బామ్మా-బత్తాయికాయలూ
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఎలా వచ్చిందో తెలియదు కానీ, బామ్మ కి బత్తాయి కాయలు వలుచుకుని తింటే, లేదా జ్యూస్ చేసుకుని పంచదార వేసుకుని తాగితే బోల్డు బలం వస్తుందని ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఎవరి దగ్గరున్నా సరే, తన డబ్బులే ఇచ్చి బత్తాయికాయలు తెప్పించుకునేది. ఇప్పుడు బత్తాయికాయల బామ్మ గురించి చెప్తా. మా నాన్నని పిలిచి చెంగు ముడి లోంచి అర్ధరూపాయి తీసిచ్చి, " రాంకిష్ణా, నీరసంగా వుంటోందిరా, ఓ డజను బత్తాయికాయలు తెప్పించి పెట్టరా, రసం తీసుకు తాగుతాను." అనేది. నాన్నేమో, ఎందుకే, నేను తెప్పిస్తాగా, అనేవాడు. బామ్మ కయ్యిమనేది. " ఆ... నా బత్తాయిలు నేను కొనుక్కోలేనా, నా డబ్బు నాకుంది రోయ్, నేనేం ఎవరిమీదా బరువుగా ఉండను" అనేది. ఇంకా నాన్న ఈవిడతో గొడవెందుకులే అని ఆ అర్ధరూపాయి తీసుకుని, తెప్పిస్తాలే, అనేవాడు.
అసలు బత్తాయికాయల ధర చాలా ఎక్కువే. అర్ధరూపాయికి డజను కాయలు కాదు కదా, అరడజను కూడా రావు. కానీ పాపం ఏ కొడుకూ ఆవిడకి ఆ విషయం చెప్పేవాడు కాదు. ఆవిడ డబ్బుతోనే ఆవిడ పళ్ళు కొనుక్కుంటోందని అనుకోనీ అని వూరుకునేవారు. మొత్తానికి బామ్మ చేతిలోకి డజను బత్తాయికాయల సంచీ సాయంత్రం లోపల వచ్చేసేది. అవి రాంగానే, నన్నో, అమ్మనో పిలిచి, రసం తీయవే, అనేది. మళ్ళీ అనుమానం, మేము వాటిల్లో నీళ్లు కలిపేస్తామేమో అని. దాంతో పక్కనే కూర్చునేది. కొంచం రసం తీయగానే టేస్ట్ చేసేది, పంచదార వెయ్యాలో వద్దో తేల్చేయటానికి. మొత్తానికి ఇదంతా ఓ పెద్ద పని. కాయలు కడగాలి, తుడవాలి, కత్తిపీటతో అన్నీ సగానికి కోయాలి. పళ్ళనుంచి రసం తీయటానికి ఓ స్టీలు పరికరం ఉండేది మా ఇంట్లో. దాని మీద ఈ కోసిన పళ్ళ సగభాగాలని పెట్టి నొక్కి తిప్పుతూ, రసం అంతా పిండేవాళ్ళం. గింజలు, తొనల మీద తొక్కలు, పక్కన పడేసి, ఆ రసం ఓ గ్లాసులో పోసి బామ్మకి ఇచ్చేవాళ్ళం. ఆవిడ అడిగితే, పంచదార అదనం. అది తాగాక ఆవిడకి శారీరకంగా బోల్డు ఎనర్జీ వచ్చేసిందని మానసికంగా బాగా నమ్మేసేది. ఆ రసం ఇలా గొంతు దిగంగానే, అలా శక్తి వచ్చేసినట్టు పీట మీంచి ధీమాగా లేచేది. ఇవన్నీ చూసి మా అమ్మకి నవ్వు వచ్చేది. అల్లాంటప్పుడు 'నువ్వు రసం తీసివ్వవే', అని తాను తప్పుకునేది. మొత్తానికి మా బామ్మకి ఆ బత్తాయికాయల రసం ద్వారా నీరసం తగ్గి, మళ్ళీ ఉత్సాహంగా ఉండేది. చుట్టూ మమ్మల్ని కూర్చోపెట్టుకుని చక్కగా భజనలు చేయించేది. 'తారక మంత్రము కోరిన దొరకేను, ధన్యుడనైతిని ఓరన్నా', అనో, లేకపోతే 'తక్కువేమి మనకూ రాముండొక్కరుండు వరకూ' అంటూ పాటలు నేర్పేది. పద్యాలు చెప్పేది. ఎవరైనా, పో బామ్మా, అన్నీ బోరు, అంటే, " నా సంగతి మీకు తెలియటం లేదు. చక్కగా పద్యాలు, పాటలు నేర్చుకోండే, అంటే బుర్రకెక్కటం లేదు. ఎంతైనా నా ఇల్లు కాదు కదా, అందుకే నామాట లెక్క చేయటం లేదు" అంటూ ఎప్పుడూ ఓ పద్యం కోట్ చేసేది. "కొండ అద్దమందు కొంచమై ఉండదా" అనేది. ఈ పద్యం మాత్రం బామ్మ ధర్మమా అని మా మనవరాళ్లందరికీ నోటికొచ్చేసింది. ఏ కజిన్ ని అడిగినా, బామ్మ ఇలా అంటుంది కదా, అని నవ్వుకునే వాళ్ళం.
ఒక విషయం మాత్రం నిజ్జంగా నిజం. ఆవిడ విశ్వరూపం వేరు. ఆవిడ నిజంగానే కొండే. ఆవిడ 1972 లోపోయింది. 1954 లో మావూరు ఆరుగొలను వదిలేసింది. ఆ తరువాత మహా వెళితే, ఓ అయిదు, ఆరు సార్లు వెళ్ళిందేమో పాపం అంతే. అదీ కంచి చంద్రశేఖరేంద్రసరస్వతీస్వామి మా ఇంటికి వస్తున్నారంటే, అప్పుడు మాత్రం వరసగా ఓ రెణ్నెళ్ళుంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఆరుగొలను మేము 2018 లో వెళ్ళినప్పుడు, నేను వియ్యమ్మగారి (ఆవిడని ఆ వూళ్ళో వాళ్ళు వియ్యమ్మగారనే అనేవారు) మనవరాలినని చెప్పంగానే, చాలామందే వచ్చి, ఆసక్తిగా ఆనాటి కబుర్లు, ఆవిడ పురాణ పఠనం, శ్రవణం, పొలం పనులు చేయించటం, ఆవిడ మడీ, ఆచారం ఇలా బోల్డు చెప్పి ఆవిడను తలచుకున్నారు. అంత పాపులర్ ఆవిడ అక్కడ. మా బామ్మ విశ్వరూపం, పది, పదహారు చేతుల్తో ఆవిడ ఒక్కత్తీ అన్ని పనులూ ఎలా సమర్ధవంతంగా చేసేదో, మరోసారి చెప్పుకుందాం.
సరే, మళ్ళీ మన బత్తాయికాయలకి వచ్చేద్దాం. బత్తాయికాయలు చూడంగానే ఆవిడకి ఆ శక్తి వచ్చేసేది. కూర్చోబెట్టి రామదాసు కీర్తనలు, సుమతీ శతక పద్యాలు, వేమన పద్యాలు, కుమారీ శతకం, కుమార శతకం, మొదలైన పద్యాలు చక్కగా చెప్పేది. బోల్డు తెలుగు సామెతలు చెప్పేది. సందర్భాన్ని బట్టి, భలే పద్యాలు, సామెతలు కోట్ చేసేది. 'అనువుగాని చోట అధికులమనరాదు', 'కొండ అద్దమందు కొంచెమై ఉండదా', 'కాకిపిల్ల కాకికి ముద్దు', 'పెద్దలమాట చద్దన్నం మూట' ఇలా ఎన్నో, ఎన్నెన్నో. నేనెప్పుడైనా, మాట వినకపోతే, మా అమ్మని వేలెట్టి చూపిస్తూ, కుమారీ శతకం నుంచి, "కూతురు చెడుగైన మాత తప్పు" అని ఎత్తిపొడుస్తూ ఉండేది. మా అమ్మకి కోపం వచ్చి, 'ఆ.... దానిది మీ పెంపకమే, ఆ కితాబులన్నీ మీకే', అనేది. ఇలాంటివి ఎప్పుడూ ఉండేవి. అలాగని, ఎప్పుడూ వాతావరణం బిట్టర్ గా ఉండేది కాదు. మా నాన్న అన్నట్టు, ఈ ఇద్దరూ నండూరి వారి ఆడపడుచులే. రేడియో నండూరి సుబ్బారావుగారు, మా బామ్మకి సొంత మేనల్లుడు, మా అమ్మావాళ్ళ నాన్నకి కజిన్, మా అమ్మకి బాబాయి. ఆయన రేడియోలో వుద్యోగం రాక ముందు వాళ్ళ వూళ్ళో ఒక వీధి బడి నిర్వహించేవాట్ట. మా అమ్మ సుబ్బారావు తాతయ్యకి స్టూడెంట్ కూడా.
ఓసారి, మా నౌకరు ఒకతను కొత్తవాడు, అర్ధ రూపాయి తీసుకుని డజను బత్తాయికాయలు రావమ్మా, అనేశాడు. ఆవిడకి ఇన్నాళ్లూ నిజం తెలిసినా, తెలియనట్టు గడుసుగా ఉండేది. ఆవిడ పిల్లలు కూడా దాన్ని అలాగే సాగనిచ్చారు. ఇప్పుడు ఈ పనివాడు, కుండ బద్దలు కొట్టేసాడు ఓపెన్ గా. దాంతో మా బామ్మకి అభిమానం పొడుచుకొచ్చింది. ఆ, వీడు నా దగ్గర డబ్బు లేదని నన్ను అన్నాడు, అని కోపం వచ్చేసింది. నన్ను పిలిచి, ఓ వుత్తరం రాయవే, అన్నది. నాకు అర్ధం అయిపోయేది. ఇటువంటి సందర్భాల్లో, ఆవిడ వుత్తరం రాసిందంటే, ఒక్కరికే. ఆయన పేరు, తుమ్మలపల్లి లక్ష్మీకాంతారావుగారు. బంధుత్వం రీత్యా, మా బామ్మకి మేనల్లుడు వరస. ఆయన బామ్మని అత్తయ్యా, అనేవాడు. మా బామ్మ వూరు వదిలేసి వస్తూ, ఆయనకు తన స్థలంలో ఓ పాక వేసుకునే పర్మిషన్ ఇచ్చింది. దానికోసం ఆయన దగ్గర సంవత్సరానికి ఓ పదో, పాతికో అద్దె తీసుకునేది. పాపం, ఆయన చాలా పేద బ్రాహ్మడు. బామ్మకి, ఆ అద్దె కూడా సమయానికి పంపించలేక పోయేవాడు. మా బామ్మకి డబ్బు అవసరాలు వచ్చినప్పుడు ఈ కాంతారావు గారు గుర్తు వచ్చేవాడు. "వెధవ, నా డబ్బు ఎగ్గొడుతున్నాడు. దిక్కూ, దివాణం లేకపోతే ఆ స్థలంలో పాక వేసుకోమన్నా, నా అద్దె పంపించమని వుత్తరం రాయి." అనేది. ఈ విషయంలో చాలా బాధాకరంగా ఉండేది నాకెప్పుడూ. కాంతారావు గారేమో, ఆ కొద్ది అద్దె కూడా పంపించలేని పేదవాడు. బామ్మకేమో, ఆ కొద్ది అద్దె కూడా తీసుకోకపోతే, ఆ ఆస్తి మీద హక్కు పోతుందేమో అని భయం. బామ్మకి డబ్బు అవసరం అసలు రాకుండా చూసుకునే వాళ్ళు నాన్నా, మిగిలిన కొడుకులూ. ఐనా ఎప్పుడో ఏడాదికోసారి ఏదో సమయంలో బామ్మకి ఈ అద్దె బాకీ గుర్తొచ్చేది. ఆయన ఎప్పుడో ఒకసారి ఓ పదో, ఇరవయ్యో పంపించేవాడు. వాటిల్లోంచే ఆవిడ అర్ధరూపాయి తో డజను బత్తాయికాయలు, ఫోర్హాన్స్ టూత్ పేస్ట్, పటిక బెల్లం, లవంగాలు, ఖర్జూరాలూ వగైరా కొనుక్కుంటూ ఉండేది. మా బామ్మకి 10 పైసలకి గుప్పెడు లవంగాలు, దోసెడు పటికబెల్లం వచ్చేవి, లేదా వచ్చేలా చేయబడేది. ఇదీ కాంతారావు గారి కథా కమామీషూ.
ఇక తప్పదు, అనుకున్నప్పుడు ఓ పోస్ట్ కార్డు తీసుకుని కూర్చునేదాన్ని. బామ్మ ముందరే 'ఒరేయ్ కాంతాయ్,' అని మొదలెట్టేది. బామ్మా, ఆయన పెద్దవాడు, నేనెలా ఆయన్ని ఒరేయ్ కాంతాయ్, అంటాను, తప్పు కాదా, కనీసం కాంతారావు గారికి అని రాస్తాను, అంటే ఒప్పుకునేది కాదు. పైగా, కింద సంతకం పెట్టేది నేను కదా, నేనెందుకు వాడిని కాంతారావు గారికి అని రాస్తాను, నేను వాడిని కాంతాయ్ అనే పిలుస్తా, అలాగే రాయి, అని లాజిక్కు మాట్లాడేది. "అమ్మ బామ్మా, నీ బుర్రే బుర్ర" అనుకుని చచ్చినట్టు ఒరేయ్ కాంతాయ్ అనే రాసేదాన్ని. పాపము శమించుగాక, అలా సంబోధిస్తూ నేను ఆయనకి కనీసం ఓ పది, పదిహేను ఉత్తరాలైనా రాసి ఉంటా. ఇలాంటి ఉత్తరాలు రెండో మూడో రాసాక, ఆయన ఓ పదో, ఇరవైయ్యో పంపించేవాడు. ఈ మధ్య 2018 జనవరిలో కలుసుకున్నప్పటికి, ఆయన 105 ఏళ్ళ వృద్ధుడు. అయినా ఆయన ఏమీ మర్చిపోలేదు, నన్ను చూసి, రాంకృష్టుడు, లీల కూతురువా, అని బోల్డంత ముచ్చట పడ్డాడు. కూతురూ, మనవడూ దగ్గర వున్నాడు. దాదాపు అరగంట సేపు తన చిన్నప్పటి కబుర్లు, ముఖ్యంగా మా హరి పెదనాన్నతో కలిసి ఎలా తోటలూ, దొడ్లూ తిరిగేవాడో, ఇద్దరూ కలిసి బామ్మకి ఎలా ఠస్సా కొట్టేవారో చెప్పాడు. అలాగే తానూ సొంత ఇల్లు కట్టుకోలేకపోవటం చేత యెంత ఇబ్బంది, అవమానం పడ్డాడో చెప్పాడు. నాకు చాలా బాధ వేసింది. ఏమీ చెయ్యలేని తనం వల్ల కొంచెం సిగ్గేసింది. 'అందరికీ ఏమున్నా, లేకున్నా చారెడంత అయినా సొంత ఇల్లు వుండాలమ్మా' అన్నాడు. మేము కలిసిన ఒక ఏడాది తరువాత ఆయన చనిపోయాడని తెలిసి బాధ పడ్డాను. ఆస్తి పోతుందేమో అని బామ్మ నిస్సహాయత, ఆ అద్దె కట్టలేక కాంతారావు గారి నిస్సహాయత, బామ్మ అడిగినప్పుడు వుత్తరం రాయకుండా ఉండలేని నా నిస్సహాయత ఇదీ జరిగిన సత్యం.
మొత్తానికి మా బామ్మ బత్తాయి కాయలు ఒక్కోసారి ఇలా కూడా ఇబ్బందిగా పరిణమించేవి. ఇవన్నీ చూసి మా అమ్మ విసుక్కునేది, 'ఇప్పుడు ఈవిడకి ఏం తక్కువ అయ్యిందీ' అని. మా నాన్న ఆ కొత్త నౌకరుని కేకలేసేవాడు. కాకపోతే, ఏ కొడుకు ఇంట్లో వున్నా, మా బామ్మకి అన్నీ మహా దివ్యంగా జరిగిపోయేవి. అది బామ్మకీ తెలుసు. ఎంతైనా ఆవిడ రాజమాత, మా నాన్నేమో చక్రవర్తి, మరి నేనంటారా, ఇంకేముంది, రాజకుమార్తెని.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి