మా నాన్న
భట్టిప్రోలు విజయలక్ష్మి
మా నాన్న నందివాడ శ్రీ రామ కృష్ణ శర్మ. వాళ్ళ అన్నదమ్ముళ్ళలో ఆరోవాడు. మేం మొత్తం ఎనమండుగురం అన్నదమ్ములం, నలుగురు అప్పచెల్లెళ్ళు అని చెప్తూ ఉండేవాడు. 'నా పేరు చాలా స్పెషల్, ఎవరైనా నా పేరు రాస్తే రెండు శ్రీ లు రాయాలనేవాడు. అంటే ముందరే వాళ్ళ నాన్న తన పేరులో శ్రీ అని పెట్టటం వల్ల, గౌరవార్ధం మరో శ్రీని చేర్చి శ్రీ శ్రీరామకృష్ణశర్మ అని రాయాలి అందరూ అనేవాడు. అన్నదమ్ములందరిలో రెండు పీజీలు చేసింది నాన్నే. మాథ్స్ లో ఎమ్మే, ఎడ్యుకేషన్ లో ఎమ్మీడీ చేసి, ఆ రోజుల్లోనే రెండు పీజీలు చేసిన ఘనత నాన్నది. పైగా ఆరోజుల్లో ఎమ్మీడీ చేసినవాళ్ళు తక్కువ వుండటంతో అటువంటి వాళ్ళందరికీ అదనంగా ఇంక్రిమెంట్లు ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు ఇంటర్ పరీక్ష ఫీజు కట్టమని బామ్మ డబ్బు ఇస్తే, దాన్ని సంఘానికి (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఖర్చుపెట్టి, ఇంకా ఆపైన స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్ళి వచ్చాడని బామ్మ ఎప్పుడూ అనేది. ఆరోజుల్లో పధ్నాలుగు, పదిహేనేళ్ళ నాన్న అయిదు జిల్లాలకి ప్రచారక్గా వుందేవాడుట. నాకు ఈవిషయం నాన్న ఫ్రెండ్, నారాయణరావుగారు చెప్పారు. ఆయనకీ నాన్నకి ఎంతో వయసు తేడా(పదేళ్ళు), అయినా ఇద్దరూ చాలా స్నేహంగా వుండేవారు. ఆయన విశాఖలో (ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీలో లైబ్రేరియన్) , నాన్న బెజవాడలో, అయినా వాళ్ళస్నేహం కాలానికీ దూరానికీ కూడా తట్టుకుని నిలిచింది. నాన్నని ఒకసారి కలిసిన వాళ్ళెవరూ మర్చిపోలేరు. ఆయన మాటా కాదనలేరు. నాన్నకి ఆ కరిష్మా వుండేది.
సరే కథలోకి వద్దాం. జైలుకెళ్లటంతో నాన్నకి ఆ ఏడు చదువు పోయింది. మరుసటి సంవత్సరం ఆ పరీక్ష రాసి పాస్ అయ్యాట్ట. ఆ తరవాత కాస్త బుద్ధిగా బీయే చదివి కానుమోలు అనుకుంటా, (వూరు పేరు బాగా గుర్తు లేదు), ఆ వూళ్లోనూ, కొన్నాళ్ళు ఆరుగొలనులోనూ టీచర్ గా పనిచేశాడు. కాకాని వెంకటరత్నం గారు ఇప్పించారుట ఆ వుద్యోగం. ఆతరవాత గుంటూరులో ఏ ఎల్ కాలేజిలో బీయీడీ చేశాడు. అప్పటికి సరోజినత్తయ్యకి పెళ్లి అయి గుంటూరులో ఉందిట. ఆవిడే నాన్నకి రికార్డుల్లో బొమ్మలు వేసిపెట్టేదిట. నాన్నకి చేయించటమే (చేయించుకోవటం అనాలేమో) గానీ చేయటం తెలియదు. నాన్న అడిగితే ఎవరైనా చేసేవాళ్ళు. అత్తయ్య వేసిన, చేసిన రికార్డులు, ప్రాజెక్టులతో నాన్న బీయీడీ అయ్యింది. కాఫీ తాగాక కూడా ఆగ్లాసు ఎవరైనా అందుకునే దాకా చేతిలోనే పట్టుకుని ఉండేవాడు. నాన్న ఎమ్మే చదివే రోజుల్లోనూ అంతే, సాంబాబాయి నోట్సు రాసి పెట్టి చదువుతుంటే, తను మంచం మీద పడుకుని, కళ్ళు మూసుకుని, ఏ జంతికలో,చేగోడీలో నముల్తూ వినేవాట్ట. బాబాయికేమో, నాన్న తననేమో పీజీ చదివించి నాన్న బీయే, బీయీడీ తో వుండిపోవటం బాధ అనిపించిదిట. (సాంబాబాయి కూడా ఎమ్మెస్సీ మాథ్స్, తరువాత చాలా కాలానికి మాథ్స్ లో పీ హెచ్ డీ కూడా చేశాడు. మొత్తం కుటుంబంలో మొట్టమొదటి పీ హెచ్ డీ హోల్డర్) అందుకని ఏమైనాసరే నాన్నచేత కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాథ్స్ పీజీ చేయించాలని బాబాయి కోరిక. పాపం నానా తిప్పలూ పడి నాన్నని ఎమ్మే ఎక్జామ్ కి తయారు చేసి బెనారస్ పంపించాట్ట సాంబాబాయి. ఈ కథంతా అమ్మ, ఉమాదేవి పిన్ని చెప్పేవారు. పెళ్ళైన కొత్తల్లో తనను వదిలేసి అన్నగారితో ఈ చదివించటాలు ఏమిటో, పైగా అసలు చదవాల్సిన వ్యక్తి మంచం మీద కళ్ళు మూసుకుని జంతికలు తింటుంటే, తన భర్త నోట్సులు రాసి తనే చదివి వినిపించటమేమిటో, పాపం పిన్నికి అర్ధం అయ్యేది కాదుట. ఒకసారి పిన్ని బాబాయిని, ఏ పండుగకో అనుకుంటా, వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తే, సాయంకాలానికల్లా నాన్న 'సాంబా' అంటూ వాళ్ళింటికి వెళ్లిపోయాట్ట. పాపం వెళ్ళాక తెలివొచ్చి, పోన్లేరా, 'పండగయ్యాక రా' అంటే, మా 'రామ భాతృ లక్ష్మణ' సాంబాబాయేమో, 'పదరా, నాకూ తోచటం లేదు. వచ్చేస్తా' అని వచ్చేశాట్ట నాన్న వెనకాలే. మరి మా ఊర్మిళ పిన్ని, అదేలే, ఉమాదేవి పిన్నికి కోపం రాదూ మరి. అదీ ఆ అన్నదమ్ముల అనుబంధం. వీళ్ళిద్దరే మరీ ఇంత విడదీయ రానట్టుగా వుండేవారు. శ్రీధర్ బాబాయినైతే చిన్నపిల్లాడిలా చూసేవాళ్ళుట. సాంబాబాయి ఇంత కష్టపడి నాన్నని ఎమ్మే ఎక్జామ్ కి బెనారస్ పంపిస్తే, రేపు ఎక్జామ్ అనగా ఆ ముందర్రోజు రాత్రి (ఆరోజుమహాశివరాత్రి) విశ్వనాధాలయంలో అర్ధరాత్రి అభిషేకం చేసే అవకాశం వచ్చిందని, అటు గుడికి వెళ్లిపోయాట్ట, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని. తెల్లారి, ఎక్జామ్ కెళ్లి, జంతికలు తింటూ తమ్ముడు చదువుతుంటే తాను విన్నది గుర్తు తెచ్చుకుని పరీక్ష రాస్తే, హైసెకండ్ క్లాస్ వచ్చింది. అదీ నాన్న కేరక్టర్. కొత్తగా వచ్చిన పిన్నికి ఇదేమీ అర్ధం అయ్యేది కాదుట. ఈ కథంతా చెప్పింది ఉమాదేవి పిన్నే. అభిషేకం సంగతి మాత్రం నాన్నే చెప్పాడు స్వయంగా.
పాపం ఎమ్మీడీకి ఎవరూ సాయం చేసినట్టు లేదు. రాజమండ్రిలో హాస్టల్లో వుండి చదివాడు ఎమ్మీడీ. (చాలా యాదృచ్ఛికంగా నేనూ ఆ కాలేజ్ లోనే బీయీడీ చేశాను.) అప్పటికి భారతి పుట్టింది. ఈ కహానీలన్నీ నాకు వాళ్ళు, వీళ్ళు చెప్పితే తెలియటమే. ఎమ్మీడీ లో నాన్న చేసిన డిజర్టేషన్ చాలా ఎక్స్ ట్రాఆర్డినరీగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారట. నాన్న గైడ్, ప్రొఫెసర్ రామకృష్ణయ్యగారు, నాన్న చేసిన వర్క్ ని వాళ్ళ గురువుగారు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చూపిస్తే ఆయనా ఎంతో మెచ్చుకున్నారట. ఆ ఫోటోలు ఉండేవి ఇంట్లో, రామక్రిష్ణయ్యగారితో, రాధాకృష్ణన్ గారితో. ఆ ప్రోత్సాహంతో నాన్న ఎడ్యుకేషన్ లో పీ హెచ్ డీ చేయాలని చాలా చాలా అనుకున్నాడు. కానీ, కుటుంబ బాధ్యతలతో, చేయలేక పోయాడు. వుద్యోగం మానేస్తే గానీ రీసెర్చ్ చేయలేడు, వుద్యోగం మానేస్తే జీతం రాదు, జీతం రాకపోతే ఇల్లు జరగదు. అదో బాధ్యతల వలయం. తరువాత చాలా కాలానికి నాన్న గుర్తుగా నేను ఆ ఎడ్యుకేషన్ లోనే పీ హెచ్ డీ చేసి నాన్నకి డెడికేట్ చేశా. అదీ నాన్న చదువు ప్రస్థానం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి