19, జులై 2015, ఆదివారం

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను

'అ' ---- అమ్మ, 'ఆ' ----- ఆరుగొలను


భట్టిప్రోలు విజయలక్ష్మి

                                                    మా బామ్మ చేత 'అందరి కోడళ్లలో లీల మంచిది, నేను దాని దగ్గర ఉంటా,  బాగా చూస్తుంది' అనిపించుకుంది. మా బామ్మ తన పూజా పంచాయతనం కూడా మా అమ్మకే ఇచ్చేసింది. అది నాన్న పోయాక అమ్మ బాబు, మా తమ్ముడు వివేకానంద్, దగ్గరికి వెళ్ళే ముందు మా పెద్ద పెదనాన్న పెద్ద కోడలు సత్యవతి వదినకి ఇచ్చింది. 'తరువాత తరంలో నువ్వే పెద్ద కోడలివి, పూజా, పునస్కారం వున్నదానివి' అంటూ. 

                                                 నాకు తెలిసి అమ్మ ఎప్పుడూ సన్నగా, నాజూగ్గానే వుండేది. లీల లావు అవటం అంటే ప్రపంచ వింత అన్నట్లుండేది. కానీ చాలా శక్తి వున్నట్లు అన్ని పనులూ చేసేది. సెకండ్ హ్యాండ్ మెరిట్ సూయింగ్ మిషన్ కొని మా అందరికీ దానితో బట్టలు కుట్టేది. తరవాత్తరవాత ఆ పని నాకు బదిలీ చేసింది. మా అందరికీ అన్ని పనులూ నేర్పింది. వంట చేయటం, ఇల్లు సర్దటం, పూజకి ఏర్పాట్లు చేయటం, టిఫిన్లు చేయటం అన్నీ నేర్పింది. నాకు ముగ్గులు వేయటం రాదు. కానీ భారతి, నా పెద్ద చెల్లి, బాగా ముగ్గులు వేసేది. బాగా ఏమిటి బ్రహ్మాండంగా వేసేది. దాదాపు ప్రతి పండక్కీ ముగ్గులు వేసే భాద్యత దానిదే. పద్మ కూడా దానికి సాయం చేసేది. పాడగా రేపనగా ముందు రోజు రాత్రే నాము వుండని నీళ్ళల్లో నానేసి, మర్నాడు పని మనిషి ఇల్లు కడగంగానే ఇల్లంతా తెల్లగా ముగ్గులు పెట్టేది. ఆ రోజుల పండగల హడావుడే వేరు. 

                                                      ఇంకోవిషయం ఏంటంటే మా అమ్మ, మా నాన్న ఇద్దరిదీ ఒకే వూరు. అదే ఆరుగొలను. కృష్ణా జిల్లాలో నూజివీడు, ఏలూరు మధ్యలో హైవే పైనే వుంటుంది. మా అమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ ఆరుగొలను అంటే ఒక రకం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. మా అమ్మకి వాళ్ళ ఊరంటే అంతిష్టం. అసలు అమ్మే కాదు వాళ్ళ పదిమందీ అంతే, అసలు వాళ్లకి ఆ వూరు పేరు మొత్తం చెప్పఖ్ఖర్లా. 'ఆ' అంటే చాలు అది ఆరుగొలనే, బహుశా చిన్నప్పుడు వాళ్ళ వూరి బడిలో అందరికీ ఆ అంటే ఆరుగొలను అని చెప్పి వుంటారు. (అన్నట్టు, వాళ్ళ వూరిలో బడి వాళ్ళ సుబ్బారావు బాబాయే నడిపేవాట్ట. మళ్ళీ ఈ సుబ్బారావుగారు కూడా వేరెవరో కాదు. నండూరి సుబ్బారావు గారే, నండూరి సుబ్బారావు గారంటే ఆల్ ఇండియా రేడియోలో ఎంతో పేరున్న ఆర్టిస్ట్. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రేడియో గణపతి అంటే ఇంకా బాగా అర్థం అవుతుందేమో. ఈ తరంలో వాళ్లకి ఆయన యెంత తెలుసో నాకు తెలియదు గానీ, మేమంతా చిన్నప్పుడు మా సుబ్బారావు తాతయ్య రేడియో నాటకాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సుబ్బారావు తాతయ్య, మా అమ్మకి బాబాయి పిల్లలు బడికి రాంగానే ఒక్కక్కళ్ళ ముందరా ఇసుక కుప్పలు పోసి దాన్ని బల్లపరుపుగా పరిచి అదే పలక అనుకోమని దానిమీద అక్షరాలు దిద్దించే వాట్ట. ఇవాల్టి చదువు అయిపోయాక ఆ ఇసుక మళ్ళీ కుప్పలో కలిపేసి పిల్లలు వెళ్లి పోయేవారుట. మర్నాటికి మళ్ళీ ఎవరి ఇసుక వాళ్ళు ముందు పోసుకుని మళ్ళీ తయారు. కాణీ ఖర్చు లేని చదువు. మన భారతదేశస్థులకి వున్న వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు) మా నాన్న క్కూడా ఆరుగొలను అంటే ఇష్టమే గానీ మరీ మా అమ్మా వాళ్ళలా కాదు. మా  శ్రీదేవి పిన్నైతే ఆరుగొలను మీద 'నెమరేసిన మెమొరీస్' అని ఓ పుస్తకమే రాసేసింది. మా రోహిణీ పిన్నైతే కార్డ్ బోర్డ్ తో ఓ మినియేచర్ ఇల్లు కట్టేసి, దానికి రంగులేసి, బల్బులు పెట్టి,  వాళ్ళ ఇంటిని, తన ఇంట్లో బంధించేసింది, కాదు కాదు, ఆవిష్కరించేసుకుంది. ఇక శంకరం మామయ్య అయితే జీడిమెట్లలో వాళ్ళ ఇంటి ముందు ఆరుగొలను ఇంటికున్నట్టు వీధిలో గేటుకి అటూ ఇటూ అరుగులు కట్టించేసుకున్నాడు. వీళ్ళందరూ కలిస్తే  'బాబోయ్, మళ్ళీ ఆరుగొలను వెల్లిపోతున్నార్రోయ్' (మాటలు, ఊహల్లోనే) అని మేమంతా తలోవైపూ సద్దుకునేవాళ్ళం. 

                                                        ఇల్లు, ఇంటి ముందు గేటుకి అటూ, ఇటూ అరుగులు, అవి దాటాక చాలా పెద్ద ముంగిలి, ఆపైన వడ్ల పురులు, వసారా, దానికి ఒక వైపు పోస్టాఫీసు గది, మరో వైపు స్పైరల్ మెట్లున్న గది, టెర్రేస్ పైన ఒక గది, (దాన్ని మేము చిన్నప్పుడు మల్లుమామయ్య గది అనేవాళ్ళం), కింద సింహద్వారం దాటగానే పే...............ద్ద హాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా. పెద్ద పెరడు, దాంట్లో జాజి తీగలూ, మందారచెట్టూ, బాదం చెట్టూ, ఆ పెరట్లోనే కొంత భాగంలో పెద్ద పాకా, పెద్ద వంటల కోసమనుకుంటా, ఒక వైపు స్నానాలగదీ (ఓపెన్ టాప్) మరోపక్క నీళ్ళు బాగా వున్నబావీ, దాని చుట్టూ చప్టా, ఇదికాక ఇంట్లో వంటిల్లు, పడమటిల్లూ, దేవుడి గదీ, గాంధీ విగ్రహమున్న గదీ ఉండేవి. గాంధీ విగ్రహం, నిలువెత్తుది, పార్కులో పెట్టటానికి తెచ్చారుట, తరువాత అది ఎందుకో పెట్టకుండా, మరోటి పెట్టారుట. ఆ ఎక్స్ట్రా విగ్రహాన్ని ఇక్కడ మూల గదిలో పెట్టారుట. సడెన్ గా చూస్తే భయమేసేది నాకు. ఇది కాక ఇంటి ముందు పెద్ద చెరువూ, చెరువు నిండుగా నీళ్ళూ, దాన్నిండుగా విరబూసిన తామరలూ, తామరతూళ్ళూ, కాయలూ, అబ్బో, మా అమ్మ మహా వైభవం గా వర్ణించి వర్ణించి చెప్పేది. 











3 కామెంట్‌లు:

  1. Chala baga raasaru attiah...telugulo chadivi chala rojulindi....good read

    రిప్లయితొలగించండి
  2. chaduvuthoo vundanda, family roots telustaayi. mundu mundu nandiwada, bhattiprolu kutumbaala vivaraalu kudaa vastaayi.

    రిప్లయితొలగించండి
  3. చిన్న నాటి విశేషాలు చాలా బాగా చెప్పారు.
    దన్యవాదములు.
    నండూరు. రత్నాకర రావు.
    విశ్రాంతి అధికారి, హైదరాబాద్.

    రిప్లయితొలగించండి