కంచి పీఠంతో సాంగత్యం
భట్టిప్రోలు విజయలక్ష్మి
తెనాలి తాలూకా హైస్కూల్ తో చక్కని అనుబంధం ఉన్న మరొక అద్వైత పీఠం కంచి కామకోటి పీఠం. ఈ పీఠం కూడా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చి స్కూల్లో విడిది చేసి, వచ్చే భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తూ ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ పీఠానికి అధిపతి ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, ఈయన్నే పెద్దస్వామి అని ఆ రోజుల్లో అనేవారు. ఆ తరువాత ఈ స్వామినే పరమాచార్య అని పిలిచేవారు. ఈ పీఠానికి ఆ రోజుల్లోనే మరొక చిన్నస్వామి కూడా ఉండేవారు. వారే శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. జయేంద్రులు కామకోటి పీఠానికి భావి పీఠాధిపతి. ఆ తరువాత రోజుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిని కూడా పరమాచార్యుల తరువాత మూడవ వారసునిగా ప్రకటించారు. సన్యాసదీక్ష తీసుకున్న తొలి రోజుల్లో ఈ విజయేంద్రులను చూడటం జరిగింది. బహుశా అప్పుడు అయన ఏడు, ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడు. ఈ పీఠం మాకు బాగా తెలిసిన సమయానికి పెద్దస్వామికి సుమారు 70 ఏళ్ళు, చిన్న స్వామికి 30 ఏళ్ళు ఉండేవి. తెనాలి స్కూల్ కి రెగ్యులర్ గా ఈ స్వాములిద్దరూ పీఠంతో తరలి వచ్చేవారు. పీఠం మామూలుగా సరస్వతీ విగ్రహం ఉన్న వేదిక మీదే పెట్టేవారు. మా నాన్నగారు ఎందుకో పెద్దస్వామికి ఇష్టులయ్యారు. మా నాన్నగారికి ఆ రోజుల్లో ఇదంతా కొత్త. అయినా ఆ స్కూల్ ఫిలాసఫీకి త్వరగానే అలవాటు పడిపోయారు.
పెద్దస్వామికి నడిచే దేవుడు అని పేరు. ఆయన ఎక్కడికి వెళ్లినా, నడిచి కానీ, లేదా మరీ అలసిపోయినప్పుడు పల్లకీలో కానీ వెళ్లేవారు. ఆయన చేతి తీర్ధం తీసుకోవటం అంటేనే అదో మహా అదృష్టంగా భావించేవారు అందరూ. ఎటువంటి కష్టాలూ, బాధలూ, రోగాలూ ఆ తీర్ధం వల్ల తొలగిపోతాయని నమ్మకం. ఎవరు ఏ పూలూ, రుద్రాక్షలూ, తులసి మాలలూ ఇచ్చినా వాటిని ఆయన తల మీద పెట్టుకునేవారు. ప్రతిరోజూ పూజ, తరువాత తీర్ధ, ప్రసాద వితరణ అయినాక ఒక్కోసారి కొద్దిసేపు ప్రవచనం కూడా ఇచ్చేవారు. ప్రతి సాయంకాలం మాత్రం తప్పనిసరిగా చాలాసేపు పెద్ద స్వామి ప్రవచనం ఇచ్చేవారు. ఒక్కోసారి చిన్నస్వామి కూడా ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ ప్రవచనాలన్నీ సాధారణంగా తెలుగులోనే ఉండేవి. వారి మాతృభాష తెలుగు కాకపోయినా భక్తులందరికీ చక్కగా అర్ధం అయ్యేలా ఈ ప్రవచనాలు ఉండేవి. ఆ రోజుల్లోనే స్వామివారి ప్రవచనాల పుస్తకాలు తెలుగులో జగద్గురు బోధలు అని చాలా పుస్తకాలు అమ్మేవారు. అవి ఎన్నో వాల్యూమ్స్ ఉండేవి. ఆ పుస్తకాలు మా ఇంట్లో చాలా ఏళ్ళు ఉండేవి. ఆ రోజుల్లో నాన్న నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఆయనకి తన పనుల్లో రోజూ స్వామివారి ప్రవచనాలు వినే ఛాన్స్ ఉండేది కాదు. నా పనేమిటంటే, రోజూ ఒక నోట్ బుక్ పెట్టుకుని స్వాములవారు చెప్తున్న విషయాల్లో నాకు ఏవి నచ్చాయో, ఏవి ముఖ్యం అనిపిస్తోందో అవి అన్నీ రాసి పెట్టటం. అలా చాలా రోజులు రాసాను. ఆ నోట్స్ నాన్న ఏం చేసాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. చిన్నపిల్లని నేను అలా నోట్స్ రాస్తుంటే, చుట్టుపక్కల పెద్దవాళ్ళు కొంతమంది నవ్వితే, కొంతమంది ఆశ్చర్యంగా చూసేవారు. నేను మాత్రం కొంచం లైట్ వచ్చే చోట పెద్ద పోజు పెట్టి మరీ రాసుకుంటూ ఉండేదాన్ని.
ఆ రోజుల్లో పెద్దస్వామి నాన్ననీ, మరికొంత మంది అకడమీషియన్స్ నీ, కొంతమంది డబ్బు దానం చేసేవాళ్ళనీ ఉత్సాహపరచి, ఒక కొత్త ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెరిపించారు. దాని పేరే వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్. నాన్నే దానికి ఫౌండర్ ప్రెసిడెంట్. మా ఇంటి ఓనర్ వేదాంతం కృష్ణప్రసాద్ గారు ఫౌండర్ కరస్పాండెంట్. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి, పనిచేసి, ఈ స్కూల్ ప్రారంభించారు. మా తమ్ముడు పేరు వివేకానంద్. వాడినే ఈ కొత్త వివేకానంద స్కూల్లో మొదటి విద్యార్థిగా నమోదు చేశారు. కృష్ణప్రసాద్ గారి అబ్బాయి, శరత్ ని మా తమ్ముడి వయసు వాడే, రెండవ విద్యార్థిగా నమోదు చేసారు. మా వివేక్ ఆ స్కూల్ మొదటి విద్యార్థిగా నమోదు చేయడానికి కారణం వాడిపేరూ, స్కూల్ పేరూ ఒకటే కావటం. అదో సరదా అంతే. కృష్ణప్రసాద్ గారు, నాన్నకి తమ్ముడల్లే ఉండేవారు. కాకపోతే ఆ స్కూల్ తెరిచాక మేము ఆ ఊళ్ళో కేవలం ఒక్క సంవత్సరమే ఉన్నాం. అక్కడి నుంచి నాన్నకి కొత్త జాబ్ వస్తే, ఒరిస్సా వెళ్లిపోయాం. కృష్ణప్రసాద్ గారే ఆ తరువాత ఆ స్కూల్ బాధ్యత తీసుకున్నారు.
కంచి స్వాములవారు సాధారణంగా ఎవరింటికి బిక్షకి వెళ్లేవారు కాదు. భక్తులే స్కూల్ కి వచ్చి పాదపూజలు చేసి, బిక్ష పెట్టేవారు. ఈ స్వామివారిది పెద్ద సిబ్బంది. ఆయన పీఠంతో పాటు ఏనుగులు కూడా వచ్చేవి. మా పిల్లలు సరదాగా రోజూ ఆ ఏనుగులు చూడటానికి వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజూ పొద్దున్నే పూజ చూడటం, పెద్ద స్వామివారి చేతిమీదుగా తీర్ధం, ప్రసాదం తీసుకోవటం, అప్పుడు ఇంటికి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ వచ్చి స్వామివారి ప్రవచనం వినటం, ఆ రోజుల్లో, ఇదే నా డైలీ ప్రోగ్రామ్. నిజాయితీగా చెప్పాలంటే, ఆ రోజుల్లో నేను చేసే ఏ పని విలువా నాకు తెలిసేది కాదు. పులుసులో గరిటకి పులుసు రుచి తెలియనట్టు.... ఏదో, ఆమ్మో, నాన్నో చెప్పారు, చేయాలి అంతే, మరో ఆలోచన ఉండేది కాదు. ఆ పనుల విలువ పెద్దయ్యాక తెలిసింది. అప్పుడే అమ్మా, నాన్నా కూడా ఒకసారి స్కూల్లోనే స్వాములవారికి పాదపూజ చేశారు. అలాంటి సందర్భాలలో ఒకసారి, నాన్న స్వాములవారిని మా ఇంటికి ఆహ్వానించారు. అప్పటికే నాన్న పెద్ద స్వాములవారితో మాటల్లో వాళ్ళ నాన్నగారు ఆనందరామయ్య గారు, చనిపోయే ముందు సన్యాసం తీసుకున్నారని, అలా ఈ సన్యాసం తీసుకోవటం అనే ఒక రివాజు మా కుటుంబాల్లో తరతరాలుగా వస్తోందనీ చెప్పారు. స్వాములవారికి ఆ విషయం చాలా విశేషంగా అనిపించిందో ఏమో, వెంటనే, "శర్మా, మీ ఇంటికి తప్పకుండా వస్తాను, వచ్చి ఓ పది రోజులు మీ ఇంట్లోనే పీఠం పెట్టి ఉంటాను. కానీ అది తెనాలిలో కాదు, మీ ఊరు, ఆరుగొలను వస్తాను. మీ ఇంట్లోనే ఉంటాను. ఏ ఇంట్లో మీ నాన్నగారు నివసించారో ఆ ఇంటికి వచ్చి పది రోజులుంటాను" అని చెప్పారు.
నాన్న ఆశ్చర్య పోయారు. అసలు స్వాములవారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి సాధారణంగా ఎవరింటికి రారు, అలాంటి స్వామి ఒక్కసారిగా పది రోజులుంటానని చెప్పేసరికి నాన్న తెల్లబోయారు, ఆనందపడ్డారు. నిజం చెప్పాలంటే, ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వాళ్ళ నాన్న వల్ల కదా ఇంత గొప్ప అవకాశం వచ్చిందని పొంగిపోయారు. స్వాములవారు ఒక్కసారి ఇంట్లో కాలు పెడితే చాలు అనుకునే స్థితి నుంచి ఒక్కసారిగా మా ఇంట్లో పీఠం పెట్టి, పది రోజులు ఉంటాననటం ఎంత గొప్ప అవకాశమో తెలిసి అమ్మా, నాన్నా ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. అసలు ఇలాంటి ఒక అరుదైన వరం స్వాములవారు ఇంతవరకూ ఎవరికైనా, ఇచ్చారో లేదో కూడా తెలియదు. విషయం తెలిసి కొందరు ఆశ్చర్యపోతే, కొందరు అసూయ పడ్డారు. ఇక అప్పటి నుంచీ నాన్నకు హడావుడి మొదలైంది. ఎందుకంటే, ఆరుగొలను వెళ్లి సుమారు పది ఏళ్ళు దాటింది. ఆ ఇల్లు ఏ స్థితిలో ఉందో తెలియదు. ఇంటికి వచ్చి విషయం బామ్మకి చెప్పారు. బామ్మకి కూడా స్వాములవారు ఆరుగొలను వాళ్ళింటికి వస్తాననటం గొప్పగా అనిపించింది. మామూలుగా బామ్మ ఎప్పుడూ స్వాములవార్ల సంగతుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేది కాదు. అటువంటిది నడిచే దేవుడు అని పేరున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి తన ఇంటికి వస్తానని అనటం ఆవిడనీ సంతోషపెట్టింది. అక్కడ ఇల్లు ఎలా ఉందో తెలియదు. పాతకాలం డాబా ఇల్లు. పైగా వదిలేసి ఏళ్ళు అయ్యింది. ప్రస్తుతం ఇదే సమస్య. బామ్మ అప్పుడు ఆఫర్ చేసింది. నేను ముందు వెళ్లి ఇల్లు బాగు చేయిస్తాను, అని. ఇక నాన్నకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఈ మాత్రం హెల్ప్ ఉంటే చాలు, మా నాన్న మిరకిల్స్ చేయగలడు. అప్పటి నుంచీ ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ప్లానింగ్ మొదలైంది. ఇవన్నీ తరువాత పోస్టులో చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి