లెక్క గట్టి బ్యాంక్ లో వేసేవాడు, అదీ వుమ్మడి ఖాతాలో. నాన్న పేరు, స్కూల్ సెక్రటరీ పేరుతో ఆఖాతా వుండేది. నాన్న చాలా నిజాయితీగా ఉండటంతో ఆడబ్బులు తమ నిర్వహణలోనే  ఉండాలనుకునే వారికి ఇబ్బందయ్యింది.  నాన్న మాత్రం నన్ను నమ్మి చందాలిచ్చిన వారి డబ్బులు దుర్వినియోగం కాకూడదని పట్టు పట్టి, చాలా రోజులు ఎంతో నలిగిపోయాడు. చివరకు తన సంతకం తప్పనిసరి అయినప్పుడు, తప్పించుకోవటానికి ఓ నెల రోజులు సెలవు పెట్టేశాడు. దానితో ఆ వ్యక్తులందరికీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ రోజుల్లో నాన్న చాలా దిగులుగా కనిపించేవాడు. పెద్ద కూతురుగా నేనేం చేయగలను అని ఆలోచించేదాన్ని. నేనప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వున్నాను. ఆరోజుల్లో మాకు హిందూ న్యూస్ పేపర్ వచ్చేది. నేను పొద్దున్నే పేపర్ చదివేసేదాన్ని, ఎడ్వర్ టైజ్ మెంట్లతో సహా. అలా ఒక రోజు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వాళ్ళ ప్రకటన చదివాను. అది వెంటనే పరిగెత్తుకుని నాన్న దగ్గరకు వెళ్లి 'నాన్న, ఇది నీకు సరిగ్గా సరిపోతుంది. వెంటనే అప్లై చెయ్యి' అన్నా. నాన్న కూడా అప్పటికి అది చూడలేదు. పైగా వుద్యోగం మారటం, అందులోనూ ఇప్పుడు జిల్లా కాదు, ఏకంగా రాష్ట్రం మారిపోవాల్సి రావటం కాస్త ఆలోచనలో పడ్డాడు. అప్పటికే మా బామ్మ పోయింది. ఆవిడే వుంటే ఎలా ఉండేదో. ఇప్పుడు ఆవిడ బాధ్యత లేకపోవడంతో నాన్న కొంచం స్వతంత్రించి నిర్ణయం తీసుకోగలిగాడు. పైగా అది సెంట్రల్ గవర్నమెంట్ వుద్యోగం. పే స్కేళ్ళు బావుంటాయి, ఇంక్రిమెంట్లు ఆటోమేటిగ్గా పెరుగుతాయి. నాన్న అన్నీ ఆలోచించి ఎస్ అన్నాడు. అప్లై చేయటం, సెలెక్ట్ అవటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. నాన్నని ఒరిస్సా లోని సంబల్ పుర్ వేశారు. తెనాలి నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు నాన్నకి రావాల్సిన బకాయిలన్నీ, ఎమ్మీడీ ఇంక్రిమెంట్లతో కూడా శాంక్షన్ చేసి పంపించారు ఆ స్కూలు వాళ్ళు. అప్పటికి నా ఇంటర్ పరీక్షలు కాకపోవటంతో నన్ను మా ఇంటి ఓనర్ కృష్ణ ప్రసాదు గారింట్లో వుంచి మిగిలిన అందరూ మొదటిసారి రైలు ఎక్కి సంబల్ పుర్ వెళ్ళారు. ఇక్కడితో తెనాలి అధ్యాయం ముగిసి సంబల్ పుర్ అధ్యాయం మొదలైంది.  

12, ఆగస్టు 2015, బుధవారం

మా నాన్న


    మా నాన్న


భట్టిప్రోలు విజయలక్ష్మి

                              మా నాన్న నందివాడ శ్రీ రామ కృష్ణ శర్మ. వాళ్ళ అన్నదమ్ముళ్ళలో ఆరోవాడు. మేం మొత్తం ఎనమండుగురం అన్నదమ్ములం, నలుగురు అప్పచెల్లెళ్ళు అని చెప్తూ ఉండేవాడు. 'నా పేరు చాలా స్పెషల్, ఎవరైనా నా పేరు రాస్తే రెండు శ్రీ లు రాయాలనేవాడు. అంటే ముందరే వాళ్ళ నాన్న తన పేరులో శ్రీ అని పెట్టటం వల్ల, గౌరవార్ధం మరో శ్రీని చేర్చి శ్రీ శ్రీరామకృష్ణశర్మ అని రాయాలి అందరూ అనేవాడు. అన్నదమ్ములందరిలో రెండు పీజీలు చేసింది నాన్నే. మాథ్స్ లో ఎమ్మే, ఎడ్యుకేషన్  లో ఎమ్మీడీ చేసి, ఆ రోజుల్లోనే రెండు పీజీలు చేసిన ఘనత నాన్నది. పైగా ఆరోజుల్లో ఎమ్మీడీ చేసినవాళ్ళు తక్కువ వుండటంతో అటువంటి వాళ్ళందరికీ అదనంగా ఇంక్రిమెంట్లు ఇచ్చేవాళ్ళు.  చిన్నప్పుడు ఇంటర్ పరీక్ష ఫీజు కట్టమని బామ్మ డబ్బు ఇస్తే, దాన్ని సంఘానికి (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఖర్చుపెట్టి, ఇంకా ఆపైన స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్ళి వచ్చాడని బామ్మ ఎప్పుడూ అనేది. ఆరోజుల్లో పధ్నాలుగు, పదిహేనేళ్ళ నాన్న అయిదు జిల్లాలకి ప్రచారక్గా వుందేవాడుట. నాకు ఈవిషయం నాన్న ఫ్రెండ్, నారాయణరావుగారు చెప్పారు. ఆయనకీ నాన్నకి ఎంతో వయసు తేడా(పదేళ్ళు), అయినా ఇద్దరూ చాలా స్నేహంగా వుండేవారు. ఆయన విశాఖలో (ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో లైబ్రేరియన్) , నాన్న బెజవాడలో, అయినా వాళ్ళస్నేహం కాలానికీ దూరానికీ కూడా తట్టుకుని నిలిచింది. నాన్నని  ఒకసారి కలిసిన వాళ్ళెవరూ మర్చిపోలేరు. ఆయన మాటా కాదనలేరు. నాన్నకి ఆ కరిష్మా వుండేది. 

                                       సరే కథలోకి వద్దాం. జైలుకెళ్లటంతో  నాన్నకి ఆ ఏడు చదువు  పోయింది. మరుసటి సంవత్సరం ఆ పరీక్ష రాసి పాస్ అయ్యాట్ట. ఆ తరవాత కాస్త బుద్ధిగా బీయే చదివి కానుమోలు అనుకుంటా, (వూరు పేరు బాగా గుర్తు లేదు), ఆ వూళ్లోనూ, కొన్నాళ్ళు ఆరుగొలనులోనూ టీచర్ గా పనిచేశాడు. కాకాని వెంకటరత్నం గారు ఇప్పించారుట ఆ వుద్యోగం. ఆతరవాత గుంటూరులో ఏ ఎల్ కాలేజిలో బీయీడీ చేశాడు. అప్పటికి సరోజినత్తయ్యకి పెళ్లి అయి గుంటూరులో ఉందిట. ఆవిడే నాన్నకి రికార్డుల్లో బొమ్మలు వేసిపెట్టేదిట. నాన్నకి చేయించటమే (చేయించుకోవటం అనాలేమో) గానీ చేయటం తెలియదు. నాన్న అడిగితే ఎవరైనా చేసేవాళ్ళు. అత్తయ్య వేసిన, చేసిన రికార్డులు, ప్రాజెక్టులతో నాన్న బీయీడీ అయ్యింది. కాఫీ తాగాక కూడా ఆగ్లాసు ఎవరైనా అందుకునే దాకా చేతిలోనే పట్టుకుని ఉండేవాడు. నాన్న ఎమ్మే చదివే రోజుల్లోనూ అంతే, సాంబాబాయి నోట్సు రాసి పెట్టి చదువుతుంటే, తను మంచం మీద పడుకుని, కళ్ళు మూసుకుని, ఏ  జంతికలో,చేగోడీలో నముల్తూ వినేవాట్ట. బాబాయికేమో, నాన్న తననేమో  పీజీ చదివించి నాన్న బీయే,  బీయీడీ తో వుండిపోవటం బాధ అనిపించిదిట. (సాంబాబాయి కూడా ఎమ్మెస్సీ మాథ్స్, తరువాత చాలా కాలానికి మాథ్స్ లో పీ హెచ్ డీ  కూడా చేశాడు. మొత్తం కుటుంబంలో మొట్టమొదటి పీ హెచ్ డీ హోల్డర్) అందుకని ఏమైనాసరే నాన్నచేత కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాథ్స్ పీజీ చేయించాలని బాబాయి కోరిక. పాపం నానా తిప్పలూ పడి నాన్నని ఎమ్మే ఎక్జామ్ కి తయారు చేసి బెనారస్ పంపించాట్ట సాంబాబాయి. ఈ కథంతా అమ్మ, ఉమాదేవి పిన్ని చెప్పేవారు. పెళ్ళైన కొత్తల్లో తనను వదిలేసి అన్నగారితో ఈ చదివించటాలు ఏమిటో, పైగా అసలు చదవాల్సిన వ్యక్తి మంచం మీద కళ్ళు మూసుకుని జంతికలు తింటుంటే, తన భర్త నోట్సులు రాసి తనే చదివి వినిపించటమేమిటో, పాపం పిన్నికి అర్ధం అయ్యేది కాదుట. ఒకసారి పిన్ని బాబాయిని, ఏ పండుగకో అనుకుంటా, వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తే, సాయంకాలానికల్లా నాన్న 'సాంబా' అంటూ వాళ్ళింటికి వెళ్లిపోయాట్ట. పాపం వెళ్ళాక తెలివొచ్చి, పోన్లేరా, 'పండగయ్యాక రా'  అంటే, మా 'రామ భాతృ లక్ష్మణ' సాంబాబాయేమో, 'పదరా, నాకూ తోచటం లేదు. వచ్చేస్తా' అని వచ్చేశాట్ట నాన్న వెనకాలే. మరి మా ఊర్మిళ పిన్ని, అదేలే, ఉమాదేవి పిన్నికి కోపం రాదూ మరి. అదీ ఆ అన్నదమ్ముల అనుబంధం. వీళ్ళిద్దరే మరీ ఇంత విడదీయ రానట్టుగా వుండేవారు. శ్రీధర్ బాబాయినైతే  చిన్నపిల్లాడిలా చూసేవాళ్ళుట. సాంబాబాయి ఇంత కష్టపడి నాన్నని ఎమ్మే ఎక్జామ్ కి బెనారస్ పంపిస్తే, రేపు ఎక్జామ్ అనగా ఆ ముందర్రోజు రాత్రి (ఆరోజుమహాశివరాత్రి) విశ్వనాధాలయంలో అర్ధరాత్రి అభిషేకం చేసే అవకాశం వచ్చిందని, అటు గుడికి వెళ్లిపోయాట్ట, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని. తెల్లారి, ఎక్జామ్ కెళ్లి, జంతికలు తింటూ తమ్ముడు చదువుతుంటే తాను విన్నది గుర్తు తెచ్చుకుని పరీక్ష రాస్తే, హైసెకండ్ క్లాస్ వచ్చింది.  అదీ నాన్న కేరక్టర్. కొత్తగా వచ్చిన పిన్నికి ఇదేమీ అర్ధం అయ్యేది కాదుట. ఈ కథంతా చెప్పింది ఉమాదేవి పిన్నే. అభిషేకం సంగతి మాత్రం నాన్నే చెప్పాడు స్వయంగా. 

                                         పాపం ఎమ్మీడీకి ఎవరూ సాయం చేసినట్టు లేదు. రాజమండ్రిలో హాస్టల్లో వుండి చదివాడు ఎమ్మీడీ. (చాలా యాదృచ్ఛికంగా నేనూ ఆ కాలేజ్ లోనే బీయీడీ చేశాను.) అప్పటికి భారతి పుట్టింది. ఈ కహానీలన్నీ నాకు వాళ్ళు, వీళ్ళు చెప్పితే తెలియటమే. ఎమ్మీడీ లో నాన్న చేసిన డిజర్టేషన్ చాలా ఎక్స్ ట్రాఆర్డినరీగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారట. నాన్న గైడ్, ప్రొఫెసర్ రామకృష్ణయ్యగారు, నాన్న చేసిన వర్క్ ని వాళ్ళ గురువుగారు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చూపిస్తే ఆయనా ఎంతో మెచ్చుకున్నారట. ఆ ఫోటోలు ఉండేవి ఇంట్లో, రామక్రిష్ణయ్యగారితో, రాధాకృష్ణన్ గారితో. ఆ ప్రోత్సాహంతో నాన్న ఎడ్యుకేషన్ లో పీ హెచ్ డీ చేయాలని చాలా చాలా అనుకున్నాడు. కానీ, కుటుంబ బాధ్యతలతో, చేయలేక పోయాడు. వుద్యోగం మానేస్తే గానీ రీసెర్చ్ చేయలేడు, వుద్యోగం మానేస్తే జీతం రాదు, జీతం రాకపోతే ఇల్లు జరగదు. అదో బాధ్యతల వలయం. తరువాత చాలా కాలానికి నాన్న గుర్తుగా నేను ఆ ఎడ్యుకేషన్ లోనే పీ హెచ్ డీ చేసి నాన్నకి డెడికేట్ చేశా. అదీ నాన్న చదువు ప్రస్థానం.   

7, ఆగస్టు 2015, శుక్రవారం

నండూరి లీలాకుమారి + నందివాడ శ్రీరామకృష్ణశర్మ = మేమందరం

నండూరి లీలాకుమారి + నందివాడ శ్రీరామకృష్ణశర్మ

  = మేమందరం 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                  భారతి తరవాత పద్మ, పూర్తి పేరు పద్మావతి. నాకెందుకు లక్ష్మి వచ్చేలా పేరు పెట్టలేదు అని చాలా గోల చేసేది. దీనికి మా అమ్మలా చాలా  లావు, బోల్డు పొడుగుతో జడ. చిన్నప్పుడు బోల్డు బొద్దుగా వుండేది గానీ, పెద్దయ్యాక సన్నబడి పోయింది. అయితేనేం బబ్లింగ్ ఎనర్జీతో వుండేది ఎప్పుడూ. ఇప్పుడూ అంతే అనుకోండి. మహా కన్నింగ్, ఒక్క పని చేసేది కాదు, అక్కలిద్దరున్నారుగా అని తప్పించుకు తిరిగేది. నేను భోజనాలు వడ్డిస్తే, భారతి అందరం తిన్నాక టేబుల్ శుభ్రం చేసేది. 'మరి నువ్వేం చేస్తావే పద్మా' అంటే 'తింటాగా' అనేది. భోజనం చెయ్యంగానే ఎక్కడ కంచాలు యెత్తాల్సి వస్తుందోనని 'అర్జెంట్' అని బాత్ రూంలో దూరేది. ఒకసారి నేనూ, భారతీ కూడబలుక్కుని అది బాత్ రూంలోకి వెళ్ళాక, 'అన్నీ ఎత్తి, శుభ్రం చేసేసాం, రావే' అంటే, నిజమని నమ్మి వచ్చి చూసి చచ్చినట్టు శుభ్రం చేసింది. 'అయినా అన్నీ నాకే చెప్తారు' అని పోట్లాడేది. మేం కూడా 'నీకన్నీ చెప్తున్న మాట నిజమే, కానీ నువ్వేమీ చెయ్యటం లేదు' అనే వాళ్ళం. పొద్దున్న చపాతీలు చెయ్యవే అంటే, ఆ పనిలో ఎన్ని స్టెప్పులున్నాయో లిస్టు చదివేది. అంటే, డబ్బా తియ్యాలి, పిండి తియ్యాలి, బేసిన్ తియ్యాలి, నీళ్ళు పొయ్యాలి, కలపాలి, ఉండలు చేయాలి,  వత్తాలి, పెనం పెట్టాలి, కాల్చాలి.............ఇలా ఈ స్టెప్పులు ఎప్పటికీ అయ్యేవి కావు. ఇంత రామాయణం ఎందుకే, 'చపాతీలు చెయ్యాలి అంటే చాలు' కదా అని మేం అనేవాళ్ళం. అది కూడా చిన్నప్పుడు యెంత పని తప్పించుకుందో, పెళ్ళయ్యాక దానికి అంతకి పదింతలు పని బాధ్యత పడింది. ఇప్పుడది యెంత పనికత్తో. మేం ఎవ్వరం దాని ముందు పనికి రాం. ఏం చెయ్యమన్నా క్షణాల్లో చేస్తుంది, చురుగ్గా చేస్తుంది, బాగానూ చేస్తుంది, ముగ్గులేస్తుంది, సంక్రాంతికి బొమ్మలు పెడుతుంది. మా అందరిలో ఇంకా వాళ్ళింట్లోనే కాస్త పద్ధతులూ, సంప్రదాయాలూ వున్నాయి. అది వాళ్ళ అత్తగారి ట్రైనింగు మహిమ.  పద్మా, నేనూ, రాధిక(మా సరోజినత్తయ్య కూతురు) ఒక్కసారే ఎమ్మీడీ చేశాం. తరవాత పద్మ ఎంఫిల్ కూడా చేసింది. నేను మాథ్స్, భారతి ఫిజిక్స్, తీసుకున్నాం కదా, నువ్వు కెమిస్ట్రీ తీసుకోవే M P C పూర్తి అయిపోతుంది మనింట్లోనే అంటే, 'ఛీ నాకు కెమిస్ట్రీ చిరాకు, నేను ఇంగ్లీష్ తీసుకుంటా' అని ఎమ్మే ఇంగ్లీష్ చేసింది సైఫాబాద్ పీజీ కాలేజ్ లో. మంచి ఇంగ్లీష్ రాస్తుంది, మాట్లాడుతుంది. వాళ్ళ స్కూల్ ఫంక్షన్లకి, మాగజైన్లకి ఇంగ్లీష్ లో కవితలు, నాటకాలు రాస్తుంది. మంచి సరదా మనిషి. భారతి యెంత నిదానమో, ఇది అంత సరదా మనిషి. నేను గలగలా, భారతి నెమ్మదినెమ్మదిగా, ఇది కళకళా-జలజలా. పద్మకి ఆడపిల్లలంటే ఇష్టం. మొదట నాకు ప్రమోద్ పుట్టినప్పుడు, దానికి బోల్డు ఆశాభంగం. ఆడపిల్ల అని బోల్డు పేర్ల లిస్టు తయారు చేసుక్కూర్చుంది. దానికి నా మీద కోపం కూడా వచ్చింది, మగ పిల్లాడ్ని కంటుందా అని. ఆరోజుల్లో దాన్ని 'బెట్సీ ట్రాట్ వుడ్' అని పిలిచే వాళ్ళం. డేవిడ్ కాపర్ ఫీల్డ్ లో ఆ పేరు గల ఒక పాత్ర డేవిడ్ పుట్టాడని, ఆడపిల్ల పుట్టలేదని అలిగి వెళ్ళిపోతుంది. తరవాత నాకు ప్రదీప్ పుట్టాడు. ఇంకా కోపం పెరిగి పోయింది. 'నీకే మగ పిల్లాడు పుడితే ఏం చేస్తావే, వాడి ముడ్డీ మూతీ కడిగి పెంచవా' అంటే, 'సింక్ లో పెట్టి టాప్ తిప్పి కడిగేస్తా' అనేది. ఆ తరువాత భారతికి సుధీర్ పుట్టినప్పుడు అయితే దానికి వైరాగ్యం వచ్చేసింది, ఇంకా అంతా మగ పిల్లలే పుడతారు కాబోలని. భారతీ వాళ్ళాయన, వెంకటేశ్వరరావు గారు, 'అన్నం మీరెవరైనా వడ్డించండి, అమ్మాయి పుట్టలేదని పద్మ గరిట పెట్టి ఒక్కటి నెత్తి మీద కొడుతుందేమో' అని జోకులేసేవాడు. మా ఇంట్లో నాలుగో మనవడిగా పద్మకే శ్రీకాంత్ పుట్టాక, నోరు మూసుకుని చక్కగా పెంచింది. పాపం దేవుడు కూతురు కావాలనే దాని కోరికని  'శ్రీరాజిత' రూపంలో తీర్చాడు. అప్పుడు మా అమ్మ, 'కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, దీనికి  ఆడపిల్ల దొరికింది' అన్నది. మా ఇంట్లో అందరికీ ఆడ పిల్లలున్నారు, నాకు తప్ప, అయినా నో రిగ్రెట్స్. మేమయినా డిజైన్ చేసుకు కన్నామా, ఎవరు పుడితే వాళ్ళే, అంతే.  

                                               తరవాత వాడు వివేకానందు, బాబు అని అనేవాళ్ళం, మాకు వాడు ఇప్పటికీ బాబే. వాడి పూర్తిపేరు చాలా పొడుగు. నందివాడ వెంకట సత్య శేష వివేకానంద శర్మ, వెంకట-తిరుపతి దేవుడికోసం, సత్య మా అమ్మా వాళ్ళ నాన్న పేరు, (సత్యనారాయణ లోంచి సత్య), మా ఇంట్లో నాగ దోషం వుందని శేష, వివేకానందుని సెన్టెనరీ సెలెబ్రేషన్స్ అవుతున్నాయి ఆరోజుల్లో, అదీకాక నాన్న రామకృష్ణామఠంలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు,  అందుకని వివేకానంద్.  ఆనంద్ కి ఇంకో కారణం కూడా వుంది, మా తాతయ్య (నాన్నావాళ్ళ నాన్న) పేరు ఆనంద రామయ్య, ఆయన పేరుతో మా ఇంట్లో అయిదుగురు ఆనందులు వున్నారు, సరే చివర్లో శాస్త్రానికి శర్మ. ఇదీ వాడి పేరు చరిత్ర. అన్నీ పోయి ఇంట్లో పిల్చుకోవటానికి బాబు మిగిల్తే, బైట స్కూల్లో రాయటానికి వివేకానంద్ మిగిలింది.  నేనూ, పద్మా ఆరుగొలన్లో  పుడితే, భారతీ, బాబూ బెజవాడలో పుట్టారు. ముగ్గురు ఆడపిల్లల తరవాత మగపిల్లాడని అందరూ వాడిని బాగా గారం చేసేవాళ్ళం. వాడికీ నాలాగా బాగా మొండితనం, పెంకితనం అలవాటయ్యాయి. పేచీలు పెట్టి ఏడిపించుకు తినేవాడు. ఆ పేచీలు కూడా తీర్చేలాగా ఉండేవి కావు. అర్ధరాత్రి లేచి కూర్చుని 'నాకు గారెలు కావాలీ' అని ఏడ్చేవాడు. 'సరే, రేప్పొద్దున్న చేస్తా' అనేది మా అమ్మ. 'కాదు, నాకు ఇప్పుడే కావాలీ' అని ఏడ్చేవాడు. 'ఇంత రాత్రివేళ గారెలు ఎలా వస్తాయిరా, పొద్దున్నే చేస్తానులే' అనేది అమ్మ. వినేవాడు కాదు. గట్టిగా శ్రుతి పెంచి ఏడ్చేవాడు. ఆ రోజుల్లో ఫ్రిజ్జులు లేవు కదా,  అప్పటికప్పుడు గారెలు వండటానికి.  గారెలు కావాలంటే, పప్పు నానేసి, కడిగి,  పొట్టుతీసి, రుబ్బి, గారెలు చేయాలి. అర్ధరాత్రి అవి అన్నీ ఎలా? వినేవాడు కాదు. 'పడుకోరా', అంటే, 'నేను ఏడుస్తా, నువ్వు పడుకో' అనేవాడు. చెప్పి చెప్పి మాఅమ్మ పడుకునేది. వాడు ఏడుస్తూ, లాభం లేదని, ఎప్పుడో పడుకునేవాడు. అన్నం వడ్డించేటప్పుడూ అంతే, పొరపాటున ఏదైనా ఆధరువు కొంచెం ఎక్కువ వాడి కంచంలో పడితే గోల గోల చేసేవాడు. అది తీసేయ్యమనేవాడు. తీసేసి మాకెవరికైనా వేస్తుంటే, ఎవరికీ వెయ్యటానికి వీల్లేదనేవాడు. సరేలే, నేను తరవాత తింటాలే, అంటే అదీ కుదరదనేవాడు. పోన్లే, పారెయ్, అంటే ఒప్పుకునేవాడు కాదు. మరేం చెయ్యార్లా, అంటే నాకు తెలియదనేవాడు. 'తన కంచంలో వుండకూడదు, ఎవరికీ పెట్టకూడదు, అమ్మ తినకూడదు' అని చాలా కండిషన్లు పెట్టేవాడు. చివరికి ఆ పప్పో, కూరో, పచ్చడో, గోడల మీదకి, బిందెల మీదకీ విసిరిసిరి కొట్టేవాడు. అందుకే అమ్మ వాడికి ఏమైనా వడ్డించేప్పుడు చాలా  జాగ్రత్తగా వుండేది. ఇప్పుడేమో, వాడు చాలా పెద్దమనిషి, మహా సర్దుకుపోయే తత్వం.  పిల్లల్ని, భార్యని యెంత బాగా, బాధ్యతగా చూసుకుంటాడో, యెంత పనిమంతుడో. అమెరికా వెళ్ళితే అన్ని బాధ్యతలూ తెలుస్తాయి కాబోలు. నాగపూర్ VRCE లో బీటెక్ చేశాక,  న్యూజెర్సీ NJIT లో ఎమ్మెస్ చేశాడు. అప్పట్నుంచీ న్యూజెర్సీలోనే ఉంటున్నాడు గత పాతికేళ్ళుగా. వాడికీ, నాకూ నాన్న పోలికలెక్కువని అందరూ అంటారు. చాలా రెస్పాన్సిబుల్  గా ఉంటాడు. మేమందరం అంటే చాలా ఆపేక్ష. నాన్న పోయాక అమ్మకి ఏం కావాలంటే అన్నీ చూసేవాడు. అమ్మ కోసం ఏనాడూ డబ్బు ఖర్చుకి వెనకాడలేదు. ఈ మూడు కుటుంబాల గురించీ ముందు ముందు రాస్తాను. 

                                            తరవాతది వరలక్ష్మి, చిన్న పాపాయి అనే వాళ్లం. చాలా బావుండేది. ఎంత తెల్లగా ఉండేదో, భారతి కన్నా తెల్లగా వుండేది. కళ్ళు భలే చురుగ్గా ఉండేవి. చక్కగా కబుర్లు చెప్పేది. భారతి దాన్ని మరీ ముద్దుగా చూసేది. నోట్లో అన్నం పెట్టేది.  పద్మని పెద్దపాపాయి అంటే వరలక్ష్మిని చిన్నపాపాయి అనేవాళ్ళం. అది పోయిన తరవాత కూడా  పద్మని పెద్దపాపాయి అంటే అమ్మ ఏడుస్తోందని మేమే పద్మని పెద్దపాపాయి అనటం మానేసి పద్మా అని పిలవటం మొదలుపెట్టాం. అలా పద్మ పేరు బైటకు వచ్చింది. చిన్నపాపాయికి మూడోఏట స్కూల్ పని మీద నాన్న హైదరాబాద్ వెళ్ళాడు, ఓ వారం పని ఉంటుందని. హైయ్యర్ సెకండరీ స్కూల్ ని  జూనియర్ కాలేజ్ గా మార్చేందుకు స్కూలు మేనేజ్ మెంట్ వాళ్ళతో కలిసి వెళ్ళాడు. నాన్న వెళ్ళేటప్పుడు చిన్న పాపాయి బాగానే వుంది. ఎందుకో రెండు రోజుల తరవాత దానికి జ్వరం వచ్చింది. పొద్దున్నించీ జ్వరం అయితే, అమ్మ నన్ను స్కూల్ కి వెళ్ళద్దంది. పాపం అది జ్వరానికి మాట్లాడలేకపోతుంటే, నీళ్ళు కూడా మింగలేక పోతుంటే, మాకు తెలియలేదు. అదేమిటో అర్ధం కాలేదు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఏ అనారోగ్యం వచ్చినా హోమియో మందులే. ఎల్లోపతీ ఎక్కువగా తెలియదు, ఖరీదని ఎప్పుడో చాలా అవసరం అయితే గానీ వాడేవాళ్ళం కాదు. నేను స్కూల్ కి పరిగెత్తుకెళ్ళి మా లెక్కలమాస్టారిని పిల్చుకొచ్చా. మాస్కూల్ కి  నాన్న తరవాత ఆయనే ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్.  ఆయన హోమియో డాక్టర్ కూడా.  ఆయన వచ్చిమందులేసి మధ్యాన్నం లోగా తగ్గకపోతే  ఎల్లోపతీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళమని చెప్పారు. ఆ రోజు ఎందుకో ఏ డాక్టర్లూ  లేరు. నేను వెళ్లి  వెతగ్గా వెతగ్గా, కొత్తగా అప్పుడే ఎంబీబీఎస్ పాస్  అయి వచ్చిన డాక్టర్ కొత్తా రవీంద్రబాబు అని ఒకే ఒక డాక్టర్ దొరికాడు. ఆయన అమ్మని, పాపాయినీ తీసుకు రమ్మన్నాడు. పాపాయిని చూస్తూనే, నన్ను చూసి, నువ్వు వెళ్ళిపోయి వెంటనే ఎవర్నన్నా పెద్ద వాళ్ళని పంపించమన్నాడు. అమ్మని, చిన్నపాపాయినీ ఆయన హాస్పిటల్లో వదిలేసి, నేను వెళ్లి మా పీడీ సాంబయ్య గారిని పిల్చుకొచ్చా. ఆరోజుల్లో చిన్నపనికీ, పెద్దపనికీ, ఆడపనికీ, మగపనికీ అన్నింటికీ నేనే మా ఇంటికి. అప్పుడేమిటి, ఎప్పుడూ అంతే, ఇప్పటికీ అంతేనేమో.  ఈ పీడీ గారు మాకు బెజవాడ రోజుల్నించే తెలుసు. ఒక రకంగా నాన్న బెజవాడ గాంధీ మునిసిపల్ హైస్కూల్ లో లెక్కల టీచర్ వుద్యోగం మానేసి, ఆవూరు వదిలి, తెనాలి తాలూకా హైయ్యర్ సెకండరీ స్కూల్ కి హెడ్ మాస్టర్ గా రావటానికి పీడీ గారి నాన్న, జంధ్యాల భగవచ్చాస్త్రి గారే కారణం. ఆయనే నాన్నని ప్రోత్సహించి పంపించారుట. సాంబయ్యగారు ఏదైనా అవసరం వస్తుందేమోనని డబ్బు బీరువాలోంచి తీస్తుంటే కింద పడిపోయిందిట. తరవాత చెప్పారు. చిన్నపాపాయి ముద్దుగా ఉంటుందని అందరూ దాన్ని ముచ్చటగా, ముద్దుగా చూసేవారు. ఈ కొత్త డాక్టర్ నన్ను రానివ్వలేదు, నీ వయసు వాళ్ళు రాకూడదు అని. అమ్మ నన్ను 'ఇంటికెళ్ళిపో, ఇంట్లో ఏం కావాలో చూడు. బామ్మకి సాయం చెయ్యి, నాకు సాంబయ్య గారు తోడు ఉన్నారుగా ' అని పంపించేసింది. పొద్దున్నే లేచి అమ్మకి కాఫీ, పాపాయికి పాలు ఫ్లాస్కు లో పోసుకుని నేను, భారతీ బయల్దేరాం. హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు రాత్రే గుంటూరు పెద్దహాస్పిటల్ కి  పంపించామని చెప్పారు. అంత పెద్ద జ్వరం ఏమిటో అర్ధం కాక మేము ఇంటికి వచ్చేశాం. బామ్మకూడా ఖంగారు పడింది, ఏమైందోనని. కాస్సేపట్లో ఏడుస్తూ అమ్మ కారు దిగింది, పాపాయిని గుడ్డల్లో చుట్టి పట్టుకుని. పాపాయి రాత్రే గుంటూరు అంటువ్యాధుల హాస్పిటల్లో పోయిందిట. పాపం ఆ కొత్తగా ఎంబీబీఎస్ చదువుకున్న కొత్తా రవీంద్రబాబుగారే పాపాయికి 24 గంటల జ్వరం, డిఫ్తీరియా వచ్చిందని చెప్పి, దానికి వైద్యం ఆ ఒక్క గుంటూరు అంటువ్యాధుల హాస్పిటల్లోనే వుందని చెప్పి, వెంటనే పంపించారుట. దానికి ఆపరేషన్ చేసే లోపునే అది చనిపోయిందిట. పాపం దాని చివరి క్షణాల్లో అది ఎంత బాధపడిందో అమ్మచెప్తే, అందరం ఏడిచేశాం.  ఇప్పటికీ తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. బామ్మకూడా చతికిల పడిపోయింది. ఆజబ్బు పేరే మేమెవ్వరం అంతవరకూ వినలేదు. అందరూ యెంత సాయం చేసినా అది బతకలేదు. నాన్న హైదరాబాదు నుంచి వచ్చేసరికి మధ్యాన్నం అవుతుందని, ఆ వ్యాధితో చనిపోయిన పిల్లని ఎక్కువ సేపు ఉంచితే, ఇంట్లోనే కాదు, వీధిలో పిల్లలందరికీ కూడా ఆవ్యాధి రావచ్చనీ, అది చాలా ప్రమాదకరమైన అంటువ్యాధనీ,  వెంటనే ఖననం చెయ్యమనీ డాక్టర్లు ముందే చెప్పి పంపించారుట. మా ఉమా పెద్దనాన్నే(నాన్నా వాళ్ళ అన్నయ్య) బెజవాడ నుంచి వచ్చి అన్నీ చేసేసాడు. అమ్మ గోలపెట్టి ఏడిచింది. నాన్న కారులో మధ్యాన్నం హైదరాబాదు నుంచి వచ్చాడు. అప్పటికి అంతా అయిపోయింది. ఆరోజుల్లో అది పుట్టినప్పుడు అమ్మ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది.  అందరూ అలా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటే తల్లీపిల్లల్లో ఒకరు చనిపోతారని భయపెట్టారుట. అయినా అమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుంది. బామ్మక్కూడా ఇష్టం లేదు. సరొజినత్తయ్య మాత్రం అమ్మ వేపు వుండి ధైర్యం చెప్పి అమ్మ పురుటికి సాయం వచ్చి, అమ్మ ఇంటికి వచ్చేదాకా వుండి వెళ్ళింది. అది పుట్టాక అమ్మకి చాలా జబ్బు చేసింది, చచ్చిపోతుందని భయపడ్డారందరూ. కానీ మా అదృష్టం, మళ్ళీ తగ్గి లేచి తిరిగింది. ఇలా చిన్నపాపాయి పోతే అవి అన్నీ తలచుకుని ఏడిచింది. ఆ ఆపరేషన్ అయ్యాక చాలా రెస్ట్ తీసుకోవాలిట. అమ్మకి ఆ రెస్ట్ జరగలేదు. బామ్మకి మడితో వంటా, ఇంటిపనీ ఇవ్వన్నీ ఉండేవి. పనిమనిషి వున్నా, వాళ్ళని వంటఇంట్లోకి రానిచ్చేవారు కాదు. అది కడిగిన గిన్నెలన్నీ మళ్ళీ తొలిచి తీసుకోవాలి, ఇంకా మన ఎంగిలి కంచాలు అది ముట్టుకోకూడదు, ఇన్ని నియమాలుండేవి ఆరోజుల్లో, ఆ వూళ్ళో బ్రాహ్మలకి. మేమూ అవ్వన్నీ పాటించేవాళ్ళం. ఇలా ఎప్పుడూ నీళ్లల్లొ వుండేసరికి అమ్మ ఆరోగ్యం పాడయ్యింది. అప్పుడే నేనూ ఇంటిపని చేయటం మొదలయ్యింది, అప్పుడు నేను ఆరోక్లాస్ లో వున్నా. నేను ఏడో క్లాస్ కి వచ్చేసరికి బామ్మకి వంట చేసే ఓపిక పోయింది. అమ్మే వంట కూడా చేసేది. దాంతో బామ్మఇంట్లో పనిలేక ఆవూరు, ఈవూరు తిరుగుతూ వుండేది. అమ్మ బైట చేరితే, ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఆ మూడు రోజులూ వేరే కూర్చునేవాళ్ళు ఎవరినీ, ఏ వస్తువునీ తాకకుండా. నేనే బామ్మకోసం మడి కట్టుకుని మరీ వంట చేసేదాన్ని. పాపం నాన్న చాలా రోజులపాటు అల్లాంటి అవసరాలు వచ్చినప్పుడల్లా వంటమనిషిని పెట్టేవాడు. తరవాత నేనే నేర్చుకుని వంట చేసేదాన్ని.  ఈరోజుల్లో పిల్లలు పాతికేళ్ళు వచ్చినా ఇంకా చిన్న పిల్లలే, అప్పుడే వంట నేర్పాలా అన్నట్టు తల్లితండ్రులు మాట్లాడటం చూస్తున్నాం. మొత్తానికి అలా మేమెంతో ముద్దుగా చూసుకునే మా చిన్నపాపాయి మా జీవితాల్లోంచి  నిష్క్రమించింది. మేము అయిదుగురు కాస్తా నలుగురయ్యాం. అమ్మ ఆ బాధనుంచి చాలా రోజులు బైట పడలేదు. మాకోసం పాపం లేచి తిరిగేది. భారతి కూడా చాలా బెంగ పెట్టుకుంది. అమ్మ 'దాన్ని ఒక కంట కనిపెట్టుకుని వుండవే, అది ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది' అని చెప్పేది. అంత చిన్న వయసులో, నాకప్పటికి పదమూడేళ్ళు, ఇంత దగ్గరగా చావుని చూడటం నాకో అనుభవం. తరువాత మరో  మూడేళ్ళల్లో బామ్మ ప్రాణం పోతున్నప్పుడు నేనూ పట్టుకునే వున్నా.  బామ్మే కదా భయమేయలేదు. ఎందుకో చావంటే భయం అలా చిన్నప్పుడే పోయింది. మరో విషయం, నాన్న ఆతరువాత హైదరాబాదు నుంచి డిఫ్తీరియాకి టీకాలు తెప్పించి ఒక అయిదునెలలపాటు, నెలనెలా మాకే కాదు, వీధిలో పిల్లలందరికీ కూడా వేయించాడు. దటీజ్ రాంక్రిష్ణుడు.  

నండూరి లీలాకుమారి + నందివాడ శ్రీరామకృష్ణశర్మ = మేమందరం

         నండూరి లీలాకుమారి + నందివాడ శ్రీరామకృష్ణశర్మ

  = మేమందరం 

భట్టిప్రోలు విజయలక్ష్మి



                                              మా అమ్మానాన్నలకి మేము ఆరుగురు సంతానం. అందులో ఇద్దరు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అందరికంటే పెద్దవాడు ఆరో నెలలో చంటిబిడ్డ జబ్బు చేసి పోతే, అందరికన్నా చిన్నది, వరలక్ష్మి, మూడోయేట డిఫ్తీరియా వచ్చి చనిపోయింది. పెద్దవాడు మాకెవ్వరికీ అసలు తెలియదు. అమ్మ చెప్పటమే. ఆ టైం లో ఎందుకో బామ్మ వేరేవాళ్ళ ఇంటికి వెళ్ళిందిట. అమ్మకి చిన్న పిల్లాడ్ని మేనేజ్ చెయ్యటం రాక బాగా బలం పడుతుందని రోజూ పిల్లాడికి థ్రెప్టిన్ బిస్కట్లు పెట్టేదిట. వాడు వాటిని హరాయించుకోలేక పోయేవాట్ట. అమ్మ చాలా ఏడ్చిందిట వాడు పోయినప్పుడు. పోయిన ప్రాణాన్ని ఎవరు తేగలరు? ఇప్పుడు వాడే వుంటే మా అందరికీ ఒక పెద్దన్న ఉండేవాడు. వాడి పేరు నాకు గుర్తు రావటం లేదు ఇప్పుడు. అప్పుడు మా అమ్మకి 18 ఏళ్ళు. ఇది వింటే ఒక్కోసారి పిల్లల చిన్నప్పుడు, వాళ్ళ పెంపకంలో ఎవరో ఒక పెద్దవాళ్ళ సాయం అవసరం కదా అనిపిస్తుంది. కానీ ఈరోజుల్లో వుమ్మడి కుటుంబాలు లేవు కదా. ఇప్పుడు వుమ్మడి కుటుంబాలు పిల్లలకీ నచ్చటం లేదు, పెద్దలకీ నచ్చటం లేదు. వుమ్మడి కుటుంబాల వల్ల లాభాలూ, నష్టాలూ రెండూ వున్నాయ్. తెలివిగా నొప్పించక, తానొవ్వక సద్దుకు పోవటం తెలియాలి. అయినా మా అన్నయ్యకి ఆయుష్షు వుండి వుండదు, లేకపోతే అప్పటి దాకా మా తోనే వున్న బామ్మ అప్పుడే వేరేవాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఇలాంటప్పుడే విధిరాత బలీయం అనిపిస్తుంది. వాడే వుంటే, మా పుండరి అన్నయ్య (హరి పెద్దనాన్న కొడుకు) తోపాటు అదే వయసులో ఉండేవాడు. మా అమ్మకి అందుకే పుండరి అంటే చాలా ఇష్టం.  

                                                    ఆ తరవాత ఒక ఏడాదిన్నరకి నేను పుట్టానట. ఇంకా చూస్కో, నన్నెవరైనా కిందకి దించితే ఒట్టు, నాది నరవాహనం అన్నమాట. అందరికీ ముద్దే, అందరికీ దీనికేమవుతుందో అని భయమే. నన్ను ఎవరైనా కొట్టాలన్నా, ఏమన్నా కేకలెయ్యాలన్నా, అందరికీ బామ్మంటే హడల్. పైగా నాది బామ్మ పేరే. నన్నేమైనా అంటే ఇన్ డైరెక్ట్ గా ఆవిడని అన్నట్టే. ఇంక నాకు ఎదురు లేదు. దాంతో బాగా గారాబం పెరిగి మొండిగా తయారయ్యనుట. మా సరోజినీ అత్తయ్య (నాన్నా వాళ్ళ చెల్లాయి) నాకు  'నందివాడ బండ మొండి తెడ్డు' అని బిరుదిచ్చిందిట. ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, అప్పుడు వాళ్ళని యెంత ఏడిపించి ఉంటానో గదా. ముందే చెప్పా గదా, బామ్మ పేరులో విజయ, అమ్మమ్మ పేరులో లక్ష్మి, వెరసి నాపేరు విజయలక్ష్మి. ఒకసారి శ్రీధర బాబాయి నన్ను తన మెడ మీద కూర్చోపెట్టుకుని తిప్పుతూ బాలన్స్ పోయి ఆ ఎత్తు నుంచి పడేసాట్ట. అందరూ ఖంగారు పడిపోయారట. నాకేమవ్వలేదు గానీ, బామ్మ భయానికి శ్రీధర బాబాయ్ ఓ వారం రోజులు ఇంటికి రాకుండా పారిపోయాట్ట. తరవాత అందరూ 'అమ్మ తిట్టదులేరా, విజయలక్ష్మి బాగానే వుంది, ఇంటికి రా', అంటే వచ్చాట్ట. నేనేమో నాకు మాటలొచ్చేసరికి మాతోనే వున్న రామానందు, శివానందు అన్నయ్యల్లాగా, మా అమ్మా, నాన్నలని పిన్నీ, బాబాయ్ అనే పిలిచేదాన్నట.  ఇలా నా చిన్నప్పటి ముచ్చట్లు ఎన్నో, అవి అన్నీ ముందు ముందు ఇంకా రాస్తాను. ప్రస్తుతానికి మా కుటుంబం గురించి రాస్తాను. 

నా తరవాత భారతి, దాని పూర్తిపేరు భారతలక్ష్మి. దాన్ని చిన్నప్పుడు అంతా, దాదాపు దానికి పది, పన్నెండేళ్ళు వచ్చిందాకా 'భారతం' అనే పిలిచే వాళ్ళం. 'భారతం ఏమిటి రామాయణం, భారతం లాగా, నాకు నచ్చలా, భారతీ అని పిలవండి', అని ఏడిచి గోల పెట్టేది. దాంతో మాఅమ్మ నెమ్మదిగా ఆ అలవాటు మానిపించి 'భారతి' అని పిలిచేలా నేర్పింది. కానీ చాలా మంది బంధువులు దాన్ని భారతం అనే పిలిచేవాళ్ళు. మా బామ్మ అయితే చివరిదాకా దాన్ని భారతం అనే పిలిచేది. ఇది చాలా నెమ్మదిగా వుండేది. చాలాకాలం దానికి మాటలు రాలేదుట, మూగదై పోతుందని భయపడేవారుట. మా హనుమానన్నయ్య (ఈయన మా బామ్మకి మేనకోడలి కొడుకు, మాకు అన్నయ్య వరస. వయసుకి, మా నాన్న కంటే పెద్ద. మహా ధన్వంతరి. ఈయన గురించి ఒక ఎపిసోడ్ రాయాలి. చాలా గొప్ప వ్యక్తి. విజయవాడకి ఆయన ఒక ఐకాన్.) హోమియో డాక్టరు, మందులిచ్చి బాగు చేశాట్ట. ఇప్పుడు దానికి చిన్నప్పటి మాటలు, ఇప్పటి మాటలు కలిసి, అదేదో సినిమాలో శ్రీలక్ష్మి లాగా చాలా బోల్డు మాటలు వచ్చేసాయి. పైగా అది ఫిజిక్స్, అందునా ఎలక్ట్రానిక్స్ టీచరు కూడా. చిన్నప్పుడు బొద్దుగా వున్నా, పెద్దయ్యాక సన్నగా, నాజూగ్గా వుండేది. మా అందరికన్నా తెల్లటి పిల్ల. చూడ చక్కగా వుంటుంది. తెలివైందే కానీ, ఎప్పుడూ పుస్తకాలు రుబ్బి చదివేస్తూ వుండేది. మా అందరికన్నా, ఎప్పుడూ దానికే ఎక్కువ మార్కులు వచ్చేవి. మళ్ళీ దాని తెలివితేటలు దాని పిల్లలకి కూడా రాలేదు. ఇంకా మా పిల్లలకే పిన్ని జీన్స్ వచ్చాయేమో. మా ఇంట్లో అందరికన్నా పొట్టిదీ  అదే. సన్నగా, తెల్లగా, నాజూగ్గా, ఒక రకం నీరసం నవ్వేసుకుని, సన్నగా, పొడుగ్గా వున్న జడేసుకుని, నోట మాట లేనట్టు అతి నిదానంగా ఉండేది మా భారతి. యెంత నిదానమంటే, అది తప్పు చేసినా, దానికున్న ఇమేజ్ వల్ల తిట్లు నేనే తినేదాన్ని. కొన్నాళ్ళయ్యాక అమ్మ కూడా ఆ విషయం కనిపెట్టింది. దాంతో నాకు తిట్లూ, చీవాట్లూ తగ్గాయి. దాని ఫేస్ కున్న వాల్యూ అది. భారతి బీ ఎస్సీ లో ఫస్ట్  క్లాస్ ఆనర్స్, ఎమ్మెస్సీ లో కూడా ఫస్ట్ క్లాస్. అది ఎమ్మెస్సీ చదివేరోజుల్లోనే నాకు పెళ్ళయి పోయింది. నాన్నకి సంబల్ పూర్ నుంచి  గౌహతీకి ట్రాన్స్ఫర్ అయింది. దాంతో దాన్ని నెహ్రు అంకుల్, మా కుటుంబ స్నేహితులు, వాళ్ళింట్లో వుంచి నాన్నా వాళ్ళు గౌహతి వెళ్లారు. తరవాత అది గౌహతీలొ బీయీడీ చదివింది. బీయీడీ చదివే రోజుల్లోనే అది సెంట్రల్ స్కూల్, మాలిగావ్ లో (గౌహతి) టీచర్ గా పని చేస్తూ వుండేది కాంట్రాక్ట్ పోస్ట్ లో. పొద్దున్నంతా స్కూలు, సాయంత్రం బీయీడీ కాలేజ్, పాపం అలిసిపోయినట్టు వుండేది. మా అమ్మ కూడా జాలిపడి దానికి పనేమీ చెప్పేది కాదు. పాపం దాని పెళ్ళయ్యాక పని ఒక్కసారిగా మీద పడిపోయింది. ఇంటి పనులన్నీ ఒక్క చేతిమీద చేసుకునేది. దాని పిల్లలక్కూడా దాని పని తీరు రాలేదు. తరవాత దానికి సెంట్రల్ స్కూళ్ళలోనే పర్మినెంట్ వుద్యోగం వచ్చింది.  మొదట్లో టీజీటీగా, తరవాత పీజీటీగా.  దాదాపు ఇరవై ఏళ్ళు సెంట్రల్ స్కూళ్ళ లో చేశాక వీఆర్ఎస్ తీసుకుని తిరిగి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫిజిక్స్ పీజీటీగా చేరింది. స్కూల్లో స్టాఫ్ లోనూ, పిల్లల్లోనూ కూడా దానికి చాలా మంచి పేరు. అసలు దానికి ఎక్కడైనా మంచి పేరే, దాని ఫేస్ వాల్యూనే  అది.  సెంట్రల్ స్కూల్ లో ఉన్నప్పుడే అవసరం లేకపోయినా అది ఎమ్మీడీ కూడా చేసింది. దాని పేరు, యెన్ భారతలక్ష్మి, అంటే నందివాడ భారతలక్ష్మి అయితే దానికి యెన్ అంటే నిదానం భారతలక్ష్మీ అనో, నిద్రా భారతలక్ష్మీ అనో అంటే చక్కగా సరిపోతుంది. దాని కుటుంబం గురించి మళ్ళీ రాస్తా. 




5, ఆగస్టు 2015, బుధవారం

ఇల్లంతా కోలాహలం

                                                            ఇల్లంతా కోలాహలం

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                        మా బామ్మ మా అమ్మా వాళ్ళనాన్నని పిలిచి 'రాంకిష్టుడికి ఏమైనా సంబంధాలు చూడు సత్యం' అందిట. ఆయన సిన్సియర్ గా సంబంధాలు చూడటం మొదలుపెట్టాడట. అప్పుడు వూళ్ళో ఎవరో 'మీ ఇంట్లో వయసైన, వరసైన అమ్మాయిని పెట్టుకుని బైట సంబంధాలు చూస్తావా, వెళ్లి వియ్యమ్మ గారిని అడుగు, మీ లీలని రామకృష్ణకి చేసుకొమ్మని అడుగు', అని ధైర్యం చెప్పి తీసుకెళ్ళి అడిగించారుట. మా బామ్మ ముందు 'మళ్ళీ నండూరి వారి ఆడపడుచా' అని మరీ ఒప్పుకుందిట. పెళ్ళిచూపులకి మానాన్నతో పాటు మా చల్లమ్మత్తయ్య (నాన్నా వాళ్ళ చిన్నక్కయ్య)  కూడా వెళ్ళిందిట.  ఆవిడ మా అమ్మ పొడుగు జడ చూసి ఫ్లా.....ట్. "ఒరేయ్, లీలనే చేస్కోరా, మనింట్లో ఎవరికీ ఇంత పొడుగు జడ లేదు. రేపు నీ పిల్లలకి కూడా పొడుగు జుట్టు వస్తుంది." అని చెప్పిందిట. నాది మాత్రం మా అత్తయ్యల పోలికతో పొట్టి జడే, భారతీ, పద్మా మాత్రం పొడుగు జడేసుకుని పోజులు పోతూ వుండేవారు.

                                                               మొత్తానికి ఎలాగైతేనేం మా అమ్మా, నాన్నకి పెళ్ళయ్యింది. నాన్న పెళ్ళవుతూనే బామ్మా వాళ్ళంతా బెజవాడకి మకాం మార్చేసారుట. నాన్నకి బెజవాడలో వుద్యోగం. బామ్మ మాదగ్గిరే వుండేది. దాంతో మా అత్తయ్యలూ, పెద్దనాన్నలూ, బాబాయిలూ, వాళ్ళ కుటుంబాలూ, అంతా ఎప్పుడూ వస్తూ, పోతూ, ఉంటూ వుండేవారు. ఇల్లంతా ఎప్పుడూ ఫుల్లుగా  సందడి. ఆడవాళ్ళకి, ముఖ్యంగా కోడలిగా మాఅమ్మకి,  చేతినిండా పని. బామ్మక్కూడా పనే ఎప్పుడూ.  మా అమ్మ పని పెనం లోంచి పొయ్యి లోకి, లేదా పదిమంది పిల్లలున్న ఇంట్లోంచి, పన్నెండుమంది పిల్లలున్న ఇంట్లోకి. (ఈ పన్నెండు మందినీ ముందు ముందు పరిచయం చేస్తా.) నాకు వూహ తెలిసి మా అమ్మ ఎప్పుడూ ఏదో పని చేస్తూనే వుండేది. వంట పనంతా మా బామ్మ చేసేది. ఆవిడకి అన్నీ అందించాల్సింది మాఅమ్మ. మా అమ్మావాళ్ళ కుటుంబం లాగా మానాన్నా వాళ్ళ కుటుంబం కూడా ఆస్తులు అన్నీ అమ్మేసుకుని చదువులూ, తెలివితేటలూ మాత్రమే ఆస్తులుగా మిగిలిపోయారు. మా బామ్మ గురించైతే ఓ పెద్ద ఎపిసోడ్ రాయాల్సిందే. ఈ రోజుకీ నాకు ఆవిడే రోల్ మోడల్, ఐడియల్, ఐడల్, కూడా.  తల్లులు అంతా మా బామ్మ లాగా వుంటే, పిల్లల మధ్య ఆప్యాయతలు కలకాలం నిలిచి వుంటాయి.  సరే, ఆవిడ గురించి మళ్ళీ రాస్తా. 


                                                ఇంటినిండా పెద్దలు, పిల్లలు, ఆడపడుచులు, తోడికోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సందడే సందడి. మా నాన్న టీచర్, అందులోనూ లెక్కలటీచర్ అవటం వల్ల, బంధువుల్లో ఎవరి పిల్లలు సరిగ్గా చదవకపోయినా, లేదా వాళ్ళు వుండే వూళ్ళో చదువుకునే సౌకర్యం లేకపోయినా, ఆ పిల్లలు వెంటనే మా ఇంటికి పార్సిల్ చేయబడేవాళ్ళు. ఇహ వాళ్ళ తిప్పలు చూడండి, అసలే మా నాన్న మహా డిసిప్లినేరియన్, ఆరెస్సెస్స్ బాక్ గ్రౌండ్, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, మా నాన్న 'ఆ' అంటే చాలు బిక్కచచ్చిపోయేవాళ్ళు. సరిగ్గా వాళ్ళు చదువుకోక పోయారో, వాళ్ళ పని అయిపోయినట్లే, నాన్న వాళ్ళు ఎవరైనా సరే, వంగదీసి వీపు మీద గుద్దేవాడు. బహుశా ఆ దెబ్బలకి భయపడి వాళ్ళు మాఇంట్లో బాగానే చదువుకునేవారు. మొత్తంమీద ఇంటినిండా చదువులకి వచ్చినవాళ్ళు, సెలవలకి వచ్చినవాళ్లు, వైద్యానికి వచ్చినవాళ్ళు, పురుళ్ళకి  వచ్చినవాళ్ళు, పట్నానికి పనిమీద వచ్చినవాళ్ళతో ఇల్లంతా కోలాహలంగా వుండేది నా చిన్నప్పుడు. ఆవిధంగా మాకందరికీ ఇంటినిండా జనం అలవాటు అయిపోయారు.  


                                         ఇంతమందికి ఎంత వంట చేయాలి, ఏమేమి చేయాలి, కూరలు ఎన్ని తరగాలి, వగైరా విషయాలన్నీ బామ్మ డిసైడ్ చేస్తే, అమ్మ, మిగిలిన వాళ్ళు ఫాలో చేసేవాళ్లుట. ఇంతమంది పిల్లల మీద ఎవరి పిల్లలకి ఎవరు స్నానం చేయించేవారో, ఎవరు అన్నం పెట్టేవారో, ఎవరు జళ్ళేసేవారో, మొత్తం మీద పనులన్నీ అయిపోయేవి. అమ్మ మాకు మరీ చిన్నప్పుడు ప్రత్యేకంగా ఏమైనా చేసినట్లు గుర్తే లేదు. పండగలకి ఇంతమందికీ నూనెలు, నలుగులు, తలంట్లు, అబ్బో, అదో హడావుడి. వంటలు కూడా మొదటి వాళ్లకి దక్కినట్టు, చివరివాళ్ళకి దక్కేవి కావు. సాధారణంగా ఆ చివరిగా మిగిలేది కోడళ్ళే. పాపం, మా అమ్మా, ఆమ్మా వాళ్ళు పనంతా చేసి చివర్లో ఆ పిండివంటలు రుచి చూడటానికి కూడా మిగలకపోతే చాలా బాధపడేవారుట. తలుచుకుంటే ఇప్పుడు నాకూ జాలి వేస్తుంది. అందరూ తిన్నాక, వీళ్ళు తింటూ, అదీ సరిగ్గా అందకపోతే ఎలా?  మన మధ్యతరగతి వుమ్మడి కుటుంబాలన్నీ ఇంతేనేమో.  ఎవరైనా మెత్తనివాళ్ళు, మొహమాటస్థులు  వుంటే అందరూ వాళ్ళ మీదకి ఎక్కేసి వాళ్ళపనులూ, వాళ్ళఖర్చులూ, వీళ్ళమీద రుద్దేసి జరిపించేసుకుంటారు. తీరాచూస్తే అందరూ మనవాళ్ళే,  పరాయి వాళ్ళెవరూ వుండరు. ఎవరైతే గృహ నిర్వహణా బాధ్యత తీసుకుంటారో, వాళ్లకి బాంక్ బాలన్సులూ వుండవు, వంటి మీద నగలూ, నాణ్యాలూ వుండవు, ఆస్తిపాస్తులూ మిగలవు. మంచి పేరు మాత్రం కొండంత,  తరతరాలుగా  నిలిచిపోతుంది. ఇప్పటికీ బంధువులందరిలో అమ్మకీ నాన్నకీ ఎంత మంచి పేరో.  ఫలానా రామకృష్ణుడు, లీలా వాళ్ళ వల్లే మేమీ రోజు ఇలా నిలబడ్డాం,  అని చాలామందే  చెప్పుకుంటారు. అది మాకు గర్వంగానే వుంటుంది, కానీ అమ్మా, నాన్నా కోల్పోయిన సౌకర్యాలు తలచుకుంటే మాత్రం బాధేస్తుంది. ఇద్దరూ ఇద్దరే. 








31, జులై 2015, శుక్రవారం

అమ్మమ్మా, తాతయ్యా

అమ్మమ్మా, తాతయ్యా

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                      మా అమ్మమ్మ, లక్ష్మీనరసమ్మ, చాలా అందంగా వుండేది. తెల్లగా, పొట్టిగా, నాజుగ్గా వుండేది. గొంతు బావుండేది. పాట అయితే నేనెప్పుడూ వినలేదు. చాలా నిదానంగా నెమ్మదిగా కనిపించేది. గట్టిగా మాట వినిపించేది కాదు. కానీ చురుక్కుమనిపించేది. మనిషి చాలా శుభ్రంగా వుండేది. పది మంది పిల్లల తల్లిలాగా కనిపించేది కాదు. ఇంతమంది కానీ, పెంచి, గొప్ప వాళ్ళను చేసింది ఈవిడేనా అనిపించేది. మా తాతయ్యా వాళ్ళ అన్నగారు డాక్టరు, ఆయన చాలా చిన్నతనంలోనే పోయారట. ఆయన మధ్యలో అడ్డం వుండి ఇప్పించిన అప్పులు తీర్చటానికి ఆస్తిలో పెద్దభాగం వదిలేసుకోవాల్సి వచ్చిందట. అందుకని మా అమ్మమ్మకి మా తాతయ్య మీదా, వాళ్ళ మామగారి మీదా కోపంగా ఉండేదిట. ఇంతమంది పిల్లలని ఎలా పెంచాలా అని బాధపడేదిట. అందరి చదువులు, పెళ్ళిళ్ళు ఎలా అని ఆలోచించేదిట. అయినా మా మామయ్యలందరూ, మల్లు మామయ్య తప్ప, రోహిణీ పిన్నీ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఆమ్మమ్మ పొదుపుగా ఉంటూ అన్నీ అందరికీ అందేలా చూసుకునేది అని అమ్మ అనేది. అమ్మమ్మ చాలా ధైర్యం వున్న మనిషని మాత్రం నేనూ చూశా. తాతయ్య పోయాక అమ్మమ్మ వొక్కత్తే వొంటరిగా ఆరుగొలనులోనే వుండేది. తన పనులన్నీ తనే చూసుకునేది. బహుశా మా అమ్మకీ వాళ్ళ అమ్మ ధైర్యమే వచ్చివుంటుంది. మా అమ్మా నాన్న పోయాక వొంటరిగానే వుంది చాలాకాలం. ఒకసారి అమ్మమ్మని ఆరుగొలనులో ఆవో, ఎద్దో పొడిచింది. ఆరోజుల్లో నేను విజయవాడలో చదువుకునేదాన్ని. అమ్మమ్మని చూసుకోవటానికి సీతామ్మ వెళితే, నేనూ, సత్యవతీ సీతామ్మా వాళ్ళింట్లో వున్నాం. ఆ తరువాత అమ్మమ్మని వాళ్ళ పిల్లలెవరూ వా వూళ్ళో ఉండనివ్వలేదు. పిల్లలందరి దగ్గరికీ, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. నాతో సంబల్ పూర్ వచ్చింది. నాన్న అప్పుడే మా అందరినీ భువనేశ్వర్, కోణార్క్, పూరీ తీసుకెళ్ళారు. అవి చూసి అంతా చాలా సంతోషించాం. మేము వెళ్ళిన రోజుల్లో మూల విరాట్టులన్నీ ఆ గుడి ఆచారం ప్రకారం గుండిచా మందిరంలో వున్నాయని గుర్తు. ఎందుకంటే విగ్రహాలని చాలా దగ్గరగా చూశాం. మళ్ళీ అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేకపోయాం. పూరీలో శంకరాచార్య పీఠానికి వెళ్లాం. దానికి దగ్గరలోనే సముద్రం వుంది. అందరం సరదాగా దాంట్లోకి దిగాం. మా కుటుంబం, నాన్న ఎం. ఈడీ.  క్లాస్ మేట్ గోవిందరాజులు గారి కుటుంబం కుడా మాతోనే వుంది. అందరం సరదాగా మిట్ట మధ్యాన్నం పన్నెండు, పన్నెండున్నర మధ్యలో సముద్రం లోకి దిగాం. అమ్మమ్మ మాత్రం మా సామాన్లన్నీ పెట్టుకుని వొద్దు మీద ఎత్తైన చోట కూర్చుంది. ఒక్కసారిగా పే......ద్ద అల ఒకటి వచ్చి మమ్మలనందరినీ ముంచేసి లోపలకి లాగేసింది. మాకు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నీళ్ళల్లో ఇసుక మీద గట్టిగా నించుంటే అలలకి కొట్టుకుపోమని నాన్న ముందే చెప్పాడు. నేను అలానే నించున్నా. కానీ నెత్తిమీంచి నీళ్ళు వేగంగా తన్నేస్తుంటే చాలా కష్టం మీద బలంగా నించున్నా. కొట్టుకుపోతూ, నాకేవో ఇద్దరి చేతులు దొరికాయ్. గట్టిగా పట్టుకుని ఆపా. తరవాత అల వెళ్ళిపోయాక తెలిసింది ఆ చేతులు మా భారతివి, గోవిందరాజులు అంకుల్ వాళ్ళ అమ్మాయివి అని. అసలు ఆ అలలోనుంచి బతికి బయటికి వస్తామనుకోలేదు. ఆ అల వెళ్లిపోంగానే అందరం గబగబా బైటకు వచ్చేశాం. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కేకలేశారు, ఎవరైనా పున్నమి రోజున మిట్ట మధ్యాన్నం వేళలో సముద్రంలోకి దిగుతారా అని. ఆ టైం లో హై టైడ్ వస్తుందిట. బతికాంరా బాబోయ్ అనుకుని పైకి వచ్చేశాం. పాపం అమ్మమ్మ గట్టు మీద కూర్చుని మేమంతా నీళ్ళల్లో మునిగిపోతుంటే భయపడుతూ, కంగారుగా ఉండిపోయింది. అందరూ మునిగిపోయారు, నాకు ఈ భాష రాదు, ఇప్పుడేం  చేయాలి అని దుఃఖంలో పడిపోయింది.  మేమంతా క్షేమంగా తిరిగి రాంగానే ఒక్కసారి బెంగగా మా దగ్గరికి గబగబా వచ్చింది. ఇక మేం అక్కడ ఉండలేదు. వెనక్కి వచ్చేశాం. 

                                         సంబల్ పూర్లో మాతో రెండు నెలలు వుంది. కొత్త వూరు, కొత్త భాష, కొత్త పద్ధతులు ఆవిడకి కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. ముఖ్యంగా అమ్మ, నాన్న స్కూటర్ మీద వెళ్తే అమ్మమ్మకి తప్పుగా తోచింది. అవి అన్నీ తలచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది, అప్పటికీ ఇప్పటికీ రోజులు ఎలా మారిపోయాయా అని. భార్యాభార్తా కలిసి వెళ్తేనే తప్పు అనుకునే కాలం నుంచి ఎటువంటి కాలం లోకి వచ్చేశామా అని. నేను రకరకాలైన టిఫిన్లు చేస్తానని ముచ్చట పడేది. నాన్నా వాళ్ళు హైదరాబాదు వచ్చేశాక కూడా కొన్నాళ్ళు మా అమ్మ దగ్గర వుంది. హైదరాబాదులో మాఅమ్మ దగ్గరా, మురళీమామయ్య దగ్గరా ఎక్కువగా వుండేది, చివరలో చనిపోయేముందర పార్థు మామయ్యా వాళ్ళింట్లో వుంది, అక్కడే పోయింది. విస్సన్నపేట నుంచి హైదరాబాదు వరకూ ఆ యాత్ర అలా సాగింది. 


                                                 మా తాతయ్య, నండూరి సత్యనారాయణ గారు ఆరుగొలనుకి కరణం. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో పోస్టాఫీసులు మొదటిసారి పెట్టినప్పుడు కరణాలకే ఆ బాధ్యత అప్పచెప్పారుట. దాంతో తాతయ్య ఆవూరికి కరణం, పోస్టుమాస్టరు రెండూను. సన్నగా, నల్లగా, పొడుగ్గా, మా అమ్మకి పూర్తిగా భిన్నంగా వుండేవాడు. చాలా సరదా అయిన మనిషి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ వుండేవాడు. నిజాయితీ గల మనిషిగా ఊరూ వాడా పేరు. డబ్బులు సంపాదించుకున్న కరణాలు చాలా మంది, నీతీ నిజాయితీ తో వుండే కరణాలు కొద్దిమంది.  వాళ్ళల్లో మా తాతయ్యా ఒకడు. ఆ నీతీ, ఆ పుణ్యమే పిల్లలు మంచిగా ఎదిగేందుకు దోహదపడిందేమో. ఒక్కళ్ళ చేత కూడా వేలెత్తి చూపించుకోలేదు. మా అమ్మకి వాళ్ళ నాన్నంటే ఇష్టంతో పాటు ఎంత మర్యాదా, గౌరవమో. చిన్నప్పుడు వెన్నెల్లో ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశాన్నంతటినీ పరిచయం చేసేవాట్ట, ఈ నక్షత్రం ఇదీ, ఆ రాశి అదీ అంటూ. తాతయ్య రోహిణీ పిన్నికి పద్యాలు చదవటం, అర్ధం చేసుకోవటం బాగా రాదని కేవలం రోహిణీ పిన్ని కోసమే పింగళి సూరన గారి కళాపూర్ణోదయం కావ్యాన్ని తెలుగులో, అదీ తేట తెలుగులో, అందరికీ తేలికగా అర్ధం అయ్యేలా రాశారు. అది అముద్రిత రచన. బహుశా దాన్ని ఏ పత్రికకీ ముద్రణ కోసం పంపించలేదు. మా చిన్నప్పుడు తాతయ్య దస్తూరీతో వున్న ఆ పుస్తకం మా ఇంట్లోనే వుండేది. మేమందరం దాన్ని చాలా సార్లు చదివాం. రచన అనేది మా జీన్స్ లోనే వున్నాయనటానికి ఇది మరో తార్కాణం. ఉత్తరాల్లో తన పేరు నండూరు సత్యనారాయణ అని రాసేవారు. నండూరు ఎప్పుడు, ఎలా నండూరిగా మారిందో తెలియదు. మోహనం మామయ్యా, పార్థు మామయ్యా నండూరి అనే రాసేవాళ్ళు. తాతయ్యకి ఎలా వచ్చిందో గానీ బీడీలు తాగటం అలవాటు. చివరిలో అదే త్రోట్ కాన్సర్ లోకి దింపింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సర్జరీ కూడా చేశారు. గొంతులో మాట్లాడే ట్యూబ్ / అన్నవాహిక  తీసేసి పొట్ట దగ్గర ఒక ట్యూబ్ పెట్టారు. దాంట్లో నుంచే కొద్దిరోజులు ఆహారం లోపలి పంపించారు. కానీ ఆ తరువాత ఆయన ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన 1900 సంవత్సరం లో పుట్టారు. 1971లో పోయారు. ఆ టైంకి మాబామ్మ మాదగ్గరే వుంది. మా బామ్మ మా తాతయ్యని 'సత్యం' అనేది, ఆవిడకి ఈ తాతయ్య తమ్ముడు వరస. మా బామ్మ కూడా నండూరి వారి ఆడపడుచే. 'నాకన్నా సత్యం చాలా చిన్నవాడు, అప్పుడే పోయాడా' అని చాలా బాధపడింది. నేను టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన సంవత్సరం అది. రోహిణీ పిన్ని పెళ్లి కూడా ఆ తరువాతే అయింది. తాతయ్య ఎన్ని ఇబ్బందులు వున్నా శాంతంగా ఎలా వుండచ్చో జీవించి చూపించారనిపిస్తుంది. ఆస్తి పోగొట్టారని వాళ్ళ అన్నయ్యని కానీ, వాళ్ళ నాన్నని కానీ ఏనాడూ తప్పు పట్టినట్లు నేను వినలేదు. కరణీకం కానీ, పోస్టాఫీసు పని కానీ తీసుకోమని అంతా మల్లు మామయ్యకి ఎంతో చెప్పారు, ఆయన వినలేదు. 'మీరంతా పట్టణాల్లో వుంటే నేను పల్లెలో ఉండాలా' అని. కానీ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బాధపడ్డాడు. ఆరుగొలనులొ వుండి తాతయ్య వుద్యోగం తీసుకుంటే బాగుండేదని అందరూ అనుకునేవారు. తాతయ్య మాత్రం ఎవరితో మాట పడకుండా, ఎవరినీ మాట అనకుండా బతుకు బండి లాగగలిగాడు. దటీజ్ తాతయ్య. 












29, జులై 2015, బుధవారం

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం


భట్టిప్రోలు విజయలక్ష్మి


                                              ఐదుగురి తరవాత మా అమ్మ, లీల. అమ్మ తరవాత పార్ధు మామయ్య. పార్ధు మామయ్య, సువర్చల అత్తయ్య (ఈ అత్తయ్య పేరు కూడా సువర్చలే) వాళ్ళు మాకందరికీ యెంత అలవాటంటే, మా ఇల్లు తరవాత అది మాకింకో ఇల్లన్నమాట. ఒక్కడే కొడుకు మధు సారధి. మధు పేరుకి మామయ్య కొడుకే గానీ మాకందరికీ ఇంకో తమ్ముడే వాడు. మమ్మల్నందరినీ అక్కా అనే పిలుస్తాడు. నన్ను పెద్దక్కా అంటాడు. వీళ్లిల్లు కూడా షరా మామూలే, సంగీత నిలయం, సాహిత్య నిలయం. ఈ మామయ్యక్కూడా పరిచయం ఏమీ అక్కర్లేదు. నండూరి పార్థసారథి, పేరు చాలు. గొప్ప రచయిత. ఈమామయ్య రాసిన పుస్తకాలు, వ్యాసాలూ చూస్తే ఈయనకి ఎన్ని విషయాల్లో, ఎన్ని రంగాల్లో ప్రవేశం, పట్టూ వున్నాయో అని ఆశ్చర్యం కలుగుతుంది. నంపాసాగా కూడా ప్రసిద్ధుడు. వాళ్ళ ఇంటి పేరు శ్రుతి. మామయ్య ఎన్ని పుస్తకాలు, ఎన్ని విభిన్నమైన కాన్సెప్ట్స్ తో, ఎంత విస్పష్టంగా రాసాడో అవి చదివితే తెలుస్తుంది. ఒక అల్ ఇన్ వన్ ఈ మామయ్య. రచనలు, (నవలలు, వ్యాసాలూ, విశ్లేషణలు, పరిశోధనలు, అనుభవాలు, సంగీతం, సాహిత్యం,  ఎట్సెట్రా, ఎట్సెట్రా ఇలా ఎన్నో) చేస్తాడు, పాటలు పాడతాడు,(యధావిధిగా ఎంతో బతిమాలించుకుని కొద్దిగా), సితార్ వాయిస్తాడు. పాటల కలెక్షన్ చేస్తాడు, వింటాడు. పుస్తకాలు కలెక్షన్  చేస్తాడు, చదువుతాడు. పాత రేర్ సినిమాలు కలెక్షన్ చేస్తాడు, చూస్తాడు. తన గదిలోకి వెళ్తే అదో లోకం, మళ్ళీ గదిని శుభ్రంగా ఉంచుకుంటాడు. సిస్టమాటిగ్గా అన్నీ ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది పెట్టి అన్నీ అందుబాటులో ఉంచుకుంటాడు. సంగీతం మీద చాలా పరిశోధన చేసి వ్యాసాలు రాస్తాడు. ఇక చెప్పలేను బాబూ, ఆయన వర్క్స్ చూడాల్సిందే, చదవాల్సిందే, వినాల్సిందే. అప్పుడు కానీ ఆయన అసలైన ప్రతిభ కొంతైనా తెలియదు. మరుగున పడ్డ మాణిక్యాల్లో ఒకడు మా పార్ధు మామయ్య. ఇంక అత్తయ్య, మంచి మనిషి, నాకు ఈ సాయం కావాలీ అంటే తప్పక చేసే స్వభావం. మంచి తత్వవేత్త, నిరంతర ధ్యానం చేస్తూ, తన దగ్గరికి వచ్చిన అందరితో ధ్యానం చేయిస్తూ వుంటుంది. వాళ్ళ కుటుంబంలో అందరూ మాస్టర్ సీవీవీ ధ్యానమార్గంలో వున్నారు. నన్ను కూడా ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టింది. ధ్యానంలో నాకు ఈ అత్తయ్యే గురువు. ఆధ్యాత్మికంగా పైస్థాయిలో వున్న వ్యక్తి. గత యాభై ఏళ్ళుగా ఒకేలా వున్న మనిషి. మా అమ్మ క్కూడా చాలా మంచి స్నేహితురాలు. అన్ని తరాల వారితో కలిసిపోయే మనస్తత్వం. ఎప్పుడూ నవ్వు మొహంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మధు చిన్నప్పట్నించీ సితార్ నేర్చుకునేవాడు. సితార్ ఒక్కటే కాదు, చదువులోనూ ముందుండేవాడు, ఇంజనీరింగ్ లో డాక్టరేట్. మధు భార్య అపర్ణ మంచి ఫ్రెండ్లీ గర్ల్. మధు సితార్ విలాయత్ ఖాన్ గారి దగ్గర నేర్చుకుని, ఆయన చేతే మధు నా అంత గొప్ప పండితుడు, అనిపించుకున్నవాడు. మేమందరం మధు కచేరీలు చాలా ఇష్టంగా వింటాం. మోదుమూడి సుధాకర్, నండూరి మధుసారథి ఒకసారి విజయవాడలో, ఒకసారి హైదరాబాదులో జుగల్ బందీ కూడా ఇచ్చారు. వినే అదృష్టం నాకు కలగలేదు. అప్పుడు వేరే వూళ్ళో వున్నా. ఈ నండూరి మనవళ్లిద్దరూ మా కుటుంబానికి దేవుడిచ్చిన వరం. తరవాత తరంలో లల్లి, పనంగిపల్లి లలిత. వీళ్ళ చేత అక్క, అత్తా అనిపించుకోవటం నా/మా యోగం. 

                                                 పార్ధు మామయ్య తరవాత శంకరం మామయ్య, నండూరి శివశంకర శర్మ. ఈ మామయ్య మాట్లాడితే జలతరంగిణిలా వినిపిస్తుంది. కొంత మంది గొంతు ప్రత్యేకంగా వుంటుంది, వాటిల్లో శంకరం మామయ్యది కూడా ఒకటి. సంగీతమంటే యెంత ఇష్టమో.  చాలా సంగీత పుస్తకాలని పరిష్కరించి పబ్లిష్ చేయటంలో తన వంతు పాత్ర పోషించాడు. గీతా ప్రెస్ వాళ్లకి ఆధ్యాత్మిక పుస్తకాల ప్రచురణలో సాయం చేసేవాడు. నివురు కప్పిన నిప్పు. సైలెంట్ గా వుంటూనే అందరికీ తలలో నాలుక లాగా వుండే వాడు. అన్నయ్యలు, అక్కయ్యలు అంటే ప్రాణం. మా నాన్న అంటే కూడా అంత ప్రేమగా, ఇష్టంగా ఉండేవాడు. యెంత నిరాడంబరంగా ఉంటాడో చెప్పలేను. పుట్టపర్తిలోని సత్యసాయి ఆశ్రమానికి రెగ్యులర్ గా వెళ్తూ అక్కడ సేవ చేసేవాడు. ఎప్పుడూ తెల్లబట్టల్లో ప్రశాంతంగా ఉంటాడు. మిగిలిన అందరిలా సాహిత్యం, సంగీతమే కాకుండా ఈయనకి సమాజ సేవ కూడా ఒక అదనపు లక్షణం. ఇవ్వన్నీ కలిస్తే మా శంకరం మామయ్య. అన్నట్టు మర్చ్మోయాను, మా శంకరం మామయ్యకి మైళ్ళకి మైళ్ళు నడవటం అలవాటు. మా జోగులాంబ అత్తయ్య గొప్ప వీణా విద్వాంసుడు, శ్రీ మంచాళ జగన్నాధరావు గారి తమ్ముడి కూతురు, సంగీతంలో ఆయన శిష్యురాలు. ఈవిడ గొంతులో దేవుడు పంచదార పోసి కుట్టేశాడా అనిపిస్తుంది ఆవిడ పాట వింటే. అంత మధురంగా వుంటుంది ఆవిడ గొంతు. శాస్త్రీయసంగీతం, లలితసంగీతం ఏదైనా సరే అంతే మధురంగా, అంతే మర్యాదతో, గౌరవంతో పాడుతుంది. వాళ్ళ అమ్మాయి విజ్జి, దీనిది నా పేరే. కూడా బాగా పాడుతుంది. ఇప్పుడు మూడోతరం, విజ్జి వాళ్ళమ్మాయి, లాస్య కూడా పాడుతోంది. ఈ మధ్యనే విన్నా, అది కూడా చక్కగా పాడుతోంది. తరతరాలుగా ఈ గానవాహిని మా కుటుంబంలో ఒక్కోసారి  అంతర్వాహినిలా, ఒక్కోసారి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూనే వుంది. 


                                                       ఆ తరువాత శ్రీదేవి పిన్ని. పిన్ని గొంతు కూడా చాలా బాగుంటుంది. కొంచం జలతరంగిణి లాగా వినిపిస్తుంది. పాట పాడుతుందో లేదో తెలియదు. నేనెప్పుడూ తను పాడుతుండగా వినలేదు. నిదానంలో సీతామ్మకి సంపూర్ణంగా చెల్లెలు. హడావుడికి మా అమ్మ, రోహిణీ పిన్ని, నిదానానికి సీతామ్మా, శ్రీదేవి పిన్నీ. అసలు సిసలు 'ఛుపారుస్తుం' (నిజ్జంగా ఈ పదానికి సరిపోయే తెలుగు పదం దొరకలా) ఈవిడే. అరవై అయిదు ఏళ్ళు వచ్చేదాకా మా బాబాయిగారికి వ్రాయసకత్తెగా వుండి, ఒక్కసారిగా స్వీయ అనుభవాలతో ఓ పుస్తకం ఏకధాటిగా రాసేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పుస్తకం, నెమరేసిన మెమోరీస్, కూడా అందర్నీ స్వీట్ మెమోరీస్ లోకి తీసుకెళ్ళింది. నేనీ బ్లాగ్ రాయటానికి ఈ పిన్ని కూడా ఒక ప్రధాన కారణం. మా బాబాయిగారు, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు.  పేరు చెప్తే చాలు,  పరిచయం అక్కర్లేని వాళ్ళల్లో ఈయన ప్రధముడు. ఈయన రాసిన కథలు, నవలలు, వ్యాసాలూ, డైలాగులు, స్క్రీన్ ప్లేలు, సినిమా నవలలు, కవితలు, చాలా కొన్ని పాటలు, అన్నీ కలిపితే లెక్కలేనన్ని. సహృదయమున్న మనిషి, చాలా బిడియంగా వుండేవారెందుకో. కానీ చాలా స్నేహశీలి. ఆయన, బాపు గారు స్నేహానికే ఐకాన్ లు. ఎంత కష్టాన్నైనా ఎవరికీ తెలియకుండా దాటేసి, దాన్ని 'ఈదేసిన గోదారి' అనగలగటం ఆయనకే చెల్లింది. పిన్ని అన్నింటా ఆయనకి సహధర్మచారిణి. వాళ్ళింట్లో లైబ్రరీ ఎంత కలెక్షనో. వాళ్ళ అబ్బాయి, బుజ్జి, వరా ముళ్ళపూడి, డైరెక్టర్ గా సినిమాలు తీస్తున్నాడు. దూరదర్శన్ వాళ్ళ కోసం చాలా షార్ట్ మూవీస్, లఘుచిత్రాలు, తీశాడు. చాలా బావుంటాయవి. నేనూ బుజ్జి ఫాన్ నే. మా పిన్ని కూతురు, అమ్మలు, అనురాధ, కూడా మా కలం సైన్యానికి చెందినదే. కాకపోతే దాని భాష ఇంగ్లీషు. తెలుగు కూడా ఇంగ్లీషులో రాస్తుందని విన్నా. మళ్ళీ అమ్మలు వాళ్ళ అమ్మాయి పాటలు పాడుతుంది. ఓసారి నేనూ టీవీలో విన్నా. బుజ్జి కూతురేమో పుస్తకాల పురుగు. బుజ్జి భార్య అరుణ, బాపు గారి తమ్ముడు శంకర్ గారి కూతురు. ఎంత హాయిగా నవ్వుతుందో. నాకు తన మందహాసం చాలా ఇష్టం.   


                                                ఇక చివరిగా మా చిన్న పిన్ని, రోహిణి. వాళ్ళ పది మందిలో చిన్నది. అందంగా వుంటుంది. బి. యే. తెలుగు లిటరేచర్ రెడ్డి కాలేజీలో చదివింది. పాటలు బాగా పాడుతుంది, బతిమాలించుకోవటంలో మిగిలిన వారికన్నా ఎంతో నయం. పైంటింగులు వేస్తుంది. కార్డ్ బోర్డ్ తో రకరకాల ఆకారాలు, ఇళ్లు, మందిరాలు తయారుచేస్తుంది. తగరం పేపర్లతో బొమ్మలకి అలంకరణ చేసి, వాటికి నగలూ, ఆభరణాలూ, చేసేది. గ్లాస్ మీద పైంటింగులు వేస్తుంది. తన చేతిలో చెత్త కాయితం పెట్టినా కళాత్మకంగా దాంతో ఏదో ఒకటి చేసి ఇవ్వగలదు. హిందీ నేర్చుకుని కొన్నాళ్ళు హిందీ టీచర్ గా కూడా పనిచేసింది. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే వుంటుంది. మా సాయి బాబాయిగారు ఎంత ఆపేక్షగా ఉంటారో. నన్నైతే సొంత కూతురు లాగానే చూస్తారు. కొత్త కొత్త గాడ్జెట్లు కొనటం, వాడటం ఆయనకిష్టం. నాటకాలు వేసేవారు. ఇప్పటికీ నాటకాలు చూడటం, కచ్చేరీలకు వెళ్ళటం ఆయనకిష్టం. కానీ ఆయాసం, ఉబ్బసం ఈ బాబాయిగారినీ, మా సోమశేఖరరావు పెద్దనాన్నగారినీ చాలా బాధించేవి. వాళ్ళ వుత్సాహమంతా ఆ జబ్బు పాడుచేసేసేది.  వాళ్ళ పిల్లలు రాధిక, హరి. రాధిక కూడా చాలా క్రియేటివ్. పాటలు పాడుతుంది. టీవీలో యాంకర్ గా చేసింది. విలేజ్ లో వినాయకుడు సినిమాలో ఓ వేషం కూడా వేసింది. 
పైంటింగులు వేస్తుంది. రకరకాలైన కొలాజ్ లు చేస్తుంది. వాళ్ళిల్లు ఓ మంచి ఆహ్లాదకరమైన మ్యుజియంలా వుంటుంది. ఎవరికైనా సాయం కావాలంటే ముందుండేది రాధికే. చాలా సమర్ధురాలు. అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకుంది. రాధిక భర్త సతీష్ కూడా మా కజినే. మా చిన్నమ్మమ్మ మనవడు. ఇక హరి, చిన్నప్పట్నుంచీ హరి అల్లరికి పెట్టింది పేరు. దేవుడు సరిగ్గా వాడికి అలాంటి పిల్లవాణ్నే, సిద్ధార్ధ ని ఇచ్చాడు, బహుశా వాడు తన చిన్నప్పటి అల్లరిని చూడలేకపోయాడని దేవుడు ఈ అరెంజ్ మెంట్ చేసి ఉంటాడు. మళ్ళీ వాడి భార్య లలిత చాలా నిదానం, మంచి పిల్ల. మా పిన్నికి మంచి కోడలు లలిత. హరి కూడా పాటలు బాగా పాడతాడు. కానీ నాలానే చాలా బద్ధకస్తుడు. సాధన చేయడు. అందుకే ఆ రంగంలో పేరు తెచ్చుకోలేక పోయాడు. కానీ తన బిజినెస్ తను బాగానే చేస్తున్నాడు. కంప్యూటర్ రంగంలో మంచి నాలెడ్జ్ వుంది. ప్రస్తుతం నండూరి పుస్తకం తయారు చెయ్యటంలో మా పార్ధు మామయ్యకి రైట్ హాండ్. 

28, జులై 2015, మంగళవారం

నండూరి కుటుంబం

నండూరి కుటుంబం

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                           అమ్మా వాళ్ళు మొత్తం పది మంది సంతానం అమ్మమ్మా, తాతయ్యలకి. అందరికంటే పెద్ద నరసింహారావు మామయ్య, మేము పెద్ద మామయ్యా అనే వాళ్ళం. ఆ అత్తయ్య గురించైతే అస్సలు గుర్తే లెదు. ఆ మామయ్యకి అందరూ ఆడపిల్లలే, అందరూ చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నవాళ్ళే. వాళ్ళ పేర్లు కూడా ఐదుగురికి నిర్మల అని పెట్టారు. గిరిజా నిర్మల, సరోజా నిర్మల, పద్మజా నిర్మల, మధు నిర్మల, నిర్మలా దేవి, విజయ సుమిత్ర, అలమేలు మంగ, ఇవీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు. ఎందుకో ఈ కుటుంబం వాళ్ళు అందరితో కలవటం తక్కువ. వాళ్ళల్లో మంచి రచయిత్రులు, డాన్సర్లు, గాయకులూ, నటులు వున్నారు. 

                              రెండో మామయ్యే, నండూరి రామమోహనరావు గారు, పరిచయం అక్కర్లేని మనిషి. ఆయన ఎన్నో భావకవితలు, విశ్లేషణాత్మక వ్యాసాలూ, వివరణాత్మక రచనలు, అద్భుతమైన సంపాదకీయాలు, మరెన్నో అనువాదాలు రచించాడు, ఇవ్వన్నీ ఒక ఎత్తు, ఆయన తెలుగులో మొట్టమొదటి సారి రాసిన సైన్స్ రచనలు ఒక ఎత్తు. "దశావతారాల గురించి ఎందరో రాసారు, నరావతారం గురించి నేను రాస్తాను" అని 'నరావతారం' పుస్తకం రాసిన మనిషి. విశ్వరూపం, విశ్వదర్శనం ఆయనవే. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. వాళ్ళ పెద్దనాన్న నండూరి శివరావు గారి తరువాత కుటుంబం లో మొదటి రచయిత. చాలా బావుండేవాడు, మా అమ్మమ్మ లాగే నాజూగ్గా ఉండేవాడు. సన్నని గొంతుతో చక్కగా పాటలు పాడేవాడు. కాకపోతే, బతిమాలించుకుని, బతిమాలించుకుని పాడే నండూరి వంశసంప్రదాయాన్ని ఆయన కూడా బాగా నిలబెట్టేవాడు. ఎక్కడో ఆకాశంలో గాలిపటంలా కుటుంబానికి కీర్తిపతాకలా  ఉండే వ్యక్తి, మా అందరిమీదా ఆపేక్షతో, ఆ గాలిపటం దారం గుండా కిందికి దిగి వచ్చి మమ్మల్నందరినీ ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా పలకరించి మళ్ళీ తన రచనా సామ్రాజ్యానికి వెళ్లిపోయేవాడు. ఎప్పుడూ మా మోహనం మామయ్యని మోహనమైన నవ్వుతోనే గాని, కోపంగా ఏనాడూ చూడలేదు. వాళ్ళ పిల్లలు కృష్ణ ప్రసాదు, సత్యవతి కొన్నాళ్ళు మా ఇంట్లో వుండి చదువుకున్నారు కూడా. సత్యవతి నాకన్నా ఓ ఏడాది పెద్దది, మేమిద్దరం చాలా స్నేహంగా వుండేవాళ్ళం. శేషశయనగారు దాన్ని చూసి ఇష్టపడి, ప్రేమించి, పెద్దలని అడిగి పెళ్లి చేసుకున్నారు. ఆయన ఈరోజుకీ దాన్నెంత బాగా చూసుకుంటారో. మంచి స్నేహశీలి. చాలా ఆప్యాయంగా వుంటారు, ఆనాటి స్నేహం ఇప్పటికీ మా మధ్య అలాగే వుంది. వాళ్ళ పిల్లలు శ్రీదేవి, శ్రీలతకూడా వాళ్ళ అమ్మ లాగానే చాలా ప్రేమగా వుంటారు. ఎలా వచ్చిందో అలవాటు తెలియదు కానీ, నన్ను 'అక్కా' అంటారు, నేనేమో వరసకి అత్తని. ఇద్దరూ మంచి పిల్లలు. తరువాత నిర్మల, శకుంతల, ఫణి. నేను  కథలు రాస్తే, నిర్మల కవితలు రాసేది. నేను ఉద్యోగ జంజాటంలో పడి కథలు రాయటం ఆపేస్తే, నిర్మల సంసార జంజాటంలో పడి కవితలు రాయటం మానేసింది. నేను మళ్ళీ ప్రారంభించినట్లే, అదీ మళ్ళీ రాయటం మొదలుపెడితే బాగుండు. మోహనంమామయ్యా, రాజేశ్వరత్తయ్యల పిల్లలందరూ చాలా అందంగా వుండేవారు. మా అత్తయ్యా, మామయ్యలిద్దరూ కూడా చాలా అందంగా వుండేవారు. చూడచక్కని జంట. మామయ్య ఎప్పుడూ తన రచనా లోకంలో వుంటే, అత్తయ్యే సంసార బాధ్యతలు అన్నీ చూసుకునేది. పిల్లల చదువులు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు వగైరా బాధ్యతలు అన్నీ అత్తయ్య ఒంటి చేత్తో చేసేది. 

                                        తరువాత మా హీరో, మల్లు మామయ్య, మల్లిఖార్జున రావు పూర్తి పేరు. ఆమామయ్య మా అందరితో ఖబుర్లు చెబుతూ సరదాగా ఉండేవాడు. బోల్డు గొప్పలు చెప్పేవాడు, కోతలు భలే కోసేవాడు, మా చిన్న పిల్లలకి అవి భలే సరదాగా ఉండేవి. కంచంలో ఏవీ పారేయకూడదు అనేవాడు. మా మల్లు మామయ్యని చూసి నేను నేర్చుకున్నది ఇదే, అన్నం పారేయకుండా తినటం. తరవాత తెలిసిందేమిటంటే మామయ్య కోతల్లో ఇది కూడా ఒకటి అని. కోతల సంగతి ఎలా వున్నా నాకు మాత్రం ఒక మంచి అలవాటు అబ్బింది. తెనాల్లో మా ఇంట్లోనే వుండి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ ప్రెమీమండలిలో హిందీ ప్రచారక్ కోర్సు చదివేవాడు. ఆ కోర్సులో భాగంగా మేము చదివే తాలుకా జూనియర్ కాలేజీకి కూడా వచ్చి మాకు స్కూల్లో హిందీ పాఠాలు చెప్పేవాడు. ఈ ట్రైనీలు వస్తే మాకు చాలా సరదాగా వుండేది. పాఠాలు కొత్త పద్ధతుల్లో, మాకు అర్థం కాకపోయినా సరే, హిందీలో మాత్రమే మాట్లాడుతూ పాఠాలు చెప్పేవారు. రోజూ హోం వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎంత మంచి వాళ్ళో, మర్నాడు అది మేం చేసామా, లేదా అని మాత్రం చూసేవాళ్ళు కాదు. హొమ్ వర్క్ ఎగ్గొట్టటం మా పిల్లలందరికీ మహా సంతోషంగా వుండేది, కాకపోతే నోట్సు రాసుకోమని చంపేవాళ్ళు. ఆ అత్తయ్య సువర్చల.ఇద్దరు పిల్లలు, శారద, రవి. ఇద్దరికీ ఇద్దరిద్దరు పిల్లలు. వీళ్ళు పూర్తిగా విజయవాడలోనే ఉండటంతో వాళ్ళ అమ్మాయి, అబ్బాయిలతో  అంత చనువు లేదు. అప్పటికే మేం తెనాలి వదిలి సంబల్ పూర్ వెళ్లిపోయాం. వాళ్ళు బెజవాడ లోనే వుండేవాళ్ళు. ఇందుమతి ఆమ్మా(మా చిన్నమ్మమ్మ కూతురు, మా అమ్మ కజిన్, చాలా మంచి ఆవిడ, చాలా క్లోజ్ గా, స్నేహంగా వుండేది అందరితో, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సాయం చేసేది. తరువాత మా తరంలో కూడా మా మధ్య ఆ దగ్గరితనం వుంది ఇంకా) వాళ్ళ ఇండియన్ మెడిసిన్ హౌస్ లో పనిచేసేవాళ్ళు. రవి భార్య ప్రశాంతి కలుపుగోలు మనిషి. వాళ్లకు ఒక అబ్బాయి జయదేవ్, ఒక అమ్మాయి, గీతిక. తరువాతి తరానికి నండూరి ఇంటిపేరుకి చిన్నారి ప్రతినిధి. శారద భర్త పేరు రామచంద్ర ప్రభు, పిల్లలు నాగలక్ష్మి, లక్ష్మీ నరసింహారావు.  

                                              ఆతరువాత మా మురళి మామయ్య. నండూరి మురళీకృష్ణ, మా నాన్న కంటే కొంచం చిన్న, మా అందరికీ మా నాన్న తరవాత నాన్నంత చనువు, ఇష్టం. మామయ్యా ఆల్ ఇండియా రేడియో లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. రేడియో నాటకాలు వేసేవాడు. కొన్ని సినిమాల్లో కూడా వేషాలు వేశాడు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, జైజవాన్ సినిమాల్లో మంచి పాత్రలే వేసాడు. ఎందుకో తానే తరవాత వద్దనుకుని మానేశాడు. ఆ అత్తయ్య, మీనాక్షి, కూడా అందరితో బాగా కలిసిపోయేది. ఎంతో ప్రేమగా, మరెంతో బాధ్యతగా వుండేది. అసలు పద్ధతులు, బాధ్యతలకి  ఈ మామయ్య, అత్తయ్య నెంబర్ వన్. ఇల్లు ఎంత బాగా శుభ్రంగా వుంచేదో. మా అమ్మ అయితే " మా మురళన్నయ్య ఇంట్లో కింద పాలు వలకబోస్తే ఎత్తచ్చు, అంత శుభ్రంగా ఉంచుతుంది మీనాక్షి" అనేది.  నా శుభ్రం కొంత మీనాక్షత్తయ్య నుంచి వస్తే, మిగిలింది మా ఉమాదేవి పిన్ని(మా సాంబుడు బాబాయి భార్య, వీళ్ళందరినీ నందివాడ కుటుంబంలో పరిచయం చేస్తాను) నుంచి వచ్చింది. పిల్లలని యెంత డిసిప్లిన్ తో పెంచేదో. ఈ అత్తయ్య నాకు ఈ విభాగంలో(పిల్లల్ని పెంచే విషయంలో) కూడా గురువు. రవి, రాజా, జ్యోతి. మంచి బుద్దిమంతులైన పిల్లలు. బంధువులందరూ ఈ పిల్లల్ని, వాళ్ళ మంచితనాన్ని, రెస్పాన్సిబిలిటీని గొప్పగా చెప్పుకుంటారు. ఐకమత్యంగా వుంటారు. జ్యోతి కూతుళ్లిద్దరూ మంచి టాలెంట్ వున్నవాళ్ళు. పెద్దది లలిత, మేమంతా ప్రేమగా లల్లి అంటాం, మంచి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. చిన్నది గాయత్రి, రోయింగ్ చేసేది, జూనియర్ నేషనల్ ఛాంపియన్  కూడా. పిల్లలిద్దరూ ఈ స్థితికి రావటానికి వెనక జ్యోతి, మూర్తీ  గార్ల పరిశ్రమ ఎంత వుందో. సత్యనారాయణమూర్తి గారు కూడా ఒక మంచి తమ్ముడులాగా ఉంటారు. రవి భార్య వసంత చాలా క్రియేటివ్, బాగా పెయింటింగ్స్ వేస్తుంది, నేర్పిస్తుంది, వాళ్ళ అమ్మాయ్ అమూల్య కూడా వాళ్ళ అమ్మ లాగానే మంచి ఆర్టిస్ట్. రాజా అసలు పేరు సత్యనారాయణ, మా తాతయ్య పేరు, కానీ మాకందరికీ రాజా అంటేనే అర్థం అవుతుంది. రాజా భార్య సునీత కూడా చాలా మంచిది, కామ్ గా వుంటుంది. వాడు జంషెడ్పూర్ లో పనిచేసేటప్పుడు అంటార్కిటిక్ ఎక్స్ పెడిషన్ టీం లో సెలెక్ట్ అయి అంటార్కిటికా వెళ్లి వచ్చాడు. వాళ్ళ అబ్బాయ్ విష్ణు తరవాత తరం లో నండూరి వంశానికి ఏకైక ప్రతినిధి, మల్లు మామయ్య మనవడు జయదేవ్ పుట్టిందాకా.   

                                                          ఆ తరువాత మా సీతామ్మ. వీళ్ళదీ పూర్తిగా సంగీత విద్వాంసుల కుటుంబం. పెద్దది మహాలక్ష్మి చక్కగా పాడుతుంది, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. రెండోది శశికళ వయొలిన్ వాయించేది. మా ఇంట్లో శశికళే మొట్టమొదట కంప్యూటర్ సంబంధించిన జాబు చేసింది ఆంధ్రజ్యోతిలో. మూడోవాడు మోదుమూడి సుధాకర్, మా వివేక్ కంటే రెండు, మూడు నెలలు పెద్దవాడు. గొప్ప సంగీత విద్వాంసుడు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తున్నాడు. సుధాకర్ భార్య అంజన, కూతురు శృతి కూడా చాలా బాగా పాడతారు. అసలు ఆ జీన్స్ మాసీతామ్మ, మాపెదనాన్నగారివి. సోమశేఖరరావు పెద్దనాన్నగారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి (మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గురువు)  మేనల్లుడు. మా ఆమ్మ కూడా బాగా పాడుతుంది. చాలా మృదువైన, మధురమైన కంఠం, షరా మామూలుగా తక్కువగా పాడేది.(లేకపోతే నండూరి వంశ సంప్రదాయం ఏమైపోతుంది?) ఎంతో నెమ్మదిగా, మంచిగా మాట్లాడుతుంది. ఎంత నిదానమో, వేదాంతం, విశ్లేషణ, ఆలోచన యెక్కువ. ఆవిడ ఒక ముడి వజ్రం, ఎవరూ సాన పట్టలేదు. కానీ సహజ ప్రకాశం తళుకులీనుతూనే వుంటుంది. మా అమ్మకి వాళ్ళ అక్కంటే  చాలా ఇష్టం. మా అమ్మా, ఆమ్మా కలిస్తే రోజులకి రోజులు తిండీ నీళ్ళూ లేకుండా ఖబుర్లు చెప్పుకునే వాళ్ళు, ఎక్కువగా వేదాంత చర్చే. శంకరాభరణం సినిమా లో శంకరశాస్త్రిగారి ఇల్లులాగా వీళ్ళింట్లో ఏమూల చూసినా, ఏ గోడ తాకినా, ఏం ముట్టుకున్నాసంగీతమే. ఇంత గొప్ప విద్వాంసులు మా వాళ్ళేనంటే నాతల ఓ నాలుగించీలు పైకి లేస్తూ వుంటుంది.

                                                                 వీళ్లంతా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు. మా అమ్మ కన్నా చిన్నవాళ్లు గురించి తరువాతి పోస్ట్ లో చెపుతాను.