26, జూన్ 2020, శుక్రవారం

పరమాచార్యుల ప్రసన్నదృష్టి

పరమాచార్యుల ప్రసన్నదృష్టి 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                      స్వాములవార్లు వచ్చేరోజుకి ఒక రోజు ముందరే అందరం ఆరుగొలను చేరుకున్నాం. ఇటు నందివాడ కుటుంబం నుంచీ, అటు నండూరి కుటుంబం నుంచీ దాదాపు అందరూ వచ్చారు. స్వాములవారికి  పూర్ణకుంభంతో  స్వాగతం చెప్పారు అమ్మా, నాన్నా. స్వాములవారితో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చారు.  బళ్ళూ, ఎడ్లూ, వాటిని నడిపే వాళ్ళూ, పల్లకీ, దాన్ని మోసే బోయీలూ, ఒక ఏనుగూ, దాని మావటీ వచ్చారు. వీళ్ళే కాక, వేదపండితులూ, పూజారులూ, సేవకులూ, వంట బ్రాహ్మణులూ, వీళ్లంతా కూడా వచ్చారు. ఇంతమందికీ నాన్నా వాళ్ళ ఇల్లే విడిది. దాన్నే మేము ఓ నెల క్రితం బాగు చేయించింది. సుమారు ఓ 50, 60 మంది అక్కడ దిగారు. స్వామివారు వస్తూనే పీఠం పెట్టారు. స్వాములవారికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. పది రోజులు ఉన్నారు ఆరుగొలనులో పీఠంతో సహా స్వామీజీ. ఆ పది రోజులు ఊరంతా జాతరే జాతర. రోజూ పూజలూ, తీర్థాలూ, ప్రసాదాలూ, ప్రవచనాలూ కోలాహలంగా సాగింది. మొదటి పాడుపడిన ఇంటికి, ఇప్పుడు సందడిగా ఉన్న ఇంటికి పోలికే లేదు. పరమాచార్యుల పాదం పడి ఆ ఇంటికి చక్కటి కళ వచ్చింది. 

   

శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి

                                                   చిన్నస్వామి జయేంద్ర సరస్వతి స్వామివారు కూడా వచ్చారు. మా తాతయ్య సత్యనారాయణ గారు వెళ్లి స్వామివారిని తన ఇంటికి కూడా ఒకసారి రమ్మని పిలిచారు. కానీ స్వామివారు తాను రాలేననీ, చిన్న స్వామిని పంపిస్తానని, జయేంద్ర సరస్వతిని పంపించారు. అప్పుడు అందరూ ఆయనకి పాదాభివందనం చేసాం. ఇక్కడ జయేంద్ర సరస్వతిని గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ స్వామికి వివేకానందుని వలె దేశం గురించీ, ధర్మం గురించీ, మతం గురించీ ఎన్నో ప్రశ్నలూ, మరెన్నో ఆలోచనలూ ఉండేవనుకుంటా. చివరికి శంకర విజయేంద్ర సరస్వతిని బాలస్వామిగా ప్రకటించాక 1987 లో ఎవరికీ చెప్పకుండా, చివరికి పరమాచార్యుల వారికి కూడా తెలియకుండా నిశ్శబ్దంగా, ఒక రకంగా సన్న్యాసాన్ని కూడా సన్యసించి తలకావేరి, కావేరీనదీ జన్మస్థానం, చేరుకొని అంతర్ముఖులై తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఈ లోపల పరమాచార్య చెప్పగా మఠం నుంచి పండితులు వచ్చి జయేంద్రులని ఒప్పించి కంచికి తీసుకువచ్చారు. ఇద్దరు ఆచార్యులూ కూర్చుని చర్చలు జరిపారు. గురువుల మాటని గౌరవించి తిరిగి పీఠం బాధ్యతలు స్వీకరించారు జయేంద్రులు. మరోసారి 1991 లో జయేంద్రులని తిరుమలలో కలిసాను. నేను M.Ed. క్లాసుల కోసం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కూడా వెళ్లాను. అలా తిరుమల వెళ్ళినప్పుడు కంచి స్వామి అక్కడే ఉన్నారని తెలిసి వెళ్లి దర్శనం చేసుకున్నా. అప్పుడు వారికి ఆరుగొలను గురించి గుర్తు చేసాను. నవ్వి  అక్కడ  ఉన్న అందరికీ ఆయన  "మేము వీళ్ళ ఊరికి వెళ్లాం" అని చెప్పారు.


     

      జయేంద్ర సరస్వతీ స్వామి                    శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి 
                                                     
                                             సాయంత్రం పూట స్వామివార్ల కోసం హరికథలూ, పురాణ కాలక్షేపాలూ, పౌరాణిక, చారిత్రిక నాటకాల ప్రదర్శనలూ నిత్యం జరిగేవి. ఊర్లో అందరూ తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. స్వామివారు వారికి ఏ జపమో, పూజో చెప్పేవారు. ఊర్లో అందరూ నాన్నని ఆరాధనగా, గర్వంగా చూసేవారు. మేము సుమారు 50, 60 మంది అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. భోజనాలన్నీ స్వాములవారి తోనే. నడిచే దేవుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతి మా ఊరంతా నడిచే తిరిగారు. ఆరుగొలనులో చెరువుని చూసి, "ఈ చెరువులో ఎవరూ స్నానం చేయకండి. మంచిది కాదు. ఏ చెరువులోనైనా స్నానం చేయాలంటే ఆ చెరువు మధ్యలో ఒక మంటపం కానీ స్తంభం కానీ ఉండాలి. లేకపోతే ప్రమాదం" అని చెప్పారు. తానూ ఆ చెరువులో స్నానం చెయ్యలేదు. మా ఇంటి బావి నీటి తోనే స్నానం చేసేవారు. ప్రతిరోజూ ప్రవచనాలు చెప్పేవారు.  ఊరు ఊరంతా చాలా క్రమశిక్షణతో స్వామివారు ఏమి చెప్పినా వినేవారు. అందరికీ ప్రతి నిత్యం ఏమేమి శ్లోకాలు చదువుకోవాలో చెప్పారు.

                                                               తెనాలి తాలూకా హైస్కూల్ నుంచి మహామహులంతా వచ్చారు. తెనాలి గురించి, అక్కడ మా స్కూల్లో పనిచేసే టీచర్ల ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ గురించి ముందు పోస్టులలో చెప్పా గదా. ఆ రోజుల్లో ఆ స్కూల్లో ములుకుట్ల సదాశివ శాస్త్రిగారు  తెలుగు పండితుడుగా పనిచేసేవారు. వారి దగ్గర కొన్ని నెలలు నేనూ, మా చెల్లెలు భారతీ సంగీతం, వీణా నేర్చుకున్నాం కూడా. ములుకుట్ల వారు ఆరుగొలను వచ్చి హరికథలు చెప్పారు. స్వామివారు చాలా సంతోషించి ఆయన్ను బ్లెస్ చేశారు. ఆ హరికథలు విని ఊళ్లోవాళ్ళు ఎంత ఆనందపడ్డారో.  తరువాత నాటకాలు వేసే వాళ్ళ వంతు వచ్చింది. మొత్తం టీమ్ కిరీటాలు, గదలూ, కత్తులూ, వగైరా అన్నింటితో సహా దిగేసారు. రెండు రాత్రులు తెల్లవార్లూ పాండవ ఉద్యోగ విజయాలు, కురుక్షేత్రం నాటకాలు వేశారు. తమాషాగా ఈ నాటకాలు తెల్లవార్లూ సాగుతాయి.  అందుకని మొదటినుంచి చివరిదాకా నడిచే ముఖ్యమైన కారెక్టర్ కృష్ణుడు లాంటి పాత్రలు వేసేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు.  వాళ్ళని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనేవాళ్ళు.  ఆరుగొలను వాళ్ళైతే ఈ నాటకాలు చూసి పిచ్చెక్కి పోయారు. వాళ్ళు ఇంతవరకూ అలాంటి నాటకాలు చూసి ఉండరు. ఆ తరువాత రోజూ కాసేపు పురాణకాలక్షేపం కూడా ఉండేది. మొదటిసారి అప్పుడే నేను గరుడ పురాణం ప్రసక్తి విన్నాను. అప్పుడు స్వామీజీ కూడా చెప్పారు. ఇలాంటి పురాణాలూ, ఉపనిషత్తులూ, భగవద్గీత అందరూ వినాలని, చదవాలనీ చెప్పారు.

                                                  ఇక్కడ నాదో చిన్నమాట. చాలామంది కొన్ని పురాణాలు ఎవరైనా చనిపోతే చదవాలని, లేదా ముసలి వయసులో చదవాలనీ అనుకుంటారు. కానీ ఈ గ్రంథాలన్నీ మనకు ఎలా బతుకు నడుపుకోవాలో చెప్తాయి. చచ్చే ముందరో, చచ్చిపోయాకో చదివితే ఏం ప్రయోజనం. కనుక ముందరే చదవండి. అన్నీ చదవచ్చు. అవి మనకు దిశా నిర్దేశం చేస్తాయి. తప్పకుండా బ్రెయిన్ చక్కగా అన్నీ అర్ధం చేసుకోగలిగే స్థితిలో ఉన్నప్పుడే చదివేయండి. వృద్ధాప్యం కోసం ఎదురు చూడకండి. ఈ సంగతి పక్కన పెట్టి స్వాములవారి దగ్గరకి వెళదాం. పది రోజుల పాటు పండగలా జరిగాక, చివరికి స్వాములవారు వెళ్లిపోయే రోజు వచ్చింది. మామూలుగా ఆయన నడిచే బయల్దేరారు. ఊరి బైటకు వెళ్ళాక పల్లకీ ఎక్కుతారట. ఆయన వెళ్లిపోయే టైం వచ్చేసరికి అందరూ కొద్దిగా ఉదాసీనంగా అయిపోయారు. నాన్న లాంటి వాళ్ళు కొద్దీ దూరం స్వాములవారితో నడిచి వెనక్కు వచ్చారు. ఆ తరువాత మరో మూడేళ్లు కంచి స్వాములని తెనాల్లోనే చూస్తూ వచ్చాం. మళ్ళీ 1974 లోనో, 1975 లోనో ఒకసారి కంచి వెళ్లాం అందరం. అప్పుడు చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు మౌన వ్రతంలో తపస్సు కోసం కంచి పొలిమేరల్లో ఒక కుటీరంలో ఉండేవారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఎప్పుడో కానీ బయటకు రాని పరమాచార్యులు ఆ రోజు బయటకు వచ్చి మాకు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నా, ఆయన ప్రసన్నదృష్టీ, చిరునవ్వుతో వెలిగిన కళ్లూ ఆయన మమ్మల్ని ముఖ్యంగా నాన్నని గుర్తించి, ఆశీర్వదించినట్లు మాకు అర్ధం అయ్యి చాలా ఆనందంగా అనిపించింది.  ఇదీ పరమాచార్యులతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం, సంబంధం. ఆ బృహత్తర, మహత్తర కార్యక్రమంలో నేను కూడా ఉడతలా కొద్దిపాటి పాత్ర వహించినందుకు నాకూ ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంది.

                                                                ప్రస్తుతానికి దాదాపుగా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసాను.  40 పోస్టులు పూర్తి అయినాయి. తిరిగి కొద్దిగా టైం తీసుకుని మళ్ళీ నాన్న గురించి చెప్పటం మొదలుపెడతాను. ఈ సారి మనం వచ్చే వారం నుంచీ  నా ప్రయాణోపనిషత్ బ్లాగ్ లో కలుసుకుందాం. నమస్కారం. 
                  







25, జూన్ 2020, గురువారం

ఆరుగొలను ఇల్లు సిద్ధం

ఆరుగొలను ఇల్లు సిద్ధం  

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                   
                                                            నాన్న ప్లానింగ్ అంతా పకడ్బందీగా చేసాడు ఎవరికీ, ఏ ఇబ్బందీ రాకుండా. బామ్మ పెద్దదయిపోయింది కనుక, ఓపిక తక్కువ, అందుకని వంట చేసిపెట్టటానికి ఒక వంట మనిషి, బహుశా ఆవిడ పేరు కమలమ్మ అనుకుంటా, పని సాయానికి ఒక పనివాడు, కోటేశ్వరరావు, స్కూల్లో కాంట్రాక్టు పనివాడు. ఈ ఇద్దరూ బామ్మకి సహాయంగా వచ్చే ఏర్పాటు చేశాడు. ఆ పైన అతి ముఖ్యంగా బామ్మకి తోకగా నేను. మా టీంకి బామ్మ కాప్టెన్. నలుగురం కలిసి ఒక మూడు వారాలలో ఇల్లు మొత్తం స్వాములవార్లకి, వారి పీఠానికీ, సిబ్బందికీ ఏ ఇబ్బంది లేకుండా సిద్ధం చేయించటం మా టాస్క్. అప్పటికి బామ్మ ఆరుగొలను ఊరు వెళ్లి చాలా ఏళ్లయ్యింది. దాంతో, ముందు గుడివాడలో దిగి అక్కడ ఉన్న ఇద్దరు కొడుకులనీ, ఇతర బంధువులనీ చూసి అక్కడి నుంచి ఆరుగొలను వెళ్లాలనేది బామ్మ ప్లాన్. సరే, నాన్న మా నలుగురికీ రైల్లో టిక్కెట్లు బుక్ చేసాడు. గుడివాడ రైల్వేస్టేషన్ కు చిన్నన్నయ్య (మా ఉమా పెదనాన్న వాళ్ళ రెండో అబ్బాయి, మురళి) వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. చిన్నన్నయ్య డ్యూటీ ఏమిటంటే, మమ్మల్ని గుడివాడ స్టేషన్ లో దించుకుని, మాతో పాటు గుడివాడలో ఒక రోజు ఉండి, మమ్మల్ని మళ్ళీ ఆరుగొలనులో దింపి మాక్కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్లాలి. చెప్పా గదా, నాన్న ఏర్పాట్లు చేయటంలో ఘనుడు.

                                                              గుడివాడలో పెద్ద పెదనాన్న, శర్మ పెదనాన్న వాళ్ళని కలిసి, ఆ తరువాత ఆ పక్కనే ఉన్న విశ్వం పెదనాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి, అందరినీ కలిసి, ఆ సాయంత్రానికి ఆరుగొలను చేరుకున్నాం అందరం. తీరా ఇంట్లో దిగాక చూద్దును కదా, కరంట్ లేని ఇల్లు అది. బామ్మా, చీకటి, మరి కరంట్ లేకపోతే ఎలా, అంటే, ఆవిడ వెంటనే ఇంట్లోకి వెళ్లి లాంతరు తెచ్చి దీపం వెలిగించింది. చెరువులో చేప లాగ, బామ్మ ఆ ఇంట్లో కాలు పెట్టంగానే, ఎంతో ఉత్సాహంగా మారిపోయింది. ఏది ఎక్కడుంటుందో ఆవిడకి అంత గుర్తు. చిన్నపిల్ల లాగా మారిపోయి, చకచకా ఇల్లంతా తిరిగేసి నాకు అన్ని గదులూ, గదుల్లో అన్ని , వస్తువులూ చూపించేసింది. వాటి గురించి బోల్డు వివరాలు చెప్పింది. బామ్మకి తన ఇల్లు చూడంగానే బోల్డంత శక్తి వచ్చేసింది. ఆ పక్కనే పెరట్లో ఉంటున్న లక్ష్మీకాంతారావు గారు వచ్ఛారు. ఈయనకే, మా బామ్మ పది రూపాయల అద్దె కోసం నాతో ఉత్తరాలు రాయించేది. మా బామ్మ ఆయన్ని కాంతాయ్ అని పిలిచేది. ఆయన బామ్మని అత్తయ్యా అని పిలిచేవాడు. ఈ లక్ష్మీకాంతారావుగారి భార్య మా కోసం ఇల్లు కొంచెం శుభ్రం చేయించి పెట్టింది. ఇంతలో మా సత్యనారాయణ తాతయ్య, మా అమ్మా వాళ్ళ నాన్న, కూడా వచ్చేసారు, "చీకట్లో ఏం ఉంటారు, మా ఇంటికి రండి, అక్కడి నుంచే పని చేయిద్దాం" అంటూ. బామ్మ వింటేనా,  "నాయిల్లు నాకు కొత్తా సత్యం, ఇన్నాళ్ల కొచ్చాను, ఇక్కడే ఉంటాను" అనేసింది. పాపం మా తాతయ్య వెళ్ళిపోయాడు. అలా మొదలైంది మా మొదటిరోజు ఆరుగొలనులో. ఎప్పటి మా ఆనందరామయ్య తాతగారూ, ఏనాడనంగా ఆయన సన్యాసం తీసుకున్నారూ, ఆ విషయం చంద్రశేఖరేంద్రసరస్వతికి తెలియగానే వారు ఈ ఇంటికి వస్తానని ఎలా అన్నారూ, అంతా తమాషాగా జరిగింది. మా తాతగారు చాలా గొప్ప మహాత్ములు కాబోలు. మహాత్ముల గురించి మహాత్ములకే తెలుస్తుందేమో. ఆయన గొప్పతనం తెలిసే ఈ ఇంటికి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి వస్తానన్నారేమో. ఇటువంటి భావాలేవీ అర్ధం కాని వయసు నాది అప్పుడు. ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ఇదే నిజం అనిపిస్తోంది.


  
సుమారు 1945 నాటి నందివాడ కుటుంబం ఫోటో
                                                     
                                                       రెండో రోజు నుంచీ మా అసలు పని సీరియస్ గా మొదలైపోయింది. పని వాళ్ళొచ్చేసారు. అందరూ బామ్మకి తెలిసిన వాళ్ళే. బామ్మ వాళ్లందరినీ పేరు పేరునా పలకరించింది. మంచీ చెడూ అడిగింది. అమ్మో, వియ్యమ్మగారు మనల్ని మర్చిపోలేదు అనుకున్నారందరూ. అందరూ పని లోకి దిగి ముందు పిచ్చి చెట్లు అన్నీ కొట్టేశారు. గడ్డీ, గాదం పీకేశారు. ఇంటి ముందూ, వెనుకా, పక్కనా వున్న పెరడంతా క్లీన్ చేశారు. చక్కగా దొడ్డంతా బాగు చేసాక స్వాములవారికి వంటశాల కోసం పెరట్లో పొడవుగా పెద్ద పాక వేశారు. దాంట్లో గాడిపొయ్యి తవ్వారు. దాన్ని రాళ్లతో, పేడతో చక్కగా పొయ్యి రూపం తెచ్చేసారు.  ఇంటి వెనక వైపున కూడా పాకలు వేశారు. బావిలో పూడిక తీశారు. గిలక బాగు చేశారు. మొత్తం పెరడంతా పేడ పెట్టి అలికేశారు. ఇంట్లో అన్ని గదులూ ఖాళీ చేసి ఆ సామాన్లన్నీ పడగ్గదిలో పెట్టారు. దాంతో మా బామ్మ పూజా, పచ్చళ్ళూ కూడా మా పడగ్గది లోకి వచ్చేసాయి. ఇల్లంతా మట్టీ, సిమెంటూ మెత్తి, బొక్కలూ, పగుళ్ళూ పూడ్చేశారు. తరువాత ఇంటికి సున్నాలేశారు. ఇల్లంతా శుభ్రం అయ్యాక మమ్మల్ని పక్క గదిలోకి పంపించి పడగ్గది స్వాములవారి కోసం శుభ్రం చేసి సిద్ధం చేశారు. అమ్మయ్య, ఇంటి పని అయిపోయింది. ఇక ఊళ్ళో వాళ్ళ కోసం ఇంటి ముందు రోడ్డు పక్కన ఒక పెద్ద పందిరీ, దాంట్లో ఒక పెద్ద వేదికా కట్టారు. మా ఇంటి వసారా లోనే పీఠం పెట్టి అమ్మవారి పూజలు చెయ్యటానికి వీలుగా గట్లు కట్టారు. ఇంటి ముందరే మరో పందిరీ, వేదికా కట్టారు. ఇదేమో స్వాములవారు కూర్చుని తీర్థప్రసాదాలు ఇవ్వటానికి. పెద్ద పందిరేమో ఊళ్ళో వాళ్లంతా కూర్చుని ప్రవచనాలు వినటానికి. ఇక స్వాములవారు, వారి పీఠం, సిబ్బందీ విడిది చేయటానికి ఇల్లూ, ఊరూ సిద్ధం. అంత గొప్ప స్వాములవారు మా ఊరు వస్తున్నారంటేనే అందరికీ గొప్పగా అనిపించింది. చాలా భక్తిగా, శ్రద్ధగా పనులు స్వచ్ఛందంగా చేశారు. ఈ పనంతా ఇంత బాగా చక్కగా జరగటానికి మూడు వారాలు పట్టింది, అది కూడా అందరూ ముచ్చటగా, ఇష్టంగా తలో చెయ్యీ వేశారు కాబట్టి. అమ్మయ్య, మొత్తం పనైపోయింది ఇక మేం వెళ్లిపోవచ్చు.



మా తాతయ్యా, బామ్మా 

                                                               ఇక ఈ మూడు వారాలూ నా గోడు చెప్తా వినండి. బామ్మకి చాలా ఏళ్ళ తరువాత తన ఇంటికి వచ్చేసరికి మహా బలం వచ్చేసింది. మహోత్సాహంతో వంట పనులూ, ఇంటి పనులూ చేసేసింది. ఆ పనికి మనిషి ఉన్నా సరే. అయిదేళ్ల నాటి ఆవకాయ, నిమ్మకాయ, చింతకాయ అంటూ ఆ పాత జాడీల్లో నుంచి అట్టడుగున ఉన్న ఊరగాయల్ని పట్టుదలగా బైటకు లాగి, నేనెంత బాగా ఊరగాయలు పెట్టేదాన్నో చూడు, అని బలవంతంగా తినిపించింది. పైగా పాత పచ్చళ్ళు పథ్యం అని దబాయించింది. నాకూ, కమలమ్మగారికీ, కోటేశ్వరరావుకీ అదే పచ్చడి. కొత్తగా ఏమైనా తిందాం బామ్మా, అంటే, 'ఠాట్, అంత మంచి పచ్చళ్ళు పారేస్తానా' అని గయ్యిమంది. ఎట్లాగూ అవి చివర్లో పని వాళ్లకి ఇచ్చేసి ఇల్లు క్లీన్ చేయించాం అనుకోండి. పనిలో పనిగా, నేనూ పనివాళ్ళూ కలిసి బామ్మ వంటింట్లో ఎప్పటినుంచో ఉండిపోయిన మిగిలిన సరుకులు కూడా పారేశాం. తెలిసాక బామ్మ గొల్లుమంటూ ఉండేది. అయినా బామ్మ దగ్గర ఆ మాత్రం లిబర్టీ నాకెప్పుడూ ఉండేది లెండి. నేను బామ్మా వాళ్ళ ఇంటికీ , అమ్మమ్మా వాళ్ళ ఇంటికీ మధ్య వారధిగా కూడా ఆ రోజుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండేదాన్ని. అమ్మమ్మా వాళ్ళింటి నుండి బామ్మ పూజకి రోజూ పొద్దున్నే వెళ్లి పూలు తెచ్చిపెట్టేదాన్ని. దానికి వేరే మరో అవసరం కూడా వచ్చి పడింది. బామ్మ ఇంట్లో లెట్రిన్ ఆ రోజుల్లో లేదు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉండేది. బామ్మా, వంట మనిషి కమలమ్మగారూ పొద్దున్నే, అలవాటుగా చెరువు గట్టున ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆ పని ముగించుకునేవారు. నేనేమో పొద్దున్నే లేవలేను. పైగా బామ్మ ఒకప్పుడు తనకి ఇలా తెల్లవారు ఝామున చెరువు గట్టుకి వెళితే, ఓ పెద్ద తాచుపాము ఎలా వచ్చిందో, అప్పుడు బామ్మ కేకలకి అందరూ వచ్చి దాన్ని ఎలా చంపేసారో అంటూ ఓ కథ చెప్పింది. ఇక అంతే, నేను మళ్ళీ పొలాల దగ్గరకి వెళితే ఒట్టు. అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో లెట్రిన్ ఉంది. రోజూ పొద్దున్నే ఓ కిలోమీటర్ నడిచి వెళ్లి, నా పని ముగించుకుని, వస్తూ వస్తూ బామ్మకి మందారాలూ, సన్నజాజులూ పూజకి తెచ్చి ఇచ్చేదాన్ని. నా అదృష్టం కొద్దీ బామ్మ ఇంట్లో ఓ తడికెల గది బాత్ రూమ్ ఉంది. స్నానాలు మాత్రం అక్కడే చేసేదాన్ని.

                                                   ఇక బామ్మ పడగ్గది. దాంట్లో ఇంతెత్తు పందిరి మంచం. బహుశా ఆ రోజుల్లో పందిరి మంచం ఎంత పెద్దదీ, ఎన్ని లతలూ, పువ్వులూ చెక్కారు, ఎంత ఎత్తుగా ఉందీ అన్న దాని మీద ఆ ఇంటి గొప్పతనం లెక్కించేవారేమో నాకు తెలియదు కానీ, అమ్మమ్మా వాళ్ళింట్లో కూడా ఓ పెద్ద పందిరి మంచం ఉంది. దానికీ బోల్డంత కథ ఉండేది. మా అమ్మ చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టటానికి ఆ మంచం కింద దాక్కుంటే, ఎవరికీ కనిపించేది కాదట. ఎటునించీ మా అమ్మమ్మకి చిక్కేది కాదట. అంత పెద్ద మంచం అది. బామ్మా వాళ్ళింట్లో పందిరి మంచమేమో ఇంకా పెద్దదీ, ఎత్తుదీను. దాన్నెక్కడానికో పెద్ద కుర్చీపీటో, నిచ్చెన లాంటిది ఏదో ఉండేది, మంచం లోనే భాగంగా. నేను పొడుగు కదా, ఒక్క గెంతు పెట్టి ఎక్కేసేదాన్ని. పాపం బామ్మ మాత్రం పద్ధతిగా ఆ స్టూల్ ఎక్కే మంచం మీదకు చేరేది. నా కిప్పుడు అర్ధం అవుతోంది, ఆ రోజుల్లో ఆడవాళ్లు మధ్యాన్నం పూట ఓ చిన్న కునుకు తీయటానికి, వంటింటి గడప మీదే తల పెట్టుకుని ఎందుకు పడుకునేవారో. లేకపోతే, ఈ ఎక్కీ, దూకీ, పాకీ, ఈ ప్రొసీజర్ అంతా ప్రతిసారీ ఎవరు పడతారూ అని. మళ్ళీ లేచి దిగి రావాలన్నా అంతే. అంతకన్నా గడప మీద తల పెట్టుకు పడుకోవటం తేలిగ్గదూ. రాత్రిపూట మాత్రం ఈ ప్రొసీజరంతా యథాతథంగా జరగాల్సిందే. ఇప్పుడు ఆ మంచం ఏమైందో. ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళే తీసుకున్నారా, తీసుకుంటే వాళ్ళు దాన్ని అలాగే ఉంచారా, ఏం చేశారో. ఈ సారి మాత్రం ఆరుగొలను వెళ్లే అవకాశం వస్తే ఆ విషయం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే, మా వాళ్ళెవ్వరూ లేరు కదా ఇప్పుడు, ఒక్క శ్రీధర్ బాబాయ్ తప్ప. బాబాయికి కూడా ఆ సంగతి ఎంత గుర్తుందో ఏమో. సుమారు 45 ఏళ్ళ కిందట అమెరికా వెళ్ళిపోయాడు మరి.



                            
                                          సుమారు 1966 నాటి నందివాడ కుటుంబం ఫోటో

                                                            ఇల్లు రెడీ, ఊరు రెడీ, ఊళ్ళో జనం రెడీ. స్వాములవారి రాక కోసం అంతా సన్నద్ధం అయిపోయింది. మేం నలుగురం పెట్టే బేడా సద్దేసి బయల్దేరాం. ఇక్కడో చిన్న పిట్టకథ. బేడా అంటే ఆ రోజుల్లో 12 పైసలు. పెట్టె సరే, ఈ 12 పైసల బేడాతో ఏం చెయ్యగలం, ఎందుకు పెట్టెతో పాటు బేడా కూడా సద్దాలీ, అని ఎవరికైనా సందేహం వస్తుందేమో అని చెప్తున్నా. ఈ బేడా మన 12 పైసల బేడా కాదు. బెడ్డింగ్ అనబడే పరుపు చుట్ట బేడా ఇది. పూర్వం రైళ్లల్లో వెళ్ళేటప్పుడు ఆ చెక్క బెంచీల మీద కూర్చోలేక, పడుకోలేక మెత్తగా ఉంటుందని ఓ పరుపు చుట్టని బెడ్డింగ్ అనే ఓ హోల్డాల్లో సద్ది తీసుకెళ్ళే వాళ్ళం. గుర్తొస్తోందా, ఆ బెడ్డింగే ఈ బేడా. ఇల్లు తాళం వేసేసి, తాళం చెవులు కాంతాయ్ అనబడే లక్ష్మీకాంతారావు గారికి ఇచ్చేసి, అమ్మమ్మా తాతయ్యలకి టాటా చెప్పేసి, తిరిగి దిగ్విజయంగా తెనాలి వచ్చేసాం. అలా మా ఆరుగొలను జైత్రయాత్ర ముగిసింది. మేం చేసిన పనికి మా నాన్న కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక ఆయన స్వాములవారికి ఈ విషయం చేరవెయ్యడమే మిగిలింది. మళ్ళీ స్వాములవారితో పాటు ఆరుగొలనులో కలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.
























18, జూన్ 2020, గురువారం

కంచి పీఠంతో సాంగత్యం

కంచి పీఠంతో సాంగత్యం   

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                   తెనాలి తాలూకా హైస్కూల్ తో చక్కని అనుబంధం ఉన్న మరొక అద్వైత పీఠం కంచి కామకోటి పీఠం. ఈ పీఠం కూడా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చి స్కూల్లో విడిది చేసి, వచ్చే భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తూ ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ పీఠానికి అధిపతి ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, ఈయన్నే పెద్దస్వామి అని ఆ రోజుల్లో అనేవారు. ఆ తరువాత ఈ స్వామినే పరమాచార్య అని పిలిచేవారు. ఈ పీఠానికి ఆ రోజుల్లోనే మరొక చిన్నస్వామి కూడా ఉండేవారు. వారే శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. జయేంద్రులు కామకోటి పీఠానికి భావి పీఠాధిపతి. ఆ తరువాత రోజుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిని కూడా పరమాచార్యుల తరువాత మూడవ వారసునిగా ప్రకటించారు. సన్యాసదీక్ష తీసుకున్న తొలి రోజుల్లో ఈ విజయేంద్రులను చూడటం జరిగింది. బహుశా అప్పుడు అయన ఏడు, ఎనిమిది సంవత్సరాల చిన్న పిల్లవాడు. ఈ పీఠం మాకు బాగా తెలిసిన సమయానికి పెద్దస్వామికి సుమారు 70 ఏళ్ళు, చిన్న స్వామికి 30 ఏళ్ళు ఉండేవి. తెనాలి స్కూల్ కి రెగ్యులర్ గా ఈ స్వాములిద్దరూ పీఠంతో తరలి వచ్చేవారు. పీఠం మామూలుగా సరస్వతీ విగ్రహం ఉన్న వేదిక మీదే పెట్టేవారు. మా నాన్నగారు ఎందుకో పెద్దస్వామికి ఇష్టులయ్యారు. మా నాన్నగారికి ఆ రోజుల్లో ఇదంతా కొత్త. అయినా ఆ స్కూల్ ఫిలాసఫీకి త్వరగానే అలవాటు పడిపోయారు.


 

                                                            పెద్దస్వామికి నడిచే దేవుడు అని పేరు. ఆయన ఎక్కడికి వెళ్లినా, నడిచి కానీ, లేదా మరీ అలసిపోయినప్పుడు పల్లకీలో కానీ వెళ్లేవారు. ఆయన చేతి తీర్ధం తీసుకోవటం అంటేనే అదో మహా అదృష్టంగా భావించేవారు అందరూ. ఎటువంటి కష్టాలూ, బాధలూ, రోగాలూ ఆ తీర్ధం వల్ల తొలగిపోతాయని నమ్మకం. ఎవరు ఏ పూలూ, రుద్రాక్షలూ, తులసి మాలలూ ఇచ్చినా వాటిని ఆయన తల మీద పెట్టుకునేవారు. ప్రతిరోజూ పూజ, తరువాత తీర్ధ, ప్రసాద వితరణ అయినాక ఒక్కోసారి కొద్దిసేపు ప్రవచనం కూడా ఇచ్చేవారు. ప్రతి సాయంకాలం మాత్రం తప్పనిసరిగా చాలాసేపు పెద్ద స్వామి ప్రవచనం ఇచ్చేవారు. ఒక్కోసారి చిన్నస్వామి కూడా ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ ప్రవచనాలన్నీ సాధారణంగా తెలుగులోనే ఉండేవి. వారి మాతృభాష తెలుగు కాకపోయినా భక్తులందరికీ చక్కగా అర్ధం అయ్యేలా ఈ ప్రవచనాలు ఉండేవి. ఆ రోజుల్లోనే స్వామివారి ప్రవచనాల పుస్తకాలు తెలుగులో జగద్గురు బోధలు అని చాలా పుస్తకాలు అమ్మేవారు. అవి ఎన్నో వాల్యూమ్స్ ఉండేవి. ఆ పుస్తకాలు మా ఇంట్లో చాలా ఏళ్ళు ఉండేవి. ఆ రోజుల్లో నాన్న నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఆయనకి తన పనుల్లో రోజూ స్వామివారి ప్రవచనాలు వినే ఛాన్స్ ఉండేది కాదు. నా పనేమిటంటే, రోజూ ఒక నోట్ బుక్ పెట్టుకుని స్వాములవారు చెప్తున్న విషయాల్లో నాకు ఏవి నచ్చాయో, ఏవి ముఖ్యం అనిపిస్తోందో అవి అన్నీ రాసి పెట్టటం. అలా చాలా రోజులు రాసాను. ఆ నోట్స్ నాన్న ఏం చేసాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. చిన్నపిల్లని నేను అలా నోట్స్ రాస్తుంటే, చుట్టుపక్కల పెద్దవాళ్ళు కొంతమంది నవ్వితే, కొంతమంది ఆశ్చర్యంగా చూసేవారు. నేను మాత్రం కొంచం లైట్ వచ్చే చోట పెద్ద పోజు పెట్టి మరీ రాసుకుంటూ ఉండేదాన్ని.   

 

                                                             ఆ రోజుల్లో పెద్దస్వామి నాన్ననీ, మరికొంత మంది అకడమీషియన్స్ నీ, కొంతమంది డబ్బు దానం చేసేవాళ్ళనీ ఉత్సాహపరచి, ఒక కొత్త ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెరిపించారు. దాని పేరే వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్. నాన్నే దానికి ఫౌండర్ ప్రెసిడెంట్. మా ఇంటి ఓనర్ వేదాంతం కృష్ణప్రసాద్ గారు ఫౌండర్ కరస్పాండెంట్.  ఇద్దరూ కలిసి చాలా కష్టపడి, పనిచేసి, ఈ  స్కూల్ ప్రారంభించారు. మా తమ్ముడు పేరు వివేకానంద్. వాడినే ఈ కొత్త వివేకానంద స్కూల్లో మొదటి విద్యార్థిగా నమోదు చేశారు. కృష్ణప్రసాద్ గారి అబ్బాయి, శరత్ ని మా తమ్ముడి వయసు వాడే,  రెండవ విద్యార్థిగా నమోదు చేసారు. మా వివేక్ ఆ స్కూల్ మొదటి విద్యార్థిగా నమోదు చేయడానికి కారణం వాడిపేరూ, స్కూల్ పేరూ ఒకటే కావటం. అదో సరదా అంతే. కృష్ణప్రసాద్ గారు, నాన్నకి తమ్ముడల్లే ఉండేవారు. కాకపోతే ఆ స్కూల్ తెరిచాక మేము ఆ ఊళ్ళో కేవలం ఒక్క సంవత్సరమే ఉన్నాం. అక్కడి నుంచి నాన్నకి కొత్త జాబ్ వస్తే, ఒరిస్సా వెళ్లిపోయాం. కృష్ణప్రసాద్ గారే ఆ తరువాత ఆ స్కూల్ బాధ్యత తీసుకున్నారు.    

                                                       కంచి స్వాములవారు సాధారణంగా ఎవరింటికి బిక్షకి వెళ్లేవారు కాదు. భక్తులే స్కూల్ కి వచ్చి పాదపూజలు చేసి, బిక్ష పెట్టేవారు. ఈ స్వామివారిది పెద్ద సిబ్బంది. ఆయన పీఠంతో పాటు ఏనుగులు కూడా వచ్చేవి. మా పిల్లలు సరదాగా రోజూ ఆ ఏనుగులు చూడటానికి వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజూ పొద్దున్నే పూజ చూడటం, పెద్ద స్వామివారి చేతిమీదుగా తీర్ధం, ప్రసాదం తీసుకోవటం, అప్పుడు ఇంటికి వెళ్ళటం, సాయంత్రం మళ్ళీ వచ్చి స్వామివారి ప్రవచనం వినటం, ఆ రోజుల్లో, ఇదే నా డైలీ ప్రోగ్రామ్. నిజాయితీగా చెప్పాలంటే, ఆ రోజుల్లో నేను చేసే ఏ పని విలువా నాకు తెలిసేది కాదు. పులుసులో గరిటకి పులుసు రుచి తెలియనట్టు.... ఏదో, ఆమ్మో, నాన్నో చెప్పారు, చేయాలి అంతే, మరో ఆలోచన ఉండేది కాదు. ఆ పనుల విలువ పెద్దయ్యాక తెలిసింది. అప్పుడే అమ్మా, నాన్నా కూడా ఒకసారి స్కూల్లోనే స్వాములవారికి పాదపూజ చేశారు. అలాంటి సందర్భాలలో ఒకసారి, నాన్న స్వాములవారిని మా ఇంటికి ఆహ్వానించారు. అప్పటికే నాన్న పెద్ద స్వాములవారితో మాటల్లో వాళ్ళ నాన్నగారు ఆనందరామయ్య గారు, చనిపోయే ముందు సన్యాసం తీసుకున్నారని, అలా ఈ సన్యాసం తీసుకోవటం అనే ఒక రివాజు మా కుటుంబాల్లో తరతరాలుగా వస్తోందనీ చెప్పారు. స్వాములవారికి ఆ విషయం చాలా విశేషంగా అనిపించిందో ఏమో, వెంటనే, "శర్మా, మీ ఇంటికి తప్పకుండా వస్తాను, వచ్చి ఓ పది రోజులు మీ ఇంట్లోనే పీఠం పెట్టి ఉంటాను. కానీ అది తెనాలిలో కాదు, మీ ఊరు, ఆరుగొలను వస్తాను. మీ ఇంట్లోనే ఉంటాను. ఏ ఇంట్లో మీ నాన్నగారు నివసించారో ఆ ఇంటికి వచ్చి పది రోజులుంటాను" అని చెప్పారు.
                   
                                                         నాన్న ఆశ్చర్య పోయారు. అసలు స్వాములవారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి సాధారణంగా ఎవరింటికి రారు, అలాంటి స్వామి ఒక్కసారిగా పది రోజులుంటానని చెప్పేసరికి నాన్న తెల్లబోయారు, ఆనందపడ్డారు. నిజం చెప్పాలంటే, ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వాళ్ళ నాన్న వల్ల కదా ఇంత గొప్ప  అవకాశం వచ్చిందని పొంగిపోయారు. స్వాములవారు ఒక్కసారి ఇంట్లో కాలు పెడితే చాలు అనుకునే స్థితి నుంచి ఒక్కసారిగా మా ఇంట్లో పీఠం పెట్టి, పది రోజులు ఉంటాననటం ఎంత గొప్ప అవకాశమో  తెలిసి అమ్మా, నాన్నా ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. అసలు ఇలాంటి ఒక అరుదైన వరం స్వాములవారు ఇంతవరకూ ఎవరికైనా, ఇచ్చారో లేదో కూడా తెలియదు. విషయం తెలిసి కొందరు ఆశ్చర్యపోతే, కొందరు అసూయ పడ్డారు. ఇక అప్పటి నుంచీ నాన్నకు హడావుడి మొదలైంది. ఎందుకంటే, ఆరుగొలను వెళ్లి సుమారు పది ఏళ్ళు దాటింది. ఆ ఇల్లు ఏ స్థితిలో ఉందో తెలియదు. ఇంటికి వచ్చి విషయం బామ్మకి చెప్పారు. బామ్మకి కూడా స్వాములవారు ఆరుగొలను వాళ్ళింటికి వస్తాననటం గొప్పగా అనిపించింది. మామూలుగా బామ్మ  ఎప్పుడూ స్వాములవార్ల సంగతుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించేది కాదు. అటువంటిది నడిచే దేవుడు అని పేరున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి తన ఇంటికి వస్తానని అనటం ఆవిడనీ సంతోషపెట్టింది. అక్కడ ఇల్లు ఎలా ఉందో తెలియదు. పాతకాలం డాబా ఇల్లు. పైగా వదిలేసి ఏళ్ళు అయ్యింది. ప్రస్తుతం ఇదే సమస్య. బామ్మ అప్పుడు ఆఫర్ చేసింది. నేను ముందు వెళ్లి ఇల్లు  బాగు చేయిస్తాను, అని. ఇక నాన్నకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఈ మాత్రం హెల్ప్ ఉంటే చాలు, మా నాన్న మిరకిల్స్ చేయగలడు. అప్పటి నుంచీ ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ప్లానింగ్ మొదలైంది. ఇవన్నీ తరువాత పోస్టులో చెప్పుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.  



17, జూన్ 2020, బుధవారం

శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం

శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం   


భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                       శృంగేరి పీఠం జగద్గురు ఆది శంకరాచార్యచే  స్థాపించబడిన పీఠం. తన శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని (మండన మిశ్రుడు) పీఠాధిపతిని చేసి, ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ పీఠంగా స్థాపించాడు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న అన్ని అద్వైత పీఠాలూ ఈ శృంగేరి పీఠం కిందే పనిచేస్తాయి. మేము తెనాలిలో ఉండే రోజుల్లో శృంగేరి పీఠాధిపతి, శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వారు దాదాపు ప్రతి సంవత్సరం మా స్కూలుకి వచ్చేవారు. ఒక సంవత్సరం చాతుర్మాస్య వ్రతం కూడా చేసారు. స్కూల్ కార్యక్రమాలకి అడ్డంకి రాకుండా ఈ స్వాములవార్ల కార్యక్రమాలు జరిగేవి. మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడే శృంగేరి స్వాములవారు చెప్పారు, ఇది విద్యాలయం కనుక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంటే బావుంటుందని, తప్పక పెట్టాలని చెప్పారు. దాంతో నాన్న స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ అనుమతితో, జైపూర్ నుంచి సరస్వతీ విగ్రహం చేయించి తెప్పించారు. స్వామీజీనే ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు.  తెల్లటి పాలరాయి మందిరంలో చక్కగా పాలరాయి పీఠంపై కాలుపై కాలువేసుకుని కూర్చుని వీణ వాయిస్తున్న సరస్వతీదేవి మహా కళగా ఉండేది. ఆ ప్రత్యేకతలన్నీ స్వాములవారు చెప్పి చేయించారు. అప్పటికే మా స్కూల్లో శారదాకళాపీఠం పేరుతో ఒక వేదిక ఉంది. ఈ సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన వేదిక సరస్వతీ కళావేదిక అయిపోయింది. ప్రధానంగా ఈ వేదికనే రోజూ ప్రార్ధనకీ, స్కూల్ ఫంక్షన్స్ కీ వాడేవాళ్లు. ఈ వేదిక, శారదాకళాపీఠం కంటే పెద్దది. ముందున్న గ్రౌండ్ కూడా చాలా పెద్దది. స్వాములవార్లు వచ్చినా కూడా ఈ వేదికనే వాడుకునే వారు. సాధుపరిషత్ సమ్మేళనం జరిగినప్పుడు, రుద్రయాగం చేసినప్పుడు మాత్రం మా ప్లేగ్రౌండ్ లో పెద్ద పెద్ద పందిరులు వేదికలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు. 

                                                   స్వాములవారు సరస్వతీ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ రోజున మా స్కూల్ విద్యార్ధులందరికీ సరస్వతీ అమ్మవారిపై ఒక శ్లోకం నేర్పించి, ఆ శ్లోకాన్ని మా స్కూల్ నిత్య ప్రార్ధనలో తప్పక రోజూ పాడాలని చెప్పారు. ఆ శ్లోకం అప్పటినుంచీ రోజూ ప్రేయర్ లో పాడేవాళ్ళం. ఆ శ్లోకమే, 
శరదిందు వికాస మందహాసామ్  
స్ఫురదిందీవర  లోచనాభిరామామ్ 
అరవిందసమాన సుందరాస్యామ్ 
అరవిందాసన సుందరీముపాసే

స్వాములవారు చెప్పిన ఆ శ్లోకాన్ని ఈ రోజుకీ ఆ స్కూల్లో పాడుతూనే ఉన్నారు. మా నాన్నగారు చేసిన ఆపని ఆ స్కూల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఆయన హెడ్ మాస్టర్ గా ఉన్న రోజుల్లోనే, ఆ స్కూల్ జూనియర్ కాలేజ్ అయింది. మా నాన్నని చూస్తే, మా కందరికి వింతగా ఉండేది, ప్యాంటు వేసుకోవాల్సిన సందర్భంలో ప్యాంటు, షర్ట్ వేసుకుని స్టైల్ గా తిరిగేవాడు. పంచెలు కట్టుకోవాల్సిన సమయం వస్తే, పంచె, లాల్చీ కట్టేసుకుని తేలికగా తిరిగేసేవాడు. అవసరం వస్తే, ఆ చొక్కా కూడా విప్పేసి, స్వాములవార్ల దగ్గర ఎంతో అలవాటుగా హాయిగా చేతులు కట్టుకుని వెనుక నుంచునేవాడు. ఎప్పుడూ భేషజాలు చూపేవాడు కాదు. స్వాములవార్ల ఎదురుకుండా ఏనాడూ చొక్కా వేసుకునే వాడు కాదు.  
                                                      
 

                                                        ఆ రోజుల్లోనే శృంగేరి స్వాములవారిని మా నాన్నపాదపూజ, బిక్ష కోసం మా ఇంటికి ఆహ్వానించారు. స్వాములవారు ఒప్పుకున్నారు. ఆ రోజు మాఇంట్లో ఒక పెద్ద పండుగ లాగా జరిగింది. చాలామంది అతిధులు వచ్చారు. సుమారు వందమందికి పైగా భోజనానికి వచ్చారు. స్వామివారికి, వారి సిబ్బందికి వేరే మడి వంటలు చేయించారు. మిగిలిన అందరికీ దొడ్లో గాడిపొయ్యి తవ్వించి వేరే వంట. మధ్యలో ఎవరో, కాస్త సందడి చేద్దామని అనుకున్నారో ఏమో, బయట షామియానా కూడా వేయించారు. మా నాన్న అనుకోవటం ఆలస్యం, ఆయన అభిమాన సిబ్బంది చకచకా బోల్డు పనులు చేసేవాళ్ళు. హనుమంతరావు గారు, లోకనాథం గారు, జనస్వామి మాస్టారి అన్నదమ్ములు, (ఈ ఇద్దరూ స్కూల్లో టీచర్లే), వాటర్ మాన్ సీతారామయ్య గారు, ఇలా ఎందరో....అందరూ నడుం కడితేనే ఈ పనులన్నీ అయ్యేవి. మేమేమో  చిన్న పిల్లలం. అమ్మా, నాన్నా స్వామివార్ల సేవలో ఉంటే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు. యజ్ఞనారాయణ గారి భార్య సరస్వతమ్మ గారు కూడా అమ్మకి ఎన్నో పనులలో చాలా సహాయంగా ఉండేది. ఆరోజుల్లో మా చెల్లమ్మ అత్తయ్య కూతురు లలిత, మా ఇంట్లోనే ఉంటూ VSR కాలేజ్ లో B.Com. చదువుకునేది. ఆరోజు శృంగేరి స్వామి వారి పాదపూజ, బిక్ష అద్భుతంగా జరిగాయి. కొసమెరుపేమిటంటే, మా లలితని మరునాడు వాళ్ళ కాలేజీలో దాని పెళ్లేమైనా నిశ్చయమైందా, ఇంటి ముందు షామియానా వేశారు, అని అడిగారట. లలిత పాపం ఇబ్బంది పడుతూ, సందర్భం స్వాములవారి పాదపూజ కార్యక్రమం అని చెప్పిందిట. 

                                                                శృంగేరి పీఠం వారు శ్రీశైలంలో ఆలయం ఎదురుగా ఒక మఠం తెరిచారు. ఆ ప్రారంభోత్సవానికి నాన్నని, మా తెనాలి వాళ్ళని స్వాములవారు పిలిచారు. తెనాలి నుంచి ఒక బస్ లో సుమారు 40 మంది వెళ్లాం. అప్పుడు మా చిన్న పాపాయి, చిన్న చెల్లెలు, కూడా ఉండేది. ఆ తరువాతే అది డిఫ్తీరియాతో  పోయింది. మాకు శ్రీశైలం పర్యటన అదే మొదటిసారి. అందరం అప్పుడు ఆ మఠం లోనే ఉన్నాం. అంత చిన్నప్పుడు, బహుశా నేను అప్పుడు ఏడో క్లాసనుకుంటా, నాకెక్కువగా శ్రీశైలం ట్రిప్ ఎక్కువగా గుర్తులేదు. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు, అది అంతా కొండ ప్రాంతం కదా, ఒక ద్వారం నుంచి రోడ్డు మీదకు వెళ్లాలంటే, ఓ పదిహేను, ఇరవై మెట్లు దిగాలి. అదే ఇంకో ద్వారంలో నుంచి బయటకు వస్తే మామూలుగా రోడ్డు మీదకు వచ్చేసేవాళ్ళం. ఇదో వింతలా ఉండేది నాకు. 

                                          ఆ ట్రిప్ లోనే మార్కాపురం, త్రిపురాంతకం కూడా చూసాం. త్రిపురాంతకం శివాలయంలో శివలింగం పైన ఉన్న ఒక చిన్న గుంత నుంచి నిరంతరం గంగాజలం ఊరుతూ ఉంటుంది, ఆ జలాన్నే తీర్థంగా పూజారి అందరికీ ఇచ్చారు. ఎన్ని సార్లు తీసిన మళ్ళీ ఆ జలం నిండుతూనే ఉంటుంది. ఆశ్చర్యంగా, భక్తిగా  చూసాం అందరం. దారిలో మార్కాపురంలో నాన్న బోల్డు పలకలు, బలపాలు కొన్నాడు. అక్కడ అవి ప్రసిద్ధి. ఈ మధ్యకాలంలో నేను, మావారు త్రిపురాంతకం వెళ్లి  ఆ ఆలయాలను దర్శించుకున్నాం. అప్పుడు పూజారి వేరే పాత్రలో నీరు తీర్థంగా ఇచ్చారు. నేను ఆయన్ని అడిగా, ఇదివరకు లింగం పైన ఊరే జలమే తీర్థంగా ఇచ్చేవారు కదా అని. అతను తెల్లబోయి, ఎన్నాళ్ళ కిందట వచ్చారు అని అడిగాడు. సుమారు యాభై ఏళ్ళ కిందట అంటే, ఇంత పాత విషయం మీకు గుర్తు ఉందా అని ఆశ్చర్యపోతూ, చెప్పాడు. ఆ లింగం కాలక్రమేణా భంగం అయిపోతే, కొత్త లింగం చేయించి ప్రతిష్ట చేశారట. ఈ లింగంలో ఆ సౌకర్యం లేదన్నాడు. అలాగే, శ్రీశైలంలోనూ శిఖరేశ్వరం వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద నంది కింద నువ్వులు వేసి తిప్పుతూ అది లూబ్రికెంట్ గా పని చేస్తుంటే, నంది కొమ్ముల మధ్య నుంచి  శ్రీశైల ఆలయ శిఖరం చూసాం. అలా ఆ ఆలయ శిఖరాన్ని చూస్తే, ఇక పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం. ఈ మధ్య వెళ్ళినప్పుడు అక్కడా అంతే, ఆ నంది మూర్తి పాడైపోతే, ఈ సారి మరో నంది విగ్రహాన్ని తెచ్చి చక్కగా ఆ శిఖరం కనపడే డైరెక్షన్ లోనే ఫిక్స్ చేసేసారు.  ఇది కూడా బాధ వేసింది. ఆ పాత నంది మూర్తి ఏదీ అంటే, కింద శిథిలాల్లో చూపించాడు. బాధ ఇంకా ఎక్కువైంది, కనీసం ఏ మ్యూజియం లోనైనా పెట్టొచ్చుగా అనిపించింది. త్రిపురాంతకంలోనూ బహుశా, ఇలానే అయి ఉంటుంది. ఆ లింగం మీద తీర్ధం కోసం ఉద్ధరిణతో గీకీ గీకీ దాన్ని పాడు చేసి ఉంటారు. 

                                                     నేనూ, మా వారూ ఈ  మధ్య కాలంలో మా యాత్రల్లో భాగంగా శృంగేరి వెళ్లాం. అప్పుడు పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి. శారదామాతను, శివుడిని, ఆది శంకరుని, దర్శించుకుని కాసేపు అక్కడ కూర్చున్నాం. అడిగితే స్వాములవారు అప్పుడు పీఠంలోనే ఉన్నారని చెప్పారు. అదృష్టం కొద్దీ వారి దర్శనం కూడా అయ్యింది. నమస్కరిస్తే, ఆశీర్వదించి ప్రసాదం ఇప్పించారు. కిందికి వచ్చి వాళ్ళ ఆఫీసుకి వెళ్లి అమ్మవారి చీర కావాలని అక్కడి వాళ్ళను చాలాసేపు పీడించి, ఒక చీర, రవికలబట్ట, కుంకుమ తీసుకున్నాను. ఆలయాలకు వెళితే అమ్మవారి చీర కొనుక్కోవటం నాకు ఒక అలవాటు. వీళ్ళేమో అవి అమ్మరుట. అందుకే ఊరికే అయినా ఇమ్మని అడిగి తీసుకున్నా. లేకపోతే, ఎంతసేపటికీ VIP ల కేనా, శేషవస్త్రం , మాలాంటి వాళ్లకు వద్దా? అదీ సంగతి. 

                                               ఇదీ శృంగేరితో, శృంగేరి  పీఠాధిపతితో  మా అనుబంధం. మా నాన్న వారి శిష్యులవటం వాళ్ళతో ఈ అనుబంధం ఏర్పడింది. లేకపోతే వీలవుతుందా. ఇక్కడితో శృంగేరి స్వామీజీ తో మా సాంగత్యం గురించి చెప్పటం ముగించుకుని, ఈ సారి కంచి పీఠాధిపతులను గురించి చెప్పకుందాం. స్వస్తి.  






14, జూన్ 2020, ఆదివారం

కుర్తాళం, పుష్పగిరి, గాయత్రి పీఠాలతో నాన్న

 కుర్తాళం, పుష్పగిరి, గాయత్రి  పీఠాలతో నాన్న   

 భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                                        అలాగే మా ఇంట్లో పీఠం తొలిసారిగా పెట్టిన వారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి. అమ్మా, నాన్నా ఆయనకు పాదపూజ చేసి బిక్ష పెట్టినప్పుడు, అదో పండుగలా ఉండేది. స్కూల్ స్కూలంతా తరలి వచ్చేవారు. ఆ రోజు సుమారు ఓ వందమంది పైగా భోజనం చేసేవారు. స్కూల్లో ఉండే బ్రాహ్మణ ఉద్యోగులు వచ్చి భోజనాలు వడ్డించేవారు.  వండిన వంటలు సరిపోకపోతే నెమ్మదిగా కూర్చోండి, అనేవారు. అదో సిగ్నల్ అందరికీ, ఏదో వంటకమో, అన్నమో అయిపోయింది, మళ్ళీ వండుతున్నారు, కాస్త నెమ్మదిగా తినండి అది వచ్చేదాకా అని చెప్పటం. ఉన్నట్టుండి, "భోజనకాల సమయే, గోవిందా నామ స్మరణా.." అని ఎవరో ఒకరు గట్టిగా అరచి, గోవిందా, గోవిందా అనేవారు. దాంతో అన్ని గదుల్లో భోజనం చేస్తున్న వారందరూ కూడా గోవిందా గోవిందా అని కేక పెట్టేవారు. మా లాంటి పిల్లలం, ఉడత సాయం లాగా, నెయ్యి, నీళ్లు వడ్డించేవాళ్ళం. ఇల్లంతా ఆ సమయంలో అన్ని గదులూ భోజనశాలలై పోయేవి. స్వాములవారు పూజ చేసి, అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చాక, తన పాదపూజ అయ్యాక,  తాను భోజనం చేస్తూ,  అందరికీ భోజనం వడ్డించమని సైగ చేసేవారు. అన్నీ అయ్యేసరికి సాయంత్రం అయ్యేది. అప్పటికి స్వాములవారు కాసేపు విశ్రమించి, తిరిగి సాయంకాల ప్రవచనానికి తయారైపోయేవారు. ఎవరిదో కారు వచ్చేది, ఆయన వెళ్ళిపోయేవారు. అక్కడ ప్రవచనం అయిపోయాక, (మళ్ళీ అక్కడ తిరిగి పూజా, తీర్ధాలూ, ప్రసాదాలూ ఉండేవి) ఇంటికి వచ్చి కాసేపు మంచీ చెడూ మాట్లాడి పడుకునేవారు.

               

                                    
                                                    తరువాత పెట్టిన పీఠం గాయత్రీ వారిది. ఆయన శ్రీ విద్యా శంకర భారతీ తీర్థ స్వామి. ఆ స్వాములవారితో పాటు రమణమూర్తీ, రామబ్రహ్మం అని ఇద్దరు సహాయకులు కూడా ఎప్పుడూ వచ్చేవారు. వాళ్లిద్దరూ ఎప్పుడూ స్వామీజీనే కనిపెట్టుకుని ఉండేవారు. ఆయనకి ఏం కావలసినా వాళ్ళే చూసుకునే వారు. అందులో రమణమూర్తికి తాను తరువాతి పీఠాధిపతిని అవుతానని కాస్త ఆశగా ఉండేది, అవ్వాలని కోరికగా కూడా ఉండేది. ఆ తరువాత ఆ పీఠం ఏమయ్యిందో, మాకెవ్వరికీ తెలియదు, గుర్తు లేదు. తరువాత ఎవరు పీఠాధిపతి అయ్యారో తెలియదు. ఆ కొత్త స్వామితో కూడా మాకెవరికీ వ్యక్తిగత పరిచయం కూడా లేదు. ఆయనతో పాటే ఆయన పీఠం వ్యక్తులు రమణమూర్తి, రామబ్రహ్మం అనేవాళ్ళు కూడా ఇద్దరు వచ్చేవాళ్ళు. వాళ్ళు స్వామీజీకి కావలసిన సేవలూ, ప్రసాదాలూ అన్నీ చూసుకునేవారు. ఈ రమణమూర్తి, రామబ్రహ్మం మా ఇంట్లోనే తినేవాళ్లు. పీఠం తాలూకు వెండి సామాన్లు అవీ వాళ్ళే తోముకునే వాళ్ళు.

                                                       కుర్తాళం పీఠానికి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి తరువాత శ్రీ  శివ చిదానంద భారతీ స్వామి అధిపతి అయ్యారు. ఆ తరువాత వచ్చినది శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, మా ఉమా పెదనాన్న చిన్న కోడలు సుశీలాదేవి, చిన్నవదిన అంటాం, ద్వారా మళ్ళీ దగ్గరయ్యారు. ఆవిడ స్వాములవారి శిష్యురాలు. మా శ్రీధర్ బాబాయ్ కూడా అమెరికా నుంచి వచ్చినప్పుడు కుర్తాళం పీఠాధిపతికి పాదపూజ చేసి, బిక్ష పెట్టారు. తదనంతరం నేనూ వారి శిష్య బృందంలో చేరాను. వారు నాకు హనుమత్ మంత్రము, గణేశ మంత్రము ఉపదేశించారు. ఆ రెండు మంత్రాలూ కూడా మననం  చేస్తూనే ఉన్నాను. బదరిలో కామధేనువు చెవిలో చెప్పి వదిలేసిన మంత్రాలలో ఈ రెండు మంత్రాలు కూడా ఉన్నాయి. నేను స్వామివారి శిష్యురాలినే కానీ, మా నాన్నలా అంత అనుబంధం ఎందుకనో పెంచుకోలేదు. త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు మాత్రం మాకు అత్యంత ఆత్మీయులుగా ఉండేవారు.



                                                              తరువాత పరిచమైన స్వాములవారు పుష్పగిరి పీఠాధిపతులు, శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు. ఈ స్వామి వారైతే మొత్తం కుటుంబానికి ఎంత దగ్గరైయ్యారో మాటలతో చెప్పలేను. తెనాలిలోనే  కాకుండా మేము సంబల్పూర్(ఒరిస్సా) వెళితే అక్కడికీ వచ్చి మా ఇంట్లో పీఠం పెట్టారు. తెనాలికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వసారాలోనే పుష్పగిరి పీఠం పెట్టారు. ఆ వసారా ఏం పుణ్యం చేసుకుందో మరి. ఆ వసారాలోనే ఒకసారి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వచ్చి కాసేపు సత్సంగం చేశారు. అప్పుడు మైలవరపు శ్రీనివాస రావు కూడా వచ్చారు. వారు అప్పుడు తెనాలిలో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్. పుష్పగిరి పీఠాధిపతి వారి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుర్తాళం స్వాములవారి తరహాలోనే ఉండేవి. ఇంట్లో నిత్య పూజ, తీర్ధ, ప్రసాద వితరణ రోజూ ఉండేవి. ఆ తరువాత స్వాములవారు ఎవరింటికి భిక్షకు వెళ్ళాలో చూసుకుని వెళ్లేవారు. రాత్రికి కూడా వాళ్ళే స్వాములవారి అల్పాహారమో, ఫలాహారమో తెచ్చేవారు, లేకపోతే మా అమ్మ ఉండనే ఉంది. సాయంకాలాల్లో రోజూ స్కూల్లో ప్రవచనాలు ఉండేవి. వేలాదిగా జనం వచ్చేవారు. స్వాములవారి చేతి తీర్ధం కోసం వచ్చేవారు. ఆ విధం గా ఈ పీఠాధిపతి కనీసం నాలుగుసార్లయినా మా ఇంటికి వచ్చేవారు. 



                                                      ఒకసారి తెనాలిలోనే శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి పట్టాభిషేక జయంత్యుత్సవం జరిగింది. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి కూడా ఉన్నారు. పుష్పగిరి స్వామివారికి సంపూర్ణంగా రాజాలంకరణ చేసి, కిరీటం, భుజకీర్తులు పెట్టారు. మా అమ్మా, నాన్నా, రాజదండాలు పుచ్చుకుని స్వాములవారికి అటూ ఇటూ నిల్చుని ఫోటో కూడా తీయించుకున్నారు. అలా చాలామంది భక్తులు కూడా చేసారు. అప్పుడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామివారు కూడా వచ్చారు. వారు  పుష్పగిరి పీఠాధిపతి సాష్టాంగ నమస్కారం చేసి, కానుకలు అందించారు. నేను తెల్లబోయాను. ఎందుకంటే, కుర్తాళం స్వామి వృద్ధుడు, పుష్పగిరి స్వామి యువకుడు. ఇద్దరూ సన్యాసులే, పీఠాధిపతులే.  చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు అలా దణ్ణం పెట్టొచ్చా అని నాకు సందేహం కలిగింది. తరువాత నాన్నను అడిగితే, ఆయన చెప్పారు. కుర్తాళం పీఠం, పుష్పగిరి పీఠానికి ఉప పీఠమట. అందుకని పుష్పగిరి స్వామి గురు స్థానంలోనూ,  కుర్తాళం స్వామి శిష్య స్థానంలోనూ ఉన్నారని చెప్పారు. సరే, నా సందేహం తీరిపోయింది, గురువు కెప్పుడూ శిష్యుడే కదా నమస్కరించాలి.


                                                                      పుష్పగిరి స్వామి సంబల్పూర్ వచ్చినప్పుడు, అక్కడి వారెవరికీ మా నాన్నలోని ఈ కోణం తెలియదు. మొదటిసారి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అక్కడా కార్యక్రమం అంతే, ఇంట్లో పీఠం, పూజలూ, భజనలూ, తీర్ధాలూ, ప్రసాదాలూ. కాలనీ వాళ్లంతా వచ్చేవాళ్ళు. స్కూల్ వాళ్లంతా వచ్చేవాళ్ళు. వాళ్లలో అందరికీ తెలుగు రాదు కదా, అందుకని పుష్పగిరి స్వామి హిందీలోకానీ, సంస్కృతంలో కానీ ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ రోజుల్లో మా చిన్న చెల్లెలు పద్మ హిందూస్తానీ సంగీతం నేర్చుకుంటూ ఉండేది. వాళ్ళ సంగీతం టీచరు హార్మోనియం తెచ్చి తాను వాయిస్తూ, మా పద్మ చేత తాను నేర్పిన భజనలు పాడించి స్వాములవారికి వినిపిస్తూ ఉండేవాడు. మా పద్మది చక్కటి గాత్రం. 'శ్రీ  గణేశ శ్రీ  గణేశ పాహిమాం, జై గణేశ జై గణేశ రక్షమాం',  'ఠుమక్ చలత రామచంద్ర' అని కమ్మగా పాడేది. స్వామీజీ మెచ్చి ఆశీర్వదించిన పాట దానిది. హిందూస్తానీ మ్యూజిక్ లో డిప్లొమా కూడా పాసయ్యింది. అంత మంచి గాత్రాన్ని తరువాతి రోజుల్లో పడుకోపెట్టేసింది. ఆ విషయం మా కందరికీ బాధగానే ఉండేది. మా ఇంట్లో పది పదిహేను రోజులున్న తరువాత పుష్పగిరి స్వామివారు సంబల్పూర్ నుంచి ఒరిస్సాలోనే మరో ప్రాంతానికి వెళ్లిపోయారు.  అలా పుష్పగిరి పీఠంతో మా సాహచర్యం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది.


                                               ఒక పదేళ్ల కిందట మా వారు ప్రొద్దటూరులో పనిచేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల క్షేత్రాలన్నీ చూడటానికి వెళ్ళాం. అప్పుడు చూశాను పుష్పగిరిని. పీఠానికి కూడా వెళ్ళాం. కానీ స్వాములవారు అప్పుడు హైదరాబాదులో ఉన్నారని చెప్పారు. నది ఒడ్డున ఆలయంలో ఆది శంకరులు ప్రతిష్టించి పూజించిన పెద్ద రెండడుగుల ఎత్తైన శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రానికి నేను నా అదృష్టం కొద్దీ పక్కనే కూర్చుని ఆ ఆలయ పూజారి తల్లి ఖడ్గమాలాస్తోత్రం ధారాళంగా చదువుతుంటే, నిష్టగా కుంకుమార్చన చేసుకున్నాను. నడుం లోతు నీళ్ళల్లో నడిచి నది దాటి, ఒడ్డుకి ఆవలి వైపున ఉన్న, కొండ మీద ఉన్న చెన్నకేశవుడినీ,శివుడినీ దర్శించుకుని తిరిగి వచ్చాం.  ఆ ఆలయ విశేషాలు, అక్కడి అపూర్వ శిల్ప సంపద గురించి మరోసారి రాస్తాను. నదుల నడి మధ్యలో వికసించిన పువ్వులా ఉన్న కొండే  పుష్పగిరి. అందుకే  ఆ పేరు. ఆ నీళ్లలో అయిదు నదుల నీళ్లు కలసి ప్రవహిస్తున్నాయి. ఆ నదులే పెన్నా, పాపాఘ్ని, కుందూ, అర్కావతి,పాలార్. ప్రభుత్వం వాళ్ళు పంటల కోసం నీళ్లు వదిలినప్పుడు, కృష్ణా, తుంగభద్రా కూడా కలుస్తాయట. అక్కడి పూజారులు చెప్పారు. నదిలో నీళ్లలో నడిచి వెళ్లామని చెప్పాను కదా, అది చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎక్కడ గుంత ఏర్పడుతుందో, ఎక్కడ మేట ఏర్పడుతుందో తెలియదు. రెండోసారి వెళ్ళినప్పుడు, నీళ్ళల్లో దిగటానికి భయమేసేంత ప్రవాహం ఉంది. అప్పుడు మా సంశయాన్ని గమనించిన ఒక పురోహితుడు, ఆవలి ఒడ్డు నుంచి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని వెంట బెట్టుకుని తీసుకు వెళ్ళాడు. లేకపోతే నీళ్ళల్లో బాట తెలియలేదు. ఒడ్డుకి చేరాక కొంచెం కొండ ఎక్కాలి. వానాకాలంలో పరిస్థితి ఇలా ఉంటే, ఎండాకాలంలో ఇసుకలో కాళ్ళు కాలిపోతాయి. మొత్తానికి అన్ని ఇబ్బందులూ దాటుకుని రెండుసార్లు పుష్పగిరి వెళ్లాం.

                                              ఈ సారి పోస్టులో శృంగేరి పీఠంతో  అప్పటి పీఠాధిపతి శ్రీ  అభినవ విద్యాతీర్థ మహా స్వామి వారితో మాకున్న అనుబంధం గురించి వ్రాస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.




















13, జూన్ 2020, శనివారం

నాన్నా - స్వామీజీలతో సాన్నిహిత్యం



నాన్నా - స్వామీజీలతో సాన్నిహిత్యం  

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                   
                                                                    మా నాన్న తెనాలి వచ్చేదాకా మనిషి వేరు. తెనాలి వచ్చాక మారిపోయాడు. అప్పటి వరకూ స్వామీజీలు, పీఠాధిపతులూ, సన్యాసులూ వీరికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. తెనాలి వచ్చాక వీళ్ళందరూ మా దైనందిన జీవితంలో దాదాపు ఒక భాగమై పోయారు. త్రివిక్రమ రామానంద భారతీ స్వామి అప్పట్లో కుర్తాళం పీఠానికి అధిపతి. వారు ముందరే మా కుటుంబానికి పరిచయం ఉన్నందున, ఒకసారి తన పీఠంతో సహా మా ఇంటికి తెనాలి వచ్చారు. మా ఇంటి వసారాలోనే (అది చాలా పెద్దది) పీఠం పెట్టారు. అక్కడ నిత్యపూజలు జరిగేవి.  స్వామివార్లందరినీ స్వాములవారు లేదా స్వాములారు అనేవాళ్ళం. నాకు రాయటానికి సహజంగా ఉండాలంటే, నాకు ఇలా అనటమే సౌకర్యంగా ఉంటుంది. ఇకనుంచీ ప్రతి స్వామీజీని స్వాములవారు అనే ఉదహరిస్తా. ఈ కుర్తాళం స్వాములవారు రోజూ సాయంత్రం వేళల్లో ఇంట్లో కానీ, మా నాన్న హెడ్ మాస్టర్ గా ఉన్న స్కూల్లో కానీ ప్రవచనాలు ఇచ్చేవారు.

                                            ఉదయం వేళల్లో మా ఇంటికి పీఠం నుంచి తీర్ధ ప్రసాదాలు తీసుకోవటానికి చాలామంది ప్రవాహంగా వచ్చేవారు. వాళ్లంతా స్వాములవారి కోసం పళ్ళూ పూలూ లాంటివి చాలా తెచ్చేవాళ్ళు. వాటినన్నింటినీ ఆయన తిరిగి ఆ భక్తులకే ప్రసాదం లాగా ఇచ్చేసేవారు. ఈ రోజుల్లో ఉన్న కొందరు దొంగ స్వాములకు, ఆ రోజుల్లోని అసలు స్వాములకీ అదే తేడా. ఏ రోజు భక్తులు ఇచ్చినవి ఆ రోజే అందరికీ పంచిపెట్టేసేవారు. మా ఇంట్లో మా అమ్మ మడి కట్టుకుని స్వాములవారు కోసం శ్రద్ధగా వంట చేసేది. ఆ భోజనం స్వాములవారు తినేవారు. కానీ ఎక్కువ రోజులు ఎవరింటికైనా బిక్షకి వెళ్లేవారు. రాత్రుళ్ళు ఎప్పుడూ అల్పాహారమే లేదా ఫలాహారం, అంతే. వీరికోసం మా ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది కేటాయించేవాళ్ళం. భక్తులు ఎవరైనా వచ్చినా, వారు వసారాలో నుంచే డైరెక్టుగా స్వామివారి గదికి వెళ్లే సౌకర్యం ఉండేది. అందువల్ల మా ఇంట్లో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఇల్లు అంత సౌకర్యంగా ఉండేది.
                                                       
                                                         ఆ రోజుల్లోనే తెనాలిలో అఖిల భారత సాధు పరిషత్ వాళ్ళ సమ్మేళనం జరిగింది. మా స్కూల్ సెలవుల్లోనే ఆ సమ్మేళనం జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. దానికి వచ్చిన సాధు సన్యాసులందరికీ స్కూల్లో గదులే వసతిగా ఇచ్చారు. సుమారు వెయ్యి మంది సన్యాసులు అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చారని చెప్పుకునే వారు. ఆ స్కూల్ మేనేజిమెంట్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా స్కూల్ ని ఇచ్చేవాళ్ళు. పైగా నాన్న వల్ల స్కూల్ కి ఇంతమంది గొప్పవాళ్ళు వచ్చారని చాలా ఆనంద పడేవాళ్ళు. స్కూల్ సెలవుల్లోనే ఆ కార్యక్రమాలు జరిగేవి కనుక ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. స్వామికార్యం, స్వకార్యం అంటే, ఇదేనేమో. ఆ అఖిల భారత సాధు సమ్మేళనం సుమారు పది రోజుల పాటు సాగింది.  అప్పుడు మా లాంటి వారందరికీ వాళ్ళు నిత్యం చెప్పే ఓ శాంతి మంత్రం బాగా నచ్చి అలవాటు చేసుకున్నాం. ఆ ప్రార్ధన ఇన్నేళ్లయినా నేను మర్చిపోలేదు. ఇప్పటికీ అది అనుకుంటూనే ఉంటాను. ఆ ప్రార్ధనా శ్లోకం ఇదే.
ధర్మస్య జయోస్తు 
అధర్మస్య నాశోస్తు 
ప్రాణిషు సద్భావనాస్తు 
విశ్వస్య కళ్యాణమస్తు 
ఓం శాంతిః శాంతిః శాంతిః

                                                        ఆ సాధు పరిషత్ సమావేశాలప్పుడే ఒక యువ స్వామి, స్వామీ సదానంద సరస్వతి అందరి దృష్టినీ తన అద్భుతమైన ఉపన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఈయన దయానంద సరస్వతి ఆశ్రమంలో ఆయన దగ్గర శిక్షణ పొందారుట. ఆయన కేరళీయుడు. తెలుగు రాదు. ఇంగ్లీష్ లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆ ఇంగ్లీష్ యెంత సులభంగా ఉండేదంటే, ఆయన ఉపన్యాసం అనువాదం లేకుండానే అందరికీ అర్ధం అయిపోయేది. ఆయన్ని ఇంగ్లీష్ స్వామి, ఇంగ్లీష్ స్వాములవారు అనేవారు. అందరూ ఆయన ఉపన్యాసాలని ఇష్టంగా వినేవారు. ఆయనకీ అభిమానులెక్కువై పోయారు. సాధుపరిషత్ వాళ్ళ సమ్మేళనం అయిపోయాక కూడా ఆయనని భక్తులందరూ రిక్వెస్ట్ చేసి తెనాలిలోనే ఉంచేశారు. ఆయనతో పాటు, ఇన్నిరోజులూ ఆయన సహాయకుడిగా ఉన్న ఒక తెలుగు స్వామి, (ఆయన్ని అందరూ కోమటిస్వామి అనేవారు) కూడా ఆయనతో పాటే ఉండిపోయారు.

                                                    స్కూళ్ళు తెరిచేయటంతో, ఆ భక్తులందరి రిక్వెస్ట్ మీద, మా నాన్న ఆ స్వాములిద్దరికీ మాఇంట్లో గది ఇచ్చేసారు. వీరికి పీఠం లేదు కానీ వారి పంచాయతనం వారికి ఉండేది. భోజనం యధావిధిగా ఎవరు భిక్షకి పిలిస్తే, వారింటికి, లేకపోతే మా ఇంట్లోనే. నివాసం మాత్రం పూర్తిగా మా ఇంట్లోనే. ఆ రోజుల్లోనే మా పిల్లలందరితో ఆయన భజనలు చేయించేవారు. అంతే కాక, మా పిల్లలందరికీ సరస్వతీ మంత్రం ఉపదేశించారు. మాకందరికీ చదువులు బాగా రావాలని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచీ అందరం రోజూ కరమాలతో సరస్వతీ జపం చేసుకునేవాళ్ళం. నాకూ, పక్కింటి దుర్గకీ సరస్వతీదేవిదే మరొక మంత్రం పూర్తిగా బీజాక్షరాలతో ఉండే మంత్రం ఇచ్చి జపం చేసుకోమన్నారు. ఆ పైన నేను నా ఇష్ట దైవం రాముడు అని చెప్పి రామ మంత్రం కూడా ఇవ్వమని అడిగాను. నాకు ఆ మంత్రం కూడా ఉపదేశం ఇచ్చారు. రెండో సరస్వతీ మంత్రం చేస్తే, మొదటిది చెయ్యక్కర్లేదని అనుమతి కూడా ఇచ్చారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఆ రెండు మంత్రాలూ జపం చేస్తూనే  ఉన్నాను. ఈ మధ్యనే బదరీనాథ్ లో కామధేనువు చెవిలో కొన్ని మంత్రాలు చెప్పి వదిలేసాను. అయినా మననం మాత్రం జరుగుతూనే ఉంది. మననాత్ త్రాయతే ఇతి మంత్రః కదా. మననం చేస్తూ ఉంటే మంత్రం రక్షిస్తుందని భావం.

                         

                                               ఈ ప్రభావంతో ఆ రోజుల్లోనే మా స్కూల్లో సంస్కృతం తెలిసిన టీచర్లందరూ కలిసి విద్యార్థులందరికీ ఎవరికైనా సంస్కృత కావ్యాలు, భగవద్గీత చదువు కోవాలనిపిస్తే, స్కూల్ అయిపోయాక, ఒక ఎక్స్ట్రా పీరియడ్ లో సంస్కృతం చదివిస్తామని చెప్పారు. మా నాన్న నన్నూ, మా పెద్ద చెల్లెలు భారతినీ కూడా ఆ ఎక్స్ట్రా క్లాస్ కి పంపించారు. అప్పటికే మా ఇద్దరికీ కూడా సంస్కృతం ఒక సబ్జెక్ట్ గా ఉండేది. ఆ రోజుల్లో ముందుగా ధాతువులు, శబ్దమంజరి, అమరకోశం, కొంచెం చెప్పి, భగవద్గీత, రఘువంశం మొదలుపెట్టారు. ఆరోజుల్లో నేర్చుకున్న శ్లోకాలు "వాగర్ధావివ సంపృక్తౌ..", "ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వద్ధమ్ ప్రాహురవ్యయమ్...." ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. భగవద్గీతలో ముందుగా పురుషోత్తమప్రాప్తి యోగం మొదలుపెట్టారు. ఒక మూడు, నాలుగు నెలలు జరిగాక, ఆ క్లాసు లెందుకో ఆగిపోయాయి. ఇంగ్లీష్ స్వాములవారు కొన్నాళ్ల తరువాత వెళ్లిపోయారు కానీ, మళ్ళీ కొద్ది నెలల తరువాత భక్తుల కోరిక మేరకు తిరిగి వచ్చారు. రెండోసారి, మాకు ఎందుకో మా ఇంట్లోనే  ఉండి చదువుకునే బంధువులు ఇద్దరుండటంతో ఆ గది ఖాళీ లేకపోయింది. అప్పుడు నాన్నే, మా ఇంటి ఓనర్ కృష్ణ ప్రసాద్ గారిని అడిగి, వాళ్ళ వాటాలో మేడమీద ఓ గది స్వామీజీకి ఇప్పించారు. అప్పుడు కూడా చాలా రోజులున్నారు. ఆ రోజుల్లో ఆయన నాకో అసైన్మెంట్ ఇచ్చి రోజూ కనీసం భగవద్గీతలో నుంచి పది శ్లోకాలని అప్పచెప్పాలని ఆదేశించారు. రోజూ ఓ పది శ్లోకాలని బట్టీ పట్టటం, వెంటనే అవి పైకి మేడ మీదకి వెళ్లి స్వాములవారుకి అప్పచెప్పటం, ఇదే పని.  అలా ఆయన ఉన్నంతకాలం జరిగింది. అలా నాకే గీత అంటే ఎక్కువగా ఏమీ తెలియని వయసులో భగవద్గీత పఠనం మొదలయ్యింది. నాన్నకీ, అమ్మకీ కూడా ఇంగ్లీష్ స్వామీజీ మంత్రాలు ఇచ్చారు. మా అమ్మ చాలాకాలం ఆ జపం  చేసేది. నాన్న మాత్రం  కొద్ది  రోజులకే వదిలేశారు. ఈ ఇంగ్లీష్ స్వామీజీ  నాలుగేళ్లు వరుసగా వచ్చి హైందవ ప్రచారం చేశారు. ఈయన ధర్మమా అని మాకు సంస్కృతం, ఇంగ్లీష్ రెండూ కాస్త కాస్త వచ్చాయి.

                                           

                                                   ఈసారి ఇంగ్లీష్ స్వాములవారు మోటివేట్ చేసి మొదటిసారి తెనాల్లో చండీ యాగం చేయించారు. ఆ యాగంలో సుమారు పదిమంది దంపతులు యాగ యాజమాన్యం వహిస్తూ కంకణ ధారణ చేశారు. వాళ్ళల్లో మా అమ్మా, నాన్న కూడా ఒకరు. ఆ యాగం చాలా పెద్ద ఎత్తున సుమారు 10 రోజులపాటు జరిగింది. పదో రోజున పూర్ణాహుతి జరిగింది. ఆ తొమ్మిది రోజులూ పెద్ద జాతరలా జరిగింది. ఒక రోజు సువాసినుల చేత కుంకుమార్చన చేయిస్తే, ఒక రోజు కుమారీ పూజ చేసారు. ఒక రోజు వేదపఠనం జరిగితే, మరో రోజు మరో పఠనం జరిగేది. అప్పుడే మాకు సామవేదమంటే సంగీతమని తెలిసింది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేక పూజ జరుగుతూ ఈ చండీయాగం సాగింది. బంగారం కొనమంటే, ఆమ్మో ఎంతో రేటు అని ఎప్పుడూ తప్పుకునే నాన్న కూడా కొంత బంగారం, వెండి కొని, దానితో సువర్ణ, రజత పుష్పాలు చేయించి పదవరోజున పూర్ణాహుతిలో వేయించారు. ఒక పెద్ద కంచిపట్టు చీరలో ఆ పూర్ణాహుతి ద్రవ్యాలు అన్నీ వేసి, మూట కట్టి హోమంలో వేయించారు. అలా పూర్ణాహుతి కోసం ప్రత్యేక ద్రవ్యాలు తెచ్చి సమర్పించిన వారెందరో. పన్నెండో రోజుకి కూడా ఆ హోమం ఇంకా వేడిగానే ఉంది. అప్పుడే అందరికీ ఆ యాగ భస్మం ప్రసాదంగా ఇచ్చారు. జనం బారులు తీరి ఆ యాగ భస్మాన్ని ప్రసాదంగా భక్తిగా తీసుకున్నారు. మేము వేసిన ఆ పువ్వులు ఓ నాలుగైదు మాక్కూడా ఆ భస్మప్రసాదంలో వచ్చాయి. ఆ వస్తువులన్నీ చాలాకాలం మాఇంట్లో ఉండేవి. అవి ఇప్పుడు ఏమయ్యాయో  గుర్తే లేదు. ఈ ఇంగ్లీష్ స్వాములవారు దాదాపుగా మా కుటుంబం లో ఒక భాగమైపోయినట్టుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఈయన కోసం వచ్చే పోయే భక్తులతో మా ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ తరువాత ఆ ఇంగ్లీష్ స్వామీజీ ఈ చండీ యాగానికి కంకణం కట్టుకున్న ఈ పదిమంది దంపతులకూ, తరువాత ఒక సంవత్సరం లోపల  రుద్రయాగం కూడా చేసుకుంటే మంచిదనీ, అలా చెయ్యాలనీ చెప్పారు. కాకపోతే మళ్లీ అటువంటి అవకాశం తెనాలిలో రాలేదు. అప్పుడు ఈ పదిమంది దంపతులూ, ఆ రుద్రయాగం జిల్లెళ్ళమూడిలో చేస్తున్నారని తెలిసి, అక్కడికి వెళ్లి ఆ యాగానికి కూడా కంకణధారణ చేసుకుని ఆ రుద్రయాగం కూడా పూర్తి చేసుకున్నారు. ఆ విధంగా అమ్మా, నాన్నా రుద్ర, చండీయాగాలు రెండూ చక్కగా చేసుకున్నారు.

                                                                ఈ వివరాలు ఇక్కడితో ఆపి, మరిన్ని వివరాలు తరువాత పోస్టులో పెడతాను. దాంట్లో నాన్నకి, తద్వారా మాకందరికీ కూడా కంచి, శృంగేరి, పుష్పగిరి, కుర్తాళం పీఠాలతో ఉన్న సాంగత్యం గురించి చెపుతాను. ప్రస్తుతానికి స్వస్తి.

                                                                 










                                                 


9, జూన్ 2020, మంగళవారం

సంబరంగా ఆరాధనలు, ఆబ్దీకాలు

సంబరంగా ఆరాధనలు, ఆబ్దీకాలు  

భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                        

                                                        ఇక మా ఉమా పెదనాన్నా వాళ్ళ ఇంట్లో ఎంతో సంబరంగా జరిగే ఆరాధనలు, ఆబ్దీకాలు గురించి చెప్తా. సంబరాలేంటి, ఆరాధనలేంటి, ఆబ్దీకాలేంటి అనుకుంటున్నారా. మా పిల్లలకి అవన్నీ పెద్ద సంబరాలు. పెద్దలకీ అంతేననుకోండి. ఎందుకంటే మా ఫామిలీలో ఒక అన్ రిటెన్ రూల్ ఏమంటే, ఏదో మరో పెద్ద ఇబ్బంది ఉంటే తప్ప ఈ కార్యక్రమాలకి ఎవరూ మిస్ కాకూడదని. సుమారు 20, 25 మంది చిన్నపిల్లలు, ఓ 10, 15 మంది పెద్ద పిల్లలు, మరో 20 మంది దాకా పెద్దలు, ఇంతమంది ఒక్కసారి, ఒక్కచోట కలుసుకునే అవకాశాలు సంవత్సరానికి ఆ రెండే. మొదటిది మా తాతగారు స్వర్గీయ ఆనందరామయ్య గారి ఆరాధన, ఆబ్దీకం, రెండోది బామ్మ, విజయరామమ్మ, వియ్యమ్మ గారి ఆబ్దీకం. అందులోనూ మా తాతగారు సన్యాసం తీసుకున్న తరువాత చనిపోయారు కనుక, ఆయనకి మొదటి రోజు ఆబ్దీకం పెట్టి, రెండో రోజు ఆరాధన చేసేవారు. ఇలా చాలాకాలం జరిగింది. ఆ ఆరాధన సమయంలో అప్పటి కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమ రామానంద భారతి స్వామి కూడా వచ్చే వారు. ఆయన మా పెద్ద పెద్దనాన్నగారికి క్లాస్ మేట్. వారు చెప్పారు, సన్యాసులకు ఆబ్దీకాలు పెట్టకూడదు. వాళ్ళు సన్యాసం తీసుకున్నారంటేనే, వాళ్ళ ఆత్మ పిండం వాళ్ళే వేసుకుని, సన్యాసాశ్రమం లోకి ప్రవేశిస్తారు. కనుక వాళ్లకు ఆబ్దీకాలు ఉండవని తేల్చి చెప్పారు. దాంతో, తాతగారికి ఆబ్దీకాలు మానేశారు, కానీ ఆరాధనలు మాత్రం ప్రతియేటా ఆ రోజు చేసేవాళ్ళు. ఈ త్రివిక్రమ రామానంద భారతి స్వామివారు ఆ రోజుల్లో తెనాలిలో మా ఇంటికి వచ్చి పీఠం పెట్టి, మా నాన్న ప్రిన్సిపాల్ గా చేసే కాలేజీలో ప్రవచనాలు ఇచ్చేవారు. వారి ద్వారానే పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహ భారతి స్వామి కూడా మాకు పరిచయం అయ్యారు. వారూ అలాగే, మా ఇంట్లో పీఠం పెట్టి కాలేజీలో ప్రవచనాలు ఇచ్చేవారు. పుష్పగిరి పీఠానికి కుర్తాళం పీఠం ఉప పీఠం. సరే, ఈ వివరాలన్నీ మరో పోస్ట్ లో రాస్తాను. ప్రస్తుతానికి వద్దాం. ఆ రకంగా తాతగారికి ఆబ్దీకాలు ఆపి ఆరాధనలు మాత్రం జరుపుకోటానికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

                                                                  తాతగారికి ఈ ఆరాధనలు (ఆబ్దీకాలు) జరిగేటప్పుడు, అన్నదమ్ములు ఏడుగురూ, వరసగా కూర్చుని చేసేవారు. ఒక పెదనాన్న దత్తు వెళ్లారు కనుక ఆయన కూర్చోలేడు. బామ్మ తద్ధినానికైతే ఐదుగురే. బామ్మ తన పిల్లలు ఇంతమంది ఇంత శ్రద్ధగా శ్రాద్ధం పెడుతుంటే, దిష్టి కొడుతుందని భయపడేది. పొద్దున్నే పిల్లలందరికీ వదినలు, అత్తయ్యలు అన్నాలు పెట్టేసేవారు. లేకపోతే, మామూలుగా భోజనాలయ్యేసరికి మూడో, నాలుగో అయ్యేది. మా పిల్లలు అంతవరకూ ఆకలికి ఆగలేరని, మాకోసం వేరే వంట చేయించి అన్నాలు పెట్టేసేవారు. కోడళ్లందరూ మడి కట్టుకుని వంటలు పర్యవేక్షిస్తూ లోపలే ఉండి పోయేవారు. సో, అమ్మలూ, నాన్నలూ బిజీ. అన్నాలు తినేసాక పిల్లలందరం ఎన్ని రకాల ఆటలు ఆడుకునే వాళ్ళమో. కొత్త కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడేవాళ్ళం. యెంత సంబరంగా ఉండేదో, అలా అందరం కలుసుకుని ఆడుతుంటే. పెళ్ళిళ్ళకీ అందరం కలుస్తాం కానీ, అప్పుడు ఇలా ఖాళీ ఉండేది కాదు. ఏదో పని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కొంతమంది పెద్దపిల్లలు అందరినీ ఏమార్చి సినిమాలకి వెళ్లిపోయేవాళ్లు. కొంతమంది పేకాట, లేకపోతే కారంబోర్డో ముందేసుకుని కూర్చునే వాళ్ళు. మా ఉమా పెదనాన్న వాళ్ళింట్లో ఓ పెద్ద కారంబోర్డు అటక మీద ఉండేది. వేసవి సెలవుల్లోనూ, లేదా ఇంటికి అందరూ వచ్చినప్పుడో దాన్ని దించేవారు. పేకాట అంటే, పెద్ద పెద్ద ఆటలు కావు, బొమ్మస్తుందా రాదా లాంటి ఆటలు. బామ్మ ఉన్నప్పుడైతే, కొందరం బామ్మ చుట్టూతా కూడా చేరేవాళ్ళం. యెంత బిజీగా ఉండే వాళ్ళమంటే, మధ్యలో పిండాలకి దణ్ణం పెట్టమని, మా పిల్ల మూకని కూడా ఓ సమయంలో పిలిచేవాళ్ళు. అందరం వరుసలో వెళ్లి దణ్ణాలు పెట్టేసుకుని మళ్ళీ వచ్చి ఆటల్లో, కబుర్లలో పడిపోయేవాళ్ళం. పెద్దవాళ్ళ భోజనాలు అయి, మమ్మల్ని పిలిచేదాకా ఆకలి మాటే గుర్తొచ్చేది కాదు. ఆకలి ఎందుకేస్తుందీ, పొద్దున్నే శుభ్రంగా అన్నీ తిన్నాంగా. ఈ కార్యక్రమం అయిపోయి అందరం తిరిగి వెళ్లిపోతుంటే, ఎంత బాధ వేసేదో, దిగులుగా ఉండేదో. మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళితే, అన్నీ మామూలు రొటీనే కదా మరి.

                                                                    బామ్మ పోయినప్పుడు మాత్రం మా ఈ కోలాహల పర్వం ఓ పది రోజులు సాగింది. పెద్దావిడ పోయిందనే దుఃఖం లేదు కదా, అదో పండగ లాగా ఉండేది. మా కొత్త ఆటలు కనిపెట్టే గోలలో, శ్రీలక్ష్మి, ఉమా పెదనాన్న కూతురు, అప్పుడు దానికి పదేళ్లేమో. వాళ్ళ ఇల్లు మూడంతస్థుల మీద కదా. ఒక స్టెయిర్ కేస్ లోపల నుంచే ఉండేది. మెట్ల పైకి ఎక్కడం, ఆ రాంప్ మీద నుంచి జర్రున జారటం, మళ్ళీ ఎక్కటం, మళ్ళీ జారటం, ఇదో ఆట. పాపం శ్రీ లక్ష్మి పడి దాని కాలు విరిగింది. దాంతో కొన్ని ఆటలు బంద్ అయ్యాయి. అది మాతో ఆడలేకపోతున్నా అని పాపం గోల పెట్టేది. మా ఇందిరక్క ఏమో, ఎప్పుడూ పెద్దమనిషే, మాలా ఈ చిల్లర ఆటలు ఆడేది కాదు. బుద్ధిగా, బాధ్యతగా ఉండేది. శ్రీలక్ష్మిని అన్నాళ్ళూ తనే చూసుకుంది. అలాగే మా చిన్నన్నయ్య మురళి కూడా చాలా పెద్దరికంగా డబ్బు బాధ్యత చూసుకునేవాడు.ఇక మిగిలిన పెద్ద మగపిల్ల లందరూ ఇంకోరకం అల్లరి చేసేవాళ్ళు. భోక్తలు భోజనం చేస్తుంటే, వీళ్ళ రాగింగ్ మామూలుగా ఉండేది కాదు. వెనకాల గదిలో కూర్చుని, ఏ భోక్త ఎన్ని గారెలు తిన్నాడో, ఎన్ని అప్పాలు తిన్నాడో లెక్కేసేవాళ్ళు, 1, 2.....10 అంటూ. లెక్కపెట్టి, హోరున నవ్వులు. లోపల వడ్డిస్తున్న పెద్దవాళ్ళకి అర్ధం అయ్యేది కాదు, వీళ్లెందుకు నవ్వుతున్నారో. ఏయ్, ఈ అల్లరేంట్రా, పొండి, అని కేకలేసేవాళ్ళు. కాసేపు ఊరుకుని మళ్ళీ మొదలు. ఎవరి సందడి వాళ్లదే. మొత్తం మీద, ఈ తద్దినాలూ, ఆరాధనలూ ఎంచక్కా, ఏ అడ్డంకులూ లేకుండా జరిగేవి.


ఓసారి ఓ తమాషా జరిగింది. బామ్మకి అందరూ తద్దినం పెట్టేసాక ఆ పిండాలని కృష్ణా నదిలో కలిపే పని అందరి కన్నా చిన్నవాడు అని శ్రీధర్ బాబాయికి అప్పచెప్పారు. బాబాయిది ఓ కండిషన్ ఉండేది. తాను తిరిగి వచ్చేదాకా అన్నయ్య లెవరూ అన్నం తినకూడదని. రోజూ అలాగే జరిగేది. ఓ రోజు పాపం బాబాయికి ఎందుకో బాగా లేట్ అయ్యింది. దాంతో పెద్ద వాళ్ళు నీరసం వస్తుంటే, ఇక లాభం లేదు, వాడు వచ్చాక తింటాడులే అని భోజనాలు మొదలుపెట్టారు. మధ్యలో వచ్చాడు బాబాయ్. ఇంకేముంది, చర్రున కోపం వచ్చింది. నన్ను చిన్నపిల్లాడిని చేసి పంపించి, మీరు మాత్రం తినేస్తున్నారు, అని అలిగాడు. ఎంతకీ భోజనానికి రాడు. ఎవరు చెప్పినా వినలేదు. మా పిన్నిని చెప్పమంటే, పిన్నేమో, మీమాటే వినంది నా మాటేం వింటారు, అని తప్పుకుంది. చివరికి పెద్దత్తయ్య వచ్చి గట్టిగా అరిస్తే కానీ కదలలేదు. పెద్దత్తయ్య, పేరుకు అక్కయ్యే కానీ, అందరికీ బామ్మ తరువాత తానే తల్లిలా ఉండేది. ఆవిడదెప్పుడూ తల్లి మనస్తత్వమే. "పెద్దవాళ్ళు, పెద్దన్నయ్యా, పెద్ద బావగారూ యెంత సేపు ఆగగలర్రా, నేనే భోజనాలు మొదలు పెట్టమన్నాను. లే భోజనానికి రా" అని బాబాయిని గట్టిగా కేకలేసింది. పాపం ఆకలికూడా వేస్తోందేమో, పైగా మే నెల బ్లేజ్ వాడ ఎండల్లో మిట్ట మధ్యాన్నం కృష్ణా నది దాకా వెళ్లి వచ్చాడేమో, తనకీ నీరసం వచ్చి ఉంటుంది. సరే, బాబాయ్ అలక మాని భోజనానికి కూర్చున్నాడు, కానీ నాకు నెయ్యి వద్దు, అంటూ, తనే నెయ్యి బదులు మంచినీళ్లు వడ్డించుకుంటూ మొత్తానికి భోజనం ముగించాడు. ఏదో, అలా అలకలతో ఆ పూట భోజనాలు పూర్తి అయ్యాయి. మా పిల్లలందరం, ఈ బాబాయి ఏమిటి, ఇలా అల్లరి చేస్తున్నాడు, చిన్నపిల్లాడిలా అనుకున్నాం. అప్పుడు పెద్దత్తయ్య చెప్పింది, "మా అందరిలోకీ చిన్నవాడు కదే, మాకు అందరికీ వాడంటే ముద్దే, అయినా మా దగ్గర అలగక పోతే, ఇంకెక్కడ అలుగుతాడూ", అని నవ్వేసింది. ఆయనంటే అందరికీ అంత ముద్దు మరి. ఇదీ అందరిలోకీ చిన్నపిల్లాడయిన మా ముప్ఫయి ఏళ్ళ బాబాయి అలక పర్వం ముచ్చట.

                                                        ఇక్కడ బ్లేజ్ వాడ అనే పేరు విజయవాడకి ఎలా వచ్చిందో కాస్త చెప్తాను. అసలు విజయవాడ నగరం గురించి కొంచం చెప్పుకుందాం. పాండవమధ్యముడు, అర్జునుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే కిరాతుడి రూపంలో ఉన్న శివుడితో యుద్ధం చేసి, శివుడ్ని మెప్పించి, వరంగా పాశుపతాస్త్రాన్ని పొందాడు. అప్పటినుంచీ అర్జునుడికి విజయుడు అన్న పేరు వచ్చింది. విజయుడు విజయం పొందిన ప్రాంతం కనుక ఈ ఊరి పేరు విజయవాటిక, విజయవాడ అయ్యింది. అర్జునుడు ఆ కాలంలో శివుడి గురించి తపస్సు చేసుకొన్న ఆ ఆలయమే విజయేశ్వరస్వామి ఆలయం. ఇది ఇంద్రకీలాద్రి కిందనే ఉన్నది. ఈ ఆలయం పాండవుల కాలం నాటి దన్న విషయాన్ని సూచించే శిలా శాసనం కూడా ఇక్కడ ఉంది. ఈ వివరాలన్నీ భారవి రాసిన కిరాతార్జునీయం అనే సంస్కృత కావ్యంలో ఉంది. అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మ గురించి కొద్దిగా  రాస్తే చాలదు. పూర్తిగా వేరే పోస్ట్ రాస్తాను. తరువాత మొఘల్స్ కాలంలో ఇక్కడే ఒక హజరత్ బల్ దర్గా వచ్చింది. దాంట్లో వారి ప్రవక్త మహమ్మద్ వెంట్రుక ఉంది. దాన్ని సంవత్సరానికో సారి భక్తులకి చూపిస్తారు. ఆ మతానుయాయులకి అది ఒక పవిత్ర ప్రదేశం. ఇలాంటిదే మరొక వెంట్రుక మరో హజరత్ బల్ దర్గా కాశ్మీర్ రాష్ట్రం లోని శ్రీనగర్ లో ఉంది. ఆ తరువాత ఇంగ్లీషు వాళ్ళు విజయవాడ వచ్చి ఇక్కడి మండే ఎండలు చూసి దడుచుకుని ఈ ఊరుని బ్లేజ్ వాడ అన్నారు. నెమ్మదిగా రానురానూ అది బెజవాడగా మార్పు చెందింది. ప్రస్తుతం ఇక్కడ మండుతున్న ఎండల గురించిన సందర్భం కనుక బ్లేజ్ వాడ అనే పేరుని పైన వాడాను.  
                                                             
                                                                             ఆ పది రోజుల్లోనే ఇంకో ముచ్చట కూడా జరిగింది. విజయవాడ పెదనాన్న ఇంట్లో నీళ్ళకి బావి ఉంది, దానికి మోటార్ ఉంది. స్విచ్ వేస్తె చాలు, నీళ్లు టాపుల్లో వచ్చేవి. ఓ రోజు మోటార్ పాడైంది. పెదనాన్న పెద్ద వాటర్ ట్యాంక్ తెప్పించాడు. కానీ ఆ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి, మోటార్ లేదు కదా. ఇలాంటి సందర్భాల్లో పనులు చేయటంలో, చేయించటంలో మా సాంబాబాయ్ బెస్ట్. మా అందరినీ పిలిచి బకెట్లు ఇచ్చి నీళ్లు మాతో పైకి మోయించాడు. మేము సుమారు 40 మంది దాకా ఉండటంతో, ఏ ఒక్కరికీ బకెట్ పక్కవాళ్ళకి ఇవ్వటమే కానీ మోయాల్సిన అవసరం రాలేదు. ఒక్కో మెట్టు మీద ఒక్కోళ్లు నుంచుని ఈజీగా మోసేసాం. అందరం ఎంతో సరదాగా టాంకుడు నీళ్లన్నీ పైకి మోసేసాం. "సాధీ, హాథ్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్ కర్ బోఝ్ ఉఠానా" నయాదౌర్ సినిమాలో లాగా ఇంతమంది ఉండేసరికి పని తేలిగ్గా అయిపొయింది. రామదండు కలిసి రామసేతు కట్టినట్టు, మా దండు అందరం కలిసి పెద్ద పని చేసినా, ఆడుతూ, పాడుతూ సరదాగా చేసేశాం.

                                                               ఇప్పుడు చెప్పండి, నేను పెట్టిన టైటిల్ తప్పా? ఇవన్నీ మా కుటుంబంలో సంబరాలు కావా? అయినా పెద్దవాళ్లు పోతే వాళ్ళ తద్దినాలు పండగల్లాగా చెయ్యాలి అని ఆ పెద్దలు చెప్పిందే కదా. మొత్తం మీద ఆ పది రోజులూ ఇంత సందడి సందడిగా కాలం గడిపి అందరం మళ్ళీ ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నాం, మళ్లీ సంవత్సరం ఆబ్దీకం కోసం ఎదురుచూస్తూ.










8, జూన్ 2020, సోమవారం

బామ్మ-నిష్క్రమణం

బామ్మ-నిష్క్రమణం 

                     భట్టిప్రోలు విజయలక్ష్మి  


                                                                     అప్పటికి ఉమా పెదనాన్న ఇంటి నుంచి బామ్మ మా ఇంటికి వచ్చి మూడు వారాలు. ఈ మూడు వారాలు ఇంట్లో అందరికీ ఏదో ఒక రకంగా తన చాదస్తం, పెంకితనంతో చుక్కలు చూపించింది. వాటిల్లో ఒకటి నా చేతిలో మందులు లాక్కుని తనే పొరపాటున ఒక మందుకు బదులు ఇంకో మందు వేసుకుని చేసిన హడావుడి. పాపం అప్పటికప్పుడు సరోజినత్తయ్య బందరు నించి వాళ్ళ అమ్మకి ఏమైపోతుందో అని పరిగెత్తుకు వచ్చింది కూడాను. ఒకరోజు 'లీలా,నాకు ఓపిక లేదే, స్నానం చెయ్యలేను, స్నానం చెయ్యకుండా, మడి కట్టుకోకుండా అన్నం తినలేను, ఎలా' అన్నది. అచ్చం బైజూబావరా సినిమాలో స్వామి హరిదాస్ లాగా. అమ్మేమో అప్పుడు పాపం మడి కట్టుకుని ఉన్నది. వెంటనే ఓపికకు ఓ గ్లాసుడు హార్లిక్స్ కలిపి ఇచ్చింది. బామ్మకి కొంచం ఓపిక వచ్చింది. అసలే మా బామ్మకి హార్లిక్స్ మీద అపారమైన గురి. అదే ఆ రోజుల్లో ఆవిడకి ఎలిక్సర్. ఈసారి పాపం హార్లిక్స్ తాగినా బాత్రూంకి వెళ్లేంత ఓపిక రాలేదు. అప్పుడు నేనే, 'బామ్మా నేను నీళ్లు పోయనా', అని అడిగి ఓ చెక్క కుర్చీ తెచ్చి ఆవిడ మంచానికీ, తూముకీ మధ్యలో వేసి, దాంట్లో ఆవిడను కూర్చోబెట్టి స్నానం చేయించా. ఈ ఏర్పాటు చూసి చాలా ముచ్చట పడింది. స్నానం చేయించి, మడి బట్టలు కట్టి, కుర్చీ మీద కూర్చోబెట్టాను. మా అమ్మ ఒక కంచంలో బామ్మ భోజనం పెట్టి పట్టుకొచ్చి, కుర్చీ పక్కన ఒక టేబుల్ వేసి, ఇహ ఇక్కడే తినండి, అంది. అలా ఆ రోజు బామ్మ మొదటిసారిగా వంటింట్లో కాకుండా తన గదిలోనే కుర్చీలో టేబుల్ మీద కంచం పెట్టుకుని భోజనం చేసింది. ఆ రోజు నుంచీ అమ్మ బామ్మ భోజనానికి అదే ఏర్పాటు చేసేది. నాకూ అప్పుడు సమ్మర్ సెలవులు కనుక, బామ్మకి స్నానం చేయించే డ్యూటీ వేసుకున్నా. నాన్నేమో బామ్మ గది తలుపులకి, కిటికీలకీ వట్టివేళ్ల తడికలు కట్టించి ఓ టేబుల్ ఫ్యాన్ బామ్మ కోసం ప్రత్యేకంగా పెట్టి, ఆ రూమ్ చల్లగా చేసాడు. ఆవిడ గదిలోకి వెళ్తే, అంత చల్లగా అలవాటు లేక మాకు చలేసేది. ఆ సంవత్సరం ఎండలు కూడా చాలా మండిపోయాయి. మా అమ్మకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. ఈసారి ఈ ఎండలు తట్టుకోవటం పాపం మీ బామ్మకి కష్టమే అన్నది. 

                                                   స్నానానికి అంత ఏడిపించేది కాదు కానీ, తలంటుకి మాత్రం నన్ను తినేసేది. జుట్టు ముట్టుకుంటే, కయ్యి మనేది. 'ఓ లీలా, నీ కూతురు నన్ను చంపేస్తోంది', అని మా అమ్మకి వినిపించేలా అరిచేది. మొదట్లో కాస్త భయపడ్డా, 'అబ్బే, ఈవిడ అరుపులకి భయపడితే అసలు తలస్నానం కానే కాదని, చకచకా నా పద్ధతిలో నేను కుంకుడు రసమో, శీకాయ రసమో పోసి తల రుద్దేసేదాన్ని. ఆ రోజుల్లో మాకు షాంపూలు తెలియవు. రోజూ నా పని ఇదే, బామ్మకి స్నానం చేయించటం, మడి బట్టలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టటం, నూనె రాసి  చిక్కు తీసి తలా దువ్వటం. మా అమ్మేమో ఆవిడ గదికే భోజనం తెచ్చి పెట్టటం. వారానికోసారి, తలంటి పొయ్యటం. ఆ రోజుల్లోనే, కూర్చుని చచ్చిపోతే స్వర్గానికీ, మంచం మీద పడుకుని చచ్చిపోతే నరకానికీ పోతాం అనే కొత్త ఫిలాసఫీ అందరికి చెప్పి, దాన్నే  చివరిదాకా పాటించింది. మధ్యాన్నం భోంచేసి ఆ కుర్చీలోనే కూర్చుని కునికిపాట్లు పడుతూ బోల్డు కళ్లజోళ్లు విరగ్గొట్టుకున్నది. మళ్లీ కంటి హాస్పిటల్ కి మాత్రం ఓపిక లేదు అన్న మాట ఎత్తకుండా వచ్చేది. ఆ ఒక్క పనే ఆవిడకి సరదాగా ఉండేదో ఏమో మరి. ఎవరు ఎంత చెప్పినా మధ్యాన్నం నిద్ర మాత్రం కుర్చీలోనే, అదీ కళ్ళజోడు పెట్టుకునే. రాత్రిపూట మాత్రం మంచం మీద పడుకోవటం పాపం తప్పలేదు. ఎందుకో ఇక ఎక్కువ రోజులు బతకదనే విషయం ఆవిడకి తెలుసేమో అన్నట్టు ప్రవర్తించేది.  కానీ చనిపోతాననే భయం మాత్రం ఆవిడలో నేనెప్పుడూ చూడలేదు. తన పాటలు, భజనలు తను పాడుకునేది. మనసు పుడితే కూర్చోబెట్టి ఏవో పాత కాలం ఖబుర్లు చెప్పేది. ఇలా కొన్నాళ్లు గడిచింది.

                                                       డాక్టరుగారు చెప్పిన పథ్యం  పాటించి నాకు మరీ చప్పిడి తిండి పెడుతున్నారు, అని గోల చేసేది. ఓసారి ఇంటి ఓనర్ కృష్ణప్రసాద్ గారు వస్తే, వీళ్ళు నాకు సరిగ్గా నచ్చింది పెట్టట్లేదండీ, అని కంప్లైన్ చేసింది. పాపం మా నాన్న ఎంబరాస్ అయ్యాడు. కృష్ణప్రసాద్ గారు మాత్రం, పోనీలెండి, నేను మీకోసం మన కొబ్బరి చెట్టు మీద నుంచి ఇప్పుడే బొండాలు దింపించి ఇస్తాను. చల్లగా ఆ నీళ్లు తాగండి, అని అప్పటికప్పుడు ఎవరినో పిలిపించి బొండాలు దింపించి మరీ ఆవిడతో కొబ్బరినీళ్లు తాగించాడు. కృష్ణప్రసాద్ గారు కూడా మా బామ్మని చాలా గౌరవంగా చూసేవాడు. తరువాత మరో రోజు పక్కింటివాళ్ళు అప్పడాలు పెడుతుంటే, ఆ పిండి అడిగి తీసుకువచ్చి ఎంత వద్దంటున్నా, అది అన్నంలో కలుపుకుని తిన్నది. ఆ రోజు లూజ్ మోషన్స్. పైగా నేనేం తినలేదని డాక్టరుతో చెప్పండి, అని ఓ ఉచిత సలహా ఇచ్చేది. మా అమ్మ ఇలా  ఈవిడ నాకు తెలిసి ఎప్పుడూ లేదు, ఎవరికైనా పెట్టటమే కానీ, అడిగి తీసుకొచ్చి తినటం నేను ఎప్పుడూ చూడలేదు, అని వాపోయింది. డాక్టర్ పుల్లయ్యగారికి చెప్తే, ఇంక ఆవిడని వదిలెయ్యండి, కావలసినవి తిననియ్యండి. అని పథ్యం నియమాలు పూర్తిగా  తీసేసారు. మాకు వింతగా ఉండేది. బామ్మ ఏమిటి, ఇలా చేస్తోంది, అని. ఇక ఆ చివరిరోజు రానే వచ్చింది.
                                                     
                                                               ఆ రోజు అనుకోకుండా ఆరుగొలను నుంచి ఆ ఊరు చిన్న కరణం గారు, ఎవరినో తీసుకుని బామ్మ కోసం మా ఇంటికి తెనాలి వచ్చారు. ఆయన పేరు నండూరి వెంకటేశ్వరరావు. బామ్మకీ, మా అమ్మకీ దూరపు బంధువు కూడాను. ఆరుగొలనులో మా అమ్మా వాళ్ళ పక్కిల్లే ఆయనది. ఆ ఊరికి మా తాతగారు, అమ్మా వాళ్ళ నాన్న, కరణం. ఆయన పోయిన తరువాత ప్రస్తుత కరణం ఈయనే. అప్పటికి మా అమ్మ వాళ్ళ నాన్నగారు పోయి ఒక సంవత్సరం. ఆయన్ని చూడంగానే బామ్మ మహా సంతోష పడిపోయి కాసేపు చక్కగా ఊరి విశేషాలు మాట్లాడింది. ఆయన కాస్తా నెమ్మదిగా, తనతో వచ్చిన వ్యక్తి, ఆరుగొలనులో బామ్మ ఇల్లు కొంటానంటున్నాడని చెప్పాడు. ఇక అంతే, జుయ్యిమని తారాజువ్వలా లేచి, ఆయన్నీ, ఆయనతో వచ్చిన వాడినీ నానా తిట్లూ తిట్టింది. నువ్వెంత, నీ బతుకెంత, నా ముందు గోచీల్లేకుండా తిరిగిన బుడ్డోళ్లు మీరంతా, నా ఇల్లు అమ్మించేంత వాడివయ్యావా, అని రామ, రామ ఎన్ని తిట్టాలో అన్ని తిట్లు తిట్టింది. బామ్మకి అన్ని తిట్లు వచ్చని, ఎవరినైనా ఎంచక్కా మొహమాటం లేకుండా తిట్టగలదనీ కూడా మాకు బాగా తెలిసింది అప్పుడే. ఆయన పాపం బిత్తర పోయాడు. బామ్మ సంగతి తెలుసు గానీ, ఇప్పుడు పెద్దదయ్యింది, తాను కూడా గ్రామ కరణం అయ్యాడు కదా, ఏమీ అనదులే అన్న ధైర్యంతో, పాపం ఎవరో ఇల్లు అడుగుతుంటే, తీసుకువచ్చాడు. పొద్దున్ననంగా బయలుదేరి మూడు బస్సులు మారి వస్తే, ఈ విడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. నోరు మూసుకుని ఉండిపోయాడు. బామ్మ భాషలో చెప్పాలంటే, "కిమన్నాస్తి". మా నాన్నకి ఆయన వసారాలోనే పాపం తాను ఎందుకు వచ్చాడో ముందే విషయం చెప్పాడు. మా నాన్నేమో, ఆవిడకి ఇష్టం అయి అమ్మితే, మాకెవరికీ ఏమీ అభ్యంతరం లేదు. అడిగి చూడండి అన్నాడు. ఈ అరుపులు విని నాన్న పరిగెత్తుకు వచ్చాడు. ఇష్టం లేకపోతే ఇల్లు అమ్మకమ్మా, వదిలేయ్, అని చెప్పాడు. బామ్మ వింటేనా, నానా ఆగం అల్లరి. పెద్ద గొంతేసుకుని పడిపోయింది ఆ చిన్న కరణం గారి మీద.

                                                    "వీడ్ని ముందర ఇంట్లోంచి వెళ్లగొట్టు, రాంక్రిష్ణా ", అని నాన్నకి ఆర్డర్ వేసింది బామ్మ. అప్పుడు మధ్యాన్నం 12 గంటలయింది. నాన్న మొదటిసారి బామ్మ మాట కాదన్నాడు. అమ్మా, ఇల్లు అమ్మద్దు. కానీ వాళ్ళు ఇంత ఎండలో బోల్డు దూరం నుంచి మూడు బస్సులు మారి వచ్చారు. లీల వంట చేస్తోంది. భోంచేసి వెళ్ళిపోతారు. ఇలా పంపించటం మర్యాద కాదన్నాడు. అప్పటికి బామ్మ భోజనం కూడా కాలేదు. బామ్మా ఠాట్, వీల్లేదంది. నాన్న మాత్రం, బామ్మకి మళ్ళీ నచ్చ చెప్పచ్చులే అనుకుని, వాళ్ళను గది లోంచి బయటికి తీసుకువచ్చాడు.  ఇంక అంతే, బామ్మ పంతం పట్టేసింది, నేనేమీ తిననూ అని. వచ్చిన వాళ్ళు మొహమాటంగా భోజనాలు చేసి, మళ్ళీ బామ్మ దగ్గరకు వచ్చి, ఆయన, 'నీకు నచ్చకపోతే వద్దులే అత్తయ్యా, పొరపాటయింది, క్షమించు, లేచి భోజనం చెయ్యి' అని చెప్పాడు. బామ్మకి సడెన్ గా హైఫీవర్ వచ్చేసింది. వణకటం మొదలెట్టింది. నాన్న ఖంగారుగా డాక్టర్ ని పిలిచారు. ఆయన చూసి, చివరి ఘడియలండీ, అందరినీ రమ్మని పిలవండి. ఐస్ పెట్టి బాడీ టెంపరేచర్ తగ్గిస్తూ ఉండండి, అంతకన్నా ఏమీ చేయలేము అని చెప్పాడు. నాన్న కంగారు పడిపోయాడు. అందరికీ కబురు పెట్టాడు.

                                                                   ఐస్ వచ్చాక, అమ్మా, పక్కింటావిడా, నేనూ బామ్మకి ఐస్ పెట్టటం మొదలుపెట్టాం. అసలు టెంపరేచర్ డౌన్ అవలేదు. బామ్మని మంచం మీద నుంచి దించి కింద పెట్టడానికి నాన్న ఇష్టపడ లేదు. ససేమిరా అన్నాడు. చుట్టూ అందరూ చెప్పి చూసారు. ఆవిడ ఇన్ని రోజులూ అందరితో చెప్పింది, మంచం మీద పోకూడదని. తప్పదు దించాలి, అని కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు. నేను వెళ్లి వసారాలో చాప వేసాను. నాన్న నేను "మా అమ్మని చాప మీద పడుకోబెట్టను", అని మా అందరి మీదా అరిచాడు. నాన్న కన్నీళ్లు పెట్టుకోవటం అప్పుడు చూశాను. చివరికి మధ్యే మార్గంగా, రెండు బెంచీలు తెచ్చి వాటిని కలిపి ఒక బెడ్ లాగా చేసి తల కింద ఓ దిండు పెట్టి పడుకోబెట్టాం. అమ్మ తులసి నీళ్లు తెచ్చి నాన్నకిచ్చి బామ్మ నోటిలో పొయ్యమంది. నాన్న ఏడుస్తూ 'నారాయణ, నారాయణ' అంటూ బామ్మ నోట్లో తులసి నీళ్లు పోసాడు. నాన్న తల దగ్గర, అమ్మా, పక్కింటావిడా ఒకవైపు, పక్కింటాయన మరోవైపు బామ్మని పట్టుకున్నారు. నేను కాళ్ళు రెండూ పట్టుకుకున్నాను. మిగిలిన పిల్లలు ముగ్గురూ బిక్క చచ్చిపోయి లోపలే ఉన్నారు. అందరికీ స్పష్టంగా అర్ధం అయ్యింది, ఇక వెళ్లిపోవటానికి ఆట్టే సమయం లేదని. ఉన్నట్టుండి రెండు కాళ్ళూ నా చేతిలో ఉండగానే దూరం జరిపేసింది. ఒక ప్రయాణం ముగిసింది. అదే నేను మొదటిసారి మరణాన్ని అంత దగ్గరగా నా చేతుల్లోనే  చూడటం. నా చేతిలోనే ప్రాణం పోవటం. కాసేపు అంతా  మౌనం.  అప్పుడు బామ్మ శరీరాన్ని దింపి చాపపై పడుకోబెట్టాం. దింపేటప్పుడు నా స్థానం మళ్ళీ కాళ్ళ దగ్గరే. ఒక్కొక్కళ్ళూ రాత్రి కంతా వచ్చేశారు. బామ్మ శరీరం చుట్టూ కర్పూరం చల్లుతుంటే సీతారాం ఆమ్మ, భయం లేదుటే నీకు, అని అడిగింది. ఎందుకు, బామ్మేగా అన్నా.

                                                                తెల్లారింది. అంత్యక్రియలైపోయాయి. మూడోరోజు అస్థి సంచయనం చేసి అందరూ బెజవాడ వెళ్లిపోయారు. మిగిలిన కార్యక్రమాలు అన్నీ ఇక బెజవాడలోనే. సొంత ఇల్లు, బామ్మ పెద్దకొడుకు ఇల్లు కదా,  అందుకని. అమ్మ మిగిలిన పిల్లలతో వాళ్ళందరితో పాటు బెజవాడ వెళ్ళిపోయింది. ఆ వచ్చిన ఆరుగొలను అతిధులు కూడా ఆ రోజే వెళ్లారు. నేనూ, నాన్నా మిగిలిపోయాం. ఎందుకంటే, బామ్మ చనిపోయిన నక్షత్రమో, తిథో ఏదో బాగా లేదట, బామ్మ గదీ, వసారా, ఇంటి మెయిన్ గేట్ మూసెయ్యాలన్నారు. మేమిద్దరం ఉండి పనివాళ్ళతో, ఏమాత్రమూ గాలీ వెలుతురూ రాకుండా బామ్మ గది మూయించి అన్నీ తాళాలేసి, ఆ రాత్రికి బెజవాడ చేరుకున్నాం. భయమూ లేదు, ఏడుపూ లేదు. అంతా నిశ్శబ్దంగానే అన్నీ చేసాం. అంతే. ఇప్పుడనిపిస్తుంది, నేను నాన్న పక్కన ఎప్పుడూ ఒక ఆడపిల్ల లాగా కన్నా, మగపిల్లాడి లాగానే ఎక్కువగా ఉండేదాన్నని.  ఒక అధ్యాయం ముగిసింది అనిపించింది. మొత్తానికి బెజవాడలో వైభోగంగా బామ్మ కర్మలు ముగిశాయి. అందరూ మళ్ళీ కలవడం కష్టమని ఆ 12 రోజుల్లోనే, ఆ ఇల్లు  అప్పుడు ఇల్లు కొనటానికి వచ్చిన ఆయనకే అమ్మేశారు. ఆ వచ్చిన డబ్బు ఆవిడకే  ఖర్చుపెట్టారు. ఆవిడ ఎవరి డబ్బూ వాడదుగా మరి. వియ్యమ్మగారి శకం ముగిసింది. అప్పుడు ఆవిడకి సుమారు 80 ఏళ్ళు.  అందరికీ తన జీన్స్ ఇచ్చి, ధైర్యాన్ని పంచి, ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పి తాను నిష్క్రమించింది. ఆవిడ గురించిన  జ్ఞాపకాలు మాత్రం అలాగే నా మైండ్ లో స్థిరంగా ఉండిపోయాయి. ఆ బరువు దించుకునే ప్రయత్నమే ఇదంతా. బామ్మా, నీకు వందనం. హాట్స్ ఆఫ్.

                                                                       



5, జూన్ 2020, శుక్రవారం

బామ్మ-మార్గదర్శి-ఓ కొసరు కథనం

బామ్మ-మార్గదర్శి-ఓ కొసరు కథనం  


భట్టిప్రోలు విజయలక్ష్మి


                                             బామ్మలో ఉన్న మరో గొప్పదనం ఏమిటంటే, ఏం చేసినా, ఇది నా బాధ్యత అనుకుని చేసేది. నేను కనుక ఇది చేసాను ఇలా చేసాను అన్నట్టు ఎప్పుడూ కనపడేది కాదు. ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. నా ధర్మం అన్నట్టే ఉండేది. ఏనాడూ భర్త గురించి కానీ, నిత్యం ఇంట్లోనే ఉండే బాల వితంతువైన ఆడపడుచు గురించి కానీ ఒక్క కంప్లైంట్ కూడా చెప్పలేదు. ఏమి చేసినా తాతగారి మాట కాదని, అతిక్రమించి చెయ్యలేదు. పెళ్ళిలో తాతగారే, "నాతిచరామి, (న అతి చరామి)", అని ప్రమాణం చేసినా, బామ్మ కూడా ఎప్పుడూ తాతగారి విషయంలో ఈ "న అతి చరామి" అనే సూత్రాన్నే పాటించింది. అంటే నిన్ను దాటి, నిన్ను కాదని నేను అతిగా చరించను అని చెప్పటం. పెళ్లి ప్రమాణంలో తాతగారు నోటితో చెప్తే, కార్యరూపంలో బామ్మ చేసి చూపించింది. పెళ్ళిలో వరుడు ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి అని ప్రమాణం చేస్తాడు. అంటే భర్త భార్యకి వాగ్దానం చేస్తున్నాడు, నేను  ధర్మ, అర్ధ, కామ సంబంధమయిన అంశాలలో నిన్ను కాదని చరించను, ఏమీ చెయ్యను అని చెప్తున్నాడు. ఈ లిస్ట్ లో నాలుగో పురుషార్ధమయిన మోక్షం లేదు. మోక్షం పొందే విషయంలో మాత్రం ఎవరి దారి వారిదే. మగవాడే ప్రమాణాలు చేసినా, ఆ నియమాలన్నీ తరువాతి రోజుల్లో ఆచారంలో స్త్రీ సంబంధంగా మార్చబడ్డాయి. కానీ దంపతులు ఇద్దరూ అద్వైతం, అబేధం అనుకుంటున్నప్పుడు ప్రమాణం ఎవరు చేసినా ఇద్దరూ కలిసే కదా ఆ మాట నిలబెట్టాలి. బామ్మ ఏం చేసినా చేస్తున్నాను అని చెప్పి చేసేది. చేయనా అని అనుమతులు అడగలేదు. కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, పర్మిషన్లు అడగకూడదు.

                                                     తాతగారి మీద ఆవిడకి ఏనాడూ కోపం లేదు. ఆయన చేయగలిగేది ఆయన, నేను చేయగలిగేది నేను చేశాం. ఆయన చెయ్యలేని పనిని చెయ్యమని వేధిస్తే మాత్రం చెయ్యగలుగుతారా, అనేది. బండికి రెండు చక్రాల్లా ఉండాలి మొగుడూ పెళ్ళాం అనేది. పూజల సెక్షన్ తాతగారిదే, బామ్మా ఏనాడూ పెద్దగా పూజలు చెయ్యటం నేను చూడలేదు. కాకపోతే ఆవిడ తెచ్చుకున్న పంచాయతనం పెట్టెలో దేవతా విగ్రహాలకు మాత్రం క్లుప్తంగా పూజ చేసుకునేది. చివరి రోజుల్లో అదీ లేదు. తనకు దేవుడు విధించిన కార్యం శ్రద్ధగా చెయ్యటమే పూజ అనుకున్న కర్మిష్ఠి బామ్మ. మా నాన్న కూడా అంతే, ఆ విషయంలో వాళ్ళ అమ్మ పోలిక. ఎంతసేపూ మానస పూజే కానీ, ఏనాడూ నిలకడగా కూర్చుని పూజ చేయలేదు, ఒక్క వినాయకచవితి నాడు తప్ప. స్వామీజీలకు మాత్రం చాలా సార్లు పాదపూజలూ, బిక్షలూ చేశాడు. అవి అన్నీ వివరంగా మరో పోస్ట్ లో రాస్తాను.

                                            బామ్మకి పిల్లలందరూ విధేయంగానే ఉండేవారు. వీళ్ళు కూడా ఏదో బామ్మ కష్టపడీ, త్యాగాలు చేసీ మమ్మల్ని ఇంత వాళ్ళను చేసింది కనుక మేము ఆవిడను గౌరవించాలీ అన్నట్టు ఏనాడూ లేరు. ఆవిడ తల్లి, ఆవిడను గౌరవించాలి, అంతే అన్న భావనతోనే ఉండేవారు. సవతి కొడుకని కానీ, దత్తు వెళ్లిన కొడుకని కానీ ఆవిడ ఏనాడూ వాళ్లను తేడాగా చూడలేదు. అందరినీ ఒకే లెక్కలో కలిపే చెప్పేది. 'ఢిల్లీకి రాజయినా, తల్లికి కొడుకే', అని అంటూ ఉండేది. 'వాళ్ళు జడ్జీలయితే నాకేంటి, ప్రిన్సిపాల్ అయితే నాకేంటి, నా కొడుకులు అంతే' అనేది. తాను వాళ్ళను పైకి తెచ్చినందుకు వాళ్ళను ఏదో ఉద్ధరించేసానని ఏనాడూ అనలేదు, అనుకోలేదు. పైగా అంతా బుద్ధిమంతులు, చక్కగా కష్టపడి చదువుకుని పైకొచ్చారు అనేది. పిల్లలకు ఏం చేసినా తల్లిగా తన బాధ్యత అనుకుంది కానీ, తన పిల్లలు తనకి ఋణపడిపోవాలనో, ఋణపడ్డారనో ఎప్పుడూ అనలేదు. పైగా ఒక శాస్త్రం చెప్పేది. ఋణానుబంధ రూపేణా, పశుపత్నీ సుతాలయా.... అని చెప్పేది. 'తల్లి తండ్రులు ఎవరికైనా ఋణం ఉంటే వాళ్ళనే పిల్లలుగా కని, వాళ్ళకి ముడ్డీ, ముక్కూ తుడిచి పెంచాలి, అప్పుడు కానీ ఆ ఋణం తీరదు. పిల్లలు తల్లితండ్రులకున్న ఋణాన్నుంచి వాళ్లను విముక్తులను చేస్తారు. ఎన్నాళ్ళు ఋణం ఉంటే, అన్నాళ్ళు మనతో ఉంటారు, ఋణం తీరిపోయాక, మనతో ఉండరు. తల్లి తండ్రులే పిల్లలకు ఋణం కానీ, పిల్లలు తల్లితండ్రులకు ఋణం కాదు' అని కచ్చితంగా చెప్పేది. 'మరి వృద్ధులైన తల్లీ తండ్రికి పిల్లలు సేవ చెయ్యాలి కదా బామ్మా' అని అడిగితే, 'చెయ్యాలి, అది ధర్మం, ఋణం కాదు. దాని వల్ల  వాళ్లకి  పుణ్యగతులొస్తాయి' అని చెప్పేది ఏమాత్రం తడుముకోకుండా.

                                                    బామ్మ అందరికీ గద్దరిదిగానే తెలుసు. ఆవిడ అలా ఉండకపోతే ఆ ఇల్లు ఏమైపోయేదో ఒక్కసారి ఊహించండి. ఆవిడ ఆ రూపానికి భయపడే కదా ఎక్కడి వాళ్ళక్కడ  బుద్ధిగా, మర్యాదగా ఉన్నారు. కనుక కొన్నిసార్లు ఆ మాత్రం గయ్యాళి ముసుగు అవసరం. అది వజ్రకవచంలాగా ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ మెతక వాళ్లయితే కొంప కొల్లేరయిపోతుంది. అటువంటి నష్టాన్ని నివారించాలంటే, ఎవరో ఒకరు కాస్త కఠినంగా ఉండటం, లేదా కఠినంగా ఉన్నట్టు నటించడం ఎంతో అవసరం. ఇల్లు నిలబడాలంటే ఎవరో ఒకరు మంచితనం అనే కవచాన్ని త్యాగం చెయ్యక తప్పదు. అందరికీ  అన్నీ రావు. అన్నీ చేయలేరు. భర్తలో లోపాలున్నప్పుడు భార్య, భార్యలో లోపాలున్నప్పుడు భర్త, ఆ గ్యాప్ ని పూరిస్తే ఆ దాంపత్యం, ఆ సంసారం ఎప్పుడూ పరిపుష్టంగా ఉంటుంది. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు సప్లిమెంటరీగా ఉండాలి. బామ్మ లైఫ్ నుంచి ఇలా ఎన్ని నేర్చుకోవచ్చో. అందుకే నేను మార్గదర్శి అనే టైటిల్ పెట్టాను. పిల్లలెవ్వరికీ తండ్రి అంటే ఏమాత్రం మర్యాద తగ్గలేదు. ఆయనని ఎప్పుడూ అందరి దృష్టిలో ఒక సాధు మహాత్ముడుగా  నిలపగలిగింది.

                                                          ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇవి నా మాటలు. పెద్దలెప్పుడూ పిల్లలకు లగేజీ కాదు, బరువూ కాదు. వాళ్ళు మనతో ఉన్నందువల్ల, వాళ్ళేమీ మననో, మనమేదో వాళ్ళనో ఉద్దరించేస్తున్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరితో ఉండాలో అనేది నిర్ణయించేది ఋణానుబంధమే. వాళ్ళు మనతోనే ఉంటే మనం ఎన్ని నేర్చుకోవచ్చో. ఇంట్లోనే ఒక కౌన్సిలర్ ఉన్నట్టు, ఇంట్లోనే ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఉన్నట్టు. మరి తగాదాలు రావా, కొట్లాటలు, మనస్తాపాలూ రావా అంటే, వస్తాయి. రానియ్యండి, ఏమిటి నష్టం. మనలో మనకెప్పుడూ తగాదాలు రావా, మాటా మాటా అనుకోమా, మనస్తాపాలు రావా. పెద్దల విషయంలోనూ అంతే, పోట్లాడండి, దెబ్బలాడండి, మంకు చెయ్యండి. మళ్ళీ కలిసిపోండి. కానీ దూరం పెట్టకండి. బామ్మని ముట్టేసుకుంటా, అని నేనూ బ్లాక్ మెయిల్ చేసేదాన్ని. 'లీలా నీ కూతురు చూడు', అని బామ్మ నా గురించి మా అమ్మకి ఫిర్యాదు చెయ్యటం నాకు ఇప్పటికీ గుర్తే. అయినా ఆవిడ నాకు దోస్తే. ఆలోచించండి. నమస్కారం.