పాపం......బామ్మ
భట్టిప్రోలు విజయలక్ష్మి
బామ్మకి మొత్తం 13 మంది సంతానం పెద్ద పెదనాన్నతో కలిపి. ఆయన్నెప్పుడూ సవతి కొడుకని వేరుగా చూసింది లేదు. తొలి చూలు సంతానం బాలాత్రిపురసుందరి పుట్టిన కొద్ది రోజులకే పోయిందిట. కానీ బామ్మ ఎప్పుడూ ఈ విషయాన్ని నాకు చెప్పనూ లేదు. తానూ ఆ విషయాన్ని తలచుకుని బాధపడుతుంటే నేను ఏనాడూ చూడనూ లేదు. అసలు మా కుటుంబంలో ఇటువంటి ఒక కారెక్టర్ ఉందని నాకు ఈ మధ్యనే, మా పెద్ద పెదనాన్న రాసిన వంశవృక్షం కాపీలో కనపడింది. తరువాత ఇందిరక్క ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ఆ బాలాత్రిపురసుందరి పేరే మా ఉమా పెదనాన్న వాళ్ళ చిన్న అమ్మాయికి పెట్టుకున్నాడు అని. ఆ బాలాత్రిపురసుందరి తరువాత పుట్టినవాడు ఆయనే మరి. తన సంతానంలో మిగిలిన వాళ్ళల్లో బామ్మ తాను జీవించిన కాలంలోనే మరో రెండు మరణాలు చూసింది. మొదటిది మా బుచ్చిపాపత్తయ్యది అయితే, రెండోది మా మధు పెదనాన్నది. మధు పెదనాన్న మరణం నాకు కూడా బాగా గుర్తుంది. బామ్మ జీవితంలో నాకు తెలిసి అత్యంత బాధాకరమైన ఘట్టాలు ఇవి రెండూ. పాపం అయినా తట్టుకుని నిలబడింది.
నేను అప్పుడు ఏడో క్లాసో, ఎనిమిదో క్లాసో చదువుతున్న రోజులవి. ఆ సంవత్సరం ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ నవలల పోటీలో ప్రధమ బహుమతి సంపాదించుకున్న నవల పేరు ఇందుమతి. రచయిత కాదంబరి. ఇది మా కుటుంబ కథ. ఈ నవలా నాయిక ఇందుమతే మా బుచ్చిపాపత్తయ్య. ఆ రచయితే మా అత్తయ్య భర్త శేషగిరిరావు గారు. ఆయనే ఎందుకో కాదంబరి అని కలం పేరుతో రాశారు. ఆ తరువాత ఆయన ఇంకే రచనలు చేసినట్టు తెలియదు. బాణభట్టు రాసిన కాదంబరి ఆయనకు ఇష్టమో ఏమో ఆ పేరునే తన కలం పేరుగా మార్చుకుని ఇందుమతి రాశారు. మా అత్తయ్య అసలు పేరు శ్రీమహాలక్ష్మి. ముద్దుపేరు బుచ్చిపాప. ఎంతో అందంగా వుండేదిట. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా వాళ్ళది ఎంతో అన్యోన్యమైన జంట. ఆయన పాపం ఆవిడను ఎంతగా ప్రేమించాడో మరి. ఆవిడను తన నవలతో ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చిరంజీవిని చేసేసాడు. ఆ నవలలో మా నాన్న పాత్ర పేరు త్రివిక్రముడు, సాంబాబాయ్ పేరు వామనుడు అనుకుంటా. మా నాన్నకి ఈ అత్తయ్య రెండో అక్క. ఈ అత్తయ్యకి పెళ్లి అయిన కొద్దిరోజులకే బాగా జబ్బు చేసి, (థైరాయిడ్ గ్లాండ్ కి టీబీ వచ్చిందిట) యెంత వైద్యం చేయించినా బతకలేదు. బామ్మ ఎప్పుడూ అనేది. వాళ్ళ బంధువుల్లో కాచమ్మ గారనే ఆవిడని ఆ మెట్టపల్లి వారింటికే ఇచ్చి పెళ్లి చేస్తే, ఒక్క ఏడాదికే భర్త చనిపోయి వెనక్కు వచ్చేసిందట. కనుక ఆ ఇంటి పేరిటి వాళ్ళతో సంబంధం వద్దూ అన్నా, వినకుండా ఇది మంచి సంబంధం అని తాతగారు ఈ పెళ్లి చేశారట. ఈసారి అబ్బాయి బాగానే వున్నాడు కానీ, అమ్మాయి పోయింది. ఈసారి ఇలా అచ్చి రాలేదు ఆ ఇంటి సంబంధం. నాతో ఎప్పుడూ చెప్పేది, 'ఆ ఇంటికి కాచమ్మ నిస్తే, అది పాపం సంవత్సరానికే పసుపుకుంకుమ పోగొట్టుకుంది. ఆ సంబంధం వద్దూ అంటే, మీ తాతయ్య వినలేదు. చివరికి అబ్బాయి మంచివాడని నేనూ ఊరుకున్నా' అనేది. ఇంతకీ ఈ కాచమ్మ ఎవరో నాకూ తెలియదు. పెళ్లి అయింది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమతో వున్నారు. ఇంతలో ఆ దేవుడికి కన్ను కుట్టింది కాబోలు, ఈ వ్యాధి ముంచుకొచ్చింది. అత్తయ్య కొద్దిరోజులకే కన్ను మూసింది.
ఈ సీరియల్ వస్తున్నన్నాళ్ళూ నాన్న బామ్మకోసం ఆంధ్రప్రభ వారపత్రిక కొనేవాడు. ప్రతి గురువారం నాడు కాబోలు వచ్చేది. పేపరబ్బాయి ఇంటికే తెచ్చి ఇచ్చేవాడు వీక్లీ. బామ్మకి అది చదువుతుంటే, కళ్లనీళ్లు వచ్చేసి చదవలేకపోయేది. ఇది చూస్తే, నాకూ జాలి వేసేది. నన్ను పిల్చి, 'ఇది కాస్త చదివి పెట్టవే' అనేది. నాకసలే పుస్తకాలు చదవటమంటే మహా ఇష్టం. పైగా ఇది మా కుటుంబ గాథ. నేను చదవకపోతే ఎలా, ప్రపంచం ఆగిపోదూ..... పైగా ఆ రోజుల్లోనే బామ్మకి ఒక కంటికి ఆపరేషన్ చేశారు. ఎక్కువ చదవకూడదు. కన్నుకి అలసట పనికిరాదని ఆ డాక్టరుగారు చెప్పారు. ఇక నాకు తప్పేదేముంది. వారం వారం ఆ సీరియల్ బామ్మకి చదివి వినిపించేదాన్ని. బామ్మ వింటూ ఏడుస్తూ ఉండేది. ఇక మా అమ్మ చూసుకో, లోపలి పిలిచి చచ్చేట్టు తిట్టేది. ఎందుకు చదువుతావ్, చదవనని చెప్పు అని కేకలేసేది. దీనికి రెండు కారణాలు. ఒకటి...అదేమో ప్రేమకథ, నేనేమో చిన్నపిల్లని. అలాంటివి ఆ వయసులో నేను చదవటం మా అమ్మకి ఇష్టం లేదు. రెండో కారణం.... అది చదివితే బామ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది, అది ఆవిడ కంటికి మంచిది కాదు. ఇదీ మా అమ్మకి ఇష్టం లేదు. ఏది ఏమైనా, మా బామ్మ నన్నూ వదలలేదు, ఏడుపునీ వదలలేదు. మా అమ్మ నన్ను తిట్టటమూ మానలేదు. నేను ఆ సీరియల్ చదవటమూ మానలేదు. ఆ వార్తాపత్రికలన్నీ మా ఇంట్లో చాలాకాలం ఉండేవి. ఆ తరువాత ఏమయ్యాయో తెలియదు. ఈ అత్తయ్య పేరు, ముద్దు పేరుతో సహా మా హరి పెదనాన్న వాళ్ళ పెద్దమ్మాయికి పెట్టుకున్నాడు. తన కూతురు పేరని మా బుచ్చిపాపక్కయ్యంటే, బామ్మకి ఎంతో ఇష్టం. చాలామంది మా బుచ్చిపాపక్కయ్య అచ్చం బామ్మ పోలికంటారు కానీ, ఈ అక్కయ్య కన్నా, మా ఇందిరక్కకే బామ్మ పోలికలు ఎక్కువగా ఉంటాయి. అందుకని బామ్మకి ఇందిరక్కన్నా కూడా చాలా ముద్దు. మొత్తానికి బామ్మ పేరు నాకూ, రూపం ఇందిరక్కకూ, అత్తయ్య పేరు మా బుచ్చిపాపక్కయ్యకూ వచ్చాయి. ఎంతమంది వున్నా మేం ముగ్గురం మాత్రం బామ్మకి స్పెషల్. అదంతే.
ఈ నవల ధర్మమా అని నాకు పుస్తకాలు చదివే పిచ్చి బాగా ఎక్కింది. ఎంత బాగా అంటే, మరునాడు పరీక్ష వున్నా, ఈ రోజు ఏదైనా పుస్తకం దొరికితే, అది చదివాకే పరీక్షకి చదివేదాన్ని. దుప్పటి కప్పుకుని, లోపల టార్చ్ లైట్ వేసుకుని చదివిన రోజులూ వున్నాయి. లైబ్రరీలకి లైబ్రరీలు ఖాళీ చేసేసా. రైల్వే కోడూరులో లైబ్రేరియన్ అయితే, అన్ని పుస్తకాలూ చదివేసారండి, మీ కోసం మళ్ళీ కొత్త పుస్తకాలొస్తే కానీ ఏమీ ఇష్యూ చెయ్యలేను, అనేది. ఆవిడ పేరు సీమంతిని. మంచి స్నేహశీలి. భార్యాభర్తలిద్దరూ ఆ లైబ్రరీలోనే లైబ్రేరియన్స్ గా పనిచేసేవారు. అతనికేమో మద్దిపట్ల సూరి అంటే ఇష్టం. ముఖ్యంగా ఆయన రాసిన చంగిజ్ ఖాన్ అంటే మరీ ఇష్టం. సరే, ఇదంతా నా గోల. మళ్ళీ బామ్మ దగ్గరికి వద్దాం. బామ్మని కూతురు పోయిన దుఃఖం నుంచైతే తప్పించలేను కానీ, ఆ నవల నేను చదువుతుంటే, ఆవిడ అంత దుఖంలోనూ ఆనందపడేది కూతురుని గుర్తు చేసుకుంటూ. అల్లుడు తప్పేమీ లేదని తెలిసినా, ఆ అల్లుడంటే బామ్మకి కోపంగా ఉండేది. అసలు ఆ ఇంటిపేరిటి వాళ్లకే, పిల్లనిచ్చి వుండకూడదు. నా ప్రారబ్ధం అని బాధపడేది. పాపం ఆ మామయ్యగారు కూడా భార్య పోయినా, తానూ వేరొక పెళ్లి చేసుకున్నా, మా కుటుంబంతో కూడా సన్నిహితంగానే ఉండేవారు. మా తమ్ముడు పెళ్ళికి ఆయన వృద్ధాప్యం వల్ల రాలేకపోతే, కొత్త దంపతులతో పాటు నాన్న, నేను వెళ్లి ఆయనకు బట్టలు పెట్టాం. అమ్మ అప్పటికే పెళ్లి పనులతో అలసిపోయి రాలేనంది. ఇదీ ఆ అత్తయ్య కథ. మధ్య వయసులో మా బామ్మకి తగిలిన ఒక పెద్ద దెబ్బ ఈ అత్తయ్య మరణం.
పెద్ద వయసులో బామ్మకి తగిలిన మరో పెద్ద దెబ్బ, మా మధు పెదనాన్న మరణం. అప్పుడు బామ్మ మాతోనే తెనాల్లో ఉండేది. ఉదయాన్నే కబురు.... పెదనాన్న పోయాడని. నాన్న నెమ్మదిగా బామ్మ దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుని, 'అమ్మా, బెజవాడ వెళ్ళాలి, టాక్సీ వస్తుంది కాసేపట్లో' అని చెప్పాడు. టాక్సీ అనేసరికి బామ్మకి ఖంగారు వేసింది. ఎందుకంటే, మామూలుగా అయితే మేము బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. ఎవరికి ఏం అయింది అని బామ్మ గట్టిగా అడిగేసరికి నాన్నే నెమ్మదిగా చెప్పాడు. మధన్నయ్య రాత్రి పోయాట్ట. హార్ట్ అటాక్ తో అని చెప్పాడు. బామ్మని పట్టుకోవడం చాలా కష్టం అయింది. నేను అప్పుడు ఐదో క్లాసో, ఆరోక్లాసో. మేము తెనాలి వచ్చి అప్పటికి సంవత్సరమో, రెండు సంవత్సరాలో అయిందేమో. నాన్నకి అక్కడ తాలూకా హైస్కూల్లో హెడ్ మాస్టర్ వుద్యోగం వచ్చింది. పెద్ద స్కూల్ అని నాన్న బెజవాడ నుంచి తెనాలికి మారాడు. "లీలా, అందరికీ బట్టలు సర్దు, ఎన్నాళ్ళుండాలో తెలియదు." అని అమ్మకి చెప్పాడు. అందరం ఓ గంటలో బెజవాడ చేరాం. ఆ ముందటి రోజే పెదనాన్న హైదరాబాద్ లో తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేసి, ఆమ్మనీ, పిల్లాడినీ అక్కడే వదిలేసి తాను ఒక్కడే తిరిగి వచ్చాడట. భోజనం చేసి పడుకుని ఇక లేవలేదు. నిద్రలోనే పోయాడట. ఆమ్మ కూడా విషయం తెలుసుకుని హైద్రాబాద్ నుంచి టాక్సీలో పెద్దత్తయ్యా వాళ్ళతో దిగింది. అంతా ఏడుపులూ, మొత్తుకోళ్ళూ...గోల గోల. తలకొరివి పెట్టేవాళ్ళు లేకపోవటంతో నాన్నే చేసాడు ఆ కార్యక్రమాన్ని. మొత్తం మీద ఆ పది పన్నెండు రోజులూ, అమ్మా నాన్నా బిజీ బిజీ. ఎప్పుడు చూసినా తడి బట్టలు, మైల బట్టలు, మడి బట్టలూ అంటూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. దాంతో నాకు చెళ్ళెళ్ళూ తమ్ముడూ స్నానాలు చేశారా లేదా, అన్నాలు తిన్నారా లేదా, అని చూసుకోవటం, మా బట్టలన్నీ ఉతుక్కోవటం, అవి జాగ్రత్త చేసుకోవటం ఫుల్లుగా చేతి నిండా పని. నేనే చిన్నదాన్నంటే, నాకన్నా చిన్నవాళ్లు మిగిలిన వాళ్ళు. మధ్య మధ్యలో బామ్మని పలకరించడం. ఇదీ నా పని.
మా మధు పెదనాన్న డిగ్రీ అయ్యాక బెజవాడలో మొదటిసారిగా ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాడు దుర్గమ్మ వారి పేరు మీద. ఆ కాలేజీ పేరే... డీ టీ కాలేజ్, అంటే దుర్గా ట్యుటోరియల్ కాలేజ్. ఈ ట్యుటోరియల్ కాలేజీల కాన్సెప్టు ఆ రోజుల్లో కొత్తది. ఆ ఐడియా ఆయన బ్రెయిన్ చైల్డ్. అది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ట్యుటోరియల్ కాలేజ్. ఆ కాలేజ్ తోనే మూడంతస్తుల ఇల్లు కట్టాడు. విద్యార్థులని చదివించి బెనారస్ కి తీసుకు వెళ్లి బనారస్ మెట్రిక్ పరీక్ష రాయించటం ఆయన పని. అలా ఎంతమందిని చదివించాడో. మా నండూరి సుబ్బారావు తాతయ్య కూడా అక్కడే మెట్రిక్ చదువుకున్నాట్ట. తమాషా ఏమిటంటే, ఆయన కొడుకు ప్రభాకర్ కూడా అక్కడే చదువుకున్నాడు. మా ఇంట్లో ఆ రోజుల్లో ఆ కాలేజీలో చదువుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మా రామానంద్ అన్నయ్య, శివానంద్ అన్నయ్య, ఇందిరక్క, సుశీల వదిన, ఉమాదేవి పిన్ని చెల్లెలు, చల్లమాంబ పిన్ని ఇలా ఎందరో అక్కడ చదువుకున్న వాళ్ళే. మా నాన్న, సాంబాబాయ్ అక్కడ పార్ట్ టైం టీచర్లుగా కూడా పని చేసేవాళ్ళు. ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు. సాంబాబాయ్ అయితే, అక్కడే స్టూడెంట్ కూడా. మొత్తానికి మా తాతగారు వేదాలు బోధిస్తే, మా పెదనాన్న, నాన్నా, బాబాయ్ టీచింగ్ సైడ్ వచ్చారు. మా తరంకి వస్తే, మేము ముగ్గురు అక్కాచెల్లెళ్లు, చెల్లమ్మ అత్తయ్య కూతురు నాగు, సరోజిని అత్తయ్య కూతురు రాధిక, ఫుల్ టైం ప్రొఫెషన్ గా టీచింగ్ చేసాం. ఇందిరక్కా, చల్లమ్మత్తయ్య కూతురు రమా కూడా కొన్నాళ్ళు టీచింగ్ చేశారు. మా జీన్స్ అక్కడివి, అప్పటివి. మా అమ్మా వాళ్ల అన్నయ్య, మురళీ మామయ్య కూడా ఆ కాలేజీలోనే మెట్రిక్ చదువుకున్నాడు. మా ఆమ్మ బైట వూరు నుంచి వచ్చే ఆడ పిల్లల కోసం ఒక హాస్టల్ లాంటిది కూడా నడిపేది. ప్రతి సంవత్సరం స్కూల్ గ్రూప్ ఫోటో అంటే మాత్రం మా పిల్లలందరం వెళ్లి అక్కడ కూర్చునేవాళ్ళం. అలాంటి ఫోటోలెన్నో....ఎన్నెన్నో....
ఈ పెదనాన్న పోతూనే ఆ కాలేజ్ కూడా మూత పడింది. ఈ పెదనాన్నా, ఆమ్మలకి మరో హాబీ కూడా వుండేదిట. అది పెళ్లిళ్లు చేయటం. బోల్డంతమంది స్టూడెంట్స్ కదా, వాళ్ళ అక్కలకీ, అన్నలకీ, ఇతర బంధువులకీ, ఎవరికి ఎవరు సరిపోతారో చూసి పెళ్లిళ్లు చేయటం. మా సాంబాబాయ్, ఉమాదేవి పిన్ని వాళ్ళ పెళ్లి కూడా వీళ్ళే కుదిర్చారు. మా ఉమా పెదనాన్న కూడా ఇన్కంటాక్స్ ప్రాక్టీషనర్ గా బాగా సంపాయించి మూడంతస్థుల మేడ కట్టాడు. మధు పెదనాన్న కాలేజీ పెట్టి మూడంతస్థుల మేడ కట్టాడు. కాకపోతే ఆ మూడంతస్తులూ క్లాస్ రూములే. వీళ్ళు మాత్రం ఓ రెండు మూడు గదుల్లో వుండేవారంతే. అంత గొప్ప కొడుకులని కన్నందుకు బామ్మ ఎప్పుడూ ఉప్పొంగిపోతూ ఉండేది. ఆ సంతోషం మీద ఒక్కసారిగా నీళ్లు చల్లేసినట్లయి పోయింది. బామ్మ దుఃఖం పట్ట తరం కానిది. సరిగ్గా ఆరోజుల్లోనే, అన్నపూర్ణామ్మకు ప్రభాకర్ పుట్టాడు. మధు పెదనాన్నే మళ్లీ పుట్టాడని అందరూ సంతోషపడ్డారు. మా మధు పెదనాన్నకి పోయేటప్పటికి 50 ఏళ్ళు మాత్రమే. చాలా అందంగా ఉండేవాడు. మెహరుబాబాలా ఉంటాడని నేను ఆ రోజుల్లో అనుకునేదాన్ని. మా శ్రీధర్ బాబాయ్ కి కొంచం మధు పెదనాన్న పోలికలు వున్నాయి. మా సరోజినత్తయ్య కొడుకు లలితానంద్ కి ఇంకా ఎక్కువ పోలికలు వున్నాయి.
ఈ పెదనాన్న పోతూనే ఆ కాలేజ్ కూడా మూత పడింది. ఈ పెదనాన్నా, ఆమ్మలకి మరో హాబీ కూడా వుండేదిట. అది పెళ్లిళ్లు చేయటం. బోల్డంతమంది స్టూడెంట్స్ కదా, వాళ్ళ అక్కలకీ, అన్నలకీ, ఇతర బంధువులకీ, ఎవరికి ఎవరు సరిపోతారో చూసి పెళ్లిళ్లు చేయటం. మా సాంబాబాయ్, ఉమాదేవి పిన్ని వాళ్ళ పెళ్లి కూడా వీళ్ళే కుదిర్చారు. మా ఉమా పెదనాన్న కూడా ఇన్కంటాక్స్ ప్రాక్టీషనర్ గా బాగా సంపాయించి మూడంతస్థుల మేడ కట్టాడు. మధు పెదనాన్న కాలేజీ పెట్టి మూడంతస్థుల మేడ కట్టాడు. కాకపోతే ఆ మూడంతస్తులూ క్లాస్ రూములే. వీళ్ళు మాత్రం ఓ రెండు మూడు గదుల్లో వుండేవారంతే. అంత గొప్ప కొడుకులని కన్నందుకు బామ్మ ఎప్పుడూ ఉప్పొంగిపోతూ ఉండేది. ఆ సంతోషం మీద ఒక్కసారిగా నీళ్లు చల్లేసినట్లయి పోయింది. బామ్మ దుఃఖం పట్ట తరం కానిది. సరిగ్గా ఆరోజుల్లోనే, అన్నపూర్ణామ్మకు ప్రభాకర్ పుట్టాడు. మధు పెదనాన్నే మళ్లీ పుట్టాడని అందరూ సంతోషపడ్డారు. మా మధు పెదనాన్నకి పోయేటప్పటికి 50 ఏళ్ళు మాత్రమే. చాలా అందంగా ఉండేవాడు. మెహరుబాబాలా ఉంటాడని నేను ఆ రోజుల్లో అనుకునేదాన్ని. మా శ్రీధర్ బాబాయ్ కి కొంచం మధు పెదనాన్న పోలికలు వున్నాయి. మా సరోజినత్తయ్య కొడుకు లలితానంద్ కి ఇంకా ఎక్కువ పోలికలు వున్నాయి.
తన సంతానంలో ఈ ఇద్దరి మరణాలూ బామ్మని బాగా కలిచివేసినట్టు నాకనిపించేది. కూతురు మరణం మర్చిపోయి, నెమ్మదిగా బతుకు బాటలో పడుతుండంగా, మధు పెదనాన్న మరణం పెద్ద దెబ్బ. నేను పోయి, వాడు ఉండకూడదా అని ఏడ్చింది. ఏమేమి మనం అనుభవించాలని రాసి ఉందో అదంతా అనుభవించక తప్పదు కదా. మొత్తానికి అన్ని కార్యక్రమాలూ పూర్తి అయ్యాక తిరిగి బామ్మతో సహా అందరం తెనాలి చేరుకున్నాం. అమ్మా, నాన్న మాత్రం ఆ సంవత్సరం అంతా బెజవాడ వెళ్లి మాసికాలు పెడుతూనే వుండేవాళ్ళు. మా అమ్మ కూడా ఇలాంటి ఎన్నో విషయాల్లో నాన్నకు తోడుగా ఉండేది. మొత్తానికి బామ్మ పడ్డ కష్టాల్లో ఇదీ ఒకటి. అన్ని బాధల్లో కూడా యేవో రామదాసు కీర్తనలు పాడుకుంటూ ఉండేది. పెద్దపులి లాంటి బామ్మ దిగులుగా, బెంగగా, మౌనంగా అయిపోయింది. మా అమ్మ కూడా జాలి పడేది ఆవిడను చూసి. కానీ ఎవరేం చెయ్యగలం. బామ్మ ఇష్టంగా పాడుకునే పాటలు, "సీతారామస్వామీ, నే చేసిన నేరము లేమీ", "తక్కువేమి మనకూ, రాముండొక్కరుండు వరకూ", "ఏ తీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా", "తారకమంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా". ఇలా ఏవేవో పాడుకుంటూ, మొత్తానికి కాలం గడిపేసింది మా బామ్మ. ఎంత రాజమాత అయినా మాతే కదా మరి. పుత్ర, పుత్రికా శోకం తప్పలేదు మరి. అందుకే "పాపం......బామ్మ" అని టైటిల్ పెట్టా.
I never knew much about Madhu peddananna’s death!
రిప్లయితొలగించండిWhere can we get the novel, “Indumati”? I feel like reading it!