నేనెరిగిన మా అన్నపూర్ణామ్మ
భట్టిప్రోలు విజయలక్ష్మి
స్వచ్ఛమైన నవ్వుకి సరియైన చిరునామా మా అన్నపూర్ణామ్మ. పేరుకి తగినట్లే నిజంగా అన్నపూర్ణ. గంపెడు సంసారాన్ని ఆ చిరునవ్వుతోనే అలవోకగా ఈదేసింది. నాకు తెలిసి మొత్తం పదిమంది పిల్లలు. కానీ ఏనాడూ ఆ పదిమందితో మాత్రమే వున్నది లేదు. ఎప్పుడూ ఇంట్లో ఓ పాతికమందికి తక్కువ వున్నదీ లేదు, తిన్నదీ లేదు. ఒక అన్నసత్రం ఆ ఇల్లు. ఆమ్మకి పదేళ్ల వయసులో పెళ్లైందిట. మా ఉమా పెదనాన్నని పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చేసరికి ఏ పనీ రాదట. అలాగే నెమ్మది నెమ్మదిగా అన్నీ నేర్చుకుందట. ఎప్పుడూ ఎవరినీ కొట్టడం కానీ, తిట్టడం కానీ ఏనాడూ చూడలేదు. ఇప్పుడు అటువంటి మా అన్నపూర్ణామ్మ గురించి చెప్తా.
పెదనాన్న ఇన్ కమ్ టాక్స్ కన్సల్టెంట్. ఆయనకు ఏనాడూ ఇంట్లో ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా జరుగుతున్నాయో తెలిసేది కాదు. అంతా ఆమ్మ ఒంటిచేత్తో నిర్వహించేది. చిన్నన్నయ్య పెదనాన్నకి అసిస్ట్ చేసేవాడు. నేను నా బి.ఎస్సీ. చదువుకునే రోజుల్లో వాళ్ళింట్లో ఉండేదాన్ని. మొదటి సంవత్సరం సాంబాబాయ్ వాళ్ళింట్లో, రెండు, మూడు సంవత్సరాలు ఉమాపెదనాన్న వాళ్ళింట్లో వుండి చదువుకున్నా. అప్పటికే పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దన్నయ్యకి ముగ్గురు కూతుళ్లు, చిన్నన్నయ్యకి ఇద్దరు కూతుళ్లు. ఆమ్మకి అయిదుగురు కూతుళ్లు, మధ్యలో నేను, మొత్తం ఇంట్లో పదకొండు మంది ఆడపిల్లలం వుండేవాళ్ళం. అందరి మధ్యలో ప్రభాకర్ ఒక్కడే మగపిల్లాడు. పాపం వాడికి ఎవరూ తోడు లేక వున్న పిల్లలతోనే ఆడుకునేవాడు. ఆమ్మ పేరుమీద ఏమి చేసినా బాగా కలిసొచ్చేదట. ఆమ్మ పేరు మీద లాటరీ కడితే, పెదనాన్నకి ఓసారి సోఫా సెట్టు, మరోసారి గట్టి ఐరన్ బీరువా వచ్చాయట. ఆ బీరువా మాత్రం చిన్నన్నయ్య గదిలో ఉండేది. ఆ దిక్కులోనే ఉండాలట అది, అందుకని.
'ఆమ్మా, కాపురానికి వచ్చేటప్పుడు పనేమీ రాదన్నావు కదా. మరి ఇంత పని ఎలా నేర్చుకున్నావు, ఇంత మందికి వంట ఎలా చేయగలుగుతున్నావ్', అంటే, 'ఏముందే, ముందర మా ఇద్దరికీ వండటం నేర్చుకున్నా, తరువాత ఒక్కొక్కడూ పుడుతుంటే, ఇంకో గుప్పెడు బియ్యం ఎక్కువ వేస్తూ నేర్చుకున్నా', అనేది. కానీ రోజూ ఎక్కడో అక్కడ చేతులూ, కాళ్ళూ కాల్చుకునేది. కాళ్ళు ఎలా కాల్చుకుంటుందీ అంటారా, ఏ అన్నంగిన్నో దించి కింద పెడుతూ కాలికి అంటించుకునేది. వంటలు మాత్రం బ్రహ్మాండంగా చేసేది, పైగా కొత్త కొత్త రకాలు చేసేది. వంటలు చాలా ఇష్టంగా చేసేది, ఏనాడూ విసుక్కునేది కాదు. మొదటిసారి విసుక్కోకుండా ఇష్టంగా వంట చేసే వాళ్ళను చూశా. మా అత్తగారు అలాంటి ఇంకో మనిషి. మా అత్తగారు ఇష్టంగా వంట చేస్తే, రుచిగా ఉంటుందని నమ్మేది. అది నిజం కూడా. పెదనాన్న వాళ్ళింట్లో ఎప్పుడూ ఇరవై మందికి తగ్గకుండా భోజనానికి ఉండేవాళ్ళం. అంతా మేమే. ఉల్లిపాయలు బస్తాతో తెప్పించేవాళ్ళు. సరుకులు రాయటం, లక్ష్మీ జనరల్ స్టోర్స్ నుంచి తెప్పించటం పెద్దవదిన బాధ్యత. కాఫీపొడి మాత్రం నాడార్స్ నుంచి వచ్చేది. ఆ సరుకులన్నీ వచ్చాక లెక్క చూసుకుని స్టోర్ రూమ్ లో సద్దేదీ ఆవిడే. పెద్దవదిన పేరు శారద. ఆ స్టోర్ రూమ్ ఒకప్పుడు వంటిల్లు కాబోలు, తరువాత ఇంతమందికి ఆ వంటిల్లు చాలక, దాని వెనకే ఓ షెడ్ లాగా వేయించాడు పెదనాన్న. దాంట్లోనే వంట. ఈ స్టోర్ రూమ్ లోనే ఓ గూట్లో పూజకోసం కొన్ని పటాలూ, అవీ ఉండేవి. పెదనాన్న మాత్రం రోజూ ఠంచనుగా 7 గంటలకల్లా స్నానం చేసుకుని పూజకి కూర్చునేవాడు. ఓ పావుగంట, అరగంట సేపు పూజ చేసేవాడు. ఆమ్మ కానీ, వదినలు కానీ ఆ రోజుల్లో పూజలు చేయటం నేను చూడలేదు. చాలా ఏళ్ళ తరువాత, చిన్నవదిన పూజలు చేయటం మొదలుపెట్టింది. అప్పటికి మా ఆమ్మ లేదు. మా పెదనాన్న సిక్ అయిపోయాడు. అప్పటి నుంచీ చిన్నవదినే పూజలు చేస్తోంది పద్ధతిగా. ఆవిడ కుర్తాళం స్వామివారి శిష్యురాలు. ఆవిడ ద్వారా నేనూ ఆయన శిష్యురాలిని అయ్యాను. చిన్నవదిన పేరు సుశీల. ఆమ్మ మాత్రం ఇంటి పనీ, వంట పనీ తప్ప పూజ పని చెయ్యగా నేను చూడలేదు. కానీ మహానైవేద్యం మటుకు ఆమ్మే పెట్టేది. పెదనాన్న పూజ టైంకి వంట అయ్యేది కాదు.
రోజూ ఆ ఇంట్లో మూడు సార్లు వంట చేసేవాళ్ళు. పొద్దున్న వంట బాధ్యత పెద్దవదినది. ఆ వంట మా లాంటి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల కోసం. మేమే ఓ డజను మంది ఉండేవాళ్ళం. మాకోసం కూర, పప్పు, పచ్చడి, పులుసో, సాంబారో, చేసేవాళ్ళు. డైనింగ్ హాల్లో ఓ పేద్ద డైనింగ్ టేబుల్ ఉండేది. పెద్దవదిన వంట చేస్తుంటే, చిన్నవదిన పిల్లలందరికీ జడలు వేసేది. ఎప్పుడు చూసినా తలలో దువ్వెన చెక్కుకుని ఉండేది. రెండు బాత్రూములు ఉండేవి. అందరం స్నానాలు చేసి హడావుడిగా తయారయి భోజనాలకు కూర్చునే వాళ్ళం. వంట పెద్దవదినే చేసినా ఆమ్మ అక్కడే వుండి అన్నీ పైపైన చూసుకుంటూ ఉండేది. డైనింగ్ హాల్లోనే ఇంకో చిన్న టేబుల్ మీద వండిన వంట అంతా పెట్టేవాళ్ళు. పక్కనే కిటికీలో పచ్చళ్ళు పెట్టేవాళ్ళు. ఎవరికి ఏది కావాలంటే, అది బాక్సులో కలుపుకుని తరువాత లంచ్ శుభ్రంగా తినేసి వెళ్లిపోయేవాళ్ళం. ఎవరైనా పక్కవాళ్ళకు లేకుండా మొత్తం తినేస్తే మాత్రం ఆమ్మ కోప్పడేది. 'అన్ని ఐటెంలు చేసి పెడితే, అన్నీ కొంచెం కొంచెం తినాలి గానీ, నచ్చిందని ఒక్కటే తినేస్తే ఎలా, మిగిలిన వాళ్ళు తినద్దూ' అని కేకలేసేది. ప్రతి వంటలోను ఉల్లిపాయలు ధారాళంగా వేసేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచీ ఉల్లిపాయలు అలవాటు లేదు. ఉమాదేవి పిన్ని నాకు ఉల్లిపాయలు అలవాటు చేయకపోతే, ఆమ్మా వాళ్ళింట్లో నేనేమయి పోయేదాన్నో. నాకు మొదట ఉల్లిపాయలు అలవాటు చేసింది ఉమాదేవి పిన్ని అయితే, వెల్లుల్లి అలవాటు చేసింది ఆమ్మ.
పిల్లల కిష్టమని పొద్దున్న వంటలో వేపుళ్ళు, మినప్పచ్చడి, కాకరకాయ పికిల్, మామిడికాయ పప్పు (అందులో కూడా ఉల్లిపాయలుండేవి), కంద పులుసు, ఇలాంటి వంటలు ఎక్కువ చేసేవాళ్ళు. మొత్తానికి ఆ టేబుల్, ఆ గది మేమంతా భోజనాలు ముగించుకుని వెళ్లేసరికి ఓ యుద్ధరంగంలా అయిపోయేది. అప్పుడు ఇందిరక్క అంతా క్లీన్ చేసేది. ఇందిరక్కకి అప్పుడే బి.ఏ. అయిపోయింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇందిరక్కకి శుభ్రం ఎక్కువ. అది పాపం ఇల్లంతా ఎప్పుడూ అందరూ ఎక్కడంటే అక్కడ తాగి పడేసిన మంచినీళ్ల గ్లాసులూ, కాఫీ గ్లాసులూ అన్నీ తీసుకెళ్లి దొడ్లో పడేసేది. ఏ రోజూ సోఫాలు చక్కగా కవర్లు అన్నీ సద్ది నీటుగా ఉంచేది. చీర నలగనిచ్చేది కాదు, తలా చెరగనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉండేది. ఇప్పటికీ మా ఇందిరక్క అలానే వుంది. అచ్చం 45 ఏళ్ళ కిందట ఎలా ఉందో అలానే. ఇందిరక్కకి వయసు అక్కడ ఆగిపోయింది. ఇల్లు ఆ మాత్రం శుభ్రంగా ఉండేదీ అంటే, అది ఇందిరక్క చలవే. ఆమ్మకి కనిపించని సాయం చేసేది. పెద్ద పెద్ద పనులన్నీ ఆమ్మా, వదినలే చూసుకునే వారు.
ఇక మధ్యాన్నం వంట ఆమ్మ వంతు. ఇంట్లో మిగిలిపోయిన పెద్దవాళ్ళకి, ఎవరైనా బంధువులొస్తే వారికీనూ. ఆరు నూరైనా, నూరు ఆరైనా పెద్దనాన్న మాత్రం పదకొండు గంటల కల్లా భోజనానికొచ్చేసేవాడు. ఆ టైం లోపల ఆమ్మ వంట చేసి, (మడి కట్టుకుని చేసినట్టు గుర్తు) దేవుడికి నైవేద్యం పెట్టి తయారుగా ఉండేది. అన్నయ్యలిద్దరూ, పెదనాన్న, ఇందిరక్క తిన్నాక, అత్తా కోడళ్ళు జోకులేసుకుంటూ భోజనాలు చేసేవారు తీరిగ్గా. చుట్టాలెవరైనా వస్తే, వాళ్ళు తప్పకుండా పెదనాన్నతో తినాల్సిందే. వాళ్ళ కోసం ఆగేవాడు పెదనాన్న ఆ రోజు. ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, వాళ్లకు పెట్టకుండా తినకూడదు, తప్పు అనేవాడు. పైగా ఇంటికి అల్లుళ్ళొస్తే ఆ మర్యాదే వేరు. వాళ్ళకోసం స్పెషల్ ఐటెంలు ఉండేవి. దాదాపు మగవాళ్లందరూ ఒకసారి, ఆడవాళ్ళందరూ ఒకసారి తినేవాళ్లు. ఇక మూడోసారి వంట రాత్రి వంట ఇంటిల్లిపాదికీ, ఈ వంట తీరిగ్గా చిన్నవదిన చేసేది. ముగ్గురూ ఏం చేసినా మంచి రుచిగా చేసేవాళ్ళు. అన్నిట్లో ఉల్లిపాయలు, కారం బాగా వేసేవాళ్ళు. కారం కారం గా తినటం నాకు వాళ్లింట్లోనే అలవాటయింది. భోజనాలన్నీ అయ్యాక పెద్దవదిన వంటిల్లూ, డైనింగ్ హాలూ చీపురు పెట్టి కడిగేది. ఆ చేత్తోనే, ఆ చీపురుతోనే, ఆ టేబులు కూడా శుభ్రంగా కడిగేసేది. అన్నీ అయ్యాక వదినలు, మేము అంతా మేడ మీదకి వెళ్లి పడుకునే వాళ్ళం.
పెదనాన్నది మూడంతస్థుల మేడ. కింద అంతస్తు అద్దెకిచ్చేసారు. పెదనాన్న ఆఫీసు, చిన్నన్నయ్య ఆఫీసు, వంట గదీ, భోజనాల గదీ, మధ్యలో పెద్ద వసారా, అదీ రెండు లెవెల్స్ లో, ఇంకా ఒక పెద్ద హాలూ, ఇవన్నీ మధ్య అంతస్థులో. పై అంతస్థులో అందరికీ నిద్ర కోసం మూడు గదులూ, మా పిల్లలకోసం ఓ పేద్ద హాలు. బైట మళ్ళీ క్లోజ్డ్ వరండా, ఓపెన్ వరండా. ఇంకా పైన టెర్రస్, ఇదీ ఇంటి రూపం. అందరూ వెళ్ళిపోయాక అప్పుడు వెనక ఎవరు మిగిలితే వాళ్ళని, 'అందరూ తిన్నారా, లేదా' అని ఆమ్మ వాకబు చేసేది. ఇంతమంది పిల్లలవటం చేత ఏరోజూ ఎవరో ఒకళ్ళు తగాదా పెట్టుకుని అలిగి తినకుండా పైకి వెళ్లి పడుకునే వాళ్ళు. అలా ఆ రోజు ఎవరు తినలేదో కనుక్కుని, వాళ్ళకేది ఇష్టమో ఆ అన్నాన్ని ఓ పెద్ద మట్టుగిన్నె నిండా కలుపుకుని, మళ్ళీ దాంట్లో ఓ చెంచా వేసి, అప్పుడు తలుపులు మూసి, లైట్లు ఆపి నెమ్మదిగా మేడెక్కేది. పొద్దున్న దిగితే మళ్ళీ పైకెక్కేది కాదు. మధ్యాన్నం పూట కింద ఆ వసారాలోనే ఓ మంచం ఉండేది, దానిమీద పడుకునేది. ఆ మట్టుగిన్నె పుచ్చుకుని పైకెళ్ళి, ఆ అలిగిన వాళ్ళని బుజ్జగించి, అవతల వాళ్ళని కేకలేసి, మొత్తానికి వాళ్ళ చేత అన్నం తినిపించేది. అప్పుడు వెళ్లి నిద్ర పోయేది. ఇదీ ఆమ్మ రొటీన్. ఒకరోజు యేవో మాటల్లో పడి దాదాపు కిలో పైన బెండకాయలు, తరుగుతూ 'పుచ్చులున్నాయి బాగా' అని విసుక్కుంది. ఒక గిన్నెలో పుచ్చుముక్కలు, ఇంకోగిన్నెలో మంచిముక్కలు వేసుకుంటూ తరుక్కుంది. చూసుకోకుండా మంచిముక్కలు కాస్తా మేడ మీద నుంచి కింద వున్న కాలువలోకి పడేసింది. అప్పుడు లోపలికి వచ్చి చూసుకుంటే, పుచ్చుముక్కల గిన్నె వుంది అక్కడ. అయ్యో, అనుకుంటూ ఉసూరుమని మళ్ళీ వేరే కూర తీసి తరుక్కుంది. అంటే కానీ కోపం తెచ్చుకునేది కాదు. పైగా నవ్వేది. యెంత స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నవ్వేదంటే, ఆ నవ్వు ఆగేది కాదు. హాయిగా నవ్వేది. ఒక్కోసారి అయ్యో, పొలకమారుతుందేమో అని ఒక్కోసారి భయమేసేది. మళ్ళీ అలాంటి నవ్వు మావారు నవ్వుతారు. ఆయనా అంతే, నవ్వొస్తే ఆగలేరు, ఆపుకోలేరు. ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు కూడాను. ఆమ్మ నవ్వు కూడా అంతే.
ఆమ్మకేమో, బాగా గాలి కావాలి, పెదనాన్నకేమో గాలి తక్కువ కావాలి. అందుకని ఆమ్మని పెదనాన్న 'వాయుకుమారీ' అని పిలిచేవాడు. ఆరుబయట పడుకున్నప్పుడు మాత్రం ఆమ్మ హాయిగా నిద్రపోయేది. అమ్మకి ఎండాకాలంలో బాగా ఒళ్ళు పేలేది. పాపం దాంతో చాలా కష్టపడేది. మహా ఉతుకుష్టంగా వుంది అనేది. అందుకే తనకి బాగా గాలి కావాలి. ఆ రోజుల్లో మంచి గాలి వచ్చేది. పడుకుంటే ఒళ్ళు తెలిసేది కాదు. నాకేమో ఆలస్యంగా లేవటం అలవాటు. అందరూ నిద్ర లేచినా నేను మాత్రం లేచేదాన్ని కాదు. పెదనాన్న, స్నానం, పూజ అయ్యాక పైకి వచ్చి, ఇంకా నేను కనుక పడుకుని ఉంటే, తన కాశీ ఎర్రతువ్వాలుతో రెండు పీకేవాడు. చటిక్కున లేచి కిందకు పరిగెత్తేదాన్ని. లేకపోతే ఏ ఇందిరక్కో 'నాన్నగారొస్తున్నారే, లే', అనేది. అప్పుడు వెంటనే లేచి, పెదనాన్న కనపడంగానే, ఎప్పుడో లేచినట్టు పోజిచ్చేదాన్ని. కానీ పెదనాన్నకు నిజం తెలుసు. ఇందిరక్క మాత్రం మేమందరం లేచి వెళ్ళిపోయినా అన్ని మంచాలూ, పక్కలూ సద్ది పైన అంతా నీట్ గా చేసేసి దిగేది. నాకు కాఫీ, టీ, పాలు ఏవీ అలవాటు లేవుగా. లేట్ గా లేచినా, పని తొందరగా అయిపోయేది. సాంబాబాయ్ పాలు తాగే అలవాటు చేసినా, అది కాకినాడ దాటంగానే మానేశా.
ఇల్లంతా చూసుకుంటూ అందరికీ అన్నీ అందుతున్నాయా అని చక్కగా కనుక్కునేది. పెదనాన్నకి ఎప్పటికప్పుడు ఇస్త్రీ బట్టలు తయారుగా ఉంచేది. ఇల్లు శుభ్రంగా ఉంచమని పిల్లలని కేకలేసేది. ఎక్కడి వస్తువులక్కడ పడేస్తే కోప్పడేది. ఆమ్మ చేసినట్టు మినప్పచ్చడి చెయ్యాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా నాకు చేత కాలేదు. అది తప్ప అన్నీ నేర్చుకున్నా. ఓ రోజు చిక్కుడుకాయ ఆవకాయ పెడితే, మరో రోజు కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టేది. ఒక్కోరోజు ఇంతంత కారం వేసి చింతతొక్కు దంచేది. దాంట్లో బోల్డు ఇంగువ కాచిన నూనె పోసేది. పచ్చడి అదిరిపోయేది. శనివారం నాడు రాత్రి పూట ఇడ్లీలు చేస్తే, పాపం పెద్ద వదిన తీసిన వాయ తీసినట్లే ఉండేది. ఓ రోజు శ్రీలక్ష్మి పోటీ పడి పది ఇడ్లీలు తిన్నది, పాపం ఆ తరువాత బాధ పడింది. ఆమ్మ వచ్చి కేకలేసింది. అన్నన్ని తింటే అరగద్దూ, అని.
శ్రీలక్ష్మి చిన్నపిల్ల, దానికి కందిపొడి అంటే ఇష్టం ఉండేది చిన్నప్పుడు. ఒక రోజు అదీ, నేనే వున్నాం భోజనాల గదిలో. 'ఇది కందిపొడేనా' అని నన్ను అడిగి నేను సమాధానం చెప్పే లోపల, కందిపొడి జాడీ మూత తీసి వాసన చూసేసింది. అంతే, ఇక తుమ్ములు మొదలు. నేను చెప్పకుండానే దానికి కందిపొడేదో తెలిసింది. ఇద్దరం చచ్చేట్టు నవ్వుకున్నాం. నవ్వీ నవ్వీ ఇద్దరికీ కళ్ళంబట నీళ్లు, దానికి ముక్కంబట కూడా. ఒకసారి లలిత పెళ్లప్పుడనుకుంటా. అందరం ఉయ్యూరు వెళ్లాం. పెళ్లయ్యాక మరుసటి రోజే, కాలేజీ ఉందని నేనూ, శ్రీలక్ష్మీ విజయవాడ వచ్చేసాం. ఆ రోజు వంట నేను. పచ్చళ్లున్నాయి కదా ఉత్తపప్పు చేసుకుందామని కందిపప్పు కోసం వెతికితే, అది ఎక్కడ పెట్టారో ఎంతకీ కనిపించలేదు. ఆలస్యమైపోతోందని నేను శ్రీలక్ష్మిని కింద రాజత్తా, శాంతత్తా వాళ్ళింటికెళ్లి ఓ గుప్పెడు కందిపప్పు తెమ్మన్నా. కాసేపటికి రాజత్త ఓ మూడు రకాల పప్పులతో పైకి వచ్చింది. శ్రీలక్ష్మికి కందిపప్పేదో తెలియక పోవటంతో, అసలు ఏ పప్పు కావాలో తెలియక, రాజత్తే అన్ని పప్పులూ కొంచం కొంచం తీసుకుని పైకి వచ్చింది. అప్పటిదాకా నాకూ తెలియదు, శ్రీలక్ష్మికి కందిపప్పంటే తెలియదని. ముగ్గురం కలిసి నవ్వుకున్నాం. అవును మరి. నాకే ఇంతవరకూ ఆ ఇంట్లో వంట చేసే ఛాన్స్ రాలేదు, పాపం చిన్నపిల్ల దానికెలా వస్తుందీ. మొత్తం మీద వంట చేసుకుని తిని కాలేజీ కెళ్ళిపోయాం.
ఆమ్మ కి చాలాకాలం అచ్చాలు అనే పనిమనిషి ఉండేది. అది బాగా ఇంట్లో కలిసిపోయేదిట. అది బాగా పెద్దది అయిపోయాక మానేసింది. ఆ తరువాతే ఆమ్మ వేరేవాళ్లను పెట్టుకుంది. నేను అక్కడ వున్నప్పుడే అచ్చాలు చచ్చిపోయిందని వాళ్ళ వాళ్లెవరో చెప్పారు. ఆమ్మ కళ్లనీళ్లు పెట్టుకుని 'తల్లిలా తోడుండేది' అని వాళ్ళకేదో ఇచ్చి పంపించింది. శవాన్ని మా మెయిన్ రోడ్డులోనుంచే తీసుకెళ్తారని తెలిసి అక్కడే వుండి, చూసి చాలా బాధపడింది. ఒక పనిమనిషి కోసం అంతగా బాధపడిన వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఆమ్మకి ఆ రోజుల్లో ఎప్పుడూ దుర్గమ్మ అనే వంటమనిషి, కూడా ఉండేదట. ఇద్దరు కోడళ్ళొచ్చాక అప్పుడు ముగ్గురం కలిసి చేసుకుందాం అని వంట మనిషిని తీసేసిందట. మా తాతగారు పోవడం, పెద్దపెద్దనాన్నకి చిన్న వయసులోనే భార్య పోవడం, వాళ్ళ ఇంకో కజిన్ విశ్వం అన్నయ్య పోవడం, వీటన్నింటి వల్లా, ఈ పెదనాన్నా, ఆమ్మలే అందరికీ ఆది దంపతులు అయ్యారు. ఏ పెళ్లి వచ్చినా, ఒడుగు వచ్చినా, ఏ శుభకార్యమైనా పీటలమీద కూర్చునేది వీళ్ళే. యెంత మందికి కన్యాదానం చేసారో, యెంత మందికి వొడుగులు చేసారో, యెంత మందికి స్నాతకాలు చేసారో వాళ్ళకే లెక్క లేదు. మళ్ళీ వీళ్లంతా ఆ ఇంటికి అల్లుళ్ళు గానే లెక్కలోకి వచ్చేవాళ్ళు. వీళ్లల్లో ఎవరు విజయవాడ వచ్చినా, వీళ్ళింటికి వచ్చి కనబడి, భోజనం చేసి కానీ వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్లందరికీ అదో మర్యాద. ఆమ్మ అల్లుళ్ళనందరినీ ఒకేలాగా చూసేది. తలుపు వెనకాల నుంచే మాట్లాడేది. వాళ్ళెంత చిన్న వాళ్ళయినా సరే, 'మీరు' అనేది. పైగా అడిగితే, 'అల్లుళ్ళకి ఎదురు పడకూడదు, వాళ్లకు కాళ్ళు కడిగాం గదా, మీరు అనే అనాలి, నువ్వు అనకూడదు' అనేది.
ముళ్ళపూడి వెంకటరమణ గారు (మా శ్రీదేవి పిన్ని భర్త) కూడా మా ఆమ్మా, పెదనాన్నా వాళ్ళ మర్యాదల గురించి తన కోతికొమ్మచ్చిలో కూడా రాశారు. శ్రీదేవి పిన్ని పెళ్లి తరువాత ఆరుగొలను నుంచి మేమంతా డైరెక్టుగా, పెదనాన్నా వాళ్ళింటికే వెళ్లాం. కొత్త పెళ్ళికొడుకు, పెళ్లికూతురు, పెళ్ళివాళ్ళు వస్తున్నారని, నందివాడ వాళ్ళు యెంత ఆలస్యమయినా ఆగి భోజనాలు చేయకుండా వున్నారని రమణ బాబాయిగారు ఆ పుస్తకంలో రాసారు. అలా మా నందివాడ వారి మర్యాదలు రమణ బాబాయిగారి ఆత్మకథలో కూడా చోటు చేసుకున్నాయి ఆమ్మా, పెదనాన్నా ధర్మమా అని. అనురాధ పెళ్లి మధ్వ పద్ధతిలో జరిగింది. రాఘవ బావగారు మధ్వ సాంప్రదాయం వాళ్ళు. పెళ్ళిలో 8 మంది దంపతులని పెళ్లి మండపంలో వధూ వరుల చుట్టూ వలయంలా నుంచోపెట్టి, మంగళసూత్రం దారంతో పోగులు వేయించారు. ఆ 8 మంది దంపతులతో నేనూ, మావారూ కూడా వున్నాం. ఆ కొత్త పద్ధతులు చూసి, ఆమ్మ, పెద్దనాన్నా, "ఎన్ని పెళ్లిళ్లు చేసాం, చూసాం, ఇది ఎప్పుడూ చూడలేదు" అంటూ నవ్వేశారు. ఏ విషయమైనా సరదాగా, తేలిగ్గా తీసుకునే మనస్తత్వం వాళ్ళది. ఏ ముహూర్తాన నవ్వుతూ ఆ పెళ్లి చేశారో కానీ, రాఘవ బావగారు ఆ ఇంటికి అల్లుడు కన్నా, కొడుకై పోయాడు. మా అందరికీ కూడా, హితుడూ, సన్నిహితుడూ అయిపోయాడు. బహుశా ఆమ్మ తలుపు వెనక నుంచి కాకుండా ముందుకొచ్చి మాట్లాడేలా చేసిన ఏకైక అల్లుడేమో కూడా.
శ్రీదేవి అక్కయ్య ఎప్పుడు మాట్లాడినా, 'అన్నపూర్ణ పిన్ని ఎంత మంచిదో, తల్లి లేని పిల్లలమని మమ్మల్ని యెంత ప్రేమగా చూసేదో', అనేది. శ్రీదేవి అక్కయ్య మొదటి పురుడప్పుడు, పెద్ద పెదనాన్న శ్రీమంతం చేసి అక్కయ్యని పురిటికి గుడివాడ తీసుకెళదామనుకున్నాట్ట. అప్పుడు బామ్మ కూడా, ఎందుకో వేరే ఊరుకి వెళ్ళిందిట. అప్పుడు ఆమ్మ, ' శ్రీదేవీ, నా మాట విను, నాతో రా, మీ నాన్న మొగవాడు ఒక్కడూ ఏం చెయ్యగలడు. నేను నీ తల్లి లాంటిదాన్ని, నీకు నేను పురుడు పోస్తా, నా మాట విను, మా ఇంటికి వెళదాం" అని చెప్పి పిలుచుకుని వచ్చిందట. తీరా పురుడు వచ్చే టైంకి, ఆమ్మకి పక్క వూళ్ళో ఎవరో బంధువుల ఇంటికి పెళ్ళికి ఒక్క రోజు కోసం వెళ్లాల్సి వచ్చిందట. ఇంకా పురిటికి వారం టైం ఉందిలే అనుకుని, అక్కయ్యకి బోల్డు జాగ్రత్తలు చెప్పి, వాళ్ళ అమ్మని (ఆవిడ పేరు పింగళి కాంతమ్మ) తోడు ఉంచి వెళ్లిందట. తీరా ఆమ్మ వెళ్ళగానే, అక్కయ్యకి అనుకున్న సమయం కన్నా ముందే నొప్పులు వచ్చి, పిల్లాడు పుట్టాడుట. ఆమ్మా వాళ్ళ అమ్మే అంతా చూసిందట. మరునాడు ఆమ్మ వచ్చిందట. "శ్రీదేవీ, నీ కొడుక్కి తొందరెక్కువ, నేను వచ్చేదాకా ఆగలేదు." అని నవ్విందట. తరువాత పురిటి స్నానం రోజుకి బామ్మ కూడా వచ్చి, "పురిటికి తెచ్చి, పురిటికి ఉండకుండా, ఊరు వెళ్ళిపోయావు" అని కోప్పడిందిట. అప్పుడు కూడా ఆమ్మ నవ్వేసి వూరుకుందిట. ఈ రోజుకీ 'అన్నపూర్ణ పిన్ని దేవత. నాకు కన్నతల్లి లాంటిది' అని ఎప్పుడు మాట్లాడినా అక్కయ్య చెప్తూనే ఉంటుంది.
మా అమ్మా నాన్నల పెళ్లి గురించి నేను ముందరే ఒక పోస్టులో చెప్పాను. అమ్మానాన్నా వాళ్ళ పెళ్ళికి ఒక రోజు ముందు, సాంబాబాయిదో, చక్రి అన్నయ్యదో ఎవరిదో ఒడుగు అయ్యిందిట. ఆరోజే ఉమా పెద్దనాన్నా, అన్నపూర్ణామ్మ వాళ్ళ అమ్మాయి సడెన్ గా చనిపోయిందట. దాంతో మగపెళ్లి వాళ్లందరికీ మూడు రోజులు మైల. ఎక్కడ చుట్టాలు అక్కడే నిలిచి పోయారుట. అందరికీ ఈ సడెన్ మైల వల్ల అంతా ఇబ్బంది పడ్డారుట. అందుకని పెళ్లిని నాలుగో రోజుకే పోస్టుపోన్ చేసారట. ఆమ్మ అంత దుఃఖం లోనూ స్నానం అయ్యాక వచ్చి పీటల మీద కూర్చుని తతంగం అంతా పూర్తి చేసిందట. అప్పుడు అందరూ అనుకున్నారట, "అన్నపూర్ణ యెంత మంచిది, తన వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదని, అంత కష్టంలో కూడా యెంత నిబ్బరంగా ఉందో" అనుకున్నారట. అదీ ఆమ్మ కారెక్టర్. ఈ విషయం నాకు ముందే తెలిసినా, ఈ అంశాన్ని ఆమ్మ కోణంలో శ్రీదేవి అక్కయ్య చూసినట్టు, నేను చూడలేక పోయాను. ఈ విషయం అక్కయ్య నోటి నుంచి వింటుంటే, నాకూ కళ్లనీళ్లు తిరిగాయి. ఆమ్మ ఎప్పుడూ పెదనాన్నకి ఏ ఇబ్బందీ కలగనియ్యలేదు, తన వల్ల పెదనాన్నని ఎక్కడా కూడా మాట పడనియ్యలేదు. పెదనాన్న రామకోటికీ (రామాలయం), బాలభారతికీ (స్కూల్) ఉచితంగా సర్వీస్ చేసేవాడు. చాలాకాలం బాలభారతికి కరెస్పాండెంటుగా, రామకోటికి ధర్మకర్తగా, కూడా వున్నాడు. ఆ రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం రామకోటి వెళ్లి మళ్ళీ ఏ ఏడు గంటలకో తిరిగి వచ్చేవాడు. రామకోటిలో గోపుర ప్రతిష్ట అయితే, ఆమ్మ కూడా పక్కనే వుండి, పెదనాన్నతో పాటు, ధర్మకర్త భార్య హోదాలో ఆ టెంపరరీ వాసాల మెట్లన్నీ ఎక్కి, ఏభయమూ లేకుండా, అంత ఎత్తున గోపుర కలశ ప్రతిష్ట చేసింది. బాబోయ్, ఎలా ఎక్కిందో కదా అనుకున్నాం.
గాలిపటాలు ఎగరేయటం నేను అక్కడే నేర్చుకున్నా. సీజన్లో పిల్లలందరం గాలిపటాలు, దారం రీల్స్ తీసుకుని, పైకి టెర్రస్ మీదకి చేరేవాళ్ళం. చీకటిపడే ముందు ఎక్కడి నుంచి వచ్చేవో తెలియదు కానీ, గుంపులు గుంపులుగా గబ్బిలాలు వచ్చేవి. వెంటనే, చకచకా గాలిపటాలని దింపేసి, దారం చుట్టేసుకుని అయిదు నిముషాల్లో కిందకు వచ్చి తలుపులు వేసేసుకునే వాళ్ళం. అదో సరదా ఆ రోజుల్లో. అందరికన్నా బాగా అనురాధ గాలిపటాలు ఎగరేసేది. ఆమ్మ చిన్నజ్వరం వచ్చి, ఒక వారం రోజులు సిక్ అయి, 60 ఏళ్లకే కన్ను మూసింది. ఆమ్మ చనిపోయే ముందర రోజు రాత్రి ఎప్పుడూ లేనిది వేంకటేశ్వరస్వామి పటం కింద పడిపోయిందిట, చిన్నవదిన చెప్పింది. గబ్బిలాలు కూడా ఇంట్లోకి వచ్చాయట. ఆమ్మ పోయిందని వినంగానే షాక్. ఆ కార్డ్ మా రైల్వే కోడూరుకు వచ్చేసరికి మూడు రోజులు పట్టింది. తెలియంగానే పిల్లలిద్దరినీ తీసుకుని విజయవాడ వెళ్లాను. అప్పుడు పెద్దవాడికి మూడేళ్లు, చిన్నవాడికి మూడునెలలు. మాధవన్నయ్య పిల్లలతో ఆ రాత్రివేళ నన్ను చూడంగానే, "అనుకున్నా, ఇది ఆగలేదని" అని నెత్తి మీద మొట్టాడు. ఆమ్మ పోవడం ఏమిటీ, ఆశ్చర్యం, విషాదం రెండూ. ఎందుకంటే, ఆమ్మ ఎప్పుడూ చక్కగా, ఆరోగ్యంగా, నవ్వుతూ ఉండేది.
పిల్లల కెవరికైనా పుట్టిన రోజు వస్తే ఆమ్మ పెదనాన్న దగ్గరికి వెళ్లి కూర్చుని వాళ్లకి కొత్త బట్టల కోసం డబ్బు ఇమ్మని అడుగుతూ ఉండేది. పెదనాన్నేమో 'మా చిన్నప్పుడు మంచి చీర పాతిక రూపాయలకు వచ్చేది, ఇప్పుడు అన్నీ బాగా డెవలప్ అయ్యాయి కదా, పది రూపాయలకే వచ్చేస్తుంది' అని పది రూపాయలిచ్చేవాడు. ఆమ్మ గోల పెట్టి మొత్తానికి పెదనాన్న నుంచి ఎక్కువ డబ్బు సాధించి పిల్లలకు పుట్టినరోజు లోటు లేకుండా చూసేది. పెదనాన్న ఎప్పుడూ పది రూపాయలడిగితే, ఐదు రూపాయలు ఇచ్చేవాడు. అలాంటి పెదనాన్న నుంచి ఓపిగ్గా, నవ్వుతూ, నిష్టూరంగా మాట్లాడుతూ, బతిమాలుతూ పని సాధించుకునేది. సంపాదించేది పెదనాన్న అయినా అసలు ఆమ్మే ఆ ఇంటికి లక్ష్మి. సిరి కళ ఆవిడదే. అందుకే కాబోలు, చిన్నవదిన ఎప్పుడూ అంటూ ఉండేది, 'మా అత్తగారితోనే ఈ ఇంటి కళ పోయింది' అని. మాక్కూడా నిజమేనేమో అనిపిస్తూ ఉండేది. వెళ్ళినప్పుడల్లా ఎప్పుడూ చక్కగా హాయిగా ఓపెన్ గా నవ్వుతూ ఉండే ఆమ్మని బాగా మిస్ అయ్యేవాళ్ళం. నెమ్మదిగా ఉద్యోగ బాధ్యతలు పెరిగాక విజయవాడ వెళ్ళటం కూడా తగ్గింది. చిన్నన్నయ్య మాత్రం 'ఇది మీ పెదనాన్న ఇల్లే, రండే. పెదనాన్నకి సంతోషంగా ఉంటుంది' అనేవాడు. నిజానికి ఆమ్మ తరువాత అందరినీ సమానంగా చూసింది చిన్నన్నయ్యే. అందరితో ప్రేమగా, ఆపేక్షగా ఉంటాడు. ఇంటికి వచ్చిన వారిని ఆదరించటం అనే అంశం మాత్రం ఆ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ విస్మరించలేదు.
చివరిగా మరో సరదా విషయంతో ముగిస్తాను. శుభాకాంక్షలు అనే సినిమాలో AVS ఒక భయంకరమైన గాయకుడు. అతడి బాధ పడలేక, వీధిలో అందరూ అతనితో రాజీ చేసుకుంటారు, రోజూ రాత్రి ఒకే సమయంలో మాత్రమే పాడాలని. ఆ టైంకి ముందే అందరూ పనులు పూర్తి చేసుకుని, తలుపులు వేసేసుకుని పడుకునే వాళ్ళు. అదంతా మహా హాస్యంగా తీసాడు దర్శకుడు. మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేది. చాలా స్నేహశీలి. ఎంతో టాలెంటెడ్, ఎన్నో పనులు చేస్తూ ఉండేది. ఆ ఆంటీ ఒక్కోసారి, కనీసం నెలకొక్కసారైనా సరే, ఆదివారం నాడు పీతలకూర చేసేది. వాళ్ళు మాంసాహారులు. ఆ రోజు మేమెవ్వరం తట్టుకోలేని భయంకరమైన వాసన మొత్తం మా ఇల్లు కూడా కమ్మేసేది. ఎవ్వరం ఇంట్లో ఉండలేక పారిపోయేవాళ్ళం. ఆ ఆంటీ కూడా అచ్చం ఆ సినిమాలో లాగానే, మాకు వీలైన టైంలోనే ఈ పీతలకూర చేసేది. ఆదివారాలు మా లంచ్ కార్యక్రమం అయిపోయేది, ఆవిడ కూర కార్యక్రమం మొదలయ్యేది. అందరం ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు పారిపోయేవాళ్ళం. నేను, మా మామయ్యా వాళ్ళింటికో, ఆమ్మ, పిన్నీ వాళ్ళింటికో అని చెప్పి వెళ్లిపోయేదాన్ని. పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి ఏదో సాకు చెప్పి పారిపోయేవాళ్లు. వదినలిద్దరూ వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్లి వస్తామని వెళ్లిపోయేవాళ్లు. ఎప్పుడూ బయటకు వెళ్ళని ఆమ్మ కూడా ఆ వాసన పడలేక, ఆ రోజు "మా అమ్మని చూసొస్తా" అని వెళ్లిపోయేది. ఇక మగవాళ్ళు మాత్రం తప్పించుకోలేక, ఇంట్లో చిక్కుకు పోయేవాళ్లు. వీళ్ళు మాత్రం ఆ పక్కింటి ఆంటీ పీతల వాసనను తప్పించుకోలేక పోయేవాళ్లు. సాయంకాలాని కల్లా, అన్ని పక్షులూ ఇంటికి వచ్చేసరికి ఆ వాసన పూర్తిగా పోయేది. అమ్మయ్యా అనుకుని, లోపలికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఆ ఆంటీ పీతలకూర చేసేదాకా అంతా మామూలే.
ఇవీ అన్నపూర్ణామ్మతో జ్ఞాపకాలు. ఇప్పటికీ ఆమ్మ గుర్తొస్తే, ముందుగా కనపడేది ఆమ్మ నవ్వుమొహం, ఆ స్వచ్ఛమైన చక్కటి నవ్వూ. అదీ మా అన్నపూర్ణామ్మ.
ఉమామహేశ్వరరావు గారిల్లు మూడంతస్తులమేడ. ఇల్లు లాగే వారి మనసులూ విశాలమైనవి అంటూ మాఅమ్మ ఎంతో ఇష్టంగా చెప్పేది. ఆఇంటి ఆతిధ్యం పొందేభాగ్యం మాఅమ్మకూనాన్నకూ కూడా కలిగింది. వారి పెళ్ళయినకొత్థలో. మంచి వ్యక్తిని గురించి తెలుసుకోవడం బావుంది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి