పంచాంగము అంటే ఏమిటి ?
మూడవది నక్షత్రం: ఇవి మొత్తం 27. కొద్దిసేపు మాత్రమే వుండే అభిజిత్ తో కలిపి లెక్కిస్తే, వీటి సంఖ్య 28. అభిజిత్ సంగతి ఏమో కానీ మిగిలిన 27 నక్షత్రాలూ చాలామందికి తెలుసు. కనుక 27 నక్షత్రములు అశ్వని నుంచి రేవతి వరకు + అభిజిత్. వీరు అందరూ దక్ష ప్రజాపతి పుత్రికలు, చంద్రుని భార్యలు. వీరి వలననే చంద్రునికి వృద్ధి క్షయాలు వచ్చాయి. వీరిలో చంద్రునికి రోహిణీ అంటే ఎంతో ఇష్టం. మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసిన దక్షుడు చంద్రుణ్ణి క్షయ వ్యాధితో కృశించమని శపించాడు. అది తెలిసి నక్షత్రాలన్నీ శోకించాయి. అప్పుడు శివుడు ఆ దక్షశాపాన్ని కొంచెం సవరించి చంద్రుడికి ఒక పక్షం రోజులు పెరుగుతూ ఉండేలాగా, మరొక పక్షంరోజులు తరుగుతూ ఉండేలా చేసి, ఆ చంద్రకళను తలమీద పెట్టుకుని చంద్రశేఖరుడు అయ్యాడు. అన్నట్టు పక్షాలు రెండు. ఒకటి శుక్ల లేదా శుద్ధ పక్షము అయితే, రెండవది కృష్ణ లేదా బహుళ పక్షము. శుక్లము అంటే తెలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ పెరుగుతూ పౌర్ణమికి పూర్తి చంద్రుడు తెల్లని కాంతితో ప్రకాశిస్తాడు. కృష్ణ అంటే నలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ తరుగుతూ అమావాస్యనాటికి పూర్తిగా నల్లగా చీకటి చంద్రుడు అయిపోతాడు.
నాలుగవది యోగము: వీటి గురించి చాలామందికి తెలియదు. ఇవి మొత్తం 27. ఏ సమయంలో ఏ యోగము ప్రభావం చూపిస్తుందో ఇది చెపుతుంది. విష్కంభము నుంచి వైధృతి వరకూ ఇవి 27. పేర్లు చెప్పటం లేదు అవి ఎక్కడైనా దొరుకుతాయి.
అయిదవది కరణము : ఇవి కూడా చాలామందికి తెలియవు. ఇవి మొత్తం 11. బవ కరణము నుంచి కింస్తుఘ్నము అనే కరణము వరకు ఇవి మొత్తం 11. ఇవి వాటి ప్రభావంతో ప్రజలకు యోగాలు కలిగించేందుకు కారణమవుతాయి. ఈ అయిదూ కాక కాలాన్ని లెక్కించటానికి ఇంకా చాలా కొలమానాలు వున్నాయి.
3 సంధ్యలు: సూర్యోదయం, అపరాహ్ణము, సూర్యాస్తమయం. త్రిసంధ్యలలోనూ జపాలు, స్తోత్ర పఠనాలు ఎంతోమంది చేస్తూ వుంటారు. గాయత్రి జపాన్ని సంధ్యావందనము అని అందుకే అంటారు.
2 పూటలు: పగలు, రాత్రి, దివారాత్రాలు. వీటికి సూర్యుడు, చంద్రుళ్లు అధిపతులు.
1 దినము: ఒక సూర్యోదయం ఒక దినానికి లెక్క. ఏ రోజు సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటుందో, ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం.
4 యుగములు: కృత, త్రేతా, ద్వాపర. కలియుగాలు. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. సంకల్పంలో చెప్పుకుంటాం కదా కలియుగే, ప్రధమ పాదే అని. సంకల్పం అంటే కేవలం మామూలుగా మన జియో పొజిషన్, మన అప్పుడు వున్న కాల వివరం, మన నామ గోత్ర వివరాలు చెప్పుకోవటం మాత్రమే.
60 సంవత్సరములు: ప్రభవ నుంచి అక్షయ వరకు ఇవి మొత్తం అరవై. ఏ సంవత్సరం ఏ పేరు మీద ఉందో ఆ ఫలితమే ఆ సంవత్సరం ఉంటుంది. వికారి ఎంత వికారంగా ఉందో చూసాం. శార్వరి ఎంత చీకటిగా ఉందో కూడా చూసాం. ప్లవ కొద్దిగా గట్టెక్కించిందని ఆనందపడ్డాం. ఇప్పుడు శుభకృత్ శుభాలని కలగచేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. శుభకృత్ అంటే అర్ధం శుభములను చేయునది అని. రాబోయే శోభకృత్ మనందరినీ శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది అని ఆనంద పడదాం.
ఈ పేర్ల వెనక ఓ పురాణ గాధ వుంది. ఒకసారి నారదుడికి, తానే గొప్ప విష్ణు భక్తుడననీ, తాను మాత్రమే విష్ణుమాయకు అతీతుడనీ ఓ అహంకారపూరిత భావం ఏర్పడింది. అప్పుడు నారదుడికిఆ అహంభావం తొలగించడానికి శ్రీమన్నారాయణుడు నారదుణ్ణి ఒక నది ఒడ్డుకి తీసుకువెళ్లి, ఆ నదిలో స్నానం చేయమని చెప్తాడు. నీళ్ళల్లో మునగగానే శ్రీమన్నారాయణుడు మాయం అయిపోయాడు. నారదుడు కాస్తా నారదిగా, అంటే స్త్రీ గా మారిపోయాడు. అటుగా పోతున్న ఆ దేశపు రాజు, అందంగా వున్న ఈ ఒంటరి సుందరిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరూ అలా కొన్నేళ్లపాటు సంసారం చేసి, అరవై మంది కొడుకులను కన్నారు. ఆ పిల్లల పేర్లే ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి నుంచి క్రోధన, అక్షయ. ఒకసారి ఇంకో దేశంతో జరిగిన యుద్ధంలో ఈ మొత్తం అరవై మంది నారద సంతానం, రాజుతో సహా మరణిస్తారు. నారదుడు తిరిగి ఆ నది ఒడ్డుకి వచ్చి శోకిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్లీ శ్రీమన్నారాయణుడు వచ్చి,"అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్, ఆ నదిలో దిగి స్నానం చేసి రా. నీ దుఃఖం పోతుంది" అని చెప్తాడు. నారదుడు తిరిగి నీటిలో మునగగానే ఆ స్త్రీ రూపం పోయి, మామూలు దేవఋషి రూపం వచ్చేస్తుంది. నారదుడు అప్పుడు విష్ణుమాయ శక్తిని గ్రహించి సిగ్గుపడి, నారాయణుడికి దాసోహం అంటాడు. కానీ పాపం తాను కన్న పిల్లల మీద ప్రేమ మాత్రం వదులుకోలేక పోతాడు. నారాయణుడికి చెప్పుకుంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, "నీ అరవై మంది పిల్లలూ సంవత్సరానికి ఒకరుగా వస్తూ పోతూ వుంటారు. వారు సంవత్సరాల రూపంలో చిరంజీవులుగా వుంటారు", అని వరం ఇస్తాడు. వారే మన సంవత్సరాలు. భాగవతం లోని ఈ శ్లోకం చూడండి.
ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్,
రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భగవతాన్ స్మరామి !
కనుక భక్తిలో నారదుడు కూడా, తన శిష్యుడైన ప్రహ్లాదుని కన్నా తరువాత స్థానంలో ఉంటాడు. ప్రహ్లాదుడు పసి పిల్లవాడు, నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడు. భక్తులలో ప్రథముడు.
6 ఋతువులు: వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం.
వసంతం --- చైత్రం, వైశాఖం మాసాల్లోనూ, గ్రీష్మం --- జ్యేష్టం, ఆషాఢం మాసాల్లోనూ, వర్షం --- శ్రావణం, భాద్రపదం మాసాల్లోనూ, శరత్తు --- ఆశ్వీయుజం, కార్తీకం మాసాల్లోనూ, హేమంతం --- మార్గశిరం, పుష్యం మాసాల్లోనూ, శిశిరం --- మాఘం, ఫాల్గుణం మాసాల్లోనూ వస్తుంది.
12 మాసములు: ఒక సంవత్సరంలో 12 మాసాలు, 12 సంక్రమణాలు వస్తాయి. మకర సంక్రమణం మాత్రం సంక్రాంతి పండుగగా ప్రసిద్ధి. ఏ నక్షత్రమైతే పూర్ణమికి చంద్రునికి దగ్గరగా ఉంటుందో, ఆ నక్షత్రం పేరు మీద ఆ మాసం పిలవబడుతుంది. ఉదాహరణకి అశ్విని నక్షత్రం పున్నమి నాడు చంద్రుడికి చేరువగా ఉంటే ఆ నెల ఆశ్వీయుజం. పూర్వాభాద్ర కానీ, ఉత్తరాభాద్ర కానీ పున్నమి రోజు చంద్రునికి దగ్గరగా ఉంటే ఆ మాసం భాద్రపదం.
వర్జ్యం: మనకందరికీ ఒక విషయం బాగా తెలుసు. సంవత్సరం అంటే ఖచ్చితంగా 365 రోజులు కాదు. ఒక రోజు అంటే, పూర్తిగా 24 గంటలు కావు అని. ఎంతో కొంత సమయం మిగిలిపోతుంది. అలా వదిలి వేయబడిన సమయాన్ని వర్జ్యం అంటారు. ఆ సమయం వదిలి వేశాం కనుక ఆ సమయంలో ఏ శుభకార్యాలూ చేయకూడదు. ఈ సమయాన్ని పరిగణన లోనికి తీసుకుని అంతర్జాతీయ గడియారాలని కూడా అప్పుడప్పుడు సవరిస్తూ వుంటారు.
దుర్ముహూర్తం: అలాగే 24 గంటలలో కొంత సమయం మంచిది కాదు , అప్పుడు ఏ యోగం, కరణం వగైరాలు యోగించవు. అటువంటి సమయాన్ని దుర్ముహూర్తంగా పరిగణించి ఆ సమయంలో కూడా ఏ శుభకార్యాలూ చేయరు.
ప్రదోషం: ఇది సరిగ్గా సూర్యాస్తమయానికి సుమారుగా ఒక అరగంట ముందు నుంచీ, ఒక అరగంటతరువాత దాకా ఉంటుంది. పూజలకు, జపాలకు ప్రశస్తమయిన కాలం. ఈ సమయంలో అభిషేకం చేసినా, దీపారాధన చేసినా ఎంతో మేలు.
24 గంటలు: ఆదివారం తరువాత సోమవారమే ఎందుకు రావాలి? బుధవారం ముందు రోజు మంగళవారమే ఎందుకు అయి ఉండాలి? అనే ప్రశ్న పిల్లలు వేస్తే, మనం ఏం సమాధానం చెప్పాలి. వారాలకు ఆ క్రమం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మన ప్రాచీన ఋషులు మానవాళికి అమర్చిపెట్టిన, కూర్చిపెట్టిన విజ్ఞాన భాండారం విప్పి చూద్దాం రండి. ఇప్పుడంటే గంటలు అంటున్నాం కానీ, మనం ఘడియలు, విఘడియలు అనేవాళ్ళం. కానీ అసలు సిసలు పదం హోర. మనమైతే మూర్ఖంగా ఈ పదం పూర్తిగా మర్చిపోయాం కానీ, పాశ్చాత్యులు మాత్రం, మన హోరలని Hours అని మార్చి ఎడాపెడా వాడేస్తున్నారు. వాళ్ళు Hours లో హ శబ్దం పలకరు, మన హోర పదంలో హ శబ్దాన్ని కూడా పలుకుతాం. అంటే తేడా. ఇప్పుడు హోర అంటే ఏమిటో, దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. రోజుకు 24 గంటలు, Hours, హోరలు. మనకున్న ఏడు వారాల గ్రహాలలోనూ వాటి గమన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వేగంగా వెళ్లే శనిగ్రహము మొదటి వాడు. మందంగా నడుస్తాడనే ఆయన్ని మందుడు అంటాం. తరువాత నెమ్మదస్తుడు, భారీ కాయుడు కనుక గురుడు, ఆ తరువాత కుజుడు అంటే మంగళుడు, తరువాత సూర్యుడు, ఆ పై శుక్రుడు, ఇంకాస్త వేగంగా బుధుడు, అందరికన్నా అతి వేగంగా చంద్రుడు వున్నారు. కనుక ఆ గ్రహాల గమన వేగపరంగా చూస్తే తక్కువ వేగం నుంచి ఎక్కువ వేగానికి ఆ క్రమం ఇది. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఇదే హోరా ఆర్డర్ --- శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఈ క్రమాన్ని గుర్తు పెట్టుకోండి. రోజుకి 24 గంటలు, 24 హోరాలు. గంటకి ఒకటి చొప్పున ఈ ఏడూ వరసగా తిరుగుతూ ఉంటాయి. అంటే రోజులో మొదటి ఏడు గంటలూ శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర ఇవి ఒక రౌండ్ తిరిగేస్తాయి. మళ్ళీ శని హోరా మొదలు. ఇలా 21 గంటలు అయిపోయాక మళ్ళీ శని, గురు, కుజ వస్తారు. ఆ తరువాత సూర్యుడు. అంటే రెండవరోజు మొదటి గంట సూర్యుడితో మొదలు అవుతుంది. మళ్ళీ లెక్కించండి. తిరిగి 25వ గంటకి చంద్రుడు వస్తాడు. గణితంలో దీన్ని MODULUS 7 అంటాం, సంగీతంలో సప్తస్వరాల లాగా. ఏ రోజు సూర్యోదయానికి ఏ గ్రహ హోరా ఉంటుందో ఆ రోజు ఆ వారం. ఆ ఆర్డర్ ని బట్టీ శనివారం తరువాత ఆదివారం, ఆదివారం తరువాత సోమవారం, ఆ తరువాత వరుసగా మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలు ఏర్పడతాయి. వేగాన్ని బట్టీ గ్రహాల క్రమం శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర అయితే, 24 హోరాల ఆర్డర్ లో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని మళ్ళీ ఆది వస్తాయి. ఎందుకంటే, ఆనాటి సూర్యోదయ సమయానికి ఆ హోరనే ఉంటుంది కనుక. ఈ హోరా సిద్ధాంతాన్ని మేము ఆధునికులం, పురోభివృద్ధి చెందిన వారం అని చెప్పుకునే వారంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆచరిస్తున్నారు. ఇంత గొప్ప గణిత, ఖగోళ, శాస్త్ర విజ్ఞానాన్ని మనకందించిన ఆ ఋషులందరికీ శిరసు వంచి వందనం చేస్తున్నాను. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు మొదలైన ఖగోళ గణిత ఋషులందరికీ పాదాభివందనం.
స్థూలంగా ఇదీ మన ఉగాది కథ, పంచాంగం కథ, కాలం కథ, కాలస్వరూపం కథ.
అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మీ భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650












