మా ఇంట్లో బామ్మ మడీ తడీ
భట్టిప్రోలు విజయలక్ష్మి
నా చిన్నప్పుడు మా బామ్మ మాఇంట్లొనే ఉండేది. బామ్మ ఉంటే మా ఇంట్లో వంట తప్పనిసరిగా మడి కట్టుకునే చెయ్యాలి. బామ్మ మైల వంట తినేది కాదు. ఈ రోజుల్లో చాలా మందికి మడి అంటేనే తెలియదు. అందుకని వాళ్ళకోసం ముందుగా మడి అంటే ఏమిటో చెప్తాను. ముందురోజు తడిబట్టలు కట్టుకుని మరో జత తడి బట్టలు ఆరేసుకునే వాళ్ళు. ఆ ఆరేసిన బట్టలను మళ్ళీ ఎవరూ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అవి మైల పడిపోతాయి. అలా ఎవరూ ఆ బట్టలు ముట్టుకునే వీలు లేకుండా వంట ఇంట్లో పైన ఒక వెదురుబొంగుని దండెంగా కట్టేవాళ్ళు. ఇంకో వెదురు బొంగు సాయంతో ఆ బట్టలను ఆరేయటం, మళ్ళీ వాటిని అవసరమైయ్యేటప్పుడు ఆ బొంగు సాయంతోనే తీసుకోవటం ఓ ఆర్ట్. ఈ మధ్య తిరుమలలో అర్చక భవన్ కి వెళ్ళినప్పుడు వరుసగా ఓ 10, 15 దండేల నిండుగా మడి పంచెలు ఆరేయటం చూసి నాకు మళ్ళీ మా చిన్నతనం, మా బామ్మ మడి గుర్తొచ్చాయి.
వంట చేసేవాళ్ళకే కాదు, పండగలప్పుడు, పూజలప్పుడు ఇంటిల్లిపాదికీ కూడా మడి బట్టలు ఆరేసేవాళ్లు. వినాయకచవితి లాంటి పండగలకైతే మడి బట్టలతోనే పూజ చేసేవాళ్ళం. ఇలా ఆరేసిన మడి బట్టలను రెండో రోజు స్నానం చేసి ఎవరూ ముట్టుకోకుండా తీసుకోవాలి. అవి తీసుకోవాలంటే, తడిబట్టలతో నైనా తీసుకోవాలి, లేదా వేమనావతారంలో నైనా తీసుకోవాలి. ఆ ఆరేసిన మడి బట్టలు కట్టుకుని, అప్పటినుంచీ ఎవ్వరినీ ముట్టుకోకుండా వంట చేసి, ఆ వంటను దేవుడికి మహానైవేద్యం పెట్టాక మాత్రమే మా బామ్మ మడి కట్టుకుని భోజనం చేసేది. మా అమ్మ రోజూ తనకీ, బామ్మకీ ఇద్దరికీ మడి బట్టలు ఆరేసేది. ఒక్కోసారి మా బామ్మ తాను భోజనం చేయకుండా మేమెవరైనా పొరపాటున ఆ వంట ముట్టుకుంటే ఇక అంతే సంగతి. మాకు వీపు మీద రాంభజన, మా బామ్మకు పస్తు. ఈ గోలంతా ఎందుకని ఎవరం అటు పోయేవాళ్ళం కాదు. ఇంకో సంగతి. ఆ సమయంలో పొరపాటున కూడా పనిమనుషులు గానీ, అబ్రాహ్మణులు కానీ ఆ వంట చూడకూడదు. బామ్మ తినకుండా పొరపాటున కూడా ఆ ఖాళీ అంట్ల గిన్నెల్ని కూడా ముట్టుకోకూడదు. ఈ అంట్లు అంటే ఏమిటో కాసేపాగి చెప్తా.
ఒకసారి నేను వంట అయిపోయింది కదా అని ఆ గిన్నెల్ని బయట బావి దగ్గర పెడదామని ముట్టుకున్నా. మా పనమ్మాయి అంట్లు తోమేది అక్కడే మరి. ఎందుకంటే, అంట్ల గిన్నెలన్నీ బయట బావి దగ్గర పెట్టటం, మళ్ళీ అవి తోమాక నీళ్లు చల్లి లోపల పెట్టడం నా డ్యూటీ. అప్పటికి బామ్మ అన్నం తినేసింది గానీ ఇంకా చెయ్యి కడుక్కోలేదు. ఏదో నా పని అయిపోతుంది కదా అని ఆ గిన్నెలు బయట పడేద్దామని ముట్టుకున్నా. అంతే, బామ్మ గయ్యిమంది. నేను చెయ్యి కడుక్కోకుండా నువ్వు అంట్లు ముట్టేసుకున్నావు, ఇవాళ నా భోజనం మైల పడిపోయింది అంటూ గోల, బాధ. వెనకాలే మా అమ్మ కూడా బామ్మను జాయిన్ అయిపోయింది. ఒక్కోసారి ఈ అత్తా కోడళ్ళిద్దరూ భలే ఒకటై పోతారు. భారతికి ఈ గోల లేదు. పెద్దదాన్ని కదా అలాంటి డ్యూటీలు నాకే. పద్మ ఇంకా చిన్నపిల్ల. బాబు మగమహారాజు. ఇవీ మడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అన్నం తినటం అయిపోయింది కదా, వూరికే కబుర్లు చెప్తూ కూర్చుంది కదా, తరవాత చెయ్యి కడుక్కుంటుందిలే, అని నేను ఆ గిన్నెలు ముట్టుకుంటే, మా బామ్మ తినేసిన భోజనం కూడా మైల పడిపోయిందిట. అప్పుడు నేను మడి కట్టుకోలేదు లెండి. అంటే, సొంత మనవరాలు కూడా ఆవిడ తిని చెయ్యి కడుక్కోందే, ఖాళీ అంట్ల గిన్నెలు కూడా ముట్టుకోకూడదు. అదీ మడి రూల్. బహుశా ఇప్పుడు కరోనాకి సరిగ్గా సరిపోతుంది.
నేను కూడా కొన్నిసార్లు మా బామ్మ కోసం మడి కట్టుకుని వంటలు చేసిన రోజులున్నాయి. మా అమ్మ బయట చేరినప్పుడు, ఆ రోజుల్లో సాధారణంగా అందరు బ్రాహ్మల ఇళ్లల్లో లాగానే ఆ మూడు రోజులు తాను ఇంట్లోకి వచ్చేది కాదు. పెద్ద మనవరాలిని, ఇంటికి పెద్దకూతురుని కదా, ఆ రోజుల్లో వంట బాధ్యత నాది. మా అమ్మ ముందు రోజు ఆరేసిన మడి బట్టలు కట్టుకుని, లేకపోతే, తడి బట్టలు కట్టుకుని నేను వంట చేసేదాన్ని. ఇంకా నా చిన్నప్పుడు ఆ నాలుగు రోజులూ ఒక వంటమనిషి వచ్చి వండి పోయేది. నేను కొంచెం ఏడు, ఎనిమిది క్లాసుల్లోకి వచ్చాక ఆ పని నా మీద పడింది. వంట చేయటానికి నాకేమీ ఏడుపు లేదు. ఎటొచ్చీ ఈ మడి తోనే గోల. పైగా నేను సరిగ్గా మడి రూల్స్ పాటిస్తానో లేదో అని అడపా దడపా మా బామ్మ నిఘా, ఇప్పటి పోలీసు వాళ్ళు జనాల్ని లాక్ డౌన్ సరిగా పాటిస్తున్నారా లేదో చూస్తున్నట్టు. యెంత నియమంగా చేసినా మా బామ్మ మధ్య మధ్యలో వచ్చి చూసి కరెక్షన్స్ చెప్తూ ఉండేది. నేను మాత్రం బాగా శ్రద్ధగానే చేసేదాన్ని. ఎందుకంటే, లేకపోతే ఈ ముసలావిడ తినదు, పాపం పస్తు ఉంటుంది, మళ్ళీ ఆవిడకు బోల్డు చిన్న చిన్న రోగాలు, వాటికి ఇంకా బోల్డు రకాల మందులు, అల్లోపతీ, హోమియోపతీ, ఆయుర్వేదం, చిట్కా మందులు వగైరా. పొడి దగ్గుకి పటికబెల్లం, కఫం ఉంటే తేనే అంటూ. మొత్తం మీద నేను మడి కట్టుకుని వండి వడ్డిస్తే తిని మెచ్చుకునేది, వంటలు బాగున్నాయంటూ. మా అమ్మ మాత్రం ఆవిడ నా వంటను మెచ్చుకున్నప్పుడల్లా ఎత్తిపొడుస్తూనే ఉండేది, ఆవిడ పేరేగా నీది, అందుకే మెచ్చుకుంటోంది అని. నాకు గుర్తు తెలిసి మా బామ్మ కోసం మడి కట్టుకుని వంట చేసిన ఏకైక మనవరాలిని నేనే. ఇదే మా మడి కాన్సెప్ట్.
ఇక 'అంట్లు' కాన్సెప్ట్ గురించి చెప్తా. అన్నం, పప్పు, కూర, పులుసు, గారెలు, బూరెలు వగైరా, అన్నీ అంటు. నెయ్యి, పెరుగు, పచ్చళ్లు అన్నీ మడి. అప్పడాలూ, వడియాలూ ఏ జాతో నాకు ఇప్పుడు గుర్తులేదు. అసలు థీరీ ఏమిటంటే ఉడికినవీ, వేయించినవీ, కాగబెట్టేవీ మొదలైనవి అంటు పదార్ధాలు. మిగిలినవి పదార్ధాలు అంటు కాదు. నాకేమో అర్ధం అయ్యి చచ్చేది కాదు. నెయ్యి కాస్తాం కదా, పచ్చడికి కూడా ఒక్కోసారి వేయిస్తాం, కాల్చుతాం కదా, పైగా ఏ పచ్చడికి అయినా పోపుగింజలు వేయిస్తాం కదా. అవి ఎలా అంటు కాదు అని లాజిక్ అడిగితే, బామ్మ "ఎదురు మాట్లాడుతున్నావ్, చెప్పినట్టు చెయ్యి" అనేది. సరే, ఏం చేస్తాం, అలాగే చేసేదాన్ని. ఇక్కడ ఎక్కడైనా పొరపాటు జరిగితే, భోజనం మానేసేది కాదు కానీ, ఇక ఆ వస్తువు ఆరోజుకి మడికి పనికి రాదు, మైల వస్తువు కిందే లెక్క, అంతే. అన్నట్టు ఊరగాయలన్నీ మడే. మడి కట్టుకున్నప్పుడే ఊరగాయలు చిన్న చిన్న జాడీల్లోకి కొంచెం కొంచెం తీసుకునేవాళ్ళం. అవి మడిగా ముట్టుకుంటే మడివే. ఒక్కసారి మైలతో ముట్టుకుంటే అవి ఇంకా మైలవే. ఇదీ మా బామ్మ అంటు థీరీ.
వంట అంతా చేసేసి,భోజనాలు అయిపోయాక, ఆ ఖాళీ గిన్నెలన్నీ బావి దగ్గర పడేస్తే,పనిమనిషి సాయంత్రం వచ్చి తోమేసేది. అది శుభ్రంగా చిలకలా ఉండేది. దానికి నాకన్నా బాగా మా బామ్మ రూల్స్ తెలుసు. ఒక్కోసారి అదే చెప్పేది నాకు. "ఆ తోమిన గిన్నెల మీద నీళ్లు చల్లుకుని లోపల పెట్టుకోండమ్మా, లేకపోతే బామ్మగారు తిడతారు" అని. అది అన్ని గిన్నెలూ తళతళా తోమేసి, వంట ఇంటి పక్కనే వున్న అరుగు మీద చక్కగా నీళ్లు కారిపోయేట్టు బోర్లించేది. ఆ తరువాత నేను ఓ చెంబుతోనో, గ్లాసుతోనో కాసిని నీళ్లు తీసుకు వెళ్లి ఆ తోమి బోర్లించిన గిన్నెల మీద ఆ నీళ్లు జల్లి అప్పుడు ఇంట్లోకి తీసుకు రావాలి. అప్పుడే అవి శుద్ధి అవుతాయిట. ఇప్పుడు దేనిపైనైనా శానిటైజర్ స్ప్రే చేసి ముట్టుకోమంటున్నారే, సరిగ్గా అలాగే. ఇక్కడా కాస్త కన్ఫ్యూజన్. బామ్మా, పై పై గిన్నెల మీద నీళ్లు చల్లుతాం కానీ, ఆ కింద వుండిపోయిన గిన్నెలు మీద చల్లటం లేదు కదా, అవి ఎలా శుద్ధి అవుతాయీ అని. దానికి మళ్ళీ బామ్మ "దీనికి అన్నీ ఎదురు ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది, లీలా, ఇదా నీ పెంపకం " అని మా అమ్మ మీద అరిచేది. మా అమ్మ కూడా తగ్గకుండా, "ఆ, దానిది మీ పేరే, మీ పెంపకమే, నన్నెక్కడ పెంచనిచ్ఛారూ" అనేది. సరిపోయింది. వీళ్లిద్దరి మధ్యా నా డౌట్ మాత్రం అలాగే ఉండిపోయేది. ఇదేమో అంటు కాన్సెప్ట్.
ఇంత చెప్పాక ఫలశృతి చెప్పొద్దూ. ఫలశృతి అంటే, విన్నందుకో చదివినందుకో మీకు వచ్చేది కాదు. మడీ, అంటూ, మైలా పాటిస్తూ మా బామ్మకు (ఇంట్లో మా అందరికీ కూడా అనుకోండి) వంట చేసి పెట్టినందుకు నాకు వచ్చిన ఫలశృతి. ఆ తరువాత మళ్ళీ ఇంతవరకూ ఎప్పుడూ నాకు, మడి కట్టుకుని వంట చేయాల్సిన అవసరం ఏ రెండు, మూడు సార్లో తప్ప రాలేదు. మడి కట్టుకోకపోయినా కానీ, ఏం చేసినా నేను చాలా శుభ్రంగా చేస్తా. జగమెరిగిన బ్రాహ్మడికి జందెమేలా అన్నది పాత సామెత. అలాగే విజయలక్ష్మి చేస్తే ఆ పని శుభ్రం గురించి అడగక్కర్లా అనేది నా కొత్త సామెత. మా ఆయనైతే, నీకు పెర్మిషన్ ఇవ్వాలే కానీ, పక్కింట్లో కూడా తుడిచొస్తావ్, అంటారు. ఏం చేస్తాం, నా శుభ్రం పిచ్చి ధర్మమా అని ఇలాంటి మాటలు పడటం అలవాటై పోయింది. తమాషా ఏంటంటే, పాపం నా చెల్లెళ్ళు భారతి, పద్మ ఇప్పటికీ దేనికో దానికి మడి కట్టుకుని వంటలు, పూజలు చేస్తూనే వుంటారు. భారతి కొంచెం తక్కువ కానీ, పద్మ మరీ ఎక్కువ. దానా దీనా నాకు అర్ధమయ్యింది ఏమిటంటే, చిన్నప్పుడు నడుం వంచి చేస్తే, పెద్దయ్యాక పనిలో రాయితీలు ఆ దేవుడే ఇస్తాడూ అని.
కరోనా మహమ్మారి గురించి అందరూ రకరకాల పోస్టులతో వీర బాదేశాక ఇవన్నీ గుర్తొచ్చి రాశా.
జై బామ్మ, జై మడి, జై అంటూ, జైజై నా మడి వంటలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి