నండూరి కుటుంబం
భట్టిప్రోలు విజయలక్ష్మి
అమ్మా వాళ్ళు మొత్తం పది మంది సంతానం అమ్మమ్మా, తాతయ్యలకి. అందరికంటే పెద్ద నరసింహారావు మామయ్య, మేము పెద్ద మామయ్యా అనే వాళ్ళం. ఆ అత్తయ్య గురించైతే అస్సలు గుర్తే లెదు. ఆ మామయ్యకి అందరూ ఆడపిల్లలే, అందరూ చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నవాళ్ళే. వాళ్ళ పేర్లు కూడా ఐదుగురికి నిర్మల అని పెట్టారు. గిరిజా నిర్మల, సరోజా నిర్మల, పద్మజా నిర్మల, మధు నిర్మల, నిర్మలా దేవి, విజయ సుమిత్ర, అలమేలు మంగ, ఇవీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు. ఎందుకో ఈ కుటుంబం వాళ్ళు అందరితో కలవటం తక్కువ. వాళ్ళల్లో మంచి రచయిత్రులు, డాన్సర్లు, గాయకులూ, నటులు వున్నారు.
రెండో మామయ్యే, నండూరి రామమోహనరావు గారు, పరిచయం అక్కర్లేని మనిషి. ఆయన ఎన్నో భావకవితలు, విశ్లేషణాత్మక వ్యాసాలూ, వివరణాత్మక రచనలు, అద్భుతమైన సంపాదకీయాలు, మరెన్నో అనువాదాలు రచించాడు, ఇవ్వన్నీ ఒక ఎత్తు, ఆయన తెలుగులో మొట్టమొదటి సారి రాసిన సైన్స్ రచనలు ఒక ఎత్తు. "దశావతారాల గురించి ఎందరో రాసారు, నరావతారం గురించి నేను రాస్తాను" అని 'నరావతారం' పుస్తకం రాసిన మనిషి. విశ్వరూపం, విశ్వదర్శనం ఆయనవే. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. వాళ్ళ పెద్దనాన్న నండూరి శివరావు గారి తరువాత కుటుంబం లో మొదటి రచయిత. చాలా బావుండేవాడు, మా అమ్మమ్మ లాగే నాజూగ్గా ఉండేవాడు. సన్నని గొంతుతో చక్కగా పాటలు పాడేవాడు. కాకపోతే, బతిమాలించుకుని, బతిమాలించుకుని పాడే నండూరి వంశసంప్రదాయాన్ని ఆయన కూడా బాగా నిలబెట్టేవాడు. ఎక్కడో ఆకాశంలో గాలిపటంలా కుటుంబానికి కీర్తిపతాకలా ఉండే వ్యక్తి, మా అందరిమీదా ఆపేక్షతో, ఆ గాలిపటం దారం గుండా కిందికి దిగి వచ్చి మమ్మల్నందరినీ ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా పలకరించి మళ్ళీ తన రచనా సామ్రాజ్యానికి వెళ్లిపోయేవాడు. ఎప్పుడూ మా మోహనం మామయ్యని మోహనమైన నవ్వుతోనే గాని, కోపంగా ఏనాడూ చూడలేదు. వాళ్ళ పిల్లలు కృష్ణ ప్రసాదు, సత్యవతి కొన్నాళ్ళు మా ఇంట్లో వుండి చదువుకున్నారు కూడా. సత్యవతి నాకన్నా ఓ ఏడాది పెద్దది, మేమిద్దరం చాలా స్నేహంగా వుండేవాళ్ళం. శేషశయనగారు దాన్ని చూసి ఇష్టపడి, ప్రేమించి, పెద్దలని అడిగి పెళ్లి చేసుకున్నారు. ఆయన ఈరోజుకీ దాన్నెంత బాగా చూసుకుంటారో. మంచి స్నేహశీలి. చాలా ఆప్యాయంగా వుంటారు, ఆనాటి స్నేహం ఇప్పటికీ మా మధ్య అలాగే వుంది. వాళ్ళ పిల్లలు శ్రీదేవి, శ్రీలతకూడా వాళ్ళ అమ్మ లాగానే చాలా ప్రేమగా వుంటారు. ఎలా వచ్చిందో అలవాటు తెలియదు కానీ, నన్ను 'అక్కా' అంటారు, నేనేమో వరసకి అత్తని. ఇద్దరూ మంచి పిల్లలు. తరువాత నిర్మల, శకుంతల, ఫణి. నేను కథలు రాస్తే, నిర్మల కవితలు రాసేది. నేను ఉద్యోగ జంజాటంలో పడి కథలు రాయటం ఆపేస్తే, నిర్మల సంసార జంజాటంలో పడి కవితలు రాయటం మానేసింది. నేను మళ్ళీ ప్రారంభించినట్లే, అదీ మళ్ళీ రాయటం మొదలుపెడితే బాగుండు. మోహనంమామయ్యా, రాజేశ్వరత్తయ్యల పిల్లలందరూ చాలా అందంగా వుండేవారు. మా అత్తయ్యా, మామయ్యలిద్దరూ కూడా చాలా అందంగా వుండేవారు. చూడచక్కని జంట. మామయ్య ఎప్పుడూ తన రచనా లోకంలో వుంటే, అత్తయ్యే సంసార బాధ్యతలు అన్నీ చూసుకునేది. పిల్లల చదువులు, ఆరోగ్యాలు, పెళ్ళిళ్ళు వగైరా బాధ్యతలు అన్నీ అత్తయ్య ఒంటి చేత్తో చేసేది.
తరువాత మా హీరో, మల్లు మామయ్య, మల్లిఖార్జున రావు పూర్తి పేరు. ఆమామయ్య మా అందరితో ఖబుర్లు చెబుతూ సరదాగా ఉండేవాడు. బోల్డు గొప్పలు చెప్పేవాడు, కోతలు భలే కోసేవాడు, మా చిన్న పిల్లలకి అవి భలే సరదాగా ఉండేవి. కంచంలో ఏవీ పారేయకూడదు అనేవాడు. మా మల్లు మామయ్యని చూసి నేను నేర్చుకున్నది ఇదే, అన్నం పారేయకుండా తినటం. తరవాత తెలిసిందేమిటంటే మామయ్య కోతల్లో ఇది కూడా ఒకటి అని. కోతల సంగతి ఎలా వున్నా నాకు మాత్రం ఒక మంచి అలవాటు అబ్బింది. తెనాల్లో మా ఇంట్లోనే వుండి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళ ప్రెమీమండలిలో హిందీ ప్రచారక్ కోర్సు చదివేవాడు. ఆ కోర్సులో భాగంగా మేము చదివే తాలుకా జూనియర్ కాలేజీకి కూడా వచ్చి మాకు స్కూల్లో హిందీ పాఠాలు చెప్పేవాడు. ఈ ట్రైనీలు వస్తే మాకు చాలా సరదాగా వుండేది. పాఠాలు కొత్త పద్ధతుల్లో, మాకు అర్థం కాకపోయినా సరే, హిందీలో మాత్రమే మాట్లాడుతూ పాఠాలు చెప్పేవారు. రోజూ హోం వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎంత మంచి వాళ్ళో, మర్నాడు అది మేం చేసామా, లేదా అని మాత్రం చూసేవాళ్ళు కాదు. హొమ్ వర్క్ ఎగ్గొట్టటం మా పిల్లలందరికీ మహా సంతోషంగా వుండేది, కాకపోతే నోట్సు రాసుకోమని చంపేవాళ్ళు. ఆ అత్తయ్య సువర్చల.ఇద్దరు పిల్లలు, శారద, రవి. ఇద్దరికీ ఇద్దరిద్దరు పిల్లలు. వీళ్ళు పూర్తిగా విజయవాడలోనే ఉండటంతో వాళ్ళ అమ్మాయి, అబ్బాయిలతో అంత చనువు లేదు. అప్పటికే మేం తెనాలి వదిలి సంబల్ పూర్ వెళ్లిపోయాం. వాళ్ళు బెజవాడ లోనే వుండేవాళ్ళు. ఇందుమతి ఆమ్మా(మా చిన్నమ్మమ్మ కూతురు, మా అమ్మ కజిన్, చాలా మంచి ఆవిడ, చాలా క్లోజ్ గా, స్నేహంగా వుండేది అందరితో, ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సాయం చేసేది. తరువాత మా తరంలో కూడా మా మధ్య ఆ దగ్గరితనం వుంది ఇంకా) వాళ్ళ ఇండియన్ మెడిసిన్ హౌస్ లో పనిచేసేవాళ్ళు. రవి భార్య ప్రశాంతి కలుపుగోలు మనిషి. వాళ్లకు ఒక అబ్బాయి జయదేవ్, ఒక అమ్మాయి, గీతిక. తరువాతి తరానికి నండూరి ఇంటిపేరుకి చిన్నారి ప్రతినిధి. శారద భర్త పేరు రామచంద్ర ప్రభు, పిల్లలు నాగలక్ష్మి, లక్ష్మీ నరసింహారావు.
ఆతరువాత మా మురళి మామయ్య. నండూరి మురళీకృష్ణ, మా నాన్న కంటే కొంచం చిన్న, మా అందరికీ మా నాన్న తరవాత నాన్నంత చనువు, ఇష్టం. మామయ్యా ఆల్ ఇండియా రేడియో లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. రేడియో నాటకాలు వేసేవాడు. కొన్ని సినిమాల్లో కూడా వేషాలు వేశాడు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు, జైజవాన్ సినిమాల్లో మంచి పాత్రలే వేసాడు. ఎందుకో తానే తరవాత వద్దనుకుని మానేశాడు. ఆ అత్తయ్య, మీనాక్షి, కూడా అందరితో బాగా కలిసిపోయేది. ఎంతో ప్రేమగా, మరెంతో బాధ్యతగా వుండేది. అసలు పద్ధతులు, బాధ్యతలకి ఈ మామయ్య, అత్తయ్య నెంబర్ వన్. ఇల్లు ఎంత బాగా శుభ్రంగా వుంచేదో. మా అమ్మ అయితే " మా మురళన్నయ్య ఇంట్లో కింద పాలు వలకబోస్తే ఎత్తచ్చు, అంత శుభ్రంగా ఉంచుతుంది మీనాక్షి" అనేది. నా శుభ్రం కొంత మీనాక్షత్తయ్య నుంచి వస్తే, మిగిలింది మా ఉమాదేవి పిన్ని(మా సాంబుడు బాబాయి భార్య, వీళ్ళందరినీ నందివాడ కుటుంబంలో పరిచయం చేస్తాను) నుంచి వచ్చింది. పిల్లలని యెంత డిసిప్లిన్ తో పెంచేదో. ఈ అత్తయ్య నాకు ఈ విభాగంలో(పిల్లల్ని పెంచే విషయంలో) కూడా గురువు. రవి, రాజా, జ్యోతి. మంచి బుద్దిమంతులైన పిల్లలు. బంధువులందరూ ఈ పిల్లల్ని, వాళ్ళ మంచితనాన్ని, రెస్పాన్సిబిలిటీని గొప్పగా చెప్పుకుంటారు. ఐకమత్యంగా వుంటారు. జ్యోతి కూతుళ్లిద్దరూ మంచి టాలెంట్ వున్నవాళ్ళు. పెద్దది లలిత, మేమంతా ప్రేమగా లల్లి అంటాం, మంచి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. చిన్నది గాయత్రి, రోయింగ్ చేసేది, జూనియర్ నేషనల్ ఛాంపియన్ కూడా. పిల్లలిద్దరూ ఈ స్థితికి రావటానికి వెనక జ్యోతి, మూర్తీ గార్ల పరిశ్రమ ఎంత వుందో. సత్యనారాయణమూర్తి గారు కూడా ఒక మంచి తమ్ముడులాగా ఉంటారు. రవి భార్య వసంత చాలా క్రియేటివ్, బాగా పెయింటింగ్స్ వేస్తుంది, నేర్పిస్తుంది, వాళ్ళ అమ్మాయ్ అమూల్య కూడా వాళ్ళ అమ్మ లాగానే మంచి ఆర్టిస్ట్. రాజా అసలు పేరు సత్యనారాయణ, మా తాతయ్య పేరు, కానీ మాకందరికీ రాజా అంటేనే అర్థం అవుతుంది. రాజా భార్య సునీత కూడా చాలా మంచిది, కామ్ గా వుంటుంది. వాడు జంషెడ్పూర్ లో పనిచేసేటప్పుడు అంటార్కిటిక్ ఎక్స్ పెడిషన్ టీం లో సెలెక్ట్ అయి అంటార్కిటికా వెళ్లి వచ్చాడు. వాళ్ళ అబ్బాయ్ విష్ణు తరవాత తరం లో నండూరి వంశానికి ఏకైక ప్రతినిధి, మల్లు మామయ్య మనవడు జయదేవ్ పుట్టిందాకా.
ఆ తరువాత మా సీతామ్మ. వీళ్ళదీ పూర్తిగా సంగీత విద్వాంసుల కుటుంబం. పెద్దది మహాలక్ష్మి చక్కగా పాడుతుంది, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. రెండోది శశికళ వయొలిన్ వాయించేది. మా ఇంట్లో శశికళే మొట్టమొదట కంప్యూటర్ సంబంధించిన జాబు చేసింది ఆంధ్రజ్యోతిలో. మూడోవాడు మోదుమూడి సుధాకర్, మా వివేక్ కంటే రెండు, మూడు నెలలు పెద్దవాడు. గొప్ప సంగీత విద్వాంసుడు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తున్నాడు. సుధాకర్ భార్య అంజన, కూతురు శృతి కూడా చాలా బాగా పాడతారు. అసలు ఆ జీన్స్ మాసీతామ్మ, మాపెదనాన్నగారివి. సోమశేఖరరావు పెద్దనాన్నగారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి (మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గురువు) మేనల్లుడు. మా ఆమ్మ కూడా బాగా పాడుతుంది. చాలా మృదువైన, మధురమైన కంఠం, షరా మామూలుగా తక్కువగా పాడేది.(లేకపోతే నండూరి వంశ సంప్రదాయం ఏమైపోతుంది?) ఎంతో నెమ్మదిగా, మంచిగా మాట్లాడుతుంది. ఎంత నిదానమో, వేదాంతం, విశ్లేషణ, ఆలోచన యెక్కువ. ఆవిడ ఒక ముడి వజ్రం, ఎవరూ సాన పట్టలేదు. కానీ సహజ ప్రకాశం తళుకులీనుతూనే వుంటుంది. మా అమ్మకి వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం. మా అమ్మా, ఆమ్మా కలిస్తే రోజులకి రోజులు తిండీ నీళ్ళూ లేకుండా ఖబుర్లు చెప్పుకునే వాళ్ళు, ఎక్కువగా వేదాంత చర్చే. శంకరాభరణం సినిమా లో శంకరశాస్త్రిగారి ఇల్లులాగా వీళ్ళింట్లో ఏమూల చూసినా, ఏ గోడ తాకినా, ఏం ముట్టుకున్నాసంగీతమే. ఇంత గొప్ప విద్వాంసులు మా వాళ్ళేనంటే నాతల ఓ నాలుగించీలు పైకి లేస్తూ వుంటుంది.
వీళ్లంతా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు. మా అమ్మ కన్నా చిన్నవాళ్లు గురించి తరువాతి పోస్ట్ లో చెపుతాను.
వీళ్లంతా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు. మా అమ్మ కన్నా చిన్నవాళ్లు గురించి తరువాతి పోస్ట్ లో చెపుతాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి