9, ఏప్రిల్ 2020, గురువారం

బామ్మా-కళ్లజోళ్ళూ-మందులూ

బామ్మా-కళ్లజోళ్ళూ-మందులూ  

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                              బామ్మ మాతో తెనాలిలో వున్న రోజులవి. బామ్మకి కళ్ళు కొంచం మసగ్గా కనిపిస్తున్నాయని, న్యూస్ పేపర్ కానీ, వారపత్రికలు కానీ చదవలేక పోతున్నానని తెగ బాధ పడిపోయేది. బామ్మ మాట అంటే మాటే, సుగ్రీవాజ్ఞ. జరిగి తీరాల్సిందే. మా నాన్న తన హోమియోపతి మందులు వేద్దామని చూసాడు. అబ్బే ఏమాత్రం గుణం కనిపించటం లేదంది. అక్కడికీ తానూ ఏదో, ఫెర్రమ్ ఫాసూ, కాలీఫాసూ, మెగ్నీషియమ్ ఫాసూ లాంటివేవో వేసుకుంది. ఊహూ, ప్రయోజనం లేదు. అప్పుడు నాన్న వాళ్ళ స్కూల్లో కనుక్కుని మంచి కళ్ళ డాక్టరు ఎవరా అని యెంక్వైరీ చేసాడు. అందరూ కృష్ణా హాస్పిటల్ నే సజెస్ట్ చేశారు. ఆ హాస్పిటల్ నడిపేది వెంపటి సూర్యనారాయణ గారని ఒక గొప్ప దేశభక్తుడు. వినోబాభావే అనుయాయి. సర్వోదయా ఉద్యమంలో పాల్గొంటూ, తన వైద్య విద్యని ఒక సేవగా భావించి, పేదలకి ఉచితంగా ఆపరేషన్స్ చేయటమే కాకుండా కళ్లజోళ్ళూ, మందులూ కూడా ఉచితంగా ఇచ్చేవాడు. మంచి హస్తవాసి అని పేరు. ఎప్పుడూ తెల్లని  దుస్తులు ధరించేవాడు. ఆయనే కాదు, ఆ హాస్పిటల్ వాళ్ళు మొత్తం, డాక్టర్లు, నర్సులు, ఇతర సేవకులు, అందరూ నిరాడంబరంగా తెల్లని దుస్తులు ధరించి సేవ చేసేవారు. సౌమ్యంగా, నిదానంగా ఉంటూనే, ఆయన రోజూ చాలా ఆపరేషన్స్ చేసేవాడు. ఆ హాస్పిటల్ నుంచి ఒక పెద్ద స్టీల్ డబ్బా, భుజానికో తెల్లని జోలె ధరించి ఆ నర్సులే, ఇల్లిల్లూ తిరిగి బియ్యం, పప్పులూ, కూరగాయలు వంటివి సేకరించేవారు. మేమూ ఇచ్చేవాళ్ళం. దాంతో వాళ్ళు వంట చేసి హాస్పిటల్లో వున్న బీద పేషంట్లకి భోజనాలు పెట్టేవారు. ఆ హాస్పిటల్లో పేదలకి అన్నీ ఉచితమే. వాళ్ళను ఏనాడూ మేము ఏమీ ఇవ్వకుండా ఖాళీగా తిప్పి పంపింది లేదు. వీళ్ళే కాదు, "సీతారామాభ్యోన్నమః" అంటూ యాయవారం బ్రాహ్మలు వచ్చేవాళ్లు. వాళ్ళకీ అంతే, దోసిటితో బియ్యం పోసి పంపించేవాళ్ళం. అసలు ఈ రోజుల్లో వాళ్లకి ఎంతమందికి సర్వోదయా ఉద్యమం అంటే, యాయవారం బ్రాహ్మలంటే తెలుసో నాకు సందేహమే. 

                                                               సరే, బామ్మ కంటి సమస్యకి వద్దాం. బామ్మని మొదటిసారి నాన్న ఆ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు. నాన్న సైకిల్ మీద, నేనూ, బామ్మా రిక్షాలో. అప్పుడు నేను ఆరో క్లాసో, ఏడో క్లాసో చదువుతున్నా అనుకుంటా. అలా మొదలయ్యాయి బామ్మతో నాకు హాస్పిటల్ యాత్రలు. అక్కడి డాక్టరుగారు బామ్మని పరీక్షించి, "అమ్మా, మీకు కంటికి శుక్లాలొచ్చాయి, ఆపరేషన్ చెయ్యాలి. కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు ఆగండి, ఇంకొంచం ముదరాలీ" అన్నాడు. ఇక బామ్మ స్టేటస్ పెరిగింది. అమ్మో, శుక్లాలట, కంటికి ఆపరేషన్ చెయ్యాలిట, అని ఎంచక్కా అడిగిన వారికీ, అడగని వారికీ, ఆవిడే గర్వంగా, గొప్పగా చెప్పుకునేది. అది చూసి మా అమ్మకు నవ్వు. మా అమ్మ నవ్వు చూసిందంటే, మా బామ్మకు కోపం. ఇక అప్పటినుంచీ రోజూ స్కూల్ నుంచి రాంగానే, నాకో డ్యూటీ. రిక్షాలో బామ్మని కంటి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలీ, తీసుకురావాలీ. నాన్న ఒక్క రోజు వచ్చాడంతే. పాపం ఆయనకు తీరికేదీ. తాలూకాలోని పెద్ద స్కూల్ కి ప్రిన్సిపాల్. సుమారు 3000 మంది పిల్లలు, 100 మంది స్టాఫ్, పాపం ఏ రోజూ సరిగ్గా భోజనానికి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. మా అమ్మే టైం చూసుకుని, ఏ నౌకరుతోనో భోజనం స్కూలుకే పంపించేది, అరిటాకుతో సహా. బామ్మ డ్యూటీ నాదే, రోజూ తీసుకెళ్లటం, అక్కడ డాక్టరుగారు మనల్ని పిలిచేదాకా కూర్చుని, బామ్మ కళ్ళ పరీక్ష అయిన తరువాత, వాళ్ళిచ్చిన మందులు, డ్రాప్స్ తీసుకుని ఇంటికి రావటం, మళ్ళీ ఆ మందులన్నీ ఎలా వెయ్యాలో వాళ్ళ నించి తెలుసుకుని మా బామ్మకు వెయ్యటం....ఇదీ నా డ్యూటీ. బామ్మ కూడా నేను ఇస్తేనే మందులు వేసుకునేది. కంట్లో చుక్కలు కూడా నేనే వేసేదాన్ని. నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు మా అమ్మ వేస్తే, చెప్పాకదా, ఆవిడకి కళాకళలు. ఒకరోజున్నట్టు ఇంకో రోజుండేది కాదు. ఒకసారి అమ్మతో వేయించుకునేది, ఒకసారి, వద్దు నేనే వేసుకుంటా అనేది. కొంచం కింద పారపోసి, కొంచెం కంట్లో వేసుకునేది. అక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, చూసావా, నేను ఎవరి మీదా ఆధారపడి లేను అనే తృప్తి. అబ్బో, ఈ ఫిలాసఫీ ఆవిడ చాలా విషయాల్లో మైంటైన్ చేసేది. ముందు ముందు చెప్పుకుందాం. నాకు ఒక్కదానికి మాత్రం బామ్మకి మందులు వేసే పర్మిషన్ ఎప్పుడూ ఉండేది. ఒకటి మా అమ్మ  ఎప్పుడూ నన్ను "నీదంతా మీ బామ్మ పోలిక, ఆవిడ పేరు, ఆవిడ పెంపకం" అనేది. ఆవిడ పేరు విజయరామమ్మ, నాపేరు విజయలక్ష్మి. అందరూ, మా అమ్మ కూడా, మర్చిపోయిన విషయం ఏమిటంటే, మా అమ్మమ్మ పేరు లక్ష్మీనరసమ్మ, నాపేరులో రెండో భాగం ఆవిడదే. మా నాన్న పాపం, నా బారసాలలో ఇద్దరికీ సమన్యాయం చేసి నాకు విజయలక్ష్మి అని పేరు పెట్టాడు. మా అమ్మకి మాత్రం నాపేరు అంటే మా బామ్మ పేరే. బామ్మ కూడా బహుశా అందుకే, తాను వేసుకున్నా, నేను వేసినా ఒకటే అనుకునేది. పైగా నేను అక్కడ హాస్పిటల్ లో డాక్టర్ చెప్పినవన్నీ వినటం. ఆ మందులు కొనటం చేసేదాన్ని గదా, అందుకు కాబోలు. 

                                       ఎంతైనా ప్రిన్సిపాల్ గారి తల్లి, పైగా పెద్దది, ఎప్పుడూ బామ్మని సూర్యనారాయణగారే చూసేవారు. ఆయన వూళ్ళో లేకపోతే వేరే చిన్న డాక్టర్ ఎవరైనా చూస్తే బామ్మకి తృప్తిగా ఉండేది కాదు. పెద్ద డాక్టరుగారు లేరా, అని నాలుగుసార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ చిన్న డాక్టర్ ని చూడనిచ్చేది. అక్కడి డాక్టర్లకీ,  నర్సులకీ, మిగిలిన పనివాళ్ళకీ, బామ్మ పద్ధతులు బాగా అలవాటు అయిపోయాయి. అద్దాలు పెట్టి చదవమంటే, నాకు ఇంగ్లీష్ అక్షరాలూ వచ్చు, ఇంగ్లీష్ చార్ట్ పెట్టమనేది. ఒక్కోసారి బెట్టు చేయకుండా, వాళ్ళు ఏ చార్ట్ పెడితే ఆ చార్ట్ చదివేది. బామ్మకు షుగర్ వుంది, పైగా హార్ట్ ఎన్లార్ జ్మెంట్ కూడా వుంది. బీపీ, షుగరూ, హార్టూ ఇన్ని పాపం ఆ డాక్టరుగారే మానేజ్ చేసుకుంటూ వచ్చారు, స్లోగా. పైగా బామ్మకి అప్పుడు వయసు కూడా 75 దాటింది. మొత్తానికి కంటి ఆపరేషన్ రోజొచ్చింది. ఆ రోజుకల్లా, విజయవాడ నుంచి, ఉమా పెదనాన్నా, మధు పెదనాన్నా కూడా వచ్చారు. ఇన్నాళ్లూ బామ్మని తీసుకెళ్లి, తీసుకొచ్చి, మందులేసి అన్నీ చూసింది నేనేనా, ఇప్పుడు మాత్రం అంతా వాళ్ళే చూసుకున్నారు, బామ్మ ఆరోగ్యం గురించి వాళ్లకేం తెలుసనీ.  నాకు కోపం కూడా వచ్చింది, నేనింత పెద్దదాన్ని, ఇన్నాళ్లూ బాధ్యతగా ఆవిడని చూసినదాన్ని, ఇప్పుడేమో, నన్ను చిన్నపిల్లని చేసి అంతా ఆ ముగ్గురు అన్నదమ్ములే చూసుకుంటారట. అసలు మొత్తం నాన్నా వాళ్ళు డజను మంది. ప్రస్తుతం హాస్పిటల్ కి ముగ్గురొచ్చారు. పెద్ద డాక్టరుగారు, భయమేమీ లేదండీ, నేనున్నాగా, అని ఆపరేషన్ థియేటర్ లోపలికి  వెళ్లారు. 

                                       మా అమ్మేమో, రోజూలాగా కాదే, ఆపరేషన్ కదా, పెద్దవాళ్లే ఉండాలి అనేసింది. మొత్తానికి మా బామ్మ ఆపరేషన్ చక్కగా పూర్తి అయి రూమ్ లోకి తీసుకువచ్చారు. కంట్లోకి ఇంజెక్షన్ ఇస్తారట. వింటే భయం వేసింది. పాపం బామ్మ, డ్రాప్స్ వేస్తేనే మంట అనేది, ఇంజెక్షన్ ఎలా చేయించుకుందో అని బాధ వేసింది. కానీ అది తప్పదుట. ఆ తరువాత నొప్పి తెలియదుట. పోన్లే, నేనూ బామ్మా, రెండు రోజులు హాస్పిటల్ లో వుండి, ఇంటికొచ్చేసాం. కొన్నాళ్ళ తరువాత  బామ్మకి కళ్ళజోడు ఇచ్చారు. పరీక్ష చేస్తుంటే, ముందుగా ఖాళీ జోడు పెట్టి, తరువాత దాంట్లో పవర్  అద్దాలు పెట్టి చెక్ చేస్తారుగా. ఆవిడేమో, ఖాళీ జోడు పెట్టంగానే, అబ్బే, ఏమీ తేడా లేదు అనేది. డాక్టరేమో ఇంకా అద్దాలు పెట్టలేదమ్మా అనేవాడు. మొత్తానికి బామ్మకి కళ్ళద్దాలొచ్చాయి. అప్పుడు తెలిసిన ఇంకో విషయమేమంటే, రెండో కంటికి కూడా మరి కొన్నాళ్ళలో ఇదే ఆపరేషన్ చెయ్యాలిట. బామ్మ మాత్రం మహా ధైర్యంగా వుంది. భయం అంతా మా అమ్మా నాన్నకే, ఏమవుతుందా అని. పెద్ద వయసు, పైగా బోల్డు BP, Sugar, Heart Enlargement అనే క్వాలిఫికేషన్స్. బామ్మా, నేనూ మాత్రం మళ్ళీ రిక్షాలో హాస్పిటల్ యాత్రలకి తయారు. 

                                                        రెండో సారి ఆపరేషన్ అన్నప్పుడు మా మధు పెదనాన్న లేరు. సడెన్ గా పోయారు. బామ్మ చాలా ఏడ్చి గోల పెట్టింది. డాక్టరుగారు మాత్రం, మేమంతా వున్నాం కదమ్మా, ఈ ఆపరేషన్ తప్పనిసరి, అని ఆవిడ్ని ఒప్పించారు. రెండో సర్జెరీ కూడా బాగా జరిగింది. మళ్ళీ కళ్ళజోడు ప్రహసనం. ఆవిడకి ఏ ఫ్రేమూ ఓ పట్టాన నచ్చేది కాదు, ఇది గుచ్చుకుంటోందీ, ఇది వెడల్పుగా ఉందీ, ఇది చిన్నగా ఉందీ, ఇది పెద్దగా ఉందీ అని ప్రతి వారం ఓ ఫ్రేము మార్చేది. బోల్డు ఖర్చు, కొంచెం సద్దుకోవచ్చు గదా అని మా అమ్మ విసుక్కునేది. మా నాన్న ఏమీ అనేవాడు కాదు. నాతో మాత్రం, జాగ్రత్తగా చూసి, బాగా నచ్చిందన్నాక కొను అనేవాడు. మొత్తానికి మా ఇంట్లో ఓ డజను కళ్ళజోడు ఫ్రేములు చేరాయి. ఏం చెయ్యాలీ వాటిని. మా అమ్మ విసుక్కునేది. మా బామ్మ మాత్రం అన్నీ నా కళ్ళజోడు ఫ్రేములు అని తన పెట్టెలో దాచుకునేది. అందులో ఒక కళ్ళజోడు ఫ్రేము నల్ల అద్దాలది. పైగా అది ప్రత్యేకంగా ఉండేది. కావాలంటే నల్లద్దాలని ఎత్తేస్తే కళ్ళకి గొడుగులా ఉండేది. వెలుగు కంటికి డైరెక్ట్ గా పడకూడదూ అంటే, ఆ నల్ల అద్దాలని దించేస్తే, ఎంచక్కా, నల్లకళ్లజోడు లాగా ఉండేది. మా బామ్మకి అది చాలా ఇష్టం. కాకపోతే అది చదవటానికి పనికి రాదు. డాక్టరు గారు రోజూ బామ్మని కొన్నాళ్లపాటు పొద్దున్న సూర్యుడిని లేత అరిటాకులో నుంచి ఓ అయిదు నిముషాల పాటు చూడమన్నారు. దాంతో, రోజూ పొద్దున్నే మా అమ్మో, నాన్నో, దొడ్లో నుంచి ఇంకా పూర్తిగా విచ్చుకోని లేలేత అరిటాకు ముక్కని తెచ్చి బామ్మకి ఇస్తే, ఆవిడ ఆ ఆకుముక్క కళ్ళకి అడ్డం పెట్టుకుని ఉదయిస్తున్న సూర్యుడిని చూసేది. అదృష్టవశాత్తూ, ఆ రోజుల్లో మాఇంట్లో అరటిచెట్టు ఉండేది. నాకు లేట్ గా లేచే అలవాటు కదా, ఈ సీన్ నేను రోజూ చూడలేక పోయేదాన్ని, ఎప్పుడో పొరపాటున ముందర లేచినప్పుడు తప్ప. 

                                      బామ్మ మధ్యలో కొన్నాళ్ళు ఉమా పెదనాన్న దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్లినా అందరూ ఆవిడకే ప్రాధాన్యం ఇచ్చి చూసేవారు. ఒకసారి ఏం తిక్క పుట్టిందో, తాను స్నానానికి వెళ్తుంటే, తన కన్నా ముందుగా మనవరాలు వెళ్లిందని అలిగి, పెదనాన్నతో పోట్లాడి, అప్పటికప్పుడు మా ఇంటికి తెనాలి వచ్చేసింది. పాపం పెదనాన్న, ఎంతో బతిమాలి, లాభం లేక, ఓ క్లయింట్ కార్ అడిగి బామ్మని తెచ్చి దింపాడు. వస్తూనే, మా అమ్మతో, " ఈవిడ దెబ్బలాడి వచ్చేసిందమ్మా, ఇంకా స్నానం, భోజనం ఏమీ కాలా, తొందరగా అవన్నీ చూడమ్మా" అన్నాడు. మా అమ్మ చకచకా ఆవిడ స్నానానికి, భోజనానికీ ఏర్పాటు చేసింది. పెదనాన్న నాన్నతో చెప్పి బాగా పేచీలు పెడుతోందిరా, పెద్దతనం, చాదస్తం, అన్నాడు. పోనీలే, లీల దగ్గర అలవాటేగా, చూద్దాం, అని చెప్పి నాన్న పెదనాన్నని పంపించేశాడు. అప్పటినుంచీ మనిషి మారిపోయింది, నిజంగానే బాగా పేచీలు పెట్టేది. ఎన్ని వండినా, అవి కాదు, ఇంకేదో కావాలనేది. డాక్టరుగారు అవి మీకు పెట్టొద్దన్నారండీ, అంటే, గడుసుగా, "ఆ, డాక్టర్ కేం తెలుస్తుంది, నేనేం తిన్నానో, నేను ఆవకాయ తినలేదని చెప్పు డాక్టర్ కి కావాలంటే" అనేది. మాకు నవ్వాలో ఏడవాలో తెలిసేది కాదు. బామ్మా, అబద్ధం చెప్పితే నష్టం నీకే కదా, డాక్టర్ కేమిటి, అంటే, పోవే పిల్ల కాకీ, అనేది. ఇవన్నీ డాక్టర్ కి చెప్తే, పోనీలెండి, ఆవిడకి ఏం కావాలో అవే పెట్టండి, ఏం చేస్తాం, అనేశాడు. ఇది విని బామ్మ,  చూసావా, నేనే రైటు అనేది. డాక్టరేమో పెద్దావిడ, పోనీలే, ఇంకెన్నాళ్లుంటుంది, కావలసినవన్నీ తిననీ అనుకుంటే, బామ్మేమో, తానే కరెక్ట్ అనుకుంది. 

                                            ఎలా పట్టుకుందో కానీ, చచ్చిపోతానని భయం పట్టుకుంది బామ్మకి. ఆవిడ భయం చచ్చిపోటానికి కాదు, మంచం మీద పడుకుని చచ్చిపోతానేమో అని. ఇదేం కొత్త భయం బామ్మా, అంటే, " నీకు తెలియదే, మంచం మీద చచ్చిపోతే యములాళ్ళు వచ్చి నరకానికి తీసుకు పోతారు. కుర్చీ మీద కూర్చుని పోతే, స్వర్గానికి పోతాం" అనేది. ఆ స్వర్గం, నరకం ఏమో కానీ, మధ్యాన్నాల్లో మాత్రం యెంత నిద్ర వచ్చినా మంచం మీద పడుకోకుండా, కుర్చీలోనే కూర్చుని నిద్ర పోయేది, కళ్ళజోడు పెట్టుకుని మరీ. కునికిపాట్లు పడుతూ తల తూగంగానే, టప్పుమని ఆ కళ్ళజోడు కింద పడటం, పగలటం ఏక కాలంలో అయిపోయేది. పోనీ కళ్ళజోడు తీసేసి పడుకో బామ్మా, అంటే, అమ్మో, నాకు కనిపించదు, భయం అనేది. మళ్ళీ నేను కాలేజ్ నుంచి రాంగానే, (అప్పుడు నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) నాకోసం ఎదురు చూస్తూ కూర్చుని, పద కొత్త కళ్ళజోడు కొనుక్కోవాలి అనేది. రోజూ కొత్త కళ్ళజోడేమిటి బామ్మా, అంటే వినేది కాదు. సరే, తప్పేదేముందీ, మళ్ళీ రిక్షాలో ఆ హాస్పిటల్, మళ్ళీ బామ్మ చార్ట్ చదవటం, కొత్త ఫ్రేములో కొత్త అద్దాలు వేయించుకోవటం షరా మామూలైపోయింది. డాక్టర్లు కూడా ఇంత వెంట వెంటనే పవర్ మారదండీ, అవే అద్దాలు మళ్ళీ చేయించుకోవచ్చు అన్నా వినేది కాదు. కళ్ళ పరీక్ష చెయ్యాల్సిందే, కళ్లద్దాలు ఇవ్వాల్సిందే. మళ్ళీ ఈ రకంగా ఒక నెల రోజుల్లోనే, ఇంకో డజను కళ్ళజోడు ఫ్రేములు చేరిపోయాయి. చివరికి ఆవిడ పోయాక ఆవిడ పిల్లలందరూ వాళ్ళమ్మ గుర్తుగా అందరూ తలా రెండూ కళ్ళజోడు ఫ్రేములు పంచుకున్నారు, అంతకన్నా పంచుకోవటానికి ఏముంది కనక, పల్లెటూళ్ళో ఒక్క పాత పడిపోయే మట్టి ఇల్లు తప్ప. అందర్లోకీ చిన్నవాడైన శ్రీధర్ బాబాయ్ మాత్రం నాకా నల్లకళ్లజోడు కావాలీ అని తీసుకున్నాడు. 
                                                                   ఈ మధ్యలో ఇంకో తమాషా జరిగింది. ఒకరోజు నామీద అలిగి, నా మందులు నేనే వేసుకుంటా అని మందుల డబ్బా లాక్కుంది. ఏం జరిగిందో తెలియదు కానీ, మనిషి వేళ్ళాడి పోతోంది. మగతగా 'సరోజినీ, సరోజినీ' అని మా అత్తయ్యని కలవరించటం మొదలుపెట్టింది. అప్పుడేమో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు అవుతున్నాయి. నాన్నేమో సెంటర్ సూపరింటెండెంట్. బయటకు రాకూడదు. నేనే పరిగెత్తుకు వెళ్లి, నాన్నా, బామ్మకు అసలు బాగా లేదు, సరోజినత్తయ్యని కలవరిస్తోంది, అమ్మేమో ఏడుస్తోందీ అని చెప్పా. నాన్న నన్ను కూడా గేట్ దాటి లోపలికి రానీయలేదు. తానూ గేట్ దాటి బయటకు రాలేదు. కానీ, వెంటనే డాక్టరు పుల్లయ్యగారికి ఫోన్ చేసి ఇంటికి పంపించారు. సరోజినీ అత్తయ్యా వాళ్ళ ఆయన, మా సుబ్బారావు మామయ్యగారు కూడా నాన్నలాగే హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆయనకు స్కూల్ కి  ఫోన్ చేసి  అత్తయ్యని అర్జెంట్ గా పంపించమని చెప్పారు. పాపం అత్తయ్య దొరికిన బస్సు పట్టుకుని, అప్పుడు వాళ్ళు బందరులో వుండేవాళ్ళు, పిల్లల్ని తీసుకుని హడావిడిగా వచ్చేసింది. ఈ లోపల డాక్టర్ పుల్లయ్య గారు వచ్చి, బామ్మని చూసి, ఏమీ ఖంగారు లేదు, ఏదీ ఇవాళ ఏం మందులేసుకున్నారూ, చెప్పమన్నారు. బామ్మకి ఇంకా స్పృహ లేదు, అలా మగత గానే వుంది. నేనే ఆవిడ మందుల డబ్బా ఇచ్చి, ఇవాళ నాతో దెబ్బలాడి డబ్బా లాగేసుకుందండీ, ఆవిడే వేసుకుంది, అని చెప్పాను. అప్పుడు చూద్దుము కదా, ఆవిడ తాను వేసుకోవాల్సింది వేసుకోకపోగా, రాత్రికి వేసుకోవాల్సిన నిద్ర మాత్ర వేసేసుకుంది పొరబడి. నాకూ, డాక్టరు గారికీ అప్పటికి విషయం అర్ధం అయ్యి నవ్వు వచ్చింది. అమ్మయ్య, ఈవిడకేమీ కాలేదు, అని అందరికీ ధైర్యం వచ్చేసింది. డాక్టరుగారు జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు. నాన్న పంపించిన నౌకరుతో నాన్నకి అంతా  బాగానే ఉందన్న కబురు పంపించాం. కాసేపటికి బామ్మకి బాగా తెలివి వచ్చి, తన తప్పుకి మహా సిగ్గుపడిపోయింది. 

                      అప్పుడు దిగింది ఏడుస్తూ సరోజినత్తయ్య పిల్లలతో. మా అమ్మ చెప్పేసింది, సరోజినీ, ఏడవకు, ఆవిడ బాగానే వుంది. ఏదో తప్పు మందు వేసుకుంది, అని. అత్తయ్య వచ్చిందనంగానే బామ్మకి, ఇంతమందిని ఇబ్బంది పెట్టానే అని మరీ సిగ్గేసింది. గది తలుపులేసుకుని తియ్యదే. సరోజినత్తయ్యకి కోపం వచ్చింది. అంత దూరం నుంచి వస్తే, చూడనివ్వవా అని. తప్పు మందేసుకుంది కాక, తలుపులేసుకుంటావా అని బామ్మని కోప్పడింది. బామ్మేమో నన్ను, మా అమ్మనీ కోప్పడింది, 'దీన్నెందుకు పిలిచారూ'  అని. మా అమ్మేమో, "బావుంది, మీరొకటే కలవరింత, సరోజినీ, సరోజినీ అని, మరి పిలవవకపోతే ఎలా" అని తిరిగి కోప్పడింది. ఈ లోపల నాన్నొచ్చి, అసలు ఆవిడకి మందుల డబ్బా ఎందుకిచ్చావ్, అని నన్ను కోప్పడ్డాడు. నేనేం చెయ్యనూ, పోట్లాడి లాక్కుంది, నేను తిరిగి అరిచా. మేమేదో కొట్లాడేసుకుంటున్నామని భయపడి అప్పుడు తీసింది బామ్మ తలుపు. నాన్ననీ, అత్తయ్యనీ  చూసి మళ్ళీ కొంచం సిగ్గుపడి, కాసేపయ్యాక, ఇంకేముందీ ముచ్చట్లలో పడ్డారంతా. ఆ తరువాత ఆ మందుల డబ్బా బామ్మ కందకుండా నా పుస్తకాల రాక్ లో భద్రంగా దాచేసా. బామ్మకీ ఇంకా ధైర్యం లేకపోయింది, నా మందులు నేనే వేసుకుంటా అని దెబ్బలాడటానికి. ఇదీ కథ. ఈ సారి మా బామ్మ అర్ధరూపాయికి డజను బత్తాయికాయల కథ చెప్తాను. బావుంటుంది, సరదాగా.  


















2 కామెంట్‌లు: