30, ఏప్రిల్ 2020, గురువారం

మా పెద్దత్తయ్య

మా పెద్దత్తయ్య
భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                                            ఆవిడ పేరు పెద్దత్తయ్యే. అమ్మన్న అని కూడా అనేవాళ్ళు. పేరు కనకదుర్గ అనుకున్నా కానీ పూర్తి పేరు కనకదుర్గాంబ  అని నాకు ఆవిడ పోయిన తరువాతే తెలిసింది. ఆవిడ ఎప్పుడు ఏ వేళలో చూసినా లక్ష్మీదేవిలా ఉండేది. ఆ కళ చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. ఆ లక్ష్మీకళ ఆవిడకు భగవద్దత్తం. ఆవిడకు తగ్గట్టు మామయ్యగారు చక్కగా నారాయణమూర్తి కళతో వుండేవారు. వారి వారి పేర్లు ఏమైనా వారు మాత్రం మొత్తం కుటుంబానికి లక్ష్మీ నారాయణులు. ఇద్దరికీ ఇద్దరే. ఆ ఇల్లు ఒక అన్నపూర్ణాలయం, సరస్వతీ నిలయం. ఎంతమంది అక్కడ ఉండి చదువుకున్నారో, ఎంతమంది ఆ ఇంట్లో ఆవిడ చేత్తో భోజనం చేశారో లెక్కే లేదు. ఎన్ని జననాలు, నిష్క్రమణాలు చూసారో పెద్దత్తయ్య, పెద్దమామయ్య గార్లు. బంధు మిత్రుల్లో ఎవరు హైదరాబాద్ వచ్చినా వారింట్లోనే బస. మా అమ్మానాన్నల పాస్ పోర్ట్ లలో  పర్మనెంట్ అడ్రస్ కూడా ఆ ఇల్లే. అందరికీ కేరాఫ్ ఆ ఇల్లు. అత్తయ్యకి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లంటే మహా ప్రాణం. పెద్దక్కలా కాకుండా తల్లిలాగానే  ఉండేది. అంతటి సహజమైన మాతృత్వం అందరికీ అబ్బదు. వాళ్లకు కడుపున పుట్టిన పిల్లలు లేరన్నమాటే గానీ, వాళ్ళెత్తుకోని పిల్లలూ లేరు. ముద్దు చేయని పిల్లలూ లేరు. ఎంతమందిని పెంచారో. ఎంతమందిని చదివించారో. ఆ రకంగా చూస్తే, వాళ్ళని పార్వతీ పరమేశ్వరులనాలి. ఎందుకంటే వాళ్ళు జగత్ పితరులు కదా. 

                                                                  చాలామంది ఆ భార్య మంచిది, భర్త మంచివాడు కాదు కోపిష్టి, లేదా, ఆ భర్త మంచివాడు, భార్య మంచిది కాదు గయ్యాళి అంటూ, అనుకుంటూ వుంటారు. ఆ సిద్ధాంతం నేను నమ్మను. ఎందుకంటే ఏ వ్యక్తి అయిన మంచిగా ఉండాలి అంటే వారి జీవిత భాగస్వామి కూడా వారికి సహకరించాలి. వాళ్ళ ఒక్కళ్ళ మంచితనం అన్ని సార్లూ సరిపోదు. జీవితభాగస్వామి చేయూతో, తల ఊపో తప్పనిసరిగా కావాలి. అప్పుడే వాళ్ళు తమ సహజ స్వభావమైన మంచితనాన్ని నలుగురికీ ఉపయోగపడేలా చేయగలరు. భార్య సహకారం లేనిదే భర్త, భర్త సహకారం లేని భార్య ఎవరికీ, ఎందుకూ ఉపయోగపడరు. ఎందరో దంపతులకు ఈ భార్యాభర్తలు ఆదర్శం. మామయ్యగారిని కోపిష్టి అనేవారు ఒక్కటి గ్రహించండి. ఆ కోపంలో ఒక బాధ్యత, ప్రేమ కూడా ఉండేవి. ఆయన లేనిదే అత్తయ్య అంతమందిని తల్లి లాగా చూడగలిగేదా. ఆలోచించండి. ఆ ఇల్లు ఎంతోమందికి ఇది మన ఇల్లు అనిపించ గలిగేలా ఆ దంపతులు ఉండేవారు. ఆ రోజుల్లో ఆ ఇల్లు ఒక ధార్మిక నిలయం లా ఉండేది. ఆ ఇంట్లో పూజ చూడనివారు, ప్రసాదం తిననివారు వుండరు.


                                                                    మా అత్తగారు పోయిన మూడోరోజే పెద్దత్తయ్య పోయింది. పెద్దత్తయ్య అంటే నాకే కాదు, మా వారికి కూడా చాలా ఇష్టం, గౌరవం. ఆవిడిచ్చే కాఫీ అంటే ప్రాణం. అత్తయ్య కాఫీ తెచ్చేలోపల ఒక సువాసన అందరినీ కమ్మేసేది. దాంతో ముందే కాఫీ కోసం ఎదురుచూపులు స్టార్ట్ అయ్యేవి. నువ్వు ఎలా చేసినా మీ పెద్దత్తయ్య కాఫీ రుచి రావటం లేదని మా వారు గోల పెట్టేవారు.  'ఆవిడ కాఫీ గింజలు తెచ్చి అప్పటికప్పుడు వేయించి ఒక చేతితో తిప్పే మెకానికల్ గ్రైండర్ లో పొడి కొట్టి, ఫ్రెష్ గా డికాక్షన్ వేసి కాఫీ చేస్తుంది, అందుకే అంత ఫ్రెష్ రుచీ, వాసనా' అని నేను చెప్పగానే, మావారు వెంటనే బజారు కెళ్లి కాఫీ గింజలు తెచ్చిపోశారు. ఇక చూస్కోండి, మా ఇంట్లోనే కాదు, ఆ వీధిలోనే చక్కటి కాఫీ సువాసన. ఆ కాఫీ తాగుతూ, నేను, మా ఆయన రోజూ అత్తయ్యని తలుచుకునే వాళ్ళం. ఇవన్నీ చదివితే, మాఆయన మళ్లీ కాఫీ గింజలు తెస్తారో ఏమో. ఈ మధ్య ఇంకోటి కనిపెట్టారు లెండి. కాఫీ డే కి వెళ్లి దగ్గరుండి గ్రైండ్ చేయించి తెచ్చుకోవడం. అన్నట్టు మనలో మనకు ఒకమాట, ఎంత బాగా చేసినా పెద్దత్తయ్య కాఫీ రుచి రావటం లేదని సణుగుతూ ఉంటే, ఇలా ఉందా పని అని, ఆ కాఫీ చేసే పని మా ఆయనకె నేర్పి అప్పచెప్పా. చక్కగా ఇప్పుడు ఆయన కాఫీకి నేనే వంకలు పెట్టచ్చు. (దేవుడా, దేవుడా, ఇది మా ఆయన చదవకుండా చూడు. నీకు రేపు జీడిపప్పు నైవేద్యం పెడతా).  ఇంతకీ ఆ రకంగా పెద్దత్తయ్య మా ఇంట్లో నిలిచిపోయింది.

                                                                ఇక మా మామయ్యగారు. ఆయనకీ ముక్కుమీదే కోపమని పేరు. నిజానికి ఆయనంటే ఉన్న భయం వల్లే, (అచ్చం మా నాన్న లాగానే) వాళ్ళింట్లో ఉంచిన పిల్లలు చదువుకునేవాళ్ళు. నాకు తెలిసి శ్రీధర్ బాబాయిని బామ్మ అందుకే పెద్దత్తయ్యా వాళ్ళింటికి పంపించింది. నాన్న అంటే బాబాయికి భయం కొద్దిగా తగ్గుతోందని అనుమానం రాంగానే బాబాయిని పెద్దమామయ్యగారికి అప్పచెప్పింది. వాళ్ళింట్లో ఉండి చదువుకున్న వాళ్ళల్లో, ఉద్యోగం చేసుకున్న వాళ్ళల్లో శ్రీధర్ బాబాయే కాకుండా, హృషీఅన్నయ్య, మాధవన్నయ్య, గిరిజ, నాగు, లలితానంద్, విశ్వం, శేషు, రాధిక కూడా వున్నారు. పెళ్లయ్యాక కూడా బాబాయ్, పిన్ని అక్కడే ఉండేవారు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని పెంచింది కూడా వీళ్ళే. వాళ్లనే కాదు సొంత మనవళ్ళనిద్దరినీ కూడా  వీళ్ళే పెంచారు. నిజానికి బాబాయికి పెద్దత్తయ్య దగ్గరకు వచ్చాకే బాధ్యత పెరిగింది. పెద్దమామయ్యగారు డిసిప్లినేరియన్ అయితే, అత్తయ్య చాలా ప్రేమగా, మంచిగా ఉంటూనే, కచ్చితంగా కూడా ఉండేది. ఇల్లు శుభ్రంగా ఉంచేది. మామయ్యగారికి పూజకి అన్నీ సిద్ధంగా ఉంచేది. మామయ్యగారు చాలా సిస్టమాటిక్ గా చాలాసేపు పూజ చేసేవారు. వాళ్ళింట్లో శ్రీచక్రార్చన ఉండేది. మొదటిసారి దక్షిణావర్తశంఖం చూసింది కూడా వాళ్లింట్లోనే. మామయ్యగారు పూజ చేసుకుంటూ ఉంటే, అత్తయ్య, ఆ పక్కనే వంట చేసుకునేది. రోజూ బోల్డు రకాలు చేసేది. మామయ్యగారి పూజ అయ్యేసరికి అత్తయ్య వంట అయిపోయేది. అప్పుడు మహానైవేద్యంతో పూజ ముగిసేది. మడి కట్టుకుని వంట చేయటానికి వీలుగా వంట ఇంటి పక్కనే ఆనుకుని స్నానాలగది కట్టించారు. మడిబట్టలు ఆరేయటానికి మా ఇంట్లో లాగానే పైకి చూరుకి వేళ్ళాడుతూ రెండు వాసం దండేలు ఉండేవి. ఆ మడిబట్టలు తీసుకోవటానికి మరో  పొడుగాటి వాసం బొంగు ఉండేది. ఇప్పుడు మేము ఆ బొంగుతో దొడ్లో జామకాయలు వగైరా కొట్టుకుంటున్నాం. ఆ దండలు మాత్రం అలానే వున్నాయి వాళ్ళ గుర్తుగా. అత్తయ్యా, మామ్మయ్యగారు ఇద్దరూ మడి కట్టుకుని  పూజా, వంటా పూర్తి  చేశాక అందరికీ తీర్థం, ప్రసాదం ఇచ్చేవారు మామయ్యగారు. అరటిపండు ప్రసాదం ఇచ్చిన రోజు మజ్జిగ అన్నంలో తినండే, అరటిపండు మజ్జిగతో తింటే మంచిది అని చెప్పేవారు. 

                                                                                 మామయ్యగారు కోయంబత్తూర్ లో అగ్రికల్చరల్ 
బీ. ఎస్సీ. చదివారు. ఆయన గోల్డ్ మెడల్ తీసుకు వస్తే, ఆ రోజుల్లో చల్లపల్లి జమీందారుగారు మామయ్యగారిని గజారోహణం చేయించి వూళ్ళో ఊరేగించారుట. అది అందరూ చెప్పుకునేవాళ్ళు. ఉద్యోగరీత్యా చాలా ఊళ్ళు తిరిగి చివరికి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో అత్తయ్య సలహాపై  మేడ మీద మరో వాటా కట్టించి అద్దెకిచ్చారు. రిటైర్ అయినాక కూడా జాబ్ చేశారు. ఆయన కోరిక, ప్రోత్సాహం మేరకే వాళ్ళబ్బాయి విఠల్ మెడిసిన్ చేసాడు.  కోడల్ని కూడా డాక్టరునే తెచ్చుకున్నారు. మామయ్యగారే నాకు మొదట సుమారు 1976 లో 'గీతామకరందం' పుస్తకం చదువుకోమని ఇచ్చారు. ఆ మకరందం మాధుర్యం తెలిసాక నేను నాకూ ఒక కాపీ కొనుక్కున్నాను. ఆ తరువాత ఎంతమందికి గీతామకరందాన్ని గిఫ్ట్ గా ఇచ్చానో నాకే లెక్క లేదు. మొదటిసారి అది చదివినప్పుడు ఆ శ్లోకాలపై నోట్స్ రాసుకునేదాన్ని. తరువాత ఎందుకో ఆ నోట్స్(డైరీ) మా తమ్ముడికిచ్చాను.  

                                                                       వాళ్ళింట్లో మా పిల్లలకి ఇంకో ఆకర్షణ ఉండేది. అది వెనుక వాళ్ళింట్లో ఉన్న బాదం చెట్టు. ఉన్నది వెనక వాళ్ళింట్లోనే కానీ, కొమ్మలు మాత్రం ఈ ఇంట్లోనే ఉండేవి. వాటికి బోల్డు బాదం కాయలు. మేము అక్కడ ఉన్న రోజుల్లో రోజూ పైకి వెళ్ళి బాదంకాయలు కోసుకుని, కొట్టుకుని ఆ బాదంపప్పులు తినేవాళ్ళం. అది ఒక నిత్య కాలక్షేపం అక్కడ ఆరోజుల్లో.  ఇప్పుడు అక్కడ ఆ బాదంచెట్టు లేదు. అత్తయ్య ఇంట్లో పెరటిలో జామ, కరివేపాకు, నిమ్మ, మందార చెట్లేసింది. ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. కోడలు ఉష వచ్చాక ఫిగ్ కూడా పెంచింది. ఇప్పటికీ ఆ చిన్న పెరట్లో తిరగటం అంటే నాకు ఇష్టం. ఉష వచ్చాక దేవుడి మందిరం వంట ఇంట్లోంచి భోజనాల గదిలోకి మారింది. పూజలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. ఉష వంట చేస్తూనే స్తోత్రాలు చదివేసుకుంటూ ఉంటుంది. పొద్దున్న ఏడింటికల్లా వంట, పూజ, నైవేద్యం పూర్తి చేసేసుకుని హాస్పిటల్ కి బయలుదేరి పోయేది. మహా చురుకు తత్వం. తనకి అసాధ్యమైనది ఏదీ లేదేమో అనిపిస్తూ ఉంటుంది. మాతో ఒక సొంత చెల్లెలి లాగ కలిసిపోయింది. బంధువులందరితో చాలా ఆప్యాయంగా ఉంటుంది. బాధ్యతగా ఉంటుంది. 
                                                                   విఠల్ పేరు సాయివిఠల్. పెద్దత్తయ్య, మామయ్యగారు దత్తు తీసుకున్న అబ్బాయి. మా సరోజినీ అత్తయ్య పెద్ద కొడుకు. అత్తయ్యలందరూ సాయి భక్తులు. మగపిల్లలందరికీ పేరులో సాయి కలిపారు. విఠల్ కి చదువంటే పిచ్చి. నిజంగానే పిచ్చి. చదువుకోవడమన్నా, చదువుకున్న వారన్నా మహా ఇష్టం. మెడిసిన్ లో 3 విభాగాల్లో స్పెషలైజ్ చేసినా తృప్తిగా ఉండడు.  ఇంకో ఏదో చదువుకోవాలన్న తపనలో ఉంటాడు. మంచి హస్తవాసి ఉన్న డాక్టర్. ఎన్ని చదివినా, ఎంత చదివినా రిటైర్ అయ్యాక కూడా చదువు కంటిన్యూ చేసి, కార్డియాలజీ లో స్పెషలైజేషన్ చేసాడు. సైన్స్ అంటే ఉన్న నమ్మకం దేవుడంటే లేదు. పూర్తిగా నాస్తికుడా అంటే అదీ కాదు. మళ్ళీ ఒక ఫ్రెండ్ చాలా క్రిటికల్ గా సిక్ అయితే ఆయన కోసం మొక్కుకుని ద్వారకా తిరుమల వెళ్లి వచ్చాడు. ఏవిషయం మాట్లాడినా, దాన్ని బాగా క్రిటికల్ గా అనలైజ్ చేస్తాడు, బట్టల నాణ్యత దగ్గర్నుంచి వాటి ధరల దాకా. అంతేనా ఏ పనిని ఎలా ఇంకా తక్కువ ఖర్చుతో చెయ్యచ్చా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏ టాపిక్ తీసుకున్నా వివరంగా మాట్లాడతాడు. విఠల్ కి షాపింగ్ అంటే ఇష్టం. వంటల్లో ప్రయోగాలు ఇష్టం. మైక్రోవేవ్ ఒకటి పెట్టుకుని దాంతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాడు. పైగా ఇంటికి వచ్చిన మాలాంటి వాళ్ళందరికీ తినిపిస్తూ ఉంటాడు. వృత్తిలో యెంత బిజీగా ఉన్నా కూడా ఈ ప్రయోగాలు మాత్రం మానడు. బహుశా ఇది స్ట్రెస్ బస్టర్ అనుకుంటా. పిల్లలిద్దరూ కూడా USA వెళ్ళిపోయాక ఇద్దరూ ఇంకా బిజీ అయిపోయారు.                                                         
                                              అన్నట్టు, ఇప్పటికీ ఆ ఇల్లు ఒక సత్రమే. ఒకప్పుడు అన్నపూర్ణానిలయం, సరస్వతీనిలయం అయితే, ఇప్పుడు అన్నపూర్ణగారు అలానే వున్నారు గానీ, సరస్వతి వలన ధన్వంతరి గారు కూడా వచ్చేసారు. దాంతో ఇప్పుడు ఆ ఇల్లు అన్నపూర్ణా నిలయం, సరస్వతీ నిలయం, ధన్వంతరీ నిలయం కూడా. మొత్తం ఇంత పెద్ద కుటుంబానికీ వీళ్ళే డాక్టర్లు. అందరూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టకపోయినా, వీళ్ళ సలహా మాత్రం నమ్మకంగా తీసుకుంటూ ఉంటారు. మేము మాత్రం వీళ్ళిద్దరినీ వదిలి పెట్టటం లేదు. వీళ్ల ప్రిస్క్రిప్షన్ లేనిదే మేము ఏమీ చేయము. అదీ సంగతి. ఇదీ మా పెద్దత్తయ్య కుటుంబంతో నా అనుబంధం . 



28, ఏప్రిల్ 2020, మంగళవారం

నేనెరిగిన మా అన్నపూర్ణామ్మ

నేనెరిగిన మా అన్నపూర్ణామ్మ 

భట్టిప్రోలు విజయలక్ష్మి

         
                                                           స్వచ్ఛమైన నవ్వుకి సరియైన చిరునామా మా అన్నపూర్ణామ్మ. పేరుకి తగినట్లే నిజంగా అన్నపూర్ణ. గంపెడు సంసారాన్ని ఆ చిరునవ్వుతోనే అలవోకగా ఈదేసింది. నాకు తెలిసి మొత్తం పదిమంది పిల్లలు. కానీ ఏనాడూ ఆ పదిమందితో మాత్రమే వున్నది లేదు. ఎప్పుడూ ఇంట్లో ఓ పాతికమందికి తక్కువ వున్నదీ లేదు, తిన్నదీ లేదు. ఒక అన్నసత్రం ఆ ఇల్లు. ఆమ్మకి పదేళ్ల వయసులో పెళ్లైందిట. మా ఉమా పెదనాన్నని పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చేసరికి ఏ పనీ రాదట. అలాగే నెమ్మది నెమ్మదిగా అన్నీ నేర్చుకుందట. ఎప్పుడూ ఎవరినీ కొట్టడం కానీ, తిట్టడం కానీ ఏనాడూ చూడలేదు. ఇప్పుడు అటువంటి మా అన్నపూర్ణామ్మ గురించి చెప్తా.

                                                            పెదనాన్న ఇన్ కమ్ టాక్స్ కన్సల్టెంట్. ఆయనకు ఏనాడూ ఇంట్లో ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా జరుగుతున్నాయో తెలిసేది కాదు. అంతా ఆమ్మ ఒంటిచేత్తో నిర్వహించేది. చిన్నన్నయ్య పెదనాన్నకి అసిస్ట్ చేసేవాడు. నేను నా బి.ఎస్సీ. చదువుకునే రోజుల్లో వాళ్ళింట్లో ఉండేదాన్ని. మొదటి సంవత్సరం సాంబాబాయ్ వాళ్ళింట్లో, రెండు, మూడు సంవత్సరాలు ఉమాపెదనాన్న వాళ్ళింట్లో వుండి చదువుకున్నా. అప్పటికే పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దన్నయ్యకి ముగ్గురు కూతుళ్లు, చిన్నన్నయ్యకి ఇద్దరు కూతుళ్లు. ఆమ్మకి అయిదుగురు కూతుళ్లు, మధ్యలో నేను, మొత్తం ఇంట్లో పదకొండు మంది ఆడపిల్లలం వుండేవాళ్ళం. అందరి మధ్యలో ప్రభాకర్ ఒక్కడే మగపిల్లాడు. పాపం వాడికి ఎవరూ తోడు లేక వున్న పిల్లలతోనే ఆడుకునేవాడు. ఆమ్మ పేరుమీద ఏమి చేసినా బాగా కలిసొచ్చేదట. ఆమ్మ పేరు మీద లాటరీ కడితే, పెదనాన్నకి ఓసారి సోఫా సెట్టు, మరోసారి గట్టి ఐరన్ బీరువా వచ్చాయట. ఆ బీరువా మాత్రం చిన్నన్నయ్య గదిలో ఉండేది. ఆ దిక్కులోనే ఉండాలట అది, అందుకని.
                                                               'ఆమ్మా, కాపురానికి వచ్చేటప్పుడు పనేమీ రాదన్నావు కదా. మరి ఇంత పని ఎలా నేర్చుకున్నావు, ఇంత మందికి వంట ఎలా చేయగలుగుతున్నావ్', అంటే, 'ఏముందే, ముందర మా ఇద్దరికీ వండటం నేర్చుకున్నా, తరువాత ఒక్కొక్కడూ పుడుతుంటే, ఇంకో గుప్పెడు బియ్యం ఎక్కువ వేస్తూ నేర్చుకున్నా', అనేది. కానీ రోజూ ఎక్కడో అక్కడ చేతులూ, కాళ్ళూ కాల్చుకునేది. కాళ్ళు ఎలా కాల్చుకుంటుందీ అంటారా, ఏ అన్నంగిన్నో దించి కింద పెడుతూ కాలికి అంటించుకునేది. వంటలు మాత్రం బ్రహ్మాండంగా  చేసేది, పైగా కొత్త కొత్త రకాలు చేసేది. వంటలు చాలా ఇష్టంగా చేసేది, ఏనాడూ విసుక్కునేది కాదు. మొదటిసారి విసుక్కోకుండా ఇష్టంగా వంట చేసే వాళ్ళను చూశా. మా అత్తగారు అలాంటి ఇంకో మనిషి. మా అత్తగారు  ఇష్టంగా వంట చేస్తే, రుచిగా ఉంటుందని నమ్మేది. అది నిజం కూడా. పెదనాన్న వాళ్ళింట్లో ఎప్పుడూ ఇరవై మందికి తగ్గకుండా భోజనానికి ఉండేవాళ్ళం. అంతా మేమే. ఉల్లిపాయలు బస్తాతో తెప్పించేవాళ్ళు. సరుకులు రాయటం, లక్ష్మీ జనరల్ స్టోర్స్ నుంచి తెప్పించటం పెద్దవదిన బాధ్యత. కాఫీపొడి మాత్రం నాడార్స్ నుంచి వచ్చేది. ఆ సరుకులన్నీ వచ్చాక లెక్క చూసుకుని స్టోర్ రూమ్ లో సద్దేదీ ఆవిడే. పెద్దవదిన పేరు శారద. ఆ స్టోర్ రూమ్ ఒకప్పుడు వంటిల్లు కాబోలు, తరువాత ఇంతమందికి ఆ వంటిల్లు చాలక, దాని వెనకే ఓ షెడ్ లాగా వేయించాడు పెదనాన్న. దాంట్లోనే వంట. ఈ స్టోర్ రూమ్ లోనే ఓ గూట్లో పూజకోసం కొన్ని పటాలూ, అవీ ఉండేవి. పెదనాన్న మాత్రం రోజూ ఠంచనుగా 7 గంటలకల్లా స్నానం చేసుకుని పూజకి కూర్చునేవాడు. ఓ పావుగంట, అరగంట సేపు పూజ చేసేవాడు. ఆమ్మ కానీ, వదినలు కానీ ఆ రోజుల్లో పూజలు చేయటం నేను చూడలేదు. చాలా ఏళ్ళ తరువాత, చిన్నవదిన పూజలు చేయటం మొదలుపెట్టింది. అప్పటికి మా ఆమ్మ లేదు. మా పెదనాన్న సిక్ అయిపోయాడు. అప్పటి నుంచీ చిన్నవదినే పూజలు చేస్తోంది పద్ధతిగా. ఆవిడ కుర్తాళం స్వామివారి శిష్యురాలు. ఆవిడ ద్వారా నేనూ ఆయన శిష్యురాలిని అయ్యాను. చిన్నవదిన పేరు సుశీల. ఆమ్మ మాత్రం ఇంటి పనీ, వంట పనీ తప్ప పూజ పని చెయ్యగా నేను చూడలేదు. కానీ మహానైవేద్యం మటుకు ఆమ్మే పెట్టేది. పెదనాన్న పూజ టైంకి వంట అయ్యేది కాదు.

                                                                 రోజూ ఆ ఇంట్లో మూడు సార్లు వంట చేసేవాళ్ళు. పొద్దున్న వంట బాధ్యత పెద్దవదినది. ఆ వంట మా లాంటి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల కోసం. మేమే ఓ డజను మంది ఉండేవాళ్ళం. మాకోసం కూర, పప్పు, పచ్చడి, పులుసో, సాంబారో, చేసేవాళ్ళు. డైనింగ్ హాల్లో ఓ పేద్ద డైనింగ్ టేబుల్ ఉండేది. పెద్దవదిన వంట చేస్తుంటే, చిన్నవదిన పిల్లలందరికీ జడలు వేసేది. ఎప్పుడు చూసినా తలలో దువ్వెన చెక్కుకుని ఉండేది. రెండు బాత్రూములు ఉండేవి. అందరం స్నానాలు చేసి హడావుడిగా తయారయి భోజనాలకు కూర్చునే వాళ్ళం. వంట పెద్దవదినే చేసినా ఆమ్మ అక్కడే వుండి అన్నీ పైపైన చూసుకుంటూ ఉండేది. డైనింగ్ హాల్లోనే ఇంకో చిన్న టేబుల్ మీద వండిన వంట అంతా పెట్టేవాళ్ళు. పక్కనే కిటికీలో పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. ఎవరికి ఏది కావాలంటే, అది బాక్సులో కలుపుకుని తరువాత లంచ్ శుభ్రంగా తినేసి వెళ్లిపోయేవాళ్ళం. ఎవరైనా పక్కవాళ్ళకు లేకుండా మొత్తం తినేస్తే మాత్రం ఆమ్మ కోప్పడేది. 'అన్ని ఐటెంలు చేసి పెడితే, అన్నీ కొంచెం కొంచెం తినాలి గానీ, నచ్చిందని ఒక్కటే తినేస్తే ఎలా, మిగిలిన వాళ్ళు తినద్దూ' అని కేకలేసేది. ప్రతి వంటలోను ఉల్లిపాయలు ధారాళంగా వేసేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచీ ఉల్లిపాయలు అలవాటు లేదు. ఉమాదేవి పిన్ని నాకు ఉల్లిపాయలు అలవాటు చేయకపోతే, ఆమ్మా వాళ్ళింట్లో నేనేమయి పోయేదాన్నో. నాకు మొదట ఉల్లిపాయలు అలవాటు చేసింది ఉమాదేవి పిన్ని అయితే, వెల్లుల్లి అలవాటు చేసింది ఆమ్మ.

                                                      పిల్లల కిష్టమని పొద్దున్న వంటలో వేపుళ్ళు, మినప్పచ్చడి, కాకరకాయ పికిల్, మామిడికాయ పప్పు (అందులో కూడా ఉల్లిపాయలుండేవి),  కంద పులుసు, ఇలాంటి వంటలు ఎక్కువ చేసేవాళ్ళు. మొత్తానికి ఆ టేబుల్, ఆ గది మేమంతా భోజనాలు ముగించుకుని వెళ్లేసరికి ఓ యుద్ధరంగంలా అయిపోయేది. అప్పుడు ఇందిరక్క అంతా క్లీన్ చేసేది. ఇందిరక్కకి అప్పుడే బి.ఏ. అయిపోయింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇందిరక్కకి శుభ్రం ఎక్కువ. అది పాపం ఇల్లంతా ఎప్పుడూ అందరూ ఎక్కడంటే అక్కడ తాగి పడేసిన మంచినీళ్ల గ్లాసులూ, కాఫీ గ్లాసులూ అన్నీ తీసుకెళ్లి దొడ్లో పడేసేది. ఏ రోజూ సోఫాలు చక్కగా కవర్లు అన్నీ సద్ది నీటుగా ఉంచేది. చీర నలగనిచ్చేది కాదు, తలా చెరగనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉండేది. ఇప్పటికీ మా ఇందిరక్క అలానే వుంది. అచ్చం 45 ఏళ్ళ కిందట ఎలా ఉందో అలానే. ఇందిరక్కకి వయసు అక్కడ ఆగిపోయింది. ఇల్లు ఆ మాత్రం శుభ్రంగా ఉండేదీ అంటే, అది ఇందిరక్క చలవే. ఆమ్మకి కనిపించని సాయం చేసేది. పెద్ద పెద్ద పనులన్నీ ఆమ్మా, వదినలే చూసుకునే వారు.

                                                          ఇక మధ్యాన్నం వంట ఆమ్మ వంతు. ఇంట్లో మిగిలిపోయిన పెద్దవాళ్ళకి, ఎవరైనా బంధువులొస్తే వారికీనూ. ఆరు నూరైనా, నూరు ఆరైనా పెద్దనాన్న మాత్రం పదకొండు గంటల కల్లా భోజనానికొచ్చేసేవాడు. ఆ టైం లోపల ఆమ్మ వంట చేసి, (మడి కట్టుకుని చేసినట్టు గుర్తు) దేవుడికి నైవేద్యం పెట్టి తయారుగా ఉండేది. అన్నయ్యలిద్దరూ, పెదనాన్న, ఇందిరక్క తిన్నాక, అత్తా కోడళ్ళు జోకులేసుకుంటూ భోజనాలు చేసేవారు తీరిగ్గా. చుట్టాలెవరైనా వస్తే, వాళ్ళు తప్పకుండా పెదనాన్నతో తినాల్సిందే. వాళ్ళ కోసం ఆగేవాడు పెదనాన్న ఆ రోజు. ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, వాళ్లకు పెట్టకుండా తినకూడదు, తప్పు అనేవాడు. పైగా ఇంటికి అల్లుళ్ళొస్తే ఆ మర్యాదే వేరు. వాళ్ళకోసం స్పెషల్ ఐటెంలు ఉండేవి. దాదాపు మగవాళ్లందరూ ఒకసారి, ఆడవాళ్ళందరూ ఒకసారి తినేవాళ్లు. ఇక మూడోసారి వంట రాత్రి వంట ఇంటిల్లిపాదికీ, ఈ వంట తీరిగ్గా చిన్నవదిన చేసేది. ముగ్గురూ ఏం చేసినా మంచి రుచిగా చేసేవాళ్ళు. అన్నిట్లో ఉల్లిపాయలు, కారం బాగా వేసేవాళ్ళు. కారం కారం గా తినటం నాకు వాళ్లింట్లోనే అలవాటయింది. భోజనాలన్నీ అయ్యాక పెద్దవదిన వంటిల్లూ, డైనింగ్ హాలూ చీపురు పెట్టి కడిగేది. ఆ చేత్తోనే, ఆ చీపురుతోనే, ఆ టేబులు కూడా శుభ్రంగా కడిగేసేది. అన్నీ అయ్యాక వదినలు, మేము అంతా  మేడ మీదకి వెళ్లి పడుకునే వాళ్ళం.

                                                             పెదనాన్నది మూడంతస్థుల మేడ. కింద అంతస్తు అద్దెకిచ్చేసారు. పెదనాన్న ఆఫీసు, చిన్నన్నయ్య ఆఫీసు, వంట గదీ, భోజనాల గదీ, మధ్యలో పెద్ద వసారా, అదీ రెండు లెవెల్స్ లో, ఇంకా ఒక పెద్ద హాలూ, ఇవన్నీ మధ్య అంతస్థులో. పై అంతస్థులో అందరికీ నిద్ర కోసం మూడు గదులూ, మా పిల్లలకోసం ఓ పేద్ద హాలు. బైట మళ్ళీ క్లోజ్డ్ వరండా, ఓపెన్ వరండా. ఇంకా పైన టెర్రస్, ఇదీ ఇంటి రూపం. అందరూ వెళ్ళిపోయాక అప్పుడు వెనక ఎవరు మిగిలితే వాళ్ళని, 'అందరూ తిన్నారా, లేదా' అని ఆమ్మ వాకబు చేసేది. ఇంతమంది పిల్లలవటం చేత ఏరోజూ ఎవరో ఒకళ్ళు తగాదా పెట్టుకుని అలిగి తినకుండా పైకి వెళ్లి పడుకునే వాళ్ళు. అలా ఆ రోజు ఎవరు తినలేదో  కనుక్కుని, వాళ్ళకేది ఇష్టమో ఆ అన్నాన్ని ఓ పెద్ద మట్టుగిన్నె నిండా కలుపుకుని, మళ్ళీ దాంట్లో ఓ చెంచా వేసి, అప్పుడు తలుపులు మూసి, లైట్లు ఆపి నెమ్మదిగా మేడెక్కేది. పొద్దున్న దిగితే మళ్ళీ పైకెక్కేది కాదు. మధ్యాన్నం పూట కింద ఆ వసారాలోనే ఓ మంచం ఉండేది, దానిమీద పడుకునేది. ఆ మట్టుగిన్నె పుచ్చుకుని పైకెళ్ళి, ఆ అలిగిన వాళ్ళని బుజ్జగించి, అవతల వాళ్ళని కేకలేసి, మొత్తానికి వాళ్ళ చేత అన్నం తినిపించేది. అప్పుడు వెళ్లి నిద్ర పోయేది. ఇదీ ఆమ్మ రొటీన్. ఒకరోజు యేవో మాటల్లో పడి దాదాపు కిలో పైన బెండకాయలు, తరుగుతూ 'పుచ్చులున్నాయి బాగా' అని విసుక్కుంది. ఒక గిన్నెలో పుచ్చుముక్కలు, ఇంకోగిన్నెలో మంచిముక్కలు వేసుకుంటూ తరుక్కుంది. చూసుకోకుండా మంచిముక్కలు కాస్తా మేడ మీద నుంచి కింద వున్న కాలువలోకి పడేసింది. అప్పుడు లోపలికి వచ్చి చూసుకుంటే, పుచ్చుముక్కల గిన్నె వుంది అక్కడ. అయ్యో, అనుకుంటూ ఉసూరుమని మళ్ళీ వేరే కూర తీసి తరుక్కుంది. అంటే కానీ కోపం తెచ్చుకునేది కాదు. పైగా నవ్వేది. యెంత స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నవ్వేదంటే, ఆ నవ్వు ఆగేది కాదు. హాయిగా నవ్వేది.  ఒక్కోసారి అయ్యో, పొలకమారుతుందేమో అని ఒక్కోసారి భయమేసేది. మళ్ళీ అలాంటి నవ్వు మావారు నవ్వుతారు. ఆయనా అంతే, నవ్వొస్తే ఆగలేరు, ఆపుకోలేరు. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు కూడాను. ఆమ్మ నవ్వు కూడా అంతే.

                                               ఆమ్మకేమో, బాగా గాలి కావాలి, పెదనాన్నకేమో గాలి తక్కువ కావాలి. అందుకని ఆమ్మని పెదనాన్న 'వాయుకుమారీ' అని పిలిచేవాడు. ఆరుబయట పడుకున్నప్పుడు మాత్రం ఆమ్మ హాయిగా నిద్రపోయేది. అమ్మకి ఎండాకాలంలో బాగా ఒళ్ళు పేలేది. పాపం దాంతో చాలా కష్టపడేది. మహా ఉతుకుష్టంగా వుంది అనేది. అందుకే తనకి బాగా గాలి కావాలి. ఆ రోజుల్లో మంచి గాలి వచ్చేది. పడుకుంటే ఒళ్ళు తెలిసేది కాదు. నాకేమో ఆలస్యంగా లేవటం అలవాటు. అందరూ నిద్ర లేచినా నేను మాత్రం లేచేదాన్ని కాదు. పెదనాన్న, స్నానం, పూజ అయ్యాక పైకి వచ్చి, ఇంకా నేను కనుక పడుకుని ఉంటే, తన కాశీ ఎర్రతువ్వాలుతో రెండు పీకేవాడు. చటిక్కున లేచి కిందకు పరిగెత్తేదాన్ని. లేకపోతే ఏ ఇందిరక్కో 'నాన్నగారొస్తున్నారే, లే', అనేది. అప్పుడు వెంటనే లేచి, పెదనాన్న కనపడంగానే, ఎప్పుడో లేచినట్టు పోజిచ్చేదాన్ని. కానీ పెదనాన్నకు నిజం తెలుసు. ఇందిరక్క మాత్రం మేమందరం లేచి వెళ్ళిపోయినా అన్ని మంచాలూ, పక్కలూ సద్ది పైన అంతా నీట్ గా చేసేసి దిగేది. నాకు కాఫీ, టీ, పాలు ఏవీ అలవాటు లేవుగా. లేట్ గా లేచినా, పని తొందరగా అయిపోయేది. సాంబాబాయ్ పాలు తాగే అలవాటు చేసినా, అది కాకినాడ దాటంగానే మానేశా.
           
                                                         ఇల్లంతా చూసుకుంటూ అందరికీ అన్నీ అందుతున్నాయా అని చక్కగా కనుక్కునేది. పెదనాన్నకి ఎప్పటికప్పుడు ఇస్త్రీ బట్టలు తయారుగా ఉంచేది. ఇల్లు శుభ్రంగా ఉంచమని పిల్లలని కేకలేసేది. ఎక్కడి వస్తువులక్కడ పడేస్తే కోప్పడేది. ఆమ్మ చేసినట్టు మినప్పచ్చడి చెయ్యాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా నాకు చేత కాలేదు. అది తప్ప అన్నీ నేర్చుకున్నా. ఓ రోజు చిక్కుడుకాయ ఆవకాయ పెడితే, మరో రోజు కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టేది. ఒక్కోరోజు ఇంతంత కారం వేసి చింతతొక్కు దంచేది. దాంట్లో బోల్డు ఇంగువ కాచిన నూనె పోసేది. పచ్చడి అదిరిపోయేది. శనివారం నాడు రాత్రి పూట ఇడ్లీలు చేస్తే, పాపం పెద్ద వదిన తీసిన వాయ తీసినట్లే  ఉండేది. ఓ రోజు శ్రీలక్ష్మి పోటీ పడి పది ఇడ్లీలు తిన్నది, పాపం ఆ తరువాత బాధ పడింది. ఆమ్మ వచ్చి కేకలేసింది. అన్నన్ని తింటే అరగద్దూ, అని.

                                              శ్రీలక్ష్మి చిన్నపిల్ల, దానికి కందిపొడి అంటే ఇష్టం ఉండేది చిన్నప్పుడు. ఒక రోజు అదీ, నేనే వున్నాం భోజనాల గదిలో. 'ఇది కందిపొడేనా' అని నన్ను అడిగి నేను సమాధానం చెప్పే లోపల, కందిపొడి జాడీ మూత తీసి వాసన చూసేసింది. అంతే, ఇక తుమ్ములు మొదలు. నేను చెప్పకుండానే దానికి కందిపొడేదో తెలిసింది. ఇద్దరం చచ్చేట్టు నవ్వుకున్నాం. నవ్వీ నవ్వీ ఇద్దరికీ కళ్ళంబట నీళ్లు, దానికి ముక్కంబట కూడా. ఒకసారి లలిత పెళ్లప్పుడనుకుంటా. అందరం ఉయ్యూరు వెళ్లాం. పెళ్లయ్యాక మరుసటి రోజే, కాలేజీ ఉందని నేనూ, శ్రీలక్ష్మీ విజయవాడ వచ్చేసాం. ఆ రోజు వంట నేను. పచ్చళ్లున్నాయి కదా ఉత్తపప్పు చేసుకుందామని కందిపప్పు కోసం వెతికితే, అది ఎక్కడ పెట్టారో ఎంతకీ కనిపించలేదు. ఆలస్యమైపోతోందని నేను శ్రీలక్ష్మిని కింద రాజత్తా, శాంతత్తా వాళ్ళింటికెళ్లి ఓ గుప్పెడు కందిపప్పు తెమ్మన్నా. కాసేపటికి రాజత్త  ఓ మూడు రకాల పప్పులతో పైకి వచ్చింది. శ్రీలక్ష్మికి కందిపప్పేదో తెలియక పోవటంతో, అసలు ఏ పప్పు కావాలో తెలియక, రాజత్తే అన్ని పప్పులూ కొంచం కొంచం తీసుకుని పైకి వచ్చింది. అప్పటిదాకా నాకూ తెలియదు, శ్రీలక్ష్మికి కందిపప్పంటే తెలియదని. ముగ్గురం కలిసి నవ్వుకున్నాం. అవును మరి. నాకే ఇంతవరకూ ఆ ఇంట్లో వంట చేసే ఛాన్స్ రాలేదు, పాపం చిన్నపిల్ల దానికెలా వస్తుందీ.  మొత్తం మీద వంట చేసుకుని తిని కాలేజీ కెళ్ళిపోయాం.

                                                          ఆమ్మ కి చాలాకాలం అచ్చాలు అనే పనిమనిషి ఉండేది. అది బాగా ఇంట్లో కలిసిపోయేదిట. అది బాగా పెద్దది అయిపోయాక మానేసింది. ఆ తరువాతే ఆమ్మ వేరేవాళ్లను పెట్టుకుంది. నేను అక్కడ వున్నప్పుడే అచ్చాలు చచ్చిపోయిందని వాళ్ళ వాళ్లెవరో చెప్పారు. ఆమ్మ కళ్లనీళ్లు పెట్టుకుని 'తల్లిలా తోడుండేది' అని వాళ్ళకేదో ఇచ్చి పంపించింది. శవాన్ని మా మెయిన్ రోడ్డులోనుంచే తీసుకెళ్తారని తెలిసి అక్కడే వుండి, చూసి చాలా బాధపడింది. ఒక పనిమనిషి కోసం అంతగా బాధపడిన వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఆమ్మకి ఆ రోజుల్లో ఎప్పుడూ దుర్గమ్మ అనే వంటమనిషి, కూడా ఉండేదట. ఇద్దరు కోడళ్ళొచ్చాక అప్పుడు ముగ్గురం కలిసి చేసుకుందాం అని వంట మనిషిని తీసేసిందట. మా తాతగారు పోవడం,  పెద్దపెద్దనాన్నకి చిన్న వయసులోనే భార్య పోవడం, వాళ్ళ ఇంకో కజిన్ విశ్వం అన్నయ్య పోవడం, వీటన్నింటి వల్లా,  ఈ పెదనాన్నా, ఆమ్మలే అందరికీ ఆది దంపతులు అయ్యారు. ఏ పెళ్లి వచ్చినా, ఒడుగు వచ్చినా, ఏ శుభకార్యమైనా పీటలమీద కూర్చునేది వీళ్ళే. యెంత మందికి కన్యాదానం చేసారో, యెంత మందికి వొడుగులు చేసారో, యెంత మందికి స్నాతకాలు చేసారో వాళ్ళకే లెక్క లేదు. మళ్ళీ వీళ్లంతా ఆ ఇంటికి అల్లుళ్ళు గానే లెక్కలోకి వచ్చేవాళ్ళు. వీళ్లల్లో ఎవరు విజయవాడ వచ్చినా, వీళ్ళింటికి వచ్చి కనబడి, భోజనం చేసి కానీ వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్లందరికీ అదో మర్యాద. ఆమ్మ అల్లుళ్ళనందరినీ ఒకేలాగా చూసేది. తలుపు వెనకాల నుంచే మాట్లాడేది. వాళ్ళెంత చిన్న వాళ్ళయినా సరే, 'మీరు' అనేది. పైగా అడిగితే, 'అల్లుళ్ళకి ఎదురు పడకూడదు, వాళ్లకు కాళ్ళు కడిగాం గదా, మీరు అనే అనాలి, నువ్వు అనకూడదు' అనేది.

                                        ముళ్ళపూడి వెంకటరమణ గారు (మా శ్రీదేవి పిన్ని భర్త) కూడా మా ఆమ్మా, పెదనాన్నా వాళ్ళ మర్యాదల గురించి తన కోతికొమ్మచ్చిలో కూడా రాశారు. శ్రీదేవి పిన్ని పెళ్లి తరువాత ఆరుగొలను నుంచి మేమంతా డైరెక్టుగా, పెదనాన్నా వాళ్ళింటికే వెళ్లాం. కొత్త పెళ్ళికొడుకు, పెళ్లికూతురు, పెళ్ళివాళ్ళు వస్తున్నారని, నందివాడ వాళ్ళు యెంత ఆలస్యమయినా ఆగి భోజనాలు చేయకుండా వున్నారని రమణ బాబాయిగారు ఆ పుస్తకంలో రాసారు. అలా మా నందివాడ వారి మర్యాదలు రమణ బాబాయిగారి ఆత్మకథలో కూడా చోటు చేసుకున్నాయి ఆమ్మా, పెదనాన్నా ధర్మమా అని. అనురాధ పెళ్లి మధ్వ పద్ధతిలో జరిగింది. రాఘవ బావగారు మధ్వ సాంప్రదాయం వాళ్ళు. పెళ్ళిలో 8 మంది దంపతులని పెళ్లి మండపంలో వధూ వరుల చుట్టూ వలయంలా నుంచోపెట్టి, మంగళసూత్రం దారంతో పోగులు వేయించారు. ఆ 8 మంది దంపతులతో నేనూ, మావారూ కూడా వున్నాం. ఆ కొత్త పద్ధతులు చూసి, ఆమ్మ, పెద్దనాన్నా, "ఎన్ని పెళ్లిళ్లు చేసాం, చూసాం, ఇది ఎప్పుడూ చూడలేదు" అంటూ నవ్వేశారు. ఏ విషయమైనా సరదాగా, తేలిగ్గా తీసుకునే మనస్తత్వం వాళ్ళది. ఏ ముహూర్తాన నవ్వుతూ ఆ పెళ్లి చేశారో కానీ, రాఘవ బావగారు ఆ ఇంటికి అల్లుడు కన్నా, కొడుకై పోయాడు. మా అందరికీ కూడా, హితుడూ, సన్నిహితుడూ అయిపోయాడు. బహుశా ఆమ్మ తలుపు వెనక నుంచి కాకుండా ముందుకొచ్చి మాట్లాడేలా చేసిన ఏకైక అల్లుడేమో కూడా.

                                                               శ్రీదేవి అక్కయ్య ఎప్పుడు మాట్లాడినా, 'అన్నపూర్ణ పిన్ని ఎంత మంచిదో, తల్లి లేని పిల్లలమని మమ్మల్ని యెంత ప్రేమగా చూసేదో', అనేది. శ్రీదేవి అక్కయ్య మొదటి పురుడప్పుడు, పెద్ద పెదనాన్న శ్రీమంతం చేసి అక్కయ్యని పురిటికి గుడివాడ తీసుకెళదామనుకున్నాట్ట.  అప్పుడు బామ్మ కూడా, ఎందుకో వేరే ఊరుకి  వెళ్ళిందిట. అప్పుడు ఆమ్మ, ' శ్రీదేవీ, నా మాట విను, నాతో రా, మీ నాన్న మొగవాడు ఒక్కడూ ఏం చెయ్యగలడు. నేను నీ తల్లి లాంటిదాన్ని, నీకు నేను పురుడు పోస్తా, నా మాట విను, మా ఇంటికి వెళదాం" అని చెప్పి పిలుచుకుని వచ్చిందట. తీరా పురుడు వచ్చే టైంకి, ఆమ్మకి పక్క వూళ్ళో ఎవరో బంధువుల ఇంటికి పెళ్ళికి ఒక్క రోజు కోసం వెళ్లాల్సి వచ్చిందట. ఇంకా పురిటికి  వారం టైం ఉందిలే అనుకుని, అక్కయ్యకి బోల్డు జాగ్రత్తలు చెప్పి, వాళ్ళ అమ్మని (ఆవిడ పేరు పింగళి కాంతమ్మ) తోడు ఉంచి వెళ్లిందట. తీరా ఆమ్మ వెళ్ళగానే, అక్కయ్యకి అనుకున్న సమయం కన్నా ముందే నొప్పులు వచ్చి, పిల్లాడు పుట్టాడుట. ఆమ్మా వాళ్ళ అమ్మే అంతా చూసిందట. మరునాడు ఆమ్మ వచ్చిందట. "శ్రీదేవీ, నీ కొడుక్కి తొందరెక్కువ, నేను వచ్చేదాకా ఆగలేదు." అని నవ్విందట. తరువాత పురిటి స్నానం రోజుకి బామ్మ కూడా వచ్చి, "పురిటికి  తెచ్చి, పురిటికి  ఉండకుండా, ఊరు వెళ్ళిపోయావు" అని కోప్పడిందిట. అప్పుడు కూడా ఆమ్మ నవ్వేసి వూరుకుందిట. ఈ రోజుకీ 'అన్నపూర్ణ పిన్ని దేవత. నాకు కన్నతల్లి లాంటిది' అని ఎప్పుడు మాట్లాడినా అక్కయ్య చెప్తూనే ఉంటుంది.

                                                               మా అమ్మా నాన్నల పెళ్లి గురించి నేను ముందరే ఒక పోస్టులో చెప్పాను. అమ్మానాన్నా వాళ్ళ పెళ్ళికి ఒక రోజు ముందు, సాంబాబాయిదో, చక్రి అన్నయ్యదో ఎవరిదో ఒడుగు అయ్యిందిట. ఆరోజే ఉమా పెద్దనాన్నా, అన్నపూర్ణామ్మ వాళ్ళ అమ్మాయి సడెన్ గా చనిపోయిందట. దాంతో మగపెళ్లి వాళ్లందరికీ మూడు రోజులు మైల. ఎక్కడ చుట్టాలు అక్కడే నిలిచి పోయారుట. అందరికీ ఈ సడెన్ మైల వల్ల అంతా ఇబ్బంది పడ్డారుట.  అందుకని పెళ్లిని నాలుగో రోజుకే పోస్టుపోన్ చేసారట. ఆమ్మ అంత దుఃఖం లోనూ స్నానం అయ్యాక వచ్చి పీటల మీద కూర్చుని తతంగం అంతా పూర్తి చేసిందట. అప్పుడు అందరూ అనుకున్నారట, "అన్నపూర్ణ యెంత  మంచిది, తన వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదని, అంత కష్టంలో కూడా యెంత నిబ్బరంగా ఉందో" అనుకున్నారట. అదీ ఆమ్మ కారెక్టర్. ఈ విషయం నాకు ముందే తెలిసినా, ఈ అంశాన్ని ఆమ్మ కోణంలో శ్రీదేవి అక్కయ్య చూసినట్టు, నేను చూడలేక పోయాను. ఈ విషయం అక్కయ్య నోటి నుంచి వింటుంటే, నాకూ కళ్లనీళ్లు తిరిగాయి. ఆమ్మ ఎప్పుడూ పెదనాన్నకి ఏ ఇబ్బందీ కలగనియ్యలేదు, తన వల్ల పెదనాన్నని ఎక్కడా కూడా మాట  పడనియ్యలేదు. పెదనాన్న రామకోటికీ (రామాలయం), బాలభారతికీ (స్కూల్) ఉచితంగా సర్వీస్ చేసేవాడు. చాలాకాలం బాలభారతికి కరెస్పాండెంటుగా, రామకోటికి ధర్మకర్తగా, కూడా వున్నాడు. ఆ రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం రామకోటి వెళ్లి మళ్ళీ ఏ ఏడు గంటలకో తిరిగి వచ్చేవాడు. రామకోటిలో గోపుర ప్రతిష్ట అయితే, ఆమ్మ కూడా పక్కనే వుండి, పెదనాన్నతో పాటు, ధర్మకర్త భార్య హోదాలో ఆ టెంపరరీ వాసాల మెట్లన్నీ ఎక్కి, ఏభయమూ లేకుండా, అంత ఎత్తున గోపుర కలశ ప్రతిష్ట చేసింది. బాబోయ్, ఎలా ఎక్కిందో కదా అనుకున్నాం.

                                                             గాలిపటాలు ఎగరేయటం నేను అక్కడే నేర్చుకున్నా. సీజన్లో పిల్లలందరం గాలిపటాలు, దారం రీల్స్ తీసుకుని, పైకి టెర్రస్ మీదకి చేరేవాళ్ళం. చీకటిపడే ముందు ఎక్కడి నుంచి వచ్చేవో తెలియదు కానీ, గుంపులు గుంపులుగా గబ్బిలాలు వచ్చేవి. వెంటనే, చకచకా గాలిపటాలని దింపేసి, దారం చుట్టేసుకుని అయిదు నిముషాల్లో కిందకు వచ్చి తలుపులు వేసేసుకునే వాళ్ళం. అదో సరదా ఆ రోజుల్లో. అందరికన్నా బాగా అనురాధ గాలిపటాలు ఎగరేసేది. ఆమ్మ చిన్నజ్వరం వచ్చి, ఒక వారం రోజులు సిక్ అయి, 60 ఏళ్లకే కన్ను మూసింది. ఆమ్మ చనిపోయే ముందర రోజు రాత్రి ఎప్పుడూ లేనిది వేంకటేశ్వరస్వామి పటం కింద పడిపోయిందిట, చిన్నవదిన చెప్పింది. గబ్బిలాలు కూడా ఇంట్లోకి వచ్చాయట. ఆమ్మ పోయిందని వినంగానే షాక్. ఆ కార్డ్ మా రైల్వే కోడూరుకు వచ్చేసరికి మూడు రోజులు పట్టింది. తెలియంగానే పిల్లలిద్దరినీ తీసుకుని విజయవాడ వెళ్లాను. అప్పుడు పెద్దవాడికి మూడేళ్లు, చిన్నవాడికి మూడునెలలు. మాధవన్నయ్య పిల్లలతో ఆ రాత్రివేళ నన్ను చూడంగానే, "అనుకున్నా, ఇది ఆగలేదని" అని నెత్తి మీద మొట్టాడు. ఆమ్మ పోవడం ఏమిటీ, ఆశ్చర్యం, విషాదం రెండూ. ఎందుకంటే, ఆమ్మ ఎప్పుడూ చక్కగా, ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండేది.

                                                           పిల్లల కెవరికైనా పుట్టిన రోజు వస్తే ఆమ్మ పెదనాన్న దగ్గరికి వెళ్లి కూర్చుని వాళ్లకి కొత్త బట్టల కోసం డబ్బు ఇమ్మని అడుగుతూ ఉండేది. పెదనాన్నేమో 'మా చిన్నప్పుడు మంచి చీర పాతిక రూపాయలకు వచ్చేది, ఇప్పుడు అన్నీ బాగా డెవలప్ అయ్యాయి కదా, పది రూపాయలకే వచ్చేస్తుంది' అని పది రూపాయలిచ్చేవాడు. ఆమ్మ గోల పెట్టి మొత్తానికి పెదనాన్న నుంచి ఎక్కువ డబ్బు సాధించి పిల్లలకు పుట్టినరోజు లోటు లేకుండా చూసేది. పెదనాన్న ఎప్పుడూ పది రూపాయలడిగితే, ఐదు రూపాయలు ఇచ్చేవాడు. అలాంటి పెదనాన్న నుంచి ఓపిగ్గా, నవ్వుతూ, నిష్టూరంగా మాట్లాడుతూ, బతిమాలుతూ పని సాధించుకునేది. సంపాదించేది పెదనాన్న అయినా  అసలు ఆమ్మే ఆ ఇంటికి లక్ష్మి. సిరి కళ ఆవిడదే. అందుకే కాబోలు, చిన్నవదిన ఎప్పుడూ అంటూ ఉండేది, 'మా అత్తగారితోనే ఈ ఇంటి కళ పోయింది' అని. మాక్కూడా నిజమేనేమో అనిపిస్తూ ఉండేది. వెళ్ళినప్పుడల్లా ఎప్పుడూ చక్కగా హాయిగా ఓపెన్ గా నవ్వుతూ ఉండే ఆమ్మని బాగా మిస్ అయ్యేవాళ్ళం. నెమ్మదిగా ఉద్యోగ బాధ్యతలు పెరిగాక విజయవాడ వెళ్ళటం కూడా తగ్గింది. చిన్నన్నయ్య మాత్రం 'ఇది మీ పెదనాన్న ఇల్లే, రండే. పెదనాన్నకి సంతోషంగా ఉంటుంది' అనేవాడు. నిజానికి ఆమ్మ తరువాత అందరినీ సమానంగా చూసింది చిన్నన్నయ్యే. అందరితో  ప్రేమగా, ఆపేక్షగా ఉంటాడు. ఇంటికి వచ్చిన వారిని ఆదరించటం అనే అంశం మాత్రం ఆ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ విస్మరించలేదు.
                          
                                                      చివరిగా మరో సరదా విషయంతో ముగిస్తాను. శుభాకాంక్షలు అనే సినిమాలో AVS ఒక భయంకరమైన గాయకుడు. అతడి బాధ పడలేక, వీధిలో అందరూ అతనితో రాజీ చేసుకుంటారు, రోజూ రాత్రి ఒకే సమయంలో మాత్రమే పాడాలని. ఆ టైంకి ముందే అందరూ పనులు పూర్తి చేసుకుని, తలుపులు వేసేసుకుని పడుకునే వాళ్ళు. అదంతా మహా హాస్యంగా తీసాడు దర్శకుడు. మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేది. చాలా స్నేహశీలి. ఎంతో టాలెంటెడ్, ఎన్నో పనులు చేస్తూ ఉండేది. ఆ ఆంటీ ఒక్కోసారి, కనీసం నెలకొక్కసారైనా సరే, ఆదివారం నాడు పీతలకూర చేసేది. వాళ్ళు మాంసాహారులు. ఆ రోజు మేమెవ్వరం తట్టుకోలేని భయంకరమైన వాసన మొత్తం మా ఇల్లు కూడా కమ్మేసేది. ఎవ్వరం ఇంట్లో ఉండలేక పారిపోయేవాళ్ళం. ఆ ఆంటీ కూడా అచ్చం ఆ సినిమాలో లాగానే, మాకు వీలైన టైంలోనే ఈ పీతలకూర చేసేది. ఆదివారాలు మా లంచ్ కార్యక్రమం అయిపోయేది, ఆవిడ కూర కార్యక్రమం మొదలయ్యేది. అందరం ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు పారిపోయేవాళ్ళం. నేను, మా మామయ్యా వాళ్ళింటికో, ఆమ్మ, పిన్నీ వాళ్ళింటికో అని చెప్పి వెళ్లిపోయేదాన్ని. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి ఏదో సాకు చెప్పి పారిపోయేవాళ్లు. వదినలిద్దరూ వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్లి వస్తామని వెళ్లిపోయేవాళ్లు. ఎప్పుడూ బయటకు వెళ్ళని ఆమ్మ కూడా ఆ వాసన పడలేక, ఆ రోజు "మా అమ్మని చూసొస్తా" అని వెళ్లిపోయేది. ఇక మగవాళ్ళు మాత్రం తప్పించుకోలేక, ఇంట్లో చిక్కుకు పోయేవాళ్లు. వీళ్ళు మాత్రం ఆ పక్కింటి ఆంటీ పీతల వాసనను తప్పించుకోలేక పోయేవాళ్లు. సాయంకాలాని కల్లా, అన్ని పక్షులూ ఇంటికి వచ్చేసరికి ఆ వాసన పూర్తిగా పోయేది. అమ్మయ్యా అనుకుని, లోపలికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఆ ఆంటీ పీతలకూర చేసేదాకా అంతా మామూలే.

                                                           ఇవీ అన్నపూర్ణామ్మతో  జ్ఞాపకాలు.  ఇప్పటికీ ఆమ్మ గుర్తొస్తే, ముందుగా కనపడేది ఆమ్మ నవ్వుమొహం, ఆ స్వచ్ఛమైన చక్కటి నవ్వూ. అదీ మా అన్నపూర్ణామ్మ.







23, ఏప్రిల్ 2020, గురువారం

బామ్మ - నమ్మకాలు

బామ్మ - నమ్మకాలు 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                                 బామ్మకి భలే భలే తమాషా నమ్మకాలు చాలా ఉండేవి. మేమంతా చాదస్తం అని తిట్టుకునే వాళ్ళం. ఈవిడ పెద్దదవుతున్న కొద్దీ పిచ్చి పిచ్చి చాదస్తాలు పెరిగాయ్ అనుకునే వాళ్ళం. కానీ మా అమ్మ కూడా ఎప్పుడూ ఈ నమ్మకాలకి ఎదురు చెప్పేదీ కాదు, సణుక్కునేదీ కాదు. ఇక్కడో చిన్న పిట్టకథ. చాదస్తం, ఛాందసము అనే మాటలకి అసలు అర్ధం ఉత్పత్తీ ఏమిటో చెప్తా. పద్యాలు రాయటానికి ఛందస్సు అవసరం. మనం అందరం ఈ ఛందస్సుని వ్యాకరణంలో చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఒక్కోసారి పదాలు ఆ ఛందస్సులో ఇమడకపోతే పదాన్ని ఏదో ఒక లాగా ట్విస్ట్ చేసి, తు, చ లాంటి అక్షరాలని కలిపి మొత్తం మీద ఆ పదం ఆ ఛందస్సులో సరిపోయేలాగా చేసేవాళ్ళు. ఎవరైనా పద్యాల్లో తప్పులు వెతికితే, లేదా ఛందస్సు కోసం తప్పు పదం వేశావు అని లోపం కనుక చూపిస్తే, "వాడికి చాదస్తం, ఛాందసము" అనటం, అటువంటివాడిని చాదస్తుడు, ఛాందసుడు అంటం అందరికీ అలవాటైపోయింది. ఇప్పటికీ ఇలా ఇంకా పాత పద్ధతులను పట్టుకు వేళ్ళాడే వాళ్ళను చూస్తే, చాదస్తం అంటం పరిపాటై పోయింది. 

                                                                సరే, బామ్మ నమ్మకాల దగ్గరికి వద్దాం. మొదటిది తుమ్ము. ఈ తుమ్ముకి రకారకాల చోట్ల తుమ్మితే రకరకాల పరిహారాలుండేవి. ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు, మరొకరు గానీ, లేదా వాళ్ళే గానీ తుమ్మారనుకోండి. వెంటనే చెప్పులు విడిచి కూర్చోవాలి. కాసేపయ్యాక వెళ్లి కాళ్ళు కడుక్కు రావాలి. ఆ తరువాత కూర్చుని కాసిని అయినా సరే మంచినీళ్లు తాగాలి. అప్పుడు గానీ మళ్ళీ లేచి బయటకు వెళ్లే అవకాశం లేదు. ఇక రెండో రకం తుమ్ము.  గుమ్మం దాటుతూ తుమ్మామనుకోండి. బామ్మ వెంటనే "కదలకు(స్టాట్యూ), అలాగే నుంచో", అంటుందన్నమాట. అప్పుడు ఎవరో వచ్చి మన తలపై వున్న గుమ్మం మీద ఓ గుప్పెడు నీళ్లు తెచ్చి చల్లేవాళ్లన్న మాట. అప్పుడు కానీ కదలటానికి వీల్లేదు. మళ్ళీ చచ్చినట్టు ఆ కింద పడ్డ నీళ్లు మనమే తుడవాలి. ఎవరైనా సరే తుమ్మంగానే, పక్కనే వున్న పెద్దవాళ్ళు, 'చిరంజీవ' అని దీవించాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా 'బ్లెస్ యు' అంటారు. నిజానికి మనం తుమ్మేటప్పుడు ఊపిరి బిగపట్టటం వల్ల మనం ఒక శ్వాస మిస్ అవుతాం. అందుకని ఈ దీవెన. సరే, ఈ గుమ్మం తుమ్ము అయిపోయిందా, మరో రకం తుమ్ము భోజనం చేసేటప్పుడు వస్తే, దానికి వేరే పరిహారం వుంది. అదేమిటంటే, వెంటనే తినటం ఆపేసి, పైకి చూసి, చేత్తో ఎవరికి వాళ్ళే, కాసిని నీళ్లు, పక్కనే గ్లాసులో వుంటాయిగా, పైకి రూఫ్ వైపుకు చల్లుకోవాలి. ఆ తరువాత, మనం పుట్టిన వూరు, ఆ ఊరి దేవుడు పేరు చెప్పాలి. బహుశా జ్ఞాపకశక్తికి పరీక్షో, లేదా ఆ దేవుడిని రక్షించమని వేడుకోవటమో అయ్యుండాలి. అదే అన్నం తినేటప్పుడు పొలమారితే, (ఇప్పుడు మనం విండ్ పైప్ లోకి ఫుడ్ పోయింది అంటామే, అదన్నమాట" అన్నం తినటం ఆపేసి కాసేపు మెడ బాగా పైకెత్తి పైకి చూసి మళ్ళీ తినమనేది. పైగా ఎవరో నిన్ను తలుచు కుంటున్నారు అనేది. మా అత్తగారు కూడా ఎవరైనా తుమ్మితే, వెంటనే, "దీర్ఘాయుష్మంతు, మార్కండేయ ఆయుష్మంతు" అనేది. మా ఆయన మాత్రం, ఎప్పుడైనా తుమ్మితే, హైదరాబాద్ భాషలో 'తుమ్ము భాన్చద్'  అనేవారు. నేనే "మీ అమ్మగారలా అంటే, మీరు ఇలా అంటారా" అని దెబ్బలాడి, ఆ అలవాటు మాన్పించా. ఇప్పుడు ఆయన కూడా నాలాగే  సింపుల్ గా చిరంజీవ అంటున్నార్లెండి. 

                                                               అలాగే బామ్మ శకున శాస్త్రం, బల్లి శాస్త్రం చూసేది. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు రాకూడని వాళ్ళు ఎదురొస్తే మాత్రం, ఆపేసేది. వెళ్లనిచ్చేది కాదు. బయటకు వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చినా ఆగి కూర్చుని, కాళ్ళు కడుక్కొని, మంచినీళ్లు తాగి అప్పుడు వెళ్లాల్సిందే. అల్లాగే ఇంటికి వచ్చిన వాళ్లెవరైనా సరే,  వచ్చిన తొమ్మిదోరోజు తిరుగు ప్రయాణం చేయకూడదు. కనుక ఎనిమిదో రోజుకో, పదో రోజుకో వాళ్ళు ప్రయాణం మార్చుకోవాల్సిందే. ఇంకోటి అమావాస్య, అమావాస్య తరువాత పాడ్యమి, అష్టమి, నవమి ఇలా యేవో బోల్డు తిధులు చెప్పేది. అవి వున్న రోజుల్లో ప్రయాణం చెయ్యకూడదు. ఒకవేళ తప్పనిసరి అయి, అలాంటి రోజుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే, ముందు రోజే, ఏ పక్కింటి వాళ్లింట్లోనో, నిర్ఘ్యం పెట్టించేది. నిర్ఘ్యం అంటే ఏమిటంటే, మనం తీసుకు వెళ్లాల్సిన సామాన్లలో ఏదో ఒకటి ముందే సద్దేసి పక్కింట్లో పెట్టాలి. దాన్ని మర్నాడు వెళ్లేటప్పుడు, తప్పనిసరిగా వాళ్ళింటి నుండి తీసుకుని, ఆ ఇంటి నుండి బయలుదేరుతున్నట్లుగా వెళ్లాలి. దీని వల్ల, మనింటి నుంచి ఈ రోజే వెళ్లినట్లు, పక్కింటినుండి మర్నాడు వెళ్లినట్లు అయ్యేది.  నాకు ఈ సూత్రమేమిటో అర్ధం అయ్యేది కాదు. అయినా అందరూ పాటించే వాళ్ళు. ఇక బల్లి శాస్త్రం. పొరపాటున బల్లి మన మీద పడితే, ఒక్కోచోట పడితే ఒక్కో ఫలితమని పంచాంగంలో రాసి ఉండేది. బామ్మ వెంటనే, పంచాంగం తీసి, ఆ ఫలితమేమిటో చెప్పేది. బల్లి పడ్డ వెంటనే స్నానం చేసి రమ్మనేది. కంచి వెళ్లి అక్కడ బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకుని వచ్చిన వాళ్ళను తాకమనేది. అప్పుడు అది పడ్డ దోషం పోతుందట. ఇదీ బల్లి కథ. నాకసలే బల్లి అంటే చచ్చే భయం. అది గదిలో ఉందంటే, నేనక్కడ ఉండేదాన్ని కాదు. దానికీ నాకూ షష్టాష్టకం. అది కానీ కింద పడితే, నేను వెంటనే ఘట్టి ఘట్టిగా అరిచేసి, ఏడ్చేసి, దగ్గర్లో వున్న మంచాలో, కుర్చీలో ఎక్కేసేదాన్ని. ఎవరైనా వచ్చి దాన్ని తరిమితే గానీ దిగేదాన్ని కాదు. ఆ ఎక్కడం అనే కార్యకమంలో మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా సరే, వాళ్ళను బలంగా తోసేసి మంచమో, కుర్చీనో ఎక్కేసేదాన్ని. అది మా ఇల్లా, మరొకరి ఇల్లా అన్న మొహమాటం కొంచం కూడా బల్లి విషయంలో నాకు ఉండేది కాదు. పెద్దదాన్నవుతున్న కొద్దీ కొంచం కొంచం భయం తగ్గినా (అంటే చూస్తేనే కలిగే భయం పోయింది) మొత్తం పోయిందని మాత్రం గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పలేను. ఇప్పటికీ మా ఇల్లు బల్లి ప్రూఫ్ చేసే వుంచుతాను.  

                                                      బామ్మది ఇంకో నమ్మకం. ఎవరైనా పొరపాటున కానీ, ప్రమాదవశాత్తూ కానీ, కాలుజారో, లేదా ఏదో దూకుతూనో, గెంతుతూనో  కింద పడితే, వాళ్ళను లేపి వెంటనే అక్కడ ఓ చెంబు నీళ్లు పోసేది, లేదా పోయించేది. పడ్డ దోషం ఆ నీళ్లు పోయంగానే పోతుందనేది. ఆ అలవాటు నేనూ మా పిల్లల చిన్నప్పుడు చేసేదాన్ని. వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ పడటమూ ఆగిపోయింది, ఆ అలవాటూ మర్చిపోయాను. ఇంకో తమాషా విషయం. అమ్మ కానీ, బామ్మ కానీ, లేదా ఎవరైనా సరే, కాలు జాపుకుని కూర్చుంటే, మేమెవరైనా  ఇటు నుంచి అటు ఆ కాలు దాటి వెళ్లామా, మా పనైపోయిందే. పిర్ర మీద నాలుగిచ్చుకుని, మళ్ళీ అటు నుంచి, ఇటు దాటమనేది. కాలు దాటకూడదనేది. 'ఒకసారి దాటితే తప్పయితే, రెండోసారి దాటితే ఇంకా డబుల్ తప్పుకాదా బామ్మా' అని అడిగితే, 'నోరు ముయ్యి, ఎదురు మాట్లాడుతున్నావ్' అనేది. ఏ ఒక్కదానికీ అది ఎందుకు చేస్తోందో చెప్పేది కాదు. ఆవిడ చెప్పేది, మేం చెయ్యాలి, అంతే. 

                                                             ఇంకో ముచ్చట, ఇంట్లో కాటుక తయారు చెయ్యటం. మా పిల్లలందరికీ సానలు, గంధం చెక్కలూ ఇచ్చి గంధం తియ్యమనేది. ఒక బుల్లి గిన్నె నిండా చిక్కగా గంధం తీసాక, అటక మీంచి పెద్ద ఆవకాయ కలిపే ఇత్తడి పళ్లెం తీయించి, దాన్ని బంగారం రంగు వచ్చేదాకా తోమించి పెట్టేది. ఆ పళ్ళానికి వెనక ఈ గంధం చిక్కగా పట్టించేది. ఈ గంధం అంతా చక్కగా దానికి ఎండిపోవాలి. రాత్రి పనంతా అయిపోయాక, మూడు ఇటుకరాళ్ళు పెట్టించి, ఆ రాళ్ళ మధ్యలో మూడు, నాలుగు ప్రమిదల్లో ఆముదం పోసి, దాంట్లో మూడు మూడు వత్తులేసి వెలిగించి ఈ పళ్లాన్ని గంధం మీదకు దీపం పొగ వచ్చేలా ఆ రాళ్లమీద పెట్టేది. ఈ మొత్తం సెట్టింగ్ కి, ఎక్కడ్నుంచి తెప్పించేదో  తెలియదు కానీ, ఓ పెద్ద వెదురుబుట్ట, పెళ్ళిళ్ళల్లో పెళ్లికూతురుని తెస్తారే, అలాంటి బుట్ట ఒకటి తెప్పించి బోర్లించేది. ఈ మొత్తం కార్యక్రమం పిన్ డ్రాప్ సైలెన్స్ లో జరగాలి. శబ్దం చెయ్యనిచ్చేది కాదు. లైబ్రరీల్లో లాగా అంతా నిశ్శబ్దం, ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టు. నేను అన్నీ కుతూహలంగా పక్కనే వుండి చూస్తూ ఉండేదాన్ని. ఇదంతా బామ్మ పర్యవేక్షణలో అమ్మ చేసేది. నేనేమో అమ్మకి అసిస్టెంటుని. ఆ తరువాత జాగ్రత్తగా శబ్దం కాకుండా తలుపులు వేసి వచ్చి పడుకునే వాళ్ళం. అమ్మ మాత్రం కాటుక చేసే రోజు రాత్రి మధ్య మధ్యలో వెళ్లి అవసరమైతే ఆముదం మళ్ళీ పొయ్యటం, దీపం ఆరిపోతే మళ్ళీ వెలిగించటం, అంతా సక్రమంగా ఉందా అని చూస్తూ ఉండేది. మర్నాడు లేచాక వుండేది సరదా అంతా. ఆ బుట్ట తీసేసి, ఆ పళ్ళాన్ని తిరగేసి యెంత మసి పట్టిందా అని చూసేవాళ్ళం. యెంత మసి పడితే అంత కాటుక వచ్చినట్టు. ఒక్కోసారి ఆ మసిలో ఎత్తుగా బుడగల లాగా కూడా వచ్చేవి. అప్పుడు ఇంకా ఎక్కువ మసి వచ్చిందని, ఎన్ని బుడగలొస్తే, అంత మంచిదని, అమ్మా, బామ్మా అనుకునే వాళ్ళు. బామ్మ ఆ మసి అంత తానే కూర్చుని, జాగ్రత్తగా ఒక న్యూస్ పేపర్ లోకి తాటాకుతో గీకేది. ఈ లోపల ఆ ఇత్తడి పళ్ళాన్ని మళ్ళీ ఎంచక్కా తోమి ఇచ్చేది పనిమనిషి. దానికీ చూడ్డానికి ఇదంతా సరదాగానే ఉండేది. మసి అంతా తీసేసాక, ఆ మసిలో కావాల్సినంత మాత్రమే తీసుకుని, మిగిలింది పొట్లం కట్టి దాచేది బామ్మ. ఎందుకంటే మళ్ళీ ఆ మసితో ఇంకోసారి కాటుక చేసుకోవచ్చట. తీసుకున్న మసి పొడిలో, తాజా వెన్న కానీ, ఆముదం కానీ, నెయ్యి కానీ వేసి కలిపేది. అంతా ఆ తాటాకు ముక్కతోనే.  కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ పేస్ట్ లో వేసి అంత చక్కగా కలిసేట్టు కలిపేది బామ్మ. అప్పుడు ఆ పేస్ట్ ని పళ్లెం మీద చక్కగా మధ్యలో ఓ ముద్దలాగా పెట్టి, ఓ చెంచాతోనో, గరిటతోనో గట్టిగా రుద్దేది. ఈ రుద్దుతున్నప్పుడు పై నుంచి నాలాంటి బుల్లి అసిస్టెంట్ ధారగా నీళ్లు పోస్తూ ఉండాలి. ఒక్కోసారి బామ్మే బోరింగ్ పంపు దగ్గరకి వచ్చి ఓ పీట వేసుకుని కూర్చునేది. నేను పంపు కొట్టటం, ఆ ధార కింద బామ్మ కాటుకని గట్టిగా నూరటం. మొత్తం సమానంగా అంతా కలిసేవరకూ నూరేది. కడుగుతున్నప్పుడు ఏవయినా గట్టి పలుకులు ఉంటే కొట్టుకుపోయేవి, లేదా అవీ మెత్తగా అయి కలిసిపోయేవి.  అలా ఓ పావుగంట కడిగాక అప్పుడు తీసి దాన్ని కాటుక భరణిలో పెట్టేది. ఇంకా చాలా బోల్డు కాటుక ఆ పళ్ళానికి అతుక్కుని ఉండిపోయేది. కొన్నాళ్ళు మేమంతా ఆ పళ్లెం కాటుకే పెట్టుకునేవాళ్ళం, ఇంత కష్టపడి చేసింది వేస్ట్ ఎందుకు కావాలని. నిజంగానే ఆ కాటుక కళ్ళకు చల్లగా హాయిగా ఉండేది. ఇదీ కాటుక కథ. ఆ కాటుక తయారు చేసేటప్పుడు అంత నిశ్శబ్దంగా ఎందుకుండాలి, అది రాత్రి పూటే ఎందుకు చెయ్యాలో అర్ధం అయేది కాదు. అడిగితే గయ్యిమనేది బామ్మ. నేను ఇప్పటికీ సరదా పుట్టినా, ఎవరింట్లో అయినా పసిపాపలు వున్నా కాటుక ఇంట్లోనే తయారు చేస్తూంటా. చిన్న పిల్లలకు బజారు కాటుక ఎందుకూ అని. నిజంగానే ఈ కాటుక కళ్లకు హాయిగా ఉంటుంది. కానీ నేను బామ్మ నియమాలు, అంటే నిశ్శబ్దంగా ఉండటం, బుట్ట బోర్లించటం, రాత్రిపూటే చెయ్యటం పాటించలా. అయినా మంచి కాటుకే వచ్చేది, కానీ చాలా కొంచం వచ్చేది.            

                                                       ఇంకో సరదా నమ్మకం దిష్టి. దిష్టి తీయటం అంటే, కాసింత  ఉప్పు తల చుట్టూ దిగదుడిచి నీళ్ళల్లో పడేయటం. ఉప్పు కరిగే లోపల దిష్టి పోతుందని ఒక నమ్మకం. బాగా పెద్ద దిష్టి కొట్టిందంటే, ఉప్పుతో  పాటు ఎండు మిరపకాయలు కూడా జత చేసి పిల్లలకు దిగదుడిచి దాన్ని పొయ్యిలో నిప్పుల్లో వేసేది. ఆ ఉప్పు చిటపట మన్నా, ఆ మిరపకాయలు ఖోరు రాకపోయినా, ' చూసావా, ఎంత దిష్టి ఉందో' అనేది బామ్మ. మా అమ్మ కి మాత్రం ఈ దిష్టి గోల సొక్కలా. బామ్మ ఉంటేనే, ఆవిడ చెప్తేనే తీసేది, లేకపోతే లేదు. మాకేమో దిష్టి తీయించుకోవడమంటే మహా సరదా. ఈ విషయంలో మా రాజ్యం ఆమ్మ మాత్రం బంగారుతల్లి. పిల్లలొచ్చి ఎప్పుడు దిష్టి తీయమన్నా తీసేది. కాకపోతే ఆమ్మ తీసే దిష్టి వేరే. నూనెగుడ్డ దిష్టి. మునిమాపు వేళ, కొంచెం చీకటి పడంగానే, పిల్లలందరం ఆమె చుట్టూ చేరి,  'అమ్మా, దిష్టి తియ్యి,  ఆమ్మా దిష్టి తియ్యి' అని కూర్చునేవాళ్ళం. ఆమ్మ శ్రద్ధగా ఒక్కోరికీ దిష్టి తీసేది. ఒక సన్నని పొడుగాటి గుడ్డముక్కని, నూనెలో ముంచి, పిల్లలకు తలచుట్టూ దిగతుడిచిన తరువాత, ఒక అట్లకాడకి ఆ బట్టముక్కని పొడవుగా వేళ్ళాడేసి,  చివర నిప్పు ముట్టించేది. ఆ బట్ట కాలుతున్నప్పుడు నూనె బిందువులు పడితే దిష్టి లేనట్టు, నిప్పు బిందువులు పడితే దిష్టి ఉన్నట్టు. ఎన్ని ఎక్కువ నిప్పు బిందువులు పడితే అంత దిష్టి ఉన్నట్టు. పాపం ఆమ్మ దగ్గర ఎన్ని పాత బట్టలున్నా, అన్నీ మా దిష్టికే అయిపోయేవి. అంతేనా, నూనె కూడా. ఓ కటోరాలో నిండుగా నూనె పెట్టుకుని కూర్చునేది. 'ఎవరెవరికి దిష్టి తియ్యాలో రండే', అంటూ. ఈ దిష్టి ప్రహసనం భలే సరదాగా ఉండేది. ఎవరికి ఎక్కువ దిష్టి ఉందో లెక్కలేసుకునేవాళ్ళం. ఆమ్మ దగ్గర చూసాగా, ఈ దిష్టి నేను ఇప్పటికీ తీస్తాను. మా మనవడు కూడా "ఫైర్ దిష్టి తియ్యి బామ్మా" అంటూ వచ్చేవాడు. ఇంకో నియమం ఏమిటంటే, ఈ దిష్టి కార్యక్రమం అయిపోయాక, ఏ రకమైన దిష్టి అయినా సరే, తప్పనిసరిగా కళ్ళు, కాళ్ళు, చేతులు కడుక్కోమనేవారు. 

                                                                ఇవీ మా బామ్మ నమ్మకాలు, ఆవిడ కోడళ్ళకీ, కూతుళ్ళకీ, మనవరాళ్ళకీ, అందరికీ ఎన్నో కొన్ని, ఎంత కొంత అంటించేసింది. అందువల్లనే ఈ ఆచారాలు, నమ్మకాలు మా ఇంట్లో తరతరాలుగా వస్తున్నాయి. ఈ అన్నింటిలో లాజిక్, రీజనింగ్ అడక్కూడదు. అడిగితే గయ్యి మనేది. 'మాటకెదురు చెప్తున్నావా' అని కోప్పడేది. బాహుబలిలో రమ్యకృష్ణ లాగా, మా ఇంట్లో బామ్మ మాటే శాసనం, ఫైనల్ , యిక అంతే. 







బామ్మ(అమ్మ) - గృహవైద్యం

 బామ్మ(అమ్మ) - గృహవైద్యం 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                                 బామ్మ రకరకాల చిట్కాలు చెప్పేది.  చిట్కా వైద్యం చేసేది. చిట్కా వైద్యం అంటే గృహ వైద్యం అన్నమాట. అమ్మో, వాటికి లెఖ్ఖ లేదు, అంతూ దరీ ఉండేది కాదు. ఊ అంటే ఒక వైద్యం, ఆ అంటే ఒక వైద్యం. అవేమీ పని చెయ్యకపోతే, హోమియో మందులు, ఫెర్రమ్ ఫాసూ, కాలీ ఫాసూ అంటూ. బహుశా అందుకేనేమో చిన్నప్పుడు ఎప్పుడూ హాస్పిటల్ కి వెళ్లిన గుర్తు లేదు. ఇవాళ మా బామ్మా, అమ్మా ఇద్దరూ చేసిన చిట్కా వైద్యం గురించి చెప్తా. చదవటానికి విసుగ్గా అనిపిస్తుందేమో గానీ వాడటానికి అద్భుతంగా ఉంటాయి. మంచి ఫలితం కూడా చూపిస్తాయి. మాకు మాత్రం చేసేటప్పుడు కొన్ని మహా హుషారుగా అనిపించేవి. చాలా పోజుగా కూర్చుని మరీ చేయించుకునే వాళ్ళం. కొన్ని చెప్తే చాలు, భయపడి పారిపోవడానికి ట్రై చేసేవాళ్ళం, కానీ బామ్మకో, అమ్మకో దొరికిపోయేవాళ్ళం. పిల్లలున్న ఇళ్లల్లో ఇలాంటి పెద్దలుంటే యెంత ఉపయోగమో, యెంత పొదుపో, యెంత ఆరోగ్యమో.

                                                    ఎవరైనా కడుపునొప్పి అంటే చాలు, మూడు నాలుగు రకాల చిట్కాలు వాడేది. కడుపు ఉబ్బరంగా ఉంటే, అంటే కడుపులో ఏదో తెలియని అనీజీగా ఉంటే, జీలకర్ర పంచదార కలిపి నములుతూ ఆ జ్యూస్ ని నెమ్మదిగా మింగమనేది. జీలకర్ర కొంచెం ఘాటుగా ఉండేది. ఇష్టం లేకుండా నమిలేవాళ్ళం, కానీ తరువాత మాత్రం హాయిగా ఉండేది. ఒక్కోసారి పంచదార ఎక్కువ, జీలకర్ర తక్కువ వేసుకోవటానికి వేషాలేసేవాళ్ళం కానీ, అమ్మ లెక్కపెట్టి సమానంగా రెండూ, చెరో చెంచా చేతిలో వేసేది. కడుపు మంట అంటే మాత్రం, చక్కగా పేర్నెయ్యి, పంచదార ఒక స్పూన్ లో చక్కగా రెండూ కలిపి పేస్ట్ గా చేసి నాకమనేవాళ్ళు. ఇది మాత్రం మా పిల్లలకు అద్భుతంగా ఉండేది. ఒక్కోసారి ఇది తినటానికి, దొంగ కడుపు మంట కూడా చెప్పేవాళ్ళం. కడుపు నొప్పి వస్తే ఆముదం చేతులకు రాసుకుని పొయ్యి మీద వేడి చేసి, పొట్టమీద బొడ్డు దగ్గర, ఓ పది పదిహేను సార్లు కాపడం పెట్టేవాళ్ళు. వేడి వేడిగా పొట్టమీద దోసెలేస్తున్నట్టు, భలే ఉండేది. నొప్పి మాత్రం మాయమై పోయేది. తలనొప్పి అంటే మాత్రం శొంఠి గంధం పట్టు వేసేది. శొంఠికొమ్ము సాన మీద అరగదీసి, గంధం తీసి, కణతలకి చక్కగా రాసేవాళ్ళు. మంట మంటగా ఉండేది గానీ తలనొప్పి మాత్రం ఆ మంటతోనే పోయేది.  ఒళ్ళు నొప్పులంటే, ఉప్పుకాపు పెట్టేవాళ్ళు. అంటే ఉప్పుని వేయించి, ఒక బట్టలో మూటకట్టి ఆ వేడి మూటతో, ఎక్కడ నొప్పంటే, అక్కడ కాపడం పెట్టేవాళ్ళు.

                                                     నోటికి  రుచి పోతే  జీలకర్ర కషాయం కానీ, మిరియాల కషాయం కానీ, ధనియాల కషాయం కానీ కాచి తాగించే వాళ్ళు. కాషాయమంటే ఏం లేదు. ధనియాలు కానీ జీలకర్రను కానీ, మిరియాలను కానీ కొంచెం దంచి పొడి చేయటం, ఆ పొడిని నీళ్ళల్లో వేసి మరిగించటం, తోడుగా కొంచెం బెల్లమో, తేనో, అదీ లేకపోతే పంచదారో వేసి కలిపి ఓ మూడు నాలుగు గుక్కెళ్ళు తాగించటం. చచ్చే కారంగా వుంటాయన్నీ. అరుదుగా అల్లం ముక్క కడిగి ఉప్పు రాచి, నిప్పుల్లో పొంగించి, దాన్ని చల్లారాక నోట్లో వేసుకుని చప్పరించమనేది. ఇది కూడా కారంగానే ఉండేది కానీ, రుచిగానే ఉండేది. ఇంకా ఎవరైనా ఉడుకు విరేచనాలవుతున్నాయంటే, మొదట్లో నీళ్ళల్లో పంచదార వేసుకుని తాగమనేది. ఈ వైద్యం మాత్రం చిన్నా, పెద్దా అందరికీ మహా నచ్చేది. అటొచ్చి ఓ సారీ, ఇటొచ్చి ఓ సారీ ఎంచక్కా పంచదార కలుపుకుని నీళ్లు తాగేసేవాళ్ళం. ఇంకోసారి సబ్జాగింజలు పంచదార నీళ్ళల్లో నానేసి తాగమనేది. ఇది కూడా చాలా బాగుండేది. ఒక్కోసారి ఓ గరిటెడు పెరుగులో ఓ అరచెంచాడు మెంతులు వేసి మింగమనేది. ఆ వేడికి ఈ మెంతులు చలవట. అప్పటికీ తగ్గకపోతే కాస్త సగ్గుబియ్యం జావ కాచి కొంచెం పాలూ, పంచదారా వేసిచ్చి తాగమనేది. ఇది అద్భుతమైన మందు. మాకందరికీ బాగా నచ్చిన సగ్గుబియ్యం పాయసం మందు. దీంతో ఆ విరేచనాలు ఠక్కున కట్టేవి. మొత్తం మీద మేము డాక్టర్ల దగ్గరకు వెళ్ళటం తక్కువే. 

                                                  పొడి దగ్గు వస్తే పటికబెల్లం బుగ్గన పెట్టుకుని నెమ్మదిగా ఆ జ్యూస్ ని మింగమనేది. అప్పుడు మాత్రం బామ్మ తన పెట్టెలోంచి తేనె సీసా తీసేది. కఫంతో వస్తున్న దగ్గుకి తేనె నాకమనేవారు. ఇది కూడా బామ్మ దగ్గర రెడీగా ఉండేది. ఒక్కోసారి దగ్గు సతాయిస్తుంటే మాత్రం, ఓ చుక్క నెయ్యిలో లవంగాలు పొంగించి పటికబెల్లంతో కలిపి పొడి చేసి కొంత పొడి బుగ్గన పెట్టుకోవడం ఓ పద్ధతి. మా బామ్మ ఎప్పుడూ ఈ పొడి చేయించి దగ్గర పెట్టుకునేది. ఇది మా అత్తగారికి కూడా చాలా నచ్చింది. ఆవిడ కూడా ఎప్పుడూ ఈ పొడి చేయించుకుని దగ్గర పెట్టుకునేది. దగ్గుకి బాగా ఉపశమనంగా వుంది అనేది మా అత్తగారు. ముక్కుదిబ్బడ కి మిరియం గింజని ఒక పిన్నుకి కాల్చి పొగ పీల్చమనేది. ఆ పొగ మహా ఘాటుగా ఉండేది. చుర్రుమనేది. కానీ ముక్కుకి వెంటనే ఉపశమనం కలిగేది. ఒక్కసారిగా ఊపిరి ఆడి హాయిగా ఉండేది. జలుబుకు కూడా బామ్మ దగ్గర రకరకాలైన ఉపాయాలు ఉండేవి. అవి అమ్మ ద్వారా చేయించేది. అమ్మ చేత వేడి నీళ్లు సలసలా కాగించి మూత పెట్టి ఆ ఆవిరి పోకుండా ఆ గిన్నెని జాగ్రత్తగా తెచ్చి దాంట్లో పసుపో, అమృతాంజనమో కొంచెం వేసి ఆవిరి పట్టించేవాళ్ళు. బామ్మయితే పక్కనే కూర్చుని, మొద్దు మొద్దు దుప్పట్లు కప్పి ఊపిరాడకుండా ఆవిరి పట్టించేది. అప్పుడు మాత్రం లబోదిబో మనే వాళ్ళం. బామ్మ మాత్రం వదిలేది కాదు. మా తమ్ముడు, బాబు అంటాం, చాలా చిన్నప్పుడు ఒకసారి మా చెల్లెళ్లు పద్మకీ, భారతికీ ఆట కోసం, అమాయకంగా వాళ్ళిద్దరి కళ్ళల్లో అమృతాంజనం పెట్టేసాడు. ఇక చూడండి, వాళ్లిద్దరూ మంటో, మంటో అంటూ పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టారు. బాబు తెల్లబోయాడు. వాడూ ఏడవటం మొదలు పెట్టాడు. అమ్మ, బామ్మా పరుగెత్తుకు వచ్చారు. విషయం అర్ధం అవగానే, బాబుకి రెండు తగిలించి ఇద్దరూ చల్లనీళ్ళతో  చెరొకరికి కళ్ళు కడగటం మొదలుపెట్టారు. ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఇంకా నయం, ఆ టైం కి నేను ఇంట్లో లేను. బతికి పోయాను. అప్పుడే ఇంట్లోకి వస్తున్నాను, వీళ్ళిద్దరూ ఘొల్లుమని ఏడుపు మొదలుపెట్టారు. తరువాత ఇద్దరికీ కాసేపు చల్లటి తడిబట్ట వేసి పడుకో పెట్టారు. తరువాత  నవ్వుకున్నా, అప్పుడు మాత్రం అందరం చాలా ఖంగారు పడ్డాం. 

                                                 నాన్నకు కాలికి ఆనెలు ఉండేవి. పాపం చాలా బాధపడేవాడు. ఆ పోలిక పాపం భారతికి కూడా వచ్చింది. బామ్మ ఇటుక ముక్క కాల్చి, కాలి ఆనె కి కాపడం పెట్టేది. చురుక్కుమంటూ ఉండేది. నేను కూడా పెళ్లయ్యాక, మావారికి ఆ ప్రాబ్లమ్ వస్తే, నేనూ ఇటుక కాపు పెట్టేదాన్ని. ఒక చిన్న ఇటుక ముక్కని మంట మీద కాల్చి, జాగత్తగా కింద పెట్టి, కూర్చుని దానిమీద పాదం పెడుతూ, తీస్తూ ఉండమనేదాన్ని. అప్పటికప్పుడు కాస్త నొప్పి తగ్గేది. అమ్మ ఎప్పుడూ ఏదో పని మీద ఎక్కువగా నీళ్ళల్లోనే ఉండేది. పాదాలు ఎప్పుడూ తడిగానే ఉండేవి. అమ్మ చర్మం చాలా సున్నితంగా ఉండేది. దాంతో అమ్మకి కాళ్ళు బాగా పాసేవి. నాన్నకేమో, ఎప్పుడూ వేడి తత్వం, పాదాలు పగిలేవి. అమ్మకేమో, కొబ్బరి నూనెలో పసుపు కలిపి, ఆ పేస్ట్ ని పాదాలకి, ముఖ్యంగా వేళ్ళ మధ్య రాసుకోమనేది. నాన్నకేమో అదే నూనెలో బోరిక్ పౌడర్ కలిపి ఆ పేస్ట్ ని కాళ్ల పగుళ్ళకి పట్టించేది అమ్మ. ఓ వారం రోజులు ఇలా రాసుకుంటే, ఆ సమస్య మాయమై పోయేది. ఆడవాళ్ళకు గైనిక్ సమస్యలుంటే, చిట్టుడుకు నీళ్లులో ఉప్పు వేసి తాగమనే వారు. చిట్టుడుకు నీళ్లంటే, అన్నం ఎసరు పెట్టి, కాసేపు ఉడికాక, ఆ నీళ్లు కొంచెం తీసుకుని, దాంట్లో కాస్త ఉప్పు వేసి,  గోరు వెచ్చగా తాగటం ఒక పధ్ధతి. ఇంకోటి బియ్యం కడుగునీళ్లు తాగటం, అంటే బియ్యాన్ని ఒకసారి పైపైన కడిగి ఆ నీళ్లు పారబోసి, రెండోసారి కడిగినప్పుడు, ఆ నీళ్లు కొంచం తీసుకుని దాన్ని తాగేవాళ్ళు. ఆ నీటిలో కొంచం తవుడు కూడా ఉండాలి, అది నియమం.  వంట చేస్తున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా కాలితే చల్లగా నవనీతం రాసుకోమనేది. లేకపోతే తనే రాసేది. తాను రాయటమా, మనమే రాసుకోవటమా అనేది, ఆవిడ ఆ సమయంలో మడిలో ఉందా, లేదా అనే దానిమీద ఆధారపడేది. ఇంతకీ నవనీతం అంటే అప్పటికప్పుడు తీసిన వెన్న కాదు. అది ఎప్పుడంటే అప్పుడు రెడీ గా ఉండొద్దూ. బామ్మే చక్కగా నవనీతం చేసేది. కొద్దిగా పేర్నెయ్యి ఒక ప్లేట్ లో తీసుకుని, నాలుగు చుక్కలు నీళ్లు వేసుకుని చక్కగా కలిపేది. యెంత కలిపితే అంత బాగా తెల్లగా అది వెన్న లాగా వచ్చేది. ఆ పేస్ట్ ని కాలిన చోట రాసేది. చల్లగా హాయిగా ఉండేది. ఈనాటి మన బర్నాల్ లాగానో, డ్రెసిన్ లాగానో పనిచేసేది. ఆ మంటా పోయేది. కాలిన గాయం మానేదాకా అదే చికిత్స, అంతే. ఇంకో చిట్కా, ఎక్కిళ్ళొస్తే, గబగబా గ్లాసుడు నీళ్లు ఆపకుండా తాగించేది. నాన్నకేమో ఎక్కిళ్ళొస్తే ఆగేవి కావు. ఒక్కోసారి నాన్నకి ఎన్ని నీళ్లు తాగినా ఎక్కిళ్ళు తగ్గేవి కావు. అయినా సరే, నీళ్లు తాగాల్సిందే, అదీ ఆగకుండా. 

                                                 వేసవికాలంలో ఒక్కోసారి బాగా వళ్ళు పేలేది. అప్పుడు మళ్ళీ సాన, గంధం చెక్క బయటకు తీసి, గంధం తీసి, ఆ గంధాన్ని చల్లగా ఒంటికి పూసేవాళ్ళు. అదే ఈ రోజు మాయిశ్చరైజర్ గా మారింది. కానీ గంధం ఉన్నంత హాయిగా మాయిశ్చరైజర్  ఉండదు. మా చెల్లెళ్ళిద్దరికీ ఎందుకో తెలియదు కానీ, ప్రతి వేసవిలో వాళ్ళిద్దరికీ తలలో, జుట్టు నిండా కురుపులు లేచేవి. చాలా బాధపడేవాళ్లు. అప్పుడు అమ్మ రోజూ ఫ్రెష్ గా, కృష్ణానది ఒడ్డు నుంచి ఒండ్రుమట్టి  తెప్పించేది. ఆ మట్టి తలకు పట్టించేది అమ్మ. చల్లగా హాయిగా ఉండేదట. కాకపోతే ఈ పుళ్ల వల్ల ప్రతి వేసవిలోనూ తప్పనిసరిగా వాళ్లిద్దరికీ జుట్టు కత్తిరించేది అమ్మ. అన్నిసార్లు కత్తిరించినందుకే కాబోలు, వాళ్ళిద్దరి జుట్లూ చక్కగా పొడుగ్గా పెరిగాయి. నాకేమో భుజాలు దాటి పెరగలేదు. పైగా జుట్టు సన్నగా స్పైరల్ లాగా అయిపోయి యెంత జుట్టున్నా కూడా స్ప్రింగులు తిరిగినట్టు భుజాలదాకా వెళ్లిపోయేది. ఎక్కడైనా పొడుగు జడ కనిపిస్తే, ఇప్పటికీ నేను చిన్నపిల్లలా వాళ్ళను, కాదు కాదు, వాళ్ళ జడను చూస్తూనే ఉంటా.

                                                    ఒకసారి నాకు చాలా చిన్నప్పుడు సుమారు మూడేళ్ళు ఉంటాయి అనుకుంటా, అప్పుడు చంటిబిడ్డ జబ్బు వచ్చిందట. ఇంతకీ చంటిబిడ్డ జబ్బు అంటే ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. బహుశా అది ఒక రకం ఫిట్ ఏమో అనుకుంటున్నా, వాళ్ళు చెప్పిన మాట బట్టీ. ఇంట్లో నాన్నా, ఎదురింట్లో ఉమా పెదనాన్నా అందరూ ఎక్కడికో బైటకు వెళ్లారు. మగవాళ్ళెవరూ లేరు. పక్కింట్లో వుండే ఆలోపతీ డాక్టర్, ఊళ్ళోనే జరుగుతున్న ఏదో డాక్టర్ల కాన్ఫరెన్స్ కి వెళ్ళాట్ట. నేనేమో పడిపోయానట. బామ్మ వెంటనే, ఎవర్నో మా హనుమానన్నయ్య కోసం పంపించింది. ఆయనా దొరకలేదు సమయానికి. హనుమానన్నయ్య ఆరోజుల్లో మా అందరికీ హోమియో డాక్టర్. బామ్మకి మేనకోడలు కొడుకు. అనుకోకుండా వాళ్ళూ నందివాడ వాళ్ళే. నాకు అన్నయ్య వరస. మా నాన్న కంటే పెద్ద, కానీ బామ్మ ని బామ్మా అనీ, నాన్నని బాబాయ్ అనీ పిలిచేవాడు. మేం అందరం అన్నయ్యా అనేవాళ్ళం. ఆయన మొత్తం విజయవాడలో పెద్ద పేరు తెచ్చుకున్న హోమియో వైద్యుడు. పూర్తి పేరు డాక్టర్ నందివాడ హనుమత్ సీతాపతిరావు. ఆయనుంటే, అందరికీ కొండంత ధైర్యం. ఆయన లేడనేసరికి నన్ను ఒళ్లో పెట్టుకుని అందరూ ఏడుస్తూ కూర్చున్నారుట. వీళ్ళ ఏడుపు విని ఎవరో రోడ్డు మీద పోతున్న వాళ్ళు లోపలికి వచ్చి, నన్ను చూసి, 'అయ్యో చంటిబిడ్డ జబ్బులా వుందే' అనుకుంటూ, అందులో ఒకాయన, తాను తాగుతున్న చుట్టతో  వెంటనే నా కనుబొమల మధ్య, కొంచం పైన, ఆజ్ఞాచక్రం అంటారే, అక్కడ ఒక వాత పెట్టాట్ట. ఆ మచ్చ నాకు ఇప్పటికీ వుంది, పెద్దవుతున్న కొద్దీ చాలావరకు చర్మంలో కలిసిపోయినా. ఆ వేడి చుట్ట నిప్పు తగలంగానే నేను లేచి కెవ్వున ఏడిచాట్ట. అందరూ వెంటనే ఆ చుట్టాయనకు దణ్ణం పెట్టి, 'బతికించారండీ దేవుడిలా వచ్చారు' అన్నారట. ఈ కథ నేను అమ్మ దగ్గరా, బామ్మ దగ్గరా ఎన్నిసార్లు విన్నానో. ఆ తరువాత నానా, పెదనాన్న, హనుమానన్నయ్యా అందరూ వచ్చారనుకోండి. కానీ అందరూ ఈ చుట్ట వాత వైద్యం మాత్రం మెచ్చుకున్నారు. ఈ రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ వస్తే, షాక్ ఇవ్వట్లా, అట్లా అన్నమాట. సో, చిట్టి  చిట్టి చిట్కాలు పోయే ప్రాణాలు కూడా రక్షిస్తాయి.

                                             ఇంకోసారి, ఈ వైద్యం బామ్మ చేసిందే. మేమందరం మా పెద్దత్తయ్యా వాళ్ళబ్బాయి విఠల్ వొడుక్కి హైదరాబాద్ వచ్చాం. పెద్దత్తయ్యా వాళ్ళింటికి, ఒడుగు జరిగే ప్రాంతానికీ ఓ గోడే అడ్డం. వెళ్తే ఆ గోడ దూకి వెళ్ళాలి, లేదా రోడ్డంతా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది జరిగింది జాంబాగ్ లో, వనపర్తి రాజా గారి బిల్డింగ్ లో. అందరం చాలా అలవాటుగా గోడ దూకేసి అటూ, ఇటూ వెళ్ళేవాళ్ళం. పైగా మా పిల్లలకు అదో ఆటలా ఉండేది. ఎక్కడానికీ, దూకటానికీ వీలుగా అటూ ఇటూ యేవో రాళ్లు కూడా పెట్టారు. మా తమ్ముడు, వాడికప్పుడు ఐదేళ్ళు ఉండొచ్చు. ఓ సారి అలా దూకుతూ, అంత ఎత్తు గోడ మీంచీ, కాలుజారి పడిపోయాడు. కంటి పక్కన నెమరుకణత మీద ఓ రాయి గుచ్చుకుని బొక్క పడి చాలా రక్తం పోయింది. బాధకి బాగా ఏడుస్తున్నాడు. అందరం భయానికి, వాడికేమి అవుతుందో అన్న ఖంగారుకీ భోరుభోరున ఏడ్చేస్తున్నాం. అందరం వాడిని లోపలికి తీసుకెళ్ళాము.  బామ్మ మాత్రం, ఏమాత్రం ఖంగారు పడకుండా, పిల్లాడిని  పడుకోబెట్టి, వంటింట్లోకి వెళ్లి, సున్నం బెల్లం కాస్త పసుపు వేసి మెత్తగా గట్టి పేస్ట్ లాగా నూరి, పట్టుకొచ్చి, బాబుకి ఆ బొక్కలో పెట్టేసింది. అంటే ఈ సున్నం బెల్లంతో  నూరిన పేస్ట్ తో ఆ బొక్కని సీల్ చేసేసింది. ఇక అంతే, టక్కున రక్తం కారటం ఆగింది. బాబు మామూలుగా లేచాడు. తరువాత బామ్మ చెప్పింది, యెంత పెద్ద దెబ్బయినా సున్నం బెల్లం నూరి పట్టు వేస్తే, చక్కగా తగ్గుతుందని. ఆ పేస్ట్, ఓ గంటకల్లా గట్టి పడిపోయింది. పూర్తిగా గాయం తగ్గాక కానీ అది ఊడి పడలేదు. దానంతట అదే పడిపోతుంది, పీకోద్దని వాడికి ఓ వార్నింగ్ ఇచ్చింది. సుమారు ఓ నెల రోజులకు ఆ వుండ ఊడి పడింది. అక్కడ ఓ చిన్న మచ్చ మాత్రం మిగిలింది. బామ్మ గృహవైద్యాలకు సాక్ష్యంగా నాకో మచ్చ, నా తమ్ముడికో మచ్ఛా మిగిలాయి. 

                                                        బామ్మ ఇంకొన్ని తమాషా చిట్కాలు చేసేది. ఇంట్లో వక్కపొడి ఎప్పుడైనా అయిపోతే, (మామూలుగా మాఇంట్లో వక్కపొడి అయిపోదు, ఎందుకంటే నాన్నకి అది చాలా ఇష్టం) అప్పటికప్పుడు ఓ చారెడు కందిపప్పు ఎర్రగా వేయించి అందరికీ చేతిలో పోసేది మా అమ్మ. ఈ చిట్కా మాత్రం బామ్మ చెప్పిందే. నాన్న కూడా ఇష్టంగా తినేవాడు, ఈ వేయించిన కందిపప్పు. అలాగే, ఎప్పుడైనా పళ్ళపొడి అయిపోతే బొగ్గుని గరుగ్గా పొడి చేసి, దానికి గరుగ్గా దంచిన ఉప్పుని జత కలిపి, ఇచ్చి పళ్ళు తోముకునేది. ఇది చెయ్యాలంటే మాత్రం మేమంతా ఘొల్లు ఘొల్లున ఏడ్చేవాళ్ళం. అయినా తప్పేది కాదు. అంతే కాదు, పొరపాటున ఎవరి పళ్లయినా పచ్చగా కనిపించాయీ అంటే,  వాళ్ళకీ ఇదే ట్రీటుమెంటు. తప్పేది కాదు. ఇప్పుడేమో పేరున్న విదేశీ కంపెనీలొచ్చి, మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, బొగ్గుందా, లవంగం ఉందా, అసలు పేస్టుందా, లాంటి తింగర ప్రశ్నలేస్తుంటే వింటున్నాం, చూస్తున్నాం. అదీ కథ. మళ్ళీ అందరూ, మన భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాల ప్రజలందరూ మనలాగానే, నిజ్జంగా నిజం, అచ్చం మన లాగానే బొగ్గుతో, ఉప్పుతో పళ్ళు తోముకునే రోజులొచ్చేశాయి. నాకేమో "మారాయ్, మారాయ్, రోజులు మారాయ్" అని పాడుకోవాలని పిస్తోంది. 








18, ఏప్రిల్ 2020, శనివారం

లలితా రహస్య సహస్ర నామాల్లో చిన్న సవరణ

లలితా రహస్య సహస్ర నామాల్లో చిన్న సవరణ 
లలితా పరమేశ్వరీ దేవ్యై నమః  

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                          లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. హిమాలయాల్లో మన్మధుడు పరమశివుని తపస్సుని భగ్నం చేసినప్పుడు, శివుడు మూడో కన్ను తెరచి మన్మధుణ్ణి భస్మం చేసాడు. తిరిగి రతీదేవి, పార్వతీ దేవి ప్రార్ధించగా మన్మధుడికి పునర్జన్మ ప్రసాదించాడు మహా దేవుడు. దాంతో మన్మధుడు తిరిగి జన్మించబోయే ప్రాంతానికి చేరుకుంది రతీదేవి. పార్వతిని హిమవంతుడు తీసుకు వెళ్ళిపోయాడు. తపోభంగమైన చోట ఉండకూడదని శివుడు తన ప్రమథ గణాలతో అక్కడి నుంచి  తరలిపోయాడు. ఇక మిగిలింది మన్మధుడి బూడిద. ఆకాశమార్గంలో వెళ్లే చిత్రకర్ముడనే రాక్షసుడొచ్చి ఏమైందో గ్రహించి తన శక్తితో ఆ బూడిద నుంచి ఒక బొమ్మను తయారుచేసి, ప్రాణం పోశాడు. వాడు లేచి, నన్నెందుకు పుట్టించావ్, ఏమి చేయాలీ అని అడిగాడు. ఇద్దరూ కలిసి శతరుద్రీయం పారాయణ చేశారు. అప్పుడు అతని కోరికపై శతరుద్రీయంతో ప్రసన్నుడైన రుద్రుడు వరాలు ఇచ్చాడు. అరవై వేల సంవత్సరాలు దిగ్విజయంగా ఈ ముల్లోకాలూ పాలించేట్టు, ఈ బ్రహ్మాండంలో ఏ ఒక్కడి చేతా మరణం రాకుండా వరాలు పొందాడు. ఇదంతా బ్రహ్మ చూసి మెచ్చి "భండ, భండ" అని అన్నాడు. దానితో వాడి పేరు భండాసురుడు అయ్యింది. 

                                                    భండాసురుడు పోతూ పోతూ మిగిలిన మన్మధ భస్మం నుంచి ఇద్దరు సోదరులని తయారు చేసుకున్నాడు. వారే, విశుక్రుడు, విషంగుడు. ముగ్గురూ కలిసి దక్షిణదేశం వైపుకు వెళ్లారు. అక్కడ మహేంద్ర పర్వతం దగ్గర వాళ్ళ రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. దానికి శూన్యకనగరం అని పేరు పెట్టాడు. భండాసురుడు సోదరులిద్దరినీ మంత్రి, సేనాపతి చేసుకుని పాలన మొదలుపెట్టాడు. ఈ వరగర్వం వల్ల ఇంద్రాది దేవతలతో సహా అందరినీ వశపరచుకున్నాడు. అందరూ భండాసురుడి సేవకులైపోయారు. భండాసురుడు కామప్రళయం సృష్టించాడు. దాని వలన స్త్రీలకూ స్త్రీత్వము, పురుషులకు పుంస్త్వము పోయాయి. దీని వల్ల ఒక్క రాక్షసులకు తప్ప ఇతర జాతుల్లో  సంతతి పెరగలేదు. ఈ విధంగా అరవైవేల సంవత్సరాలు దాదాపు గడిచిపోయాయి. ఇప్పుడు ఇంద్రాది దేవతల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ భండాసురుడు కనుక తపస్సు చేసి మళ్ళీ వరాలు పొందితే, ఎలా అని భయపడ్డారు. అప్పుడు అందరూ కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్లారు. వాళ్ళూ ఈ బ్రహ్మాండానికి సంబంధించిన వారే కనుక నిస్సహాయత వ్యక్తం చేస్తూ, ఒక ఉపాయం ఆలోచించారు. 
                                                                       
                                                                              ఈ బ్రహ్మాండం బయట నుంచి మాత్రమే ఎవరైనా వచ్చి ఈ భండాసురుని వధించాలి అనుకున్నారు, అందునా రుద్రుడిచ్చిన వరంలో ఎవడి చేతా భండాసురుడు  మరణించడు అని వున్నది కనుక,  స్త్రీ మాత్రమే వాడిని చంపగలదు అని నిర్ధారించుకున్నారు. కనుక ఈ బ్రహ్మాండం బయట వున్న స్త్రీ మాత్రమే భండాసురుడిని వధించగలదు అని అందరికీ అర్ధం అయ్యింది. అప్పుడు త్రిమూర్తులు, "లలితాదేవి మాత్రమే ఈ పని చేయగలదు" అని చెప్పారు.  అప్పుడు అందరూ ముందు ఈ బ్రహ్మాండం నుంచి బయట ఎలా పడాలీ అని ఆలోచించడం మొదలైంది. ఈ బ్రహ్మాండం చుట్టూ వేల మైళ్ళ మందపాటి గోడ వుంది. దానినుంచి బైట పడాలి. ఆ గోడలో ఎక్కడైనా పగులు ఉందేమో అని వెతకడం మొదలు పెట్టారు. ఒకచోట బ్రహ్మాండం పైకప్పులో  రావి చెట్టు (అశ్వత్థవృక్షం) కనపడింది. ఆ చెట్టు పైనుంచి వేళ్ళాడుతోంది. కొమ్మలు కిందకు, వేళ్ళు బయటకు వున్న ఆ రావి చెట్టు కనపడింది. ఆ చెట్టు వేళ్ళ దగ్గర కొద్దిగా పగుళ్లు కనిపించాయి. అష్టదిగ్గజాలతో ఆ ప్రాంతంలో వాటి కుంభస్థలాలతో మోదించి ఆ పగులుని కొంచం పెద్దది చేసి అందరూ బయటకు వచ్చారు. అందరూ బయలుదేరి ఆ పాలపుంతలో లలితాదేవిని వెతుక్కుంటూ  బయల్దేరారు. దారిలో ఎన్నో బ్రహ్మాండాలు కనిపించాయి. చివరకు మణిద్వీపం వద్దకు చేరుకున్నారు. అక్కడ వారిని పరశంభువు, అతని భార్య పరాదేవి ఆపారు. లలితాదేవి దర్శనం కావాలంటే, ఎంతో జపం చేయాలన్నారు. పరశంభువు అందరికీ లలితా మంత్రం ఇచ్చాడు. పరాదేవి అందరికీ జపమాల లిచ్చింది. అందరూ జపసంఖ్య పూర్తి చేసాక తనను తలచుకుంటే వచ్చి హోమం చేయిస్తానని చెప్పాడు. అందరూ తిరిగి మన బ్రహ్మాండానికి వచ్చి జపం మొదలుపెట్టారు. 

                                                               జపం పూర్తయ్యింది. పరశంభువు వచ్చాడు. ఈ బ్రహ్మాండం  లోని వస్తువులేవీ హోమానికి పనికిరావన్నాడు పరశంభువు. బ్రహ్మాండం  బయట నుంచి సప్త మారుతాలను అవగాహన చేసాడు. తన మూడో కన్ను నుంచి అగ్ని సృష్టించాడు. ఆ అగ్ని సాయంతో ఆ వాయువులు మండసాగాయి. అదే చిదగ్ని. ఆహుతులుగా తమ శరీర ఖండాలనే వెయ్యమన్నాడు. అందరూ తమ శరీర ఖండాలని కోసి మంత్రంతో అగ్నిలో వేస్తున్నారు. చివరకు పరశంభువు వారినే ఆ చిదగ్ని కుండంలో దూకమన్నాడు. అందరూ దూకేశారు. తరువాత పరశంభువు అష్టకారికలను పఠించి అమ్మవారిని ఆవాహన చేసాడు. అప్పుడు ఆ చిదగ్ని కుండం నుంచి లలితాదేవి ఆవిర్భవించింది. ఆమే "చిదగ్నికుండ సంభూత."  "దేవకార్య సముద్యత." దేవతలందరూ అప్పుడు ఆ లలితాదేవి కోసం సింహాసనం తెచ్చారు. ఆ సింహాసనం మీద ఆ "శ్రీమహారాజ్ఞి" కామేశ్వరునితో కూడి ఆ సింహాసనం అధిష్ఠించారు. ఆమే "శ్రీమత్సింహాసనేశ్వరి." 


                                                                ఆ "శ్రీమాత" తన నుంచి శక్తి సేన ను సృష్టించింది. మొట్టమొదటి స్త్రీ సేన అది. లలితాదేవి తన శక్తితో హృదయం నుంచి బాల ను సృష్టించింది. మంత్రిణిగా శ్యామలాదేవిని, సేనాపతిగా వారాహిని నియమించింది. ఇలా ఎంతోమంది శక్తిస్వరూపాలని తన నుంచి ఆవిష్కరించింది. మహా యుద్ధం ఆరంభమయ్యింది. అమ్మవారి సేన భండాసురుని సేనను సంహరించసాగాయి. బాల భండపుత్రుల నందరినీ వధించింది. "భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా". ఆ తరువాత యుద్ధం భీకర రూపం దాల్చింది. భండాసురుడు సృష్టించిన విఘ్నయంత్రం గూఢంగా దాగి, స్త్రీ సేనను నాయకులకు ఎదురుతిరిగేలా చేసింది. దాంతో వారు నాయకుల మాట వినడం మానేశారు. అప్పుడు అమ్మవారు, కామేశ్వరుణ్ని  చిరునవ్వుతో  చూసింది. గణేశ్వరుడు ఉదయించాడు. "కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా". ఆ గణేశ్వరుడు విఘ్న యంత్రాన్ని భేదించాడు. దానితో స్త్రీ సేన మళ్ళీ గాడిన పడింది. "మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితా". 

                                                          తరువాత భండాసురుడు విశుక్రుణ్ణి పంపించాడు. అప్పుడు మంత్రిణి అయిన శ్యామలాదేవి భీకర యుద్ధంలో విశుక్రుణ్ణి సంహరించింది. "మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా". ఈసారి విషంగుడు వచ్చాడు. సేనాపతి, వారాహి విషంగుణ్ణి వధించింది. "విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా". చివరకు భండాసురుడే స్వయంగా యుద్ధంలోకి దిగాడు. అప్పుడు లలితాదేవే తానూ యుద్ధానికి వచ్చింది. ఇద్దరి మధ్యా ఎన్నో శస్త్రాలతో, ప్రత్యస్త్రాలతో యుద్ధం జరిగింది. "భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ". అమ్మవారు మహా పాశుపతాస్త్రం ప్రయోగించింది. దానితో భండాసురుని సైన్యం అంతా నశించింది. "మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా". చివరగా అమ్మవారు కామేశ్వరాస్త్రం వదిలింది. దానితో భండాసురుడు తన శూన్యకనగరం తో సహా దగ్ధమయ్యాడు. "మహాకామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా". తరువాత కథ బ్రహ్మాండపురాణంలో చదువుకోవచ్చు. 

                                                            బ్రహ్మాండపురాణం ప్రకారం ముందుగా విశుక్రుడు వచ్చాడు, మంత్రిణి చేతిలో చచ్చాడు. తరువాత విషంగుడు వచ్చాడు, వారాహి చేతిలో చచ్చాడు. కనుక స్తోత్రంలో నామాలు ఈ విధంగా ఉండాలి.

మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా
విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా

కానీ మనం ఎప్పుడూ చదివే లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం లో మనం ఈ కింది విధంగా చదువుతున్నాం.    
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా
విశుక్ర ప్రాణహరణా వారాహీ వీర్య నందితా 

దీని ప్రకారం, మంత్రిణి విషంగుణ్ణి చంపితే, విశుక్రుణ్ణి వారాహి చంపింది. అంటే, పురాణంలో ఒకలాగా, స్తోత్రంలో మరొకలాగా ఉండటం కనపడుతోంది. కనుక స్తోత్రాన్ని సవరించుకోవాలి. ఈ తప్పు ఎక్కడ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలియదు. ఈ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం బ్రహ్మాండపురాణాంతర్గతమైనది కనుక అక్కడ తేడా వచ్చే అవకాశం లేదు. విడిగా స్తోత్రాన్ని ప్రింట్ చేసేటప్పుడు దోషం దొర్లి ఉండచ్చు. కనుక సరి చేసి స్తోత్రం ఈ విధంగా చదువుకోవాలి. 

మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వధ తోషితా
విషంగ ప్రాణహరణా వారాహీ వీర్యనందితా

                                                        నేను బ్రహ్మాండపురాణం పుస్తకం కోసం వేట మొదలుపెట్టాను. అప్పుడు నాకు "సౌభాగ్య భాస్కర భాష్యం" దొరికింది. కానీ లలితా రహస్య సహస్ర నామ స్తోత్రం బ్రహ్మాండపురాణం లో వుంది. మనం అందరం స్తోత్రం చివరిలో "ఇతి బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీ లలిత రహస్య సహస్ర నామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః"  అని పూర్తి చేస్తాం కదా. 


                                                                  కానీ ఏ బ్రహ్మాండపురాణం కాపీ లోనూ నాకు ఈ స్తోత్రం దొరకలేదు. ఉత్తరఖండమూ వుంది, దానిలో హయగ్రీవ అగస్త్య సంవాదమూ వుంది. కానీ ఈ స్తోత్రం ప్రసక్తి ఎక్కడా ఏ ప్రచురణలో కూడా నాకు దొరకలేదు. చాలా వెతికాను. ఎవరి దగ్గరైనా, పాత పుస్తకం అయినా సరే, పురాణంలో స్తోత్రం కూడా ఉంటే, ప్లీజ్ నాకు కొద్ది  రోజులకు ఇవ్వరా. అప్పుడు మనం నిర్ద్వందంగా ఈ స్తోత్రాన్ని సవరించుకోవచ్చు. ప్రస్తుతానికి విశుక్రుణ్ణి మంత్రిణి, విషంగుణ్ణి వారాహి సంహరించారనే చదువుకోవడం కరెక్ట్. సామవేదం వారు కూడా ఈ మార్పుని ప్రతిపాదించారు. ప్రస్తుతానికి స్వస్తి. 








16, ఏప్రిల్ 2020, గురువారం

వంశ వృక్షం అంటే ఏమిటి

వంశ వృక్షం అంటే ఏమిటి 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                              ఎలిక్స్ హాలీ నవల రూట్స్ చదివినప్పటినుంచీ నాకు కూడా ఎంతో కొంత మన పూర్వీకుల గురించీ, గోత్ర, ప్రవర గురించీ తెలుసుకోవాలని చాలా అనిపించింది. మా యాత్రల్లో భాగంగా, మా రూట్స్ వున్న నందివాడ, నండూరు, ఆరుగొలను, పొన్నూరు, భట్టిప్రోలు వంటి ఊళ్ళు ప్రత్యేకంగా చూసి వచ్చాం. ఆ సందర్భంగా కొన్ని వివరాలుకూడా సేకరించాను. అవి అన్నీ కలిసి ఇప్పుడు ఈ రూపంలో బయటకు వస్తున్నాయి. 




                                                                వంశ వృక్షం రాసేముందు కొంచం మన వంశం వివరాలు, అసలు ఈ కాన్సెప్ట్ ఏమిటో చెప్పుకుందాం. ఇంటిపేరు నందివాడ. ఉండేది ఆరుగొలను. ఇంటిపేరుని బట్టి ఈ కుటుంబం నందివాడ అనే గ్రామం నుంచి ఆరుగొలను వచ్చారని తెలుస్తోంది. నందివాడ లో ఆనందేశ్వరస్వామి ఆలయం వుంది. బహుశా మా తాతగారి పేరు ఆ దేవుడి పేరు మీదే పెట్టారేమో. ఏది ఏమైనా ఈ ఆనంద్ అనే పేరు మా కుటుంబంలో తరతరాలుగా వస్తూనే వుంది. లెక్కపెడితే సుమారు ఓ పది మంది ఆనంద్ లు ఉంటారేమో. తాతగారి అక్క ఆదెమ్మ గారు నండూరి వారి కోడలు. ఆరుగొలను నండూరు వారి మొఖాసా. ఈ పదం నాకు శ్రీదేవి పిన్ని రాసిన 'నెమరేసిన మెమోరీస్' పుస్తకంలో దొరికింది. మా మాతామహుల కుటుంబం వారు ఆరుగొలను మొఖాసాదారులు. ఆదెమ్మ గారి 300 ఎకరాల పొలం పనులు చూడటానికి గాను మా తాతగారు నందివాడ నుంచి ఆరుగొలను చేరారు. 

                                                    సంస్కృతంలో తాత అంటే తండ్రి. అదే మన తెలుగులో తాత అంటే పితామహుడు లేదా మాతామహుడు. ఈ ఇద్దరి తాతలకీ సంస్కృతంలో రెండు పదాలున్నా, తెలుగులో ఒకటే పదం. అంటే ఇంకా తెలుగు భాష పూర్తిగా సంస్కరింప బడలేదని తెలుస్తోంది. హిందీ మహాభారత్  సీరియల్ లో  తండ్రిని తాతాశ్రీ అని పిలవటం కనపడుతుంది. అదే మాతామహి, పితామహి శబ్దాలకు, అమ్మమ్మ,  బామ్మ, లేదా నాయనమ్మ అని వేరే వేరే పదాలు కనపడతాయి. 

                                                          ఆరుగొలనుకి ఆ పేరు ఆ వూళ్ళో ఆరు కొలనులు ఉండటం వల్ల వచ్చింది. ఆ వూరిలో మల్లిఖార్జున స్వామి ఆలయం వుంది. ఇంటి దేవుడు నందివాడ లోని ఆనందేశ్వరుడే కానీ, అందరూ పుట్టిన వూరు ఆరుగొలను లోని  దేవుడు మాత్రం మల్లిఖార్జునుడు. ఇక గోత్రం భారద్వాజస, అంటే భారద్వాజ ఋషి గోత్రం వంటి గోత్రం అని అర్ధం.  గోత్రం అంటే, వంశం అని  ఇక్కడ భాష్యం చెప్పుకోవాలి. ఈ భారద్వాజస గోత్రానికి ఋషులు ముగ్గురు. ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ ముగ్గురు. ఆంగీరస మహర్షి పుత్రుడు బృహస్పతి, బృహస్పతి పుత్రుడు భారద్వాజుడు. ఈ బృహస్పతి ఋషే కానీ నవగ్రహాలలో గురు గ్రహం కాకపోవచ్చు. పేరు మాత్రమే అది. ఈ బృహస్పతి చేసిన ఒక హేయమైన పని వల్ల పుట్టిన వాడు భారద్వాజుడు.  ఆంగీరసునకూ, శ్రద్ధకూ పుట్టినవాళ్లు ఉతధ్యుడు, బృహస్పతి.  ఉతధ్యుని  భార్య మమత. ఈమె గర్భంతో వున్నప్పుడు, ఉతధ్యుడు తీర్ధయాత్రల్లో ఉండగా, బృహస్పతి అమానుషంగా మమతని బలాత్కారం చేస్తాడు. మమత, ఆమె కడుపులో వున్న శిశువు యెంత వద్దని వారించినా వినడు. చివరికి బృహస్పతి వీర్యాన్ని, మమత గర్భస్థ శిశువు కాలితో బయటకు తన్నేసి తానూ జన్మిస్తాడు. కింద పడ్డ వీర్యం బాలుని రూపం దాలుస్తుంది. ఆ బాలుణ్ణి అటు మమతా, ఇటు బృహస్పతీ ఇద్దరూ త్యజిస్తారు. ఇద్దరి చేత  విడిచివేయబడిన (త్యజింపబడిన) వాడు కనుక ఆ బాలుడు భారద్వాజుడైనాడు. ఇదీ భారద్వాజుని జన్మ వృత్తాంతం. 'దాన వీర శూర కర్ణ' సినిమాలో ఒక బ్రహ్మాండమైన డైలాగ్ వుంది, "ఆచార్యదేవా, ఏమంటివి, ఏమంటివి"అంటూ. దానిలో భరద్వాజుడు, ఆతని పుత్రుడు ద్రోణుడు ఇద్దరి జన్మ వృత్తాంతాన్నీ ప్రశ్నిస్తాడు దుర్యోధనుడు.  అసలు ఈ దుర్యోధనాదులందరూ, నూటొక్కమందీ ఇంక్యుబేటర్ లలో కాపాడబడి  పుట్టినవారు. ఇక ద్రోణుడి జన్మ వృత్తాంతం. భారద్వాజునికి ఘృతాచి అనే అప్సర కాంత మీద కోరిక కలిగినప్పుడు జారిపడిన వీర్యాన్ని ఒక కుండ, ద్రోణి, లో భద్ర పరుస్తాడు. తరువాత ఘృతాచి వచ్చి తన అండాన్ని ఆ ద్రోణితో వదులుతుంది. తద్వారా కుండలో పుట్టినవాడు ద్రోణుడు. టెస్ట్ ట్యూబ్ బేబీ గుర్తొస్తోందా. అంటే..... ద్రోణుడు స్త్రీ పురుష శారీరక సంపర్కం లేకుండా ఒక మట్టి కుండలో పుట్టినవాడు. సరే, నందివాడ వారి గోత్రం భారద్వాజస అంటే భారద్వాజ గోత్రము వంటి గోత్రము కలవాడు అని అర్ధం. 

                                             ఇప్పుడు ప్రవర గురించి, వేదం శాఖ గురించీ చెప్తాను. పెద్దలకు ఎవరికైనా నమస్కరించేటప్పుడు, తననితాను పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఈ ప్రవర చెపుతాం. మనం ఎవరి గోత్రస్థులమో, ఎవరి సంతానమో, ఏ వేద శాఖకు చెందుతామో చెప్తూ, చివరిలో స్వీయ నామం చెప్పడాన్నే ప్రవర అంటారు. ఇంతకీ మనది యజుర్వేద శాఖ. నాకు ఎలా తెలిసిందంటే, శ్రాద్ధాల్లో అగ్ని ఉంటే అది యజుర్వేద శాఖ.  ఋగ్వేదం శాఖ వారికి శ్రాద్ధాల్లో ఈ అగ్ని ఉండదు. వాళ్లకు అరచేతిలోనే అగ్నికుండాన్ని గీసి శ్రాద్ధం పెట్టిస్తారు. ఈ రోజుల్లో కేవలం ఉపనయనం చేసేటప్పుడు మాత్రం వాడుతున్నాం. ఉదాహరణకి మన కుటుంబం వాళ్ళు  ప్రవర ఎలా చెప్పాలో ఇక్కడ రాస్తాను. 

చతుస్సాగర పర్యంతం, గోబ్రాహ్మణస్య శుభం భవతి. 
భారద్వాజస గోత్రస్య, ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ త్రయా ఋషేయ,
 ప్రవరాన్విత,  ఆపస్తంభ సూత్రః, యజుశ్శాఖాధ్యాయీ,  
(ఇక్కడ ప్రపితామహః, పితామహ, పితృ నామాలు కూడా చెప్పుకోవచ్చు)
 (అహంభో ముందు తన పేరు చెప్పుకోవాలి ) 
అహంభో అభివాదయే. 

                                  
                                                   ఇక ఇప్పుడు మన ఆరువేల నియోగి శాఖ అంటే ఏమిటో చెప్పుకుందాం. నియోగి అంటే, నియోగించబడిన వాడు అని. అంటే, వీళ్ళు ప్రధానంగా ఉద్యోగాలు చేసేవారు. మంత్రులుగా అధికారులుగా, సంస్థానాధికారులుగా, గ్రామాధికారులుగా, కరణాలుగా పని చేసేవారు. విజయనగర రాజ్యంలో మహామంత్రి తిమ్మరుసు ఒక్కసారిగా ఆరువేల మందిని నియోగించటం  (నియమించటం)  వల్ల, ఆ జాబితాలోని వారందరూ ఆరువేల నియోగులైనారనే వాదన వుంది. వీళ్ళందరూ అధికారం చెయ్యటం వల్లనో ఏమో, లేదా ఎప్పుడూ రాజుల చెంత, చక్రవర్తుల చెంత పని చేసి, చేసి ఆ పౌరుషం కొంత వీళ్లకూ వచ్చింది. బ్రాహ్మణుల్లో ఇతర శాఖల వారికన్నా, ఈ నియోగి శాఖ వారికి, అందునా ఆరువేల నియోగి శాఖ వారికి కొంచం పౌరుషం ఎక్కువ అనే వాదం వుంది. అందుకే నియోగులకు నిక్కు ఎక్కువ అని అంటూ వుంటారు.  

                                          మన కుటుంబాల్లో ఎక్కువగా రావు అనే పేరు కనపడుతుంది. ఈ రావు శబ్దం, రాయ అనే శబ్దం నుంచి వచ్చింది. మేము బర్కత్ పురా లో వున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ ల్యాండ్ లార్డ్ కొమరగిరి భూపాలరావు గారు మంచి పండితుడు, రచయితా. కలెక్టర్ గా చేసి రిటైర్ అయినవారు. ఆయన తాను కలెక్టర్ గా వున్నప్పుడు అభివృద్ధి చేసిన రెండు ప్రాంతాలు ఆయన మీద కృతజ్ఞతతో తమ ఊళ్లకు ఆయన పేరు పెట్టుకున్నారు. భూపాలపల్లి, భూపాలపట్నం. ఆయన మంచి పరిశోధకుడు. మాదన్న మంత్రి మీద పరిశోధన చేసి మాదన్న మంత్రి అనే పుస్తకం ప్రచురించారు. తరువాత వాల్మీకి రామాయణం పై పరిశోధన చేసి, "కౌచిప్పలో కమ్మని కాసారం" అనే పేరుతో రామాయణం ప్రచురించారు. మనకు దూరపు బంధువులు. ఇంతకీ ఇక్కడ చెప్పేదేమంటే, వారు కూడా ఆరువేల నియోగులే. ఆయన తన రామాయణంలో రచయితగా "కొమరగిరి భూపాలరాయ" అని రాసుకున్నారు. ఆ విధంగా నాకు రావు, రాయ శబ్దాలు ఒకటే అన్న విషయం తెలిసింది. కానీ ఈ రాయ, రావు పేరు క్షత్రియులకీ, వెలమ దొరలకీ, కమ్మవారికీ ఎక్కువ కనిపిస్తుంది. క్షత్రియులకూ వెలమదొరలకూ సంబంధం వుంది. ఇద్దరూ రాజ్యాలేలిన వాళ్ళే. వెలమల చరిత చదివినప్పుడు వారు రెడ్డి కులం వారి నుంచి వేరు పడ్డ వారని తెలుస్తోంది. రెడ్డివారు కూడా రాజ్యాలు చేసిన వారే. రెడ్లు, కమ్మవారు కూడా ఒకే మూలం నుంచీ వేరు పడ్డవారని తెలుస్తోంది. కమ్మవారు జమీందారులుగా, సంస్థానాధీశులుగా పేరు పడ్డవారే. అంటే ఈ శాఖలన్నింటికీ ఎక్కడో లింక్ ఉందా? తెలియదు. ఇది ఎవరైనా అధ్యయనం చేయాల్సి వుంది. 

                                              మరో విషయం.... చాలా సంవత్సరాల క్రితం విశ్వనాథ సత్యనారాయణ గారి "పునర్జన్మ" అనే నవల చదివాను. తమాషాగా ఉంటుంది కథ అంతా. అందులో ఒక నైష్ఠికుడైన బ్రాహ్మణుడు భార్యావియోగం తరువాత వేరొక పెళ్లి చేసుకుంటాడు. కానీ మొదటి భార్యని మరువలేక పోతాడు. అది మనసులు కలసిన మనువు. రెండోపెళ్లితో విసిగిపోయి 60 ఏళ్ళ వయసులో 40ఏళ్ళ మేనల్లుని దగ్గరకు హైదరాబాద్ వస్తాడు. ఒక సిటీ బస్సులో ఉన్నట్టుండి ఒక 20 ఏళ్ళ అమ్మాయిని చూసి, ఇదే నా మొదటి భార్య అంటాడు. ఆ యువతి కూడా ఈ ముసలాయనను చూసిన వెంటనే , ఈయనే నా పూర్వజన్మ భర్త అంటుంది. ఆ యువతి  20 ఏళ్ళు కూడా లేని వెలమస్త్రీ.  ఈయనేమో 60 ఏళ్ళు దాటిన నైష్ఠిక, నియోగి బ్రాహ్మణుడు. ఆ యువతి తల్లి ఏమో, మీరు నియోగులు, మేము వెలమలం. ఇద్దరం ఒకటే, మేమూ నియోగులమే అంటుంది. ఈ వాక్యం నాకు అసలు అర్ధం కాలేదు. ఇప్పుడు ఈ వాక్యం ఈ రాయ, రావు శబ్దాల దగ్గరకు వచ్చి ఆగింది. విశ్వనాథ వారు చిన్నా, చితకా రచయితా కాదు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. వందల కొద్దీ నవలలే కాకుండా అన్ని విభాగాలలో ఎన్నో పుస్తకాలు రచించిన గొప్ప పండితుడు, కవి. ఆయన అర్ధం లేని రాతలు రాస్తారని అనుకోను.  భూపాలరాయ శబ్దం చూసాక ఏనాడో చదివిన పునర్జన్మ గుర్తు వచ్చింది. ఆ నవల కొంచెం అర్ధం అయినట్టు అనిపిస్తోంది. 

                                              భగవద్గీత పంచదశోధ్యాయం, పురుషోత్తమప్రాప్తి యోగం లో మొదటి శ్లోకం ఇది. శ్రీభగవానువాచ అని ప్రారంభం అవుతుంది. అంటే, ఈ శ్లోకాన్ని స్వయంగా ఆ భగవానుడే చెప్పాడు. ఆ శ్లోకం అర్ధం ఏమంటే, "వేర్లు పైకి, కొమ్మలు కిందకు వుండి, ఆకులన్నీ వేదములై, ఎన్నటికీ నశించని ఆ అశ్వత్థ వృక్షం యొక్క అసలైన స్వరూపాన్ని అర్ధం చేసుకున్నవారే వేదవిదులు." 


 
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥
                      
                                                          ఈ అశ్వత్థ వృక్షమే మన వంశవృక్షం, ఆ వేర్లే మన మూలాలు, ఆ కొమ్మలే మన పెద్దలు, ఆ క్రొంగొత్త రెమ్మలే మనం, ఆ  లేలేత ఆకులే మన పిల్లలు అనీ, ఒక్కొక్క ఆకు మీదా మీ పెద్దల పేర్లు, మీ పేర్లు, మీ పిల్లల పేర్లు ఒక్కసారి ఊహించుకోండి. అదే మనం ఇప్పటివరకూ మాట్లాడుకుంటున్న వంశవృక్షం. ఆ వేర్లు భూమిలో ఉంటే, నీరు పోసి కాపాడుకోవచ్చు. కానీ అవి పైకి ఆకాశం లోకి సాగిపోతున్నాయి, మనం వాటికి నీరు అందించలేం. మన ఇళ్లల్లో గాల్లో పెరుగుతున్న మనీప్లాంట్ లాగా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోవాలి. వృక్షం స్థిరంగా, నశించకుండా ఉండాలంటే, వేర్లు, మూలాలు, ఆరోగ్యంగా ఉండాలి. అది దాని ఆహారాన్ని అదే తయారు చేసుకునే వాతావరణం ఉండాలి. అంటే, వాతావరణంలో, కుటుంబంలో పొల్యూషన్ వుండకూడదు. మన బాధ్యత అదే. ఇంట్లో అంతా చక్కని సుహృద్భావ వాతావరణం ఉంటే, ధర్మం తప్పక జీవనం సాగిస్తున్నప్పుడు, చెట్టు క్షేమం, వేర్లు క్షేమం, కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ అన్నీ క్షేమం. అంటే, మనం క్షేమాన్ని మనమే కాపాడుకోవాలి. ఇదే నేను వంశవృక్షం చెప్పేముందు చెప్పాలనుకున్నది. నమస్కారం.