16, మార్చి 2022, బుధవారం
మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య
6, మార్చి 2022, ఆదివారం
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
మేము విజయవాడలో వున్న రోజుల్లో మానాన్న ఏదో పత్రికలో ఫోటో కాంపిటీషన్ కోసం, మా అమ్మని మేడమీదకు తీసుకువెళ్లి, ఈ ఫోటో తీసి, "నారీ-నారికేళం" అనే పేరుతో పంపించాలని అనుకున్నాట్ట. మరి పంపించాడో, లేదో ఎప్పుడూ చెప్పలేదు. ఈ రెండో ఫోటో మా అమ్మ మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు.
ముందుగా ఆ పాత పాట మీ అందరి కోసం.
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడెవరే అందగాడెవరే.....అందగాడెవరే మన్మథుండనీ చెలియా మనసు ఘోషించెనే మరలీ వచ్చెదమన్నా మరపురాకున్నాడే //ఆ తోటలో// చంద్రబింబపు ముఖమూ గండుకోకిల స్వరమూ పండూ వెన్నెలలోనే పవ్వాళించేనమ్మా చెలియా, చుక్కల్లా రేడమ్మ సఖియా మరుని శరములు చేత మనసునిలువక నేను మల్లె మొల్ల మొగలి మాలతి మందార మాలికలు వాని మెడలోన వైచినానే మధురామూర్తి మేల్కొని మందహాసము చేయ మకరకర్ణిక మెరిసేనే చెలియా మదివెన్న చిల్కినదే సఖియా
పేరేమిటని వాని ప్రశ్నించినానే
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పల్కె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే చెలియా
మది కోర్కె నెరవేరె సఖియా.....
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడితడే.....
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఒరిజినల్ పాట లింక్
వివేక్ .... ఆ తోటలోనొకటి తమ్ముడు పాడిన పాట లింక్
ఈ పాటపైన నేను వివేక్ కి రాసిన నా భావం.........
ఒక చక్కని పడుచు తన చెలికత్తెతో చీకటి పడ్డాక ఒక తోటలో మందిరానికి వెళ్ళింది. గుళ్లో దేవుడి కన్నా ఆమెను వెన్నెల్లో నిద్ర పోతున్న (పవ్వళించిన) ఒక అందగాడైన యువకుడు ఆకర్షించాడు. (తరువాత పాటలో ఆ యువకుడే బుద్ధుడని తెలుస్తుంది)
ఆతడు మన్మధుడిలాగా ఉన్నాడని తెలిసి మనసు మొత్తుకుంది. వెనుతిరిగి వచ్చేద్దామంటే ఎంతకీ మరిచి పోలేక పోతోంది.
ఆ తోట లోని ఆ మందిరంలో ఉన్న ఆ అందగాడెవడు అనే ప్రశ్న ఆమెను వదల్లేదు.
ఆ నిద్రిస్తున్న యువకుని ముఖం చంద్రబింబం వలె ఉంది. స్వరం గండు(మగ)కోకిల వలె ఉంది, అని ఆ పడుచు అనుకుంది. (ఈమెకి ఆతని స్వరం తనకు తరువాత సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వినిపించింది. కానీ ముందే గండు కోకిల స్వరము అన్నాడు కవి. ఇది ఒక దోషమేమో. పోనీ ఇంకెవరితో నైనా మాట్లాడేటప్పుడు విన్నదీ అనుకుంటే, వెన్నెల్లో నిద్ర పోతున్నాడని కూడా ఆ నాయికే అన్నది.) (ఇంకో విషయం......సృష్టిలో సాధారణంగా మగజంతువులు అన్నీ, ఆడజంతువులు వాటిని చూసి మోహించటానికి ప్రత్యేకంగా పింఛమో, జూలో, డోలో, చక్కటి గొంతో ఇలా ఏదో ఒక స్పెషాలిటీ కలిగి ఉంటాయి)
ఆ అందగాడు చక్కటి వెన్నెల్లో, నిద్రపోతున్నాడు.
వాడు చుక్కల్లరేడు, అంటే, చుక్కల్లో చంద్రుడు వలె వున్నాడు, అంటోంది నాయిక తన సఖితో.
మరుని శరము, అంటే, మన్మధ బాణాల తాకిడికి మనసు ఆగక ఆ నాయిక మల్లె, మొల్ల, మొగలి, మాలతి, మందారం పూలతో అల్లిన మాలలు అతని మెడలో వేసింది. దేవుని కోసం అనే మిషతో తెచ్చిన మాలలని మోహంతో, ఆ యువకుడి మెడలో వేసింది. ఇదో గడుసుదనం కూడా. లేకపోతే ఎలా మరి. ఆ సుందరుడేమో పడుకునే వున్నాడు, లేవటం లేదు. తన ప్రేమను ప్రకటించటం ఎలా. ఆలయానికి వస్తూ తెచ్చిన సుగంధ పుష్పాల మాలలని ఈతడి మెడలో వేసేసి అతడికి మెలకువ వచ్చేలా చేసింది.
ఇక్కడో మధురోహ వుంది. ఆ కన్యకు ఎలాగైనా సరే నిద్రిస్తున్న ఈ అందగాడిని లేపి మాటలు కలపాలనీ, తన ప్రేమను వెల్లడించాలనీ వుంది. మన్మథుడేమో ఈ కన్య మీద ఇప్పటికే తన అయిదు పుష్పబాణాలనీ, పద్మము, అశోకము, మామిడిపూత, నవమల్లిక, నల్లకలువ బాణాలనీ ప్రయోగించేసి వున్నాడు. ఆ బాణాలు ఆ కన్యని సమ్మోహన పరిచేశాయి. అరవిందమశోకంచ, చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చశాయకా. ఈ అయిదు బాణాలూ బ్రహ్మ మన్మథునికి ఇచ్చాడు, బ్రహ్మకి సృష్టి కార్యంలో మన్మథుని సాయం కావాలి కదా మరి. ఈ కన్య దగ్గర ఆ పంచ పుష్పాబాణాలకి బదులు, దేవుడి కోసం తెచ్చిన వేరే పంచపుష్పాల మాలలు వున్నాయి. వెంటనే చేతిలో వున్న సజ్జలో నుంచి మల్లె, మొల్ల, మొగలి, మాలతీ, మందార పుష్పమాలలు తీసింది. ఆ యువకుడి మేడలో తటాలున తన సమ్మోహన పంచ పుష్ప బాణ మాలలను వేసేసింది. ఆ సుగంధ భరిత స్పర్శకి ఆ అందగాడు లేచి చిరునవ్వు నవ్వాడు. కన్య కోరిక సిద్ధించింది.
ఆ పూమాలల స్పర్శకు ఆ మధురమూర్తి లేచి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు అతని చెవులకు పెట్టుకున్న మకరకుందనాలు (మకరకర్ణిక......మొసలి ఆకారంలో ఉన్న చెవి దిద్దు) తళుక్కున మెరిసాయి. అది చూసిన నాయికకు మనసులో వెన్న చిలికినట్టు అయ్యింది. మరి మన్మథుడు చేసేది మనోమథనమే కదా.
అప్పుడు ఆ కన్య పరవశంతో ఒళ్ళు మరిచి, అతన్ని వెంటనే నీ పేరేమిటి అని అడిగింది. అతడు వెంటనే నేను మాయాదేవి పుత్రుడిని అని చెప్పాడు. అప్పుడు ఆమెకు, ఈ అందగాడు మాయాదేవీ కుమారుడు సిద్ధార్థుడు అని తెలిసింది. సిద్ధార్థుడు అంటే సిద్ధించిన కోరిక కలవాడు అని అర్ధం. అప్పుడు ఆమె "ఆహా, తనకు దొరికింది సిద్ధార్థుడు" అని ఎంతో ఆనందించింది.
తన మనసు లోని కోరిక తీరింది అని సంతోషించింది. బహుశా ఈమె ముందు నుంచీ ఇతని గురించి విని, తెలిసి ఇష్టపడి ఉంటుంది. ఈ యువకుడి కోసమే ఆమె రోజూ ఈ ఆలయానికి వచ్చి పోతోందేమో. ఆ సిద్ధార్థుడు ఈమెని ఎప్పుడూ గమనించి ఉండడు. సమయం కోసం ఎదురు చూసి, ఆతడు పవ్వళించి వున్నప్పుడు వచ్చి, మాలలు మేడలో వేసి, మేల్కొలిపి, ఆతడు ఎవరో కనుక్కుని సంతోషపడింది. సిద్ధార్థుడిని వలచిన ఆ పడతికి ఇన్నాళ్ళకి సిద్ధార్థుడు సిద్ధించాడు. ఆహా, ఈ మనోహరుడు, ఈ మధురమూర్తి, ఈ చుక్కల్లరేడు, ఈ మన్మథుడు నా సిద్ధార్థుడే అని ఆ పడుచు మహదానంద పడింది.
ఫైనల్ గా
ఆ తోటలోని ఆలయం లోని అందగాడు ఇతడే అని ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేసింది.
ఇక పాటలోని అభిసారిక విషయానికి వస్తే,
సిద్ధార్ధుని జీవితంలో వచ్చిన స్త్రీలు మాయాదేవి, గౌతమి కాక, భార్య యశోధర, వైశాలి నగర గణిక ఆమ్రపాలి, బుద్ధగయలో పాలు పోసి ప్రాణం నిలబెట్టిన సుజాత అనే కన్య.
పాట లోని పడుచు ఖచ్చితంగా యశోధర కాదు. యశోధర శుద్ధోధనుడు చేత సిద్ధార్థుని మనసు ఆకట్టుకోటానికి ఎన్నుకోబడిన కోడలు. అది ప్రేమ వివాహంగా ఎక్కడా చెప్పబడలేదు. కనుక ఆ యువతి యశోధర కాదు.
మాయాదేవి కొడుకుని కని పురిటి లోనే జబ్బు పడి చనిపోయింది. అయినప్పటికీ బుద్ధుణ్ణి మాయాదేవి పుత్రుడు గానే సంఘం లెక్కించింది. తల్లి చనిపోతే అంతఃపుర దాసి గౌతమి పెంచింది. ఆ రోజుల్లో ఇంకా మాతృ స్వామ్యం పోలేదు. పితృ స్వామ్యం అప్పుడప్పుడే వస్తున్న రోజులు. పిల్లలు వారి తల్లుల పేర్ల తోనే గుర్తించబడేవారు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాగా. సిద్ధార్థుడికి పెంపుడు తల్లి పేరు మీద గౌతముడు అనే పేరు కూడా వుంది.
అది జరిగింది వైశాలిలో కూడా అయి ఉండదు. వైశాలిలో ఆమ్రపాలి అప్పటి రోజుల్లో ఖరీదైన గణిక, అంటే వేశ్య. ఆమ్రపాలి ఉదంతం బుద్ధుని తరువాత అతని శిష్యుల్లో ఒకనితో జరిగింది, బుద్ధుడు, ఆమ్రపాలి సమకాలీకులు కాదు అని కూడా చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఆమ్రపాలి కాలానికి బుద్ధుడు యువకుడు కాదు వృద్ధుడు.
బహుశా ఈ అమ్మాయి సుజాత కావచ్చు. ఆ గుడి బుద్ధగయలో ఉండి ఉండొచ్చు. సుజాత అయితే కొద్దిరోజులుగా అతన్ని గుడికి వచ్చినప్పుడు గమనిస్తూ ఉందని అనుకోవచ్చు. ఈ సుజాతే ఉపవాసాలతో శుష్కించి, స్పృహ తప్పి పడి వున్న బుద్ధుణ్ణి గమనించి, అతనికి ఆహారం ఇచ్చి చావకుండా రక్షించింది. ఈ సంఘటన వలననే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడే అతడికి, "ఉపవాసాలు, పస్తులు, దేవుణ్ణి (సత్యాన్ని) చూపలేవు", అనే సత్యం బోధపడింది. అతని జీవితంలో స్త్రీలు కేవలం మాయాదేవి, గౌతమి, యశోధర, ఆమ్రపాలి. కానీ ఆమ్రపాలిని కలుసుకునేసరికి బుద్ధుడు యవ్వనదశని దాటాడు. కనుకనే ఆ పాటలోని పడుచు, సుజాత ఏమో అని అనుకుంటున్నా.
ఇక ఈ పాట రచన, సంగీతం గురించి........
ఈ పాట పాడిన రావు బాల సరస్వతీ దేవి. ఈవిడ చరిత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. నెల్లూరు దగ్గర వెంకటగిరి సంస్థానం జమీందార్ల ఇంట్లో పుట్టిన (రాజ)వెలమ కన్య. వారింట్లో కొంచం ఘోషా ఆచారం తక్కువ. తెలుగు సినిమాల్లో పాడిన మొదటి నేపధ్య గాయని కూడా ఈవిడే. తన ఆరేళ్ళ వయసులో ఫస్ట్ రికార్డింగ్ ఇచ్చిందని అంటారు. కొన్ని సినిమాల్లో వేషాలు కూడా వేసిందిట. అద్భుతమైన అందగత్తె. సుమారు 25, 30 ఏళ్లపాటు సినీ రంగాన్ని తన పాటలతో దున్నేసింది. అందుకే అమ్మావాళ్ళకి ఆవిడ అంటే అంతిష్టం. ఎంతో ఇష్టపడి ఈవిడను, ఈవిడ పాటను మోహించి, నూజివీడు/చల్లపల్లి మహారాజు ఈవిడను పెళ్లాడి అంతఃపురంలో ఉంచేశాడట. అప్పటినుంచి ఆవిడ పాటల్లేవు. ఆ అత్తగారింట్లో విపరీతమైన ఘోషా పధ్ధతి వుంది.
ఆ భర్త చనిపోయాక, ఒక 10 ఏళ్ల నుంచి సభల్లో, సమావేశాల్లో కనబడుతోంది, వినబడుతోంది. ఇప్పటికీ ఎంతో మధురంగా పాడుతోంది. ఈ వయసులో కూడా ఎంత అందంగా, నాజూగ్గా ఉంటుందో.... ఆవిడ వయసు 90 ఏళ్ల పైనే. పక్కా తెలుగావిడ, ఉత్తరాది మహిళ కాదు. కాకపోతే, రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చెప్తే అలా పాడాలి కదా. హిందుస్తానీ బాణీలు కూడా బాగా పాడేది.
మా వివేక్ కల్పనల పెళ్లి తరువాత