2, ఏప్రిల్ 2022, శనివారం

పంచాంగము అంటే ఏమిటి ?

పంచాంగము అంటే ఏమిటి ? 


అందరికీ శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 

ఈ రోజు మనం అందరం ఉగాది జరుపుకుంటున్నాం. ఈ నాడే పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఏ రాశి వారికి ఎలా వుందో, ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో ఆతృతగా తెలుసుకుంటున్నాం. 
పంచాంగాలు రాసేవారిని సిద్ధాంతి అంటారు. మన భారత దేశంలో సిద్ధాంతులు  సాధారణంగా 
దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి రాస్తారు. ఇంకా ఇతర సిద్ధాంతాలు కూడా వున్నాయి. కాలమును శాసించేవి ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు. వీరి గమనం వల్లే దివారాత్రాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు పగటి అధిపతి అయితే, చంద్రుడు రాత్రికి అధిపతి. అందుకే ముఖ్యంగా కాలాన్ని చాంద్రమానము, సౌరమానము అంటూ కొలుస్తాం. ఇంకా బార్హస్పత్య మానము వంటి ఇతర గ్రహ గమనాల ద్వారా కూడా కాలం కొలిచే పద్దతి కూడా వుంది. మన తెలుగు వారందరం చాంద్రమానాన్ని వాడతాం. తమిళులు సూర్యమానాన్ని వాడతారు. గ్రహచారం అంటే గ్రహగమనం బట్టీ లెక్కించి చెప్పేదే గ్రహచారం, గోచారం. ఇవి ఆ రాశి వారికి, ఆ నక్షత్రం వారికి కలిపి మూకుమ్మడిగా ఒక్కటే చెప్తారు. అవే ఇప్పుడు మనం స్థూలంగా చెప్పుకుంటున్న సంవత్సర ఫలితాలు. కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవాలంటే ఎవరైనా స్వీయ జాతకం  చూపించుకోవలసిందే. జాతకం రాయించుకోవాలంటే DTP కావాలి. వారు పుట్టిన D అంటే డేట్, T అంటే టైం, P అంటే ప్లేస్ వివరాలు కావాలి. ఉగాది అంటే సంవత్సరంలో  మొదటి రోజు.  ఆ పండుగ వారంలో ఏ రోజు వస్తే ఆ గ్రహమే ఆ సంవత్సరానికి అధిపతి. ఈ సంవత్సరం అధిపతి శని, ఎందుకంటే ఉగాది శనివారం వచ్చింది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే అయిదు అంగములతో కూర్చినది పంచాంగము. 

మొదటిది తిథి: ఇది చాలా మందికి తెలుసు. తిథులు మొత్తం 16. పాడ్యమి నుంచి చతుర్దశి వరకూ 14,  పౌర్ణమి, అమావాస్యలను  కూడా కలుపుకొని మొత్తం 16. తిథి లేకుండా వచ్చేవాడినే అతిథి అంటారు. అంటే అప్పటికప్పుడు అనుకోకుండా వారం , వర్జ్యం చూసుకోకుండా  వచ్చేవాడే అతిథి అన్నమాట. 
  
రెండవది వారం: ఇవీ అందరికీ  తెలుసు. వారములు 7. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, 
శని వారాలు. మరి గ్రహాలూ తొమ్మిది కదా మిగిలిన రాహువుకీ, కేతువుకీ కాలమానంలో స్థానం లేదా 
అంటే, వున్నది. ఈ రెండూ ఛాయా గ్రహాలైనా వీటికీ వాటి సమయం వాటికి వుంది. రాహువు అధిపతిగా వుండే కాలం రాహుకాలం, కేతువు అధిపతిగా వుండే కాలం యమగండం. 

మూడవది నక్షత్రం: ఇవి మొత్తం 27. కొద్దిసేపు మాత్రమే వుండే అభిజిత్ తో కలిపి లెక్కిస్తే, వీటి సంఖ్య 28. అభిజిత్ సంగతి ఏమో కానీ మిగిలిన 27 నక్షత్రాలూ చాలామందికి తెలుసు. కనుక 27 నక్షత్రములు అశ్వని నుంచి రేవతి వరకు + అభిజిత్.   వీరు అందరూ దక్ష ప్రజాపతి పుత్రికలు, చంద్రుని భార్యలు. వీరి వలననే చంద్రునికి వృద్ధి క్షయాలు వచ్చాయి. వీరిలో చంద్రునికి రోహిణీ అంటే ఎంతో ఇష్టం. మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసిన దక్షుడు చంద్రుణ్ణి క్షయ వ్యాధితో కృశించమని శపించాడు. అది తెలిసి నక్షత్రాలన్నీ శోకించాయి. అప్పుడు శివుడు ఆ దక్షశాపాన్ని కొంచెం సవరించి చంద్రుడికి ఒక పక్షం రోజులు పెరుగుతూ ఉండేలాగా, మరొక పక్షంరోజులు తరుగుతూ ఉండేలా చేసి,  ఆ చంద్రకళను తలమీద పెట్టుకుని చంద్రశేఖరుడు అయ్యాడు. అన్నట్టు పక్షాలు రెండు. ఒకటి  శుక్ల లేదా శుద్ధ పక్షము అయితే, రెండవది కృష్ణ లేదా బహుళ పక్షము. శుక్లము అంటే తెలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ పెరుగుతూ పౌర్ణమికి పూర్తి చంద్రుడు తెల్లని కాంతితో ప్రకాశిస్తాడు. కృష్ణ అంటే నలుపు, ఈ పక్షంలో చంద్రుడు రోజు రోజుకీ తరుగుతూ అమావాస్యనాటికి పూర్తిగా నల్లగా చీకటి చంద్రుడు అయిపోతాడు. 

నాలుగవది యోగము: వీటి గురించి చాలామందికి తెలియదు. ఇవి మొత్తం 27. ఏ సమయంలో ఏ యోగము ప్రభావం చూపిస్తుందో ఇది చెపుతుంది. విష్కంభము నుంచి వైధృతి వరకూ ఇవి 27. పేర్లు చెప్పటం లేదు అవి ఎక్కడైనా దొరుకుతాయి. 

అయిదవది కరణము :  ఇవి కూడా చాలామందికి తెలియవు. ఇవి మొత్తం 11. బవ కరణము నుంచి కింస్తుఘ్నము అనే కరణము వరకు ఇవి మొత్తం 11. ఇవి వాటి  ప్రభావంతో ప్రజలకు యోగాలు కలిగించేందుకు కారణమవుతాయి. ఈ అయిదూ కాక కాలాన్ని లెక్కించటానికి ఇంకా చాలా కొలమానాలు వున్నాయి. 

3 సంధ్యలు: సూర్యోదయం, అపరాహ్ణము, సూర్యాస్తమయం. త్రిసంధ్యలలోనూ జపాలు, స్తోత్ర పఠనాలు ఎంతోమంది చేస్తూ వుంటారు. గాయత్రి జపాన్ని సంధ్యావందనము అని అందుకే అంటారు. 

2 పూటలు: పగలు, రాత్రి, దివారాత్రాలు. వీటికి సూర్యుడు, చంద్రుళ్లు అధిపతులు. 

1 దినము: ఒక సూర్యోదయం ఒక దినానికి లెక్క. ఏ రోజు సూర్యోదయ కాలానికి ఏ తిథి ఉంటుందో, ఆ రోజు ఆ  తిథిగా పరిగణిస్తాం. 

4 యుగములు: కృత, త్రేతా, ద్వాపర. కలియుగాలు. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. సంకల్పంలో చెప్పుకుంటాం కదా కలియుగే, ప్రధమ పాదే అని. సంకల్పం అంటే కేవలం మామూలుగా మన జియో పొజిషన్, మన అప్పుడు వున్న కాల వివరం, మన నామ గోత్ర వివరాలు చెప్పుకోవటం మాత్రమే.  

60 సంవత్సరములు: ప్రభవ నుంచి అక్షయ వరకు ఇవి మొత్తం అరవై. ఏ సంవత్సరం ఏ పేరు మీద ఉందో  ఆ ఫలితమే ఆ సంవత్సరం ఉంటుంది. వికారి ఎంత వికారంగా ఉందో చూసాం. శార్వరి ఎంత చీకటిగా ఉందో కూడా చూసాం. ప్లవ కొద్దిగా గట్టెక్కించిందని ఆనందపడ్డాం. ఇప్పుడు శుభకృత్ శుభాలని కలగచేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. శుభకృత్ అంటే అర్ధం శుభములను చేయునది అని. రాబోయే శోభకృత్ మనందరినీ శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది అని ఆనంద పడదాం. 

ఈ పేర్ల వెనక ఓ పురాణ గాధ వుంది. ఒకసారి నారదుడికి, తానే గొప్ప విష్ణు భక్తుడననీ, తాను మాత్రమే విష్ణుమాయకు అతీతుడనీ ఓ అహంకారపూరిత భావం ఏర్పడింది. అప్పుడు నారదుడికిఆ అహంభావం తొలగించడానికి శ్రీమన్నారాయణుడు నారదుణ్ణి ఒక నది ఒడ్డుకి తీసుకువెళ్లి, ఆ నదిలో స్నానం చేయమని చెప్తాడు. నీళ్ళల్లో మునగగానే శ్రీమన్నారాయణుడు మాయం అయిపోయాడు. నారదుడు కాస్తా నారదిగా, అంటే స్త్రీ గా మారిపోయాడు. అటుగా పోతున్న ఆ దేశపు రాజు, అందంగా వున్న ఈ ఒంటరి సుందరిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరూ అలా కొన్నేళ్లపాటు సంసారం చేసి, అరవై మంది కొడుకులను కన్నారు. ఆ పిల్లల పేర్లే ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి నుంచి క్రోధన, అక్షయ. ఒకసారి ఇంకో దేశంతో జరిగిన యుద్ధంలో ఈ మొత్తం అరవై మంది నారద సంతానం, రాజుతో సహా మరణిస్తారు. నారదుడు తిరిగి ఆ నది ఒడ్డుకి వచ్చి శోకిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్లీ  శ్రీమన్నారాయణుడు వచ్చి,"అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావ్, ఆ నదిలో దిగి స్నానం చేసి రా. నీ దుఃఖం పోతుంది" అని చెప్తాడు. నారదుడు తిరిగి నీటిలో మునగగానే ఆ స్త్రీ రూపం పోయి, మామూలు దేవఋషి రూపం వచ్చేస్తుంది. నారదుడు అప్పుడు విష్ణుమాయ శక్తిని  గ్రహించి సిగ్గుపడి, నారాయణుడికి దాసోహం అంటాడు. కానీ పాపం తాను కన్న పిల్లల మీద ప్రేమ మాత్రం వదులుకోలేక పోతాడు. నారాయణుడికి చెప్పుకుంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, "నీ అరవై మంది పిల్లలూ సంవత్సరానికి ఒకరుగా వస్తూ పోతూ వుంటారు. వారు సంవత్సరాల రూపంలో చిరంజీవులుగా వుంటారు", అని వరం ఇస్తాడు. వారే మన సంవత్సరాలు. భాగవతం లోని ఈ శ్లోకం చూడండి. 

ప్రహ్లాద నారద పరాశర పుండరీక  వ్యాసాంబరీష శుక శౌనక  భీష్మదాల్భ్యాన్,

రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్  పుణ్యానిమాన్ పరమ భగవతాన్ స్మరామి !

కనుక భక్తిలో నారదుడు కూడా, తన శిష్యుడైన ప్రహ్లాదుని కన్నా తరువాత స్థానంలో ఉంటాడు. ప్రహ్లాదుడు పసి పిల్లవాడు, నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడు. భక్తులలో ప్రథముడు. 

2 అయనములు:  ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యగమనాన్ని బట్టి సూర్యుడు ఎటు దిక్కు 
ఉంటే ఆ వైపు ఆయనమని అంటారు. ఉత్తరాయణంలో వెలుగు ఎక్కువ, దక్షిణాయనంలో వెలుగు తక్కువ. ఈ అంశం మీద చెప్పాలంటే అది ఒక్కటే ఒక్క వ్యాసమవుతుంది. అన్నట్టు ఉత్తరం, దక్షిణం అంటే మరో విషయం గుర్తొచ్చింది. ఉత్తర దేశానికీ, దక్షిణ దేశానికీ 12 సంవత్సరములు తేడా. మనం శుభకృత్ అంటే వారు అంటే సరిగ్గా వింధ్య పర్వతాలకు అవతలివైపు ప్రాంతం వారు ఆనంద నామ సంవత్సరంలో వుంటారు. 

ఈ విశేషానికి సంబంధించిన "వింధ్యపర్వతం గర్వ భంగం కథ" ఒకటి పురాణాల్లో వుంది. దాని ప్రకారం 'మేరుపర్వతం తనకన్నా పెద్ద పర్వతం, దాని చుట్టూ సూర్యుడు ప్రదక్షిణం చేస్తాడు' అని నారదముని ద్వారా తెలుసుకున్న వింధ్య, "నేనేం తక్కువ, నేనూ పెద్దగా ఎదుగుతాను" అని బాగా ఎత్తుగా పెరిగిపోయేసరికి సూర్యుడు దాన్ని దాటలేక మిగిలిన ప్రాంతాన్నే పరిభ్రమించాడుట. దాంతో వింధ్యకి ఈవలి వైపు దక్షిణ భారత ప్రాంతమంతా పూర్తిగా చీకట్లో ఉండి పోయిందిట. దానితో దక్షిణ భారత దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం లేకపోవటంతో తిధులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మారలేదు. ఉత్తర భారతంలో అయితే మామూలుగా సంవత్సరాలు మారిపోతున్నాయి. అప్పుడు దేవతలంతా ఈ ఇబ్బంది గురించి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే, ఆయన అగస్త్యుడిని ఎన్నుకుని వింధ్యపర్వతం ఎత్తు అణచమని అడిగాడట. 
అప్పుడు అగస్త్యుడు దేవతల ఆదేశంతో తన కుటుంబంతో సహా దక్షిణ భారత పర్యటనకు 
బయలుదేరి, వింధ్యపర్వతాల వద్దకు రాగానే, వింధ్య పర్వతం అగస్త్యుని చూసి వంగి దణ్ణం 
పెట్టాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఇదే విధంగా వంగి ఉండమని, లేకపోతే తన
వంటి పొట్టివాళ్లకు వింధ్యని దాటి వెళ్ళటం కష్టమవుతుందని, తాను దక్షిణభారత యాత్రలు చేసి తిరిగి వస్తానని చెప్పాడు. దానితో తిరిగి, వింధ్యపర్వతాలు మళ్ళీ పొట్టిగా వంగిపోయాయి. 
అప్పటినుంచి సూర్యుడు యధావిధిగా పరిభ్రమణం మొదలుపెట్టాడు. దానితో దక్షిణ భారత 
దేశంలో తిరిగి సంవత్సరాలు మారటం మొదలైంది. ఈ కారణం చేతే మనకు వాళ్లకు  12 సంవత్సరాల తేడా వుంది. 

3 కాలాలు: వేసవికాలం, వానాకాలం, శీతాకాలం.  

6 ఋతువులు: వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం. 

వసంతం --- చైత్రం, వైశాఖం మాసాల్లోనూ, గ్రీష్మం --- జ్యేష్టం, ఆషాఢం మాసాల్లోనూ,  వర్షం --- శ్రావణం, భాద్రపదం మాసాల్లోనూ, శరత్తు --- ఆశ్వీయుజం, కార్తీకం మాసాల్లోనూ, హేమంతం --- మార్గశిరం, పుష్యం మాసాల్లోనూ, శిశిరం --- మాఘం, ఫాల్గుణం మాసాల్లోనూ వస్తుంది. 

12 మాసములు: ఒక సంవత్సరంలో 12 మాసాలు, 12 సంక్రమణాలు వస్తాయి. మకర సంక్రమణం మాత్రం సంక్రాంతి పండుగగా ప్రసిద్ధి. ఏ నక్షత్రమైతే పూర్ణమికి  చంద్రునికి దగ్గరగా ఉంటుందో,    ఆ నక్షత్రం పేరు మీద ఆ మాసం పిలవబడుతుంది. ఉదాహరణకి అశ్విని నక్షత్రం పున్నమి నాడు చంద్రుడికి చేరువగా ఉంటే ఆ నెల ఆశ్వీయుజం. పూర్వాభాద్ర కానీ,  ఉత్తరాభాద్ర కానీ పున్నమి రోజు చంద్రునికి దగ్గరగా ఉంటే ఆ మాసం భాద్రపదం. 

వర్జ్యం: మనకందరికీ ఒక విషయం బాగా తెలుసు. సంవత్సరం అంటే ఖచ్చితంగా 365 రోజులు కాదు. ఒక రోజు అంటే, పూర్తిగా 24 గంటలు కావు అని. ఎంతో కొంత సమయం మిగిలిపోతుంది. అలా  వదిలి వేయబడిన సమయాన్ని వర్జ్యం అంటారు. ఆ సమయం వదిలి వేశాం కనుక ఆ సమయంలో ఏ శుభకార్యాలూ చేయకూడదు. ఈ సమయాన్ని పరిగణన లోనికి తీసుకుని అంతర్జాతీయ గడియారాలని కూడా అప్పుడప్పుడు సవరిస్తూ వుంటారు.  

దుర్ముహూర్తం: అలాగే 24 గంటలలో కొంత సమయం మంచిది కాదు , అప్పుడు ఏ  యోగం, కరణం వగైరాలు యోగించవు. అటువంటి సమయాన్ని దుర్ముహూర్తంగా పరిగణించి ఆ సమయంలో కూడా ఏ శుభకార్యాలూ చేయరు. 

ప్రదోషం: ఇది సరిగ్గా సూర్యాస్తమయానికి సుమారుగా ఒక అరగంట ముందు నుంచీ, ఒక అరగంటతరువాత దాకా ఉంటుంది. పూజలకు, జపాలకు ప్రశస్తమయిన కాలం. ఈ సమయంలో అభిషేకం చేసినా, దీపారాధన చేసినా ఎంతో మేలు. 

24 గంటలు: ఆదివారం తరువాత సోమవారమే ఎందుకు రావాలి? బుధవారం ముందు రోజు మంగళవారమే ఎందుకు అయి ఉండాలి? అనే ప్రశ్న పిల్లలు వేస్తే, మనం ఏం సమాధానం చెప్పాలి. వారాలకు ఆ క్రమం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మన ప్రాచీన ఋషులు మానవాళికి అమర్చిపెట్టిన, కూర్చిపెట్టిన విజ్ఞాన భాండారం విప్పి చూద్దాం రండి. ఇప్పుడంటే గంటలు అంటున్నాం కానీ, మనం ఘడియలు, విఘడియలు అనేవాళ్ళం. కానీ అసలు సిసలు పదం హోర. మనమైతే మూర్ఖంగా ఈ పదం పూర్తిగా మర్చిపోయాం కానీ, పాశ్చాత్యులు మాత్రం, మన హోరలని  Hours అని మార్చి ఎడాపెడా వాడేస్తున్నారు. వాళ్ళు Hours లో హ శబ్దం పలకరు, మన హోర పదంలో హ శబ్దాన్ని కూడా పలుకుతాం. అంటే తేడా. ఇప్పుడు హోర అంటే ఏమిటో, దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. రోజుకు 24 గంటలు, Hours, హోరలు. మనకున్న ఏడు వారాల గ్రహాలలోనూ వాటి గమన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వేగంగా వెళ్లే శనిగ్రహము  మొదటి వాడు. మందంగా నడుస్తాడనే ఆయన్ని మందుడు అంటాం. తరువాత నెమ్మదస్తుడు, భారీ కాయుడు కనుక గురుడు, ఆ తరువాత కుజుడు అంటే మంగళుడు, తరువాత సూర్యుడు, ఆ పై శుక్రుడు, ఇంకాస్త వేగంగా బుధుడు, అందరికన్నా అతి వేగంగా చంద్రుడు వున్నారు. కనుక ఆ గ్రహాల గమన వేగపరంగా చూస్తే తక్కువ వేగం నుంచి ఎక్కువ వేగానికి ఆ క్రమం ఇది. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఇదే హోరా ఆర్డర్ --- శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర. ఈ క్రమాన్ని గుర్తు పెట్టుకోండి. రోజుకి 24 గంటలు, 24 హోరాలు. గంటకి ఒకటి చొప్పున ఈ ఏడూ  వరసగా తిరుగుతూ ఉంటాయి. అంటే రోజులో మొదటి ఏడు గంటలూ శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర ఇవి ఒక రౌండ్ తిరిగేస్తాయి. మళ్ళీ శని హోరా మొదలు. ఇలా 21 గంటలు అయిపోయాక మళ్ళీ శని, గురు, కుజ వస్తారు. ఆ తరువాత సూర్యుడు. అంటే రెండవరోజు మొదటి గంట సూర్యుడితో మొదలు అవుతుంది. మళ్ళీ లెక్కించండి. తిరిగి 25వ గంటకి చంద్రుడు వస్తాడు. గణితంలో దీన్ని MODULUS 7 అంటాం, సంగీతంలో సప్తస్వరాల లాగా. ఏ రోజు సూర్యోదయానికి ఏ గ్రహ హోరా ఉంటుందో ఆ రోజు ఆ వారం. ఆ ఆర్డర్ ని బట్టీ శనివారం తరువాత ఆదివారం, ఆదివారం తరువాత సోమవారం, ఆ తరువాత వరుసగా మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలు ఏర్పడతాయి. వేగాన్ని బట్టీ గ్రహాల క్రమం శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర అయితే, 24 హోరాల ఆర్డర్ లో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని మళ్ళీ ఆది వస్తాయి. ఎందుకంటే, ఆనాటి సూర్యోదయ సమయానికి ఆ హోరనే ఉంటుంది కనుక.  ఈ హోరా సిద్ధాంతాన్ని మేము ఆధునికులం, పురోభివృద్ధి చెందిన వారం అని చెప్పుకునే వారంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆచరిస్తున్నారు. ఇంత గొప్ప గణిత, ఖగోళ, శాస్త్ర విజ్ఞానాన్ని మనకందించిన ఆ ఋషులందరికీ శిరసు వంచి వందనం చేస్తున్నాను.  ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు మొదలైన ఖగోళ గణిత ఋషులందరికీ పాదాభివందనం.  

స్థూలంగా ఇదీ మన ఉగాది కథ, పంచాంగం కథ, కాలం కథ, కాలస్వరూపం కథ. 

అందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మీ భట్టిప్రోలు విజయలక్ష్మి 

 9885010650

16, మార్చి 2022, బుధవారం

మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య

 మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య 

               

మా అమ్మా వాళ్ళ రెండో అన్నయ్య, మోహనం అన్నయ్య, అందరికీ నండూరి రామమోహనరావుగా సుపరిచితుడు. గొప్ప కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, పరిశోధకుడు, ఎందరికో ఎన్నింటి లోనో మార్గదర్శి, వూహా విహారి, సౌమ్యుడు, భావుకుడు, అందగాడు, నిదానస్తుడు. ఇలా మా మోహనం మామయ్య గురించి ఎన్నయినా లలితమైన, గంభీరమైన, విశేషణాలు రాయచ్చు. మా మామయ్యది మా అమ్మమ్మ పోలిక. తెల్లగా నాజూగ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి భావుకత ఎక్కువ. ఆలోచన అధికం. వేదాంత పుస్తకాలు చదివీ చదివీ, ఆ వినూత్న ఆలోచనల తోనే, చిన్నవయసులో, అందరినీ వదిలేసి, హిమాలయాల బాట పట్టాడు. శివానందగారి రచనలు చదివి, వారిని కలవాలని, కొన్నాళ్ళు వారి సహచర్యంలో గడపాలని, ఏదో నేర్చుకోవాలన్న తపనతో, ఎవ్వరితో చెప్పకుండా హృషీకేశం వెళ్ళిపోయాడు. అప్పటికే మామయ్యకి పెళ్లి అయ్యింది. స్వయానా తన మేనమామ, కిష్టప్ప మామయ్య పెద్దకూతురు రాజేశ్వరినే పెళ్లాడాడు. అందమైన భార్య, చక్కటి కుటుంబం, తమాషాగా ఇవి ఏవీ కూడా మామయ్యను హృషీకేశం వెళ్లకుండా ఆపలేకపోయాయి. విషయాలు తెలుసుకున్న శివానంద గారు కోప్పడి, మామయ్యను వెనక్కు పంపించారట. అయినా కూడా మామయ్య కొన్నాళ్ళు అక్కడే వుండి, ఆ తరువాత తిరిగి వచ్చాడు. అసలే భావుకుడు, అందునా హిమాలయ పర్వత శ్రేణుల వాతావరణం, ఆ ప్రశాంత ఆశ్రమ పరిసరాలు మామయ్యను ఒక పూర్తి భావకవిగా మార్చాయి. ఆ తరువాత ఎన్నో, ఎన్నెన్నో కవితలు, పాటలు రాసాడు. తాను రాసిన పాటలకు తానే బాణీలు కట్టి పాడుకుంటూ, ఇంట్లో పిల్లలందరికీ కూడా ఆ పాటలు నేర్పేవాడట. మా కుటుంబంలో బహుశా తొలి వాగ్గేయకారుడు మోహనం మామయ్య. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఆ పాటలే ఎప్పుడూ పాడుకుంటూ వుండే వాళ్లమని మా అమ్మ చెప్పింది. అదీ ఎంత విపరీతంగా అంటే, చివరికి మంగళహారతి  ఇచ్చేటప్పుడు కూడా మామయ్య రాసిన "విభుడేగుతెంచేటి వేళాయెనే సఖీ....." అని ప్రేమ, విరహ గీతాలు పాడేసేవాళ్ళట. ఇది విని చచ్చే నవ్వేదాన్ని నేను. 

       
 
మామయ్య ప్రవృత్తి రీత్యా భావకవి అయినా, వృత్తి రీత్యా, జీవనోపాధి కోసం పాత్రికేయుడయ్యి, ఆ తరువాత, ఎంతో గొప్ప సాహిత్యాన్ని, భారతీయ పాశ్చాత్య వేదాంతాన్ని, చివరకు సైన్స్ సాహిత్యాన్ని కూడా విపులంగా రాసి తెలుగువారి అందరికీ పరిచయం చేసాడు. మోహనం మామయ్య రాసే సంపాదకీయాలంటే అప్పటికీ ఇప్పటికీ ఒక గీటురాయి, ఒక ప్రమాణం, ఒక కొలబద్ద. ఎందరో పాత్రికేయులకు అవి నేటికీ మార్గదర్శకాలు. మామయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవాడు. గర్వం అనేది మచ్చుకైనా కనిపించేది కాదు. 'నేను కదా ఇంతంత గొప్ప రచనలు చేసాను' అన్నట్టు ఎప్పుడూ డాబూ, దర్పం, అతిశయం, అహంభావం ప్రకటించలేదు. అమ్మమ్మ, తాతయ్యల పెంపకం నమూనా అది. అన్నదమ్ములందరిలోకీ పెద్ద పేరు తెచ్చుకున్న వాడు, కళాప్రపూర్ణుడు మోహనం మామయ్య. సింపుల్ గా ఉండేవాడు. చక్కటి చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద ఉండేది. ఎవరినీ కోప్పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ వాళ్ళ పిల్లలందరూ ఎందుకో మామయ్యకి, (మేము మా నాన్నకి దగ్గరయ్యినట్టుగా) ఉన్నట్టు నాకు ఎప్పుడూ కనిపించలేదు. మా తరంలో ఆయన్ని బతిమాలి పాటలు పాడించి, విన్న అదృష్టం నాదే. అందరి మేనల్లుళ్లు, మేనకోడళ్లలోనూ, ఆయనతో ఎక్కువ పరిచయం, సాన్నిహిత్యం వున్నది నాకే. ఈ మాట మా మోహనం మామయ్య కూడా స్వయంగా నాతో అన్నాడు. (మా పెద్దమామయ్య పిల్లలకి ఇంకా ఎక్కువ సాన్నిహిత్యం ఉందేమో మరి నాకు తెలియదు. అందుకని నా స్టేట్ మెంట్లో వాళ్ళని మినహాయించి అని చదువుకోవాలి). మామయ్య జీవితంలో సింహభాగం ఎప్పుడూ తన రచనలు, జర్నలిజం ఆక్రమించాయి. ఆయన ఊహావిహారం ఆయనది, ఆయన పరిశోధనా ప్రపంచం ఆయనది, ఆయన సాహితీ వ్యవసాయం ఆయనది, ఆయన కవితా ఘోష ఆయనది, ఆయన భావనాలోకం ఆయనది. ఇల్లు, పిల్లలు రెండో ప్రయారిటీకి వెళ్లిపోయాయి. ఈ భాగం పూరించడానికా అన్నట్టు, దేవుడు ఆయన జీవితం లోకి మా రాజేశ్వరత్తయ్యను పంపించాడు. శివపార్వతులిద్దరూ కలిస్తే పూర్ణం అవుతారు. అలాగే వీళ్ళు కూడా, ఒకళ్ళలో లేని క్వాలిటీస్ ఇంకొకళ్ళలో వుండి ఇద్దరూ కలిసి పూర్ణం అయ్యారు. నాలోని రచయిత్రికి మామయ్య ఇష్టమైతే, నాలోని తల్లికి అత్తయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. అత్తయ్య చాలా సక్సెస్ ఫుల్ తల్లి.  పిల్లలని చాలా బాగా పెంచింది. 

   

రాజేశ్వరి అత్తయ్య భలే చక్కనిది, మంచి రంగు, సౌమ్యురాలు. ఎప్పుడూ గొంతు వినపడేదే కాదు. నిదానంగా ఉండేది. మా అమ్మ రాజు వదిన, చిన్నవదిన అనేది. ప్రతి విజయవంతమైన స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడు అంటారు, సుబ్బులక్ష్మికి సదాశివం లాగా. కానీ నేను మాత్రం మామయ్య సాహితీ, పాత్రికేయ విజయాల వెనుక వున్నది అత్తయ్య అంటాను. మామయ్యకి ఇంటి బాధ్యత ఏదీ తగలకుండా చూసుకున్నది అత్తయ్యే. ఇంటి విషయంలో నిష్పూచీగా వున్నాడు కనుకే, మామయ్య అంత గొప్ప సాహిత్యాన్ని చదువరులకి అందించగలిగాడు. పిల్లల పెంపకం, చదువులూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అన్నీ అత్తయ్యే చూసుకునేది. అవసరానికి మామయ్య, అత్తయ్య పక్కన కూర్చుని ఆ సమయానికి ఆ కార్యక్రమం నడిపించేవాడు. మామయ్య రాసుకుంటుంటే ఆయనకి ఏ అంతరాయం, ఆటంకం రాకుండా చూసుకునేది. అందుకేనేమో, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆయన గదిలోకి వెళ్లి ఎవరూ ఆయన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. పిల్లలందరినీ తన లాగా సౌమ్యంగా పెంచింది. అయిదుగురు పిల్లలూ నిదానస్తులే. అందరికీ అత్తయ్య, మామయ్యల అందం వచ్చింది. మా కుటుంబంలో అందరి కన్నా వీళ్ళు చక్కని అందమైన పిల్లలు అనే పేరుండేది. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.

  
   రాజేశ్వరి అత్తయ్య, మీనాక్షి పిన్ని, లలిత పిన్ని                      సీతామ్మతో అత్తయ్య 

ఇక్కడ అత్తయ్య సమర్ధత, చాకచక్యం, తెలివితేటలు, ధైర్యం గురించి చెప్పాలి. ద్రోణంరాజు కృష్ణమూర్తి గారి అమ్మాయి. చిన్నప్పుడే తల్లి పోతే, వాళ్ళ బామ్మ పెంపకంలో విస్సన్నపేట లోనే పెరిగింది. ఆ రోజుల్లోని వానాకాలం పల్లెటూరి చదువు. మా అమ్మమ్మ అన్నయ్య కూతురు. చిన్నప్పుడు పెళ్లి అనుకునే రోజుల్లో, కట్నం ఇస్తే గానీ పెళ్లి కాదు అనుకుంటున్నప్పుడు, ధైర్యంగా అంత చిన్నపిల్ల కూడా "ఎలాగూ కట్నం ఇస్తున్నారు కనుక, బావనే చేసుకుంటాను" అని చెప్పిందట. అలా పెళ్లి కుదిరిందిట వాళ్లకి. అత్తయ్యే ఒకసారి ఈ విషయం చెప్పింది. పెళ్లి అయిన తరువాత కొద్ది రోజులకే, మామయ్య శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అల్లుడు ఇలా వెళ్లిపోయాడన్న బెంగతో అత్తయ్యా వాళ్ళ నాన్న చనిపోయారుట. "నాకిప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ లేరు, మీరు కాకపోతే నన్ను ఇంకెవరు చూస్తారు" అంటూ వాళ్ళ బామ్మ ప్రోద్బలంతో మామయ్యకి ఉత్తరం రాసిందట. దాంతో మామయ్యకి తన బాధ్యతలు, బంధాలు గుర్తొచ్చి తిరిగి వచ్చాడు కాబోలు. మొత్తానికి తన సమస్య చక్కగా, ధైర్యంగా, మర్యాదగా సాల్వ్ చేసుకుంది. ఈ మామయ్యా అత్తయ్యా ఇద్దరూ చూడచక్కని జంటలా కలిసి మెలిసి ఉండేవారు. మామయ్యా ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్తే, ఏ తోడూ లేకపోయినా, మామయ్యుంటే చాలు అన్నట్టుగా ధైర్యంగా ఆయనతో వెళ్లి, భాష తెలియని వూళ్ళో కూడా హాయిగా వుంది.  

  

అత్తయ్య తానే పూనుకుని పిల్లలందరి పెళ్లిళ్లూ కుదిర్చింది. అందరితో మంచిగా ఉంటూ తనకు కావలసిన పని చేయించుకునేది. చక్కగా నవ్వుతూ మాట్లాడేది. మల్లెపూవులా ఉండేది. చీర కానీ, జుట్టు కానీ నలగనిచ్చేది కాదు. చక్కగా లక్ష్మీకళతో ఉండేది. ఎప్పుడూ, ఎవరితోనూ ఘర్షణ పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలా. సన్నగా మాట్లాడేది. గొంతు పెద్దది చేయటం కూడా నేను ఎప్పుడూ వినలా. కృష్ణప్రసాద్, సత్యవతి, నిర్మల, శకుంతల, ఫణి అందరినీ సమానంగా చూసుకునేది. తన భర్త ఎంత గొప్పవాడో తెలిసినా, ఏనాడూ గర్వం చూపేది కాదు. మామయ్యకే లేని హెచ్చులు తనకెందుకు అన్నట్టు ఉండేది. ఉన్నదాంతో తృప్తిగా, హాయిగా ఉండేది. మామయ్యా అంతే. ఇల్లు శుభ్రంగా వుంచుకునేది. కృష్ణప్రసాద్ పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళ వరకూ కూడా ఇంటి బాధ్యత వదల్లేదు. చక్కగా మనవలని, మనవరాళ్ళనీ, మునిమనవలు, మునిమనవరాళ్ళనీ చూసింది. సత్యవతి పిల్లలు శ్రీదేవి, శ్రీలతల పిల్లలను కూడా చూసింది. తన పిల్లలు కూడా వయసులో పెద్దవాళ్ళవటం గమనించింది. మామయ్య పోయాక కొన్నాళ్ళు పిల్లలతో వున్నా, తాను వాళ్ళకెవరికీ భారం కాకూడదని, తనంతట తనే ఒక స్నేహితురాలి ద్వారా ఒక వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడ కూడా అందరితో చాలా స్నేహంగా ఉండేది. వాళ్లందరితో కలిసి మెలిసి ఉంటూ ఊరగాయలు పెట్టించేది. ఆశ్రమంలో వాళ్ళు కూడా అత్తయ్యకి అభిమానులైపోయారు. అత్తయ్య పోయినప్పుడు వాళ్లంతా ఆశ్రమం నుంచి ఒక బస్సులో వచ్చి మరీ అత్తయ్యను చూసారు. అత్తయ్య చివరి మజిలీ కూడా చాలా సునాయాసంగా జరిగిపోయింది. అమెరికాలో వుండే శకుంతల కూడా అనుకోకుండా అప్పుడు దగ్గరే వుంది. అన్నీ అది దగ్గర వుండి చూసుకుంది. ఎంత నిదానంగా, నిశ్శబ్దంగా ఉండేదో, అంతే నిదానంగా, నిశ్శబ్దంగా నిష్క్రమించింది. మామయ్యకి చివరిరోజుల్లో మతిమరపు వస్తే, పక్కనే వుంటూ ఆ లోపం పూరించేది. ఇద్దరూ ఒక్క మాటగా వుండేవాళ్ళు. చివరికి మామయ్య వాళ్ళ రెండో అమ్మాయి నిర్మలకు ఒకసారి కొన్ని మంచి మాటలు అంటూ "సప్త సూత్రాలు" రాసిచ్చాడు. ఆ కాపీ ఒకటి నిర్మల నుంచి నేను తీసుకున్నాను. ఆ మాటలు మా ఇద్దరివీ అంటూ ఇద్దరి సంతకాలూ పెట్టి ఇచ్చాడుట నిర్మలకి. 

నిజంగా ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే. సైలెంట్ గా, సామరస్యంగా వుండే దంపతులు వాళ్ళు. ఇవీ ఈ ఇద్దరి గురించీ నాకు తెలిసిందీ, నేను చెప్పగలిగిందీ, చెప్తున్నదీను.  


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


6, మార్చి 2022, ఆదివారం

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము

ఈ పాట మా అమ్మకు ఎంతో ఇష్టం. మా అమ్మ ఈ పాట పాడితే మా నాన్నకి మరీ ఇష్టం. చక్కగా సన్నగా పాడేది. ఈ పాటంటే మా కందరికీ ఇష్టం, పైగా మా నలుగురికీ ఈ పాట వినంగానే మా అమ్మ గుర్తు వస్తుంది. ఆ మధ్య మా తమ్ముడు వివేక్ ఒకసారి ఈ పాట నేర్చుకుంటూ, "దీని అర్ధం చెప్పవే, అప్పుడైతే, పాటలో భావాలు బాగా పలుకుతాయి" అన్నాడు. అప్పుడు వాడి కోసం రాసిన వివరణ ఇది. మీ అందరి కోసం ఇప్పుడు జ్ఞాపకాలదొంతర బ్లాగ్ లో పెడుతున్నాను.

                      

మేము విజయవాడలో వున్న రోజుల్లో మానాన్న ఏదో పత్రికలో ఫోటో కాంపిటీషన్ కోసం, మా అమ్మని మేడమీదకు తీసుకువెళ్లి, ఈ ఫోటో తీసి, "నారీ-నారికేళం" అనే పేరుతో పంపించాలని అనుకున్నాట్ట. మరి పంపించాడో, లేదో ఎప్పుడూ చెప్పలేదు. ఈ రెండో ఫోటో మా అమ్మ మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు. 

ముందుగా ఆ పాత పాట మీ అందరి కోసం. 

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడెవరే అందగాడెవరే.....అందగాడెవరే మన్మథుండనీ చెలియా మనసు ఘోషించెనే మరలీ వచ్చెదమన్నా మరపురాకున్నాడే //ఆ తోటలో// చంద్రబింబపు ముఖమూ గండుకోకిల స్వరమూ పండూ వెన్నెలలోనే పవ్వాళించేనమ్మా చెలియా, చుక్కల్లా రేడమ్మ సఖియా మరుని శరములు చేత మనసునిలువక నేను మల్లె మొల్ల మొగలి మాలతి మందార మాలికలు వాని మెడలోన వైచినానే మధురామూర్తి మేల్కొని మందహాసము చేయ మకరకర్ణిక మెరిసేనే చెలియా మదివెన్న చిల్కినదే సఖియా

మెరపులోనా నేను మైమరచి వెంటనే
పేరేమిటని వాని ప్రశ్నించినానే
పేరేమిటని వాని ప్రశ్నించినానే

మాయాదేవీ సుతునని మధురామూర్తీ పల్కె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే చెలియా
మది కోర్కె నెరవేరె సఖియా.....

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆ ఆలయములోని అందగాడితడే.....


ఆ తోటలోనొకటి ఆరాధనాలయము    ఒరిజినల్ పాట లింక్  

వివేక్ .... ఆ తోటలోనొకటి         తమ్ముడు పాడిన పాట లింక్ 

ఈ పాటపైన నేను వివేక్ కి రాసిన నా భావం.........   

ఒక  చక్కని  పడుచు తన చెలికత్తెతో చీకటి పడ్డాక ఒక తోటలో మందిరానికి వెళ్ళింది. గుళ్లో దేవుడి కన్నా ఆమెను వెన్నెల్లో నిద్ర పోతున్న (పవ్వళించిన) ఒక అందగాడైన యువకుడు ఆకర్షించాడు.  (తరువాత పాటలో ఆ యువకుడే బుద్ధుడని తెలుస్తుంది) 

ఆతడు మన్మధుడిలాగా ఉన్నాడని తెలిసి మనసు మొత్తుకుంది. వెనుతిరిగి వచ్చేద్దామంటే ఎంతకీ మరిచి పోలేక పోతోంది. 

ఆ తోట లోని ఆ మందిరంలో ఉన్న ఆ అందగాడెవడు అనే ప్రశ్న ఆమెను వదల్లేదు. 

ఆ నిద్రిస్తున్న యువకుని ముఖం చంద్రబింబం వలె ఉంది. స్వరం గండు(మగ)కోకిల వలె ఉంది, అని ఆ పడుచు అనుకుంది. (ఈమెకి ఆతని స్వరం తనకు తరువాత సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వినిపించింది. కానీ ముందే గండు కోకిల స్వరము అన్నాడు కవి. ఇది ఒక దోషమేమో. పోనీ ఇంకెవరితో నైనా మాట్లాడేటప్పుడు విన్నదీ అనుకుంటే, వెన్నెల్లో నిద్ర పోతున్నాడని కూడా ఆ నాయికే అన్నది.) (ఇంకో విషయం......సృష్టిలో సాధారణంగా మగజంతువులు అన్నీ, ఆడజంతువులు వాటిని చూసి మోహించటానికి ప్రత్యేకంగా పింఛమో, జూలో, డోలో, చక్కటి గొంతో ఇలా ఏదో ఒక స్పెషాలిటీ కలిగి ఉంటాయి)

ఆ అందగాడు చక్కటి వెన్నెల్లో, నిద్రపోతున్నాడు.

వాడు చుక్కల్లరేడు, అంటే, చుక్కల్లో చంద్రుడు వలె వున్నాడు, అంటోంది నాయిక తన సఖితో.

మరుని శరము, అంటే, మన్మధ బాణాల తాకిడికి మనసు ఆగక ఆ నాయిక మల్లె, మొల్ల, మొగలి, మాలతి, మందారం పూలతో అల్లిన మాలలు అతని మెడలో వేసింది. దేవుని కోసం అనే మిషతో  తెచ్చిన మాలలని మోహంతో, ఆ యువకుడి మెడలో వేసింది. ఇదో  గడుసుదనం కూడా. లేకపోతే ఎలా మరి. ఆ సుందరుడేమో పడుకునే వున్నాడు, లేవటం లేదు. తన ప్రేమను ప్రకటించటం ఎలా. ఆలయానికి వస్తూ తెచ్చిన సుగంధ పుష్పాల మాలలని ఈతడి మెడలో వేసేసి అతడికి మెలకువ వచ్చేలా చేసింది. 

ఇక్కడో మధురోహ వుంది. ఆ కన్యకు ఎలాగైనా సరే నిద్రిస్తున్న ఈ అందగాడిని లేపి మాటలు కలపాలనీ, తన ప్రేమను వెల్లడించాలనీ వుంది. మన్మథుడేమో ఈ కన్య మీద ఇప్పటికే తన అయిదు పుష్పబాణాలనీ, పద్మము, అశోకము, మామిడిపూత, నవమల్లిక, నల్లకలువ బాణాలనీ  ప్రయోగించేసి వున్నాడు. ఆ బాణాలు ఆ కన్యని సమ్మోహన పరిచేశాయి. అరవిందమశోకంచ, చూతంచ నవమల్లికా, నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చశాయకా. ఈ అయిదు బాణాలూ బ్రహ్మ మన్మథునికి ఇచ్చాడు, బ్రహ్మకి సృష్టి కార్యంలో మన్మథుని సాయం కావాలి కదా మరి. ఈ కన్య దగ్గర ఆ పంచ పుష్పాబాణాలకి  బదులు, దేవుడి కోసం తెచ్చిన వేరే పంచపుష్పాల మాలలు వున్నాయి. వెంటనే చేతిలో వున్న సజ్జలో నుంచి మల్లె, మొల్ల, మొగలి, మాలతీ, మందార పుష్పమాలలు తీసింది. ఆ యువకుడి మేడలో తటాలున తన సమ్మోహన పంచ పుష్ప బాణ మాలలను వేసేసింది. ఆ సుగంధ భరిత స్పర్శకి ఆ అందగాడు లేచి చిరునవ్వు నవ్వాడు.  కన్య కోరిక సిద్ధించింది. 

ఆ పూమాలల స్పర్శకు ఆ మధురమూర్తి లేచి చిరునవ్వు నవ్వాడు. అప్పుడు అతని చెవులకు పెట్టుకున్న మకరకుందనాలు (మకరకర్ణిక......మొసలి ఆకారంలో ఉన్న చెవి దిద్దు) తళుక్కున మెరిసాయి. అది చూసిన నాయికకు మనసులో వెన్న చిలికినట్టు అయ్యింది. మరి మన్మథుడు చేసేది మనోమథనమే కదా.

అప్పుడు ఆ కన్య పరవశంతో ఒళ్ళు మరిచి, అతన్ని వెంటనే నీ పేరేమిటి అని అడిగింది. అతడు వెంటనే నేను మాయాదేవి పుత్రుడిని అని చెప్పాడు. అప్పుడు ఆమెకు, ఈ అందగాడు మాయాదేవీ కుమారుడు సిద్ధార్థుడు అని తెలిసింది. సిద్ధార్థుడు అంటే సిద్ధించిన కోరిక కలవాడు అని అర్ధం. అప్పుడు ఆమె "ఆహా, తనకు దొరికింది సిద్ధార్థుడు" అని ఎంతో ఆనందించింది. 

తన మనసు లోని కోరిక తీరింది అని సంతోషించింది. బహుశా ఈమె ముందు నుంచీ ఇతని గురించి విని, తెలిసి ఇష్టపడి ఉంటుంది. ఈ యువకుడి కోసమే ఆమె రోజూ ఈ ఆలయానికి వచ్చి పోతోందేమో. ఆ సిద్ధార్థుడు ఈమెని ఎప్పుడూ గమనించి ఉండడు. సమయం కోసం ఎదురు చూసి, ఆతడు పవ్వళించి వున్నప్పుడు వచ్చి, మాలలు మేడలో వేసి, మేల్కొలిపి, ఆతడు ఎవరో కనుక్కుని సంతోషపడింది. సిద్ధార్థుడిని వలచిన ఆ పడతికి ఇన్నాళ్ళకి సిద్ధార్థుడు సిద్ధించాడు. ఆహా,  ఈ మనోహరుడు, ఈ మధురమూర్తి, ఈ చుక్కల్లరేడు, ఈ మన్మథుడు నా  సిద్ధార్థుడే అని ఆ పడుచు మహదానంద పడింది. 

ఫైనల్ గా 

ఆ తోటలోని ఆలయం లోని అందగాడు ఇతడే అని ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేసింది. 

ఇక పాటలోని అభిసారిక విషయానికి వస్తే, 

సిద్ధార్ధుని జీవితంలో వచ్చిన స్త్రీలు మాయాదేవి, గౌతమి కాక, భార్య యశోధర, వైశాలి నగర గణిక ఆమ్రపాలి, బుద్ధగయలో పాలు పోసి ప్రాణం నిలబెట్టిన సుజాత అనే కన్య. 

పాట లోని పడుచు ఖచ్చితంగా యశోధర కాదు. యశోధర శుద్ధోధనుడు చేత సిద్ధార్థుని మనసు ఆకట్టుకోటానికి ఎన్నుకోబడిన కోడలు. అది ప్రేమ వివాహంగా ఎక్కడా చెప్పబడలేదు. కనుక ఆ యువతి యశోధర కాదు.    

మాయాదేవి కొడుకుని కని పురిటి లోనే జబ్బు పడి చనిపోయింది. అయినప్పటికీ బుద్ధుణ్ణి మాయాదేవి పుత్రుడు గానే సంఘం లెక్కించింది. తల్లి చనిపోతే అంతఃపుర దాసి గౌతమి పెంచింది. ఆ రోజుల్లో ఇంకా మాతృ స్వామ్యం పోలేదు. పితృ స్వామ్యం అప్పుడప్పుడే వస్తున్న రోజులు. పిల్లలు వారి తల్లుల పేర్ల తోనే గుర్తించబడేవారు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాగా. సిద్ధార్థుడికి పెంపుడు తల్లి పేరు మీద గౌతముడు అనే పేరు కూడా వుంది. 

అది జరిగింది వైశాలిలో కూడా అయి ఉండదు. వైశాలిలో ఆమ్రపాలి అప్పటి రోజుల్లో ఖరీదైన గణిక, అంటే వేశ్య. ఆమ్రపాలి ఉదంతం బుద్ధుని తరువాత అతని శిష్యుల్లో ఒకనితో జరిగింది, బుద్ధుడు, ఆమ్రపాలి సమకాలీకులు కాదు అని కూడా చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఆమ్రపాలి కాలానికి బుద్ధుడు యువకుడు కాదు వృద్ధుడు. 

బహుశా ఈ అమ్మాయి సుజాత కావచ్చు. ఆ గుడి బుద్ధగయలో ఉండి ఉండొచ్చు. సుజాత అయితే కొద్దిరోజులుగా అతన్ని గుడికి వచ్చినప్పుడు గమనిస్తూ ఉందని అనుకోవచ్చు. ఈ సుజాతే ఉపవాసాలతో శుష్కించి, స్పృహ తప్పి పడి వున్న బుద్ధుణ్ణి గమనించి, అతనికి ఆహారం ఇచ్చి చావకుండా రక్షించింది. ఈ సంఘటన వలననే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడే అతడికి, "ఉపవాసాలు, పస్తులు, దేవుణ్ణి (సత్యాన్ని) చూపలేవు", అనే సత్యం బోధపడింది.  అతని జీవితంలో స్త్రీలు కేవలం మాయాదేవి, గౌతమి, యశోధర, ఆమ్రపాలి. కానీ ఆమ్రపాలిని కలుసుకునేసరికి బుద్ధుడు యవ్వనదశని దాటాడు. కనుకనే ఆ పాటలోని పడుచు, సుజాత ఏమో అని అనుకుంటున్నా. 

ఇక ఈ పాట రచన, సంగీతం గురించి........ 

ఇటువంటి అందమైన ప్రేమ భావాలు పలికించేది, సాధారణంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు గార్లు. అందుకే రచయిత వాళ్ళల్లో ఒకరు అని ముందు అనుకున్నా. కానీ తరువాత తెలిసింది, రచయిత సాలూరు సన్యాసిరాజు గారు, సాలూరు రాజేశ్వరరావు గారి తండ్రి. తండ్రి పాటకు కొడుకు సంగీతం సమకూర్చి రావు బాలసరస్వతి గారిచే పాడించాడు. ఆ రోజుల్లో ఈ పాట ఒక గొప్ప హిట్టు. ఈ పాట సరిగ్గా ఏ సంవత్సరంలో రిలీజ్ అయ్యిందో మాత్రం తెలియలేదు. సుమారుగా 1940 లలో అయి ఉండవచ్చు. 

ఈ పాట పాడిన రావు బాల సరస్వతీ దేవి. ఈవిడ చరిత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. నెల్లూరు దగ్గర వెంకటగిరి సంస్థానం జమీందార్ల ఇంట్లో పుట్టిన (రాజ)వెలమ కన్య. వారింట్లో కొంచం ఘోషా ఆచారం తక్కువ. తెలుగు సినిమాల్లో పాడిన మొదటి నేపధ్య గాయని కూడా ఈవిడే. తన ఆరేళ్ళ వయసులో ఫస్ట్ రికార్డింగ్ ఇచ్చిందని అంటారు. కొన్ని సినిమాల్లో వేషాలు కూడా వేసిందిట. అద్భుతమైన అందగత్తె. సుమారు 25, 30 ఏళ్లపాటు సినీ రంగాన్ని తన పాటలతో దున్నేసింది. అందుకే అమ్మావాళ్ళకి ఆవిడ అంటే అంతిష్టం. ఎంతో ఇష్టపడి ఈవిడను, ఈవిడ పాటను మోహించి, నూజివీడు/చల్లపల్లి మహారాజు ఈవిడను పెళ్లాడి అంతఃపురంలో ఉంచేశాడట. అప్పటినుంచి ఆవిడ పాటల్లేవు. ఆ అత్తగారింట్లో విపరీతమైన ఘోషా పధ్ధతి వుంది. 

ఆ భర్త చనిపోయాక, ఒక 10 ఏళ్ల నుంచి సభల్లో, సమావేశాల్లో కనబడుతోంది, వినబడుతోంది. ఇప్పటికీ ఎంతో మధురంగా పాడుతోంది. ఈ వయసులో కూడా ఎంత అందంగా, నాజూగ్గా ఉంటుందో.... ఆవిడ వయసు 90 ఏళ్ల పైనే. పక్కా తెలుగావిడ, ఉత్తరాది మహిళ కాదు. కాకపోతే, రచయిత, మ్యూజిక్  డైరెక్టర్ ఎలా చెప్తే అలా పాడాలి కదా. హిందుస్తానీ బాణీలు కూడా బాగా పాడేది. 

మా వివేక్ కల్పనల పెళ్లి తరువాత 


అమ్మతో మేము ముగ్గురం, సుస్మిత, కింద కొంచెం మా ప్రమోద్ కూడా కనిపిస్తున్నాడు. 

ఇక్కడ బక్క పద్మ,  శ్రీ రాజిత కూడా వున్నారు.  
  

బుద్ధుడు అంటే అమ్మకు ఇష్టం. లుంబిని చూడాలని అనుకుంది. మా నేపాల్ ట్రిప్ లో 
మా అమ్మా, నేనూ, సరిగ్గా బుద్ధుడు పుట్టిన చెట్టు కింద తిన్నె మీద. 
ఈ చెట్టు కొమ్మ పుచ్చుకుని నించుని బుద్ధుణ్ణి మాయాదేవి కన్నదట. 



ఇదీ మా అమ్మ పాట కథ. బుద్ధుడి కథ.


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650