శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం
భట్టిప్రోలు విజయలక్ష్మి
శృంగేరి పీఠం జగద్గురు ఆది శంకరాచార్యచే స్థాపించబడిన పీఠం. తన శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని (మండన మిశ్రుడు) పీఠాధిపతిని చేసి, ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ పీఠంగా స్థాపించాడు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న అన్ని అద్వైత పీఠాలూ ఈ శృంగేరి పీఠం కిందే పనిచేస్తాయి. మేము తెనాలిలో ఉండే రోజుల్లో శృంగేరి పీఠాధిపతి, శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వారు దాదాపు ప్రతి సంవత్సరం మా స్కూలుకి వచ్చేవారు. ఒక సంవత్సరం చాతుర్మాస్య వ్రతం కూడా చేసారు. స్కూల్ కార్యక్రమాలకి అడ్డంకి రాకుండా ఈ స్వాములవార్ల కార్యక్రమాలు జరిగేవి. మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడే శృంగేరి స్వాములవారు చెప్పారు, ఇది విద్యాలయం కనుక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంటే బావుంటుందని, తప్పక పెట్టాలని చెప్పారు. దాంతో నాన్న స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ అనుమతితో, జైపూర్ నుంచి సరస్వతీ విగ్రహం చేయించి తెప్పించారు. స్వామీజీనే ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. తెల్లటి పాలరాయి మందిరంలో చక్కగా పాలరాయి పీఠంపై కాలుపై కాలువేసుకుని కూర్చుని వీణ వాయిస్తున్న సరస్వతీదేవి మహా కళగా ఉండేది. ఆ ప్రత్యేకతలన్నీ స్వాములవారు చెప్పి చేయించారు. అప్పటికే మా స్కూల్లో శారదాకళాపీఠం పేరుతో ఒక వేదిక ఉంది. ఈ సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన వేదిక సరస్వతీ కళావేదిక అయిపోయింది. ప్రధానంగా ఈ వేదికనే రోజూ ప్రార్ధనకీ, స్కూల్ ఫంక్షన్స్ కీ వాడేవాళ్లు. ఈ వేదిక, శారదాకళాపీఠం కంటే పెద్దది. ముందున్న గ్రౌండ్ కూడా చాలా పెద్దది. స్వాములవార్లు వచ్చినా కూడా ఈ వేదికనే వాడుకునే వారు. సాధుపరిషత్ సమ్మేళనం జరిగినప్పుడు, రుద్రయాగం చేసినప్పుడు మాత్రం మా ప్లేగ్రౌండ్ లో పెద్ద పెద్ద పందిరులు వేదికలు, హోమగుండాలు ఏర్పాటు చేశారు.
స్వాములవారు సరస్వతీ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ రోజున మా స్కూల్ విద్యార్ధులందరికీ సరస్వతీ అమ్మవారిపై ఒక శ్లోకం నేర్పించి, ఆ శ్లోకాన్ని మా స్కూల్ నిత్య ప్రార్ధనలో తప్పక రోజూ పాడాలని చెప్పారు. ఆ శ్లోకం అప్పటినుంచీ రోజూ ప్రేయర్ లో పాడేవాళ్ళం. ఆ శ్లోకమే,
శరదిందు వికాస మందహాసామ్
స్ఫురదిందీవర లోచనాభిరామామ్
అరవిందసమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీముపాసే
స్వాములవారు చెప్పిన ఆ శ్లోకాన్ని ఈ రోజుకీ ఆ స్కూల్లో పాడుతూనే ఉన్నారు. మా నాన్నగారు చేసిన ఆపని ఆ స్కూల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఆయన హెడ్ మాస్టర్ గా ఉన్న రోజుల్లోనే, ఆ స్కూల్ జూనియర్ కాలేజ్ అయింది. మా నాన్నని చూస్తే, మా కందరికి వింతగా ఉండేది, ప్యాంటు వేసుకోవాల్సిన సందర్భంలో ప్యాంటు, షర్ట్ వేసుకుని స్టైల్ గా తిరిగేవాడు. పంచెలు కట్టుకోవాల్సిన సమయం వస్తే, పంచె, లాల్చీ కట్టేసుకుని తేలికగా తిరిగేసేవాడు. అవసరం వస్తే, ఆ చొక్కా కూడా విప్పేసి, స్వాములవార్ల దగ్గర ఎంతో అలవాటుగా హాయిగా చేతులు కట్టుకుని వెనుక నుంచునేవాడు. ఎప్పుడూ భేషజాలు చూపేవాడు కాదు. స్వాములవార్ల ఎదురుకుండా ఏనాడూ చొక్కా వేసుకునే వాడు కాదు.
ఆ రోజుల్లోనే శృంగేరి స్వాములవారిని మా నాన్నపాదపూజ, బిక్ష కోసం మా ఇంటికి ఆహ్వానించారు. స్వాములవారు ఒప్పుకున్నారు. ఆ రోజు మాఇంట్లో ఒక పెద్ద పండుగ లాగా జరిగింది. చాలామంది అతిధులు వచ్చారు. సుమారు వందమందికి పైగా భోజనానికి వచ్చారు. స్వామివారికి, వారి సిబ్బందికి వేరే మడి వంటలు చేయించారు. మిగిలిన అందరికీ దొడ్లో గాడిపొయ్యి తవ్వించి వేరే వంట. మధ్యలో ఎవరో, కాస్త సందడి చేద్దామని అనుకున్నారో ఏమో, బయట షామియానా కూడా వేయించారు. మా నాన్న అనుకోవటం ఆలస్యం, ఆయన అభిమాన సిబ్బంది చకచకా బోల్డు పనులు చేసేవాళ్ళు. హనుమంతరావు గారు, లోకనాథం గారు, జనస్వామి మాస్టారి అన్నదమ్ములు, (ఈ ఇద్దరూ స్కూల్లో టీచర్లే), వాటర్ మాన్ సీతారామయ్య గారు, ఇలా ఎందరో....అందరూ నడుం కడితేనే ఈ పనులన్నీ అయ్యేవి. మేమేమో చిన్న పిల్లలం. అమ్మా, నాన్నా స్వామివార్ల సేవలో ఉంటే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు. యజ్ఞనారాయణ గారి భార్య సరస్వతమ్మ గారు కూడా అమ్మకి ఎన్నో పనులలో చాలా సహాయంగా ఉండేది. ఆరోజుల్లో మా చెల్లమ్మ అత్తయ్య కూతురు లలిత, మా ఇంట్లోనే ఉంటూ VSR కాలేజ్ లో B.Com. చదువుకునేది. ఆరోజు శృంగేరి స్వామి వారి పాదపూజ, బిక్ష అద్భుతంగా జరిగాయి. కొసమెరుపేమిటంటే, మా లలితని మరునాడు వాళ్ళ కాలేజీలో దాని పెళ్లేమైనా నిశ్చయమైందా, ఇంటి ముందు షామియానా వేశారు, అని అడిగారట. లలిత పాపం ఇబ్బంది పడుతూ, సందర్భం స్వాములవారి పాదపూజ కార్యక్రమం అని చెప్పిందిట.
శృంగేరి పీఠం వారు శ్రీశైలంలో ఆలయం ఎదురుగా ఒక మఠం తెరిచారు. ఆ ప్రారంభోత్సవానికి నాన్నని, మా తెనాలి వాళ్ళని స్వాములవారు పిలిచారు. తెనాలి నుంచి ఒక బస్ లో సుమారు 40 మంది వెళ్లాం. అప్పుడు మా చిన్న పాపాయి, చిన్న చెల్లెలు, కూడా ఉండేది. ఆ తరువాతే అది డిఫ్తీరియాతో పోయింది. మాకు శ్రీశైలం పర్యటన అదే మొదటిసారి. అందరం అప్పుడు ఆ మఠం లోనే ఉన్నాం. అంత చిన్నప్పుడు, బహుశా నేను అప్పుడు ఏడో క్లాసనుకుంటా, నాకెక్కువగా శ్రీశైలం ట్రిప్ ఎక్కువగా గుర్తులేదు. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తు, అది అంతా కొండ ప్రాంతం కదా, ఒక ద్వారం నుంచి రోడ్డు మీదకు వెళ్లాలంటే, ఓ పదిహేను, ఇరవై మెట్లు దిగాలి. అదే ఇంకో ద్వారంలో నుంచి బయటకు వస్తే మామూలుగా రోడ్డు మీదకు వచ్చేసేవాళ్ళం. ఇదో వింతలా ఉండేది నాకు.
ఆ ట్రిప్ లోనే మార్కాపురం, త్రిపురాంతకం కూడా చూసాం. త్రిపురాంతకం శివాలయంలో శివలింగం పైన ఉన్న ఒక చిన్న గుంత నుంచి నిరంతరం గంగాజలం ఊరుతూ ఉంటుంది, ఆ జలాన్నే తీర్థంగా పూజారి అందరికీ ఇచ్చారు. ఎన్ని సార్లు తీసిన మళ్ళీ ఆ జలం నిండుతూనే ఉంటుంది. ఆశ్చర్యంగా, భక్తిగా చూసాం అందరం. దారిలో మార్కాపురంలో నాన్న బోల్డు పలకలు, బలపాలు కొన్నాడు. అక్కడ అవి ప్రసిద్ధి. ఈ మధ్యకాలంలో నేను, మావారు త్రిపురాంతకం వెళ్లి ఆ ఆలయాలను దర్శించుకున్నాం. అప్పుడు పూజారి వేరే పాత్రలో నీరు తీర్థంగా ఇచ్చారు. నేను ఆయన్ని అడిగా, ఇదివరకు లింగం పైన ఊరే జలమే తీర్థంగా ఇచ్చేవారు కదా అని. అతను తెల్లబోయి, ఎన్నాళ్ళ కిందట వచ్చారు అని అడిగాడు. సుమారు యాభై ఏళ్ళ కిందట అంటే, ఇంత పాత విషయం మీకు గుర్తు ఉందా అని ఆశ్చర్యపోతూ, చెప్పాడు. ఆ లింగం కాలక్రమేణా భంగం అయిపోతే, కొత్త లింగం చేయించి ప్రతిష్ట చేశారట. ఈ లింగంలో ఆ సౌకర్యం లేదన్నాడు. అలాగే, శ్రీశైలంలోనూ శిఖరేశ్వరం వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద నంది కింద నువ్వులు వేసి తిప్పుతూ అది లూబ్రికెంట్ గా పని చేస్తుంటే, నంది కొమ్ముల మధ్య నుంచి శ్రీశైల ఆలయ శిఖరం చూసాం. అలా ఆ ఆలయ శిఖరాన్ని చూస్తే, ఇక పునర్జన్మ ఉండదని ఒక నమ్మకం. ఈ మధ్య వెళ్ళినప్పుడు అక్కడా అంతే, ఆ నంది మూర్తి పాడైపోతే, ఈ సారి మరో నంది విగ్రహాన్ని తెచ్చి చక్కగా ఆ శిఖరం కనపడే డైరెక్షన్ లోనే ఫిక్స్ చేసేసారు. ఇది కూడా బాధ వేసింది. ఆ పాత నంది మూర్తి ఏదీ అంటే, కింద శిథిలాల్లో చూపించాడు. బాధ ఇంకా ఎక్కువైంది, కనీసం ఏ మ్యూజియం లోనైనా పెట్టొచ్చుగా అనిపించింది. త్రిపురాంతకంలోనూ బహుశా, ఇలానే అయి ఉంటుంది. ఆ లింగం మీద తీర్ధం కోసం ఉద్ధరిణతో గీకీ గీకీ దాన్ని పాడు చేసి ఉంటారు.
నేనూ, మా వారూ ఈ మధ్య కాలంలో మా యాత్రల్లో భాగంగా శృంగేరి వెళ్లాం. అప్పుడు పీఠాధిపతి శ్రీ భారతీ తీర్ధస్వామి. శారదామాతను, శివుడిని, ఆది శంకరుని, దర్శించుకుని కాసేపు అక్కడ కూర్చున్నాం. అడిగితే స్వాములవారు అప్పుడు పీఠంలోనే ఉన్నారని చెప్పారు. అదృష్టం కొద్దీ వారి దర్శనం కూడా అయ్యింది. నమస్కరిస్తే, ఆశీర్వదించి ప్రసాదం ఇప్పించారు. కిందికి వచ్చి వాళ్ళ ఆఫీసుకి వెళ్లి అమ్మవారి చీర కావాలని అక్కడి వాళ్ళను చాలాసేపు పీడించి, ఒక చీర, రవికలబట్ట, కుంకుమ తీసుకున్నాను. ఆలయాలకు వెళితే అమ్మవారి చీర కొనుక్కోవటం నాకు ఒక అలవాటు. వీళ్ళేమో అవి అమ్మరుట. అందుకే ఊరికే అయినా ఇమ్మని అడిగి తీసుకున్నా. లేకపోతే, ఎంతసేపటికీ VIP ల కేనా, శేషవస్త్రం , మాలాంటి వాళ్లకు వద్దా? అదీ సంగతి.
ఇదీ శృంగేరితో, శృంగేరి పీఠాధిపతితో మా అనుబంధం. మా నాన్న వారి శిష్యులవటం వాళ్ళతో ఈ అనుబంధం ఏర్పడింది. లేకపోతే వీలవుతుందా. ఇక్కడితో శృంగేరి స్వామీజీ తో మా సాంగత్యం గురించి చెప్పటం ముగించుకుని, ఈ సారి కంచి పీఠాధిపతులను గురించి చెప్పకుందాం. స్వస్తి.


Sringeri ashram,and temple are beautifully Devine places. Once we enter, we do not feel to come back from there. Lovely write up Vijaya.
రిప్లయితొలగించండి