మోహనం మామయ్య - రాజేశ్వరత్తయ్య
మా అమ్మా వాళ్ళ రెండో అన్నయ్య, మోహనం అన్నయ్య, అందరికీ నండూరి రామమోహనరావుగా సుపరిచితుడు. గొప్ప కవి, రచయిత, సంపాదకుడు, పాత్రికేయుడు, పరిశోధకుడు, ఎందరికో ఎన్నింటి లోనో మార్గదర్శి, వూహా విహారి, సౌమ్యుడు, భావుకుడు, అందగాడు, నిదానస్తుడు. ఇలా మా మోహనం మామయ్య గురించి ఎన్నయినా లలితమైన, గంభీరమైన, విశేషణాలు రాయచ్చు. మా మామయ్యది మా అమ్మమ్మ పోలిక. తెల్లగా నాజూగ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి భావుకత ఎక్కువ. ఆలోచన అధికం. వేదాంత పుస్తకాలు చదివీ చదివీ, ఆ వినూత్న ఆలోచనల తోనే, చిన్నవయసులో, అందరినీ వదిలేసి, హిమాలయాల బాట పట్టాడు. శివానందగారి రచనలు చదివి, వారిని కలవాలని, కొన్నాళ్ళు వారి సహచర్యంలో గడపాలని, ఏదో నేర్చుకోవాలన్న తపనతో, ఎవ్వరితో చెప్పకుండా హృషీకేశం వెళ్ళిపోయాడు. అప్పటికే మామయ్యకి పెళ్లి అయ్యింది. స్వయానా తన మేనమామ, కిష్టప్ప మామయ్య పెద్దకూతురు రాజేశ్వరినే పెళ్లాడాడు. అందమైన భార్య, చక్కటి కుటుంబం, తమాషాగా ఇవి ఏవీ కూడా మామయ్యను హృషీకేశం వెళ్లకుండా ఆపలేకపోయాయి. విషయాలు తెలుసుకున్న శివానంద గారు కోప్పడి, మామయ్యను వెనక్కు పంపించారట. అయినా కూడా మామయ్య కొన్నాళ్ళు అక్కడే వుండి, ఆ తరువాత తిరిగి వచ్చాడు. అసలే భావుకుడు, అందునా హిమాలయ పర్వత శ్రేణుల వాతావరణం, ఆ ప్రశాంత ఆశ్రమ పరిసరాలు మామయ్యను ఒక పూర్తి భావకవిగా మార్చాయి. ఆ తరువాత ఎన్నో, ఎన్నెన్నో కవితలు, పాటలు రాసాడు. తాను రాసిన పాటలకు తానే బాణీలు కట్టి పాడుకుంటూ, ఇంట్లో పిల్లలందరికీ కూడా ఆ పాటలు నేర్పేవాడట. మా కుటుంబంలో బహుశా తొలి వాగ్గేయకారుడు మోహనం మామయ్య. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఆ పాటలే ఎప్పుడూ పాడుకుంటూ వుండే వాళ్లమని మా అమ్మ చెప్పింది. అదీ ఎంత విపరీతంగా అంటే, చివరికి మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా మామయ్య రాసిన "విభుడేగుతెంచేటి వేళాయెనే సఖీ....." అని ప్రేమ, విరహ గీతాలు పాడేసేవాళ్ళట. ఇది విని చచ్చే నవ్వేదాన్ని నేను.
మామయ్య ప్రవృత్తి రీత్యా భావకవి అయినా, వృత్తి రీత్యా, జీవనోపాధి కోసం పాత్రికేయుడయ్యి, ఆ తరువాత, ఎంతో గొప్ప సాహిత్యాన్ని, భారతీయ పాశ్చాత్య వేదాంతాన్ని, చివరకు సైన్స్ సాహిత్యాన్ని కూడా విపులంగా రాసి తెలుగువారి అందరికీ పరిచయం చేసాడు. మోహనం మామయ్య రాసే సంపాదకీయాలంటే అప్పటికీ ఇప్పటికీ ఒక గీటురాయి, ఒక ప్రమాణం, ఒక కొలబద్ద. ఎందరో పాత్రికేయులకు అవి నేటికీ మార్గదర్శకాలు. మామయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవాడు. గర్వం అనేది మచ్చుకైనా కనిపించేది కాదు. 'నేను కదా ఇంతంత గొప్ప రచనలు చేసాను' అన్నట్టు ఎప్పుడూ డాబూ, దర్పం, అతిశయం, అహంభావం ప్రకటించలేదు. అమ్మమ్మ, తాతయ్యల పెంపకం నమూనా అది. అన్నదమ్ములందరిలోకీ పెద్ద పేరు తెచ్చుకున్న వాడు, కళాప్రపూర్ణుడు మోహనం మామయ్య. సింపుల్ గా ఉండేవాడు. చక్కటి చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద ఉండేది. ఎవరినీ కోప్పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ వాళ్ళ పిల్లలందరూ ఎందుకో మామయ్యకి, (మేము మా నాన్నకి దగ్గరయ్యినట్టుగా) ఉన్నట్టు నాకు ఎప్పుడూ కనిపించలేదు. మా తరంలో ఆయన్ని బతిమాలి పాటలు పాడించి, విన్న అదృష్టం నాదే. అందరి మేనల్లుళ్లు, మేనకోడళ్లలోనూ, ఆయనతో ఎక్కువ పరిచయం, సాన్నిహిత్యం వున్నది నాకే. ఈ మాట మా మోహనం మామయ్య కూడా స్వయంగా నాతో అన్నాడు. (మా పెద్దమామయ్య పిల్లలకి ఇంకా ఎక్కువ సాన్నిహిత్యం ఉందేమో మరి నాకు తెలియదు. అందుకని నా స్టేట్ మెంట్లో వాళ్ళని మినహాయించి అని చదువుకోవాలి). మామయ్య జీవితంలో సింహభాగం ఎప్పుడూ తన రచనలు, జర్నలిజం ఆక్రమించాయి. ఆయన ఊహావిహారం ఆయనది, ఆయన పరిశోధనా ప్రపంచం ఆయనది, ఆయన సాహితీ వ్యవసాయం ఆయనది, ఆయన కవితా ఘోష ఆయనది, ఆయన భావనాలోకం ఆయనది. ఇల్లు, పిల్లలు రెండో ప్రయారిటీకి వెళ్లిపోయాయి. ఈ భాగం పూరించడానికా అన్నట్టు, దేవుడు ఆయన జీవితం లోకి మా రాజేశ్వరత్తయ్యను పంపించాడు. శివపార్వతులిద్దరూ కలిస్తే పూర్ణం అవుతారు. అలాగే వీళ్ళు కూడా, ఒకళ్ళలో లేని క్వాలిటీస్ ఇంకొకళ్ళలో వుండి ఇద్దరూ కలిసి పూర్ణం అయ్యారు. నాలోని రచయిత్రికి మామయ్య ఇష్టమైతే, నాలోని తల్లికి అత్తయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. అత్తయ్య చాలా సక్సెస్ ఫుల్ తల్లి. పిల్లలని చాలా బాగా పెంచింది.
రాజేశ్వరి అత్తయ్య భలే చక్కనిది, మంచి రంగు, సౌమ్యురాలు. ఎప్పుడూ గొంతు వినపడేదే కాదు. నిదానంగా ఉండేది. మా అమ్మ రాజు వదిన, చిన్నవదిన అనేది. ప్రతి విజయవంతమైన స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడు అంటారు, సుబ్బులక్ష్మికి సదాశివం లాగా. కానీ నేను మాత్రం మామయ్య సాహితీ, పాత్రికేయ విజయాల వెనుక వున్నది అత్తయ్య అంటాను. మామయ్యకి ఇంటి బాధ్యత ఏదీ తగలకుండా చూసుకున్నది అత్తయ్యే. ఇంటి విషయంలో నిష్పూచీగా వున్నాడు కనుకే, మామయ్య అంత గొప్ప సాహిత్యాన్ని చదువరులకి అందించగలిగాడు. పిల్లల పెంపకం, చదువులూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అన్నీ అత్తయ్యే చూసుకునేది. అవసరానికి మామయ్య, అత్తయ్య పక్కన కూర్చుని ఆ సమయానికి ఆ కార్యక్రమం నడిపించేవాడు. మామయ్య రాసుకుంటుంటే ఆయనకి ఏ అంతరాయం, ఆటంకం రాకుండా చూసుకునేది. అందుకేనేమో, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆయన గదిలోకి వెళ్లి ఎవరూ ఆయన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. పిల్లలందరినీ తన లాగా సౌమ్యంగా పెంచింది. అయిదుగురు పిల్లలూ నిదానస్తులే. అందరికీ అత్తయ్య, మామయ్యల అందం వచ్చింది. మా కుటుంబంలో అందరి కన్నా వీళ్ళు చక్కని అందమైన పిల్లలు అనే పేరుండేది. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.
రాజేశ్వరి అత్తయ్య, మీనాక్షి పిన్ని, లలిత పిన్ని సీతామ్మతో అత్తయ్య
ఇక్కడ అత్తయ్య సమర్ధత, చాకచక్యం, తెలివితేటలు, ధైర్యం గురించి చెప్పాలి. ద్రోణంరాజు కృష్ణమూర్తి గారి అమ్మాయి. చిన్నప్పుడే తల్లి పోతే, వాళ్ళ బామ్మ పెంపకంలో విస్సన్నపేట లోనే పెరిగింది. ఆ రోజుల్లోని వానాకాలం పల్లెటూరి చదువు. మా అమ్మమ్మ అన్నయ్య కూతురు. చిన్నప్పుడు పెళ్లి అనుకునే రోజుల్లో, కట్నం ఇస్తే గానీ పెళ్లి కాదు అనుకుంటున్నప్పుడు, ధైర్యంగా అంత చిన్నపిల్ల కూడా "ఎలాగూ కట్నం ఇస్తున్నారు కనుక, బావనే చేసుకుంటాను" అని చెప్పిందట. అలా పెళ్లి కుదిరిందిట వాళ్లకి. అత్తయ్యే ఒకసారి ఈ విషయం చెప్పింది. పెళ్లి అయిన తరువాత కొద్ది రోజులకే, మామయ్య శివానంద ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అల్లుడు ఇలా వెళ్లిపోయాడన్న బెంగతో అత్తయ్యా వాళ్ళ నాన్న చనిపోయారుట. "నాకిప్పుడు అమ్మానాన్నా ఇద్దరూ లేరు, మీరు కాకపోతే నన్ను ఇంకెవరు చూస్తారు" అంటూ వాళ్ళ బామ్మ ప్రోద్బలంతో మామయ్యకి ఉత్తరం రాసిందట. దాంతో మామయ్యకి తన బాధ్యతలు, బంధాలు గుర్తొచ్చి తిరిగి వచ్చాడు కాబోలు. మొత్తానికి తన సమస్య చక్కగా, ధైర్యంగా, మర్యాదగా సాల్వ్ చేసుకుంది. ఈ మామయ్యా అత్తయ్యా ఇద్దరూ చూడచక్కని జంటలా కలిసి మెలిసి ఉండేవారు. మామయ్యా ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్తే, ఏ తోడూ లేకపోయినా, మామయ్యుంటే చాలు అన్నట్టుగా ధైర్యంగా ఆయనతో వెళ్లి, భాష తెలియని వూళ్ళో కూడా హాయిగా వుంది.
అత్తయ్య తానే పూనుకుని పిల్లలందరి పెళ్లిళ్లూ కుదిర్చింది. అందరితో మంచిగా ఉంటూ తనకు కావలసిన పని చేయించుకునేది. చక్కగా నవ్వుతూ మాట్లాడేది. మల్లెపూవులా ఉండేది. చీర కానీ, జుట్టు కానీ నలగనిచ్చేది కాదు. చక్కగా లక్ష్మీకళతో ఉండేది. ఎప్పుడూ, ఎవరితోనూ ఘర్షణ పడ్డట్టు నేను ఎప్పుడూ చూడలా. సన్నగా మాట్లాడేది. గొంతు పెద్దది చేయటం కూడా నేను ఎప్పుడూ వినలా. కృష్ణప్రసాద్, సత్యవతి, నిర్మల, శకుంతల, ఫణి అందరినీ సమానంగా చూసుకునేది. తన భర్త ఎంత గొప్పవాడో తెలిసినా, ఏనాడూ గర్వం చూపేది కాదు. మామయ్యకే లేని హెచ్చులు తనకెందుకు అన్నట్టు ఉండేది. ఉన్నదాంతో తృప్తిగా, హాయిగా ఉండేది. మామయ్యా అంతే. ఇల్లు శుభ్రంగా వుంచుకునేది. కృష్ణప్రసాద్ పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళ వరకూ కూడా ఇంటి బాధ్యత వదల్లేదు. చక్కగా మనవలని, మనవరాళ్ళనీ, మునిమనవలు, మునిమనవరాళ్ళనీ చూసింది. సత్యవతి పిల్లలు శ్రీదేవి, శ్రీలతల పిల్లలను కూడా చూసింది. తన పిల్లలు కూడా వయసులో పెద్దవాళ్ళవటం గమనించింది. మామయ్య పోయాక కొన్నాళ్ళు పిల్లలతో వున్నా, తాను వాళ్ళకెవరికీ భారం కాకూడదని, తనంతట తనే ఒక స్నేహితురాలి ద్వారా ఒక వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడ కూడా అందరితో చాలా స్నేహంగా ఉండేది. వాళ్లందరితో కలిసి మెలిసి ఉంటూ ఊరగాయలు పెట్టించేది. ఆశ్రమంలో వాళ్ళు కూడా అత్తయ్యకి అభిమానులైపోయారు. అత్తయ్య పోయినప్పుడు వాళ్లంతా ఆశ్రమం నుంచి ఒక బస్సులో వచ్చి మరీ అత్తయ్యను చూసారు. అత్తయ్య చివరి మజిలీ కూడా చాలా సునాయాసంగా జరిగిపోయింది. అమెరికాలో వుండే శకుంతల కూడా అనుకోకుండా అప్పుడు దగ్గరే వుంది. అన్నీ అది దగ్గర వుండి చూసుకుంది. ఎంత నిదానంగా, నిశ్శబ్దంగా ఉండేదో, అంతే నిదానంగా, నిశ్శబ్దంగా నిష్క్రమించింది. మామయ్యకి చివరిరోజుల్లో మతిమరపు వస్తే, పక్కనే వుంటూ ఆ లోపం పూరించేది. ఇద్దరూ ఒక్క మాటగా వుండేవాళ్ళు. చివరికి మామయ్య వాళ్ళ రెండో అమ్మాయి నిర్మలకు ఒకసారి కొన్ని మంచి మాటలు అంటూ "సప్త సూత్రాలు" రాసిచ్చాడు. ఆ కాపీ ఒకటి నిర్మల నుంచి నేను తీసుకున్నాను. ఆ మాటలు మా ఇద్దరివీ అంటూ ఇద్దరి సంతకాలూ పెట్టి ఇచ్చాడుట నిర్మలకి.
నిజంగా ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే. సైలెంట్ గా, సామరస్యంగా వుండే దంపతులు వాళ్ళు. ఇవీ ఈ ఇద్దరి గురించీ నాకు తెలిసిందీ, నేను చెప్పగలిగిందీ, చెప్తున్నదీను.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి