బామ్మ - పెళ్ళి కథా కమామీషూ
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఎప్పుడూ బామ్మని ఒకటి అడిగేదాన్ని. ' బామ్మా, నీ పెళ్లి ఎలా అయ్యిందీ అని. "మా నాన్నకి నేనంటే ప్రాణం, అందుకని నన్ను ఊళ్ళోనే ఇవ్వాలని మీ తాతగారికి ఇచ్చాడు" అనేది. 'మరి మీ అక్కని బైట వూరికి ఇచ్చారుగా' అంటే, 'అందుకే నన్ను ఊళ్ళోనే ఇచ్చాడు' అని చెప్పేది. 'ఇంత బంగారం, ఇంత ఆస్తి ఇచ్చి మరీ నిన్ను రెండో పెళ్ళివాడికి ఎందుకు ఇచ్చారు, పైగా అప్పటికే ఒక కొడుకు కూడా వున్నాడు గదా' నేనూ వదిలిపెట్టేదాన్ని కాదు. ఎందుకంటే, నాకెప్పటికీ ఒక ఆశ్చర్యం, అర్ధం కాని విషయం ఇది. ట్రంకు పెట్టెడు బంగారం ఇచ్చి, పైగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి, వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలం ఇచ్చి, రెండో పెళ్లి వ్యక్తికి, అందునా ఓ ఆరేళ్ళ కొడుకున్న తండ్రికి ఇచ్చి బామ్మకు ఎందుకు పెళ్లి చేశారూ...... అని. ఆ వయసులో ఇది అడిగే ప్రశ్న, ఇది అడక్కూడని ప్రశ్న అని తెలిసెడి కాదు. పైగా అత్యంత ఆత్మీయురాలు బామ్మ. ఆవిడ నా ప్రాపర్టీ అంతే, మరో ఆలోచన లేదు. అడిగేశా.
బామ్మ మాత్రం తొణక్కుండా, బెణక్కుండా ఒక్కటే విషయం చెప్పేది. ఏమంటే, బామ్మా వాళ్ళ నాన్న నండూరి శ్రీరామూర్తిగారికి తన చిన్న కూతురు వియ్యమ్మని పెళ్లి పేరుతో దూరంగా పంపించటం ఇష్టం లేదు. చూడాలనుకోగానే పిల్లను చూసుకోగలిగేలాగా వున్న ఊళ్ళోనే ఇవ్వాలని ఆయన ఆలోచన. అప్పటికి, అవునూ, కాదూ అని చెప్పగలిగే వయసు కాదు బామ్మది. ఆరుగొలను గ్రామానికి నండూరు వాళ్ళు మొఖాసాదార్లు. అంటే అది నండూరి వాళ్ళ అగ్రహారం లాంటిదన్న మాట. దాంతో, ఊరు ఊరంతా నండూరివాళ్ళే. మరి ఊళ్ళోనే సంబంధం అంటే ఎలా? నండూరు వారు కాకుండా వూళ్ళో ఉంటున్న మరొక్క ఏకైక బ్రాహ్మణ కుటుంబం నందివాడ ఆనందరామయ్యగారిది. భార్య పోయి ఒంటరిగా వున్నాడు. ఒక కొడుకున్నా, ఆ పిల్లవాడిని మేనత్తలు పెంచుతున్నారు. వయసెక్కువ తేడా లేదు. పిల్లవాడు బుద్ధిమంతుడు. మంచి పేరున్న కుటుంబం. పైగా ఇంట్లో చేదోడు వాదోడుగా ఒక వితంతు ఆడపడుచు ఉంటుంది. ఇవన్నీ చూసుకుని ఓ రోజు శ్రీరామూర్తిగారు సంబంధం ఖాయం చేసుకున్నారు, అదీ పెళ్లయ్యాక ఆరుగొలను ఊళ్ళోనే ఉండిపోవాలన్న షరతు మీద. సరే, అదే ఒప్పందం మీద బామ్మకీ, తాతగారికీ పెళ్లి అయ్యింది. మామగారిచ్చిన స్థలంలోనే ఒక ఇల్లు కట్టుకుని కాపురం పెట్టారు బామ్మా, తాతగారూ. ఆ రకంగా బామ్మా వాళ్ళ నాన్న కోరిక తీరింది. ఆయనింటికి పావు మైలు దూరంలోనే చిన్నకూతురు సంసారం వెలసింది. ఇదీ బామ్మ చెప్పిన కథ.
కానీ అసలు కథ వేరే వుంది. ఇది నాకు ఇంకొంచం పెద్దయ్యాక అత్తయ్యల ద్వారా తెలిసింది. బామ్మకి మొదట గుడివాడలో లా ప్రాక్టీస్ చేస్తున్న రాజగోపాలం తాతగారితో పెళ్లి కుదిరిందిట. ఆయన ఆనందరామయ్యగారి తమ్ముడు. బామ్మా వాళ్ళ నాన్నకి బామ్మని దూరంగా ఇవ్వటం ఇష్టం లేక వీలైనంత దగ్గరలో వున్న గుడివాడలో పిల్లని ఇవ్వటానికి ఒప్పుకున్నారుట. ఈ లోపల ఆనందరామయ్యగారికి భార్య పోయింది. ముందుగా అన్నగారికి పెళ్లి చేస్తే గానీ తమ్ముడికి చెయ్యరు. అప్పుడు తాతగారి చెల్లెలు లౌక్యంగా మాట్లాడి, మీ ఊళ్ళోనే ఉంటాడు, అలా అని ఇల్లరికం ఉండడు, అంటూ మాట్లాడి మా బామ్మకీ, తాతగారికి పెళ్లి కుదిరేలా చేసిందట. ఇదీ కథ. పిల్ల ఊళ్ళోనే ఉంటుందన్న మాట మంత్రంలా వినపడి శ్రీరామూర్తిగారు మా బామ్మ పెళ్లి మా తాతగారితో జరిపించేసారుట. ఇదీ అత్తయ్యలు చెప్పిన కథ.
మొత్తానికి అన్నదమ్ములిద్దరిలో తన ముద్దుల కూతురిని ఎవరికివ్వాలో ఆలోచనలో పడ్డ నండూరి శ్రీరామూర్తిగారు గుడివాడలో ఉంటున్న మొదటి సంబంధం పెళ్ళికొడుకైన తమ్ముడి కన్నా, రెండో సంబంధం పెళ్ళికొడుకయినా ఆరుగొలనులోనే వుండే అన్ననే పెళ్లికొడుకుగా నిర్ణయించుకున్నారు. దాంతో మా బామ్మ పెళ్లి ఆనందరామయ్యగారి తోనే ముడిపడిపోయిందిట. తమాషా ఏమిటంటే, ఆ రాజగోపాలం తాతగారికి పెళ్లి చేసుకున్నా, ఆ భార్యలూ బ్రతకలేదు, వాళ్ళకు పుట్టిన సంతానము బతకలేదు. వంశం కోసం, తన తదనంతర కార్యక్రమాలు జరిపించటం కోసం ఆయన తిరిగి మా బామ్మా, తాతయ్యలకు పుట్టిన సంతానాన్నే దత్తు తీసుకోవాల్సి వచ్చింది. అదీ విధి. ఏది ఏమైనప్పటికీ విజయరావమ్మగారు ఎంచక్కా, బోల్డు ఆస్తి, బంగారంతో పాటు పెళ్లి చేసుకుని, ఆరుగొలనులోనే, ఒక వీధి నుంచి మరో వీధికి కాపురానికి వచ్చేసింది. ఎంచక్కా డజను మంది పిల్లలను కన్నది. అందరినీ బాగా చదివించి ప్రయోజకులను చేసింది. తండ్రి హాపీ, కూతురు హాపీ. కథ సుఖాంతం.
వాళ్ళ నాన్న ఇచ్చిన స్థలంలోనే ఇల్లు కట్టుకున్నామని బామ్మే నాకు చెప్పింది. అందుకే ఆవిడకి ఆ ఇంటి మీద అంత మమకారం, హక్కు, పట్టూనూ. ఆ ఇంటిలో ప్రతి గది గురించీ ఎంతో ఇష్టంగా చెప్పేది. యెంత ఇష్టంగా చెప్పినా మా అమ్మ వాళ్ళింటి గురించి చెప్పినంత ఇష్టంగా కాదనుకోండి. ఈ వివరాలన్నీ 'అ'----అమ్మ, 'ఆ'----ఆరుగొలను అనే పోస్టులో రాసాను. మొత్తం మీద ఈ అత్తాకోడళ్ళిద్దరూ నండూరివారే, మొఖాసాదారుల కూతుళ్లే. బామ్మకి తన ఇంటిలో వంటగది, పూజ గది, పెరట్లో పశువుల కొట్టం, బావి, బైట వసారా పెద్ద పడగ్గది, దాంట్లో ఎత్తైన పెద్ద పందిరి మంచం, ఆ మంచం ఎక్కడానికి ఓ కుర్చీపీట, అన్నీ గుర్తే. నాకూ ఆ ఇంట్లో ఓ నెలరోజుల పాటు వుండే అదృష్టం కలిగింది. అన్నాళ్ళూ ఆ పందిరి మంచం మీదే పడుకునే వాళ్ళం నేనూ బామ్మ. బామ్మ ఊరగాయలు పెట్టే పెద్ద పెద్ద జాడీలు, వాటికి మూతలు పెట్టి గుడ్డలతో వాసెనలు కట్టటం, అన్నీ చెప్పేది. తాతగారి శిష్యులు వస్తే వాళ్ళ ఎడ్లు కూడా వీళ్ళ కొట్టంలోనే కట్టేసేవారట. ఇంతమందికీ ఆవిడే వంటలు చేసేదిట.
ఇంటికి ఎదురుగుండానే ఊరి మంచినీటి చెరువు. ఆడవాళ్లు మడి కట్టుకుని ఆ చెరువు నుంచి మంచినీళ్లు తెచ్చుకునే వారట. ఆ నీటితోనే మడి వంటలు చేసుకునేవారట. ఎప్పుడైనా ఎవరైనా తాకినా, లేదా తాకారని అనుమానం వచ్చినా ఆ నీళ్లు పారబోసి మళ్ళీ వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారట. కానీ బామ్మ మాత్రం తానూ ఏనాడూ చెరువుకు వెళ్లి నీళ్లు తెచ్చుకున్నట్టు చెప్పలేదు. మరి ఇంకెవరైనా తెచ్చి పోసేవారేమో. ఏదైనా వస్తువు, మంచి నీళ్ళైనా సరే, మైల పడిందని తెలిస్తే మాత్రం పారబోయ్యాల్సిందే. కానీ ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో అవసరార్ధం శుద్ధి కోసం దాంట్లో ఓ చల్ల చుక్క వేసి ఆ వస్తువుని మళ్లీ వాడుకునే వాళ్ళుట. మా అమ్మా వాళ్ళ తాతమ్మ రాజ్యలక్ష్మమ్మగారికి కూడా ఈ మడి, మైల చాదస్తం బాగా వుండేదిట. అందులోనూ ఆవిడ ఇంకో తరం ముందు మనిషి కదా. ఈ చాదస్తం అనే విషయం గురించి చివర్లో చెప్తాను. అసలు ఈ పదం ఎలా వచ్చిందీ వగైరా సంగతన్నమాట. అమ్మకి తాతమ్మైతే, నాకు ముత్తాతమ్మగారు. ఈవిడ తడిబట్ట కట్టుకుని, బిందె తీసుకుని చెరువుకు వెళ్లి, అక్కడ మళ్ళీ స్నానం చేసి, ఆ తడిబట్టలతోనే బిందె నిండుగా నీళ్లు నింపుకుని దారి పొడవునా యేవో శుద్ధి మంత్రాలు చదువుతూ బిందె లోని నీళ్లను కాస్త కాస్త చిలకరించుకుంటూ ఇంటికొచ్చేసరికి బిందెలో నీళ్లన్నీ అయిపోయేవిట. దాంతో మళ్ళీ తిట్టుకుంటూ చెరువుకి వెళ్లి మళ్ళీ స్నానం, బిందె నింపుకోవటం, దారిపొడవునా నీళ్లు జల్లుకుంటూ రావటం, ఇదే చర్వితచర్వణంగా సాగేదిట ఆవిడ మడి మంచినీళ్ల బాగోతం. పైగా మధ్యలో ఏ ఆకతాయి పిల్లలో ముట్టుకుంటే, వాళ్లకు రెండు తగల్నించి, ఆ మిగిలిన కాసిని నీళ్ళూ అక్కడే ఎక్కడో చెట్టు మొదట్లో దిమ్మరించి మళ్ళీ చెరువుకు మంచినీటి యాత్ర మొదలు. మా బామ్మకు కూడా చాదస్తం వుంది కానీ మరీ మా ముత్తాతమ్మలా కాదేమో.
ఇంతకీ చాదస్తం అనే పదం ఎలా వచ్చిందంటే, ఛాందసము అనే పదం నుంచి. ఈ ఛాందసము అనే పదమే రాను రాను వాడుకలో చాదస్తం అయ్యింది. ఛాందసము అనే పదం ఛందస్సునకు సంబంధించినది. పూర్వం ఎవరైనా ఛందస్సుని పట్టుకుని పద్యంలో పద నిర్మాణం కోసం తంటాలు పడుతుంటే, 'మరీ ఛాందసము, చూచాయగా ఏదో పదం వేస్తే పోలా' అనుకునే వారట. అలా ఛందస్సు కోసం తాపత్రయ పడేవారిని ఛాందసులు, చాదస్తులు అనుకోవటంతో మొదలయ్యి, నెమ్మదిగా పూర్వాచార పరాయణత కోసం తాపత్రయ పడేవారి గురించి కూడా ఈ పదం వాడటం అలవాటై పోయింది. అదీ చాదస్తం కథ.
ఏమిటో, నా చాదస్తం, బామ్మ పెళ్లి గురించి రాస్తూ మళ్ళీ ఆచారాల గురించీ, మడి గురించీ రాస్తున్నాను. మొత్తానికి మా బామ్మ పెళ్లి ధర్మమా అని నండూరి వారి మొఖాసా గ్రామమైన ఆరుగొలనులో, నందివాడ వారు అలా స్థిరపడిపోయారు. ఇప్పుడు ఆ వూళ్ళో నండూరు వాళ్ళూ లేరు, నందివాడ వాళ్ళూ లేరు. అసలు బ్రాహ్మణులే లేరు, ఏదో గుడి పూజారులు తప్ప. ఇంతకీ మా బామ్మ పెళ్లి అయ్యాక, కొన్నాళ్ళు బాగానే వుంది కానీ, ఆ తరువాత వాళ్ళ నాన్నగారు పోయిన కొన్నాళ్ళకి ఆవిడకి, వాళ్ళ పుట్టింటితో ఏదో మాట పట్టింపు వచ్చింది. అంతే, మళ్ళీ బామ్మ పుట్టింటికి వెళ్ళలేదు. కొన్ని విషయాల్లో బామ్మ చాలా ఖచ్చితంగా ఉండేది. మాటంటే మాటే, పంతమొస్తే, పంతమే, అది ఎవరని కూడా చూసేది కాదు. అదీ బామ్మంటే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి