నాన్నా - స్వామీజీలతో సాన్నిహిత్యం
భట్టిప్రోలు విజయలక్ష్మి
మా నాన్న తెనాలి వచ్చేదాకా మనిషి వేరు. తెనాలి వచ్చాక మారిపోయాడు. అప్పటి వరకూ స్వామీజీలు, పీఠాధిపతులూ, సన్యాసులూ వీరికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. తెనాలి వచ్చాక వీళ్ళందరూ మా దైనందిన జీవితంలో దాదాపు ఒక భాగమై పోయారు. త్రివిక్రమ రామానంద భారతీ స్వామి అప్పట్లో కుర్తాళం పీఠానికి అధిపతి. వారు ముందరే మా కుటుంబానికి పరిచయం ఉన్నందున, ఒకసారి తన పీఠంతో సహా మా ఇంటికి తెనాలి వచ్చారు. మా ఇంటి వసారాలోనే (అది చాలా పెద్దది) పీఠం పెట్టారు. అక్కడ నిత్యపూజలు జరిగేవి. స్వామివార్లందరినీ స్వాములవారు లేదా స్వాములారు అనేవాళ్ళం. నాకు రాయటానికి సహజంగా ఉండాలంటే, నాకు ఇలా అనటమే సౌకర్యంగా ఉంటుంది. ఇకనుంచీ ప్రతి స్వామీజీని స్వాములవారు అనే ఉదహరిస్తా. ఈ కుర్తాళం స్వాములవారు రోజూ సాయంత్రం వేళల్లో ఇంట్లో కానీ, మా నాన్న హెడ్ మాస్టర్ గా ఉన్న స్కూల్లో కానీ ప్రవచనాలు ఇచ్చేవారు.
ఉదయం వేళల్లో మా ఇంటికి పీఠం నుంచి తీర్ధ ప్రసాదాలు తీసుకోవటానికి చాలామంది ప్రవాహంగా వచ్చేవారు. వాళ్లంతా స్వాములవారి కోసం పళ్ళూ పూలూ లాంటివి చాలా తెచ్చేవాళ్ళు. వాటినన్నింటినీ ఆయన తిరిగి ఆ భక్తులకే ప్రసాదం లాగా ఇచ్చేసేవారు. ఈ రోజుల్లో ఉన్న కొందరు దొంగ స్వాములకు, ఆ రోజుల్లోని అసలు స్వాములకీ అదే తేడా. ఏ రోజు భక్తులు ఇచ్చినవి ఆ రోజే అందరికీ పంచిపెట్టేసేవారు. మా ఇంట్లో మా అమ్మ మడి కట్టుకుని స్వాములవారు కోసం శ్రద్ధగా వంట చేసేది. ఆ భోజనం స్వాములవారు తినేవారు. కానీ ఎక్కువ రోజులు ఎవరింటికైనా బిక్షకి వెళ్లేవారు. రాత్రుళ్ళు ఎప్పుడూ అల్పాహారమే లేదా ఫలాహారం, అంతే. వీరికోసం మా ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది కేటాయించేవాళ్ళం. భక్తులు ఎవరైనా వచ్చినా, వారు వసారాలో నుంచే డైరెక్టుగా స్వామివారి గదికి వెళ్లే సౌకర్యం ఉండేది. అందువల్ల మా ఇంట్లో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఇల్లు అంత సౌకర్యంగా ఉండేది.
ఆ రోజుల్లోనే తెనాలిలో అఖిల భారత సాధు పరిషత్ వాళ్ళ సమ్మేళనం జరిగింది. మా స్కూల్ సెలవుల్లోనే ఆ సమ్మేళనం జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. దానికి వచ్చిన సాధు సన్యాసులందరికీ స్కూల్లో గదులే వసతిగా ఇచ్చారు. సుమారు వెయ్యి మంది సన్యాసులు అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చారని చెప్పుకునే వారు. ఆ స్కూల్ మేనేజిమెంట్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా స్కూల్ ని ఇచ్చేవాళ్ళు. పైగా నాన్న వల్ల స్కూల్ కి ఇంతమంది గొప్పవాళ్ళు వచ్చారని చాలా ఆనంద పడేవాళ్ళు. స్కూల్ సెలవుల్లోనే ఆ కార్యక్రమాలు జరిగేవి కనుక ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండేది కాదు. స్వామికార్యం, స్వకార్యం అంటే, ఇదేనేమో. ఆ అఖిల భారత సాధు సమ్మేళనం సుమారు పది రోజుల పాటు సాగింది. అప్పుడు మా లాంటి వారందరికీ వాళ్ళు నిత్యం చెప్పే ఓ శాంతి మంత్రం బాగా నచ్చి అలవాటు చేసుకున్నాం. ఆ ప్రార్ధన ఇన్నేళ్లయినా నేను మర్చిపోలేదు. ఇప్పటికీ అది అనుకుంటూనే ఉంటాను. ఆ ప్రార్ధనా శ్లోకం ఇదే.
ఆ సాధు పరిషత్ సమావేశాలప్పుడే ఒక యువ స్వామి, స్వామీ సదానంద సరస్వతి అందరి దృష్టినీ తన అద్భుతమైన ఉపన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఈయన దయానంద సరస్వతి ఆశ్రమంలో ఆయన దగ్గర శిక్షణ పొందారుట. ఆయన కేరళీయుడు. తెలుగు రాదు. ఇంగ్లీష్ లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆ ఇంగ్లీష్ యెంత సులభంగా ఉండేదంటే, ఆయన ఉపన్యాసం అనువాదం లేకుండానే అందరికీ అర్ధం అయిపోయేది. ఆయన్ని ఇంగ్లీష్ స్వామి, ఇంగ్లీష్ స్వాములవారు అనేవారు. అందరూ ఆయన ఉపన్యాసాలని ఇష్టంగా వినేవారు. ఆయనకీ అభిమానులెక్కువై పోయారు. సాధుపరిషత్ వాళ్ళ సమ్మేళనం అయిపోయాక కూడా ఆయనని భక్తులందరూ రిక్వెస్ట్ చేసి తెనాలిలోనే ఉంచేశారు. ఆయనతో పాటు, ఇన్నిరోజులూ ఆయన సహాయకుడిగా ఉన్న ఒక తెలుగు స్వామి, (ఆయన్ని అందరూ కోమటిస్వామి అనేవారు) కూడా ఆయనతో పాటే ఉండిపోయారు.
స్కూళ్ళు తెరిచేయటంతో, ఆ భక్తులందరి రిక్వెస్ట్ మీద, మా నాన్న ఆ స్వాములిద్దరికీ మాఇంట్లో గది ఇచ్చేసారు. వీరికి పీఠం లేదు కానీ వారి పంచాయతనం వారికి ఉండేది. భోజనం యధావిధిగా ఎవరు భిక్షకి పిలిస్తే, వారింటికి, లేకపోతే మా ఇంట్లోనే. నివాసం మాత్రం పూర్తిగా మా ఇంట్లోనే. ఆ రోజుల్లోనే మా పిల్లలందరితో ఆయన భజనలు చేయించేవారు. అంతే కాక, మా పిల్లలందరికీ సరస్వతీ మంత్రం ఉపదేశించారు. మాకందరికీ చదువులు బాగా రావాలని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచీ అందరం రోజూ కరమాలతో సరస్వతీ జపం చేసుకునేవాళ్ళం. నాకూ, పక్కింటి దుర్గకీ సరస్వతీదేవిదే మరొక మంత్రం పూర్తిగా బీజాక్షరాలతో ఉండే మంత్రం ఇచ్చి జపం చేసుకోమన్నారు. ఆ పైన నేను నా ఇష్ట దైవం రాముడు అని చెప్పి రామ మంత్రం కూడా ఇవ్వమని అడిగాను. నాకు ఆ మంత్రం కూడా ఉపదేశం ఇచ్చారు. రెండో సరస్వతీ మంత్రం చేస్తే, మొదటిది చెయ్యక్కర్లేదని అనుమతి కూడా ఇచ్చారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఆ రెండు మంత్రాలూ జపం చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యనే బదరీనాథ్ లో కామధేనువు చెవిలో కొన్ని మంత్రాలు చెప్పి వదిలేసాను. అయినా మననం మాత్రం జరుగుతూనే ఉంది. మననాత్ త్రాయతే ఇతి మంత్రః కదా. మననం చేస్తూ ఉంటే మంత్రం రక్షిస్తుందని భావం.

ఈ ప్రభావంతో ఆ రోజుల్లోనే మా స్కూల్లో సంస్కృతం తెలిసిన టీచర్లందరూ కలిసి విద్యార్థులందరికీ ఎవరికైనా సంస్కృత కావ్యాలు, భగవద్గీత చదువు కోవాలనిపిస్తే, స్కూల్ అయిపోయాక, ఒక ఎక్స్ట్రా పీరియడ్ లో సంస్కృతం చదివిస్తామని చెప్పారు. మా నాన్న నన్నూ, మా పెద్ద చెల్లెలు భారతినీ కూడా ఆ ఎక్స్ట్రా క్లాస్ కి పంపించారు. అప్పటికే మా ఇద్దరికీ కూడా సంస్కృతం ఒక సబ్జెక్ట్ గా ఉండేది. ఆ రోజుల్లో ముందుగా ధాతువులు, శబ్దమంజరి, అమరకోశం, కొంచెం చెప్పి, భగవద్గీత, రఘువంశం మొదలుపెట్టారు. ఆరోజుల్లో నేర్చుకున్న శ్లోకాలు "వాగర్ధావివ సంపృక్తౌ..", "ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వద్ధమ్ ప్రాహురవ్యయమ్...." ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. భగవద్గీతలో ముందుగా పురుషోత్తమప్రాప్తి యోగం మొదలుపెట్టారు. ఒక మూడు, నాలుగు నెలలు జరిగాక, ఆ క్లాసు లెందుకో ఆగిపోయాయి. ఇంగ్లీష్ స్వాములవారు కొన్నాళ్ల తరువాత వెళ్లిపోయారు కానీ, మళ్ళీ కొద్ది నెలల తరువాత భక్తుల కోరిక మేరకు తిరిగి వచ్చారు. రెండోసారి, మాకు ఎందుకో మా ఇంట్లోనే ఉండి చదువుకునే బంధువులు ఇద్దరుండటంతో ఆ గది ఖాళీ లేకపోయింది. అప్పుడు నాన్నే, మా ఇంటి ఓనర్ కృష్ణ ప్రసాద్ గారిని అడిగి, వాళ్ళ వాటాలో మేడమీద ఓ గది స్వామీజీకి ఇప్పించారు. అప్పుడు కూడా చాలా రోజులున్నారు. ఆ రోజుల్లో ఆయన నాకో అసైన్మెంట్ ఇచ్చి రోజూ కనీసం భగవద్గీతలో నుంచి పది శ్లోకాలని అప్పచెప్పాలని ఆదేశించారు. రోజూ ఓ పది శ్లోకాలని బట్టీ పట్టటం, వెంటనే అవి పైకి మేడ మీదకి వెళ్లి స్వాములవారుకి అప్పచెప్పటం, ఇదే పని. అలా ఆయన ఉన్నంతకాలం జరిగింది. అలా నాకే గీత అంటే ఎక్కువగా ఏమీ తెలియని వయసులో భగవద్గీత పఠనం మొదలయ్యింది. నాన్నకీ, అమ్మకీ కూడా ఇంగ్లీష్ స్వామీజీ మంత్రాలు ఇచ్చారు. మా అమ్మ చాలాకాలం ఆ జపం చేసేది. నాన్న మాత్రం కొద్ది రోజులకే వదిలేశారు. ఈ ఇంగ్లీష్ స్వామీజీ నాలుగేళ్లు వరుసగా వచ్చి హైందవ ప్రచారం చేశారు. ఈయన ధర్మమా అని మాకు సంస్కృతం, ఇంగ్లీష్ రెండూ కాస్త కాస్త వచ్చాయి.

ఈసారి ఇంగ్లీష్ స్వాములవారు మోటివేట్ చేసి మొదటిసారి తెనాల్లో చండీ యాగం చేయించారు. ఆ యాగంలో సుమారు పదిమంది దంపతులు యాగ యాజమాన్యం వహిస్తూ కంకణ ధారణ చేశారు. వాళ్ళల్లో మా అమ్మా, నాన్న కూడా ఒకరు. ఆ యాగం చాలా పెద్ద ఎత్తున సుమారు 10 రోజులపాటు జరిగింది. పదో రోజున పూర్ణాహుతి జరిగింది. ఆ తొమ్మిది రోజులూ పెద్ద జాతరలా జరిగింది. ఒక రోజు సువాసినుల చేత కుంకుమార్చన చేయిస్తే, ఒక రోజు కుమారీ పూజ చేసారు. ఒక రోజు వేదపఠనం జరిగితే, మరో రోజు మరో పఠనం జరిగేది. అప్పుడే మాకు సామవేదమంటే సంగీతమని తెలిసింది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేక పూజ జరుగుతూ ఈ చండీయాగం సాగింది. బంగారం కొనమంటే, ఆమ్మో ఎంతో రేటు అని ఎప్పుడూ తప్పుకునే నాన్న కూడా కొంత బంగారం, వెండి కొని, దానితో సువర్ణ, రజత పుష్పాలు చేయించి పదవరోజున పూర్ణాహుతిలో వేయించారు. ఒక పెద్ద కంచిపట్టు చీరలో ఆ పూర్ణాహుతి ద్రవ్యాలు అన్నీ వేసి, మూట కట్టి హోమంలో వేయించారు. అలా పూర్ణాహుతి కోసం ప్రత్యేక ద్రవ్యాలు తెచ్చి సమర్పించిన వారెందరో. పన్నెండో రోజుకి కూడా ఆ హోమం ఇంకా వేడిగానే ఉంది. అప్పుడే అందరికీ ఆ యాగ భస్మం ప్రసాదంగా ఇచ్చారు. జనం బారులు తీరి ఆ యాగ భస్మాన్ని ప్రసాదంగా భక్తిగా తీసుకున్నారు. మేము వేసిన ఆ పువ్వులు ఓ నాలుగైదు మాక్కూడా ఆ భస్మప్రసాదంలో వచ్చాయి. ఆ వస్తువులన్నీ చాలాకాలం మాఇంట్లో ఉండేవి. అవి ఇప్పుడు ఏమయ్యాయో గుర్తే లేదు. ఈ ఇంగ్లీష్ స్వాములవారు దాదాపుగా మా కుటుంబం లో ఒక భాగమైపోయినట్టుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఈయన కోసం వచ్చే పోయే భక్తులతో మా ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ తరువాత ఆ ఇంగ్లీష్ స్వామీజీ ఈ చండీ యాగానికి కంకణం కట్టుకున్న ఈ పదిమంది దంపతులకూ, తరువాత ఒక సంవత్సరం లోపల రుద్రయాగం కూడా చేసుకుంటే మంచిదనీ, అలా చెయ్యాలనీ చెప్పారు. కాకపోతే మళ్లీ అటువంటి అవకాశం తెనాలిలో రాలేదు. అప్పుడు ఈ పదిమంది దంపతులూ, ఆ రుద్రయాగం జిల్లెళ్ళమూడిలో చేస్తున్నారని తెలిసి, అక్కడికి వెళ్లి ఆ యాగానికి కూడా కంకణధారణ చేసుకుని ఆ రుద్రయాగం కూడా పూర్తి చేసుకున్నారు. ఆ విధంగా అమ్మా, నాన్నా రుద్ర, చండీయాగాలు రెండూ చక్కగా చేసుకున్నారు.
ఈ వివరాలు ఇక్కడితో ఆపి, మరిన్ని వివరాలు తరువాత పోస్టులో పెడతాను. దాంట్లో నాన్నకి, తద్వారా మాకందరికీ కూడా కంచి, శృంగేరి, పుష్పగిరి, కుర్తాళం పీఠాలతో ఉన్న సాంగత్యం గురించి చెపుతాను. ప్రస్తుతానికి స్వస్తి.

ధర్మస్య జయోస్తు
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
విశ్వస్య కళ్యాణమస్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి